Sunday, 8 June 2014

ప్రేమ.. చల్లగా, వెచ్చగా!


అబ్బ! ఆ గది ఎంత చల్లగా వుందో! గదిలో ఏసీ నిశ్సబ్దంగా, మెత్తగా, హాయిగా, చల్లగా పన్జేస్తుంది.

ఆ చల్లని గదిలో ఒక రచయితగారు సీరియస్ గా కథ రాస్తున్నారు.

ఆ కథ...

గత నెల్రోజులుగా రాధ, రాజు - తీవ్రంగా, గాఢంగా ప్రేమించుకుంటున్నారు.

'ప్రేమ' - ఒక  మధుర భావన!

'ప్రేమ' - ఒక మది పులకరింత!

అందుకే - రాధ రాజుని చూసినప్పుడు సిగ్గుతో గువ్వలా (గవ్వ కాదు) అయిపోతుంది. బుగ్గలు సిగ్గుతో (ఈడ్చి చెంప మీద కొట్టినట్లు) ఎర్రగా అయిపోతాయి.

రాజుకైతే ప్రపంచాన్నే జయించిన గర్వం, ఆనందం. 'ఆహా! ఏమి నా అదృష్టం, ఈ చిన్నది నా ప్రేయసి అగుట నా పూర్వజన్మ సుకృతం.'

ఇలా ఒకళ్ళనొకళ్ళు తీవ్రమైన ప్రేమతో కొద్దిసేపు చూసుకున్న పిమ్మట, రాధ రాజు కౌగిలిలో ఒదిగిపోయింది.

సృష్టిలో అత్యంత తీయనైనది ఏమి? - ప్రేమ!

ప్రపంచంలో అమూల్యమైనది ఏమి? - ప్రేమ! ప్రేమ!!

భూమండలాన్ని తిప్పేది, పడిపోకుండా నిలబెట్టేది ఏమి? - ప్రేమ! ప్రేమ!! ప్రేమ!!!

ఇన్ని మాటలేల? ప్రేమ అనునది పెసరట్టు కన్నా రుచికరమైనది, కొత్తావకాయ కన్నా ఘాటైనది, విస్కీ కన్నా వెచ్చనైనది.

ఓయీ తుచ్ఛ మానవా! నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయనీ, ఉద్యోగాలు రావట్లేదనీ, అవినీతి పెరిగిపోతుందనీ.. ఇట్లాంటి పనికిమాలిన విషయాల మీద వర్రీ అవుతావెందుకోయి?

ప్రేమించు! బాగా ప్రేమించు! ప్రేమని మనసారా ఆస్వాదించు!

ఏలననగా - ప్రేమ నీ జీవితాన్నే మార్చేస్తుంది.

మానవ జీవితం చిన్నది, పొట్టిది, పెళుసుది.. ప్రేమంచి దానికి సార్ధకత చేకూర్చుకో!

ఇంతలో....

'టప్' - కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది. కొద్దిసేపటికి చల్లదనం తగ్గి, ఉక్కపోత మొదలైంది.

రచయితగారికి ఉక్కపోత ఇబ్బందిగా వుంది, అయినా కథ రాయడం కొనసాగించారు.

ఆరోజు రాజుని చూసిన రాధ (రోజూ పడే) సిగ్గు పళ్ళేదు, బుగ్గలు మొగ్గలెయ్యలేదు. రాజు మొహం చిట్లించాడు.

'ఐ ఫోన్ కొనియ్యమని నిన్ననే కదా అడిగింది? ఈలోపే సిగ్గు పట్టం మానెయ్యాలా? ఈ అమ్మాయిలింతే, వీళ్ళవన్నీ షాపింగ్ ప్రేమలే! రాజకీయ నాయకుల్లో నీతీ, అమ్మాయిల్లో ప్రేమ.. ఎడారిలో ఎండమావి వంటివి.'

'గిఫ్టు కొనివ్వలేడు గానీ, కోపానికి మాత్రం తక్కువ లేదు. గుడ్లు మిటకరించి గుడ్లగూబలా ఎట్లా చూస్తున్నాడో చూడు! ఒట్టిపోయిన ప్రియుణ్ని, ఓడిపోయిన పొలిటీషయన్ని సాధ్యమైనంత తొందరగా ఒదుల్చుకోమన్నారు పెద్దలు.' అనుకుంది రాధ.

ఇప్పుడు ఉక్కపోత భరింపరానిదిగా తయారైనందున, రచయితగారికి బాగా చికాగ్గా వుంది. అయినా రాస్తూనే వున్నాడు.

ఏవిటీ ప్రేమ గొప్ప? తిని అరగని ప్రతి గాడిదా ప్రేమ అంటూ కలవరించడమే! ప్రేమో జ్వరం, ప్రేమో గజ్జి, ప్రేమో అంతుపట్టని రోగం.

ప్రజలు ఉక్కపోతతో, చెమటల్తో నానా ఇబ్బందులు పడుతుంటే - ఈ ప్రేమికులు మాత్రం 'ప్రేమ' అంటూ కలవరిస్తుంటారు, పూనకం వచ్చినాళ్ళలా పలవరిస్తుంటారు.

అబ్బా! చెమటకి జుబ్బా తడిసిపొయింది. వామ్మో! కుంపట్లో కూర్చున్నట్లుగా వుందిరా దేవుడోయ్!

ప్రేమికులకి బుద్ధి లేదు, ప్రేమకి అర్ధం లేదు. అసలీ ప్రేమికులకి నిర్భయ చట్టాన్ని వర్తింపజేసి జైల్లో కుక్కాలి, ఉరి తియ్యాలి.

ఇంతలో....

'టప్' - కరెంటొచ్చింది. ఏసీ మళ్ళీ పంజెయ్యడం మొదలెట్టింది. ఉక్కపోత, చెమటలు క్రమేపి తగ్గసాగాయి.

రచయితగారు రెణ్ణిమిషాలపాటు ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటికి వారి శరీరం చల్లబడసాగింది.

రచయితగారు రాయడం కొనసాగించారు.

పవిత్రమైన ప్రేమకి కరెంటుకోత అడ్డు కాదు, కారాదు.

రాజు రాధని ప్రేమగా, మురిపెంగా చూశాడు.

అయ్యో! నా ప్రేయసిని అపార్ధం చేసుకున్నానే! ఎంత తప్పు చేశాను! స్వగృహ ఫుడ్స్ వారి ఖరీదైన జీడిపప్పు పాకం వంటి రాధ ప్రేమని, అలగా జనం బడ్డీకొట్లల్లో కొనుక్కు తినే పరమ చౌక వేరుశెనగ పప్పుండగా భావించానే!

'రాధీ! నన్ను క్షమించు.'

రాధ రాజుని చూసింది. ఆ చూపులో కిలోల్లెక్కన  ప్రేముంది, టన్నుల్లెక్కన ఆరాధనుంది.

అయ్యో! బిస్లరీ వాటరంత ఖరీదైనవాణ్ని మునిసిపాలిటీ కుళాయి నీళ్ళలాంటి చీప్ మనిషనుకున్నానే! నా ప్రియుడు ప్రేమికులకే ప్రేమికుడు - ప్రేమభూషణ్, ప్రేమరత్న. ప్రియతమా! నిన్నెంత తప్పుగా అర్ధం చేసుకున్నాను!

'రాజ్! నన్ను క్షమించు.' అంటూ రాజు కౌగిలిలో ఒదిగిపోయింది రాధ.

ఇప్పుడు గది పూర్తిగా చల్లబడింది.

ప్రేమ - స్వచ్చం, ప్రేమ - నిజం, ప్రేమ - అమర్ రహే, ప్రేమ - జిందాబాద్.

(picture courtesy : Google)

21 comments:

  1. నువ్విది ఏ సీ గదిలో కూర్చుని రాశావో కరెంటు కోతప్పుడు రాశావో అస్సలు తెలియట్లేదు!

    ReplyDelete
    Replies
    1. హహహా! గత కొన్నాళ్ళుగా ఏసీలోంచి బయటకొచ్చే ధైర్యం చెయ్యట్లేదు.

      మన చిన్నప్పట్నుండి.. సినిమాల్లో, కథల్లో ప్రేమార్తనాదాలు ఎక్కువ.

      అవేంటో అర్ధం కాకపోయినా.. 'నేను సైతం ప్రేమ కోసం ఒక్క పోస్టు రాశాను.' అనిపించుకుందామని.. ఒక ప్రయత్నం చేసితిని. :)

      Delete
  2. చాలా బాగుందిరా. కాని కధ కి ఎ సి, ప్రెమ కి ధన బలం చాలా ముఖ్యం అని చెప్పకనె చెప్పావు.
    పుచ్చా

    ReplyDelete
    Replies
    1. ప్రేమకీ, డబ్బుకీ గల సంబంధం - రాజకీయనాయకుడికీ, పదవికీ గల సంబంధం వంటిదని అర్ధమౌతుంది. :)

      Delete
  3. హృదయాంతరాలనుంచి వచ్చేదే ప్రేమ, మిగతావన్నీ బాహ్యమైనవి కాబట్టే ఏసీ, నాన్ ఏసీ, బిస్లరి సోడా, ముంచిపాలిటీ కుళాయి మంచినీళ్ళు లాంటివి అవసరమయితే డబ్బుతో కొనగలం, లేకపోతే వాటిని చీప్ గా చూడగలం.

    ReplyDelete
    Replies
    1. >>హృదయాంతరాలనుంచి వచ్చేదే ప్రేమ,

      నేచెప్పేదీ అదే! కాకపోతే - దానికి బాహ్యపరిస్థితులు కూడా కలిసిరావాలి. :)

      Delete
  4. //నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయనీ, ఉద్యోగాలు రావట్లేదనీ, అవినీతి పెరిగిపోతుందనీ.. ఇట్లాంటి పనికిమాలిన విషయాల మీద వర్రీ అవుతావెందుకోయి?//
    అయినా ప్రేమిస్తున్నాం కదా ప్రభుత్వాలని. లేదా భలవంతంగా నైనా ప్రేమింప చేపిస్తునారు గదా! అలాంటపుడు ప్రేమికురాల్ని , ప్రేమికున్ని ప్రేమించలేమా?
    మానవ సైకాలాజిని అద్బుతంగా ఆవిష్కరించారు సార్‌! అబ్బా! బ్లాగులోకి అడుగుపెట్టగానే ఎంత చల్లగా ఉండిందో!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ.

      బ్లాగు చల్లగా మాత్రమే వుందా? అయితే - మీరు సగం మిస్సయ్యారు. :)

      Delete
    2. మిస్సవ్వలేదు సార్‌, ఆ చల్లని వాతావరణానికి నిద్రపొయాను. తర్వాత కాసేపటికి కుంపట్లో ఉన్నట్లు గమనించానను కోండి.

      Delete
  5. ఈ పోస్ట్ ని blow hot blow cold అనచ్చేమో (ఆ పేరుతో వచ్చిన సినిమా లాగా కాదులెండి). temperature తో పాటు మారిన swinging moods బాగా చూపించారు కాబట్టి.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ.

      మొదట్లో మీరు సూచించిన పేరే అనుకున్నాను.. కానీ - పోస్టులో 'ప్రేమ' గూర్చి అత్యంత తీవ్రంగా రాయడం వల్ల, చివరి నిమిషంలో టైటిల్ మార్చేశాను. :)

      Delete
  6. //ఒట్టిపోయిన ప్రియుణ్ని, ఓడిపోయిన పొలిటీషయన్ని సాధ్యమైనంత తొందరగా ఒదుల్చుకోమన్నారు పెద్దలు//
    జీవితాన్ని కాచి వడపోశాడు కవి

    ReplyDelete
    Replies
    1. నాకు ప్రేమ భావనలు తక్కువ.. కించిత్తు ప్రేమంటే చికాగ్గూడా! అందుకే ప్రేమ / ప్రేమికుల పట్ల biased గా రాస్తుంటాను.

      తెలుగు బ్లాగర్లలో కూడా 'ప్రేమ పరవశం' పెద్దగా వున్నట్లుగా లేదు. :)

      Delete
  7. చూసారా, కథ వ్రాయడానికి సహకరించిన విద్యుత్ శాఖ వారికి రచయిత కృతజ్ఞతలు చెప్పలేదు.

    ReplyDelete
    Replies
    1. మీరు మరీను!

      ఎక్కడైనా / ఎప్పుడైనా తెలుగు రచయితలు కృతజ్ఞతలు చెప్పగా చూశారా?!

      Delete
  8. కరెంట్ కోతలు మీలోని రచయితను నిద్ర లేపినట్టున్నాయి.. థాంక్స్ టు విద్యుత్ శాఖ.. మాకో మంచి పోస్ట్ ఇప్పించినందుకు :) :)

    ReplyDelete
    Replies
    1. మన చంద్రబాబు ముఖ్యమంత్రయ్యాక విద్యుత్ కోతలు లేవు. నాలోని రచయిత మళ్ళీ నిద్రపొయ్యాడు. :)

      Delete
  9. Your story shows the external influence on the feelings. If the mood changes as per the outside factors it is not really "Love". Love has no other influence. It should and will remain whatever happens around. It is not the love that changed between raju and radha but it is the mood of the writer that changed. I am glad you chose old names rather than new ones. How can you not get sleep. Are u not taking zopiclone or similar?
    ramana

    ReplyDelete
    Replies
    1. నిజమైన ప్రేమని వడగాల్పులు, ఉక్కపోత, చెమట, దురదలు ప్రభావితం చెయ్యలేవు! ఒప్పుకుంటున్నాను.:)

      నాకెప్పుడూ పాత పేర్లే ఇష్టం. అసలీ కథకి ముందుగా నేరాసుకున్న పేర్లు సుబ్బారావు, సుబ్బులక్ష్మి (ఇవి నాకత్యంత ఇష్టమైన పేర్లు). అయితే సుబ్బులక్ష్మి ప్రేమని గిఫ్టుల్తో ముడిపెట్టటం నచ్చక.. (చివరి క్షణంలో) రాజు, రాధగా మార్చేశాను.

      Delete
  10. ప్రేమని చెవులు మూసి చితగ్గొట్టి పచ్చడి పచ్చడి చేసిపారేసినట్టున్నారు! ఏవండీ రమణ గారు, గత జన్మలో మీది లవ్ ఫెయిల్యూరాండీ, ఈ జన్మలో కసికొద్దీ ప్రతీకారం తీర్చుకున్నట్టున్నారు ప్రేమ మీద :-)

    ReplyDelete
    Replies
    1. అందరి సంగతి నాకు తెలీదు కానీ, నాకు మాత్రం - 'ప్రేమించడం' అనేది తెలుగు సినిమా చూడ్డం కన్నా దుర్భరంగా అనిపించింది. ఈ పోస్టులో వున్నదంతా అప్పటి తాలూకా చిరాకే.

      అయితే - ప్రేమ పట్ల నాకింత 'పగ' వుందని పోస్ట్ రాసేదాకా నాక్కూడా తెలీదు. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.