Monday, 24 December 2012

'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!



ఇవ్వాళ ఆంధ్రజ్యోతిలో 'సోషలిజం తేవడం చాలా తేలికే!' అంటూ రంగనాయకమ్మ రాసిన వ్యాసం చదివాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాదాపుగా నా అభిప్రాయాలు కూడా రంగనాయకమ్మవే. నా ఆలోచనలు అప్పుడప్పుడు 'విరసం' ప్రముఖులకి చెబుతూనే ఉన్నాను.

ప్రస్తుతం తెలుగు బ్లాగుల్లో ఇటువంటి విషయాలు రాయాలంటే ధైర్యం కావాలి. 'విరసం', రంగనాయకమ్మ వంటి పదాలు వినడమే ఆలస్యం.. తిట్టడమే లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారు. వారితో తిట్టించుకునే ఓపిక లేకా..ఎందుకొచ్చిన గోలలే అనుకుంటూ.. ఇటువంటి అంశాలు బ్లాగులో రాయను. ఇవ్వాళెందుకో ధైర్యం వచ్చేసింది. కారణం తెలీదు.

తెలుగు సాహిత్యంలో ప్రముఖ సాహితీవేత్తల complete works ప్రచురించడం ఈ మధ్య ఊపందుకుంది. శ్రీపాద, మల్లాది, పాలగుమ్మి పద్మరాజు, గోపీచంద్, అడవి బాపిరాజు, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం మొదలైనవారి పూర్తి సాహిత్యం ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ పరిస్థితి కొన్నేళ్ళ క్రితం లేదు. కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వాన 'విశాలాంధ్ర' ప్రచురించిన కుటుంబరావు సాహిత్యం నాకెంతగానో ఉపయోగపడింది.

ఈ మధ్యన మనసు ఫౌండేషన్ వారు వరసగా ఇట్లాంటి సమగ్ర రచనల్ని ప్రచురిస్తున్నారు. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, బీనాదేవి, గురజాడ, పతంజలి.. ఈ లిస్టు పెరుగుతూనే ఉంది. వారు ఇదొక యజ్ఞంగా స్వీకరించారు. వారికి నా అభినందనలు.

ప్రతి సంస్థకి ఒక నిర్దేశిత లక్ష్యం ఉంటుంది. ఉండాలి కూడా. ఒక హిందూ ధార్మిక సంస్థ నాస్తికవాదుల రచనల్ని ప్రచురించరాదు. జనవిజ్ఞాన వేదిక చేతబడికి ప్రచారం కలిపించరాదు. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపుల్స్.

ఇప్పుడు 'విరసం' గూర్చి మాట్లాడుకుందాం. 'విరసం' అనగా విప్లవ రచయితల సంఘంకి కుదించిన పేరు. ఈ పేరులోనే సంస్థ లక్ష్యం మనకి తెలుస్తుంది. శ్రీశ్రీ పుట్టిన రోజున ఏర్పడ్డ విరసం చరిత్ర అందరికీ తెలిసిందే. 'అరుణతార' అనే మాసపత్రిక విరసం ప్రచురిస్తుంది. అరుణతార కవితలకి ప్రాముఖ్యతనిస్తూ.. సంస్థ లక్ష్యాలకి అనుగుణంగా నడుస్తుంది.

అయితే విరసం వ్యక్తులకి అనవసర ప్రాధాన్యం ఇస్తుందని నా భావన. అంచేతనే తమ సభ్యుల complete works కి ప్రాధాన్యతని ఇచ్చుకుంటుంది. ఇది శ్రీశ్రీతో మొదలయ్యింది. శ్రీశ్రీ సాహిత్య సంపుటాలని చలసాని ప్రసాద్ ఎడిట్ చేసిన తీరు అద్భుతం. నాకు తెలిసి తెలుగులో ఇంత గొప్పగా ఎడిట్ చేసిన సాహిత్యం లేదు. అయితే శ్రీశ్రీ సాహిత్యంలో సినిమా వ్యాసాలు 'విరసం'కి అనవసరం. (చలసానికి శ్రీశ్రీ, రావిశాస్త్రిల పట్ల గల వీరాభిమానం జగద్విదితం. అంచేత దీన్నొక aberration గా అనుకున్నాను.)

ఇప్పుడు కుటుంబరావు సమగ్ర సాహిత్యం వరుసగా వెలువడుతోంది. ఇది ఇరవై సంపుటాలు. తమ సభ్యుల్ని (వల్లమాలిన ప్రేమతో/ అభిమానంతో/ స్నేహంతో) ప్రమోట్ చేసుకోవడం విరసం ఎజెండాలో ఒకటిగా నాకనిపిస్తుంది. కుటుంబరావు తెలుగు సాహిత్యంలో 'మకుటం లేని మహారాజు' అన్నాడు శ్రీశ్రీ. పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

అయితే కుటుంబరావు తాత్విక వ్యాసాలు భీతి గొలుపుతాయి. కుటుంబరావు పేరా సైకాలజీకి తెలుగు ప్రజలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నమ్ముతున్నాను. ఈ వ్యాసాల్ని కూడా ప్రచురించడంలో విరసం తాత్వికత ఏమిటో ఎడిటర్లైన చలసాని ప్రసాద్, కృష్ణాబాయిలు చెప్పాలి. అలాగే కుటుంబరావు సినిమా వ్యాసాలు రెండు పెద్ద సంపుటాలుగా (14 & 15) వెలువరించారు. సినిమా వ్యాసాలకి, విరసానికి సంబంధం ఏమిటో?!

ఒక రచయిత తన అభిప్రాయాలు మార్చుకోవచ్చు (గుడిపాటి చలం). లేదా.. ఎన్నో విషయాల్లో డెమాక్రటిక్ గా ఉంటూ స్త్రీ పురుష సంబంధాల గూర్చి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చెయ్యవచ్చు (శ్రీశ్రీ 'అనంతం'). అది ఆ వ్యక్తి ఇష్టం. వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ శ్రీశ్రీ ఒక శతకం రాస్తే.. ఆ శతకం ఒక్కదాన్నే తితిదే (TTD) వారు ప్రచురిస్తారు. మనవాడేలే అంటూ మహాప్రస్థాన కవితల్ని కూడా ప్రచురించరు. ఎందుకంటే తితిదేకి ఒక స్పష్టమైన, నిర్దేశిత లక్ష్యం ఉంది. అది విశాలాంధ్ర పబ్లిషర్స్ కి కూడా ఉంది. దురదృష్టవశాత్తు విరసంకి లేదు.

విరసం తన సభ్యులైతే చాలు. వాళ్ళు రాసిన 'అన్ని రకాల' రచనల్ని సమగ్ర సంపుటాలుగా ప్రచురిస్తుంది. అదేమంటే.. ఒక రచయిత గూర్చి చదివే వాళ్లకి పూర్తి అవగాహన కావాలంటుంది. కుటుంబరావు గూర్చి పూరా అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమం విరసానికి ఎందుకు? 'పూర్తిగా' తమవాడిగా చేసుకోవలసిన అవసరం ఏమిటి? ఆ పని చెయ్యడానికి మనసు ఫౌండేషన్, ఇంకా అనేక ట్రస్టులు ఉన్నాయిగా!

ఒక వ్యక్తి రాసిన అనేక వేల పేజీల్లో తమ సంస్థ లక్ష్యాలకి అనుగుణంగా ఉన్న సాహిత్యాన్ని మాత్రమే ప్రచురించుకోగల నిర్మొహమాటత, నిక్కచ్చితనం ఉండగలగడం ఆ రచయితల సంఘం ప్రాధమిక కర్తవ్యం. ఇక్కడ వ్యక్తిగత అభిమానాలకి తావుండరాదు. ఈ విషయాన్ని రంగనాయకమ్మ తన వ్యాసంలో చక్కగా వివరించారు. అందుకు రంగనాయకమ్మని అభినందిస్తున్నాను.

చూద్దాం.. చలసాని, కృష్ణాబాయి రంగనాయకమ్మకి ఎలా రియాక్ట్ అవుతారో!


(photos courtesy : Google)

51 comments:

  1. అన్నివర్గాల చదువరులను కుటుంబరావు సాహిత్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం అనుకోవచ్చును కదా. చలం అభిప్రాయాలు మార్చుకున్నంత మాత్రాన, చలం అభిమానులు మార్చుకోలేదే . అలాగే ఆయన లో ని మార్పును కూడా చదవడం చదువరులకు ముఖ్యం. ఆ విధం గా ఒక వ్యక్తీ పూర్తిగా తెలియడం లో ఇబ్బంది ఉండకూడదు. సంస్థలు లానే, ఒక రచయిత అన్ని పుస్తకాలు ఒకే విధమైన లక్ష్యాలను కలిగి ఉంటాయని నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. Mauli గారు,

      >>సంస్థలు లానే, ఒక రచయిత అన్ని పుస్తకాలు ఒకే విధమైన లక్ష్యాలను కలిగి ఉంటాయని నా అభిప్రాయం.<<

      అలా ఉండనప్పుడే సమస్య. ఉదా. చలం, కొకు, శ్రీశ్రీ!

      Delete
    2. మొదట్లో నేను చలాన్ని ఒక స్త్రీవాది అనుకున్నాను. కానీ ఆయన జీవిత చరిత్ర చదివిన తరువాత ఆయన స్త్రీవాది కాదనే అనిపించింది. చలం తన భార్య ఉండగానే తన వదినగారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్య ఉండగా ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకోవడాన్ని ఎక్కడా స్త్రీవాదం అనరు. మరి స్త్రీవాదాన్ని వ్యతిరేకించేవాళ్ళు కూడా చలాన్ని ఎందుకు తిడుతున్నారు అనే సందేహం రావచ్చు. ఆయన వ్రాసిన మైదానం నవల చదివి తమ కుటుంబాలకి చెందిన స్త్రీలు కూడా లేచిపోతారని వాళ్ళ భయం కావచ్చు. అభిప్రాయాలు మార్చుకోవడం విషయం అంటారా, రమణ మహర్షి ఆశ్రమంలో చేరకముందు కూడా ఆయన గొప్ప భౌతికవాది కాదు. ఆయన తన చిన్నప్పుడు అంటరానితనాన్ని పాటించాడు కానీ పెద్దైన తరువాత ఆయన దళితులతో కలిసి ఆవు మాంసం తిన్నాడు. ఆయనలో వచ్చిన గొప్ప మార్పు అదొక్కటే. ఆయన నాడీ జాతకాలని కూడా నమ్మేవాడు. అలాంటి వ్యక్తి తన సాహిత్యాన్ని రమణ మహర్షి పాదాలకి అర్పించడం విచిత్రం కాదు.

      Delete
  2. మీ అభిప్రాయం బాగానే ఉంది. కానీ నాకు మాత్రం రచయిత సమగ్ర సాహిత్యం అన్నప్పుడు ఆ రచయిత రాసిన అన్నింటిని ప్రచురించడమే సబబు అనిపిస్తోంది

    ReplyDelete
    Replies
    1. buddha murali గారు,

      అవును. మీ అభిప్రాయమే నాది కూడా. అందుకే మనసు ఫౌండేషన్ (రాయుడు) వారిని అభినందించాను.

      అయితే విరసంకి ఆ అవసరం ఉందా? లేదనుకుంటున్నాను.

      Delete
  3. బాగుంది, కానీ అందరూ ఆవిడని కాలక్షేపం కోసం తిట్టరేమో, విమర్శ అన్నది ఎప్పుడు బాగుంటుంది అంటే నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు, కాదన్నవాడు అమెరికా తొత్తు అన్నప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు ఓ భూత వైద్యుడు, అసలు వైద్యం అంటేనే భూత వైద్యం, జలుబు శాకినీ దెయ్యం వలన వస్తుంది, దగ్గు ఢాకినీ దెయ్యం వలన, ఇలా ఓ మాంచి భుత పుస్తకం రాసి జనాలమీదకి వదిలి, అసలు ఇంగ్లీషు వైద్యం కేవలం పెట్టుబడిదారులు కుట్ర అని నానా గొడవా చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది? రోజూ దాని గురించి పేపర్లో సమీక్షలు, బ్లాగుల్లో పొగడ్తలు ఇలా విసిగిస్తే మా చెడ్డ చిరాకు వస్తుందా రాదా?

    రంగనాయకమ్మ గారిని (గారు అనకపోతే అదో గొడవ) చూస్తే నాకూ ఇదే ఫీలింగ్, తెలిసింది ఏదీ లేదు, సతికింది ఎదో నాలుగు 18వ శతాబ్ధం పుస్తకాలు, ఇక అవి పట్టుకొనీ ప్రతి ఎకనమిక్ సమస్యకీ కారణం ఎదో అని ఊదరగొట్టుడు, తీరా చూస్తే అవేమైనా పనికొచ్చేవా అంటే ఎక్కువ శాతం, పైన చెప్పినట్టు భూత వైద్యంలాగా, పైగా నోటికొచ్చినట్టు తిట్లూనూ, పైగా ఈవిడేమో చిన్నపిల్లలకి ఆర్ధిక శాస్త్రం పుస్తకం అని ఒకానొక ఆణిముత్యం వ్రాసి తరించిన గొప్ప మేధావి, మిగతావాళ్ళందరూ బుఱ్ఱలేనోళ్ళూ.

    చాలా విసుగ్గా ఉంటుంది మాష్టారు, సహేతుకంగా ఉంటే పర్లేదు, కానీ ప్రతి సమస్యకి సింపుల్ సొల్యూషన్ ఉన్నా, కేవలం కంపెనీల కుట్రల వలనే అన్ని సమస్యల మూలం అని, ఎదో చెత్త రాస్తే ఎట్లా?

    నా వ్యాఖ్య టపాకి రిలేటెడ్ కాదు, కానీ మేడం అంటే మా చెడ్డ చిరాకు కలగడం అన్నది మాత్రం (కొందరికైనా) సహేతుకమైనదే అని చెప్పడానికే నా కామెంట్.

    (నా వ్యాఖ్యలో చెప్పిన రం.నా. గారి పుస్తకం కేవలం ఆవిడ, ఆవిడకి తెలిసినవారి ఊహలు, కలలు, కల్పనలు తప్ప ఆర్ధిక శాస్త్రం మాత్రం కాదు, చేతబడి, బాణామతి, కాష్మోరా, .... ఇలాంటి వాటిల్లో దీన్ని కుడా చేర్చి యండమూరి ఓ నవల రాయొచ్చు, హోమియోపతి నిజమైన వైద్యం అని నమ్మే వారు ఉన్నారు, అలానే ఆ పుస్తకం నిజమైన ఆర్ధిక శాస్త్రం అని వాదించే వారున్నారు. )

    ReplyDelete
    Replies
    1. తార గారు,

      మీ వ్యాఖ్య చదివిన తరవాత నాకు అర్ధమైనదేమనగా.. మీకు రంగనాయకమ్మ అంటే చిరాకు. నా సలహా ఏమంటే..మీరు అసలు రంగనాయకమ్మని పట్టించుకోకండి. హాయిగా ఉండండి. (నచ్చకపోతే నేను చేసేదదే!)

      మా తరం (50+) వారిలో రంగనాయకమ్మ రాసిన కాల్పనిక సాహిత్యానికి పెద్ద పంఖాలే ఉన్నారు. కూలిన గోడలు, అంధకారంలో , బలిపీఠం, జానకి విముక్తి, స్వీట్ హోం.. ఇట్లా చాలా రచనలు.

      ఆ రోజుల్లో తెలుగులో యద్దనపూడి, కౌసల్యాదేవి.. తరవాత కాలంలో యండమూరి, మల్లాది వంటివారు రాసిన చెత్తకుప్పలు ఎక్కువగా ఉండేవి. ఒక సమస్యని తీసుకుని కథగా రాసేవారు తక్కువ. రంగనాయకమ్మది సీరియస్ సాహిత్యం. రచయిత్రులలో రంగనాయకమ్మలా సీరియస్ సాహిత్యాన్ని సృష్టించిన పేరు ఇంకోటి గుర్తుకు రావడం లేదు.

      అయితే ఆమె 'రామాయణ విషవృక్షం' రాసి.. హిందూత్వ వాదులకి శత్రువుగా మారింది. (నాకు తెలిసి రంగనాయకమ్మని విమర్శించే వారికి ఇదే ముఖ్య కారణం. అందుకే ఆవిడ ఒక స్త్రీ.. అందునా వృద్ధురాలు అని కూడా గమనంలోకి తీసుకోకుండా బ్లాగుల్లో ఆవిడని చాలా వ్యక్తిగతంగా, హీనంగా తిడుతుంటారు.)

      రగనాయకమ్మ పొలిటికల్ థాట్, ఆర్ధిక సూత్రాల భాష్యాలు (ఆవిడకీ మధ్య ఛాదస్తం ఎక్కువయ్యింది. నాక్కూడా కొన్ని నచ్చవు) ఇష్టం లేకపోతే ఆవిడని అసలు పట్టించుకోవలసిన అవసరం లేదు. హాయిగా చెత్తబుట్టలో పడెయ్యొచ్చు. అది మంచిది కూడానూ. ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి ఇష్టం వారిది. ఎవరికైనా అభ్యంతరం ఎందుకుంటుంది!?

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. @Anonymous (08:36),

      రంగనాయకమ్మని బూతులు తిట్టుకోవడం కోసమే తెలుగులో కొన్ని బ్లాగులు ఉన్నాయి. మీకు అన్ని గొప్ప వేదికలుండగా.. నా బ్లాగులో కూడా ఆ 'తిట్టే హక్కు' కోసం పోరాడనేల!

      రంగనాయకమ్మ కొడవటిగంటి తాత్విక కోణాన్ని విమర్శించింది. నేను ఆ పుస్తకం 'విరసం' ప్రచురించడాన్ని తప్పు పడుతున్నాను. ఈ టపా సబ్జక్ట్ ఇది. ఈ టాపిక్ పై మీకేమన్నా అభిప్రాయాలుంటే రాయండి. చర్చించుకోవచ్చు.

      Delete
    4. వ్యాఖ్య టపా పరిధిలోనిది కాదు ఐనా చెప్తా..

      ఒక్క రంగనాయకమ్మగారు అంటేనే చిరాకు కాదు.
      మన సమాజంలో అసలు ఎంతమందికి వ్యపారస్తుడు అంటే మోసగాడు, దోపిడీదారుడు అన్న నమ్మకం లేదు? చిన్నప్పటి నుండీ చూస్తున్నా ఏ తెలుగు పేపర్ చూసినా ఇదే గొడవ అమెరికావాడు వస్తాడు, లంచాలిస్తాడు దోచేసుకుపోతాడు, పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు నాకు పదేళ్ళు కుడా లేవు (దిగేటప్పటికి కుడా లేవులేండి), కానీ ఇప్పటికీ నాకు ఈనాడులో శ్రీధర్ వేసిన కార్టూన్లు గుర్తే, అమెరికా పాము వచ్చి మనందరినీ తినేస్తున్నట్టు, మనం బానిసలమైపోతున్నట్టు, ఆ నిర్ణయమే తీసుకోకపోతే ఇప్పుడు భారతదేశంలో మనుషులని మనుషులు పీక్కుతినే పరిస్థితి ఉండేది, కంప్యూటరైజేషన్ అప్పుడూ ఇదే గొడవ, మనుషులని తీసేసి కంప్యూటర్లని పెట్టి పనులు చేయిస్తారు అని వామపక్షాలు ఒకటే గొడవ, ఇలా అయ్యిన దానికీ కాని దానికీ ఈ విష ప్రచారేల? నాకు అవన్ని నిజాలు కాదు వ్యపారం తప్పు కాదు, అలానే "ఎర్ర" సినిమాల్లో చూపిచ్చినట్టు దేశం అంత ఘోరంగా లేదు అని తెలుసుకోవడానికి దాదపు ఇరవై ఏళ్ళు పట్టింది, అప్పటి వరకు నేను అబద్దాలనే నిజమని నమ్మాను, ఇంకా అదే ప్రచారం పేపర్లలో ఇంకో తరం కుడా ఇలానే విషప్రచారంలో మగ్గుతారా అన్న భయం ఒకటి, కమ్యూనిష్ట్లు ఐన, శివసేన ఐన, ఇదే ప్రచారం దోపిడీ..(ఊహ తెలియని వయసులోనే ఎంతో ఇంఫ్లూయంస్ చేశాయి అంటే, తరువాత తరువాత కుడా నమ్మితే ఇంకో నక్సలైట్ అయ్యేవాడ్నేమో)

      ఇక ఇంకో వైపు, ఇంటర్లో "థీరీ ఆఫ్ రెలెటివిటీ" అన్నది మన వేదాల్లోనే ఉన్నది, అణుబాంబు తయారు చేసే పద్దతి కూడా, ఐన్‌స్టీన్ కేవలం తర్జుమా చేశాడు, మన ఋషులేమో దాని చెడ్డ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని బయటకి తెలియనివ్వలేదు అని, ఇదీ నిజమే అని నమ్మితిని..

      ఇవా మనం తరువాతి తరాలకి ఇచ్చేది అనేది చిరాకే, ఇవి చిన్న విషయాలు కాదు, ఐ.ఐ.టీల్లో కుడా వాస్తు ప్రకారం బిల్డింగులు కడతారు, ఎన్ని సార్లో ఇలా పిచ్చి పిచ్చి డిజాన్లలోపాలతో బిల్డింగులు పడగొట్టి మళ్ళీ కట్టారు, "ల్యాబులు వాస్తు ప్రకారం" కడతారా? వాటికి సశాస్త్రీయమైన డిజైన్లు ఉండగా, ఏమిటీ పిచ్చి అని మా చెడ్డ చిరాకు.

      ఇక ఫైనల్గా ఇంకో రకం చిరాకు తెప్పించే వాళ్ళు సైన్సు రచయితలు, అది సైన్సో అర్ధం కాదు, రచయిత పైత్యమో అర్ధం కాదు, పైగా పేరుకే సైన్సు లోపల మొత్తం పనికిమాలిన చెత్త, బోల్డు తప్పులు, అవి చెబుతూ మెయిల్ చేస్తే జవాబులు ఉండవు, లేదా "తత్వం" బోధపడలేదు అని ఏదో హెగెల్ పుస్తకాలు చదవమని ఉచిత సలహా..

      వీళ్ళందరికన్నా వీళ్ళ భజన బృందాలు అంటే మా చెడ్డ చిరాకు, రం.నా. గారు అనలేదని ఒకరు నానా గొడవ చేశారు ఒకప్పుడు, ఇంతా చేస్తా అతను ఈవిడ్ని తప్ప ఎవర్రినీ గారు అని పిలవరాయే, బ్లాగుల్లోనే ఎక్కడో చదివాను కొ.కు గారు సైన్సుకీ, సాహిత్యానికీ మారు పేరు అట, కొ. రో. ప్రసాద్ గారేమో సైన్సుకీ, సాహిత్యానికీ, సంగీతానికీ మారు పేరట, ఈయన ఎవరో బ్లాగుల్లోకి రాకముందు నాకు తెలియదు, పైగా తన సైన్సు రచనలు కనీస స్థాయిలో కుడా లేవు, (అసలు కొ.కు. సైన్సు రచనలు చేశారా?), కానీ వీరే మనకి ఆదర్శ పురుషులు, గొప్ప రచయితలు అని ఒకటే ప్రచారం, (మళ్ళీ వీళ్ళకే కలాం, డెబ్రూ, .. మాత్రం మూర్ఖులు)

      నిజంగా చెప్పాలి అంటే మనం టెక్నాలెజీలో కనీసం 150 ఏళ్ళు వెనకాల ఉన్నం (చైనాతో పోల్చుకున్నా), అది మాత్రం ఎవ్వడూ చెప్పడు, ఏమైనా అంటే భారతీయులు ఇంత గ్రేట్ అంత గ్రేట్ అని తప్ప, ఇవన్నీ ఇగ్నోర్ చెయ్యడం తప్ప మరొక ఉత్తమమైన మార్గం లేదు, కానీ కొన్ని సార్లు మహా విసుగొస్తుంది, కానీ ఏమి చేస్తాం, ఇదిగో మీలాగా వినేవాళ్ళు ఉంటే చెప్పుకోవడం తప్ప.

      Delete
    5. తార గారు, మనదేశం వదిలెయ్యండి. అమెరికా వలన కాని, వారితో స్నేహం వలన కాని నష్ట పోతున్న, తప్పు దారి పడుతున్న దేశం ఏదయినా ఉందా మీ దృష్టి లో ?

      Delete
    6. Mauliji,

      That is very vague question and needs huge expertise in foreign relations to answer your question. Relations with other country will create huge impact from Economic to Cultural affairs, so, (except for non Economic relations), I believe it should be left to individual. Some say westernized costumes are not good for Indians, and asks me to use dhothi, I may not agree, here my comfort is important. (But here effects are always relative)

      But if you say some thing like Walmart into India, that is very wide topic, but at the same time that can be answered very precisely, upto given precision due to development of Economic theory, no one is using that people are simply going by their BC dated manifestos.

      >>నష్ట పోతున్న, తప్పు దారి పడుతున్న దేశం

      A response from my friend, such an impact is less (or can be neutralized) in Democratic countries, since after some point of time local factors influence power more than the American relations,so if a country is on loosing side due to American influence, the opposition will naturally encash that.

      Delete
    7. రంగనాయకమ్మ లాంటి వారిపై, తార గారి వ్యాఖ్య సూపర్బ్‌గా వుంది. రమణగారికి ఖచ్చితమైన ఎజెండా వుంది. తమ కమ్యూనిస్టులు రాసిన ఏచెత్తనైనా ఆస్వాదించే విశాలహృదయం వుంది.

      Delete
    8. @Anonymous (16:30),

      తారా గారి వ్యాఖ్య సూపర్బ్ గానే ఉంది.

      మీ వ్యాఖ్య మాత్రం అర్ధం కాకుండా ఉంది!

      Delete
    9. అర్థం కానట్టు బాగా నటిస్తున్నారు. ఓ మారు నన్ను మద్రాసులో కలవండి, అరవ సినిమాలో ఎగస్ట్రా వేషం ఇప్పిస్తాను.

      Delete
    10. ఓ! ఇప్పటిదాకా నేను మాట్లాడింది జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ తోనా!

      Delete
    11. తార గారు,


      @if a country is on loosing side due to American influence, the opposition will naturally encash that.


      కరెక్ట్ గా చెప్పారు. మరి ప్రతిపక్షం ఇలాంటి పరిస్థితిని వివాదం చెయ్యడం మంచిదే అయినపుడు విమర్శించడం ఎందుకు?

      Delete
    12. ఇది అప్పుడే రాద్దామనుకున్నాను కానీ ఇప్పటికి సమయం కుదిరింది.

      రమణగారు,

      బ్లాగుల్లో తిట్లూ, పొగడ్తలు రెండూ సమాన హీనంగానే ఉంటాయి, విషవృక్షం చదివి నవ్వుకోవచ్చు, చిరాకుపడవచ్చు, అలానే రామాయణం ఐనా అంటే, చాలామందికి రామాయణం చదవడమే ఓ గొప్ప కార్యం, నాకేమో అదో సోది పని, నాకు రామాయణం ఎక్కడా గొప్పగా అనిపించదు, ఎదో సోది సూపర్ మ్యాన్ కధలా ఉంటుంది, దానికి రామాయణం చదవడం ఎందుకు హీ మ్యాన్ కార్టూన్లు చూడొచ్చుగా రెండిటికీ తేడా ఏంటో అర్ధం కాదు. రాముడూ దేవుడు అని నాకనిపించదు, కానీ రామాయణం ఒక కావ్యంగా గొప్పదేమో, అది నాకు తెలియదు, అది తెలియజెప్పేట్టు ఎవరైనా విడమర్చి చెబితే అప్పుడు రామాయణం చదవడం ఇష్టంగా ఉంటుంది, కాస్త అర్ధం అవుతుంది, అలా కాకుండా రాముడు దేవుడు, రామాయణ పారాయణ వలన పుణ్యం వస్తుంది అంటే నాకంత పుణ్యం అక్కర్లేదు.
      అలానే మన రచయితలు, రంగనాయకమ్మనే తీసుకుంటే, ఏదో పుస్తకాలు వ్రాసుకున్నారు, నేను కొన్ని చదివాను అవి నిస్సందేహంగా పరమ చెత్త, కోందరు భజనపరులు వాటిని తెచ్చి ఆర్ధిక రంగంలో మరొక అంకం అన్నట్టు ప్రచారం చేస్తుంటే, రంగనాయకమ్మ అంటే చిరాకు పెరుగుతుంది తప్ప, తగ్గదు, అలా కాకుండా ఆవిడ రచనలు పార్షియాలిటీ లేకుండా పరిచయం చెయ్యంది, మీకు ఎందుకు నచ్చాయో వ్రాయండి అప్పుడు మాలాంటి వాళ్ళకి కాస్త ఐన గౌరవం పెరుగుతుంది మన తెలుగు రచయితలు అంటే, అప్పటివరకు (ఇప్పుడు కుడా) నాలాంటి వాళ్ళు (కనీసం నేను) మన (తెలుగు) రచయితలకి మెడమీద తలలేదనే అనుకుంటాను.

      మీ అభిప్రాయం రాయడానికి భయపడనవసరం లేదు, పైగా పాఠకులు ఆదరిస్తారు అనే నమ్మకం కుడా ఉన్నది, ఎటొచ్చి అలా నిజాయితీగా చెప్పేవారే నాకు కనపడరు, అంతెందుకు, ఇదే మాట నేను వేణువుబ్లాగులో చెప్పాను, అసలు నువ్వు ఎన్ని రం.గ. రచనలు చదివావు, చదవకుండా విమర్శించే హక్కు నీకు లేదు అన్నవారే తప్ప, ఒక్కడు నేను చెప్పింది విన్నదీ లేదు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించిందీ లేదు. సాహిత్యం వేరు, సైన్సు వేరు, రెండిటి మధ్య సున్నితమైన లైను కాదు పెద్ద అగాధమే ఉన్నది, బుర్ర మోకాల్లో ఉంటుంది అని రం.గ. ఓ మార్స్కిస్టు కోణంలో వైద్య గ్రంధం రాసినా ఆహా, ఓహో అని పొగిడేవాళ్ళు, అది తప్పు అంటే ఆవిడ ఏమిరాసిందో చదవకుండా తప్పు అని ఎలా వాదిస్తున్నావు అని మీదడిపోయే జనాలు చాలా మంది ఉన్నారు, అంతే తప్ప, నిష్పక్షపాతంగా ఆవిడరచనలు నాకు ఇందుకు బాగుంటాయి, ఈ ప్రయోగాలు కొత్తగా ఉన్నాయి, ఇలా రాసినోడు నాకు ఇంతవరకూ కనపడలేదు, ఆవిడ తుమ్మినా దగ్గినా అద్భుత కావ్యం అనేవాళ్ళు, లేదా పెద్ద పాపం అని తిట్టేవాళ్ళు తప్ప, (ఆవిడ రచనల మీద విమర్శ అని బోల్డు మంది రాశారు, కానీ అవన్నీ రామాయణాన్ని పొగడటమో లేదా ఆవిడ్ని తిట్టడనికే పరిమితం). ప్రత్యేకించి ఈవిడ అనే కాదు, ఏ రచయిత గురించి ఇలాంటి పరిచయం నాకైతే కనపడదు, కమ్యూనిష్ట్లు మాత్రం కనపడిన ప్రతి కమ్యూనిష్ట్‌నీ మహా కవి అని పొగుడుకోవడం తప్ప, అసలు మహా కవి అన్నది ఎలా జస్టిఫై చేస్తారు అన్నది ఎక్కడా రాయరు,

      మీరు మీ అభిప్రాయం రాయండి, కనీసం నాలాంటివాడు ఐనా ఆనందిస్తాడు

      @ మౌళీగారు,

      మీ కామెంటు నాకు అర్ధం కాలేదు,

      Delete
    13. తార గారు,

      చాలా పెద్ద కామెంటే రాశారు. నాకర్ధమైనంత మేరకు.. మీకు రచయితల భజనపరుల పట్ల చికాకు. నాకూ అంతే! శంకరాచార్యులవారి పీఠాల వలే తెలుగు రచయితల్లో పీఠాధిపతులున్నారు. వారికి నమ్మిన బంట్లు, భజనపరులు కూడా ఉన్నారు. ఈ సంగతి గురజాడ గూర్చి రాసేప్పుడు నేను ప్రస్తావించాను.

      నా అంచనా.. ఒక రచయితని విమర్శించేవారి కన్నా ఈ భక్త బృందం (ఆ రచయితకి) ప్రమాదకారులు. అయితే ప్రస్తుతం మన చేతిలో ఏదీ లేదు. నచ్చింది చదువుకోడం.. నచ్చకపొతే చెత్త బుట్టలో పడెయ్యడం తప్ప. అసలు మనకి ఆ రచనలే నచ్చనప్పుడు.. ఆ రచయిత భజనపరుల భక్తి ప్రయాసల గూర్చి మనకేల?

      ఇక రంగనాయకమ్మ విశిష్టత గూర్చి ఎవరి అంచనాలు వారివి. ఆవిడ చాలా వివాదాస్పద రచనలు చేశారు. అందువల్ల సహజంగానే ఆవిడని అభిమానించేవారు, విమర్శించేవారు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. నాకు తెలిసి ఈ గొడవ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది.

      నేను రంగనాయకమ్మ గూర్చి రాయడానికి భయపడలేదు. కాకపొతే ఆవిడని విమర్శించే పేరుతొ తెలుగు బ్లాగుల్లో కొనసాగుతున్న బూతుల దండకం నన్ను ఆశ్చర్యపరిచింది. భయపెట్టింది. రంగనాయకమ్మ రచనలని విమర్శించే హక్కు మనందరికీ ఉంది. అయితే ఏ రచయితనైనా వ్యక్తిగతంగా తిట్టటం సరికాదు.

      నేను రంగనాయకమ్మ అభిమానిగా మీరు పొరబడినట్లు తోస్తుంది. నేను ఎవరికీ అభిమానిని కానని మనవి చేసుకుంటున్నాను. నాకు ఒక రచయిత కొన్ని రచనల / భావాల మేరకు నచ్చుతాడు. అదే రచయిత ఇంకొన్ని రచనల్లో అస్సలు నచ్చడు. పైగా చిరాకు పెడతాడు. (ఒక హోటల్లో అన్ని పదార్ధాలు ఒకేలా ఉండవు). ఉదా.. కుటుంబరావు, చలం, శ్రీశ్రీ.

      అయితే చలసాని ప్రసాద్, కృష్ణాబాయి వంటి వారికి ఒక రచయిత రాసుకున్న వెచ్చాల ఖర్చు, చాకలి పద్దులు కూడా 'సమగ్ర సాహిత్యం' పేరుతొ ప్రచురించే మోజు / వ్యామోహం పట్టుకుంది. ఆ రకంగా కొందరు 'గొప్ప' రచయితలు రాసిన 'చెత్త'ని కూడా చేర్చి / పేర్చి.. ప్రచురిస్తున్నారు!

      ఈ బ్లాగుకి సంబంధించినంత మటుకు.. కుటుంబరావు రచనల విషయంలో 'విరసం'పై రంగనాయకమ్మ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అంతే! రంగనాయకమ్మ రచనల్లో నాకు నచ్చని అభిప్రాయాలు కూడా చాలానే ఉన్నాయి. రంగనాయకమ్మ అన్ని అభిప్రాయాలు, రచనల్ని ఫాలో అయ్యి.. వాటి గుణగణాల్ని బేరీజు వేసేందుకు నాకు సమయం / ఓపిక / దక్షత లేదు. నాకంత అవసరమూ కనిపించడం లేదు. ఆవిడ గోల ఆవిడది. నా గోల నాది.

      Delete
    14. రమణగారు,

      నా వ్యాఖ్య మీకు అర్ధం ఐనట్టు లేదు, నేను వ్రాసింది
      >>>>>>>>>
      రంగనాయకమ్మ, తెలంగాణా వంటి అంశాలపై రాయడానికి మనవంటివారు సందేహించేట్లు / భయపడేట్లు చెయ్యడం కొందరి బ్లాగర్ల తెలివైన ఎత్తుగడగా భావిస్తున్నాను. అందుకే అలా అసభ్యంగా, అతి వ్యంగ్యంగా, వెటకారంగా వ్యాఖ్యలు రాస్తుంటారు. ఇదంతా కావాలనే జరుగుతున్న కార్యక్రమం.

      బ్లాగింగ్ ఒక హాబీగా.. అభిప్రాయాలు రాసుకునే మనవంటివారిని భయపడేట్లు చెయ్యడంలో మన తెలుగు బ్లాగర్లు గొప్ప విజయం సాధించారనే అనుకుంటున్నాను. కొందరు రాయడం మానేశారు. అందుకే నాకు కొన్ని అభిప్రాయాలు
      >>>>>>>>>>>>>

      దీనికి జవాబుగా, అది ఎక్కడ ఉన్నదో నిన్న కనపడలేదు.
      ఇంతకుముందు కుడా మీరొకసారి అన్నారు, రంగనాయకమ్మగారి గురించి వ్రాయాలి అంటే అజ్ఞాతలు భయపెడుతున్నారు అని, రెండిటికీ కలిపి చెబుతున్నాను, ఒక విధంగా భజన చేసేవాళ్ళు ఎక్కువ ఐపోవడం మూలన(లేదా వారి గోంతే ఎక్కువగా వినపట్టం) ప్రతి చెత్తా తెచ్చి గొప్ప అనడం, ఎందుకు గొప్పా అని ప్రశ్నించినవాడి గొంతు నొక్కేయ్యడం ( ఎందుకు గొప్ప అని అడగటం అన్నది తిట్టు కాదు, నిజంగా తెలియక అడిగేవాళ్ళు కుడా ఉంటారు), మన సాహిత్యం అన్నది ప్రజలకు చాలా దూరం ఐపోతున్నదేమో అని నా భావన (ఇది రంగనాయకమ్మ రచనలే కాదు, రామాయణ భాగవతాలకీ వర్తిస్తుంది) ఇది క్లుప్తంగా నేను పైన చెప్పాలనుకున్నది.

      ఇక రంగనాయకమ్మ రచనల్లో మీకు నచ్చినవి, అవి ఎందుకు నచ్చినవో చెబితే కాస్త మాకు అర్ధం అవుతుంది, చలం గొప్ప అంటారు, నాకు చలం రచనలకి టింటో బ్రాస్ సినిమాలకి తేడా అర్ధం కాదు, కానీ చలం అంటే చాలా మందికి ఒక ఐకాన్, ఎందుకురా అంటే స్త్రీవాదం అని మొదలెడతారు, అది నాకోముక్కా అర్ధం కాదు, విశ్వనాధ అనగానే కుల దురహంకారి అని మొదలెడతారు, ఇక రం.నా తిట్టేవాళ్ళు రివర్సు, అలా కాకుండా సరైన పరిచయం, విమర్శ అన్నది దొరకడం కష్టం ఐపోతున్నది, అవి లేకుండా సాహిత్యం బ్రతకడం కష్టమేమో,

      ఇక మీరు రం.నా. అభిమానో కాదో నాకు తెలియదు నేను పట్టించుకోలేదు, భజన బృందాల గురించి చెప్పింది, నాకు చిరాకు అనేదానికన్నా వారి వలన అసలు ఆ సదరు రచయిత గొప్పతనం ఏమిటో నాలాంటి వాళ్ళకి అర్ధం కావడం లేదు మీరు మీకు సమయమున్నప్పుడు ఏదైనా పుస్తక పరిచయాలు వ్రాయండి అది చాలా అవసరం, అని చెప్పాలనుకున్నాను.

      Delete
    15. తార గారు ,

      నేనయితే చలం వి ఒక రెండు మూడు రచనలు చదివిన గుర్తు, రంగనాయకమ్మవి ఆ మాత్రం కూడా చదవలేదు, ఎలాంటి వ్యక్తీ అనే దానిపై కొంత అవగాహన ఉంది . కాని ఇక్కడ ఆవిడ పైన చిమ్మే విషం అవతలి వ్యక్తులు ఎలాంటి వారు అన్నదికూడా అవగాహనకు తెస్తుంది. ఎక్కడో ఒక బ్లాగులో మీకు చదివి రమ్మని సలహా ఇచ్చారన్నారు. కాని చదివినా మీ అభిమతంలో మార్పు రాదు. నేను సిరివెన్నెల అభిమానిని కాదు కాని ఆయన మాటల్లో ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నాను. చాలా మంది మీలాంటి ఔత్సాహికులు ఆయన మాటలు వినడానికి వెళ్తే ఆయన అన్నది 'మీకు తెలిసింది అయితేనే మీకు చెప్పగలను, మీకు తెలియంది యెంత చెప్పినా మీకు అర్ధం కాదు అని.'

      ఈ మాట మీకు రంగనాయకమ్మ గారి విషయంలో ఖచ్చితంగా వర్తిస్తుంది అని భావిస్తున్నాను.ఒక రచన చదవడానికి ఒక రచయిత గొప్పదనం అర్ధం అవడం అనే భావన వల్ల జరగదు అని నాఅనుకొలు. మీకు ఆవిడ భావాలు అర్ధం చేసికొనే అవసరం లేకపోతె వదిలెయ్యండి.కడుపు నిండిన వ్యక్తికి ఆకలిగురించి అర్ధం అయ్యేలా చెప్పడం కష్టం. అలాగని అది ఆ వ్యక్తి లోపం కానవసరం లేదు. ఇందుకోసం శ్రమపడి మీరు ఆవిడని ఖండిన్చనవసరం లేదు. ఏమి తెలియకుండానే, ఆమె పేరును మీరు వివిధరకాలుగా పలుకడం బాగోదు.

      Delete
    16. మౌళీగారు,

      మీరు మళ్ళీ ఎక్కడైనా సరే నా కామెంట్‌కి/టపాకి జవాబు/కామెంట్ ఇస్తే మర్యాదగా ఉండదు.

      సెలవు.

      Delete
    17. తార గారు,

      ha ha yekkadainaa naa !!! meeru naaku kanipinchede rendu blogs lo. maryaadagaa undadaa, yem chestarenti.


      />>>>>>>>>
      రంగనాయకమ్మ, తెలంగాణా వంటి అంశాలపై రాయడానికి మనవంటివారు సందేహించేట్లు / భయపడేట్లు చెయ్యడం కొందరి బ్లాగర్ల తెలివైన ఎత్తుగడగా భావిస్తున్నాను. అందుకే అలా అసభ్యంగా, అతి వ్యంగ్యంగా, వెటకారంగా వ్యాఖ్యలు రాస్తుంటారు. ఇదంతా కావాలనే జరుగుతున్న కార్యక్రమం.

      బ్లాగింగ్ ఒక హాబీగా.. అభిప్రాయాలు రాసుకునే మనవంటివారిని భయపడేట్లు చెయ్యడంలో మన తెలుగు బ్లాగర్లు గొప్ప విజయం సాధించారనే అనుకుంటున్నాను. కొందరు రాయడం మానేశారు. అందుకే నాకు కొన్ని అభిప్రాయాలు
      /


      idi Ramana gaaru vraasindi mee gurinchi kaadu...kaani meerenduku bhujaalu tadumukonnaaro???

      alaage ranganaayakamma gaari gurinchi naa vyaakhya lo mimmalni vyaktigatam gaa ayite nenem matlaadaledu.


      yedemainaa ranganaayakamma gurinchi kaani, inke itara mahilala gurinchi kaani ishtam vachchina reetigaa matlaadite ikapai kudaradu. naaku bedirinche alavaatu ledandee, kaani satyam idi.

      mee kaaments naku kanapadakundaa chusukovadam mee baadhyata, nenu javaabudaaree kaadu :)

      Delete
    18. మౌళీ,

      ఆరోగ్యం సరిగానే ఉన్నదా? ఏమీ లేదు నాకు తెలిసీ ఇలా తలాతోకా లేకుండా మాట్లాడేవాళ్ళు బ్లాగ్లోకంలో ఒకరే ఉన్నట్టు గుర్తు.
      మీకు తెలుగులో చెబితే అర్ధం కానట్టున్నది, ఏ కొరియ భాషలోనో చెప్పాలి, ఐనా నాకు మీ పరిస్థితి మీద మా చెడ్డ అనుమానంగా ఉన్నది, అలాంటివారికి నేను చాలా దూరం సుమీ.

      రమణగారు, సారీ అండి, ఈ కామెంట్స్ ఇక్కడ రాయడం నాకూ ఇష్టంలేదు, ఇదే చివరి కామెంట్

      Delete
    19. TARA

      I am very fine, thanks for the concern. please check yours here.. and if you do not like it, you please ignore.. I do not see the commenter name but just the comment, and respond if required.

      you are free to say what ever you want and where ever you like.

      Delete
    20. This comment has been removed by a blog administrator.

      Delete
  4. పైన పెర్కొన్న వారి సాహిత్యం ఒక్కటీ చదవలేదు ...కాని కొడవగంటి గారి రచనలు చదవాలని మాత్రం ఉంది ఎందుకంటె స్కూల్ లో ఒక పాఠం చదివినట్లు గుర్తు.
    అసలు ఎవరూ ప్రచురించకుండా...అలా చరిత్ర లో కలిసె బదులు ఎవరొ ఒకరు,లేదా అందరూ ప్రచురించడం వల్ల జనాలకి చేరె అవకాశం ఉంది కదా...అలా ఆ రచనలు బతికుండె అవకాశం ఉంది కనుక ....రచయిత సమగ్ర సాహిత్యం అన్నప్పుడు ఆ రచయిత రాసిన అన్నింటిని ప్రచురించడమే సబబు అనిపిస్తోంది....

    ReplyDelete
    Replies
    1. Narasimha గారు,

      కుటుంబారావు సాహిత్యాన్ని తప్పకుండా చదవండి. మధ్యతరగతి సమాజం గూర్చి చాలా సైంటిఫిక్ గా విశ్లేషిస్తూ ఆయన రచనలు చేశారు. సులభ శైలి, క్లుప్తత కుటుంబరావు ప్రత్యేకత.

      Delete
  5. రమణ గారు,

    కుటుంబరావు గారు రాసిన తాత్విక వ్యాసాలు, పేరా సైకాలజికి మీరు ఎందుకు దూరంగా ఉండమట్టున్నారు? అది ఏమైనా ఈ మధ్య కనుగొన్న/అభివృద్ది చెందిన శాస్త్రలకి విరుద్దమా? మీ కోణం కొంచెం వివరంగా రాయగలరా?

    SriRam

    ReplyDelete
    Replies
    1. SriRam గారు,

      మీరు చదివారో లేదో నాకు తెలీదు. నాకు దెయ్యాల గూర్చి రాసే కుటుంబరావు, యండమూరి.. తీసే రాము అన్నా చిరాకు.

      నాకు నచ్చనివాటికి దూరంగా ఉండటం అలవాటు. అందుకనే కొకు మార్క్ తాత్వికతకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నాను.

      మీకు కొకు తాత్విక వ్యాసాలు నచ్చినట్లయితే మంచిదే! అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా!

      Delete
    2. నా దగ్గర ఆయన రాసిన విరసం ప్రచూరించిన తాత్విక వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు రెండు పుస్తకాలు ఉన్నయి. తాత్విక వ్యాసాలు లో కొన్ని చదివాను. ఆయన మార్క్సిస్ట్ కనుక ఆయనకి కలిగిన అనుభవాలను కొత్తవనుకొని వ్యాసాలు రాశాడు. నాకైతే అందులో పెద్ద విశేషం,కొత్త దతనం కనిపించలేదు. తాత్వికత సాహిత్యం తో పోలిస్తే ఆయన రాసిన వాటిలో పెద్ద తాత్వికత ఎమి ఉందండి? ఇక దెయ్యాలు, భూతాలు అంటే నాకు భయంగాని, నమ్మకంగాని ఏటువంటి భావన లేకపోవటం వలన ఆ వ్యాసాలను ప్రత్యేకంగా పట్టించుకోలేదు. అయితే ఆయన రాసిన వ్యాసాలు ఇతరులను నమ్మించటానికి కాకుండా పూర్తిగా ఆయన క్లారిటి కొరకు రాసుకొన్నవి. నమ్మ దగ్గ విషయాలు అని అనిపించింది.

      SriRam

      Delete
    3. SriRam గారు,

      నాకు రచయితల పట్ల లాయల్టీస్ ఉండవు. సాధ్యమైనంతమటుకూ ఒక రచయిత/కవి భజనపరుల నుండి దూరంగా ఉంటుంటాను (ఇందుకు ఒక్క రావిశాస్త్రి మాత్రమే మినహాయింపు).

      విరసం వారు కొకుని ఇరవై సంపుటాలుగా తెస్తున్నామన్నప్పుడు.. కొకు రాసిన దెయ్యాలు, science వ్యాసాలు, సినిమ వ్యాసాలు తెలుగు పాఠకులకి (కనీసం నాకు) శుద్ధ దండగ అని వారికి చెప్పాను. నాకు కొకు కథలు, నవలలు మాత్రమే కావాలనే డిమాండ్ కూడా పెట్టాను. వాళ్ళు పట్టించుకోలేదు. 1+1 ఆఫర్ లా అన్ని సంపుటాల్ని అంటగట్టారు.

      ఈ మధ్య NRI ల చలవతో, అనేక ట్రస్టుల కృషితో ప్రముఖుల సాహిత్యం బాగానే బయటకొస్తుంది. అందుకే ఇంతకుముందు చదవని అనేక కథలు ఇప్పుడు చదవగలుగుతున్నాం. ఇది తెలుగు పాఠకులందరూ సంతోషించదగ్గ విషయం.

      నాకున్న ఓ సమస్య.. రచయితని పూర్తిగా చదవాలని ప్రణాళిక వేసుకుని.. చదవలేకపోవడం.

      మొన్నామధ్య గోపీచంద్ ని పూర్తిగా చదవాలనే పట్టుదలతో ఆయన complete works కొన్నాను. మళ్ళీ ఎప్పుడో చదివిన అసమర్ధుని జీవతయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, గడియపడని తలుపులు చదివాను.. బస్.. ఇంకేం చదవలేదు! ఇదొక రోగం.

      Delete
  6. పూర్తిగా ఏకీభవిస్తాను మీతో.
    కానీ కొ.కు పునర్జన్మ, దెయ్యాల వ్యాసాలు విరసం ప్రచ్రించక పోతే, వాటిని చదివే అవకాశం కోల్పోయే వాడిని. అయితే వాటిని ప్రచ్రించటాన్ని విరసం కాకుండా మరెవరైనా తలకెత్తుకుంటే బాగుండేది. విరసానికి తమ సిధ్ధాంతమే ముఖ్యమైతే, ఒక్కోసారి గొప్ప మార్క్సిస్టులు కూడా ఎలా పొరపడవచ్చో నిరూపిస్తూ, విమర్శితూ (కొకు ని కాదు, ఆ వ్యాసాలలో భావజాలాన్ని, అందులోని వైయక్తికమైన ప్రభావాలని) వాటిని ఉటంకించవచ్చు.
    చలసాని ఇంకా బ్రతికే ఉన్నారా? వాళ్ళ అమ్మాయి అమెరికా లొ ఉందనుకొంటాను. మల్లాది కృ మూ. గారి వ్యాసాలలో చదివినట్లు గుర్తు.

    ReplyDelete
    Replies
    1. బొందలపాటి గారు,

      నాది కూడా మీ అభిప్రాయమే.

      చలసాని ప్రసాద్ నిత్యయవ్వనుడు. ఇప్పటికీ అదే ఉత్సాహం, హుషారు. జ్ఞాపకశక్తి కొద్దిగా తగ్గిందని అంటున్నారు. తెలుగు సాహిత్యాన్ని కోట్ చేస్తూ గలగల మాట్లాడటం చలసాని ప్రత్యేకత. ఆయనతో మాట్లాడటం చాలా సరదాగా, హాయిగా ఉంటుంది. ఐదు నిమిషాలు మాట్లాడినా జీవితాంతం గుర్తుండిపోయే విలక్షణ వ్యక్తిత్వం చలసానిది.

      ఆయన కూతుర్ని ఓ పదేళ్ళ క్రితం చూశాను. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలీదు.

      Delete
  7. నాకున్న కొద్ది పాటి సామాన్య పరిజ్ఞానం తో చెప్తున్నాను. ఈ వ్యాఖ్య టపా కి సంబంధం లేదేమో అని సందేహం.
    నాకు లోక జ్ఞానం తెలిసే సమయం లో ఈ సంఘం గురించి విని, చదివి ఒక పాజిటివ్ అభిప్రాయం పెట్టుకున్నాను. విరసం సభలు గురించి కొంచెం ఆసక్తి గా చదివేవాన్ని. ఈ సంఘం లక్ష్యాలేంటో నాకు అంతగా తెలియదు.
    కాని ఆ తరువాత తరువాత వీళ్ళ రెండు నాల్కల పద్దతి కి చిరాకేసింది. నక్సలైట్ హింస ని ఖండించకపోవడం, పోలీస్ లని తెగ తిట్టడం. సమాజం లో ఒక వర్గాన్ని మాత్రమె తకకేట్టుకోవడం.
    ఈ మధ్యన తెలంగాణా వాదాన్ని పెంచడానికి వీళ్ళు పడే పాట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. దానికి ప్రపంచ తెలుగు మాహా సభలని బహిష్కరిస్తున్నారంటా!!!.
    సాహిత్యం లో విప్లవ సాహిత్యం ఉంటుంది, కథా సాహిత్యం ఉంటుంది, ఇలా బోలెడన్ని రకాలు ఉంటాయి. అవన్నీ మన తెలుగు బాష లో రాసినవి. మన బాషని స్మరించుకుంటూ చేసే సభలని బహిష్కరించడం ఎంత వరకు న్యాయం. కేవలం ప్రభుత్వం నిర్వహిస్తుందన్న ఒకే ఒక కారణం తో బహిష్కరించాలా ? ప్రభుత్వం చేసే ఏ పనైనా విమర్శిస్తూ ఉండాలా ?
    అసలు ఈ సంఘానికి , తెలంగాణా వాదానికి సంభంధం ఏంటో తెలియదు. మళ్ళీ అందులో తెలంగాణా పేరు చెప్పి తెలుగు మహా సభలని బహిష్కరించడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి. వీళ్ళు రాసే పుస్తకాలు తెలుగు బాష లోనే కదా , వేరే ఏ ఆఫ్రికన్ బాషలో కాదు కదా. ఏంటో వీళ్ళు ఒక సభ కాని, చిన్న సమావేశం కాని పెట్టారంటే అది ఎవరో ఒకరని విమర్సిన్చాడానికే అనుకుంటా.
    ఆదివాసి ల గురించి బాధపడేవాళ్ళు, అక్కడికే వెళ్లి వాళ్ళ జీవితాలని బాగుచేయోచ్చు కదా. అణగారిన వర్గాలు ని వాళ్ళ ఊరికే వెళ్లి బాగుచేయోచ్చు కదా. ఎక్కడో హైదరాబాద్ లో ఉండి , కొంత సాహిత్యం నేర్చుకుని రక రకాల పుస్తకాల్ని రాసి జనాల మీద కి వదలడం ఎందుకు. ఎటువంటి ఒక నిర్దిష్ట మైన లక్ష్యం లేని ఈ సంఘం ఆ పుస్తకాన్ని ముద్రించడం లో పెద్ద ఆశ్చర్యం లేదు .

    ReplyDelete
    Replies
    1. @Anonymous,

      'విరసం' తెలుగు సాహిత్యంలో ఒకానొక చారిత్రిక నేపధ్యంలో ఏర్పడిన రాజకీయ రచయితల సంఘం. ఆ సంఘానికున్న రాజకీయాలని అనుసరించి ఆ సభ్యులు వివిధ విషయాలపై స్పందిస్తుంటారు. వారి రాజకీయాలు నచ్చనివారు వారికి దూరంగా ఉంటారు. ఇంకొందరు వాళ్ళని తిట్టిపోస్తూ వ్యాసాలు, పుస్తకాలు రాస్తుంటారు. ఎవరి గోల వారిది.

      'అరసం' అని ఇంకో రాజకీయ రచయితల సంఘం ఉంది. వీరు కూడా అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. వీళ్ళని కూడా బాగానే విమర్శిస్తుంటారు.

      ఇంక ఈ తెలుగు సభల గూర్చి.. గత నెల రోజులుగా వ్యక్తులు, సంఘాలు, సమూహాలు తమ అభిప్రాయాల్ని, విమర్శల్ని పుంఖాను పుంఖాలుగా తెలియచేస్తూనే ఉన్నారు. ఆ వ్యాసాలు చదివితే మీకు అవగాహన కలగవచ్చు.

      ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో 'చిత్తశుద్ధి లేని భాషా పూజలేల?' అంటూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఒక వ్యాసం రాశారు. దయచేసి చదవండి. మీకు విషయం అర్ధమవుతుంది.

      Delete
    2. FYI, Not all Virasam leaders were in favour of Telangana. Read this story: http://blog.marxistleninist.in/2015/11/blog-post.html

      Delete



  8. కొన్ని అంశాలు(తెలంగాణావిభజన,నక్సలిజం,రంగనాయకమ్మ వంటివి ) గురించి రాయడానికి సందేహిస్తాను.ఎందుకంటే కొందరు బ్లాగర్లు,సమ్యమనం పాటించరు.అసభ్యపదజాలం ,దూషణలు సాగిస్తారు. ఐనా ఈసారి రంగనాయకమ్మగారి రచనలగురించి రాస్తాను .ఆవిడనేకాదు వ్రాతలో మనం ఎవరినైనా ' గారు ' అనడం సభ్యత.ప్రజాస్వాన్యంలో మన అభిప్రాయాలని మనం ప్రకటించవచ్చును.అలాగే ఇతరుల అభిప్రాయాలని కూడా మనకు నచ్చకపోయినా ప్రకటించుకోనివ్వాలి.ఇక రంగనాయకమ్మగారిగురించి ; ఆవిడ నవలలను,వ్యాసాలను, ఇతర రచనలనీ కొన్నిటిని చదివాను.నా అభిప్రాయం.-
    1.ఆమె మంచి నవలా రచయిత్రి.ఒక ప్రత్యేక దృక్పథంతో రాస్తుంటారు.
    2.రాజకీయాలపై ఆమె దృక్పథం out of date .సోవియెట్యూనియన్,చైనా వదిలిపారేసిన కమ్యూనిజాన్ని పట్టుకొని పాకులాడుతారు.మొండిగా వాదిస్తారు.
    3.రామాయణాన్ని విమర్శించవచ్చునుకాని,ఆమె విమర్శ హుందాగాలేదు. కొన్నిచోట్ల చవకబారుగా వుంది.మూలంలో లేని వాటిని కూడా కల్పించి అర్థం లేని విమర్శలకు దిగారు.
    ఇక సమగ్రసాహిత్యాన్ని ప్రచురించినప్పుడు ఆ రచయిత అన్నిరచనలనీ ప్రచురిస్తే తప్పులేదు. అవి అన్నీ ఒకే దృక్పథాన్ని ప్రతిఫలించకపోయినా.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      రంగనాయకమ్మ (నేను 'గారు' వంటి ఫార్మాలిటీస్ పట్టించుకోను.) పట్ల మీ అభిప్రాయాలతో దాదాపుగా ఏకీభవిస్తున్నాను.

      తెలుగు సాహిత్యంలో రంగనాయకమ్మది ఒక ప్రత్యేక స్థానం. కాల్పనిక సాహిత్యం పరిధి దాటి కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని నెత్తికెత్తుకుని.. అనేక సమకాలీన అంశాలపై నిక్కచ్చిగా రాయడం వల్ల మిత్రుల్ని, శత్రువుల్ని సంపాదించుకుంది. ఇటువంటి రచనల వల్ల ఆవిడ అభిప్రాయాల్ని ఆరాధించేవారు, చిరాకు పడేవారు, తిట్టిపోసేవారు.. కనబడుతుంటారు. ఎవరి కారణాలు వారివి.

      నాకయితే రంగనాయకమ్మ మొదట్లో రాసిన నవలలు, చలంపై రాసిన వ్యాసాలు నచ్చుతాయి. కుటుంబరావు-రోజారాణిలపై ఆవిడ రాసినదంతా పరమ చెత్త. బాలగోపాల్, లోక్ సత్తా JP పై విమర్శలు నచ్చాయి.

      ఆవిడ కేపిటల్ తెలుగులో రాసిన పుస్తకాలు కొనలేదు. చదవలేదు. (నాకు ఇంగ్లీషు వచ్చు కాబట్టి.)

      ముప్పైయ్యేళ్ళ క్రితం 'రామాయణ విషవృక్షం' చదివాను. చాలాచాలా నవ్వుకున్నాను. అప్పుడు నాకది జోక్స్ పుస్తకంలా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చదువుదామని రెండేళ్ళ క్రితం కొన్నాను. ఒక్క పేజీ కూడా చదవలేకపోయాను. విసుగనిపించింది.

      రంగనాయకమ్మ, తెలంగాణా వంటి అంశాలపై రాయడానికి మనవంటివారు సందేహించేట్లు / భయపడేట్లు చెయ్యడం కొందరి బ్లాగర్ల తెలివైన ఎత్తుగడగా భావిస్తున్నాను. అందుకే అలా అసభ్యంగా, అతి వ్యంగ్యంగా, వెటకారంగా వ్యాఖ్యలు రాస్తుంటారు. ఇదంతా కావాలనే జరుగుతున్న కార్యక్రమం.

      బ్లాగింగ్ ఒక హాబీగా.. అభిప్రాయాలు రాసుకునే మనవంటివారిని భయపడేట్లు చెయ్యడంలో మన తెలుగు బ్లాగర్లు గొప్ప విజయం సాధించారనే అనుకుంటున్నాను. కొందరు రాయడం మానేశారు. అందుకే నాకు కొన్ని అభిప్రాయాలు రాయడానికి భయం.. హాబీగా రాస్తూ తిట్టించుకోవడం దేనికిలే అని.

      (కానీ.. మరప్పుడు ఈ బ్లాగులు రాయడం దేనికి???)

      Delete
    2. మరి రేపిస్టులకి వీళ్ళకి తేడా ఏంటి ? :)
      వీళ్ళని కూడా బహిరంగం గా ఉరితియ్యాలి :)

      Delete
    3. నీకు, మనుషులకు ఉన్న తేడాయే

      Delete

  9. ఏమిటో నండీ, మీరీ మధ్య ఏదేదో తెగ రాసేస్తున్నారు.

    ఒక్క ముక్కా అర్థయం అయి చావటం లేదు.

    పాపం సుబ్బూ కూడా దిక్కూ దివాణం లేకుండా ఊళ్ళు పట్టి బికారై తిరుగుతున్నాడు మరి. ప్చ్!


    ముఫత్ మే ఓ లోగ్ పబ్లిష్ కర్ రహైన్ హై! కుచ్ పైసా మిలా బస్, ఖజానా భరేగ. కొద్దిగా మీరు చూసీ చూడనట్టు ఉండాలి గాని ...


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi జీ,

      వెరీ సారీ!

      మీకు అర్ధం కాకుండా రాస్తున్నానంటే.. ఖచ్చితంగా అర్ధం పర్ధం లేకుండా రాస్తున్నాననే అర్ధం!

      ఇకముందు మీకు అర్ధమయ్యేట్లు రాయడానికి ప్రయత్నిస్తాను. ఈ సారికి క్షమించెయ్యండి.

      Delete
  10. రమణ గారూ
    ఒక యనానిమస్‌ మహాశయులు రాసిన వ్యాఖ్యలో సంస్కారం పాలు కాస్త ఎక్కువైంది. ఆ వ్యాఖ్యలు తీసేస్తే బాగుంటుందేమో.

    ReplyDelete
    Replies
    1. మోహనరాగం గారు,

      పోన్లేద్దురూ! నేను నా బ్లాగ్ open forum లా ఉంచేయడానికే ఇష్టపడతాను. చదివిన వారు ఓ కామెంట్ పడేసి పోతే సంతోషం. అజ్ఞాతలందరూ నా శ్రేయోభిలాషులే్!

      (అయితే నా బ్లాగులో కామెంట్ రాసిన వారిపై ఇంకొకరు నెగెటివ్ గా వ్యాఖ్యానిస్తే మాత్రం ఆ వ్యాఖ్య తీసేస్తుంటాను.)

      Delete
    2. ఇంకా ఎంతో ఎదగాల్సిన మోహనరాగం గారి సలహాకు మీరిచ్చిన చిన్న మొట్టికాయ జవాబు నవ్వుతెప్పించింది. అభినందనలు.

      Delete
    3. మోహనరాగం గారు,

      అజ్ఞాతల పట్ల నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. మీరు సూచించిన విధంగా ఆ అసభ్య కామెంట్ తొలగించాను. సలహాకి ధన్యవాదాలు.

      Delete
  11. డాక్టర్ గారూ, విరసంపై మీ వాదన తర్కబద్ధంగా లేదనిపిస్తోంది. మన దేశంలో విప్లవం వస్తుందనుకోవడంకన్నా మూఢనమ్మకం మరోటి ఉండదని మన విప్లవకారులకూ విరసానికీ దశాబ్దాల క్రితమే జ్ఞానోదయమైంది. ఒక వ్యక్తికైనా సంస్థకైనా ఒకే మూఢనమ్మకం ఉండాలన్న పరిమితి ఏమీ లేదు కదా? అందుకే పునర్జన్మలనూ, దెయ్యాలనూ కూడా నమ్మడంలోనూ అట్టి నమ్మకాలను వ్యాప్తి చేయడంలోనూ విరసం వారి భావప్రకటనా స్వేచ్ఛను నేను సమర్థిస్తున్నాను.

    ReplyDelete
  12. అసలు రంగనాయకమ్మ సోషలిజం గురించి ఏం చెప్పిందబ్బా అని మీ టపా సాంతం చదివినా అర్ధం కాలేదు. సోషలిజం తీసికొని రావడం పై మీకు రంగనాయకమ్మ కీ ఒకే అభిప్రాయం ఉన్నపుడు అదేంటో చెప్పకుండా ఈ కుటుంబరావు పుస్తకాల గోలేంటి..సర్లే ఆవిడెం వ్రాసిందో చూస్తే పోలా..గూగుల్ పుణ్యమా అని అదీ దొరికింది. మళ్ళీ అదే సందేహం, రంగనాయకమ్మ శీర్షికలో సోషలిజం అని చెప్పి వ్యాసం అంతా ఈ భూత రచనలపై చేసిన వ్యాఖ్యానం చూస్తె, విష వ్రక్షం ని వ్రాసినంత సమగ్రం గా ఈ విశ్లేషణ కూడ సాగింది.

    చివర్లో ఆత్మల ద్వారా సోషలిజం తేవడం తేలిక అని కేవలం చెప్పడమే కాదు, వాటికి కావలిసినంత ఆధారాలను ముందే వివరించారు.

    ఆవిడకి ఓపికకి జోహార్లు.

    ReplyDelete
  13. నిష్కర్ష గా చెప్పాలంటే, నాకు RN గారి కంటే మీరు చెప్పిన విధానం నచ్చింది. అంటే ఆ పాయింట్ నా బుర్ర లోకి బాగా ఎక్కింది.
    అంతకుముందు, పోనీలే, తాత్వికవ్యాసాలు వేస్తే వేసారు, ఏం కొంప మునిగిపోయింది? అనుకునేదాన్ని.
    మీ 'తితిదే' ఉదాహరణ నసాళానికంటింది. (లెంప లేసుకున్నా మనసులో, ఇంత వరకూ దానిలో అసంబద్ధతను గ్రహించనందుకు)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.