Sunday 26 February 2012

డా.సు.

పొద్దున్నే మా డా.సు. ఫోన్! డా.సు. అంటే డాక్టర్ సుబ్బారావుకి పొట్టిపేరు. సుబ్బారావు నా క్లాస్మేట్, అతనికో బలహీనత వుంది. తన పేరుముందు డాక్టర్ అని రాస్తాడు, ఎవరైనా డాక్టర్ సుబ్బారావు అని రాయకపోయినా, పిలవకపోయినా కోపం వచ్చేస్తుంది. అంచేత సుబ్బారావు డా.సు.గా సుప్రసిద్ధుడు! ఇదీ మా డా.సు. కథాకమామీషు.

"డాక్టర్ రమణా! నీ రాతలు చూస్తున్నాను. నీకీ జన్మకి బుద్ధి రాదా?"

"రాదు, అందుకే గదా ఈ రాతలు!" నవ్వుతూ అన్నాను.

"అయాం సీరియస్. కష్టపడి డాక్టర్ కోర్స్ చదివావ్, కానీ పేరుకిముందు డాక్టర్ అన్రాసుకోడానికి మాత్రం నామోషీ!" అన్నాడు డా.సు. 

ఇవ్వాళ పొద్దున్నే ఎవడి మొహం చూశానో కదా!

"ఓ! అదా! చూడు మైడియర్ డా.సుబ్బారావ్! మన వృత్తి పేషంట్లకి వైద్యం చెయ్యడం. వాళ్ళకోసం డా. అని రాసుకుంటాం. రాతల్ని చదవడానికి పేషంట్లు అవసరం లేదు, పాఠకులు చాలు. పాఠకులకి మన పేరుముందు డా.వున్నా, బా. వున్నా అనవసరం." అన్నాను.

"మరైతే ప్రముఖ రచయితలు కొమ్మూరి  వేణుగోపాలరావు, యం.వి.రమణారెడ్డి, కేశవరెడ్డి, వి.చంద్రశేఖరరావులు వాళ్ళపేరు ముందు డా. తగిలించుకున్నారుగా?" ప్లీడర్లా పాయింటు లాగాడు డా.సు.

"డా.ని పేరు ముందు తగిలించుకోవటం అన్నది రచయితల వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి సంబంధించిన విషయం. సోమర్సెట్ మామ్, చెహోవ్‌లు మెడికల్ డాక్టర్లని చాలామందికి తెలీదు. నాకయితే డా. అనేది నాపేరులో భాగం కాదు. వైద్యవిషయాలు రాసేట్లయితే డా.అని రాసుకోవచ్చు గానీ జనరల్ రాతలకి డా. అనవసరం అని నా అభిప్రాయం." అన్నాను.

ఈ డా.సు.ని ఎలా వదిలించుకోవాలబ్బా!

"అక్కడే పప్పులో కాలేసావ్. డా.దాసరి, డా.మోహన్ బాబు.యం., డా.అక్కినేని.. మరి వీళ్ళ సంగతేంటి? కాబట్టి నీవాదన తప్పు. డా. అనేది పవిత్రమైనది. తక్షణం నీ పేరుకి డా. తగిలించు." హుంకరించాడు డా.సుబ్బారావు.

దేవుడా! ఈ డా.సు. నోరు పడిపొతే బాగుణ్ణు.

"డా.సుబ్బారావ్! పొద్దున్నే నువ్విలా విసిగించడం నీ డా.కి గౌరవం కాదు. నేనేదో ఇలా డా. లేకుండా సింపుల్‌గా బ్రతికేస్తున్నా, వదిలెయ్యవా? ప్లీజ్!" చిరాగ్గా అన్నాను. 

"హౌ శాడ్!!" అంటూ ఠపీమని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు.. అదే డా.సుబ్బారావ్!  

48 comments:

  1. ఈ పైత్యం బాగుంది. కాని మాలాంటి ఇంజినీర్లకి ఈ సౌలభ్యం లేకపోవడం వలన బతికి పోయాం

    కాముధ

    ReplyDelete
  2. :) బాగుంది. మరీ, ముందర డా. అని రాసుకోలేని మనుషులం అయినంత మాత్రాన వదిలేస్తామా ఏంటి? పేరు ముందు కాకపోతే వెనకాతల రాసుకుంటామండీ.. ఈ విషయం లో రాఘవేంద్ర రావు BA గారు మాకు గురువు. (అన్నట్టు మీ సుబ్బారావు గారికి ఏమైనా తెలుస్తుందేమో కాస్త కనుక్కుందురూ.. మాలాంటి వారి పేర్లకి గార్లు తగిలించాలంటే.. "రాఘవేంద్రరావు గారు BA" అనాలా? లేక "రాఘవేంద్రరావు BA గారు" అనాలా?)

    ReplyDelete
  3. "యరమణ" ముందు "డా" కూడా చేరిస్తే బాగుంటుందంటారా :D

    ReplyDelete
  4. డాయ్ రమణా అయిపోతుందేమో నండీ ఇండియన్ మినర్వా గారూ!!

    సో, 'సు'(బ్బు) రమణ గారనో,

    రమణయ్య గారనో,

    కాకుంటే 'బ్లా'(గు) రమణ గారనో, కాకుంటే...

    'పీ ఎల్' (దీన్ని సాగదీస్తే మరీ బాగోదు!) రమణ గారనో, కాకుంటే....

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. డాక్టర్లు తమ బోర్డులను పూర్తిగా తెలుగులోనో.. లేక పూర్తిగా ఇంగ్లీషులోనో రాసుంటే బావుంటుంది. లేకపోతే భలే చిత్రాలు జరుగుతాయి. నేను ఒక డాక్టరు గారి బోర్డు చూశాను. అతని పేరు ఓ.ప్రకాష్. దానికి ముందు.. డా.. తగిలించాడు. అది కాస్తా "డాO.ప్రకాష్" అయి కూర్చుంది. :-D

    ReplyDelete
  6. @kamudha,

    మీ ఇంజనీర్లు కూడా కొందరు Er. అని రాసుకుంటున్నారే!

    ReplyDelete
  7. @కృష్ణప్రియ,

    పోస్ట్ బానే ఉందంటారా?

    ఏదో గజిబిజిగా రాసేశాను. డా. అని రాసుకుంటున్నవాళ్ళ పట్ల ఎగతాళిగా రాశానా?

    ఈ మధ్య రాత్రిళ్ళు బుర్ర పని చెయ్యట్లేదు.

    పోన్లేండి. అదృష్టవశాత్తు.. ఈ డా. లందరికీ పెద్దన్న డా.సి.నా.రె. జోలికి పోలేదు. మెడికల్ డాక్టర్లకి పరిమితమై.. బతికిపొయ్యా.

    డా.సు. గాడు నాతో మాట్లాడటల్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ B.A. డౌటడిగితే నా బుర్ర రాంకీర్తన పాడించే ప్రమాదము కలదు. మన్నించగలరు.

    ReplyDelete
  8. @Indyan Minerva,

    మిమ్మల్ని మా డా. సు. పూనినట్లున్నాడే!

    ReplyDelete
  9. @zilebi,

    పి.ఎల్. ని సాగదీసి రాస్తే మంచిది (నాకర్ధం కాలేదు కాబట్టి).

    తమ క్వాలిఫికేషన్ని అన్ని చోట్లకి తీసికెళ్ళే డా.సు. ల గూర్చి మీ అభిప్రాయం రాయనే లేదు.

    ReplyDelete
  10. డారమణ గారూ బాగుండాది :)

    ReplyDelete
  11. రైటో రైట్ డా.యరమణ గారూ..ఇప్పుడేదో బాగున్నట్టుందండీ..మీరు కాస్త ఆలోచిస్తే పోలా?

    ReplyDelete
  12. @Srikanth M,

    ఈ బోర్డుల మీద బోల్డన్ని జోకులున్నయ్ కదూ!

    ఇంతకీ.. డా. అనేది పేరులో భాగమైపోతుందా?

    ReplyDelete
  13. @puranapandaphani,

    డారమణ కన్నా యరమణే బాగుందండి.

    ReplyDelete
  14. @రమణ గారు,

    మీరై అడిగారు కాబట్టి. నా మీద కోపం తెచ్చు కోకండీ. పీ ఎల్ అన్నది మీ బ్లాగు టైటిల్ నించి తెచ్చి, క ని ని గా మార్చి, పీ ఎల్ రమణ అని అనొచ్చు నేమో అని .....

    జిలేబీ పరార్ !

    ఇక డా ని అన్ని చోట్ల తీసుకు పోయే వారి గురించి - అడిగారు కాబట్టి, తోక లేని డాగ్ డాగ్ అనిపించు కోదు! కావున... తోక ముందో వెనుకో వుంటేనే వారికో శభాసు!!!

    చీరుసు
    జిలేబి.

    ReplyDelete
  15. ఫణిగారు చెప్పినది కాని సుభ చెప్పినదిగాని పేరు అతికినట్లుంటుంది అలో"చించండీ"

    ReplyDelete
  16. @సుభ,

    పేర్లకి ముందు ఈ డా. లు ఉండరాదని డా. సు. గాడితో బల్ల గుద్ది వాదిస్తే.. మీరేంటి మళ్ళీ నాకు డా. కలుపుతున్నారు!

    ఇంతకు ముందు కొందరు 'అన్నయ్య గారు' అని సంబోధించి మాడు పగలగొట్టారు!

    ReplyDelete
  17. వై. రమణ గారు,
    అంటే యడవల్లి రమణ గారు కాదు. వైద్యులు రమణ గారు. ఇదెలా ఉందండి?

    మీరన్నట్టు సౌత్‌లో తక్కువ కాని, నార్త్‌లో ఇంజనీర్లు తమ పేర్ల ముందు Er. అని వ్రాసుకొంటారు.

    ReplyDelete
  18. డా. యరమణ గారు , మీ ఫ్రెండ్ అంత మోజు పడుతుంటే డా. అని రాసుకోవచ్చు కదండి :)

    ReplyDelete
  19. మీ బ్లాగుకి గౌరవ డాక్టరేట్ ఇచ్చేస్తాం ! 'డా. పనిలేక' అని అని మీ బ్లాగు పేరును గౌరవిస్తే బావుంటుంది కాని, మీకెందుకండీ :)

    ReplyDelete
  20. @kastephale గారు,

    చించడానికి ఏమీ లేదులేండి.

    నాకు అర్ధం గాని ఈ డా. ల మోజు మీద బుల్లి టపా రాశాను. అంతే!

    ReplyDelete
  21. @jilaebi,

    'పని లేని రమణ!'

    హ.. హ.. హా..

    నాకీ పేరు తెగ నచ్చేసింది.

    ReplyDelete
  22. మాలా కుమార్ గారు,

    రాసుకోవచ్చుననుకోండి.

    కానీ.. అప్పుడు డా. సు. గాడు విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తాడేమో!

    ReplyDelete
  23. @bonagiri,

    >>'వైద్యులు రమణ గారు!'

    ఇట్లాంటి అర్ధం కాని మాటలతో నన్ను హింసించే కంటే..

    మీకు నా మీద కోపముంటే డైరక్టుగా తిట్టెయ్యొచ్చుగా!

    ReplyDelete
  24. @Mauli,

    మనుషులకే డా. లెందుకని నేను ఆయాస పడుతుంటే.. మీరు బ్లాగులకి కూడా డాక్టరేట్ ఇప్పిస్తానంటరేమిటి!

    ReplyDelete
  25. అమ్మయ్య! అందరితో మాట్లాడేశాను.

    ఇవ్వాళయినా నిద్ర పడుతుందని ఆశిస్తున్నాను.

    పట్టకపోతే.. 'డ్రాక్యులా. రక్తపిశాచి'లా మరొక టపా పడుతుందేమో!

    ReplyDelete
  26. 'డా' అంటే డాక్టర్ అనా? 'ఢా'కిణీ వారేమో అనుకున్నానే! :))

    ReplyDelete
  27. @SNKR,

    హ.. హా.
    ఇద్దరికీ పెద్ద తేడా లేదులేండి!

    ReplyDelete
  28. I agree with yor opinion and second it Dr.Yaramana! :)

    ReplyDelete
  29. @kamudha said...

    "కాని మాలాంటి ఇంజినీర్లకి ఈ సౌలభ్యం లేకపోవడం వలన బతికి పోయాం"

    కొంతమంది Er. తగిలించుకుంటారు, మీరు చూడలేదేమో. ఎప్పుడయినా పొరపాటున Engineers of india సెమినారు కెళ్తే ప్రతి వక్త పేరు ముందట తప్పనిసరిగా ఉంటుంది. విచిత్రమేమిటంటే చాలా మంది B.Tech.లు ఈ సంస్థ సభ్యత్వం తీసుకోరు కానీ దిప్లోమాలు, AMIEలు దండిగా కనిపిస్తారు (no disrespect intended to these courses)

    ReplyDelete
  30. కష్టపడి ఆరేడు ఏళ్ళు చదివితే వచ్చిన "డాక్టరు" సర్టిఫికెట్టుకి, ఏదో రాజకీయ పలుకబడితో (కొంతమంది) వచ్చిన "డాక్టరేట్ సర్టిఫికెట్టుకి తేడా ఉంది. రెండవది కొంచెం తేలికగ వచ్చినప్పుడు దాన్ని "గట్టిగా" పట్టుకోవాలి. లేకపోతే ఊరికినే పోతుంది.

    ReplyDelete
  31. డా|| తో పాటు మరి కొన్ని సంబోధనలు కూడా మనకి సామాన్యంగా వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి, "విశ్వ విఖ్యాత ....", "కళా ..." "పద్మ ..." వగైరా వగైరా.
    మీరు అటువంటివి కూడా మీ పేరుకి ముందు తగిలించాలని మీ డా|| సు గారి తరపున మరొక్కసారి "డిమాండ్" చేస్తున్నాను.
    మేము మీకు "బ్లాగు శిఖామణి", "పి డా బ్లాగరు" డా య వె రమణ అని తగిలిస్తే బాగుంటుందని అనిపించింది. మీ డా సు గారు దానిని approve చేసారు, కాబట్టి తగిలించేసాము.

    ReplyDelete
  32. Sri గారితో ఏకీభవిస్తున్నాను.. శ్రీ. డా. బ్లా.శి. మే. అ.గా. యా.వి. రమణ గారు..

    (శ్రీ డాక్టర్ బ్లాగు శిరోమణి మేధావి అన్నయ్యగారు యడవల్లి వెంకట రమణ గారు)

    PS. నా కామెంట్ కి సమాధానం ఇస్తూ వెటకారం గా రాశానంటారా? అని అడిగారు. అదేమీ లేదు. చాలా సరదా గా ఉంది. మా ఆఫీసు లో తుమ్మితే ఊడిపోయే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఒకబ్బాయి పెళ్లి పత్రిక లో తన పెళ్లి పత్రిక లో

    ఫలానా ...
    (బీ టెక్ ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఫలానా ఫలానా .. యూనివర్సిటీ, సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీయర్, డిప్లమో ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫలానా ఇన్స్టిట్యూట్, ఫలానా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ )... ఇలాగ వేయించుకున్నాడు :)

    ReplyDelete
  33. హహహహ...బావుంది డా. ల గోల. అది కాదుగానీ మెడికల్ డాక్టర్లైనా, గౌరవ డాక్టరేట్లయినా కూడా డా. తగిలించుకోవాల్సిందేనంటారా మీ డా.సు గారు?
    ఆ తేడా వారికి తెలుసును కదా? :)

    నాకు చిన్నప్పుడు phd డాక్టరేట్లు, గౌరవ డాక్టరేట్లు ఉంటారని తెలీదు. డా. ఉన్న ప్రతీవాళ్ళూ మెడికల్ డాక్టర్లే అనుకునేదాన్ని. సినిమాల్లోను, బయట ఈ డా. లు చూసి అబ్బా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ డాక్టర్లే ఉన్నారు కాబోలు, మనం మాత్రం మెడిసిన్ చదవకూడదు అనుకునేదాన్ని :)

    ReplyDelete
  34. @కృష్ణ ప్రియ గారు,

    పోదురు మీ చెణుకు ఆన్ సా వే ఇ !

    సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి 'డీటైల్డ్' స్పెసిఫికేషన్ లేకుంటే చెయ్యాడదు!

    సో,ఆ డీ ఎస్ ఇక్కడా ఉండాలన్న రూలు పెట్టుకున్నట్టున్నాడు ! తన క్వాలిఫికేషన్ విషయం లో కూడా...


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  35. భిషగ్వర యడవల్లి వెంకటరమణ అంటే కాస్త గంభీరంగా ఉంటుందేమో చూడండి! కాని మీరు "వైద్యులు రమణ గారు" అంటేనే అర్ధం కాని మాటలతోహింసించవద్దన్నారుగా!

    అయినా జగమెరిగిన బ్రాహ్మణునకు జంధ్యంబేలా అని మీ పేరు ముందు బిరుదులు తగిలించాలా యేమిటి!

    ReplyDelete
  36. మితృలారా,

    నా పేరు ముందు మీరు తగిలిస్తున్న (ముఖ్యంగా కృష్ణప్రియ గారు) విశేషణాలని చూసి ఆనందభాష్పాలు ధారగా కారిపోతున్నాయి.

    (కళ్ళు తుడుచుకుని)

    నన్ను ఇలా బోడిగా 'yaramana' గానే ఉండనివ్వండి. థాంక్యూ!

    ReplyDelete
  37. >>>>(శ్రీ డాక్టర్ బ్లాగు శిరోమణి మేధావి *అన్నయ్యగారు* యడవల్లి వెంకట రమణ గారు)

    >>>>విశేషణాలని చూసి ఆనందభాష్పాలు ధారగా కారిపోతున్నాయి.

    సింపుల్ గా 'డాక్టర్ అన్నయ్య' . :-)

    ReplyDelete
  38. డాక్టరు గారూ..
    మీ వైద్యం ఆదరగొట్టేసారండీ, సారీ మిమ్మల్లి డా. అని సంభోదించోద్దు అన్నట్టున్నారు....
    మీ టపా, దానికి అనుసంధానంగా ఉన్న కామెంట్లు అన్ని చదివేసి మిమ్మల్లి అలవాటులో పొరపాటుగా డా.గారు అని పిలిచేసా..
    పోన్లెండి.. డా.సు. గారు చూస్తే సంతోషిస్తారు...
    కాని మీరు చెప్పిన విషయము ఒకటి మాత్రము నిజం...
    అదేమిటంటే.. మన కూడా ఉన్నవి ఏవి శాశ్వతం కావు.... మనం సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలు మాత్రమే మనతో ఎల్లవేళలా ఉంటాయి..
    తగిలించుకుంటే ఉండవు అవి.... మీ ద్వారా వైద్యం పొందిన వారు మిమ్మల్లి డాక్టర్ గానే గుర్తుంచుకొంటారు.
    అలాగే మీ టపాల ద్వారా ఉల్లాసం పొందిన వారు మిమ్మల్లి యామన గారి గానే గుర్తుంచుకొంటారు....
    మీరు మాత్రము మాకు యామన రమణ గారే....

    ReplyDelete
  39. నా అంచనా ప్రకారం.. మీకు డా.సు. అనే ప్రెండు ఎవరూ లేరనుకుంటున్నాను..
    బహుశా టపా కోసము డా.సు. గారిని క్రియేట్ చేసారేమో అనుకుంటున్నాను....

    ReplyDelete
  40. రాజీవ్ రాఘవ్ గారు,

    కేవలం సరదా కోసం రాసిన టపా.

    నేను రాసే టపాలకి మూలం మా స్నేహితుల మధ్య జరిగే సంభాషణలే!

    కొన్ని దేశాల యూనివర్సిటీలకి డాక్టరేట్లు అమ్ముకోవడం ఒక ఆదాయ మార్గం. సంతలో వస్తువు కొన్నంత హాయిగా కొనుక్కోవచ్చు! నా పోస్టులో వారి గూర్చి రాయలేదు. చూద్దాం. ఇకముందు ఎవరైనా ఈ దొంగ డాక్టరేట్ల గొర్చి రాస్తారేమో.

    ReplyDelete
  41. మొన్న
    "నాకు అన్నయ్య గారు అన్న పిలుపు ఇష్టం లేదు."
    అన్నయ్యా, అన్నియ్యా, అన్నయ్య గారూ,

    నిన్న
    "నేను మేధావి నేనా?"

    అన్నయ్య మేధావి, మేధావి అన్నయ్యా, శాలువా మేధావి అన్నయ్యా..

    ఇప్పుడు:
    "పేరుకు ముందు 'డా' అవసరమా?"

    డాక్టరు రమణ అన్నయ్య గారు, భిషగ్వర, వైద్యులు, మేధావి డాక్టరు అన్నయ్య...ఇంకా కొన్ని ముళ్ళ కిరీటపు పిలుపులు.

    తర్వాతి పోస్ట్ పెట్టబోయే ముందు ఆలోచించి పెట్టండి.

    ReplyDelete
  42. @Chandu S,

    కరక్టుగా నేనూ ఇదే అనుకుంటున్నాను.

    ఇకనించి మీరు ఒక కొత్త 'yaramana' ని చూస్తారు!

    సలహాకి ధన్యవాదాలు.

    ReplyDelete
  43. కోపమొచ్చిందేమో నా సలహాకు. సరే వచ్చిన కోపం ఎటూ వచ్చింది.
    పని లో పని ,ఇంకో కామెంటు!

    "ఇకనించి మీరు ఒక కొత్త 'yaramana' ని చూస్తారు!"

    డా: కొత్త యరమణ, సరికొత్త యరమణన్నయ్య, కొంగొత్త యరమణ డాక్టరన్నయ్య., మేధావి మరికొత్త..

    ReplyDelete
  44. @Chandu S,

    అయ్యో! నాకెందుకండి కోపం!

    నాకు రాజశేఖరరెడ్డిలాగా కోపం నరం తెగిపోయింది.

    మీ చక్కని కామెంట్ల వల్ల నెత్తి మీద ఐస్ గడ్డ పెట్టినంత చల్లగా ఉంది. థాంక్యూ!

    ReplyDelete
  45. మీ పేరు యడవల్లి వెంకట రమణా?? నేనిన్నాళ్ళూ 'వైద్యులు' అడుసుమిల్లి రమణ అనుకున్నా
    హిహిహిహిహి

    సీతారామం

    ReplyDelete
  46. వైద్య డాక్టర్ దగ్గరకు పేషెంట్ గా గౌరవ డాక్టరేట్ పొందిన వారు వచ్చారనుకోండి యేమని పలకరించుకుంటారు ... చెప్పండి డాక్టర్ చెప్పండి ...

    ReplyDelete
  47. buddha murali గారు,

    డాక్టర్ని డాక్టర్ అని పిలవకపోయినా ఫీజ్ ఠంచనుగా ఇచ్చేస్తే చాలు. ఆనందం.

    మేం రాసే అనవసరపు టెస్టులు చేయించుకుని.. మా మందుల షాపులోనే బండెడు మందులు కొనుక్కెళితే మహదానందం.

    అప్పుడు గౌరవ డాక్టరేట్లనేం ఖర్మ.. ఎవర్నయినా డాక్టర్ అని పిలవడానికి మేం రెడీ!

    అయినా (వెధవ) పిలుపులో ఏముంది మురళిగారు? అంతా తైలంలోనే ఉంది!

    ReplyDelete
  48. భలే సరదాగానూ ఉంది, ఆలోచించేట్టూ ఉంది...
    పాళం బాగా కుదిరింది (నా టేస్టు ప్రకారం సుమా...మీ వంటను తూచే తాహతు లేదు)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.