సమయం రాత్రి పన్నెండు గంటలు, నిద్ర రావట్లేదు. పక్కన పడుకునున్న నా భార్య ఏదో మెడికల్ జర్నల్ చదువుకుంటుంది. రోజూ ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ సంఘటనలపై ఏదోటి తీక్షణంగా చదువుతూ, తీవ్రంగా ఆలోచిస్తూ, అంతకన్నా తీవ్రంగా నిట్టూరుస్తూ వుంటాను. తరవాతేం చేస్తావు? అబ్బే! పెద్దగా ఏమీ చెయ్యను, అలసిపొయ్యి నిద్ర పోతాను, అంతే! రోజుట్లా వార్తలు చదివి నిట్టూర్చడానికి ఇవ్వాళ మూడ్ బాలేదు.
పక్కనున్న టీపాయ్ మీద 'రావిశాస్త్రి రచనాసాగరం' వుంది. పుస్తకం అట్టమీదనున్న రావిశాస్త్రి రంగుల బొమ్మ నవ్వుతూ నన్ను పలకరిస్తున్నట్లనిపించింది. రావిశాస్త్రికి రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టుకుని (నాకు దేవుడి మీద నమ్మకం లేదు గానీ రావిశాస్త్రి మీద నమ్మకముంది), ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాను. చేతికొచ్చిన ఒక పేజీ ఓపెన్ చేశాను.
వావ్! నా ఫేవరెట్ 'రాజు - మహిషి' వచ్చింది. గేదెల రాజమ్మ, బావ గంగరాజుతో కలిసి బంగారి కిళ్ళీకొట్టు ముందు.. కర్రిముండని (అమ్మలు), కమ్మలింటి రాజుని (భవానీ శంకర ప్రసాద్) రొట్లప్పిగాడి సాక్షిగా తన్నిన ఘట్టం. ఈ చాప్టర్ మొత్తం ఒకేఒక్క పేరాగ్రాఫ్‌లో పీనుగ్గుమాస్తాతో ఉపన్యాస ధోరణిలో చెప్పిస్తాడు రావిశాస్త్రి. ఇదో ఎపిక్ పేరాగ్రాఫ్. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంటుంది. కావున - చదవసాగాను.
"పొద్దస్తమానం ఆ రావిశాస్త్రినే చదువుతారు! బోర్ కొట్టదా?" నా భార్య ప్రశ్న విని తల పక్కకి తిప్పాను.
"ఏమో మరి! అస్సలు బోర్ కొట్టట్లేదు, పైగా రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతుంది కూడానూ." నవ్వుతూ అన్నాను.
నేను అనేక సంవత్సరాలుగా తెలుగు సాహిత్యంలో కొత్తగా ఏదీ చదవలేదు. ఎందుకు? 'సమయం లేదు' అంటూ అబద్దాలు రాసుకోడానికి ఇదేమీ నా ఆత్మకథ కాదు కదా? కావున నిజాయితీగానే ఈ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నిస్తాను.
జీవిక కోసం తప్పించి, ఏ మనిషీ కూడా తనకి నచ్చని పని చెయ్యడాని నా నమ్మకం. నాకు రావిశాస్త్రి రచనలు ఇష్టం. కావున అవే చదువుతుంటాను. రావిశాస్త్రి అన్నేసి కథలు, అన్నేసి పేజీలు రాశాడు కదా? ఎందుకు? తనెందుకు రచనలు చేస్తున్నానో రావిశాస్త్రి చాలా స్పష్టంగానే చెప్పాడు. ఆయన ఎందుకోసం రాశాడో ఆ ప్రయోజనం నెరవేరిందా? ఆయన ఎవరి కోసం రాశాడో - వాళ్ళు ఆయన సాహిత్యం చదువుతున్నారా? చదివినట్లైతే వారిపై ఆయన ప్రభావం ఎంత? ఇత్యాది విషయాలు ఆలోచించి బుర్ర పాడు చేసుకోను.
మొన్నెక్కడో చదివాను 'రావిశాస్త్రి భవిష్యత్తరాలు కూడా స్మరించుకునే గొప్ప రచయిత.' అని. నాకు నవ్వొచ్చింది. రావిశాస్త్రిని ఎవరు, ఎందుకు, ఎప్పటిదాకా చదువుతారో మనమెలా చెప్పగలం? ఏ రచనైనా మారుతున్న సమాజానికి రిలెవెంట్ గా వుంటే నిలబడుతుంది, లేకపోతే లేదు. ఈ ముక్క రావిశాస్త్రే చెప్పాడు. నేను మాత్రం గత కొన్నేళ్ళుగా రావిశాస్త్రి రచనల్ని పూరీ పిండిలాగా పిసికేస్తున్నాను!
ఒకసారి నా మిత్రుడు అన్నాడు. 'ఒక సినిమా గానీ, రచన గానీ ఒకసారి ఎంజాయ్ చేస్తే రెండోసారి చెయ్యలేం.' అతని అభిప్రాయం కరెక్టు కావచ్చు. కానీ - అన్నిసార్లు కాదు. షెర్లాక్ హోమ్స్ నవల, హిచ్‌కాక్ సినిమా రెండోసారి ఎంజాయ్ చెయ్యలేకపోవచ్చు. కానీ - సోమర్సెట్ మామ్ ని ఎన్నిసార్లైనా చదవొచ్చు, 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' ని ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఇంకా చాలా పన్లు చాలాసార్లు చేసినా బాగానే ఎంజాయ్ చెయ్యొచ్చు.
చిన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే పక్కన కూర్చుని గమనిస్తుండేవాణ్ని. కొన్ని నిమిషాల వ్యవధిలో ఒక పదార్ధం తినడానికి పనికొచ్చే విధంగా తయారైపోవడం అనే అద్భుతాన్ని ఆశ్చర్యంతో గుడ్లప్పగించి చూస్తుండి పొయ్యేవాణ్ని. ముఖ్యంగా - అమ్మ చక్రాలు చేసేప్పుడు చూస్తూ కూర్చోటం నాకెంతో ఇష్టం. చక్రాల గిద్దల్ని నొక్కుతుంటే కింద గిద్ద రంధ్రాల్లోంచి సన్నగా, మెత్తగా, ధారగా, దారంలా వచ్చే శెనగ పిండి - మరుగుతున్న నూనెని తాకంగాన్లే 'సుర్రు'మని శబ్దం చేస్తూ, హడావుడిగా నూనెలో అటూఇటూ పరిగెట్టడం చూస్తే గమ్మత్తుగా వుండేది. నేను కూడా చక్రాల గిద్దల్ని ఒత్తుదామని ప్రయత్నించేవాణ్ని గానీ, నా బలం సరిపొయ్యేది కాదు. నాకు చక్రాల రుచి కన్నా, అవి వండిన విధానం ఎంతగానో ఇష్టం.
అలాగే - చిన్నప్పుడు తిరుపతి చాలాసార్లు వెళ్లాను. రెండు మూడు కుటుంబాల వాళ్ళం కలిసి వెళ్ళేవాళ్ళం కాబట్టి మా పటాలం పెద్దది. ముసలీ ముతకా, కొందరు సుకుమారులు కొండపైకి కార్లల్లో వెళ్లిపొయ్యేవాళ్ళు. నేను మాత్రం నడక బ్యాచ్‌లోనే వుండేవాణ్ని. ఆ అడవి, కొండలు, గుట్టలు, లోయలు, రాళ్ళూరప్పలు, కోతుల గుంపులు, కాళ్ళ నొప్పులు.. నాకు చాలా ఇష్టం. నా మటుకు నాకు తిరుపతి ట్రిప్ అంటే ఇంతే! దేవుడి దర్శనం చప్పగా (ఒక్కోసారి విసుగ్గా) అనిపించేది.
అమ్మ చేసిన వంట రుచి నాకు ముఖ్యం కాదు. తిరుపతి దేవుడి దర్శనం నాకు ప్రధానం కాదు. అలాగే - రావిశాస్త్రి రచనల్లో 'కథ' నాకు అనవసరం. నేను దాన్నెప్పుడూ పట్టించుకోలేదు, ఇకముందు పట్టించుకోను కూడా. నాకు రావిశాస్త్రి వాక్యం ఇష్టం, అక్షరం ఇష్టం, ఆయన రాసే స్టైల్ ఇష్టం. ఒకవేళ - రావిశాస్త్రి తను షేవింగ్ చేసుకునే విధానం గూర్చి రాసినా చదవడానికి నాకు ఆసక్తిగానే వుంటుంది. కొందరు కథావస్తువు, శిల్పం అంటూ ఏవో చెబుతారు గానీ.. నాకవేవీ అర్ధం కావు, అనవసరం కూడా. అయినా - అందరికీ అన్నీ నచ్చాలని రూలేమీ లేదు కదా?
ఈమధ్య ఒకళ్ళిద్దరు నన్ను విసుక్కున్నారు, ఆ ఒకళ్లిద్దరూ నా శ్రేయోభిలాషులే!
'నీ గూర్చి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా? నీదంతా గుడ్డెద్దు వ్యవహారం. ఏదో ఒకదాన్ని ఇష్టపడతావ్. ఇంక అందులోనే కూరుకుపోతావ్. పైగా అదే స్వర్గం అనుకుని మురిసిపోతుంటావ్! నీ రావిశాస్త్రి అభిమానం వ్యసన స్థితికి చేరుకుంది, అందులోంచి అర్జంటుగా బయటకి రా! ఈ ప్రపంచం చాలా పెద్దది, కళ్ళుండి చూడాలే గానీ చాలా సుందరంగా వుంటుంది.'
నాకు మొండి కత్తితో గుండెల్లో పొడిచినట్లు అనిపించింది. తెలుగు సినిమా హీరో అభిమానుల సరసన నించున్నంత అవమానంగా కూడా అనిపించింది. అవున్నిజమే! నేనెప్పుడూ ఈ కోణంలో ఆలోచించలేదే! నేనేమన్నా రావిశాస్త్రికి బానిసనా? ఆయనకేమన్నా అప్పున్నానా? అక్కటా! ఏల నేనిన్నాళ్ళూ బావిలో కప్పలా, బురదలో పందిలా, సందులో కుక్కలా జీవించితిని? నా హృదయం తడిసిన సిమెంటు బస్తాలా బరువుగా అయిపొయింది.
ధృతరాష్ట్రుడికంటే కళ్ళు కనిపించవు, ఆయనకి వేరే చాయిస్ లేదు. మరి ఆ పక్కన గాంధారి కళ్ళకి గుడ్డెందుకు కట్టుకుంది? గాంధారి భర్త కోసం కళ్ళగ్గుడ్డ కట్టుకుని (పాతివ్రత్యాన్ని పాటించి) ఎంతోకొంత పుణ్యం సంపాదించి వుండే వుంటుంది.. రావిశాస్త్రి వల్ల నాకాపాటి పుణ్యం కూడా లభించదు కదా! కావున - ఇకముందు నేనిలా వుంటానికి వీల్లేదు. వీరేశలింగం వితంతువుల్ని సంస్కరించినట్లు, నన్ను నేను సంస్కరించుకోవలసినదే!
అసలు తెలుగు సాహిత్యమన్న ఒక పవిత్ర జీవనది వంటింది. దాన్ని మనసారా చదివి ఆనందం పొందవలె! సీతాకోక చిలక అనేక పుష్పములపై వ్రాలి మకరందము గ్రోలుట నీవు కాంచలేదా? ఏం - ఆ కీటకం ఒక పువ్వు మీదే వాలి కడుపు నింపుకోవచ్చు కదా? కానీ - ఆ సీతాకోక చిలక అన్నిరకాల పూలపై వ్రాలుతూ మకరందం కుంచెం కుంచెం రుచి చూస్తూంటుంది. దీన్నే సమన్యాయం అంటారు! అర్ధమైందా?
అయ్యో! ఒక అర్భక సీతాకోక చిలక్కి వున్నంత పాటి బుర్ర నాకు లేకపోయేనే! తప్పదు.. తక్షణమే తెలుగులో రాస్తున్న యితర రచయితల సాహిత్య పరిమళాన్ని అఘ్రూణించెద, తేనే వలే స్వీకరించెద, చింతలూరివారి మాదీఫల రసాయనము వలె నాకి వేసెద, నూజివీడు రసం వలె జుర్రు కొనెద, అమూల్ ఐస్‌క్రీం వలె చప్పరించెద.
నా స్నేహితుల సలహా మేరకు, పుస్తకాల షాపు కెళ్ళి, ఈ మధ్య కాలంలో తీవ్రమైన పేరు ప్రఖ్యాతులు పొందిన మాంచి జమాజ్జెట్టీల్లాంటి రచయితల పుస్తకాలు కొన్నాను. ఉత్తమ పాఠకుని లక్షణమేమి? పుస్తకం 'కొని' చదవటం. పుస్తకం కాజేసో, అరువు తెచ్చుకునో చదివినవాడు పాఠకుడో, పాతకుడో అగును కానీ.. ఉత్తముడు మాత్రం కాజాలడు.
ఒక చల్లని రాత్రి (వాస్తవానికి అది చల్లని రాత్రి కాదు, ఎండాకాలపు వెచ్చని రాత్రి, ఏసీ వల్ల గది లోపల మాత్రమే చల్లగా వుంది, కానీ - అనాదిగా తెలుగు కవులు వెచ్చని రాత్రిని శృంగార విషయాలకి మాత్రమే రిజర్వ్ చేసి ఉంచారు) పుస్తకం తెరిచి చదవడం మొదలెట్టాను.
ఒక పేజీ ఏదో చదివాను. రెండో పేజీ కష్టపడి చదివాను. మూడో పేజి చదువుతుంటే ఎంతకీ కదలట్లేదు! ఔరా! ఏమి ఈ మాయ! రాత్రికి రాత్రులు దిండ్ల కన్నా మందమైన, బండరాయి కన్నా బరువైన పుస్తకాల్ని 'ఉఫ్'మని ఊది పారేసిన నాకు పేజి కదులుట భారమగుటయా! ఏమి ఈ కాలమహిమ! కష్టపడి మూడో పేజి కూడా చదివాను. నాలుగో పేజి మొదట్లోనే ఇంజన్ మొరాయించింది.
ఎన్నో యేళ్ళుగా ఎంతోమందికి కౌన్సిలింగ్ చేశాను. పీనుగల్లాంటి వాళ్ళు ఏనుగుల్లాగా ఫీలయ్యేట్లు చేశాను. కర్కోటకుల్ని కరుణామయులుగా మార్చేశాను. తొమ్మిది మార్కుల వాళ్ళని తొంభై తొమ్మిది మార్కుల వాళ్ళగా తీర్చిదిద్దాను. ఆశ్లీలుల్ని సచ్ఛీలులుగా మార్చి సమాజానికి సేవ (డబ్బు తీసుకునే అనుకోండి) చేశాను. అట్టి నాకు, ఒక తెలుగు రచన ముందుకు కదలకపోవుటయా! ఇది కలయా? నిజమా? భ్రాంతియా?
ఎవరక్కడ? దుశ్శాసనా! ఈ అవమానం నేను భరింపలేకున్నాను. చితి పేర్పించు, వెంటనే ప్రాయోపవేశం చేస్తాను. 'రారాజా! ఆగుము. నీవే యిటుల ఆలోచించినచో మేమైపోవాలి? నీ తమ్ములం నూర్గురం వున్నాం, ఆజ్ఞాపించు. తక్షణం చతురంగ బలాలతో వెళ్లి ఆ దరిద్రపుగొట్టు తెలుగు సాహిత్యాన్ని భస్మీపటలం చేసేస్తాం.' అని ఎవరూ ఎంతకీ అనరేమి? ఒరేయ్! ఎవడోకడు వచ్చి నా ప్రాణాల్ని కాపాడండ్రా! ఆలీసం అయితే అన్యాయంగా చచ్చూరుకుంటాను. ఇంతలో మెలుకువొచ్చింది. ఔరా! ఇదంతా కలన్న మాట! పుస్తకం మహిమ! కొన్ని పుస్తకాలు నిద్ర మాత్రల్లా పంజేస్తాయి. వెంటనే పుస్తకం టపుక్కున మూసేసి పడుకున్నాను.
మర్నాడు ఇంకో రచయిత పుస్తకం, ఈసారి రెండో పేజి దాటలేకపోయ్యాను. అవమాన భారంతో, శోకంతో కృద్దుడనై మళ్ళీ మాగన్ను నిద్రలోకి జారుకుంటిని. మళ్ళీ దుర్యోధనుడు ప్రత్యక్షం! 'ఇక నీకు మరణమే శరణ్యం.' అంటూ ఎస్వీరంగారావులా వికటాట్టహాసం చేయుచుండగా మెలకువొచ్చింది.
ఇంక నాకు పట్టుదలొచ్చేసింది. 'ఇవ్వాళ - నేనో తెలుగు సాహిత్యమో తేలిపోవాలి' అని పట్టుదలగా ఇంకో రచయిత పుస్తకం తెరిచాను. ఈ పుస్తకం మొదటి పేజి దాటట్లేదు. హృదయం బరువెక్కింది, గుండె నీరయ్యింది, మనసు తల్లడిల్లింది. కంట్లో నీటిపొర! ఏమి నా దౌర్భాగ్యము? నా అఖండ పఠనాశక్తి ఏమయ్యింది? ఏమయ్యింది? ఎక్కడకి పోయింది? కహా గయా? అని మనసు ఘూర్ఘించింది.. దీనంగా, దిక్కు తోచక, బిత్తర చూపులు చూసింది.
ఫ్రిజ్ తెరిచి ఐస్ వాటర్ గటగటా తాగాను. కడుపు చల్లబడింది, తెలుగు సినిమాకి 'శుభం' కార్డు పడినప్పుడు కలిగే ప్రశాంతత వంటిది లభించింది. ఇప్పుడు బుర్ర ఆలోచించడం మొదలెట్టింది.
'నేనవర్ని? సగటు తెలుగు పాఠకుణ్ని. నేనెవర్ని? ప్రభుత్వ గ్రంధాలయంలో దుమ్ము కొట్టుకుపోయిన పాత పుస్తకం లాంటి వాడిని. నేనెవర్ని? పెద్దబాలశిక్షకీ, ఉరిశిక్షకీ తేడా తెలియని అజ్ఞానిని. నేనెవర్ని? 'ది హిందూ'ని హిందువులు మాత్రమే చదువుతారనుకున్న అమాయకుణ్ని. నేనెవర్ని? జీవన పరమార్ధాన్ని కాఫీ హోటళ్ళల్లో, సినిమా హాళ్ళల్లో వెతుక్కున్న వ్యర్ధజీవిని. నేనెవర్ని? నేనెవర్నీ కాను, నేను నేనే!'
నువ్వో జ్ఞానివా? కాదు. నువ్వో సాహిత్య పాఠకుడివా? కానేకాదు. నేను చందమామ, విజయచిత్ర మాత్రమే చదువుకున్న అపాఠకుణ్ని. నువ్వో సాహిత్య విమర్శకుడవా? కాదు బాబూ కాదు, అసలు నాకా మాటకి అర్ధమే తెలీదు. మరి నీకెందుకీ ఆపసోపాలు? నీకు నచ్చింది తిను, నచ్చింది చూడు, నచ్చింది చదువుకో! ఈ భువనము నందు నీవొక నీటి బిందువువి, ఇసుక రేణువువి, అరిగిపోయిన కారు టైరువి, కాల్చి పడేసిన సిగరెట్టు పీకవి! కావున - ఆయాసపడుతూ అర్ధం కాని విషయాల జోలికి వెళ్ళడం మాని.. నీకు ఆనందం కలిగే పన్లు మాత్రమే చెయ్యి! దేశాన్ని ఉద్ధరించే ప్రయత్నం మానుకో!
అమ్మయ్య! మనసు ప్రశాంతంగా అయిపొయింది. నేనిప్పుడేం చెయ్యాలి? కొద్దిసేపు ఆలోచించిన మీదట, రావిశాస్త్రి 'బాకీ కథలు' తీసుకున్నాను. పక్కింటి అబ్బాయి, వెన్నెల, పాతదే కథ.. వరసగా కథలు చదువుతూనే వున్నాను. నిద్రా గిద్రా ఎగిరిపోయింది. మా చాత్రిబాబు మాటల మాయలో పడిపోయ్యాను, రచనా ప్రవాహ వేగానికి కొట్టుకు పోసాగాను. 'అబ్బా! తల దిమ్ముగా ఉందేంటి?' అనుకుంటూ టైమ్ చూశాను. తెల్లావారుఝాము నాలుగయ్యింది. అయినా ఏం పర్లేదు, నాకిప్పుడు తెలుగు కథలు చదవగలననే కాన్ఫిడెన్స్ వచ్చేసింది.
ఆ రోజున నేనో జీవిత సత్యం తెలుసుకున్నాను. పక్షులు మాత్రమే ఎగురుతాయి, పులి మాత్రమే వేటాడుతుంది, పోలీసులు మాత్రమే ఎన్కౌంటర్లు చేస్తారు, ప్రకృతి వైపరిత్యాల్లో పేదవాడు మాత్రమే చస్తాడు, కాఫీ మాత్రమే కమ్మగా వుంటుంది, విస్కీ మాత్రమే వెచ్చగా వుంటుంది, రావిశాస్త్రి మాత్రమే నాకు నచ్చిన కథ రాయగలడు.
తాజ్‌మహల్ అందముగా యుండును, సావిత్రి నటన అద్భుతముగా యుండును, కొత్తావకాయ ఘాటుగా యుండును, మండువేసవిలో తొలకరి జల్లు ఆహ్లాదముగా యుండును, కృష్ణమ్మ ప్రవాహము వేగముగా యుండును? ఈ 'యుండును'లకి ఇంకో వంద 'యుండును'లు కలిపి.. అవన్నీ ఎందులో యుండును? రావిశాస్త్రి రచనల్లో యుండును!
రావిశాస్త్రీ! థాంక్యూ వెరీ మచ్! యువార్ ద బెస్ట్! ఐ బో మై హెడ్ టు ఎ ట్రూలీ గ్రేట్ రైటర్.
(picture courtesy : Google)
Sir,
ReplyDeleteరావిశాస్త్రి మాత్రమే నాకు నచ్చిన కథ రాయగలడు. ఇళయరాజా మాత్రమే(నాకు) నచ్చిన సంగీతం ఇవ్వగలడు.
Manohar..
నేనూ మీలాగే రావి శాస్త్రి గారి వీరాభిమానినే కాని తెలుగులో అద్భుతమైన కథలు, నవలలు రాసిన కవులు, రచయిత(త్రు)లు చాలా మంది వున్నారు..ఎప్పుడో 1950 ప్రాంతంలో రాసిన కొకు గారి కథలు ఇప్పటికీ తాజాగా వుంటాయి..
ReplyDeleteమల్లాది, యండమూరి, ద్విభాష్యం, చలం, ఘండికోట ఇలా అనేకులు సాహితీ వనంలో పూదోటలు పూయించారు..ఎవరి బాణి, శైలి వారిదే..రావి శాస్త్రి గారి తూర్పు మాండలికాన్ని సరిగ్గా అర్ధం చేసుకునే వాళ్ళు యావత్తు తెలుగు వాళ్ళలో ఎంతమంది వుంటారు?
మీకు దగ్గరలో వున్న పబ్లిక్ లైబ్రరీ లో సభ్యత్వం తీసుకుంటే మహానుభావులెంతో మంది సాహిత్యాన్ని గ్రోలవచ్చు..
నా వ్యక్తిగత విన్నపం ఏమిటంటే రావి శాస్త్రి గారి "నిజం" నాటిక మీద ఓ సమీక్ష రాయండి ..ఎప్పణ్ణుంచో అడగాలనిపించి అడుగుతున్నాను..
శెలవ్..మరో పనిలేని పాఠకుడు..
// 'నేనవర్ని? సగటు తెలుగు పాఠకుణ్ని. నేనెవర్ని? ప్రభుత్వ గ్రంధాలయంలో దుమ్ము కొట్టుకుపోయిన పాత పుస్తకం లాంటి వాడిని. నేనెవర్ని? పెద్దబాలశిక్షకీ, ఉరిశిక్షకీ తేడా తెలియని అజ్ఞానిని. నేనెవర్ని? 'ది హిందూ'ని హిందువులు మాత్రమే చదువుతారనుకున్న అమాయకుణ్ని. నేనెవర్ని? జీవన పరమార్ధాన్ని కాఫీ హోటళ్ళల్లో, సినిమా హాళ్ళల్లో వెతుక్కున్న వ్యర్ధజీవిని. నేనెవర్ని? నేనెవర్నీ కాను, నేను నేనే!'//
ReplyDeleteఏష సత్య సనాతనః
రావి శాస్త్రి గారి ని మాటాడిస్తూ, మధ్యలో ఎస్.వి.రంగా రావుని ఎందుకు పిలిచారు?
ReplyDeleteఓలేటి గారితో చేతులు కలుపుతున్న సార్, మీరు ' నిజం ' గురించి రాయాల్సిందే! ధాంక్యు!
వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
ReplyDeleteప్రస్తుతం తెలుగు సోషల్ సైట్లలో విశ్వనాథవారిదే అగ్రస్థానం. విశ్వనాథశాస్త్రి ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. ఇది మారుతున్న తెలుగు సమాజస్థితిని అద్దం పడుతుందని నమ్ముతున్నాను.
నేను ఒక హార్డ్‌కోర్ రావిశాస్త్రి అభిమానిని. ఈ అభిమానం రావిశాస్త్రి రచనల్ని విశ్లేషించడానికి నాకు అనర్హతగా భావిస్తున్నాను. నానోట కానీ, చేత గానీ.. రావిశాస్త్రి పట్ల భక్తి, ప్రేమ తప్ప మరేదీ పలకదని విన్నవించుకుంటున్నాను.
రావిశాస్త్రి రచనల్ని పలువురు లబ్దప్రతిష్టులు విమర్శనాత్మకంగా పరిశీలించారు. వారిలో ముఖ్యులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ఓల్గా, కాత్యాయినీ విద్మహే, కోడూరి శ్రీరామమూర్తి, రంగనాధాచార్యులు మొదలైనవారు. నాకు బాలగోపాల్ (రూపం - సారం) విశ్లేషణ బాగుందనిపించింది.
'అల్పజీవి' సుబ్బయ్యని కొందరు విశ్లేషించారు. నాకూ అలా చెయ్యాలని వుంది. అయితే నా అభిమాన పాత్రలు మీరంతా అసహ్యించుకునేవారే! ఉదా : 'రత్తాలు రాంబాబు'లో రత్తాల్ని ముండల కంపెనీలో అమ్మేసిన సింహాచలం పాత్ర నాకు ఇష్టం! అయితే అంతటి దుర్మార్గమైన పాత్రని రావిశాస్త్రి 'చక్కగా' రాస్తే.. నేను 'ఇంకా చక్కగా' గ్లోరీఫై చేస్తానేమోననే సందేహం పీడిస్తున్న కారణాన ఆగిపొయ్యాను.
ఇంకో సందేహం - అసలు తెలుగు బ్లాగ్ ప్రపంచంలో రావిశాస్త్రికి 'స్పేస్' వుందా? అనేది. ఇక్కడ రావిశాస్త్రిని చదివినవాళ్ళని వేళ్ళమీద లెక్కించవచ్చు. రావిశాస్త్రి ఏం రాశాడో కూడా తెలీనప్పుడు, సహజంగానే ఆయన పాత్రల గూర్చి చదవడానికి ఎవరికీ ఆసక్తి వుండదు.
ఎవరూ చదవనిదానికి నేను రాసి మాత్రం ప్రయోజనమేమి? ఇది కూడా ఒక సమస్యే!
ఇదీ... అభిమాన తీవ్రత అంటే..!
ReplyDeleteతెలుగు బ్లాగ్ ప్రపంచంలో రావిశాస్త్రి కే కాదు, ఇలాంటి చాలామందికి స్పేస్ ‘ప్రస్తుతం’ ఉండకపోవచ్చు. మీలాంటి అభిమానులు ఇలా రాస్తూవుంటే స్పేస్ దానికదే వచ్చితీరుతుంది.
మీరిలా రాస్తుండండి- ‘ఎవరీ రావిశాస్త్రి? ఎందుకిలా ఆయన గురించి ఈయన తెగ రాసేస్తున్నారు?’ అనే సందేహంతోనో, ఆసక్తితోనో, ఉత్సుకతతోనో కొత్త పాఠకులు కొంతమందైనా ‘రచనా సాగరం’లోకి దూకకుండా ఉంటారంటారా?
థాంక్యూ.
Deleteనేను రావిశాస్త్రి భజన కార్యక్రమాన్ని, గత కొంతకాలంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తూనే వున్నాను (తీర్థప్రసాదాలు ఇవ్వడం కుదరక ఆగిపొయ్యాను). :)
నా రాతల వల్ల (కొత్తగా) ఎంతమంది రావిశాస్త్రిని చదువుతారో తెలీదు కానీ.. నాకు మాత్రం ఈ ప్రోగ్రాం బహుతృప్తిగా వుంటుంది.
venu garu nenu ninnane alpajeevi navala chadivanu:-)
ReplyDeleteపాత రచయితల రచనలను ఎవరైనా ప్రస్తావిస్తుంటేనో, చర్చలోకి తీసుకువస్తేనో తప్ప కొత్త పాఠకులు చదివే అవకాశం ఉండదు. (అవి మార్కెట్లో అందుబాటులో ఉండటం కూడా ఓ షరతు అనుకోండీ...)
ReplyDeletesubha గారూ, మీరు ‘అల్పజీవి’ నవల గురించి కొత్తగా తెలిసి చదివారనుకుంటాను. లేకపోతే ఆ నవల గురించి ఎప్పుడో తెలిసి కూడా లేటుగా చదివారేమో తెలీదు.
నేను రావి శాస్త్రి రచనలు కాస్త లేటుగానే చదివాను. ‘ఆరు సారా కథలు’ గొప్పతనం మాత్రం శ్రీశ్రీ ముందుమాట చదివాక బాగా అర్థమైంది!
రమణ గారూ !!
ReplyDeleteమీరు రావి శాస్త్రి గారి రచనలని గురించీ ఇంకా ఎక్కువగా రాయాలని చాలామంది లాగానే నేనూ కోరుకుంటున్నాను.
మీ రచనా శైలి హాయి గా ఉంటుంది . ఎన్నో విషయాలు కొత్త కోణం నించీ చూస్తున్నాను . ధన్యవాదాలు .
రావి శాస్త్రి గురించీ ఇతరులు రాసినా - మీ శైలి లో - ఆయన గురించీ చదవడం ఇంకా బాగుంటుంది.
భవదీయుడు
రామ్
@రామ్,
Deleteరావిశాస్త్రి గూర్చి రాస్తుండటం నాకు చాలా ఎనెర్జీనిస్తుంది. Thanks for the nice words.
**ఈ మధ్య కాలంలో తీవ్రమైన పేరు ప్రఖ్యాతులు పొందిన మాంచి జమాజ్జెట్టీల్లాంటి రచయితల పుస్తకాలు కొన్నాను.**
ReplyDeleteసుమారు గత పదిహేనేళ్ళలో అంత పేరు ప్రఖ్యాతులు పొందిన కొత్త రచయితలు ఎవరున్నారు సర్.... ఒకవేళ ఉన్నా... రావిశాస్త్రికి వాళ్ళతో పోలికా... మామూలు అపచారం కాదు... :(
ఫణిగారు! ఈమధ్య రాస్తున్నవాళ్ళల్లో కొందరు అద్దరగొట్టేస్తున్నారని పెద్ద టాకుందండీ. :)
Delete**ఈ మధ్య కాలంలో తీవ్రమైన పేరు ప్రఖ్యాతులు పొందిన మాంచి జమాజ్జెట్టీల్లాంటి రచయితల పుస్తకాలు కొన్నాను.**
Deleteఆ రచయితలు ఎవరో తెలుసుకోవాలని ఉంది. (ఈ మధ్య పేరుపొందిన రచయితలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు.)
@venkat,
Deleteగుర్తులేదండి. :)
సార్.... కె.యన్.వై. పతంజలి గారిని ఎప్పుడన్నా ఒక చూపు చూసారా....
ReplyDeleteనేను పతంజలిని (అంతాకాదు, కొంత) చదివాను. నాకు పతంజలి వాక్యం ఇష్టం.
Deleteసార్.... మీరు అనేది "పతంజలి భాష్యం" గురించేనా.... లేకపోతే పతంజలి శైలి గురించా.....
ReplyDeleteపతంజలి శైలి నాకు ఇష్టం. నా దృష్టిలో 'పతంజలి భాష్యం' tip of the iceberg మాత్రమే.
Deleteమీరనేది నాకు పూర్తిగా అర్ధమైంది, కొ.కు. రచనలు నాకలాగే ఉంటాయి, శ్రీపాద ను కూడా ఎన్ని సార్లైనా చదువుతూనే ఉండగలను.
ReplyDeleteరావి శాస్త్రి గారిది ఈ మధ్య(మళ్ళీ)ఇద్దరు పిల్లలు చదివేను,ఏడుపు ఆగలేదు.
అంత గంభీరమైన కథలను మీరు మళ్ళీ మళ్ళీ (ఆహ్లాదం నిమిత్తం) ఎలా చదవగలరా అని సందేహం. కానీ మీరన్నట్టు - ఎవరి శక్తి వారిది, కానీ నేనూ ఎదో ఒక నాటికి అంత శక్తిని సంపాదిస్తాను...(శపథం!)