Thursday, 12 June 2014

ప్రాణం ఖరీదు


హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన విద్యార్ధుల మృతి చాలా దారుణమైనది. గత రెండు మూడ్రోజులుగా జాతీయ మీడియా కూడా ఈ ఘటనకి చాలా ప్రాధాన్యతనిచ్చి కవర్ చేస్తుంది. మా ఇంట్లో కూడా దీనిగూర్చే చర్చ. తూనీగల్లాంటి పిల్లలు! ఎంత ఆనందంగా, ఎంత సరదాగా వున్నారు! చదువుకునేప్పుడు స్నేహితుల్తో కలిసి ఫొటోలు తీసుకునే సరదా ఎంత మజాగా వుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే - నేను కూడా ఇట్లాగే, ఇంతకన్నా ఎడ్వెంచరస్‌గా - చెట్లూ, పుట్టలూ ఎక్కి ఫొటోలు దిగినవాణ్ని కాబట్టి! అంచేత - చాలా దిగులుగా అనిపిస్తుంది.

సంతోషంగా వున్నప్పుడు ఆలోచనలు రేసుగుర్రంలా పరిగెడితే, దిగులుగా వున్నప్పుడవి దుక్కిటెద్దులా నిదానంగా సాగుతాయి. ఆ దిగుల్లోనే నన్ను నేనో ప్రశ్న వేసుకున్నాను. నన్నీ ఘటన ఎందుకింత తీవ్రంగా కలచివేసింది?

నాకు తోచిన కారణాలు కొన్ని రాస్తాను. ఒకప్పుడు స్నేహితుల్తో నేనూ ఇలాగే ఎంజాయ్ చేశాను, ఇప్పుడు ఆ విద్యార్ధులు నా పిల్లల వయసువాళ్ళు, ముఖ్యంగా వారు పట్టణప్రాంత ప్రజలు. ఎలా చూసుకున్నా - వారు నాకూ, నా కుటుంబానికి ప్రతిబింబం లాంటివారు. అందువల్ల - నేనా పిల్లలతో, వారి కుటుంబాలతో చాలా సులభంగా ఐడింటిఫై అయిపొయ్యాను. 

ఇప్పుడు నాకింకో ప్రశ్న. నేను అన్ని మరణాలకి ఇంతే బాధగా స్పందిస్తానా? దీనికి సమాధానం కోసం కొంత ఆలోచన చెయ్యాలి. మానవ సమాజం అనేక పొరలతో compartmentalize అయింది. కులం, మతం, ప్రాంతం, జెండర్, సామాజిక ఆర్ధిక స్థాయి.. ఇలా అనేకమైన పునాదుల ఆధారంగా. వీటిల్లో కొన్ని భౌతికమైనవి, మరికొన్ని మానసికమైనవి. అందువల్ల అందరూ అన్ని సమస్యలపై ఒకే రకంగా స్పందించటం జరక్కపోవచ్చు. 

ఈ దేశంలో అనేకమంది, అనేక కారణాల వల్ల మరణిస్తూ వుంటారు. వాటిల్లో కొన్ని మరణాలు సభ్యప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన మరణాలు. వీటిల్లో మన హైదరాబాద్ విద్యార్ధుల మరణం కూడా ఒకటి. అయితే మన దృష్టికి రాని, వచ్చినా పెద్దగా పట్టించుకొని మరణాలు ఇంకా చాలానే వున్నాయి. ఉదాహరణకి ఈ రోజుకీ అనేకమంది ఆదివాసీలు మలేరియా, టైఫాయిడ్ వంటి సాధారణ జబ్బులక్కూడా సరైన వైద్యసహాయం అందక చనిపోతున్నారు.

రైతుల ఆత్మహత్యలైతే.. లెక్కే లేదు. నాసిరకం విత్తనాలు, పురుగు మందుల్తో.. చివరికి గిట్టుబాటు ధర లేక.. చేసిన అప్పులు తీరే మార్గం లేక.. రైతులు చనిపోతూనే వుంటారు. పంటపొలాలకి పన్జెయ్యని మందులు ప్రాణం తీసుకోడానికి మాత్రం చక్కగా పన్జేస్తుంటాయి! ఇంకో గమ్మత్తేమంటే, రైతులపై ఆధారపడి వ్యాపారం చేసే వ్యాపారస్తులు మాత్రం కోట్లకి పడగలెత్తుతారు!

దేవుడు మన్నందర్నీ సమానంగానే పుట్టించాడు కదా? మనమందరం మన అమ్మ పాలు తాగే పెద్దవాళ్ళం అయ్యాం కదా? మనందర్లో ప్రవహించే రక్తం రంగు ఎరుపే కదా? మనందరికీ రక్తమాంసాలు, మలమూత్రాలు ఒకటే కదా? ఇట్లాటి ప్రశ్నలు సంధిస్తూ చేంతాడులా చాలా రాయొచ్చు గానీ.. ప్రస్తుతానికి ఈ లిస్టు ఆపేసి, ఇంకో లిస్టు రాస్తాను.

మనందరికీ తినే ఆహరం ఒకటి కాదు. ఒక పాపడికి 'బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ' అయితే, ఇంకో పాపడికి 'గంజి విత్ ఉల్లిపాయ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనెర్జీ'! ఒకడిది కేజీల చదువైతే, ఇంకోడిది కూలీ చదువు. ఈ లిస్టు కూడా చాలా పొడుగ్గా రాయొచ్చు కానీ.. ఇంతటితో ఆపేస్తాను. 

కుక్కల్లో బొచ్చుకుక్కలు, వీధి కుక్కలున్నట్లే.. మానవజన్మల్లో కూడా రకాలుంటాయి. అయితే కుక్కల్లో రూపం తేడా వుంటుంది.. మనుషుల్లో వుండదు, అంతే! ప్రస్తుతం మన ప్రభుత్వాల్ని బొచ్చుకుక్కలు పాలిస్తున్నాయి, వీధికుక్కలు పాలింప బడుతున్నయ్. ఐదేళ్ళకోసారి వచ్చే ఎలక్షన్ల ప్రహసనంలో వీధికుక్కలకి రాయితీలంటూ కొన్ని బిస్కట్లని లంచాలుగా పడేసి తమ అధికారాన్ని కాపాడుకుంటున్నాయి.  

అయితే - ఈ మరణాల్ని మనం ఆపలేమా? ఆపటం సంగతేమో గానీ, తగ్గించటం మాత్రం చెయ్యొచ్చు. కానీ - మన ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీల్ని నడిపిస్తుంది వ్యాపార మాఫియా. కాబట్టి ప్రభుత్వాల నుండి చిత్తశుద్ధి ఆశించడం అమాయకత్వమే అవుతుంది. విద్యార్ధుల మరణం అనే ఘోర దుర్ఘటన వెనుక హిమాచల్ ప్రదేశ్‌లోని ఇసుక మాఫియా, ప్రైవేటు విద్యుత్తు మాఫియాల హస్తం వుందంటున్నారు. ఇకముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా అక్కడి పాలకులు నొక్కి వక్కాణిస్తున్నారు. నమ్మక చేసేదేమీ లేదు. 

సరే! ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకం కష్టనష్టాల్ని చిత్తశుద్ధిగా పట్టించుకుంటాయనుకునే అమాయకులకి ఈ దేశంలో కొరత లేదు కావున, ప్రస్తుతానికి నేను కూడా ఆ అమాయకుల సరసన చేరి ప్రభుత్వాల్ని వేడుకుంటున్నాను (ఇంతకుమించి చేసేదేమీ లేదు కాబట్టి).

అయ్యా! ప్రభుత్వాల పెద్దమనుషులూ! మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు - ఇకముందు ఇలా అర్ధంతరంగా, అసహాయంగా, సిల్లీగా, అకారణంగా, చెప్పుకోడానిక్కూడా సిగ్గుపడే విధంగా.. పైకి పోకుండా వుండేందుకు తగు చర్యలు తీసుకొమ్మని వినయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను. 

మీరు దయామయులు, కరుణా స్వరూపులు. ప్రజల్ని, ప్రజా ప్రయోజనాల్ని సలసల కాగే నూనెలో పకోడీల్లా వేయించుకు తింటుండే తమరు.. కొంచెం (మరీ ఎక్కువేం కాదులేండి) మీ ప్రయోజనాల్ని పక్కన పెట్టి మా గోడు కూడా పట్టించుకొమ్మని విన్నవించుకుంటున్నాను. తమరు తల్చుకుంటే ఇదేం పెద్ద ఇబ్బందైన పని కాదు. 

అదేమిటయ్యా? ఇంత ఛండాలంగా ప్రభుత్వాల్ని అడుక్కునేవాణ్ని నేనెక్కడా చూళ్ళేదు. నీ విన్నపం దేవుణ్ని ప్రార్ధించినట్లుంది!

అన్నా! ఇప్పటిదాకా దేవుణ్ని చూసినోడు లేడు. అయినా ఆ దేవుణ్ని ప్రార్ధిస్తూనే వుంటాం! ఎందుకు? 'దైవం' అనేది ఒక నమ్మకం. ఒకవేళ ఆ దేవుడే వుంటే.. మన ప్రార్ధనే ఆయన చెవుల పడితే.. మన కష్టాల గూర్చి ఆలోచిస్తాడనే ఆశ, నమ్మకం. ఇదీ అంతే!

(picture courtesy : Google)

11 comments:

  1. నా ఉద్దేశంలో ఈ మరణాలకు కారణం గౌతం, భాష్యం, నారాయణ... వారి విద్యా విధానం. అంతేకాక తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా కొంతవరకు కారణం.

    http://www.amarujala.com/feature/samachar/national/himachal-pradesh-tragedy-video/?page=1

    పై వీడియో చూడండి. పిల్లలు ఎంత అమాయకంగా, ఒక వైపు మృత్యువు ముంచుకొస్తున్నా, చలనం లేకుండా రాళ్ళపై స్థాణువుల్లా నిలబడ్డారో! నీళ్ళు దగ్గరికి రాకుండానే తెగించి దూకి ఒడ్డుకు చేరడానికి ముప్పై సెకండ్లు కూడా పట్టి వుండేది కాదు.

    అక్షరాభ్యాసం మొదలు పెట్టింది మొదలు కార్ఖానాల్లాంటి ఇరుకు భవనాల్లో పుస్తకాలు భట్టీయం వేయడం తప్ప ఆటలు వీళ్ళు ఎరుగుదురా? ఈతకొట్టడం తెలుసా?

    పల్లేటూరి ప్రభుత్వ పాటశాలల్లోంచి వచ్చిన arts విద్యార్థులైతే వీరిలో కనీసం సగం మందికి పైగా బతికి వుండే వారని కచ్చితంగా చెప్పగలను. మన విద్యావిధానం యువకుల agility, దేహ దారుఢ్యాలను ఎంతగా నాశనం చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ కావాలి.

    ReplyDelete
    Replies
    1. ఇది నిజం సార్.నేనా వీడియో చూశాను.నాకూ ఆశ్చర్య మేసింది.గట్టుకి చాలా దగ్గిరే ఉన్నా కూడా ఒక్క దూకు దూకినా గట్టుకి చేరిపోయే వాళ్ళు కూడా అలా నిలబడిపోయారేమిటా అని.

      Delete

    2. రాళ్ళమీద నుంచున్నాము కాబట్టి భయంలేదు అని అనుకుని వుంటారు. దిగితే కొట్టుకుపోతాము అని అనుకొని
      వుండవచ్చు. ప్రమాదం తెలిసేలోపే నీళ్ళు ఉధృతంగా వచ్చేశాయి పాపం.

      Delete
    3. అవును. వాళ్ళకి జరగబోతుంది తెలీక (అస్సలు ఏమాత్రం ఐడియా లేక).. అలా నిలబడిపొయ్యారని అనుకుంటున్నాను.

      Delete
    4. పారిశ్రామిక (విహార) యాత్రకు పిల్లలతో కొందరు ఫాకల్టీ వెళ్తారు. అలాగే టూరిస్టు కంపనీ తరఫున ఒక గైడు ఉంటారు. ఈ వ్యక్తులు తమ బాద్యతను పూర్తిగా విస్మరించినట్టు అనిపిస్తుంది.

      లోకల్సు వారించినా అక్కడే ఉండడం అనవసరం. ఇది ఎందుకు (misunderstanding or recklessness) జరిగిందో విచారణలో తెలిస్తే బాగుణ్ణు.

      Delete
    5. ఇక్కడ మనం ఎన్నయినా చెప్పచ్చు. కాని ఊరు కాని ఊరులో హటాత్తుగా అంత ప్రమాదం ముంచుకొస్తుందని లోకజ్ఞానం, అనుభవం లేని విద్యార్థులు ఎలా ఊహిస్తారు. పైగా అలాంటి సమయంలో బుర్ర సరిగా పనిచెయ్యదు. అసంకల్పితంగా ఏదో విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

      Delete
  2. Manalo manam thittukuntu, okarikoram juttulu pattukoni, samoohanga... oka oobhi loki jaaripothu.... evarini badyulanu chestav.... manushullo manchi - chedu... shatham 40-60 ainatharuvaata... neti prajasamyamlo majority is law... ane sutram lo... nee manchi evadiki kaavali...?

    ReplyDelete
  3. //శ్రీకాంత్ చారి
    //నా ఉద్దేశంలో ఈ మరణాలకు కారణం గౌతం, భాష్యం, నారాయణ... వారి విద్యా విధానం. అంతేకాక తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా కొంతవరకు కారణం.//
    //పల్లేటూరి ప్రభుత్వ పాటశాలల్లోంచి వచ్చిన arts విద్యార్థులైతే వీరిలో కనీసం సగం మందికి పైగా బతికి వుండే వారని కచ్చితంగా చెప్పగలను. మన విద్యావిధానం యువకుల agility, దేహ దారుఢ్యాలను ఎంతగా నాశనం చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ కావాలి.//

    ఈ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. ఇంటర్ వరకు బందిఖానా చదువు. ఇంజనీరింగులో చేరుతూనే చేతికి అందిన పల్సర్లు, సామ్సంగ్ ఫోన్లు వీరిని జనజీవన స్రవంతికి, సాధారణ జీవనజ్ఞానానికి దూరం చేస్తున్నయి. ఏ ప్రముఖ ఇంజనీరింగ్ కాలజ్¬ విద్యార్థినై రాండమ్¬గా ఎంచుకుని, ఊరి బయట వాళ్ల బండి, ఫోను లేకుండా వదిలిపెడితే తాము ఇంటికి ఎలా వెళ్లాలో తెలియనివాళ్లు ఎక్కువగానే కనబడతారు. ( మా కాలేజ్ యాజమాన్యం కూడా రెండు ఇంజనీరింగు కాలేజీల్ని నడుపుతున్నది. ఇక వీళ్లకు ప్రమాదాల్లో ఎలా వ్యవహరించాలో తెలివిడి ఉండాలని ఎలా ఆశించగలం చెప్పండి...
    చెప్పులు ముఖ్యమో, ప్రాణం ముఖ్యమో తేల్చుకోవడంలో పొరపాటు చేసిందో పిల్ల. ఫలితంగా ప్రాణాలే కోల్పోయింది. పక్కవాడిని చేతులిచ్చి లాగిన కుర్రాడు, తాను ఒడ్డు మీదవాడి చేతిని అందుకుంటే బయటపడతాననే ఆలోచనే చెయ్యలేక పోయాడు. తన మిత్రుడు ఒక్క దూకి దూకి ఒడ్డు చేరుకుంటే చూసిన మిత్రమండలి తామూ అలా చెయ్యగలమని మరిచి అలానే బండపై నిలబడిపోయింది. ఫలితంగా యావత్తు మిత్రమండలి కొట్టకుపోయింది.
    అన్నిటికన్నా ముఖ్యమైంది స్థానికులు చేతులు ఊపి అరుస్తుంటే అది టాటా చెప్పినట్టో, ప్రోత్సహకంగా చేతులు ఊపుతున్నట్లుగా భావించి తాము చేతులు ఊపారట. అదీ ప్రమాదపరిస్థితుల్లో వారి ప్రతిస్పందన.
    ఇలా మనం యువకుల్ని తయారు చేస్తుంటే నీళ్లు, నిప్పులేకాదు, రోడ్డుపక్కన మెల్లగా సాగే సైకిల్ కూడా వీళ్ల ప్రాణాల్ని సులభంగా తీసిపారేస్తుంది.
    ఇందుకు రామయ్య దగ్గర కోచింగుకోసం ప్రాణాలు తీసి, ఐఐటి లేదా బిటెక్ చెయ్యకపోతే పితృదేవతలు రౌరవాది నరకానికి పోతారని మూఢంగా నమ్మే తల్లిదండ్రులు, అమ్మా ఆయ్యకే పట్టదు, మనకేం పట్టిందిలే అని మూడో క్లాసు నుంచి ఐఐటి, బిటెక్ కోచింగులతో ఆశలు రేపే పాఠశాలు, కళాశాల యాజమాన్యాలు, అసలు స్వంతరాష్ట్రం చూపడం అవమానంగా భావించి రాష్ట్రాంతరాలకు తప్ప మరెక్కడికీ విహారయాత్రలు ప్లాన్ చెయ్యలేని పైచూపు మాత్రమే గల కాలేజి యాజమాన్యాలు. తమ వెంటవచ్చిన పిల్లలు తమ షెడ్యులులో లేని ప్రాంతంలో నీటికాలువలోకి దిగుతుంటే ఆపలేకపోయిన అయ్యవార్లు (ఒకాయన వాళ్లతో సహా నీళ్లలో దిగాడటయ నీళ్లు రాగానే ఆయన్ని విద్యార్థి కాపాడట), ఈ తప్పులో హిమాచల్ డ్యాం అధికార్లంత బాధ్యత వహించాల్సిందే.
    డ్యాం అధికార్లది నిర్లక్ష్యం ప్రశ్నించాల్సిందే, అయితే ఎంతవరకు కాలవ ఉంటే అంతవరకు డ్యాం అధికారులు సైరన్లు పెట్టలేరు. స్థానికంగా ప్రకటన ఇస్తారు. ఆ వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత పర్యాటకులదే తప్ప, ప్రతి బస్సు దగ్గరికి ప్రభుత్వాధికార్లు వచ్చిన జాగ్రత్తలు చెప్పరు. తెలుగు రాష్ట్రాలనుంచి రెండుబస్సుల ఇంజనీరింగు పిల్లలు వచ్చి నీళ్లలో దిగి ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తుంటే, నీళ్లు వాళ్లని కబళిస్తాయని హిమాచల్ ముఖ్యమంత్రికి ముందస్తుగానే తెలియదు గాదా.
    అందరిలోనూ తప్పులు ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వాన్నే బాధ్యతగల దాన్నిగా చెప్పే ప్రయత్నం చెయ్యడం ఇప్పుడు ఎడాపెడా పెరిగిపోతున్న స్వేచ్ఛాసంస్కృతి. టీవిలు పెరిగిపోయాక ఈ స్వేచ్ఛ మరింతగా పెరిగిపోయింది. వార్తరాగానే ప్రతి చర్చా కార్యక్రమంలోనూ ప్రభుత్వాలని వేలెత్తి చూపాలనే ధోరణి పెరిగిపోతోంది.
    రెండు దశాబ్దాలకు పైగా బోధనలో ఉన్నాను. ఒక్కసారిగా పాతికమంది విద్యార్థులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే అది యాజమాన్యాలపైన, అయ్యవార్లపైన, తోటి విద్యార్థులపై ఎలాంటి దారుణ ప్రభవాన్ని చూపుతుందో నాకు తెలుసు. ఒకసారి నాకు తెలిసిన కాలేజి పిల్లలు నగరంలోని గండిపేటకు వెళ్లారు. నీళ్లలోకి దిగిన ఒకడు కొట్టుకుపోతుంటే ఎలాగోలా కాపాడారు. మరో సంవత్సరం కూడా పిల్లలు అక్కడికే విహారానికి పోదామని కోరితే, ఆ కాలేజి ముసలి ఆయా పిల్లలు నీళ్లలోకి దిగకుండా చూడాలని పట్టుపట్టింది. మాటవినని విద్యార్థుల నడుములకి చేంతాడు కట్టి ఆ తాడు చివక తాను పట్టుకుని కూర్చుంది. ఆ ముసలమ్మ తీరును నిరసించినా, పెద్ద చదువులు లేని ఆమె తీరు ఇలాంటి వేళ ఎంత అక్కరకు వచ్చేదోగదా అనిపించింది.

    ReplyDelete
  4. ఏంటీ సార్‌! ఈ పిల్లలకోసం మనుషులు ఇలా స్పందిస్తున్నారు. ఈ దుస్సంఘటన మాత్రం అభి వృద్దిలో భాగం కాదా? డాం లు కట్టటం, కట్టెటపుడు కూలీలు చావటం, ఆ తరువాత లక్షలాది ప్రజలు నిరాశ్రులు కావటం, అందులో కొంతమంది ఆకలితో చావటం ఎదావిదే గదా? ఈ స్పందనకు నాకు నవాలో ఏడవాలో తెలియటం లేదు. మనుషులు మరీ దయమయులు అయి పోతున్నారు. ఇది చూసి నా వృధయం స్పందించటం లేదు.
    మరణాలని వర్గాలుగా వర్గీకరించటం బాగుంది.

    ReplyDelete
  5. మనదేశంలో ప్రాణానికి విలువేమి ఉందండి?

    మూడేళ్ళ క్రితం కోటిపల్లి వెళ్ళాను. గోదావరి దాటడానికి ఒక ఇంజన్ బోట్ ఉంది. పడవ వాడు ఎంతమంది వస్తే అంతమందినీ ఎక్కించుకుంటున్నాడు. ఈ బోట్ కెపాసిటీ ఎంత అని అడిగితే, అలాంటివేమీ తెలియదన్నాడు. ఇక లైఫ్ జాకెట్ల గురించి అడగటం ఎందుకని ఊరుకున్నాను. హుస్సేన్ సాగర్ లాంటి పర్యాటక ప్రదేశాల్లో లైఫ్ జాకెట్లని కంపల్సరీ చేసిన ప్రభుత్వం, గ్రామాలలో ఎందుకు అమలు చెయ్యరు? లైఫ్ జాకెట్లు వాడకపోవడం వలన మన దేశంలో ప్రతి యేడాదీ, ఎంతో మంది జలప్రమాదాలలో మరణిస్తున్నారు.

    ReplyDelete
  6. నిజమే,కొద్ది మంది పిల్లలకి ఇంటి దారి కూడా తెలియదు. అనుకోని ప్రమాదం ఎదురైతే మెదడు పని చేయదు. నేను ఒక వీడియో క్లిప్ చూసాను. నలుగురైదుగురు పిల్లలు ఒక ఎత్తయిన రాతిని, మార్కండేయుడు శివలింగాన్ని కరుచుకున్నట్టు పట్టుకున్నారు . నీళ్ళు పెద్ద అలలా వచ్చి వాళ్ళని ఊడ్చుకు పోయాయి. ఆ క్షణంలో వాళ్ళ feelings ఎలా ఉండి ఉంటాయో నా ఊహకి అందలేదు. నేనే కొట్టుకు పోతున్నానేమో అన్పించింది.
    కొంత మంది parents కి పిల్లలు ఎక్కడికో వెళ్ళేది కూడా తెలియదట. కాలేజీ వాళ్లు డబ్బు తెమ్మన్నారని పిల్లవాడు చెబితే 15000 ఇచ్చారట.
    వాళ్ళ ప్రోగ్రాం లో లేని ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు , వెంట ఉన్న ఉపాధ్యాయులు వివరాలు కనుక్కోవలిసింది.
    డాం పొడవున బోర్డులు పెట్ట లేక పొవచ్చు గాని, ప్రారంభం అయ్యేచోట ఒక బోర్డు పెట్టవచ్చు, డాం ఎంత పొడవు ఉన్నది, safe గా ఫోటోలు దిగటానికి ఎంత దూరంలో వీలుగా ఉంటుంది, (అలాంటి వసతి ఉన్నట్టు ఒక రాజకీయ. నాయకుడు ఒక చర్చలో చెప్పారు ) ఎంత దూరంలో , ఏ సమయంలో నీళ్ళలో దిగడం safe గా ఉంటుంది లాంటి సూచనలతో .
    ఏది ఏమైనా ఈ విషాదానికి విచారించడం తప్ప ఏమి చేయగలం ?

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.