Friday 28 December 2012

ఆనందభవన్ లో ఆ రోజు!


అది గుంటూరు పురము. ఆ పురంబునకు బ్రాడీపేట తలమానికము. అందుకలదొక భోజనగృహము. అచట భుజించుట ఆనందదాయకము. ఆ కారణముననే కాబోలు ఆ భోజనగృహ నామధేయము ఆనందభవనముగా భాసిల్లుచుండెను. నిస్సందేహముగా ఇది సార్ధక నామధేయము.

(ఏమిటయ్యా ఈ పిశాచాల భాష? ఆ రాసేదేదో మనుషులు మాట్లాడే భాషలో ఏడిచ్చావు!)

క్షమించాలి. అలా కోప్పడకండి. తెలుగు మహాసభలు జరుగుతున్నాయ్ గదా! కొద్దిగా పాండిత్యం ప్రదర్శిద్దామని ఉబలాటపడ్డాను. మీకిష్టం లేకపోతే రాయన్లేండి. తెలుగు భాషలోనే రాస్తాను.

ఇక చదవండి..


సమయం మధ్యాహ్నం మూడు గంటలు. వేదిక గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆనందభవన్. మాసిన నేల. అరిగిపోయిన బల్లలు. సొట్టల గ్లాసులు. నిశ్శబ్దాన్ని చేదించుకుంటూ రెండో ప్రపంచ యుద్ధ కాలపు నాటి ఫ్యాన్లు 'గరగర' మంటూ భారంగా తిరుగుతున్నాయి.

ఎదురుగా ఒక అద్దాల బీరువా. దాని వయసు సుమారు తొంభయ్యేళ్ళు. బీరువా పక్కగా పెద్ద రిఫ్రెజిరేటర్. అది ఫ్రిజ్ కనిబెట్టబడిన రోజుల్లో బ్రిటిషు వాడు స్టీమర్లో పంపించినదై ఉండవచ్చు. హాలుకి ఒక మూలగా పగిలిపోయిన వాష్ బేసిన్. పక్కనే స్టీలు బకెట్ లో నీళ్ళు.. స్టీలు గ్లాసు. గత ముప్పైయ్యేళ్ళుగా ఆ వాష్ బేసిన్లోకి నీళ్ళు రావు. రావడానికి అసలు నీళ్ళ గొట్టం ఉంటేగదా! బకెట్లోంచి గ్లాసుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కోవాలి.


హోటల్ ప్రవేశద్వారం ఎడమ వైపు క్యాష్ కౌంటర్. పక్కనున్న గోడ మీద అనేక దేవతల పటాలు.. వాటికి పసుపు కుంకుమల తాలూకా మరకలు. క్యాష్ కౌంటర్ కుర్చీలో ఒక ఎర్రటి, బక్కపలచని వ్యక్తి కూర్చుని డబ్బులు లెక్కపెడుతూ.. పదులు, యాభైలు, వందలు నోట్లు కట్టలుగా కడుతున్నాడు. తెల్ల ప్యాంటు, చొక్కా. ఎత్తు అయిదడుగుల మూడంగుళాలు. ఆయనే ఆ హోటల్ యజమాని.

పేరు పురుషోత్తం. పేరుకు తగ్గట్టుగానే చాలా మంచివాడు. ఎప్పుడు నవ్వు మొహంతోనే ఉంటాడు. క్యాష్ కౌంటర్, వంటగదికి మధ్య బొంగరంలా తిరుగుతుంటాడు. అవసరమైతే క్షణంలో వంటవాడిగా మారిపోతాడు. ఒక్కోసారి కష్టమర్లు బిల్లు కట్టటానికి క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి పురుషోత్తం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది.

ఎప్పటివలె ఆ రోజు కూడా ఆనందభవనం ప్రశాంత నిలయంగా.. బద్దకంగా, మత్తుగా జోగుతుంది. కష్టమర్లు తలోమూల కూర్చుని కాఫీలు, టిఫినీలు నిదానంగా ఆరగిస్తున్నారు. సప్లైర్లు గొడకి ఆనుకుని నించొని కునికిపాట్లు పడుతున్నారు.

ఇంతలో బయట నుండి  రణగొణధ్వనులు. ఏవో స్లోగన్లు. పురుషోత్తం కంగారు పడ్డాడు. గబగబ డబ్బులు సొరుగులో పెట్టేసి తాళం వేసుకుని.. ఎందుకయినా మంచిదని సొరుగుని రెండు మూడుసార్లు ఘాట్టిగా లాగి చెక్ చేసుకున్నాడు.

చూస్తుండగానే బిలబిల మంటూ ఆడవాళ్ళు.. సుమారు పది మంది.. లోపలకి దూసుకొచ్చారు. పురుషోత్తంని చుట్టుముట్టారు. కంగారు పడిపోయిన పురుషోత్తం.. ఆ గుంపులో ఒకళ్ళిద్దర్ని గుర్తు పట్టి.. 'అమ్మయ్య!' అనుకున్నాడు.

"నమస్తే అమ్మా! వణక్కం. ఎండన పడి వచ్చారు. కాఫీ తాగండి తల్లీ!" అంటూ మర్యాద చేశాడు.

నిజంగానే పాపం వాళ్ళ మొహాలు ఎండకి వాడిపొయి, కాలిన మినపట్టుల్లా ఉన్నాయి. అయితే.. ఆ వచ్చినవారు కోపంగా ఉన్నారు. ఆవేశంగానూ ఉన్నారు. వేడిగా కూడా ఉన్నారు.

పురుషోత్తం వంటశాలలోకి వినబడేలా గట్టిగా అరిచి చెప్పాడు.

"రంగరాజన్! మేడం గార్లకి పది కాఫీ!"

ఆ గుంపులో అందరిలోకి ముందు నించునున్న ఒక యువతి కోపంగా పురుషోత్తాన్ని తినేశాలా చూస్తూ..

"మేమేమీ నీ బోడి కాఫీ తాగిపోటానికి రాలేదు. అర్జంటుగా  ఈ హోటల్ మూసెయ్యమని చెప్పడానికొచ్చాం." అన్నది. ఆవిడ పొట్టిగా, బొద్దుగా ఉంది. పేరు రమాప్రభ.

పురుషోత్తం గతుక్కుమన్నాడు.

"అమ్మా! నా హోటల్ ఎందుకు.. "


అందర్లోకి వెనగ్గా నించొని.. చేతులు వెనక్కి కట్టుకుని ఆ హోటల్ని నిశితంగా పరిశీలిస్తుంది ఒక లావుపాటి వ్యక్తి. గోల్డ్ ఫ్రేం చత్వారపు కళ్ళజోడు. ఆమె ఆ టీమ్ కి లీడర్. పేరు సూర్యాకాంతం.

"ఏవిటయ్యా నీకు కారణాలు చెబితేగానీ ముయ్యవా? నా సంగతి నీకింకా తెలీదు." విసురుగా ఎడమ చేయి చూపుడు వేలుతో బెదిరించింది.

ఇంతలో గీతాంజలి ఉత్సాహంగా స్లొగన్లందుకుంది.

"విప్లవం.. వర్ధిల్లాలి. ఆనంద భవన్ డౌన్! డౌన్!!"

మిగిలినవారు గొంతు కలిపారు.

పురుషోత్తం భయపడిపోయ్యాడు. రెండు చేతులూ జోడించాడు.

"అమ్మా! మీ అందరికీ నా హోటల్ వల్ల ఇబ్బందైతే మూసేసుకుంటాను. కానీ విషయం ఏంటో నాకు అర్ధమయ్యేట్లు చెప్పండమ్మా!" అంటూ ప్రాధేయపడ్డాడు.

ఆ ఆడవారు పురుషోత్తం వినయానికి మిక్కిలి సంతోషించారు. మగాళ్ళంతా ఇంత వినయవిధేయలతో ఉంటే ఈ లోకం శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియదా? అడవిలో లేడిపిల్లని చూసి పులి జాలి పడ్డట్లు.. నక్సలైట్ నాయకుణ్ణి ఎన్ కౌంటర్ చేసే ముందు పోలీసు జాలి పడ్డట్లు.. వారంతా పురుషోత్తాన్ని చూసి జాలి పడ్డారు. ఒకళ్ళిద్దరికి పురుషోత్తాన్ని ఓదార్చాలనిపించింది గానీ.. సూర్యాకాంతానికి ఝడిసి ఊరుకున్నారు.

ఆ విప్లవనారీ లోకానికి స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న చాయాదేవి అసలు విషయం చెప్పనారంభించింది.

"ఇదిగో అబ్బాయ్! ఇన్నాళ్ళూ మా బ్రాడీపేటలో ఆడవాళ్ళం గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. భార్యలుగా మాక్కొన్ని హక్కులుంటాయి.. నీకు తెలుసుగా?"

"అమ్మా! నాకు తెలీదు. మీరే చెప్పండి. వింటాను." పురుషోత్తం మళ్ళీ నమస్కరించాడు.

"అయ్యో నా మతి మండా! నిన్నడిగితే నువ్వేం చెబుతావు! ఎంత చెడ్డా నువ్వూ మగవెధవ్వేగా! సరే విను. నీ ఓటల్లో భోజనం అమృతంలా ఉంటుందిట. నీ కందపచ్చడి, బీట్రూట్ కూర, సాంబార్ని మా ఆయన రవణారెడ్డి కల్లో కూడా కలవరిస్తూ లొట్టలేస్తున్నాడు." అంటూ చాయాదేవి మూతి వంకర్లు తిప్పింది.

ఛాయాదేవి మాటకి పురుషోత్తం ఛాతీ గర్వంతో రెండంగుళాలు పొంగింది. సంతోషంతో సిగ్గు మొగ్గయి పొయ్యాడు. ఆనందంతో మెలికలు తిరిగిపొయ్యాడు.

ఇంతలో వెనకనుండి గిరిజ అందుకుంది.

"మా ఆయన రేలంగి మాత్రం తక్కువ తిన్నాడా? ఆఫీసు నుండి డైరక్టుగా నీ హోటలుకే వచ్చి సుష్టుగా భోంచేస్తున్నాడు. బొజ్జ ఇంకాస్త పెంచేశాడు. నేనేం చేశాను? సీతాదేవంతటి ఇల్లాల్ని. ఇంట్లో పన్లు చెయ్యమన్నాను. అంతేగా! భర్తన్నవాడు అంట్లు తోమడా? ఇల్లు చిమ్మడా? బట్టలుతకడా? ఏం! ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి?" ముక్కులెగరేసింది.

ఇంతలో రమాప్రభ మళ్ళీ అందుకుంది.

"మొగుడన్న తరవాత ఆ మాత్రం తిట్టుకోడానికి, తన్నుకోడానికి లేదా? నేనేమన్నా మా అక్క గీతాంజలిలా భర్తని బెల్టుతో తంతున్నానా? అసలు భర్తంటే అర్ధమేంటి? భార్య నుండి తిట్లు, తన్నులు భరించేవాడని! మేమేం చేసినా మా భర్తల్ని మంచి మార్గాన పెట్టుకోడానికేగా. అయినా నా మొగుడు రాజబాబుకి ఆ బుద్ధే ఉంటే నాకీ తిప్పలెందుకు?" అంటూ ముక్కు చీదుకుంటూ రమాప్రభ ఎమోషనల్ అయిపోయింది.

"ఒసే రమాప్రభా! మధ్యలో మా ఆయన పద్మనాభం సంగతి తీసుకురావద్దు. బెల్టుతో బాదుకుంటానో, బెత్తంతో కొట్టుకుంటానో నా ఇష్టం. నీకెందుకే?" సాగదీసింది గీతాంజలి.

గిరిజ విసుక్కుంటూ అన్నది.

"అబ్బా! ఆపండే మీ పాడు గోల. చూడు బాబు! ఈ ఆంధ్రదేశంలో 'భార్య' అన్న పదం వింటేనే భర్తలు గజగజా వణికిపోతారు.. ఒక్క ఈ గుంటూర్లో తప్ప! అందుకు కారణం నువ్వే! ఈ హోటల్ టిఫిన్లు, భోజనాలు చూసుకుని మా మొగుళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ తిండి సుఖమే లేకపోతే మా భర్తలు కుక్కల్లా మేం చెప్పినట్లు వింటారు."

పురుషోత్తం చేతులు జోడించి నమస్కారం పోజులోనే.. విగ్రహంలా నిలబడి వింటున్నాడు.

ఇప్పుడు చాయాదేవి అందుకుంది.

"ఏవయ్యా పెద్దమనిషి! ఇళ్ళల్లో పన్లెగ్గొట్టి మా మొగుళ్ళు నీ పంచన చేరితే.. వాళ్ళకి బుద్ధి చెప్పి, గడ్డి పెట్టాల్సిందిపోయి పీకల్దాకా భోజనం పెడతావా? నువ్వసలు మనిషివేనా? నీకు డబ్బులే ముఖ్యమా? నీకు అక్కాచెల్లెళ్ళు లేరు?" అంటూ పురుషోత్తం మీదమీదకి వెళ్ళింది.

"చాయాదేవత్తా! మా ఆయన రాజబాబు ఈ ఊరొచ్చి చెడిపొయ్యాడు. ఇంతకు ముందు నా తిట్లు, తన్నులు తట్టుకోలేపోతే..  కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలేవాడు. ఇప్పుడు సుబ్బరంగా ఈ హోటల్ కొచ్చి ముప్పూటలా మెక్కుతున్నాడు. బంగారం లాంటి మా ఆయన పద్మనాభం బావతో సావాసం చేసి చెడిపొయ్యాడు." రమాప్రభ మళ్ళీ గీతాంజలి వైపు కొరకొరగా చూసింది.

గీతాంజలి సర్రున కోపమొచ్చింది.

"అబ్బో! చెప్పొచ్చావు! మీ ఆయనో పెద్ద అమాయక చక్రవర్తమ్మా! నువ్వామధ్య పుట్టింటికెళ్తే నెలవారి సీజన్ టిక్కెట్లు కొనుక్కుని మరీ తిన్నాడు. మళ్ళీ చూడ్డానికి మాత్రం ఒంటూపిరివాళ్ళా ఉంటాడు. సూది బెజ్జం బానకడుపు. ఎవరి భాగోతం ఎవరికి తెలీదు." అంటూ రుసరుసలాడింది.

ఇంతలో సూర్యాకాంతం గట్టిగా అరిచింది.

"ఒసే! ఆపండే మీ మొహాలు మండా! వీడి ఓటేలు మూయించడానికొచ్చి మీ పరువులు బజార్న పడేసుకుంటారే? ఇదిగో అబ్బాయ్! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు మా ఆయన ఎస్వీరంగారావు ఎంత పెద్ద ప్లీడరో తెలుసుగా? బల్ల గుద్ది వాదించాడంటే ఈ గుంటూరేం ఖర్మ.. ఢిల్లీ కూడా గడగడలాడిపోవాల్సిందే. నువ్వర్జంటుగా నీ దుకాణం మూసెయ్. ఇది మర్యాదస్తులు కాపురాలు చేసుకునే ఏరియా. ఇట్లా హోటళ్ళు పెట్టి కాపురాలు కూల్చావంటే ఏవనుకున్నావో? నీమీద మా ఆయనతో న్యూసెన్స్ కేసు కట్టించి.. ఉరిశిక్ష వేయిస్తా! జాగ్రత్త." హూంకరించింది సూర్యాకాంతం.

పురుషోత్తం భయంతో వణికిపోసాగాడు. చెమటలు పట్టేశాయి.

"అ.. అ.. అమ్మగారూ! మీరు ఉప్పూకారాలు ఎక్కువేస్తున్నారంట. గంట క్రితమే మీ ప్లీడరు గుమాస్తా వంగర వెంకటసుబ్బయ్య  రెండు ఫుల్ క్యారేజీలు కట్టించుకుని తీసుకెళ్ళాడు. సాంబార్ ఎగస్ట్రా!"

సూర్యాకాంతం బిత్తరపోయింది. తదుపరి ఆవేశంతో ఊగిపోయింది.

"అదా సంగతి. 'కాంతం! ఇవ్వాళ ఒంట్లో నలతగా ఉందే. లంఖణం పరమౌషధం అన్నారు. నాకు వంట చెయ్యకు.' అంటే పస్తున్నాడేమోననుకున్నాను. ఈ మధ్య కోర్టులోనే కాకుండా ఇంట్లో కూడా అబద్దాలు చెబుతున్నాడన్న మాట! చెప్తా! చెప్తా! ఎక్కడికి పోతాడు. సాయంకాలం కోర్టు నుండి వస్తాడుగా! ముందా వంగరకి బెండు వంకర తీస్తే ఈ పెద్దమనిషి దారికోస్తాడు." పళ్ళు పటపటలాడించింది సూర్యాకాంతం.

చాయాదేవి అందుకుంది.

"ఇదిగో అబ్బాయ్! నీ వాలకం చూస్తుంటే మా గుమ్మడి బావగారిలా మంచాళ్ళాగే ఉన్నావు. ఉన్నపళంగా వెళ్ళిపొమ్మంటే నువ్వు మాత్రం ఎక్కడికి పోతావులే! అంచేత నువ్వు హోటల్ ఎత్తెయ్యడానికి నెల్రోజులు గడువిస్తున్నా. ఈ లోపు నీ ఏర్పాట్లు చూసుకో. లేకపోతే నా సంగతి నీకు తెలీదు. మా అల్లుడు రాజనాలతో చెప్పి నీ హోటల్ నేలమట్టం చేయిస్తాను. పదండే పోదాం!" అంటూ వెనుతిరిగింది.

"చాయాదేవత్తా! వెళ్ళేప్పుడు చీతిరాల వాళ్ళ కొట్లో ఓ పది అప్పడాల కర్రలు కొనుక్కెళ్ళాలి. అట్నుండి వెళ్దాం." అంది గీతాంజలి.

"అయినా నీకిదేం పోయ్యేకాలమే గీతాంజలి? మేం మాత్రం కాపురం చెయ్యట్లేదు? ఎంత మొగుడయితే మాత్రం అన్నేసి అప్పడాల కర్రలు విరిగేలా కోడతావుటే? తగలరాని చోట తగిలి హరీ మంటే రేపు నీకు కొట్టుకోడానికి ఎవరు దొరుకుతారు? అయినా ఈ కరువు రోజుల్లో అన్ని కర్రలు ఎక్కడ కొనగలం? అట్లకాడతో వీపు మీద వాతలు పెట్టు. ఖర్చు లేని పని. సరిపోతుంది." అంది చాయాదేవి.

"ఉసే ఉసే! ఈ ప్లాన్లన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలే. మొగుళ్ళని ఎంత తన్నుకున్నా.. వాళ్ళ పరువు ఇలా రోడ్డున పడెయ్య కూడదు. ఇదిగో అబ్బాయ్! నీకు మా ఛాయాదేవి ఇచ్చిన గడువు గుర్తుందిగా?" అంటూ గర్జిస్తూ బయటకి నడిచింది సూర్యాకాంతం.

వర్షం వెలిసినట్లైంది. పురుషోత్తానికి ఇంకా వణుకు తగ్గలేదు. తన హోటల్లో ఆహార పదార్ధాలు రుచిగా, శుచిగా ఉండాలనుకున్నాడు గానీ.. బ్రాడీపేట కుటుంబాల్లో ఇన్ని కలతలు రేపుతాయనుకోలేదు. వంటగదిలోకెళ్ళి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్ గా కలుపుకుని.. తాగుతూ.. ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలా? అని ఆలోచనలో పడ్డాడు.

చివరి తోక..

గుంటూరు, ఆనంద భవన్, పురుషోత్తం.. నిజం. మిగిలిందంతా కల్పితం!

అమ్మకి నాన్నతో తగాదా వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేది. నేను నాన్నతో కలిసి అన్ని రోజులూ ఆనంద భవన్ లో హాయిగా భోంచేసేవాడిని. అమ్మ తిరిగొచ్చినప్పుడు నాకు చికాగ్గా ఉండేది.. ఆనంద భవన్ మిస్ అవుతున్నందుకు. మళ్ళీ అమ్మానాన్నల తగాదా కోసం ఆశగా ఎదురు చూస్తుండేవాణ్ణి.

ఈ రోజుకీ ఎందరో భర్తలకి ఆపద సమయంలో (భార్య కన్నా) మంచి భోజనం అందిస్తున్న మా గుంటూరు ఆనందభవన్ కి వందనం.. అభినందనం!

కృతజ్ఞతలు..

ఆనంద భవన్ ఫోటోలు : నా ఆత్మీయ మిత్రుడు D.S.R.మూర్తి, బ్రాడీపేట, గుంటూరు.

33 comments:

  1. డాక్టర్ గారు పాత కాలం నాటి హోటల్స్ కు ఆనంద్ భవన్ అనే పేరు ఎందుకుంటుంది ... సికింద్రాబాద్ కింగ్స్ వె లోను ఆనంద్ భవన్ ఉంది .. చిత్రమైన కారణం తో హోటల్ మూత పడింది .. పాత హోటల్ .. చాల విశాలంగా ఉంటుంది .. హైదరాబాద్ లో దాదాపు 20 ఏళ్ళ నుంచి నిలబడి ... ఒకడిని ఒకడు తోసుకుంటూ తినడం ఆచారంగా మారింది .. అప్పటి నుంచి ప్రశాంతంగా కూర్చొని తినే విశాల మైన స్థలం ఉన్న హోటల్స్ కు కాలం చెల్లింది .. సికింద్రాబాద్ ఆనంద్ భవన్ లో చిన్నప్పుడు ఇడ్లీలు తిన్నాను ఎంత రుచిగా ఉండేవో

    ReplyDelete
    Replies
    1. buddha murali గారు,

      మన పుట్టుక ఒక ఏక్సిడెంట్. చిన్ననాటి స్నేహితులు, ప్రదేశాలు, సినిమాలు తీపి జ్ఞాపకాలు. అందుకే మనందరం మన ఊరన్నా, స్నేహితులన్నా చాలా ఇష్టంగా ఉంటాం.

      నేను గుంటూర్లో, బ్రాడీపేటలో పుట్టి, పెరిగాను. కాబట్టి 'ఆనంద్ భవన్' అంటూ రాశాను. నాకు గుంటూరు తప్ప.. ఇంకో ఊళ్ళో హోటళ్ళ గూర్చి తెలీదు. మా ఆనంద్ భవన్ కన్నా వెయ్యిరెట్లు మంచి హోటళ్ళు ఉండొచ్చు. అయినా నేను పట్టించుకోను. (మన అమ్మ వంట రుచిగా ఉంటుందని చెప్పడానికి comparative study అవసరం లేదు.)

      మనందరికీ దాదాపుగా ఒకే రకమైన అనుభూతులు, అనుభవాలు ఉంటాయి.. పేర్లు మార్పుతో.

      ఈ పోస్ట్ నా చిన్ననాటి స్నేహితుల కోసం రాశాను.

      (అందుకనే నా అభిమాన సినిమా నటుల్ని మా బ్రాడీపేట వాళ్ళుగా కలిపేసుకున్నాను.)

      Delete
  2. very good sir once upon a time when i was working in guntur i am also fan of this great hotel, i still remember the taste of food.

    ReplyDelete
    Replies
    1. welcome to the fan club of Ananda bhavan. now you are our member. congratulations!

      Delete
  3. ఇంట్లో 365 రోజులు వంట చేసి చేసి విసుగేస్తుంది. మా బెజవాడ లో కూడా "ఆనంద భవన్ " ఉంటే ఎంత బావుండునో!

    ReplyDelete
    Replies
    1. అలాగా! ఎలాగూ సూర్యాకాంతం, ఛాయాదేవిల దెబ్బకి పురుషోత్తం హోటల్ మూసేస్తున్నాడు. మీ బెజవాడకి మకాం మార్చమని అతనికి సలహా ఇస్తాను!

      Delete
  4. ఎందుకో ఈ పోస్ట్ నాకు బోర్ గా అనిపించింది.
    ఎందుకంటారు ? ఐడెంటిఫై అవ్వకపోవడం వల్లంటారా ?
    :venkat

    ReplyDelete
    Replies
    1. 1.ఐడెంటిఫై అవ్వకపోవడం.

      2.ఆనందభవన్ గూర్చి రాయాలని మొదలెట్టి.. మధ్యలో రూట్ మార్చి.. సూర్యాకాంతం, ఛాయాదేవి అంటూ రాస్తూ.. ఎండింగ్ ఎలా చెయ్యాలో తెలీక.. ఎవార్డ్ సినిమాలా ఎబ్రప్ట్ గా ముగించెయ్యడం!

      కర్ణుడి చావుకి అనేక కారణాలు!!

      (ముఖ్యమైన కారణం.. రాత్రిళ్ళు రాసేప్పుడు అర్ధరాత్రి దాటిన తరవాత మెదడుపై చూపించే భూతప్రేతపిశాచాల ప్రభావం!)

      Delete
  5. ఆ అందమైన ఆనంద భవన్ , అందులో తిన్న ఇడ్లీ సాంబార్, రవ్వ అట్టు , అన్నిటికన్నా ఇంకెక్కడా దొరకని మైసూరు బజ్జి ఎన్ని జన్మలకైనా మరచిపోగలమా! మా ఆవిడకూడా ఆ మైసూరు బజ్జి తిని ఆహా! అన్నది. ఇక భోజనం సంగతికి వొస్తే అప్పటి రోజుల్లో అంత మంచి భోజనం (వెజిటేరియన్) దొరికే హోటల్ గుంటూరు లో ఇంకెక్కడా లేదు. ఇంత మరిచిపోలేని జ్ఞాపకాలని మనకి మిగిల్చిన ఆ పురుషోత్తానికి , నాకు తెలిసి ఇంకొక పార్టనర్ (ఒక లావాటి అతను ఉండేవాడు ) అతనికి కృతజ్ఞతలు !
    గో వె ర

    ReplyDelete
    Replies
    1. నేను కూడా నా భార్యాపిల్లలకి మన ఆనందభవన్ గూర్చి ఎంతగానో చెప్పి తీసికెళ్ళాను.

      వాళ్ళకి ఆ అరిటాకు భోజనం నచ్చలేదు. కారణం.. బహుశా 'ప్రాణభయం' కావచ్చు!

      గరగరలాడే ఫ్యాన్లు పై నుండి ఊడి నెత్తి మీద పడతాయేమోనని (అప్పటికీ నేను వాళ్ళకి చాలా ధైర్యం చెప్పాను.. ముప్పైయ్యేళ్ళగా ఆ ఫ్యాన్లు అంతేనని) భయపడి చచ్చారు!

      Delete
  6. Hilarious post. BTW Is Anand bhavan better than Mysore cafe? How do you rate all including Ravi Sankar, sankar vilas, Geeta cafe? To me #1 is Mysore cafe as I lived nearby in my childhood. ;)

    ReplyDelete
    Replies
    1. చాతకం గారు,

      thank you.

      you are asking me a difficult question. i lived between Mysore cafe and Ananda bhavan. i have to borrow CBN's "two eyes" theory to answer you! i wrote a post referring the great Sankara Narayana of Mysore cafe.

      Geeta cafe & sankara vilas, according to me, much below in standards. can't even compare!

      Delete
  7. అద్భుతమైన టపా, సూర్యకాంతం గారి లీడర్షిప్ బావుంది. మిగిలిన వారి వెర్షన్ కుడా సూపర్బ్ గా ఉంది . ఈ హోటళ్ళ బెడద కుటుంబాలకి చెప్పనలవి కానిదేమో, పల్లెటూర్ల లో అయినా పట్టణాలలో అయినా :)

    పురుషోత్తం గారిని రిటైర్ అవ్వమని చెప్పండి :)

    ReplyDelete
    Replies
    1. Mauli గారు,

      హోటళ్ళ బెడద!!

      హన్నా! ఎంతమాటనేశారు!

      మాలాంటి వాళ్ళం బ్రతికి బట్టకడుతున్నాం అంటే ఈ హోటళ్ళ చలవే అని గుర్తుంచుకోండి!

      Delete
  8. నా మిత్రుడు రోజూ ఆనందభవన్ నుండి భోజనం తెచ్చుకుని తినేవాడు. ఆనంద్ భవన్ వారి పార్సిల్లో వచ్చే పచ్చడి భలే ఉంటుంది. ఇక మైసూర్ బజ్జీలు గట్రా మైసూర్ కేఫ్లో బాగుంటాయా లేక ఆనంద్ భవన్ లోనా లేక మరొక చోటనా అనేది చెప్పటం కష్టమైనా, మైసూర్ బజ్జీలో నేనె అధికంగా ఉండటం నాకు పెద్దగా నచ్చేది కాదు. నాకు గుర్తుండి, కాఫీ మాత్రం మైసూర్ కేఫులో బాగుండేది. ఆనందభవనులో కాఫీ సేవించి బయటి బడ్డీకొట్టులో ఏదోక పుస్తకం గెలకటం నాకు అలవాటు.

    ReplyDelete
    Replies
    1. మీరు ఆనందభవన్ మైసూర్ బజ్జీల ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెబుతున్నాను.

      మా వాళ్ళకి కాలేజ్ లైబ్రరీలో గంటల తరబడి చదవడం అలవాటు. సాయంత్రం నాలుగవ్వంగాన్లే సగం లైబ్రరీ ఆనందభవన్ లో మైసూర్ బజ్జీలు లాగిస్తుండేది.

      ముఖ్యంగా నా మిత్రుడు పెండ్యాల (ఆర్థోపెడిక్ సర్జన్ - ఇప్పుడు లేడు) ఎక్జామ్స్ టెన్షన్ అంటూ మూడునాలుగు ప్లేట్లు మైసూర్ బజ్జీలు తినేవాడు.

      ఆనందభవన్ మైసూర్ బజ్జీలు ఎప్పుడూ వేడిగా ఉంటాయి (చల్లారేదాకా వాటిని ఎవరూ బ్రతకనిచ్చేవారు కాదు)!

      Delete
  9. emi baagaledu. maree atigaa vunnaayi A padi mandi dailaagulu.

    ReplyDelete
  10. చాలా బాగుందండి. మొత్తానికి ఈ టపాలో కూడా రావిశాస్త్రి నుంచి తప్పించుకోలేక పోయారు.(అడవిలో లేడిపిల్లని చూసి పులి జాలి పడ్డట్లు.. నక్సలైట్ నాయకుణ్ణి ఎన్ కౌంటర్ చేసే ముందు పోలీసు జాలి పడ్డట్లు..)
    - బ్రహ్మం

    ReplyDelete
    Replies
    1. బ్రహ్మం గారు,

      నిజమే సుమీ! నేను గ్రహించలేదు. ధన్యవాదాలు.

      Delete
  11. "ఎంత చెడ్డా నువ్వూ మగవెధవ్వేగా!"

    డాక్టరు గారు,

    మీరు మగవాళ్లని కించపరస్తూ, వారి మనోభావాలను దెబ్బతీసేలా రాస్తున్నారు. ఆ ఏముందిలే మగవారినీంటే ఏమంటారులే అనే భావం మీలో/మన సమాజంలో బాగా జీర్ణించుకు పోయినట్లుంది. సరదాగా రాశాను గదా అని మీరు సమర్దించుకొంటారేమో! అదే మీరు "ఎంత చెడ్డా నువ్వూ ఆడముం*వి కదా!" అని మీరు రాయగలరా?

    ReplyDelete
    Replies
    1. మీరీ మధ్య మీ పురుషవాద కళ్ళ జోడుతో.. నా బ్లాగ్ ప్రతి లైన్ నీ బూతద్దం వేసి మరీ గాలిస్తున్నారు. దానివల్ల మీ మనోభావాలు దెబ్బ తినడం వినా ప్రయోజనం లేదు:)

      నిజమే. మీరన్నట్లు నాకు ఆడవారికి వ్యతిరేకంగా రాసే అలవాటు / ధైర్యం లేదు. రాయలేను.

      అయినా.. ఛాయాదేవి ఎవర్నైనా 'వెధవ' అని అనగల శక్తిమంతురాలని మనవి చేసుకుంటున్నాను.

      Delete
  12. మీకు కూడా కాయ కష్టం చేసి, కొంపలో పెళ్ళాం బిడ్డలను పోషించే మగవాడంటే అంత లోకూవైపోయాడన్నమాట.
    మీరు బాగా రాస్తారు కదా! మన నెత్తిమీద భారం పడకుండా వారిని వారు (మహిళలను) సెల్ఫ్ గోల్ చేసుకొనేటట్లు, ఎలా హాండిల్ చేయాలి అని టపాలను రాయండి. పురుషులకు తెలివి తేటలు పెంచే కొన్ని సలహాలివ్వవచ్చు కదా! ఎప్పుడు ఇలాంటి హాస్య కథలను రాయటమేనా? ఒకసారి చదివి నవ్వుకొన్న తరువాత, ఎవరు వీటిని పట్టించుకోరు.

    ReplyDelete
    Replies
    1. నేను సీరియస్ లిటరేచర్ చదువుతాను. రాయను. మీ కామెంట్లని కూడా సరదాగానే తీసుకుంటున్నాను:)

      మన మగాళ్ళ గూర్చి మీరు మరీ వర్రీ అవకండి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మనదే రాజ్యం. కాబట్టే ఫుల్లుగా తాగి హాయిగా భార్యల్ని ఇరక్కొడుతున్నాం. ఆ విధంగా మన మగతనం దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంది.

      ఈ మధ్య ఉన్నతమధ్య తరగతి వర్గాల్లో భర్తలు కొంత ఇబ్బంది పడుతున్నారు. వారికి నా ప్రగాఢ సానుభూతి.

      Delete
    2. @ఈ మధ్య ఉన్నతమధ్య తరగతి వర్గాల్లో భర్తలు కొంత ఇబ్బంది పడుతున్నారు.

      LOLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL

      Delete
  13. "ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మనదే రాజ్యం"
    భలే చెప్పారు. కాంగ్రెస్ పార్టి గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఓడిపోయి ఉత్తరాఖండ్ లో లాంటి చిన్న రాష్ట్రం లో గెలిస్తే సంబరపడినట్లుంది. మీరు రాసింది చదివితే కాంగ్రెస్ పార్టి స్పొక్స్ పర్సన్ మాటలను తలపింప చేసారు . చిన్న చిన్న విజయాలకే ఎక్కువ సంబరపడుతున్నారు. పురుషుల వాణిని బలంగా వినిపించటానికి,సామజిక చైతన్యం చాలా అవసరం. పెళ్లైన తరువాత సామజిక చైతన్యం చాలా మటుకు కోల్పోయినట్లున్నారు. కనుకనే హాస్య రచనలు చేస్తున్నారనిపిస్తున్నాది.

    "కాబట్టే ఫుల్లుగా తాగి హాయిగా భార్యల్ని ఇరక్కొడుతున్నాం"

    దానికి ప్రభుత్వాన్ని వదిలేసి భర్తలను నిందిస్తే ఎలాగా?. ఆడపడచులంతా ఉచిత స్కీములు లను చూసి రాజకీయ పార్టిలకు ఓటు వేస్తారు. ప్రభుత్వం మందు షాపులు ఎక్కువగా తెరచి (బెల్ట్ షాపులను పెట్టి ) ప్రజలచేత మద్యం మరింతగా తాపిచ్చి , ఉచిత పథకాలకు డబ్బులు సమకూర్చు కొంట్టున్నాది. ఈ తతంగానికంతా కీలకం మహిళా మణులే. వారి కోరికలు తీర్చుకోవటానికి మొగుడిమీదా, వాడు మాట వినేవాడు కాకపోతే ప్రభుత్వం మీదా (ఉచిత స్కీములు,పావల ఋణాలు) ఆధారపడుతారు. అది వారి నైజం. ప్రభుత్వం ఒకవైపున వారి కోరికలు తీరుస్తున్నట్లు నటిస్తూ, డబ్బుల కొరకు భర్తలచేత మందు ఎక్కువ తాగిపిస్తుంది. ఈ జగనాటకం మొత్తం లో వారి పాత్ర ఎమీ లేదని, మోసపోయామని అర్థమైన భర్తలు ప్రభుత్వాన్ని, దాని యంత్రాగం లో ఎవరిని నిలదీయలో తెలియక, ఈ నాటకానికంతా మూల కారణమైన భార్యలని, అప్పుడప్పుడు నాలుగిచ్చుకొంటారు. అది తప్పేలా అవుతుంది? అది వాళ్ల దురాశను అదుపులో ఉంచటానికి చేసే ప్రయత్నం గా మీకు కనపడటం లేదా?

    ReplyDelete
    Replies
    1. @Anonymous (13:37),

      మీ వ్యాఖ్య కనీసం పదిసార్లు చదువుకున్నాను. నవ్వలేక చచ్చాను. చాలాచాలా ఫన్నీగా రాశారు. మన మగజాతికి మీరు ఆశాదీపం. పెన్నిధి. పెట్టని కోట.. ఇంకా చాలా!

      మగవారు, అందునా భర్తల తరఫున మీరు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తాగి భార్యల్ని తన్నే మన సోదరుల కష్టాల్ని గుర్తించలేనందుకు సిగ్గు పడుతున్నాను.

      వాదనాపటిమలో మీరు రాం జెత్మలానికి తమ్ముడు, కపిల్ సిబల్ కి అన్న! అందుకోండి నా అభినందనలు.

      (రేప్ టపా గొడవలో పడి ఆలస్యంగా అభినందిస్తున్నాను. సారీ!)

      Delete
    2. అప్పుడే నన్ను మరచి పోయారా డాక్టర్! మగవారికి బట్టతల ఎందుకొస్తుందో ఇంతకు మునుపు చెప్పాను. కాని మీరు ఆ అంశాన్ని పరిశీలించల్సిన విషయమే అని, ఇప్పటివరకు దాని మీద మీ అభిప్రాయం చేప్పలేదు (కాంగ్రేస్ పార్టి తెలంగాణ అంశం పక్కన పెట్టినట్లు ). ఇప్పుడు ఈ వాఖ్య రాశాను. కాని మీరు తమాషాగా తీసుకొన్నారు. పురుషులై ఉండి కూడా, మీకు పురుషుల సమస్య మీద చాల చిన్న చూపు ఉన్నాది. ఆ ఏముందిలే, ఆవేశంలో రెండు వ్యఖ్యలు రాస్తారు. ఆ తరువాత గమ్మునైపోతారు అని అనుకొంట్టునట్లున్నారు. మీరు రచయితగా కన్నా కాంగ్రేస్ పార్టి లో ఉండవలసిన వారు. చూస్తున్నాము కదా కాంగి పార్టిని. అధికారం అనుభవించటం అలవాటైన కాంగ్రేస్ అధిష్టాన వర్గం, మన సమాజంలో వచ్చే మార్పులను గుర్తించటంలో ఎలా విఫలం చెందిందో!మొన్న డిల్లి సంఘటనతో ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలా తెలిసింది. అలాగే మీకు పెళై, పిల్లలు పుట్టిన తరువాత సామజిక చైతన్యం కొరవడింది. పురుష జాతిలో మారుతున్న ఆలోచనా విధానం అంచనా వేయటంలో, మీరు కాంగ్రెస్ అధిష్టాన వర్గంలాగా పూర్తిగా విఫలం చెందారు. అందువల్లే నా వ్యఖ్యను పొట్ట చేక్కలయ్యే లాగున చదువుకొని ఆనందిచారు. ఇకనైన మీరు సోనియా,మన్మోహన్ లు ఎలా వారి పొరపాటును గుర్తించి, తప్పును సరిద్దుకొవటానికి టి వి ముందుకు కొచ్చి, దుండగులపైన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చరో, అలాగే మీరు మీ తప్పును తెలుసుకొని, పురుషుల తరపున మీ పదునైన కలంతో, వారికి జరిగే అవమానాలను, వారి సంపదను ప్రభుత్వం, స్రీలు కూడ బలుకొని దోచుకోవటమే కాక వాడిని తాగుబోతుగా, తిరుగుబోతుగా, దుర్మార్గునిగా ఎలా చిత్రికరించి వాళ్ల పబ్బం గడుపుకొంట్టున్నారో వివరిస్తూ, మాంచి కదం తోక్కే టపాలు రాయలి. లేకపోతే ఈ కామేడి టపాలు అందరు చదివి చాలా హిలేరియస్ గా ఉంది డాక్టర్ గారు భలే అని రాసినంత కాలం పొగుడుతారే గాని, ఆ తరువాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు.

      ముగించే ముందు చిన్న మాట, డాక్టర్ గారు వీరరసాని కున్న గుర్తింపు హాస్య రసానికి ఉండదు. రామారావు బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు సినేమాలలో వేసిన వేషాల ప్రభావం ఎటువంటిది. అదే ప్రేక్షకులలో కామేడి సినేమాలు చేసిన చంద్ర మోహన్ రాజేద్ర ప్రసాద్ సినేమాల ప్రభావం ఎంతో మీకు తెల్సుగదా! కావున పురుషుల కు మద్దతుగా మీ కలాన్ని ఝూలిపించండి. అప్పుడే మిమ్మల్ని ఒక పురుష సింహంగా భావి తరాల వారు పది కాలాల పాటు గుర్తుంచుకొంటారు.

      Wish you a happy new year 2013

      Delete
  14. I loved reading your story. Your writing is very creative Ramana. I could not stop laughing at some places, especially about atlakada comment One of our favorite joints is in Brodipet. next time when I am in Guntur I would love to try Mysore Bajji.

    BTW side track, how to write in Telugu script. I wish to know that.

    ReplyDelete
    Replies
    1. Hello Sudha garu,

      you can write in Telugu using..
      http://www.google.com/transliterate/telugu
      OR
      lekhini.org.
      I prefer the former one, it also gives auto suggestions drop down.

      :venkat

      Delete
    2. Thank you Venkat garu. I typed the word and cut it pasted here. is there anway directly when I am replying it comes automatically

      ధన్యవాదాలు

      Delete
  15. Dear sir, though I belong to GNT district, lived very near to gnt(Nallapadu), I had never visited Anand Bhavan. Because of your blog, I recently had a lunch. Great food. 100 times better than Sankar vilas. Thank you.

    ReplyDelete
  16. ఆలస్యంగా అయినా మంచి కధ చదవగలిగాను
    ధన్యవాదాలు రాజుగారికి.
    అన్ని వూళ్ళల్లోనూ హోటళ్ళు వుంటాయి. వాటికీ మంచి మంచి చరిత్రలుంటాయి. రాసే మీలాంటివారు కావాలంతే.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.