గత మూడ్రోజులుగా విజయా వారి 'పెళ్లి చేసిచూడు' సినిమా చూశాను. కుదురుగా కూర్చుని సినిమా చూసే ఓపిక ఎప్పుడో నశించింది. ట్రెడ్మిల్‌పై నడుస్తూ సినిమాల్ని ముక్కలుగా చూట్టం నాకు అలవాటు. ముక్కలుగా చూసిన 'పెళ్లి చేసిచూడు' సినిమా గూర్చి కొన్నిముక్కలు.
నచ్చిన అంశాలు :-
1.ఎన్టీరామారావు పాత్ర పేరు వెంకటరమణ (తెలుగులో ఇంతకన్నా గొప్ప పేరు లేదని నా ధృఢవిశ్వాసం). అత్యున్నతమైన ఈ పేరుని హీరోకి ఇవ్వడం చక్రపాణి, ఎల్వీప్రసాదుల అత్యుత్తమ అభిరుచికి తార్కాణం! ఎస్వీరంగారావు, డా.శివరామ కృష్ణయ్య రామారావుని 'రమణా!' అంటూ పిలిచినప్పుడల్లా నా మనసు ఆనందంతో గంతులేసింది.
2.ఎస్వీరంగారావు పోషించిన వియ్యన్న పాత్ర. చాలా విలక్షణంగా ఉంది. సినిమాకి ఈ పాత్ర ఒక ఎస్సెట్. మహంకాళి వెంకయ్య సీన్లు కొన్ని తగ్గించి ఎస్వీరంగారావు పాత్ర నిడివి పెంచినట్లయితే బాగుండేది.
3.ఘంటసాల సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. పాటల గూర్చి కొత్తగా చెప్పటానికేమీ లేదు. విజువల్స్, నేపధ్య సంగీతం పాలూ నీళ్ళలా కలిసిపొయ్యాయి. కొన్ని దృశ్యాలు ఘంటసాల వల్లే ఎలివేట్ అయ్యాయి.
4.సిసింద్రీగా నటించిన బాలనటుడు మాస్టర్ కుందు ప్రతిభ. చక్కటి ఈజ్‌తో సరదాగా నటించేశాడు. కొన్ని సన్నివేశాల్లో జోగారావుని డామినేట్ చేసేశాడు.
5.ఎన్టీరామారావు రూపం. నాకు యాభైలలోని రామారావు రూపం చాలా ఇష్టం. గొప్ప అందగాడు. ఈ సినిమాలో మరీమరీ బాగున్నాడు.
హాశ్చర్యపరిచిన అంశం :-
'మిస్సమ్మ' లో మేరీ తండ్రిగా ఓ ముసలాయన గడ్డం, టోపీతో కనబడతాడు. ఆయన్ని ఆ పాత్ర కోసం ఏదో చర్చి ప్రేయర్లోంచి పట్టుకోచ్చారనుకున్నా. ఆయనే ఈ 'పెళ్లి చేసిచూడు'లో విలన్! పేరు దొరైస్వామి. నక్కజిత్తుల వాడిగా చక్కగా నటించాడు. ఇట్లాంటి పాత్రల్ని తరవాత రోజుల్లో రమణారెడ్డి, అల్లు రామలింగయ్యలు పోషించారు.
1.సినిమా మొదలైన చాలాసేపటి దాకా ఎన్టీరామారావు (రమణ) కనిపించడు. ఈ సినిమాకి హీరో జోగారావేనేమో అన్న సందేహం కలుగుతుంది.
2.ఎన్టీఆర్ (రమణ) కనిపించిన మొదటి సీన్ పెళ్లి పీటలపై. కట్నం దగ్గర పేచీ వస్తుంది. తండ్రి ఆజ్ఞపై మూడు ముళ్ళు వేసి కూడా.. పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతాడు. రమణని కట్నకానుకలకు వ్యతిరేకిగా ఎస్టాబ్లిష్ చేస్తూ పెళ్ళికి ముందు ఒక సీన్ ఉన్నట్లయితే బాగుండేది (నే చూసిన డివిడిలో అటువంటి సీన్లు ఎగిరిపోయ్యాయేమో తెలీదు).
3.రమణ తండ్రిగా డా.శివరామ కృష్ణయ్య చక్కగా నటించాడు. మంచివాడు. కానీ కోపిష్టి. కథంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. దొరైస్వామి చెప్పినవన్నీ అమాయకంగా నమ్మేస్తాడు. ఈయన్ని కొడుకు, కోడలు మరీ వెర్రివాడిని చేస్తారు. 'పాపం! ఈ అమాయకుడి కోసం ఇన్ని వేషాలు అవసరమా?' అనిపిస్తుంది. ఈ పాత్రని కొంత తెలివిగా చూపిస్తే కథ ఇంకా కన్విన్సింగ్‌గా ఉండేదేమో.
ధర్మసందేహం :-
సూర్యాకాంతం సన్నగా, చిన్నదిగా ఉంది. అందంగా కూడా ఉంది. దొరైస్వామికి భార్యగా వేసింది. ఇంత చిన్న వయసులో తల్లి పాత్ర ఎందుకు వేసిందబ్బా?! 'బావ' అన్నప్పుడల్లా కూతుర్ని పుర్ర చేత్తో 'ఫెడీ' మనిపిస్తుంటుంది. ఆ తరవాత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకి సూర్యకాంతం తన చేతి చురుకు రుచి చూపించింది!
(photos courtesy : Google)
ఈ సినిమా చూడడానికి చాలా ముందే ఈ పాట బాగుందని అప్పుడప్పుడు వింటూ ఉండేవాడిని. సంగీతాన్ని బట్టి, సాహిత్యాన్ని బట్టి ఓ భార్యా భర్తా ఇంచుమించుగా విడాకులదాకా వచ్చి ఒకళ్ళనొకళ్ళని ఎత్తిపొడుచుకుంటూ పాడుకుంటున్నారు అనుకునేవాణ్ణి. సినిమా చూశాక అర్థమైంది ఇదో రొమాంటిక్ వ్యంగ్యమని.
ReplyDelete(అడక్కపోయినా సినిమా గురించి నా అభిప్రాయం: ఇదో వెర్రి మొర్రి సినిమా. పాతదీ, విజయావాళ్ళదీ సినిమా ఇలా ఉందేంటి చెప్మా అని ఆశ్చర్యపోయాను చూశాక కొన్నేళ్ళ క్రితం.)
@nagamurali,
Delete'పెళ్ళిచేసిచూడు' 1952 లో విడుదలై భారీవిజయాన్ని సాధించింది. ఇప్పటి కాలానికి చాలా బ్లాండ్ గా ఉంటుంది. బహుశా ఆ రోజుల్లో అదే ట్రెండ్ అయ్యుండొచ్చు. పాత సినిమాలు చూసేప్పుడు అప్పటి కాలం, పరిస్థితులు గుర్తుంచుకుని చూస్తే గానీ ఎంజాయ్ చెయ్యలేం.
రమణగారు,
ReplyDeleteఆహా! మీరు పాత సినేమాలన్నిటిని చూసి, మళ్ళీ వాటిమీదటాపాలు రాయటం మీ ఓపికకి నిదర్శనం. ఇంతవరకు మీరు 1950,1960ల కాలం నాటి సినేమాల గురించి రాస్తున్నారు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి బాలరాజు,కీలు గుర్రం,ముగ్గురు మరాఠీలు, గుణసుందరి కథ ( శివరాం నటించిన ) వీటిని కూడా మీరు తొందరగా కవర్ చేయండి. ఓ పనైపోతుంది :)
SriRam
@SriRam,
Deleteప్రస్తుతం బుర్ర పాత సినిమాల చుట్టూ తిరుగుతుంది. అంచేత అవే రాస్తున్నాను. ఇవి రాయడానికి పెద్ద ఓపిక అవసరం లేదు లేండి. రెండు బొమ్మల్ని ఒక విడియోతో కలిపేస్తూ రాసేసుకుపోవచ్చు.
ఇంతకు ముందు అప్పుడప్పుడు A.P. పాలిటిక్స్ రాసేవాణ్ణి. ఇప్పుడు రాయాలనిపించడం లేదు. అంతే.
బ్లాండ్ కాదు, అసలు కథ మరీ విపరీతంగా ఉంటుంది. ఒక నాలుగు పీజీ వుడ్ హవుసు నవల్లు కలగలిపి, తెలుగు కుంపటి మీద ఈ కథ వండారని నా అనుమానం. But each character stands out so uniquely. The two little playlets Jogarao presents in his elementary school are hilarious. I heard/read somewhere that the little kid who wants garelu but does not want to go to school was Sri Mohan Kanda IAS, one time Chief Secretary of AP.
ReplyDelete@Narayanaswamy S,
Deleteఅవును. ఆ చిన్న పిల్లాడి పేరు మోహన్ కందా. తరవాత IAS చేశాడు. ఈయన CPM లీడర్ సీతారాం యేచూరికి మేనమామ. ఇందులో ఇంకో బాలనటుడు మాస్టర్ కుందు (గాదె రామకృష్ణారావు). కన్యాశుల్కంలో వెంకటేశంగా కూడా నటించాడు. వీళ్ళంతా బాలానందం బ్యాచ్.
ఇంకో ముఖ్యమైన పాయింట్. మోహన్ కందా మా గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో చదువుకున్నాడు. కొన్నాళ్ళు మా పూర్వ విద్యార్ధుల సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా వున్నాడు. అదీ సంగతి!
సంసారంలో ఆనాటి మృదుత్వాలూ మాధుర్యాలు వాటి అర్ధాలూ మారిపోయాయి. నాకు బాగా నచ్చిన పాట "ఏడుకొండల వాడా వెంకటా రమణా".పెళ్ళి చేసుకుని అల్లా ఉయ్యాలలో పడుకుని పాడించు కుందామను కున్నాను. దీనిలో సగం మాత్రమే నిజమయ్యింది. ఏమి చేస్తాం అందరూ యంటీ వోరు అవలేరు కదా.
ReplyDeleteRao S Lakkaraju గారు,
Deleteమీ కోరిక నెరవేరనందుకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.
(అయినా మరీ అంత పెద్ద కోరికైతే ఎలాగండి!)
విజయావారి సినిమాల్లో అత్యంత బోరింగ్ సినిమా ఇదేననుకుంటా.
ReplyDelete" 1.సినిమా మొదలైన చాలాసేపటి దాకా ఎన్టీరామారావు (రమణ) కనిపించడు. ఈ సినిమాకి హీరో జోగారావేనేమో అన్న సందేహం కలుగుతుంది."
నిజమేస్మీ!!
జీడిపప్పు గారు,
Deleteనేనయితే విజయావారి అన్ని సినిమాలు చూళ్ళేదు. చంద్రహారం, ఉమాచండీగౌరీశంకరుల కథ, సత్యహరిశ్చంద్ర.. ఇంకా కొన్ని. కాబట్టి గ్రేడింగ్ చెయ్యలేను. మీకు ఘంటసాల నచ్చేట్లయితే 'పెళ్ళిచేసిచూడు' కూడా నచ్చొచ్చు. లేకపోతే లేదు.
ప్రస్తుతం బాగా పాత సినిమాలు చూసే పన్లో ఉన్నా. మొన్న కాంచనమాల సినిమాల సిడీలు తెప్పించాను. నేను సినిమాల్ని థియేటర్లో చూడను. ముక్కలుగా చూస్తుంటాను. కాబట్టి నాకేం బోర్ కొట్టట్లేదు.
"చంద్రహారం, ఉమాచండీగౌరీశంకరుల కథ" These two are pretty bad.
Delete@Narayanaswamy S,
Deleteమొన్న 'ఆరుద్ర సినీ మినీ కబుర్లు'లో చదివాను.
'ఉమాచండీ గౌరీశంకరుల కథ'ని మన ప్రేక్షక దేవుళ్ళు 'ఉప్మా చట్నీ గారె సాంబారుల కథ' గా పిలిచార్ట!
'ఉప్మా, చట్నీ, గారి, శనగల కథ' అనేవాళ్ళుట మా అమ్మావాళ్ళు చిన్నప్పుడు.
Deleteఎంత పని చేశారు డాట్రారు! ఈ టపా అరవై ఏళ్ళ కిందట (ఏ పత్రికలోనో) రాసుంటే విజయావారికి పనికొచ్చి ఉండేది. సినిమా ముక్కలు ముక్కలుగా చూసినా టపా ని ముక్కలు ముక్కలుగా కాకుండా ఒకేసారి రాసినందుకు మీకో తృణం ఋణపడి ఉన్నాం!
ReplyDelete@sree surya,
Deleteటపా కూడా ముక్కలుగానే (పాయింట్లు లాగా) రాశాను గదా. ఏదో నా ఆలోచనలు అప్పటికప్పుడు రాసేశాను. ఇట్లాంటి టపాలు రాసే అసలు కారణం 'పని లేక.. '!
ఇదేమిటి ఇప్పుడా చుసారు ఈ సినిమా!!! నేనిప్పటికి బోల్డు సార్లు చూసేసా. నాకైతే నచ్చుతుంది. వరకట్న సమస్య మీద వచ్చిన సినిమా. పాటలు అద్భుతం..ముఖ్యంగా ఏడుకొండలవాడ వెంకటరమణా. చిన్నపిల్లల నాటికలు కూడా బావుంటాయి. అమ్మా నొప్పులే పాట మేము చిన్నప్పుడు విపరీతం గా పాడుకునేవాళ్ళం. పింగళి వారి కలం పదును తెలియడానికి ఒక్కటి చాలు..."చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణి కి నమస్తే". "సాముదాయకపు వలపు పంపిణీ"...ఆలోచించి చూడండి..ఎంత అద్భుతంగా వాడారో కదా! భార్యాభర్తల మధ్య వ్యంగ్య పాటేకాదు, ఆడపడుచు-వదినల మధ్య వెటకారం పాట కూడా అదుర్స్.
ReplyDeleteఈ సినిమాలో "రాధనురా నే రాధనురా" పాట గురించి నేనొక పోస్ట్ రాసాను. వీలైతే చూడగలరు.
http://vivaha-bhojanambu.blogspot.in/2011/06/blog-post_28.html
ఈ సినిమా లో నాకు నచ్చే ఒక చక్కని సన్నివేశం...వెయ్యి అబద్దాలాడైనా పెళ్ళి చెయ్యాలి అని రంగారావు అంటే సావిత్రి మనసులో అనుకుంటుంది..."నా పెళ్ళి మాత్రం అబద్ధాలతో జరగలేదు" అని.
ముఖ్యంగా ఏడుకొండలవాడ వెంకటరమణా
Delete--------------------------
నా కిష్టమైన పాట నచ్చినవాళ్ళు ఇంకోళ్ళు గూడా ఉన్నారని తెలియగానే చాలా సంతోషమేసింది సౌమ్య గారూ.
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by a blog administrator.
Deleteఆ.సౌమ్య గారు,
Deleteమీ నాలెడ్జ్ కి అబ్బుర పడుతూ.. అభినందిస్తూ.. సరదాగా కామెంట్ రాశాను. but i started feeling uncomfortable. so i am editing and republishing my comment. very sorry, if i hurt your feelings.
ఆ.సౌమ్య గారు,
Deleteఈ సినిమా చిన్నప్పుడు అమ్మతో చూసిన గుర్తు. మళ్ళీ ఇప్పుడే చూట్టం.
పాత సినిమాలు, పాత పాటల గూర్చి మీ నాలెడ్జ్ అమోఘం.
మీరేం కామెంటు రాసారో నాకు తెలీదండీ. నేను చూడలేదు. కాని ఏం రాసుంటారో గ్రహించాను. మా ఇంట్లో అన్ని పాత సినిమాల కేసెట్లు ఉండేవండీ. మేము చిన్నప్పడు ఎక్కువ పాత సినిమాలే వినేవాళ్ల గమనించారా? వినేవాళ్ళం :) ఆ తరువాత్తరువాత చూసాం VCR లోనూ, టీవీల్లోనూ. మా ఊర్లో ఒక హాల్ కి పాత సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేవి. మా ఇంట్లో ఆ సినిమాలకే తీసుకెళ్ళేవారు. కాబట్టి నాకు పాత సినిమాలగురించి బ్రహ్మాండం గా తెలుసు. నా వయసు చాలా తక్కువే లెండి :)
Deleteమీకీ పాటికి బ్లాగు ప్రపంచం పోకడలు అర్థమయ్యే ఉంటాయి. హద్దుమీరిన కామెంట్లను తొలగిస్తారని ఆశిస్తున్నాను.
సౌమ్య గారు,
Deleteమిమ్మల్ని రిఫర్ చేస్తూ అజ్ఞాత రాసిన వ్యాఖ్య తొలగించాను.
Thank you :)
Delete