సమయం రాత్రి పన్నెండు గంటలు. సాహిత్యంపై బాలగోపాల్ రాసిన వ్యాసాల సంకలనం 'రూపం-సారం' చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఇదే. ఇంతలో అసరా (USA) నుండి ఒక మిత్రోత్తముని ఫోన్. చాలాసేపు చిన్ననాటి కబుర్లు, కాకరకాయలు. పిచ్చాపాటీ.
"ఈ టీవీలో 'పాడుతా తీయగా' ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా చూడు." అన్నాడు. మావాడు సంగీత ప్రియుడు. ఓ సన్నకారు పాటగాడు.
"తెలుగు టీవీ చూడకపోవడం నా ఆరోగ్య రహస్యం. కావున తియ్యగా పాడినా, చేదుగా పాడినా నాకు తెలిసే అవకాశం లేదు. నువ్వు చూడమంటున్నావు కాబట్టి తప్పకుండా చూస్తాను." అన్నాను.
నాది మాట మీద నిలబడే వంశం కాదు. అంచేత సహజంగానే అటు తరవాత ఆ టీవీ గోల మర్చిపోయ్యాను. అనగనగా ఓ పని లేని రోజు నా స్నేహితుడు, అతగాడికి చేసిన బాస గుర్తొచ్చి ఆ ప్రోగ్రాం టైమింగ్స్ వాకబు చేసి టీవీ ఆన్ చేయించాను.
టీవీ స్క్రీన్ పై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిండుగా కనిపిస్తున్నాడు. ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఈ రియాలిటీ షోలు గిరాకీ తగ్గిన పని లేని నటులకి, గాయకులకి చక్కటి ఆశ్రయం కల్పిస్తున్నాయి. మంచిది. ఇట్లాంటి కార్యక్రమాలు వృద్ధ కళాకారులకి రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ వలే కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వెరీ గుడ్.
ఇంతలో బక్కపలచటి కుర్రాడొకడు సెట్ మధ్యలో కొచ్చి ఆవేశంగా ఏదో సినిమా పాట ఎత్తుకున్నాడు. కళ్ళు మూసుకుని గొంతెత్తి పాడటం మొదలెట్టాడు. నాకు చిరాకేసింది.
'వార్నీ! పాడుతా తీయగా అంటే సినిమా పాటల పోటీ ప్రోగ్రామా!' ఆశ్చర్యపోయాను.
'మరి మన అసరోత్తముడు బాగుందన్నాడేమి! నా మీద వాడికి పాత కక్షలేమీ లేవు గదా!' ఆలోచిస్తూ మళ్ళీ టీవీ చూశాను.
ఇప్పుడు కడుపులో వికారం మొదలైంది. వెంటనే టీవీ కట్టేసాను.
ఈ వికారం నాకు కొత్త కాదు. దీనికి నలభయ్యేళ్ళ చరిత్ర ఉంది. సైకియాట్రీ వైద్యంలో PTSD అని ఓ కండిషన్ ఉంది. ఒక భయంకర అనుభవం మనసులో ముద్రించుకుపోయి.. ఆ అనుభవం తాలూకా భయాలు వెంటాడుచుండగా.. ఆ అనుభవం కనీస స్థితిలోనయినా మళ్ళీ ఎదురైతే తట్టుకోలేరు. అసలా ఊహకే విచలితులవుతారు. నా జీవితంలో ఈ సినిమా పాటల పోటీ ఒక బీభత్స అనుభవం.
ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్ బ్యాక్. నా చిన్నప్పుడు వీధివీధినా వెలిసే శ్రీరామనవమి పందిళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలకి కేరాఫ్ ఎడ్రెసులని ఇంతకు ముందొక టపాలో రాశాను. ప్రతి యేడాది ఈ పందిళ్ళల్లో సినిమా పాటలు పోటీ కూడా ఒక ముఖ్యాంశంగా ఉండేది.
అలనాటి ఆ పాటల పోటీలు నా జీవితంలో చెరగని ముద్ర వేస్తాయని అప్పుడు నాకు తెలీదు. అరిగిపోయిన భాషతో మర్యాద కోసం 'ముద్ర' అంటున్నానే గానీ.. నిజానికవి ముద్రలు కావు.. కత్తి పోట్లు, గొడ్డలి నరుకుళ్ళు!
ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. 'రాగమయి రావే! అనురాగమయి రావే!'. ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!
ప్రతి గాయక రాక్షకుడు మైకు ముందుకు రావడం.. గొంతు సరి చేసుకుని.. 'ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన ఫలానా పాట.' అని ఎనౌన్స్ చేసి మరీ హింసించేవాళ్ళు. మరీ ఒక్కోడు పాడుతుంటే పిశాచాల ప్రార్ధనలా, సూడి పంది ప్రసవ వేదనలా ఉండేది. జీవితం మీద విరక్తి పుట్టేది.
చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.
శ్రోతల ఏడుపు మొహాలు ఎవాయిడ్ చెయ్యడానికి వారు అలా కళ్ళు మూసుకొంటారని సుబ్బు అంటాడు. కొంతమంది మెలికలు తిరుగుతూ పాడేవారు. 'గొంతు ఎలాగు మెలికలు తిరగదు. కనీసం శరీరంలోనయినా చూపించనీ!' అంటాడు సుబ్బు.
మొత్తానికి ఆ యేడాది శ్రీరామనవమి పాటల పోటీ గాడిదలు, కుక్కలు, పిల్లులు, గబ్బిళాలు వంటి నానాజాతుల వికృత గాన సౌందర్య విలాసములకి పుట్టినిల్లుగా భాసిల్లింది. కళ్ళు మూసుకున్నట్లు చెవులు మూత పడకపోవడం మానవ శరీర నిర్మాణ లోపమని ఆ నాడే నాకు అర్ధమయ్యింది. అందుకే నాకు 'రాగమయి రావే' పాటంటేనే కసి, కోపం, చిరాకు, రోత!
ఒకానొక రోజు నవ్వారు మంచంపై కాళ్ళు పైకెత్తుకుని చందమామలోని ధూమకేతు, శిఖిముఖిల సీరియల్ ఉత్కంఠపూరితంగా పఠించు సమయమున.. నా ఒక్కగానొక్క అన్నయ్య ప్రేమగా అడిగాడు.
"జయభేరి సినిమాకి వెళ్తున్నా. వస్తావా?"
"ఛీ.. ఛీ.. ఆ సినిమా పొరబాటున కూడా చూణ్ను." అని ఈసడించుకున్నా.
అన్నయ్యకి అర్ధం కాలేదు. ఆ సినిమాపై నాకున్న కోపానికి కారణం తెలుసుకుని పెద్దగా నవ్వాడు.
"పోనీ ఒక పని చెయ్యి! ఆ పాట వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని, చెవుల్లో వేళ్ళు పెట్టుకో!" అన్నాడు.
'ఇదేదో బానే ఉంది.' అనుకుంటూ అన్నయ్యతో జయభేరి సినిమాకి బయల్దేరాను.
'జయభేరి' ఒక అద్భుత దృశ్యకావ్యం. ఆసాంతం సుమధుర సంగీతమయం. నేను అసహ్యించుకున్న 'రాగమయి రావే' పాట సమయంలో కళ్ళు మూసుకోవడం కాదు.. కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయ్యి చూశాను. ఇన్నాళ్ళూ మా బ్రాడీపేట ఔత్సాహిక గాయక రాక్షసులు ఘంటసాల పాటని సామూహికంగా హత్య కావించారని అవగతమైంది.
(ఏమిరా దుష్ట దుర్మార్గ వెర్రి వైద్యాధమా! నీ రాతలతో మన బ్రాడీపేటీయుల పరువు తీయుచుంటివి? మనవాళ్ళు తమ గార్ధభ గానంతో ఘంటసాల పాటని కంకరరాళ్ళతో కలిపి కరకరలాడించారు. అంతమాత్రానికే అపచారమంటూ అంతలా అరవాలా?)
అవును గదా! 'రాగమయి రావే!.. ' గీత హనన నేరం మా బ్రాడీపేట గాత్రకారులది కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు బాధ్యత వహించవలసిన వారు ఘంటసాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పెండ్యాల, పి.పుల్లయ్యలు మాత్రమే! ఒక పాటని మరీ అంత గొప్పగా రూపొందించడమే వారు చేసిన నేరం! దొంగలు బంగారాన్ని మాత్రమే కాజేస్తారు.
తరవాత జయభేరి సినిమా చాలాసార్లు చూశాను. ఎప్పుడు చూసినా 'రాగమయి రావే!' ఇష్టంగానే చూస్తున్నాను. కావున.. నా 'రాగమయి' పాట తాలూకా వికారం తగ్గిపోయినట్లే. ఘంటసాల అద్భుత గానం మూలానా కొందరి నీచగాన దోషం నశించినట్లుంది. పోన్లే. మంచిదే కదా!
చిత్రంగా ఇప్పుడు 'పాడుతా తీయగా' కార్యక్రమం చూస్తుంటే అప్పటి వికారం బయటేసింది. అనగా.. నేనకున్నట్లు నా చిన్ననాటి క్షుద్ర గాయకుల పట్ల నా ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదన్నమాట. ఆలోచించగా ఇదంతయూ Pavlov classical conditioning వలే యున్నది. నా పసిహృదయం మరీ అంతలా గాయపడి తల్లడిల్లిందా!
దూరంగా పాట వినిపిస్తుంది. 'తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా.. మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనయినా.. '
ఈ టపాకి కారణం అయిన జయభేరి సినిమాలోని 'రాగమయి రావే.. ' పాట యూట్యూబ్ లో ఉంది. ఇక్కడ ఇస్తున్నాను. మరొక్కసారి విని ఆనందిచండి. ('చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం ఆ నాటి 78 rpm రికార్డులో లేదు.)
(photos courtesy : Google)
బాగుంది మీ నిందాస్తుతి. :)
ReplyDelete'తనువుకెన్ని గాయాలైనా' నాకిష్టమైన ఓ పాట, పిబి బాస్ గొంతు భలే సూటయ్యింది కదూ.
అవును. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. P.B.శ్రీనివాస్ చాలా బాగా పాడాడు.
Delete'రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో! this title is good,
ReplyDeleteఅంటే పోస్ట్ బాలేదనా?!
Deleteరమణా,
ReplyDeleteమొదటి రిలీజులో యాన్టి బ్రాహ్మణ చిత్రంగా ముద్రపడి ఫ్లాప్ అయిన జయభేరి, రెండో రిలీజు నుంచి ఈరోజుదాక వచ్చినన్నిసార్లు ఆడినన్ని రోజులూ హౌస్ ఫుల్ గా ఆడిన సినిమా. musical మూవీస్ అని ఇంగ్గ్లిష్లో అంటు వుంటారు కదా, అలా తెలుగులో వచ్చిన ఒక గొప్ప సంగీత నృత్య గాన కళాపూర్ణం 'జయభేరి'.
తన మాజికల్ musical గొప్పతనంతో సంగీతంతో ఆడుకున్నాడు పెండ్యాల. సౌందరరాజన్ తో claimax పాట పాడించి హిట్ చేశాడు. నాకు గుర్తున్నంత మటుకు తెనాలి సత్యన్నారాయణ టాకీస్ (అప్పటి) ఓనర్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్.
ఏమయినా ఉదయాన్నే మంచి పాట వినిపించి, మంచి సినిమాని గుర్తు చేసినందుకు చాలా థాంక్స్.
గోపరాజు రవి
డియర్ రవి,
Deleteనేను నాకు నచ్చిన సినిమా హిట్టా కాదా అనేది పెద్దగా పట్టించుకోను. అది నాకనవసరం కూడా.
జయభేరి చివరిపాట దారుణంగా ఉంటుంది. సౌందరరాజన్ గొంతు భరించడం కష్టం. ఇంకో ముఖ్యమైన విషయం ఈ సినిమా ప్రింట్ క్వాలిటీ దరిద్రంగా ఉంటుంది. కారణం తెలీదు.
మధ్యలో కొన్నాళ్ళు.. జయభేరికి భైజుబావ్రాతో సంబంధం ఉందేమోననే అనుమానంతో.. పి.పుల్లయ్యని శీలాన్ని శంకించాను. కానీ బైజూబావ్రా చూశాక లెంపలేసుకున్నాను.
ReplyDeleteమీ బ్రాడీపేటలోని ఔత్సాహికగాయకులు ఈ అద్భుతమైన పాటను ఖూనీ చేసిఉండొచ్చు,కాని మొన్న ' పాడుతా తీయగా 'షోలో ఈ పాటని ఎంచుకున్న అబ్బాయి బాగా పాడాడు.ముఖ్యంగా ' చివురులు మేసిన చిన్నారి కోయిల ' అన్న చరణం ఎంత మధురంగా ఉంటుందో!
కమనీయం గారు,
Deleteజీవితంలో ఒక డాక్టర్ వల్ల మోసపోయినవాడు, ఇంకే డాక్టర్ని నమ్మడు. నమ్మలేడు. నాది ఆ కేసు.
"పాడుతా తీయగా అంటే సినిమా పాటల పోటీ ప్రోగ్రామా!"
ReplyDeleteఏవిటీ ఇది రికార్డింగ్ డాన్సా? అన్నట్టు కొట్టిపారేస్తున్నారే!
నాకు ఈ సినిమా పాటల పోటీగాళ్ళంటే అసహ్యం, రోత, చిరాకు. అదే రాశాను.
Deleteఈ పాటగాళ్ళకి, రికార్డింగ్ డాన్సుల్లో చిందులు వేసేవారికి తేడా ఏంటో నాకు అర్ధం కాదు!
రాగమయి రావే పాటే కాదు ముద్దబంతి పూవులొ,తలనిండ పూదండ ఆ తరువాత తాలికట్టు శుభవెళ ,ఏ దివిలొ విరిసిన పారిజతమొ ఇలా ఒకటా రెండా ఒకరా ఇద్దరా కూనిరాగం తీసే ప్రతిఒక్కరూ ప్రతీ వూల్లొ ఆంధ్ర దెశమంతా ప్రాణాలు తోదేసిన వాళ్ళే.ఘంటసాల జయంతి ,వర్ధంతి అంటెనె వణికి పోయిన రోజులు తలచుకుని మళ్ళీ వణుకొస్తొంది.
ReplyDelete@rajani gopireddy,
Deleteఘంటసాల పాటల పాటగాళ్ళు మిమ్మల్ని కూడా బాధించారన్నమాట! నా సహా బాధితులైన మీకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
ఘంటసాల పేరుని అనేక రకాలుగా వాడుకుంటూ పబ్బం గడుపునే పెద్దమనుషులు కొందరైతే.. ఘంటసాల గూర్చి జరిగే ప్రోగ్రాముల్లో ఇరుక్కుని, ఘంటసాలని పొగుడుతూ తమ స్థాయి పెంచుకునే అల్పులు మరికొందరు. వీళ్ళే టీవీల్లో నిత్యం దర్శనమిస్తుంటారు.
ఘంటసాల ఒక అద్భుత గాయకుడు. ఆయన పాట మనందరి హృదయాల్లో శాస్వితంగా నిలిచి ఉంటుంది. మనమే ఆ మహాగాయకుడికి నిజమైన అభిమానులం. అంతేగానీ ఘంటసాల పేరు వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్న దౌర్భాగ్యులు మాత్రం కాదు.
ఎవురయ్యా ఈడా
ReplyDeleteబ్రాడీపేటోళ్ళని ఆడిపోసుకుంటా ఉందీ
నాల్గు అవ్వాయ్ సువ్వాయిలు ఒదిల్నానంటే రైలుకట్ట అవతల పడతారు
ఏవనుకుంటన్నారో
@భాస్కర్ రామరాజు,
Deleteనే.. నే.. నేను కాదు.
వాడెవడో తెలీంగాన్లే మీకు కబురు చేసుకుంటాను.
చి.. చి.. చిత్తగించండి!
ఆణిముత్యాలు గుర్తు చేసారు.ధన్యవాదములు
ReplyDeleteపాడుతా తీయగా పోగ్రాం "గాన గంధర్వులని " వెలికి తీసే కార్యక్రమం అని నా అభిప్రాయం.
కాకపొతే అన్ని సీరీస్ లలోను అవే పాటలు. విని విని విసుగొస్తుంది.
వనజవనమాలి గారు,
Deleteమీ అభిప్రాయం కాదనను. అయితే టీవీ చానెళ్ళకి వ్యాపార ప్రయోజనమే పరమార్ధం. ఎవర్నీ వెలికి తీద్దామనే సదాశయాలుండవ్. ఈ టాపిక్ పై నా అభిప్రాయాలు వీలును బట్టి ఒక టపాగా రాస్తాను.
డాక్టర్ గారు జీవితం వ్యాపారం కాదా? టి వి ప్రోగ్రంస్ వాళ్ళు టాలెంట్ వెలికి తీసి ఎమీ చేయాలి? యం.యస్. సుబ్బు లక్ష్మి, మంగళంపల్లి లాంటి గాయని గాయకులను తయారు చేయటం వాళ్ల ఆశయం గా ఉండాలా? అటువంటి గొప్ప ఆశయాలు పాడే వారికి ఉండాలి.
Delete@Anonymous,
Deleteనేను వనజవనమాలి గారి 'గానగంధర్వులు' అన్న పదానికి సమాధానం రాశాను. అంతే!
జీవితం వ్యాపారమా! అదేమో నాకు తెలీదు గానీ.. టీవీ మాత్రం గ్యారంటీగా వ్యాపారమే!
వనజవనమాలి గారన్నట్లు ఇది మట్టిలోని మాణిక్యాల్ని వెలికి తీసే కార్యక్రమమేకానీ మరీ అందరూ వారికిష్టమొచ్చిన పాటల్ని తమదైన రీతిలో పాడేస్తూ రెపీట్లు కొడుతూ ఉంటం వల్ల కాస్త చెవులకిబ్బందిగానే ఊంటుంది. కొంచెం ఆడిషన్లు స్త్రిక్టుగా చేసి సెలెక్టు చెయ్యాలేమో!
ReplyDeleteఈప్పుడే నీ సన్నకారు పాడు మిత్రునికి ఫోను చేసి నీకింత మంచి ఐడియా ఇచ్చినందుకు అభినందిస్తానుండు!అది లేకపోతే ఇది నీ కలం (కీ బోర్డు) నుండి జాలు వారేది కాదు కదా!
గౌతం
నిద్రోతున్న సింహాన్ని ఫోను చేసి మరీ రెచ్చగొట్టడం నీకు మర్యాద కాదు. మన పాటల మితృడు ఆ ప్రొగ్రాం చూసేది S.P.బాలసుబ్రమణ్యం వాచాలత్వాన్ని వీక్షించుటకు కాదు. పాటగాళ్ళ వద్ద నుండి మెళకువలు సంగ్రహించుట కొరకు!
Deleteఛాలా బాగా చెప్పారండి. మేము బ్రాడీపేటలో శివాలయం దగ్గర ఉండేవాళ్ళం. శివరాత్రికి ఒక పది రోజులు నాల్గోలైనులో నుంచి ఆ కర్న కఠోర గాన గార్ధభ స్వర విన్యాసాలు కంటికి కునుకు లేకుండా చేసాయి. నా మటుకు వాళ్ళు ఆ "రాణి ఓ రాణి" అల్లు రామలింగయ్య "కులుకులు" పాటని చావగొట్టి చంపేవాళ్ళు. మరొక కళా ఖండం "అంతా బ్రాంది ఏనా, జీవితాన విస్కీ ఏ లేదా, ఆశా నిరాశేనా" అనుకునే వాళ్ళం. ;) దీనికి తోడు ప్రతి ఒక్క ఆడపిల్ల ఇత్తడి పళ్ళెం మీద నిలబడి నెత్తిన చెంబు భరత నాట్యం [విధానం పేరు తెలియదు] స్టేజి మీద చేసి చంపి తీరాలనే పట్టుదలతో చంపేవాళ్ళు. మీలాగే "స్వామి రా రా ఇటు రా రా" పాటని కూడా మేము కూడా ఎన్నిసార్లు రావాలిరా బాబూ అని తల బాదుకునే వాళ్ళం.
ReplyDeleteచాతకం గారు,
Deleteనా చిన్నప్పుడు ఈ ఇత్తడి పళ్ళెం నాట్యం CVN ధన్ గారి 'రవి ట్యుటోరియల్ కాలేజి'లో చూసేవాళ్ళం. ఆ రోజుల్లో అమెరికాలో ఉండేవాళ్ళు తక్కువ. వాళ్ళ పిల్లలు అక్కడో, ఇక్కడో, ఎక్కడో ఈ ఇత్తడి పళ్ళెం నాట్యం నేర్చుకుని.. ధన్ గారి కాలేజిలో ప్రదర్శించేవాళ్ళు. ఫ్రీగా వస్తే ఫినాయిలయినా వదలరాదనే పాలసీ నాది. అంచేత ఏమాత్రం అర్ధం కాకపోయినా నోరు తెరుచుకుని చూస్తుండేవాణ్ని.
టీ వీ సినిమా పాటల పోటీ ల వల్ల , పిల్లలకి కష్ట పడే తామే గురువులుగా మారి సంగీతం నేర్పించి పోటీలకు పంపించే తల్లి దండ్రుల కృషి కనిపిస్తుంది. కాని సినిమా పాటలే పాడుతారు ఎందుకో :(
ReplyDeleteఒకరిద్దరు స్వంత పాటలు పాడుతారు అనుకొంటే, అవి విషాద గీతాలే (ఆడపిల్ల, అనితా ). ముందు తల్లి దండ్రులు సినిమా పాట ల నుండి బయటికి వస్తే బావుంటుంది. కాని వారికి సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో అన్న ఆశ.
ఈ పాటల పోటీ ల వల్ల దేశం లో సంగీతం మాష్టార్లకు గిరాకీ పెరిగి ఉంటుంది, పిల్లలకి మ్యూజిక్ క్లాసులు తప్పనిసరి అదనపు బడి ..
సినిమాపాటలు కాక శాస్త్రీయ సంగీతం పాడితే నీలాంటి శ్రోతలు నిద్దరోతారు లేదా బుర్రగోక్కుంటూ లగెత్తుతారు. అదనపు బడి, భారం అనేది మనలాంటోల్లకు కాదులే.
Deleteమౌళీ గారు,
Deleteతలిదండ్రులు పిల్లలకి సినిమా పాటలు, డ్యాన్సులు నేర్పించడం, టీవీ స్టూడియోల చుట్టూ తిప్పడం.. ఒక కెరీర్ ఆప్షన్. తలిదండ్రులు తమ పసిపిల్లల ద్వారా డబ్బు సంపాదించాలనే కోరిక కూడా ఇంకో కారణం.
మీరు చార్లీ చాప్లిన్ 'ద కిడ్' చూసే ఉంటారు. ఆ పిల్లాడి డబ్బు తలిదండ్రులు జల్సా చేసేశారు. ఆ పిల్లాడికి ఏమీ మిగల్లేదు. అప్పట్నుండి ఆ దేశంలో పిల్లల సంపాదన (వాళ్ళు మేజర్ అయ్యేదాకా) వేరెవరూ ఖర్చు చెయ్యకుండా చట్టాలు చెయ్యబడ్డాయి. మరి మన పిల్లలకి అట్లాంటి ప్రొటెక్షన్ ఉందొ, లేదో నాకు తెలీదు.
ఎవరండీ ఈ రాగమయి? మరీ అన్ని సార్లు పిలవకండి. ఈవ్ టీజింగ్ కేసు పెట్టి మీచేత "హే క్రిష్ణా..!" అని పాడించగలదు. ఇక రియాల్టీ షోల్లో కొన్నాల్లవరకే కాస్త టాలంట్ ఉన్నవారు వస్తారు. ఎపిసోడ్లు పెరుగుతున్న పొద్దీ నాటు సరుకు పేరుకుపోవటం దాదాపు అన్ని షోలల్లోనూ గమనించొచ్చు.
ReplyDeleteశ్రీసూర్య గారు,
Deleteనాకు మొదట్నుండి పోలీసులన్నా, ప్లీడర్లన్నా భయం. నా భయాన్ని రావిశాస్త్రి పదింతలు చేశాడు. కాబట్టి నేను అన్నిసార్లు పిలిచే ప్రసక్తి లేదు.
అసలు 'రాగమయి'ని అక్కినేని నాగేశ్వరరావు చేత పి.పుల్లయ్య, పెండ్యాల మార్గదర్శకత్వంలో, ఘంటసాల స్టోన్లో మల్లాది రామకృష్ణశాస్త్రి పిలిపించారు. అంజలీదేవి వస్తుంది. అదీ కథ!
ఒక విషయం గమనించారా? నాగేస్సర్రావు కాబట్టి అంత కష్టపడి తెలుగులో మనం అంతగా వినని పదాలు ఏరుకొచ్చి క్లాసైన పాట పాడి పిలిచాడు. అదే ఎంటీవోడైతే "వగల రాణివి నీవే.. సొగసుకాడను నేనే.. ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగిరావే!" అని మోటుగానే పిలిచేవాడు.
Deleteశ్రీసూర్య గారు,
Deleteప్రేమ విషయంలో రామారావుకున్నంత క్లారిటీ నాగేశ్వరరావుకు లేదు. నాగేశ్వరరావుకి మొదట్నుండీ కంఫ్యూజనే. అందుకే ఏటో చూస్తూ ఎవర్నో రమ్మంటూ పాడుతుంటాడు. అదే రామారావు చూడండి. కృష్ణకుమారిని గుర్రం ఎక్కించుకుని తీసుకుపోతాడు. దటీజ్ రామారావు!
హహహ..డాక్టరు గారు మా కైతే(అశోక్ నగర్, మీ బ్రాడీపేట, కోబాల్ట్ పేట దాటాక కృష్ణ నగర్ వెళ్ళేదారిలో)" ఆలయాన వెలసిన ఆదేవుని రీతీ ఇల్లాలే ఈ " అని చంపేసేవాళ్ళు. ఇప్పటిక్కూడా నాకు రామారావూ సావిత్రీ జంటగా సాంఘీకాలంటే వణుకు. పొరపాటున కూడా చూడను:)
ReplyDelete@Sunita Manne,
Deleteఘంటసాల వల్ల మనలాంటి వారికి నష్టం జరిగింది. దుష్ట గాయకులు ఆయన పాటల్ని గులకరాళ్ళతో దంచి మనకి మెదడు వాపు వ్యాధి తెప్పించేవాళ్ళు.
ReplyDeleteజయభేరి సినిమాకి మూలం 'మత్వాలా షైర్ రాం జోషి 'అనే మరాటీచిత్రం.హిందీలోకి డబ్ చేయబడింది.(శాంతారాం నిర్మించినది.)
కమనీయం గారు,
Deletethanks for the information. i don't know this.
after reading your comment i have gone through P.Pullayya's Wikipedia.
(copy paste of an excerpt.)
Jayabheri is a 1959 Telugu musical hit film directed by him and starring Akkineni Nageswara Rao and Anjali Devi in lead roles.[1] The film is based on the 1947 production by V. Shantaram, titled Lokshahir Ram Joshi in Marathi and Matwala Shayar Ram Joshi in Hindi.
రజని గోపిరెడ్డి గారు మీరు ఇంకొక పాట మరిచిపోయరు
ReplyDelete"భలేమంచిరోజు పసందైన రోజు"