"అమ్మా! అబ్బా!" కడుపు చేత్తో పట్టుకుని, కళ్ళు గట్టిగా మూసుకుని, పళ్ళ బిగువున బాధ భరిస్తున్నాను.
"కొంచెం ఓపిక పట్టు నాన్నా, ఒక్కనిమిషం." అంటూ తులసికోట నుండి రెండు తులసి దళాల్ని తుంచారు శేషమ్మగారు.
పొట్టిగా, తెల్లగా, బొద్దుగా, నుదుట రూపాయంత కుంకుమ బొట్టుతో ప్రశాంతంగా కనిపించే శేషమ్మగారంటే మావీధిలో అందరికి గౌరవం. విశాలమైన శేషమ్మగారిల్లు మా ఇంటికి రెండిళ్ళ ఆవతలగా ఉంటుంది.
ఆ తులసి దళాల్ని దోసిలిలో పెట్టుకుని సూర్యుని వైపు చూస్తూ ఏవో మంత్రాలు జపించారు. నెమ్మదిగా కళ్ళు తెరచి ఆ తులసి ఆకుల్ని నాపొట్ట మీద ముందుకీ వెనక్కి సున్నితంగా మూడుసార్లు రాశారు.
"ఇంటికెళ్ళి పడుకో నాన్న, కొంతసేపటికి తగ్గిపోతుంది." హామీ ఇచ్చారు శేషమ్మగారు.
ఆవిడ చెప్పినట్లే కొద్దిసేపటికి నా కడుపునొప్పి 'హుష్'మంటూ ఎగిరిపోయింది! దటీజ్ శేషమ్మగారు.. అపర ధన్వంతరి!
నేను గుంటూరు బ్రాడీపేటలో పుట్టి పెరిగాను. ఐదోక్లాసు దాకా శారదానికేతనంలో చదువుకున్నాను. అక్క నాకు ఒక సంవత్సరం సీనియర్, స్కూలుకి రెగ్యులర్‌గా వెళ్ళేది. నాకు మాత్రం స్కూలుకెళ్ళడం అత్యంత దుర్భరంగా ఉండేది. మా స్కూలు భూకంపంలో కూరుకుపోయినట్లూ, వరదల్లో కొట్టుకుపోయినట్లూ మధురమైన కలలొచ్చేవి (ఆవిధంగా కలలు నిజం కావని చిన్నప్పుడే గ్రహించాను).
స్కూలు ఎగ్గోడదామని అనేక తీవ్రమైన ప్రయత్నాలు చేసేవాణ్ణి. ఆ ప్రయత్నాలు విఫలమవడమే గాక తన్నులు బోనసుగా లభించేవి. ఆవిధంగా నాపై నిర్భంద విద్యాబోధన కార్యక్రమం కర్కశంగా, నిర్విఘ్నంగా అమలు జరపబడింది. దీన్నే 'చదువుకోవటం' అనంటారని పెద్దయ్యాక అర్ధమైంది.
అమ్మకి చుట్టుపక్కల ఇళ్ళల్లో స్నేహితులుండేవారు. వాళ్ళల్లో ఎదురింటి విజయ అతి ముఖ్య స్నేహితురాలు. మేం ఆవిడని 'విజయక్కయ్య' అని పిలిచేవాళ్ళం. విజయక్కయ్య వయసులో అమ్మకన్నా పదేళ్ళు చిన్నది. ఆవిడ భర్త ఆఫీసుకి, పిల్లలు బడికి వెళ్ళిన తరవాత అమ్మతో చాలాసేపు కబుర్లు చెప్పేది.
ఇద్దరు కలిసి బియ్యంలో రాళ్ళు యేరేవాళ్ళు, మినుమలు తిరగలి పట్టేవాళ్ళు, ఆవకాయ పట్టేవాళ్ళు. కబుర్లు కూడా వెరైటీ సబ్జక్టుల మీద చెప్పుకునేవాళ్ళు. 'సుబ్రమణ్యం పెళ్లిసంబందం యెందుకు తప్పిపోయింది? సుబ్బలక్ష్మికి పెళ్ళయి నాలుగేళ్ళైనా ఇంకా కడుపెందుకు రాలేదు?' నాకు వాళ్ళ కబుర్లు అర్ధమయ్యేవి కాదు.
కుక్కలకి వాసనశక్తి స్పెషల్ పవర్, అది ఆ జాతి లక్షణం. కుక్కజాతివలే నాలోనూ ఒక స్పెషల్ పవర్ ఉంది. అది - అమ్మ, విజయక్కయ్యల సినిమా ప్రోగ్రాం ముందుగా పసిగట్టెయ్యడం. సినిమా ప్రోగ్రాం వున్ననాడు వీళ్ళద్దరూ కళ్ళతో సైగలు చేసుకుంటారు, తక్కువగా మాట్లాడుకుంటారు. నాకు వీళ్ళ బాడీ లాంగ్వేజి అర్ధమైపొయ్యేది.
ఈ విషయం తెలీని అమాయక అక్క మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ స్కూలుకెళ్లిపొయ్యేది. అన్నం పీకల్దాకా దట్టించి, నా కడుపునొప్పి నటన ప్రారంభించేవాడిని (అన్నం తినకముందే కడుపునొప్పి యాక్షన్ మొదలెడ్తే ఆ తరవాత ఆకల్తో చస్తాం, అందుకే నటనలో టైమింగ్ ముఖ్యం అంటారు పెద్దలు).
స్కూలుకెళ్ళే ముందు - 'అమ్మా, నొప్పి' అంటూ డొక్క నొక్కుకుంటూ కూలబడిపొయ్యేవాణ్ని. నా ఈ గొప్ప ఐడియాని (నేను పుట్టకముందే) కాపీ కొట్టేసి ఎల్వీ ప్రసాద్ 'పెళ్ళిచేసి చూడు'లో పాటగా పెట్టేశాడు - ఆ విషయం పెద్దయ్యాక తెలిసింది!
స్కూల్ టైమ్ దాటిపొంగాన్లే ఈ ఓవర్ యాక్షన్ శృతి కొంత తగ్గించాలి. స్కూలు అనే ప్రధమ గండం గడిచింది గదా, అని పూర్తిగా రిలాక్స్ అయితే నాది ఉత్తుత్తి కడుపునొప్పని తెలిసిపోతుంది. ఇది మన భవిష్యత్తు నాటకాలకి దెబ్బ (దురాలోచన చేసేవాడు దూరాలోచన కలిగుండాలి).
అమ్మ, విజయక్కయ్య కొద్దిసేపు మంతనాలు సాగించేవారు. ఇద్దర్లోనూ నా కడుపునొప్పి వాళ్ళ సినిమాకి ఎసరు తెస్తుందేమోననే ఆందోళన కనిపించేది. మా ఫ్యామిలి డాక్టరు వాడపల్లి వెంకటేశ్వరరావుగారి దగ్గరికి తీసుకెళ్ళాలంటే అరవై పైసలు ఖర్చు. అంత డబ్బు అమ్మ దగ్గర ఉండేది కాదు.
అంచేత - వయా మీడియాగా నన్ను శేషమ్మగారి దగ్గరకి తీసికెళ్ళేవాళ్ళు. ఈ కథకి హీరోయిన్ శేషమ్మగారు కావున ఆవిడ వైద్యవిధానం ముందే తెలియజేశాను.
శేషమ్మగారి తులసిదళ వైద్యానంతరం నా కడుపునొప్పి సహజంగానే తగ్గిపొయ్యేది!
అమ్మ ప్రేమగా నాతల నిమురుతూ - "కళ్ళు మూసుకుని పడుకో, కొద్దిగా పనుంది, విజయతో పాటు అలా బజారు దాకా వెళ్ళొస్తా." అనేది.
"భయమేస్తుందమ్మా, మళ్ళీ నొప్పి వస్తుందేమో." అని దీనంగా అనేవాణ్ణి.
అమ్మ, విజయక్కయ్యలు మళ్ళీ మరికొద్దిసేపు మంతనాలు.
కొద్దిసేపటికి అమ్మ నెమ్మదిగా చెప్పేది - "సినిమాకెళ్దామని విజయ ఒకటే గొడవ, నువ్వూ వస్తావా?"
"వస్తానమ్మా"
"సరే, రా! ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా నాన్నకి." అని ఒట్టేయించుకుని నన్ను సినిమాకి తీసుకెళ్ళేది.
మా ఇంటికి దగ్గరగా రెండు సినిమా హాళ్ళుండేవి. ఒకటి ఆనందభవన్ పక్కగా ఉండే లక్ష్మీ పిక్చర్ పేలెస్, ఇంకోటి ఓవర్ బ్రిడ్జ్ అవతలగా శేషమహల్. అమ్మ, విజయక్కయ్యలతో పాటు నడుచుకుంటూ వెళ్లి, నా కడుపునొప్పి సినిమాలన్నీ ఈ హాళ్ళలోనే చూశాను.
తిరపతమ్మకథ, సతీసక్కుబాయి, నాదీ ఆడజన్మే, మాతృదేవత, ఆడపడుచు.. దాదాపుగా అన్నీ మూడుగంటల ఏడుపు సినిమాలే. నాకేమో ఫైటింగు సినిమాలు ఇష్టం, కానీ ఆ సినిమాల్లో భూతద్దంతో వెదికినా ఒక్క ఫైటింగ్ కూడా ఉండేది కాదు. అసలు నాకా సినిమాలల్లో ఎవరు ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్ధమయ్యేది కాదు.
స్టిల్ నో రిగ్రెట్స్, నాది డబుల్ ధమాకా! స్కూలు ఎగ్గొట్టాను, సినిమా చూస్తున్నాను. ప్రపంచంలో ఇంతకన్నా లక్జరీ ఏముంటుంది? ఆశ్చర్యమేమంటే - హాల్లో చాలామంది మావీధి ఆడవాళ్ళుండేవారు. సినిమాహాల్లోనే 'పిన్నిగారు, వదినగారు' అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకిరించుకునేవారు.
సినిమా మొదలెట్టిన అరగంటకి హాలు వాతావరణం బరువెక్కేది, ఆపై వేడినిట్టూర్పులతో ఉక్కపోత వాతావరణం మరింత వేడెక్కేది. చిన్నగా మొదలైన ఏడ్పులు, క్రమంగా నిశ్శబ్ద వెక్కిళ్ళుగా రూపాంతరం చెందేవి. రాన్రాను ఏడుపు, పెడబొబ్బలతో హాలు దద్దరిల్లేది. ఆవిధంగా ఆ సామూహిక రోదనా కార్యక్రమం అప్రతిహతంగా గంటలపాటు సాగిపోయ్యేది.
మధ్యలో బుర్రుబుర్రున ముక్కుచీదుళ్ళు, సూర్యాకాంతాన్ని చూస్తూ మెటికల విరుపులు, తిట్లు, శాపనార్ధాలు. హీరోయిన్ కష్టాలకి పెద్దవాళ్ళు ఏడుస్తుంటే, ఉక్కపోత భరించలేక పసిపిల్లలు ఏడ్చేవాళ్ళు. ఆవిధంగా వాతావరణం రోదనాభరితంగా, శోకపూరితంగా ఉండేది. సినిమా అయిపొయ్యేప్పటికి అందరి ఆడవాళ్ళ మొహాలు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయేవి, జుట్టు రేగిపోయేది, కళ్ళు వాచిపోయేవి.
సినిమాని వినోదసాధనం అంటారు, డబ్బిచ్చి ఏడవటం వినోదం కిందకి వస్తుందా?! సమాధానం నాకు తెలీదు గానీ, మొత్తానికి నా కడుపునొప్పి నాటకంతో చాలా సినిమాలే గిట్టిచ్చాను. ఇంటికి వెళ్ళంగాన్లే హడావుడిగా మంచమెక్కి, దుప్పటి కప్పుకుని, నీరసంగా పడుకునేవాణ్ణి - అక్క స్కూల్ నుండి వచ్చే వేళయింది గదా!
'నీ బోడి కడుపునొప్పి నటన గూర్చి తెగ డబ్బా కొట్టుకుంటున్నావ్, ఆమాత్రం మా చిన్నప్పుడు మేమూ వెలగబెట్టాం.' అని అంటారా? సర్లేండి, కాకిపిల్ల కాకికి ముద్దు. నా నటన నాకు మాత్రం గొప్పే. మంచినటనకి కొలమానం ఎదుటివారిని నమ్మించడమే అయితే, నాకందులో నంది అవార్డు రావాలి. కారణం - నా కడుపునొప్పి నాటకాన్ని అమ్మ గానీ, శేషమ్మగారు గానీ, ఎప్పటికీ గ్రహించలేకపోయారు.
శేషమ్మగారి తులసిదళ మంత్రం కడుపునొప్పికి అద్భుతంగా పన్జేస్తుందని అమ్మ ప్రచారం చేసింది. శేషమ్మగారికి కూడా కాన్ఫిడెన్సు పెరిగింది. రెట్టించిన ఉత్సాహంతో తన వైద్యాన్ని జ్వరాలు, దగ్గు, గజ్జి పుళ్ళు, పంటినొప్పి వగైరా రోగాలకి విస్తరింపజేసి ప్రాక్టీసు పెంచుకున్నారు. రోజూ సాయంత్రం నాలుగింటికి తులసికోట పక్కన కూర్చుని పేషంట్లని చూసేవారు. శేషమ్మగారి మంత్రం చాల పవర్ఫుల్లనీ, కొన్నిరోగాలకి వాడపల్లి వెంకటేశ్వరరావుగారి కన్నా ఆవిడే మెరుగనీ చెప్పుకునేవారు. ఆవిడ 'అపర ధన్వంతరి' అనీ, దేవీ ఉపాసకురాలు కావడం చేతనే ఆవిడ వైద్యానికి గొప్పమహత్తు కూడా ఉందని ప్రచారం వచ్చింది.
నేను తన వైద్యం నూటికి నూరుశాతం పనిచేసిన పేషంటుని కావటంచేత శేషమ్మగారు నాపట్ల అవ్యాజ వాత్సల్యాన్ని కురిపించేవారు.
"ఏం నాన్నా! ఈ మధ్యేం కడుపునొప్పి రావట్లేదు గదా!" అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.
ఆ పిలుపులో నాకు అనేకరకాల భావాలు గోచరించేవి. ఏ డాక్టరైనా తన మొదటి పేషంట్ పట్ల కృతజ్ఞతా భావం, ప్రేమానురాగాలు కలిగుంటాడు. తన వైద్యం వల్ల రోగం తగ్గి నార్మల్ అయిన పేషంట్లని చూస్తే డాక్టర్లకి అపరిమితమైన తృప్తి, గర్వం! నీకు ఏ రోగమొచ్చినా తగ్గించటానికి నేనున్నానుగా అనే భరోసా, అభయ హస్తం కూడా శేషమ్మగారి పలకరింపులో నాకు కనబడేవి!
ఏడు పెంకులాట, పిచ్చిబంతి మొదలైన సందుగొందుల క్రీడలు ఆడుతుండగా, శేషమ్మగారి పెరట్లో బంతి పడ్డప్పుడు, దాన్ని తెచ్చుకోటానికి వారి ఇంటి ప్రహరీ గోడ దూకి (ఇంటి తలుపులు తెరిచున్నా గోడ దూకాలనే పాలసీ నాది) పెరట్లో బంతికోసం వెతుకుతున్నప్పుడు.. చేతిలో చిన్న బెల్లంముక్కో , గుప్పెడు శనగపప్పులో పెట్టేవారు. ఎంతయినా నేనావిడ బెస్ట్ పేషంటుని గదా!
నా 'కడుపునొప్పి' తగ్గించి, నాకు దుష్టదుర్మార్గ స్కూలు నుండి తాత్కాలిక విముక్తి కల్పించి, నేను అనేక సినిమాలు చూడ్డానికి కారణభూతురాలైన 'అపర ధన్వంతరి' శేషమ్మగారికి శతకోటి వందనాలు!