Friday, 3 February 2012

విగ్రహామా! భవిష్యత్తు నీదే!!


ఆంధ్రజ్యొతి  పేపర్లో  విగ్రహాల  కూల్చివేత  గూర్చి  రంగనాయకమ్మ  రాసిన  ఆర్టికల్  చదువుతున్నాను. వ్యాసం  రంగనాయకమ్మ  రాసినట్లుగా  లేదు! చప్పగా  ఉంది. బాలేదు.

"రవణ మావా! కాఫీ. అర్జంట్." అంటూ  సుడిగాలిలా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"కూర్చో  సుబ్బు! తెలుగు జాతంతా  విగ్రహాల విధ్వంసం  గూర్చి  సతమతమైపోతుంది. నువ్వు  మాత్రం  కాఫీ  తప్పితే  దేన్నీ  పట్టించుకోవు. కొద్దిగా  సీరియస్ గా  ఆలోచించు  సుబ్బు!"

ఒక్క  క్షణం  ఆలోచించాడు   సుబ్బు.


"సీరియస్ గా  చెప్పనా? అయితే  విను. విగ్రహాల  కన్నా  మనుషులు  ముఖ్యం. ఈ  రోజుకీ  ఆకలి చావులకి  నిలయమైన  మన  సమాజానికి  ఈ  పరమ పవిత్ర  విగ్రహ సంస్కృతి  అవసరమా? లక్షలు  వృధా  చేసి  విగ్రహాలు  ఏర్పాటు  చెయ్యటం  దండగ. మానవసేవే  మాధవసేవ  అన్నారు. ఇప్పుడు  విగ్రహసేవే  మానవసేవ  అంటున్నారు. అందుకే  ఇప్పుడు  మనకి  శ్రీశ్రీ  గూర్చి  లగడపాటి  పాఠాలు  చెబుతున్నాడు. సమాజానికి  శ్రీశ్రీ  రిలవెంట్  అయితే  మహాప్రస్థానం  నిలబడుతుంది. లేకపోతే  మహాప్రస్థానంతో  బాటు  శ్రీశ్రీ  కూడా  కాలగర్భంలో  కలిసిపోతాడు. పని గట్టుకుని  ఎన్టీఆర్  దాతృత్వంతో  శ్రీశ్రీ  లెగసీని  టాంక్ బండ్  ఫై  పోషించనేల? పూర్వం  పుస్తకాల  నుండి  కవుల  గొప్పదనం  గుర్తించేవాళ్ళం. ఇప్పుడు  విగ్రహాల  ద్వారా  గుర్తిస్తున్నాం. టాంక్ బండ్  విగ్రహాల్ని  కూల్చేసినప్పుడు  కొందరు  గుండెలు  బాదుకున్నారు. వాళ్ళ  ఇళ్ళల్లో  మనుషులు  చచ్చినా  అంతకన్నా  ఏడుస్తారని  అనుకోను. ఆ  ఏడ్చిన వాళ్ళల్లో  చాలామందికి  ఆ  కూలిన విగ్రహాలు  ఎవరివో  కూడా  తెలీదు."

ఇంతలో కాఫీ  వచ్చింది.

"మరీ  ఆర్.నారాయణమూర్తి  టైపు  ఆవేశం  వద్దు. కొద్దిగా  ప్రశాంతంగా, పెద్ద మనిషిలా  చెప్పు. చాలు." అన్నాను.


"అయ్యో! దానికేం  భాగ్యం! పరమ ప్రశాంతంగా  చెబుతా. విను. ఈ  విగ్రహాలనేవి  ఒక  ప్రాంతానికీ, కాలానికీ  సంబంధించిన  సాంఘిక, రాజకీయ భావాల  ఆధిపత్య  ప్రదర్శన. పుస్తకాల్లో  లిఖించబడే  చరిత్ర  వలే  విగ్రహాలు  కూడా  శిల్పులతో  చెక్కించబడే  చరిత్ర. స్టాలిన్, సద్దాం  విగ్రహాలు  ఇందుకు  ఉదాహరణ. రాజ్యాధికారం  మారినప్పుడు  ఈ  విగ్రహాలు  సహజంగానే  నేలకొరుగుతాయి. బుద్దుణ్ణి  కూలగొట్టే  ధ్వంస రచన  చేసిన  తాలిబన్లు  అప్పటి  దేశ రాజకీయ భావాల్ని  చరిత్రలో  లిఖించారు." కాఫీ  సిప్  చేస్తూ  అన్నాడు  సుబ్బు.

"సుబ్బు! మాలతి చందూర్  లాగా అర్ధం  కాకుండా  అంతర్జాతీయ స్థాయిలో  మాట్లాడుతున్నావ్. కొంచెం  ప్రజల భాషలో  చెప్పవా? ప్రస్తుతం  ఆంధ్రాలో  నడుస్తున్న  విగ్రహల గోల  గూర్చి  మాట్లాడు." చికాగ్గా  అన్నాను.

"నువ్వడిగేది  తెనాలి  విగ్రహాల  సంగతేనా? దాని  గూర్చి  మాట్లేదేముంది! పాపం.. ఆ  కూల్చేసేవాళ్ళకి  'రంగా  బొమ్మని  కూల్చండి.'  అని  చెప్పి  పంపారు. అసలు  ఆంధ్ర దేశంలో  ఇద్దరు  రంగాలున్నారన్న  సంగతి  చాలా మందికి  తెలీదు. అందుకే  కూల్చటానికి  ఏ  రంగానయితేనేం  అనుకుని  శత్రుశేషము  రంగాశేషము  లేకుండా.. రెండు  రంగా విగ్రహాల్నీ  పడేసిపొయ్యారు. కాబట్టే  మన  ఏరియాలో  సంకుల సమరం  తప్పింది. వాళ్ళకి  సామాన్య ప్రజానీకం  తరఫున  నా  కృతజ్ఞతలు."

కళ్ళు  మూసుకుని  నిదానంగా  మాట్లాడటం  మొదలెట్టాడు  సుబ్బు.

"నేనిప్పుడు  Nostradamus ని. భవిష్యత్తు  చెబుతున్నాను  విను. రాబోయే  కాలంలో  విగ్రహలు  తయారు చేసే  శిల్పుల  కోర్స్ లకి   యూనివర్సిటీ  స్థాయిలో  ఎంట్రన్స్  పరీక్ష  నిర్వహించబోతున్నారు. అందుకోసం  శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు  కోచింగ్  ఇస్తాయి. సాఫ్ట్ వేర్  నిపుణులు  శిల్పి వేర్  నిపుణులుగా  మారబోతున్నారు. ప్రస్తుతం  ఉన్న  విగ్రహాల  ముక్కు  మొహాలు  ఏవో  చలిమిడి ముద్దల్లా  ఉన్నాయి. అస్సలు  బాగా లేవు. అందుకే  విగ్రహాల తయారి నిపుణతని  పెంచుకోటానికి  Madame Tussauds  museum  వాళ్ళని  సాంకేతిక సలహాదారులుగా  నియమించబోతున్నారు. "

"కాఫీలో  ఏదో  కలిసింది. తేడాగా  మాట్లాడుతున్నావ్."

"పిచ్చివాడా! భవిష్యత్తంతా  విగ్రహాల  కూల్చివేతలదే!. ప్రతి  కులానికి, ఉప కులానికి, భాషకి, భాషలో  వివిధ  యాసలకి, మతానికి, ప్రాంతానికి, ఉప ప్రాంతానికి, వృత్తికి..... అన్ని రకాలకి  ఒక్కో  వ్యక్తి  విగ్రహం  సంకేతంగా  నిలబడబోతుంది. ప్రభుత్వాలు  మారినప్పుడూ, మరనప్పుడూ.. ధరలు  పెరిగినప్పుడు, ఉద్యోగం  పోయినప్పుడు, భార్య  తిట్టినప్పుడు, కూరలో  ఉప్పు  తగ్గినప్పుడు.. ఇట్లా  ప్రతి  సందర్భానికి  విగ్రహాలు  పడేస్తూ ఉంటారు. అన్నింటికీ  ఆత్మగౌరవమే! మనుషులంతా  విగ్రహాల  వారిగా  విడిపోయి  తన్నుకు చస్తుంటారు. ఎదుటి వాడి  విగ్రహ విధ్వంసం.. ఆపై  తమ  విగ్రహాలకి  ఇరవై నాలుగ్గంటలూ  కాపలా."

"సుబ్బు! interesting. carry on my boy!"

"యుద్ధాలు  కూడా  విగ్రహాల  ఆధారంగానే  జరుగుతాయ్. మెదక్ లో  గురజాడ  విగ్రహ  ముట్టడి. ప్రతిగా  విశాఖలో  కాళోజీ  విగ్రహ ముట్టడి. బందీలైన  విగ్రహాలు  గజ గజ. hostage  crisis. టీవీ లలో  లైవ్  షో. sms లు. టాక్  షోలు. ఉద్రిక్త పరిస్థితులు. పోలీస్  లాఠీ చార్జ్. కాల్పులు. హాహాకారాలు. మృతులు. నష్ట పరిహారాలు. తీవ్రమైన  చర్చల  అనంతరం  ఒక  రాజీ మార్గం. మేం  గురజాడ  తలపాగా  ఎగరకొడతాం. మీరు  కాళోజీ  గడ్డాన్ని నరుక్కోండి. ప్రశాంతత  నెలకొనడానికి  చర్చల  ద్వారా  తీవ్ర  కృషి  చేసిన  కేసీఆర్, బొత్స  కొడుకులకి   ధన్యవాదాలు."

"రోజూ  ట్రాఫిక్ జామ్ లన్న  మాట!"

"ఇంకెక్కడి  ట్రాఫిక్! ప్రజలు  ఊళ్లు  ఖాళీ  చేసి  పొలాల్లో  గుడారాలు  వేసుకుని  నివసిస్తుంటారు. కూల్చబడ్డ  విగ్రహాలకి  పాలాభిషేకం  కోసం, పున:ప్రతిష్ట  కోసం  చందాలిచ్చే  గొర్రెలుగా  మారిపోతారు. నగరాలన్నీ  ఖాళీ. నిర్మానుష్యం. వీధులన్నీ  వేల, లక్షల  విగ్రహాలు. కాపలాకి  ప్రైవేట్  సైన్యం. పాలిచ్చే  గేదెల్ని  మాత్రమే  బ్రతకనిస్తారు. ఎందుకంటే  అభిషేకం  కోసం  పాలు  అవసరం  కాబట్టి! కుక్కలు, కాకులు  కూడా  చంపబడతాయ్!"

"మధ్యలో ఆ  మూగజీవులు  ఏం  చేశాయి?"

"నీకన్నీ  విడమర్చాలి. కుక్కలు  కాలెత్తి  విగ్రహాల్ని  అపవిత్రం  చేస్తాయి. కాకులకి  విగ్రహాల  తలలంటే  భలే  ఇష్టం. అందుకే  వాటిని  commode గా  వాడుతుంటాయ్. అందుకని."

"సుబ్బు! బాగుంది."

"టీవీ  ప్రకటనలు. పెద్ద  బాంబ్  ప్రేలుడు. మంటల  మధ్య  చెక్కు  చెదరని  ఒక  విగ్రహం. పొగల్లోంచి  బయటకొచ్చి అక్కినేని అఖిల్  ఎనౌన్స్ మెంట్. 'మా  కంపెనీ  తయారు చేసిన  విగ్రహమే  కొనండి. ఇది  rdx  తో  కూడా  బద్దలవదు.' అంటూ. విగ్రహ తయారీకి  ప్రత్యేక సిమెంట్  తెప్పించాలని  కేబినెట్  నిర్ణయం. విగ్రహాల  తయారీలో  అవినీతి  అంతం  చెయ్యాలని  అన్నూ బక్రాలే  రాం లీలా  మైదానంలో  నిరాహార దిక్ష. వెంటనే  ప్రియాంక గాంధి  కొడుకుతో  చర్చలు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"సుబ్బు! నీ  ఇమేజినేషన్  అదిరింది."

"గాడిద గుడ్డేం కదూ! జార్జ్  ఆర్వెల్  రాసిన  1984  స్పూర్తితో.. విల్ స్మిత్  సినిమా 'I Am Legend'  back drop గా.. జాక్ లండన్  రాసిన  ఐరన్ హీల్  climax  ని  వినిపించాను. అంతే!" అంటూ  టైం  చూసుకున్నాడు.

"ఔరా! copy cat! " అన్నాను.

"మధ్యలో  పిల్లులేం  చేశాయి  పాపం!" అంటూ  నవ్వుతూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుడిగాలి సుబ్బు!

61 comments:

  1. Quite intersting

    ReplyDelete
  2. "ప్రతిగా విశాఖలో కాళోజీ విగ్రహ ముట్టడి"

    సుబ్బు చెప్పినదంతా బాగానే ఉంది కాని ఆంధ్రలో తెలంగాణా వారి విగ్రహాలు లేవు. నేను పని కట్టుకుని మరీ రామకృష్ణ బీచంతా గాలించినా నాకు ఒక్కటీ కనిపించలేదు. టాంకుబండు ఘటన తరువాత ప్రతిదాడులు జరగక పోవడానికి ఇదే కారణం.

    ReplyDelete
  3. Jai Gottimukkala గారు..

    ఇప్పుడైతే లేవు.

    కానీ సుబ్బు భవిష్యద్దర్శనం చేశాడు.

    ReplyDelete
  4. రమణ గారు,

    ఈ సుబ్బు విగ్రహం ఒకటి మీ బ్లాగులో ప్రతిష్టించండీ డాక్టరు గారు ! మార్నింగ్ దర్శనం చేసుకుంటాం , బ్లాగ్ అంతర్జాల 'రామనా సైన్యమై'!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. రమణ గారూ, ఇప్పుడే లేనప్పుడు భవిష్యత్తులో రావడం కల్ల. సుబ్బు గారి లాంటి మేధావి ఈ విషయం మరిచిపోయారేమో.

    PS: సుబ్బు మేధావి అన్నంతమాత్రాన మీరు మేధావి కాదనడం నా ఉద్దేశ్యం కాదు :)

    ReplyDelete
  6. హైదరాబాద్‌లో తెలంగాణా నాయకుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఒక సమైక్యవాది ఇలా సమాధానం చెప్పాడు "నువ్వు చెప్పిన లిస్ట్‌లోని నాయకుల విగ్రహాలు పెడితే దానికి నెక్‌లేస్ రోడ్ కూడా సరిపోదు" అని. నేను కేవలం ముగ్గురు తెలంగాణా నాయకుల పేర్లు చెప్పాను. వాళ్ళు తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్ & సురవరం ప్రతాపరెడ్డిలు. కాళోజీ నారాయణరావు గురించో, రావి నారాయణరెడ్డి గురించో నేను మాట్లాడలేదు. కోస్తా ఆంధ్రకి చెందిన నాకు తెలంగాణా నాయకుల గురించి తెలిసినది తక్కువే. అయినా నా లిస్ట్ లోని తెలంగాణా నాయకుల విగ్రహాలు పెడితే దానికి నెక్‌లేస్ రోడ్ సరిపోదట. తెలంగాణా నాయకులకి విగ్రహాలు పెడితే చూడలేని కోస్తా ఆంధ్ర ప్రాంతీయతత్వం ఇలాగే ఉంటుంది.

    ReplyDelete
  7. జై గారు, విశాఖపట్నం దాక ఎందుకు? కాళోజీ గారికి ఆయన పుట్టిన గ్రామానికి దగ్గరలో ఉన్న వరంగల్‌లోనో, కాజీపేటలోనో విగ్రహం పెట్టినా సమైక్యవాదులు దాన్ని ప్రాంతీయతత్వం అనే అంటారు. పక్కా సమైక్యవాది అయిన రాజశేఖరరెడ్డికి తెలంగాణాలో వీధివీధినా విగ్రహాలు పెట్టినా దాన్ని ప్రాంతీయతత్వం అనరు.

    ReplyDelete
  8. yaramana గారు నేనూ జిలేబీ గారితో ఏకీభవిస్తున్నా.సుబ్బు విగ్రహం ప్రతిష్టించాల్సిందే.

    "పాపం.. ఆ కూల్చేసేవాళ్ళకి 'రంగా బొమ్మని కూల్చండి.' అని చెప్పి పంపారు."

    హహహ ఈ లెక్కన "గాంధీ" అని చెప్పి పంపిస్తే తడవకి మూడు విగ్రహాలు ఎగిరిపోతాయన్న మాట. :))

    @ ప్రవీణ్

    "హైదరాబాద్‌లో తెలంగాణా నాయకుల విగ్రహాలు ఎందుకు పెట్టలేదు"

    ట్యాంక్ బండ్ మీద విగ్రహాలని ఎప్పుడూ సరిగా చూడలేదా? అక్కడ తెలంగాణా ప్రాంత మహనీయుల విగ్రహాలు కూడా ఉన్నాయి బాబూ అని నువ్వు అడిగిన చోటే చెప్పానుగా ప్రవీణ్. మళ్ళీ వేరే బ్లాగులో అదే పాటా?

    ఇక పొతే

    "నేను కేవలం ముగ్గురు ముగ్గురు తెలంగాణా నాయకుల పేర్లు చెప్పాను. వాళ్ళు తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్ & సురవరం ప్రతాపరెడ్డిలు."

    ఓ సారి నువ్వు ఎక్కడ చెప్పావో అక్కడికి వెళ్లి నీ కామెంట్ చూసుకునిరా. అక్కడ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు లేదు. సరే పోనీ నీ విశాల హృదయంతో ఆయన పేరు కూడా నీ లిస్టు లో చేర్చావనుకుందాం.

    ఆల్రెడీ ఆయన విగ్రహం టాంక్ బండ్ మీద ఉన్న విషయం తెలుసుకోకుండా మళ్ళీ లిస్టు లో చేర్చడాన్ని ఏమనుకోవాలి ప్రవీణ్? ఎప్పడూ టాంక్ బండ్ మీద ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయో సరిగా చూసినట్టు లేవు నువ్వు.

    ఇక పొతే నువ్వు చెప్పిన లిస్టు అంతా అన్నాను సరే. అక్కడ నా కామెంట్ ఒక సారి చూడు

    "తెలుగు వాళ్ళ రాజధానిలో తెలుగు జాతి మహనీయుల విగ్రహాలు పెట్టుకోడంలో తప్పేమిటో నాకు అర్ధం కాదు. అక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళ విగ్రహాలూ ఉన్నాయి ప్రవీణ్. నువ్వు చెప్పిన లిస్టు అంతా పెట్టాలంటే ట్యాంక్ బండ్ సరిపోదు నక్లెస్ రోడ్ పొడవునా పెట్టినా ఇంకా లిస్టు మిగిలిపోతుంది. ఉన్న ప్లేస్ ని బట్టి ఎంపిక చేసుకున్న ముఖ్యులని అక్కడ ఉంచారు గానీ అక్కడ లేని వారు జాతి ప్రముఖులు కారని కాదుగా."

    ఇక్కడ నా ఉద్దేశ్యం నువ్వు చెప్పిన ఇద్దరనే కాదు. ఇలా ప్రతి ఒక్కరూ కొమరం భీం, చాకలి ఐలమ్మ, తుర్రేబాజ్ ఖాన్ అంటూ లిస్టు ఇచ్చుకుంటూ పోస్తే అని.

    ఇప్పుడు నేను అక్కడ విశ్వనాధ వారి విగ్రహం లేదు కాబట్టి ఇది తెలంగాణావాదుల కుట్ర అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నువ్వు చెప్పేది కూడా అంతే.

    (yaramana గారూ ఇక్కడ ప్రవీణ్ నా కామెంట్ ప్రస్తావన తీసువచ్చాడు కాబట్టి స్పందించాల్సి వచ్చింది)

    ReplyDelete
  9. తెలంగాణాలో చాకలి ఐలమ్మ విగ్రహం పెడితే చాకలివాళ్ళలో కులగజ్జి పెరిగిపోతుందని ఇంకో మేతావి తన బ్లాగ్‌లోనే వ్రాసాడు. ఆయన పేరు నేను ఇక్కడ వ్రాయదలచుకోలేదు. ఒక విషయం మాత్రం ఇక్కడ చెపుతున్నాను. ఆ మహానుభవుడు ఉండేది బెంగళూరులో. నా స్నేహితురాలి భర్తకి ఆయన క్లాస్‌మేట్. ఆయన అభ్యుదయభావాలు ఉన్న వ్యక్తి అని నా స్నేహితురాలు చెప్పింది కానీ ఆయన బ్లాగ్‌లోనే అభ్యుదయవాదానికి వ్యతిరేకమైన ప్రాంతీయతత్వం కనిపించింది. ఆయన పేరు వ్రాస్తే నా స్నేహితురాలికి కోపం వస్తుందేమోనని ఆయన పేరు ఇక్కడ వ్రాయడం లేదు. ఆయన బ్లాగ్స్పాట్‌లో సెపరేట్ ఆంధ్ర అనే పేరుతో బ్లాగ్ పెట్టి తెలంగాణావాదాన్ని విమర్శిస్తూ వ్రాసాడు. ఆయన చాకలి ఐలమ్మని మంద కృష్ణ మాదిగతో పోలుస్తూ వ్రాయడం బోడి గుండు - మోకాలు పోలికలాగే అనిపించింది.

    ReplyDelete
  10. బాబూ నాన్నా చిట్టీ ప్రవీణూ పైన నువ్వు పెట్టిన కామెంట్ ఎందుకు పెట్టావో నాకెలాగూ అర్ధం కాలేదు కనీసం నీకైనా అర్థమయితే చాలు.

    ReplyDelete
  11. మిత్రులారా,

    అసలు విగ్రహాలు ఏ సంస్కృతి?

    విగ్రహాలు లేకుండా ఒక జాతి మనుగడ సాగించలేదా?

    విగ్రహ రహిత సమాజానికి తావు లేదా?

    లేకపోతే ఎందుకు లేదు?

    విగ్రహాలు మనని inspire చేసే విధంగా ఉంటే ఇంకో లక్ష విగ్రహాలు పెట్టుకోవచ్చు.

    అసలు విగ్రహాలే సమస్యలకి కారణమైతే.. అన్నింటినీ కట్టగట్టి బంగాళఖాతంలోకి విసిరెయ్యనూ వచ్చు.

    ఈ పోస్ట్ ప్రధానంగా ఈ పాయింట్ మీదనే రాయబడింది.

    ప్రాంతాల వారి లెక్కలు ఈ పోస్టుకి సంబంధం లేదు.

    దయచేసి గ్రహించగలరు.

    ReplyDelete
  12. కాళోజీ విగ్రహం గురించి వ్రాసి ప్రాంతం ప్రశ్నకి మీరే లేవనెత్తారు కద రమణ గారు.

    విగ్రహ రహిత సమాజం వస్తుంది. దళితులని కులం పేరుతో segregate చెయ్యకుండా ఉంటే దళితులకి ఐడెంటిటీ కోసం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, వీధికి అంబేద్కర్‌వాడ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంబేద్కర్ విగ్రహాలు అనేవి caste segregation నుంచే వచ్చాయి కదా. ఆ segregation లేనప్పుడు అంబేద్కర్ విగ్రహాలు అవసరం ఉండవు.

    ReplyDelete
  13. @प्रवीण् शर्मा:

    ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదులోనే కాదు తెలంగాణా అంతా తిప్పి కొడితే పది పన్నెండు విగ్రహాలుండేవేమో. విగ్రహాలు పెట్టుకునే సంస్కృతి ఆ తరువాతే వచ్చింది, మరీనా బీచు విగ్రహాలని మురిసిపోయిన copycat రామారావు గారి "దయ" వల్ల.

    @yaramana:

    ఏ విగ్రహాలు కూడా సఖ్యతకు, పరస్పర మైత్రికి ప్రతిరూపాలు కావు, కాజాలవు. The erection of a statue is an assertion of identity and a symbol of politics. అయితే విగ్రహాలు సమస్యకు కారణం కాదు, symptom మాత్రమె. విగ్రహాలు ఉంచుకున్నా తొలగించినా సమస్య అలాగే ఉంటుంది.

    ReplyDelete
  14. దళితులందరూ అంబేద్కర్ విగ్రహాలని స్వచ్ఛందంగా తొలిగించుకున్నంతమాత్రాన అగ్రకులాలవాళ్ళు వాళ్ళని segregate చెయ్యడం మానేస్తారా? అలా మానెయ్యరు కదా. ఈ పరిస్థితులలో దళితులు తమ ఐడెంటిటీ పరిరక్షణ కోసం తమ నాయకుని విగ్రహాలు అవసరమనే అనుకుంటారు. "కులాలు లేవు, ఆర్యన్ ఇన్వేసన్ థియరీ తప్పు, అన్ని కులాలూ సమానమే, కులాలు ఉన్నాయని అనడమే కులగజ్జి" అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా దళితుల segregation పైకి కనిపిస్తూనే ఉంటుంది.

    ReplyDelete
  15. కం. పడి పోయిన పడ నుండిన
    పడి లేచిన విగ్రహాల బాధలు చూస్తూ
    మిడికే నేతల బొమ్మలు
    పొడమును పడిపోవు నటులె పుడమి జిలేబీ

    ReplyDelete
  16. "ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదులోనే కాదు తెలంగాణా అంతా తిప్పి కొడితే పది పన్నెండు విగ్రహాలుండేవేమో."

    నీ వయసెంత ప్రవీణూ?

    ReplyDelete
  17. జిలేబీ గారు జాగ్రత్త. ఇక్కడ ప్రవీణ్ శర్మగారున్నారు -

    కం. నేరక ప్రవీణు శర్మకు
    మీరు జవాబిచ్చి గాని వివరించారో
    వారింక మిమ్ము వదలరు
    పోరాడే యోపికుంటె పొండు జిలేబీ

    ReplyDelete
  18. రమణ గారూ ఆరాధనకు విగ్రహ రూపం కల్పించడం ఏదో ఒక జాతికో సంస్కృతి కో పరిమితం కాలేదు. తనకన్నా అధికం అనుకున్న దానికి మనిషి ఎప్పుడూ పూజ్య స్థానం కల్పిస్తూనే వచ్చాడు. ప్రాచీన గుహాలయాల్లో శిల్పాలు, ఈజిప్ట్ లో ఫారో చక్రవర్తుల శిల్పాల నుండి ఈనాటి అమలాపురం అంబేద్కర్ విగ్రహాల వరకూ అన్నీ ఆరాధనకు రూపాలే. ఇది ఇప్పట్లో ఆగుతుందని కూడా నేను భావించటం లేదు. కాకపోతే తమ సమూహం ఆధిపత్యం ప్రదర్శించుకోడానికో లేదా వేరొక సమూహం మీద ఉన్న విద్వేషం వల్లనో అవతలవారికి ఆరాధనీయమైన విగ్రహాలు / శిల్పాల మీద తమ ప్రతాపం చూపడంతోనే సమస్య మొదలైంది. మన దేశానికి సంబంధించినంత వరకూ దేవాలయాలపై ముస్లిం రాజుల దండయాత్రలు చేసి విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఈ తరహా చర్యలు ప్రారంభమయ్యాయని నా అభిప్రాయం.

    ReplyDelete
  19. "ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదులోనే కాదు తెలంగాణా అంతా తిప్పి కొడితే పది పన్నెండు విగ్రహాలుండేవేమో." అని వ్రాసింది నేను కాదు. నేను పుట్టినది 29 ఏళ్ళ క్రిందటే. కానీ 1975 నుంచి రాజకీయాలలో ఉన్న మా తాతగారు దేశమంతా తిరిగారు కాబట్టి ముప్పై ఏళ్ళ క్రితం రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలు ఉండేవో మా తాతయ్యని అడిగితే చెప్పేస్తారులే.

    ReplyDelete
  20. "ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదులోనే కాదు తెలంగాణా అంతా తిప్పి కొడితే పది పన్నెండు విగ్రహాలుండేవేమో. విగ్రహాలు పెట్టుకునే సంస్కృతి ఆ తరువాతే వచ్చింది"

    ""ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదులోనే కాదు తెలంగాణా అంతా తిప్పి కొడితే పది పన్నెండు విగ్రహాలుండేవేమో." అని వ్రాసింది నేను కాదు."


    (దానవీర శూర కర్ణలో దుర్యోధనుడి ఎంట్రీ మ్యూజిక్ వేస్కో)
    నిరంతర బ్లాగ్లోక సంచారీ, నిష్ఫల మేధా ముకుట దారీ, అసమాన అసందర్భ వ్యాఖ్యా ప్రవీణా, వ్యర్ధ వాదనా ధురీణా మార్తాండా ఈ విధంబైన పరస్పర విరుద్ధ వ్యాఖ్యా చాతుర్యంతో మా సమయంబు వృధా చేయుట, సహనమ్ము పరీక్షించుట నీకు తగునా

    ReplyDelete
  21. నువ్వు ఎలాగూ వ్యాఖ్యలు పూర్తిగా చదవవు, కనీసం వ్యాఖ్యాత పేరు కూడా చదవవు.

    "ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదులోనే కాదు తెలంగాణా అంతా తిప్పి కొడితే పది పన్నెండు విగ్రహాలుండేవేమో. విగ్రహాలు పెట్టుకునే సంస్కృతి ఆ తరువాతే వచ్చింది, మరీనా బీచు విగ్రహాలని మురిసిపోయిన copycat రామారావు గారి "దయ" వల్ల."

    అనే వ్యాఖ్య వ్రాసినది జై గారు అయితే నా వయసు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది?

    ReplyDelete
  22. నాకు ముఖ్యమైన పనులున్నాయి.

    మీ కోసం comment moderation ఎత్తేశాను.

    చర్చలో కంటిన్యూ కాలేనందుకు మన్నించగలరు.

    ReplyDelete
  23. "నువ్వు ఎలాగూ వ్యాఖ్యలు పూర్తిగా చదవవు, కనీసం వ్యాఖ్యాత పేరు కూడా చదవవు."


    అవును ప్రవీణోయ్. పొరపాటే.కానీ ఏం చేస్తాం ఇన్నేళ్ళుగా నీతో వాదిస్తూ వాదిస్తూ సహవాస దోషం అనుకుంటా అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయ్ :)

    పొరపాటు జరిగితే జరిగింది కానీ నీ గుణగణాలను అద్భుతంగా కీర్తించే అవకాశం లభించింది చూశావా. అందుకే పెద్దోళ్ళు అంటారు ఏం జరిగినా మన మంచికే అని. :)

    ReplyDelete
  24. టపా చదవకుండానే రచయితని విమర్శించేవాళ్ళు ఉన్నట్టే (ఉదాహరణకి మహేశ్ గారిని విమర్శించినవాళ్ళలాగ) వ్యాఖ్య చదవకుండానే వ్యాఖ్యాతని విమర్శించేవాళ్ళు ఉంటారు.

    ReplyDelete
  25. "అసలు ఆంధ్ర దేశంలో ఇద్దరు రంగాలున్నారన్న సంగతి చాలా మందికి తెలీదు"

    అన్ని రంగాలలో రంగాలు ఉన్నారు
    అన్ని ప్రాంతాలలో రంగాలు ఉన్నారు
    అన్ని కులాలలో రంగాలు ఉన్నారు


    అన్ని సామాజిక వర్గాలలో రంగాలు ఉన్నారు

    "రంగా"స్తలరంగం నుండి సినిమా రంగంలోకొచ్చి రంగుల కళలు పేర్చిన రంగా ఒకరు

    కొండలకే రంగు వేసినా, రాజకీయ విద్యారంగాలలో ఎంత వెలుగు వెలిగినా, ఘోరంగా ఆరో వేలుగానే మిగిలిన రంగా ఒకరు

    స్త్రీల మనోరంగానికి కడలి తరంగాలకు ముడి పెట్టిన రంగా ఒకరు

    వ్యవసాయ రంగానికి, రాజకీయ రంగానికి వారధి కట్టిన రంగా ఒకరు

    బెజవాడ కదన రంగంలో బహిరంగంగా వీరంగం చేసిన రంగా ఒకరు

    అన్ని రంగాలలో అనేక రంగాలు
    అన్ని రంగులలో అనేక రంగాలు

    రంగా రంగా రోసేసు, పాకెట్ ఫుల్ ఆఫ్ పోసేసు, ఎస్ సార్ ఎస్ సార్ త్రీ బ్లాగ్స్ ఫుల్ (సరికొత్త nursery rhyme)

    రంగా రంగా రంగా రంగా రే (సరికొత్త chartbuster)

    PS: Lighter vein only.

    ReplyDelete
  26. జై గారూ క్షమించాలి ఇందాకా మీరు చేసిన వ్యాఖ్య ప్రవీణ్ చేసింది అనుకుని పొరపాటు పడ్డాను. మీరు వయసులో పెద్దవారే అయి ఉంటారు లెండి.

    ReplyDelete
  27. "టపా చదవకుండానే రచయితని విమర్శించేవాళ్ళు ఉన్నట్టే "
    ఈ మాట అనడానికి యావత్ బ్లాగ్లోకంలో నీకు మాత్రమే అర్హత ఉంది ప్రవీణ్ :)

    ReplyDelete
  28. టపా చదవకుండా రచయితని విమర్శించడం పాత స్టైల్. కత్తి మహేశ్ గారిని విమర్శించినవాళ్ళలో దాదాపుగా అందరిదీ అదే స్టైల్. అయితే వ్యాఖ్యలు చదవకుండానే వ్యాఖ్యాతని విమర్శించే స్టైల్‌ని కనిపెట్టింది శంకరే.

    ReplyDelete
  29. ప్రవీణ్ బ్లాగ్ లోక సంచారి .. ఈ మాట అన్నారు అయితే శంకర్ నిరంతర ప్రవీణ్ సంచారి ... నిరంతరం అతని గురించి పట్టించుకోవడం తప్ప మీకు మరో పనిలేద శంకర్ ...... మనం ఒక పోస్ట్ చదివితే నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చక పొతే ఎందుకో చెప్పి వెళ్లి పోవాలో కానీ అసలు విషయం వదిలి మరొకరి బ్లాగ్ లో శంకర్ ప్రావిన్ లా గొడవేమిటో ?

    ReplyDelete
  30. @प्रवीण् शर्मा:

    "నేను పుట్టినది 29 ఏళ్ళ క్రిందటే"

    ఆడవాళ్ళ జీతం, మగవాళ్ళ వయసు చెప్పకూడదనే సరికొత్త ఇడియా మీరు వినలేదా?

    ReplyDelete
  31. "వ్యాఖ్యలు చదవకుండానే వ్యాఖ్యాతని విమర్శించే స్టైల్‌ని కనిపెట్టింది శంకరే."

    ఆహా నా జన్మ ధన్యం. టాంక్ బండ్ మీద ఎవరెవరి విగ్రహాలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండా విగ్రహాల స్థాపన కోసం వాదించే స్టైల్ నువ్వు కనిపెట్టిన మహా పుణ్య దినానే నాకు ఇంతటి భాగ్యం దక్కింది చూశావా ప్రవీణ్ :)

    ReplyDelete
  32. విమర్శించాలనే ఇంటెన్షన్ కలిగితే ఎవరు వ్రాసారో, ఏమి వ్రాసారో చూడకుండానే విమర్శించేస్తారు. ఆ మధ్య కత్తి గారు ఆర్యన్ ఇన్వేసన్ థియరీ గురించి వ్రాస్తే అతన్ని విమర్శించేవాళ్ళు "ఆర్యన్ ఇన్వేసన్ థియరీ తప్పని ఎప్పుడో తేలిపోయింది" అని వాదించారు. కత్తి మహేశ్ lingual diversity & cultural diversity గురించి వ్రాసిన విషయాలని ఒక్క విమర్శకుడు కూడా పట్టించుకోలేదు. ఇక్కడ ఆ స్టైల్‌ని కొంచెం మార్చేసి వ్యాఖ్యాత పేరు కూడా చదవకుండా వ్యాఖ్యాతని విమర్శించే స్టైల్‌ని కనిపెట్టారు.

    ReplyDelete
  33. అజ్ఞాత గారూ అమోఘంగా సెలవిచ్చారు. నేను కామెంట్లలో ప్రవీణ్ నా కామెంట్ ఉదహరించడం చూసి వచ్చానన్న విషయం పైన నా మొదటి కామెంట్ చూస్తె మీకు అర్ధం అవకపోవడం కడుంగడు శోచనీయం. మరి నేను చెప్పిన స్టేట్మెంట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను అందుకు జవాబు ఇవ్వడం తప్పు కాదు కదండీ.

    "నిరంతరం అతని గురించి పట్టించుకోవడం తప్ప మీకు మరో పనిలేద శంకర్"

    ఇక పొతే మీ ఈ పై స్టేట్మెంట్ చూసి మహదానందం కలిగింది నేను నిరంతరం ప్రవీణ్ గురించి పట్టించుకుంటున్నానా లేదా అని మీరు నిరంతరం పనిమానుకు గమనిస్తున్నట్టు తెలుస్తోంది. సంతోషం. అంత శ్రమపడుతున్నప్పుడు అలా చీకట్లో అజ్ఞాతంగా ఉండిపోవడం ఎందుకు? వెలుగులోకి రావచ్చుగా.

    ReplyDelete
  34. శం"ఖరా", ట్యాంక్ బండ్ మీద తెలంగాణా నాయకుల విగ్రహాలు లేవని నేను అనలేదు. ఆ మధ్య గూగుల్ బజ్‌లో ట్యాంక్ బండ్ విగ్రహాల ద్వంసం గురించి చర్చ జరిగింది. తెలంగాణావాదులు మొల్ల విగ్రహాన్ని ద్వంసం చేశారని తెలకపల్లి రవి గారు వ్రాసిన విషయాన్ని నేను కూడా నమ్మేశాను. ట్యాంక్ బండ్ మీద మొల్ల విగ్రహం ఉందనీ, అది ద్వంసం కాలేదనీ మురళి గారు చెప్పారు. కావాలంటే నన్ను కూడా హైదరాబాద్ వెళ్ళి విగ్రహాలు చూడమన్నారు. తెలకపల్లి రవి గారు హిందూ సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణా వ్యతిరేక ద్వేషం కలిగించడానికి మొల్ల పేరు ఉపయోగించుకున్నారని మురళి గారు చెప్పారు. ఓ రోజు ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళి ఆటోలో వెళ్తున్నప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహాలు చూశాను. ఆటో వేగంగా వెళ్తుండడం వల్ల కొన్ని విగ్రహాలు మాత్రమే కనిపించాయి. నాకు కనిపించిన విగ్రహాలలో రుద్రమ దేవి విగ్రహం ఒకటి. ఆటో వేగంగా వెళ్తున్నా ఆ విగ్రహాన్ని గుర్తుపట్టగలిగాను. మొల్ల విగ్రహాన్ని కూడా గుర్తుపట్టాను. ఎవరో, ఏదో చెపితే గుడ్డిగా నమ్మేసే తత్వం నీలాంటివాళ్ళకి ఉంటుంది కానీ నాకు లేదు.

    ReplyDelete
  35. "ఎవరో, ఏదో చెపితే గుడ్డిగా నమ్మేసే తత్వం నీలాంటివాళ్ళకి ఉంటుంది కానీ నాకు లేదు."


    " తెలంగాణావాదులు మొల్ల విగ్రహాన్ని ద్వంసం చేశారని తెలకపల్లి రవి గారు వ్రాసిన విషయాన్ని నేను కూడా నమ్మేశాను."


    :)

    ReplyDelete
  36. తెలకపల్లి రవి గారు మీ సమైక్యవాదేననే విషయం మర్చిపోయినట్టు ఉన్నావు.

    ReplyDelete
  37. @SHANKAR.S said...

    "జై గారూ క్షమించాలి ఇందాకా మీరు చేసిన వ్యాఖ్య ప్రవీణ్ చేసింది అనుకుని పొరపాటు పడ్డాను. మీరు వయసులో పెద్దవారే అయి ఉంటారు లెండి"

    నా వయసు అంత ఎక్కువేమీ కాదు లెండి.

    అయితే ఒక విషయం తెలియడానికి ప్రత్యక్ష అనుభవం అక్కరలేదు. మనకు నమ్మకయిన వారు చెప్పినా చాలు కదా.

    ReplyDelete
  38. జై గారు, జై ఆంధ్ర ఉద్యమం జరిగిన కాలంలో మనమిద్దరమూ పుట్టలేదు. అయినా ఆ ఉద్యమం కేవలం ముల్కీ నిబంధనలకి వ్యతిరేకంగా జరిగిందనీ, ముల్కీ నిబంధనలని రద్దు చేసిన వెంటనే ఆ ఉద్యమం మాయమైపోయిందనీ మనకి ఎలా తెలిసింది?

    ReplyDelete
  39. @ప్రవీణ్
    "తెలకపల్లి రవి గారు మీ సమైక్యవాదేననే విషయం మర్చిపోయినట్టు ఉన్నావు."

    అయితే అక్కడ నేనెందుకు నవ్వానన్నది నీకు ఇంకా అర్ధం కాలేదన్న మాట. :)

    @ జై గారూ

    నిజమే

    ReplyDelete
  40. సరే గానీ ప్రవీణ్ నీ సోదంతా నాకెందుకు. అవతల నాకు బోలెడు పని ఉంది. నువ్వు ఈ పోస్ట్ టాపిక్ మీద ఏమన్నా కామెంట్లు చేస్తే చేయి. సాయంత్రం వచ్చాక చూసి నీ కామెంట్లలో సరుకుంటే స్పందిస్తా.

    ReplyDelete
  41. నాస్తికుడైన తెలకపల్లి రవి గారికి మొల్లతో పని ఏమొచ్చిందో, ఆయన మొల్లని ఎందుకు పొగిడాడో, రామాయణం మహా కావ్యం అని ఎందుకు అన్నాడో అర్థం కానంత అమాయకులు లేరు. ఒకవేళ మొల్ల విగ్రహం నిజంగా ద్వంసమై ఉన్నా తెలకపల్లి రవి గారి ఇంటెన్షన్ ఏమిటో చదివేవాళ్ళకి అర్థం కాదా?

    ReplyDelete
  42. మొల్ల రాముణ్ణి మానవీయంగా చిత్రించిందట! తెలకపల్లి రవి గారి కామెడీ ఇక్కడ చదవండి: http://telakapalliravi.blogspot.in/2011/03/blog-post_17.html
    మత గ్రంథాలలో ఉన్నవాటిని మార్చడం సాధ్యమేననే మొల్ల పాయింట్‌తో ఏకీభవిస్తే CPMవాళ్ళు హిందూ మతాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు కదా.

    ReplyDelete
  43. విగ్రహ విద్వంసం విషయానికొచ్చేసరికి నాస్తికులు కూడా భక్తులు ఎలా అయిపోయారో చెప్పడానికే తెలకపల్లి రవి గారి గురించి ఉదహరించాను. వ్యక్తిగత ప్రయోజనాల విషయానికొచ్చేసరికి మతం, నాస్తికత్వం, విగ్రహారాధన, ఏకేశ్వరోపాసన లాంటి వ్యక్తిగత నమ్మకాలు ఏమీ పని చెయ్యవు.

    ReplyDelete
  44. @प्रवीण् शर्मा:

    Thanks a lot for the link, very interesting & full of unintended humor.

    తెలకపల్లి వారి "డోకు" పురాణంలో కొన్ని మచ్చు తునకలు.

    "ట్యాంకు బండ్‌పై తెలుగు ప్రముఖుల విగ్రహాల విధ్వంసం": Arthur Cotton, Srikrishnadeva etc. are not Telugus. Similarly Maqdoom Mohiuddin & Mahboob Ali Khan.

    "1986లో ఆ విగ్రహాలను ప్రతిష్టిస్తే ఆ తర్వాత కాలంలో మరణించిన దాశరథి, కాళోజీ,అయిలమ్మ వంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడం అలాటిదే": ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి విగ్రహాలు వారి జీవిత కాలం లోనే వెలశాయి, బద్దలయాయి కూడా.

    "వారిిలో దాదాపు అందరూ సంస్కర్తలు కవులు కళాకారులు చారిత్రిక వ్యక్తులే. మాననీయులే": ఓహో అందరూ కాదా? కానిదేవరో తెలకపల్లి వారు సెలవిస్తే వారి విగ్రహాలు మాత్రమె పడగోట్టేవారేమో?

    "తెలంగాణా ప్రజలు వెట్టిచాకిరీలో మగ్గిపోవడానికి కారణమైన నిజాంను నెత్తిన పెట్టుకుని మాట్టాడటం ఒకవైపు- నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్న దాశరథి విగ్రహం పెట్టాలనడం మరో వైపు ఎలా పొసుగుతాయి?": మహబూబ్ అలీ ఖాన్ విగ్రహం పెట్టింది ఎందుకో తమరే చెప్పండి మరి

    "తెలంగాణా సాయుధ పోరాట తొలిఅగ్ని కణం దొడ్డి కొమరయ్య": కామ్రేడు చరిత్ర చదివినట్టు లేడు, తొలి అమరుడు బందగీ అనే సాధారణ గ్రామికుడు. ముస్లిం కావడమో లేదా కామ్రేడు కాకపోవడం వల్ల ఆయనకు అంత గుర్తింపు రాలేదు.

    ఇంకా ఇలాంటివే ఎన్నెన్నో. ఇవి నమూనాలు మాత్రమె

    ReplyDelete
  45. Praveen:

    Why Jai Andhra, you & I are not direct witnesses for the Ambedkar statue incident that happened just a few days ago.

    The thin line between fact & fiction can be broken by one or more of the following methods:

    - Original sources are usually the best. For instance Prakasam's autobiography, not text books, is a good source for refuting the Andhra Kesari drama. (Caution: not every autobiographer can be relied especially when he praises himself).

    - Credibility of the source: no explanation needed

    - Consistency with other empirical evidence (especially if I can check it myself): Caste discrimination is almost certainly a fact because I can test it myself in a variety of situations

    - Why-why analysis: keep on questioning a statement

    - Horizontal audit: keep jumping to a related aspect

    - Triangulation/loop closure: same as horizontal but return to the original point at the end. Is it still the same?

    - Null hypothesis: test a hypothesis & try to prove it false (caution: this is a negative approach; never proves anything)

    - Occam's razor: if two theories can explain a phenomenon, the simpler one is likely to be true

    ReplyDelete
  46. అసలు విగ్రహాలు ఏ సంస్కృతి? విగ్రహాలు లేకుండా ఒక జాతి మనుగడ సాగించలేదా? విగ్రహ రహిత సమాజానికి తావు లేదా? లేకపోతే ఎందుకు లేదు? విగ్రహాలు మనని inspire చేసే విధంగా ఉంటే ఇంకో లక్ష విగ్రహాలు పెట్టుకోవచ్చు. అసలు విగ్రహాలే సమస్యలకి కారణమైతే. అన్నింటినీ కట్టగట్టి బంగాళఖాతంలోకి విసిరెయ్యనూ వచ్చు.

    Nice set of questions to think :)

    ReplyDelete
  47. ఈ లింక్ చదవండి: http://missiontelangana.com/prakasham-pantulu-facts
    ఇది చదివినంతమాత్రాన ప్రకాశం పంతులు గారి విగ్రహ ద్వంసాన్ని సమర్థించాలని రూల్ లేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలుగా కనిపించిన నాయకులు మనం అనుకున్నంత గొప్పవారు కాదు అని చెప్పడానికే ఈ లింక్ ఇచ్చాను.

    నేనేమీ అంబేద్కర్ అభిమానిని కాదు. అంబేద్కర్‌ని విమర్శిస్తూ రంగనాయకమ్మ గారు వ్రాసిన "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం చదివిన తరువాత నాకు అంబేద్కర్ మీద ఉన్న భ్రమలు తొలిగిపోయాయి. అయినా నేను అంబేద్కర్ విగ్రహాల ద్వంసాన్ని వ్యతిరేకించాను. అంబేద్కర్ లేకపోతే మన దేశంలో రిజర్వేషన్‌లు ఉండేవా, కాదా అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఐడెంటిటీని అగ్రకులాలవాళ్ళకి మాత్రమే పరిమితం చేసి దళితుల ఐడెంటిటీకి ఐకాన్‌గా ఉన్న అంబేద్కర్ విగ్రహాలని ద్వంసం చెయ్యడాన్ని నేను సమర్థించలేను.

    నేను గిరిజనుణ్ణి. అంబేద్కర్ సమర్థించిన।బలపరిచిన రిజర్వేషన్‌ల వల్ల దళితులు ఎంత ప్రయోజనం పొందారో, గిరిజనులు కూడా అంతే ప్రయోజనం పొందారు. కానీ నేను మార్క్సిస్ట్-లెనినిస్ట్‌ని. పైపై మెరుగుల్లాగ కనిపించే రిజర్వేషన్‌లు లాంటి స్కీమ్‌లని నేను నమ్మను. నేను అంబేద్కర్‌ని వ్యక్తిగతంగా నమ్మినా, నమ్మకపోయినా విగ్రహాల ద్వంసాన్ని మాత్రం సమర్థించలేను. అంబేద్కర్ విగ్రహాలు ద్వంసం చేసినవాళ్ళేమీ తెలంగాణావాదులలాగ ప్రజా పోరాటాలు చేస్తున్నవాళ్ళు కాదు. వాళ్ళు ఉన్న కుల వ్యవస్థని పరిరక్షించే పని చేస్తున్నవాళ్ళే కానీ సమాజంలో ఏదో మార్పు రావాలని కోరుకుంటున్నవాళ్ళు కాదు. అందుకే ట్యాంక్ బండ్ విగ్రహాల ద్వంసాన్ని సమర్థించిన నేను అంబేద్కర్ విగ్రహాల ద్వంసాన్ని వ్యతిరేకించాను.

    ReplyDelete
  48. తెలకపల్లి రవి గారి బ్లాగ్‌లో చదివిన వాక్యం ఇది "రాముణ్ని కూడా మానవీయంగా చిత్రించిన మొల్ల, చాప కూటితో సమతను నేర్పిన బ్రహ్మన్న, బ్రహ్మమొకటేనన్న అన్నమయ్య, విశ్వనరుడ నేనన్న జాషవా, మనుష్యుడే నా సందేశం అన్న శ్రీశ్రీ, వీళ్ల విగ్రహాలు విద్వేషానికి ధ్వంసం చేయడం ఏం సాదించడానికి?"

    రామాయణం గురించి ఇంతకు ముందే వ్రాసాను. ఇప్పుడు అన్నమయ్య విషయానికొద్దాం. అన్నమాచార్యుడు దేవుని దృష్టిలో అందరూ సమానులే అని అన్నాడు కానీ సమాజం దృష్టిలో అందరూ సమానులే అని అనలేదు. ధనవంతుడూ, పేదవాడూ ఒకే దేవుణ్ణి ఆరాధించినా సమాజంవాళ్ళని వేరువేరుగానే చూస్తుంది. మార్క్సిస్ట్‌నని చెప్పుకునే తెలకపల్లి రవి గారికి ఈ విషయం తెలియదా? మతం అనేది కేవలం ఒక విశ్వాసం. భక్తి విశ్వాసాలు వేరు, సామాజిక జీవితాలు వేరు. విశ్వాసాల వల్ల సామాజిక సమానత్వం రాదు అనే విషయం మార్క్సిస్ట్‌లందరికీ తెలుసు. అన్నమాచార్యుని విగ్రహం ద్వంసం జరిగినప్పుడు తెలకపల్లి రవి గారు ఈ విషయం మర్చిపోయారా?

    ReplyDelete
  49. రమణ గారు

    చదువరి గారు రాయడం తగ్గించిన దగ్గరనుంచి కెలుకుడు కామెంట్లు తగ్గి బాగ్లోకం చిన్నబొయింది. ఆ కొరత మీ బ్లాగ్ తీరుస్తున్నాది.

    ధన్యవాదాలు.

    కాముధ

    ReplyDelete
  50. ప్రవీణ్ శర్మగారితో వాదించే అవసరం గాని,ఉద్దేశం గాని ఓపిక గాని నాకు లేవని ముందే మనవి చేసుకుంటున్నాను.

    బ్లాగు స్వంతదారులకు ఒక మాట.

    ఒకే వ్యక్తి పరంపరగా డజన్ల కొద్దీ వ్యాఖ్యోపవ్యాఖ్యలు చేస్తూ పోతుంటే అసలు బ్లాగరు గారి పోష్టుకు సంబంధించిన విషయాన్ని వదలి శాఖాచంక్రమణాలు చేస్తూ పోతూ ఉంటే, చదువరులకు చాలా విసుగ్గా ఉంటుందని నా అభిప్రాయం. దీనివలన ఇతరులకు తమ నిర్మాణాత్మకమైన వ్యాఖ్కలను జోడించటం కష్టమౌతుంది. ఒకవేళ ఓపిగ్గా అలా వ్యాఖ్యలు వారు చేసినా, చదువరులకు ఇబ్బడిముబ్బడిగా ఒకవ్యక్తి యేకపక్షంగా నింపి పడవేస్తున్న అనవసరపు సరుకు మధ్య పడి ఉన్న తక్కిన ఆ వ్యాఖ్యలను పట్టుకోవటం కష్టమవుతుంది.

    మీరు దయచేసి మంచి మార్గం ఆలోచించుకోండి.

    ReplyDelete
  51. ఇక్కడ వీకెండు పొగ మంట ఏదో వస్తోందే !

    మా ప్రవీణుడు వున్నాడు. శంకర్ ఎస్ గారున్నారు. ఇంకా మా లక్కు పేట వారేలేదిమిటి చెప్మా !

    విషయం తెలియక డాక్టరు వారు కూడా కామెంటు మాడరేషన్ తీసేసామని ఖుషీ గా చెప్పారు.

    అప్పారావు ష్మాష్ త్రీ వారు, వీకెండు చలి కాచు కోవడానికి రావలె ! మా లక్కు పేట వారు ఎక్కడున్నా వారికి ఎస్ ఓ ఎస్ పంప వలె

    చీర్స్
    నారాదాయ నమః

    ReplyDelete
  52. జిలేబీ గారూ,

    ఆడుకోవాల్సినదంతా జనాలు గూగుల్ ప్లస్ లో ఆడుకుంటున్నారులెండి. Super entertainment there. ఇక్కడికొచ్చే అవసరం జనాలకి ప్రస్తుతనికి ఉన్నట్టు లేదు.


    Malakpet Rowdy

    ReplyDelete
  53. శ్యామలీయం గారు, రమణ గారు కోస్తా ఆంధ్రలో కాళోజీ విగ్రహాలు ఉన్నాయని వ్రాస్తే కోస్తా ఆంధ్రలో కాళోజీ విగ్రహం ఎక్కడుందా అని సందేహం వచ్చింది. అందుకే జై గారిలాగే నేనూ వ్యాఖ్యలు వ్రాసాను. కోస్తా ఆంధ్ర నుంచి వచ్చి బరంపురం (ఒరిస్సా)లో స్థిరపడిన కుటుంబానికి చెందిన వి.వి.గిరి విగ్రహం కోస్తా ఆంధ్రలో కనపడుతుందో, లేదో తెలియదు. మహారాష్ట్ర-కర్నాటక కుటుంబానికి చెందిన కాళోజీ విగ్రహం కోస్తా ఆంధ్రలో కనిపించడం సంగతి తరువాత.

    ReplyDelete
  54. యారమణ గారి జిగ్రీయార్ చలోక్తుల గురించి చాలా గంభీరంగా ఆలోచించాను. తీవరంగా (తీవ్రంగా) శోధించాను.

    వివిధ రంగాలలో ప్రఖ్యాతి కాంచిన అనేక మంది రంగాల గురించి చాలా సుతారంగా రాసాను. ఆయా రంగాల వీరంగాల గురించి వివరంగా కవిత్వమల్లాను. రంగరంగవైభోగంతో రంగుల ముగ్గులేసాను.

    అకటా నా హృదయ అంతరంగాలనుంచి కడలి తరంగాలలా జాలువారిన ఈ కవితామణిని పట్టించుకున్న నాథుడే లేడు. నా ఆశు కపిత్వాన్ని (పోయము ఫుల్లు అఫ్ టియరు టియరు) మెచ్చుకోలేదు సరి కదా కనీసం ఒక్కరూ గమనించలేదు.

    మనసు భారంగా ఉంది. కడు విచారంగా తోస్తుంది. కడుపులో వికారంగా అనిపిస్తోంది. హతవిధీ ఎందుకింత నిష్టూరంగా రాయాల్సి వస్తోంది.

    Ref: my "poem" of 3 February 2012 15:48 on this post.

    ReplyDelete
  55. చలోక్తులు నేను కూడా వ్రాసాను: https://plus.google.com/111113261980146074416/posts/1regavjdrMt

    ReplyDelete
  56. "విగ్రహరాధన" అనే సంస్కృతి దాదాపుగ అన్ని మతస్థులలో ఉంది. నైతిక, మానవత విలువలు కలిగి ఉండటం ఒక సామాజిక ధర్మం. సమాజ శ్రేయస్సు కోరి, ఉన్నతమయిన విలువలు, ఆశయలాతో ఉద్యమం చేబట్టి సాధించినవారు చిరస్మరణీయులు. ప్రతి పౌరుడు సమాజ శ్రేయస్సుకు ఎంతోకొంత తన వంతు "ఉన్నత" స్థితికి తీసుకెళ్ళడానికి స్పూర్థిగా "ఆ మహనీయుల విగ్రహాలు ఆవిష్కరింపబడ్డాయి. కాలక్రమేణ ఆ "విలువలు" కోల్పోయి, పాలకుల దగ్గర నుండి పాలింపబడే వారిదాకా (దాదాపుగ) కేవలం "అధికార, కుల, మత, ఆర్ధిక, బలాల ప్రదర్శ్న, అంతకన్న ఒకరి మీద ఒకరికి ద్వేషం" అనే ధ్యేయాలతో "విగ్రహ....." రూపాంతరం.
    ఈ రూపాంతరం 711వ సం. లో మనదేశం మీద మొట్టమొదటి దండయాత్ర(అలెగ్జాండర్ కాకుండ) మొహమ్మద్ బిన్ కాసీం తో మొదలయినది.

    ReplyDelete
  57. "విగ్రహరాధన" అనే సంస్కృతి దాదాపుగ అన్ని మతస్థులలో ఉంది. నైతిక, మానవత విలువలు కలిగి ఉండటం ఒక సామాజిక ధర్మం. సమాజ శ్రేయస్సు కోరి, ఉన్నతమయిన విలువలు, ఆశయలాతో ఉద్యమం చేబట్టి సాధించినవారు చిరస్మరణీయులు. ప్రతి పౌరుడు సమాజ శ్రేయస్సుకు ఎంతోకొంత తన వంతు "ఉన్నత" స్థితికి తీసుకెళ్ళడానికి స్పూర్థిగా "ఆ మహనీయుల విగ్రహాలు ఆవిష్కరింపబడ్డాయి. కాలక్రమేణ ఆ "విలువలు" కోల్పోయి, పాలకుల దగ్గర నుండి పాలింపబడే వారిదాకా (దాదాపుగ) కేవలం "అధికార, కుల, మత, ఆర్ధిక, బలాల ప్రదర్శ్న, అంతకన్న ఒకరి మీద ఒకరికి ద్వేషం" అనే ధ్యేయాలతో "విగ్రహ....." రూపాంతరం.
    ఈ రూపాంతరం 711వ సం. లో మనదేశం మీద మొట్టమొదటి దండయాత్ర(అలెగ్జాండర్ కాకుండ) మొహమ్మద్ బిన్ కాసీం తో మొదలయినది.

    ReplyDelete
  58. "విగ్రహరాధన" అనే సంస్కృతి దాదాపుగ అన్ని మతస్థులలో ఉంది. నైతిక, మానవత విలువలు కలిగి ఉండటం ఒక సామాజిక ధర్మం. సమాజ శ్రేయస్సు కోరి, ఉన్నతమయిన విలువలు, ఆశయలాతో ఉద్యమం చేబట్టి సాధించినవారు చిరస్మరణీయులు. ప్రతి పౌరుడు సమాజ శ్రేయస్సుకు ఎంతోకొంత తన వంతు "ఉన్నత" స్థితికి తీసుకెళ్ళడానికి స్పూర్థిగా "ఆ మహనీయుల విగ్రహాలు ఆవిష్కరింపబడ్డాయి. కాలక్రమేణ ఆ "విలువలు" కోల్పోయి, పాలకుల దగ్గర నుండి పాలింపబడే వారిదాకా (దాదాపుగ) కేవలం "అధికార, కుల, మత, ఆర్ధిక, బలాల ప్రదర్శ్న, అంతకన్న ఒకరి మీద ఒకరికి ద్వేషం" అనే ధ్యేయాలతో "విగ్రహ....." రూపాంతరం.
    ఈ రూపాంతరం 711వ సం. లో మనదేశం మీద మొట్టమొదటి దండయాత్ర(అలెగ్జాండర్ కాకుండ) మొహమ్మద్ బిన్ కాసీం తో మొదలయినది.

    ReplyDelete
  59. రమణ,
    ఇప్పటివరకు మీరు వ్రాసిన బ్లాగులన్నిట్లలోకి నాకు నచ్చిన అత్యంత అద్భుతంగ ఉన్నది.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.