టీవీలో పాండురంగ మహత్యం సినిమా చూస్తున్నాను. ఘంటసాల పాడిన 'అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా.. ' పాట వస్తుంది. ఘంటసాల అద్భుత గానం. రామారావు హృదయ విదారక నటన. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. ఆనందంతో.. తన్మయత్వంతో.. మైమరచి చూస్తుండగా..
"రవణ మామా! కాఫీ. అర్జంట్." అంటూ సుడిగాలిలా సుబ్బు అడుగెట్టాడు.
"నీ కాఫీదేముంది గానీ.. ఈ పాట చూడు సుబ్బు. నీ జన్మ ధన్యమౌతుంది." అన్నాను.
సుబ్బూ కూడా సినిమా చూస్తూ కూర్చున్నాడు. పాట అయిపోయింది.
"రామారావు తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం. ఆయన దురదృష్టం." ఎప్పుడో, ఎక్కడో ఎవరి గూర్చో ఎవరో అనంగా చదివాను. ఈ భారీ డైలాగ్ నాకు బాగా నచ్చింది. అందుకే.. ఇదిగో ఇప్పుడు రామారావు కోసం వాడి పడేశాను!
"తెలుగులో అక్షరాలు ఎక్కువ. వాచాలత్వం, వాగాడంబరం కూడా ఎక్కువే. రామారావు తెలుగువాడవడం మనకి అదృష్టం అనేది అర్ధమైంది. కానీ ఆయనకి దురదృష్టం ఎందుకో అర్ధం కాలేదు."
అమ్మయ్య! ఇన్నాళ్ళకి సుబ్బుకి క్లాస్ పీకే అవకాశం వచ్చింది.
"ఒరే నాయనా! నీకు అరటిపండు ఒలిచి చేతిలో పెడితే గానీ అర్ధమయ్యి చావదు. మళ్ళీ అన్నిట్లో నోరేస్తావ్. రామారావు ఏ అమెరికాలోనో పుడితే అంతర్జాతీయ స్థాయి నటుడయ్యేవాడు. గ్రెగరి పెక్, మార్లన్ బ్రాండో, రాబర్ట్ డి నీరో పంక్తిలో ఉండేవాడు. కేవలం తెలుగువాడవటం చేత ఆయన కీర్తి తెలుగు దేశానికే పరిమితమయ్యింది."
మా సుబ్బు ఒక క్షణం ఆలోచించాడు.
"రవణ మావా! ఈ ప్రపంచం ఒక ఏక్సిడెంట్ల కూపం. అందులో మనిషి జన్మ ఒక పెద్ద ఏక్సిడెంట్. ఈ ఏక్సిడెంట్లు కొందరికి లాభం. కొంతమందికి నష్టం. చాలామందికి శాపం. ఏ అంబాని కుటుంబంలోనో, గాంధీ వంశంలోనో పుట్టటం జాక్ పాట్. మన దేశంలో మనం పుట్టిన ప్రదేశం, కులం, జెండర్ మనిషి భవిష్యత్తుని చాలామటుకు నిర్ణయించేస్తాయి. ఉదాహరణగా నువ్విప్పుడు ఆకాశానికెత్తేస్తున్న ఎన్టీరామారావునే తీసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమ ఆ రోజుల్లో కేవలం రెండు జిల్లాలకే పరిమితమై.. ఒక కులం ఆధిపత్యంలో నడుస్తుండేది. ఆ రోజుల్లో తెలుగు సినిమా అగ్ర హీరోలందరూ ఆ ప్రాంతానికి, ఆ కులానికి చెందినవారై ఉండటం కాకతాళీయం కాదు. చాలా పద్ధతిగా అమలు పరచబడ్డ మాస్టర్ ప్లాన్. ఆ రోజుల్లో, ఆ ప్రాంతంలో, ఆ కులంలో హీరోకి కావలసిన అన్ని అర్హతలతో రెడీగా.. ఎవైలబుల్ గా ఉండటం ఎన్టీఆర్ కి కలిసొచ్చింది. ఎ సింపుల్ కేస్ ఆఫ్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ టైం! మరప్పుడు ఎన్టీఆర్ అదృష్టవంతుడు అవుతాడు గానీ దురదృష్టవంతుడు ఎలా అవుతాడు?"
ఇంతలో పొగలు గక్కుతూ కాఫీ వచ్చింది.
"రామారావు ఒక అద్భుత నటుడు. ఆ విషయాన్ని నేను అస్సలు కంటెస్ట్ చెయ్యట్లేదు. ఒక ప్రతిభాశాలి పాపులర్ నటుడవడానికి సహకరించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ కోణం గూర్చి మాత్రమే మాట్లాడుతున్నాను. రామారావు ఆ ప్రాంతంలో, ఆ కులంలో పుట్టకపోయినట్లయితే.. ఇంతకి వంద రెట్లు ప్రతిభావంతుడైనప్పటికీ.. మనం ఎప్పటికీ ఎన్టీరామారావు పేరు వినేవాళ్ళం కాదు. ఇంత చిన్న లెక్క తేలకుండా.. రామారావుని ఇంగ్లీషోడిగా, ఫ్రెంచోడిగా ఊహించుకుని ఎట్లా మాట్లాడగలవ్?"
"ఓరే సుబ్బు! నీ బుర్ర రోజురోజుకీ ఇరుగ్గా తయారవుతున్నట్లుంది!" చికాగ్గా అన్నాను.
"రవణ మావా! నేను చెప్పేది నీకర్ధమవుతున్నట్లు లేదు. ఇప్పుడు నేను నీకు అరటి పండు వలిచి నోట్లో పెడతాను. రామారావు తను పుట్టిన నిమ్మకూరు గ్రామంలోనే ఒక పుజారి గారింట్లో పుడితే అర్చకత్వం చేసుకునేవాడు. లేదా ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంత జీవనం కొనసాగించేవాడు. పక్కనున్న కుమ్మరి బజారులో పుడితే కుండలు చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. ఏ శివరాత్రికో, శ్రీరామనవమికో నాలుగు నాటకాలు వేసుకుని కళాతృష్ణ తీర్చుకునేవాడు. ఈ రామారావునే ఊరి బయట పల్లెలోకి పంపిద్దాం. జీవితమంతా చెప్పులు కుట్టుకుంటూ బ్రతికేసేవాడు. కనీసం తిరనాళ్ళప్పుడు కూడా వేషం దొరికేది కాదు. ఇప్పుడు చెప్పు. రామారావు దురదృష్టమేంటో!"
"సుబ్బు! చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్."
"ఇందులో దారుణం ఏముంది? మన సమాజం అనేక సామాజిక వర్గాల కలయికతో ఏర్పడ్డ ఒక పటిష్ట వ్యవస్థ. ఈ వ్యవస్థ నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైనది! ఒక్కో సామాజిక వర్గం ఒక్కో రంగంలో పట్టు సాధిస్తుంది. ఏ రంగంలోనూ 'అందరికీ సమానావకాశాలు' అనేది బూతద్దంతో గాలించినా కనబడదు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఒకే కులానికి చెందినవాళ్ళై ఉండటం.. చిన్న వ్యాపారస్తులంతా ఇంకో కులానికి చెందినవాళ్ళై ఉండటం కాకతాళీయం కాదు. మనం అయా సామాజిక వర్గాలలో పుట్టటం మాత్రం ఏక్సిడెంట్."
"సుబ్బు! నువ్వు ఒక గొప్ప నటుణ్ణి కించపరుస్తున్నావ్."
"రామారావు అంటే నీకు ఇష్టం మాత్రమే. నాకు వెర్రి అభిమానం. ఆ మహానుభావుణ్ణి కించ పరిచేంతటి అధముణ్ణి కాదు. నా పాయింటల్లా మన సమాజ పరిమితుల వల్ల ఇంకో పది మంది రామారావుల్ని మిస్ అయిపొయ్యామని. అంతే! 'మనుషులంతా ఒక్కటే. కులరహిత సమాజం.' లాంటి టీవీ నైన్ రవిప్రకాష్ బ్రాండ్ స్లోగన్స్ వినటానికి బాగానే ఉంటాయి. అదే నిజమయినట్లయితే ఒక గిరిజనుడు రాసిన కథకి, బిసీ కులస్థుడు పాటలు రాస్తే, దళితుడు హీరోగా, బ్రాహ్మణుడు నిర్మాతగా కొన్ని సినిమాలు రావాలి. అలా ఏదైనా సినిమా వచ్చిందా? నాకైతే తెలీదు. నీకు తెలిస్తే చెప్పు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ టైం చూసుకున్నాడు.
"నాకు బ్యాంక్ పనుంది. వెళ్ళాలి." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.
హమ్మయ్య! వర్షం వెలిసినట్లయింది.
టీవీలో 'జయకృష్ణా ముకుందా మురారి.. ' అంటూ ఘంటసాల ఆలాపన మొదలైంది. తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాను.