Monday 18 April 2016

చినబాబు స్పందించారు!


"చినబాబూ! మీకు చెప్పదగ్గవాళ్ళం కాదు, అయినా చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి పోస్టులో నాన్నగారు బిజీగా వున్నారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం మీదే. మీరేమో పొద్దస్తమానం ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు."

"అబ్బబ్బా! ఏం పార్టీ నాయకులయ్యా, ఒకటే నస. సరే! ఇప్పుడు నేనేంచెయ్యాలో చెప్పండి."

"ఎండలకి జనం మలమలా మాడిపోతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు."

"సారీ! ఇప్పుడా ఎండల్లో తిరగడం నా వల్లకాదు."

"మీరు ఎండలోకి రానక్కర్లేదు చినబాబు, స్పందిస్తే చాలు."

"అంటే?"

"ఎండల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టండి."

"పెట్టి?"

"ప్రతిపక్ష నాయకుణ్ణి నాలుగు తిట్టండి."

"తిడితే?"

"అది చాలు చినబాబు. మీరు చెప్పిన్దానికి అదనంగా కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం వహిస్తూ వార్తల్ని వండి వార్చడానికి మనకి మన మీడియా వుండనే వుందిగా!"

"అవును కదా! ఆ విషయం మర్చేపొయ్యాను. వెంటనే ప్రెస్‌వాళ్ళకి కబురంపండి."

కొద్దిసేపటికి ప్రెస్ మీట్ -

"నాన్నగారి పాలనలో ప్రజలు ఆనందంతో ఉక్కిరిబిక్కిరౌతున్నారు. మళ్ళీ సాక్షాత్తు ఆ శ్రీరాముడే మమ్మల్ని పాలిస్తున్నాడని పులకించిపోతున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా దర్జాగా, హాయిగా ఇంట్లోనే వుంటూ ఏసీ చల్లదనాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్నే మా పార్టీ అమెరికా బ్రాంచివాళ్ళు కూడా రిపోర్టు చేశారు. ప్రజలు ఇంత చల్లగా, ప్రశాంతంగా బ్రతకడాన్ని చూసి సింగపూరు, జపాను వాళ్ళు కూడా తీవ్రంగా ఆశ్చర్యపోతున్నారు. అయితే అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రజల ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే - ప్రజల్ని రోడ్ల మీదకి రమ్మనీ, చచ్చిపొమ్మనీ రెచ్చగొడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడి కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడిపై సెడిషన్ చార్జెస్‌ మోపి వెంటనే అరెస్టు చెయ్యలని కూడా డిమాండ్ చేస్తున్నా. మా నాన్నగారికి జై! మా పార్టీకి జై!!"  

(picture courtesy : Google) 

5 comments:

  1. చెమటలు పడుతున్నాయి.

    ReplyDelete
  2. చినబాబు తాతగారికి కూడా జై చెప్పే ఉంటారు మీరు మరిచిపోయారు!

    ReplyDelete
  3. తాతగారికి జై కొట్టకపోతే ఓట్లు రాలేదెలా?

    ReplyDelete
    Replies
    1. మా తాత బుద్ధుని విగ్రహం పెట్టాడు, మా నాయన హైటెక్ టెక్కు సిటీ కట్టాడు, నేను నిక్కర్లు ఏసుకొని గల్లీల్లో తిరిగాను అంటూ ఎంత మొత్తుకున్నా వోట్లు రాలలేదు ఎందుకో పాపం!

      Delete

comments will be moderated, will take sometime to appear.