మిస్సమ్మ సినిమా వీరాభిమానులు ఈ టపా చదవకపోవటం ఉత్తమం. చదివినట్లైతే మీ మనోభావాలు దెబ్బతినొచ్చు.
'చదవొద్దని చెప్పావు కాబట్టి తప్పకుండా చదువుతాం. అంతేకాదు.. మిస్సమ్మపై తేడాగా రాస్తే నీ సంగతీ తేలుస్తాం.' అనేట్లయితే మీ ఇష్టం.
(ఇదంతా మీచేత ఈ టపా చదివించేందుకు ప్రభాకర్రెడ్డి స్టైల్లో నే పన్నిన కుట్ర!)
ముందు మాట ;
'మొన్న దేవదాసుని విమర్శిస్తూ 'దేవదాసు' వేదన - తెలుగువారి రోదన అంటూ రాశావు. ఇవ్వాళ మిస్సమ్మ గూర్చి రాస్తున్నావు. ఎంత 'పని లేక.. ' పొతే మాత్రం మరీ ఇంత అరాచకమా! గొప్ప సినిమాలని తిట్టినంత మాత్రాన గొప్పవాడవైపోవు. పన్లేకపోతే పెద్దలు తీసిన కళాఖండాల్ని శ్లాఘించు, స్తుతించవోయ్! అంతేగానీ తెగనాడకు. నీ ధోరణి చాలా తప్పు.' అనుకుంటున్నారు కదూ!
(మీరెట్లాగూ ఇలాగే అనుకుంటారని.. నాకు నేనే అనేసుకుంటున్నాను).
అయ్యలారా! అమ్మలారా! నా అభిప్రాయమేమనగా మనం ఉత్తమ సినిమాలనే మైక్రోస్కోపిక్ గా పరీక్షించాలి. అందుకే మిస్సమ్మని చూసీచూసీ అరిగిపోయిన కళ్ళతో కొన్ని 'మిస్సమ్మ ఆలోచనలు' రాస్తున్నాను. మిస్సమ్మేమీ ఆషామాషీ సినిమా కాదు. విజయావారి సినిమా. చక్రపాణి మానస పుత్రిక. ఎల్వీప్రసాద్ అంతటి ఘనుడు దర్శకత్వం వహించిన సినిమా.
Introduction :
ముందుగా మిస్సమ్మ సినిమా గూర్చి రెండు ముక్కలు. మిస్సమ్మ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. మిస్ మేరీని ఎన్నోయేళ్ళుగా తీవ్రంగా ప్రేమిస్తున్నాను. నాకు మేరీ ఎందుకంతగా ఇష్టమో వివరిస్తూ ఇంకో టపా రాస్తాను (అదంతా ఓ పెద్దకథ).
తెలుగులో వచ్చిన మంచి సినిమాల్లో నిస్సందేహంగా మిస్సమ్మ కూడా ఒకటి. అయితే మిస్సమ్మ సినిమా గూర్చి critique ఎవరూ రాసినట్లు లేదు. కారణం ఏమైయ్యుండొచ్చు? తెలుగు సినీ విమర్శకులు మర్యాదస్తులు. మొహమాటస్తులు. ఇంకో కారణం.. అందరూ మెచ్చుకున్న సినిమానో, పుస్తకాన్నో కొంచెం విమర్శనాత్మకంగా రాస్తే తెలుగు పత్రికలు ప్రచురించవు (పత్రికలవాళ్ళు వివాదాల జోలికి పోరు).
అయితే నన్ను ఆశ్చర్యపరిచింది.. అటువంటి ప్రయత్నం తెలుగు బ్లాగుల్లో కూడా జరక్కపోవడం. సినిమాలేమీ మతగ్రంధాలు కాదుగదా! ఎంత గొప్పరచనైనా, సినిమానైనా అక్కడక్కడా కొన్నిలోపాలు కలిగుండొచ్చు (కనీసం అవి లోపాలుగా మనకి అనిపించొచ్చు). ఆ అంశాలని చర్చకి పెట్టవచ్చు. నిజానిజాలు తేల్చుకోవచ్చు. కాబట్టి ఇవ్వాళ మిస్సమ్మ గూర్చి రాసే పవిత్ర కార్యాన్ని తలకెత్తుకుంటున్నాను. ఆశీర్వదించండి.
'కథా మిస్సమ్మ' లోపాలు :
ఇప్పుడు కొద్దిసేపు మిస్సమ్మ 'కథ' గూర్చి మాట్లాడుకుందాం. మిస్సమ్మ సినిమాకి మాతృక ఒక బెంగాలి కథ (మంచి కథలు బెంగాలీలోనే దొరుకును). ఈ కథకి సెంట్రల్ పాయింట్ నిరుద్యోగులైన హీరోహీరోయిన్లు ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటించడం (అందునా వారిద్దరూ భిన్నమతాలకి చెందినవారు). ఆశ్చర్యంగా ఉంది కదూ? 1950 ల మాట అటుంచండి.. ఈ రోజున కూడా ఇట్లాంటి సంఘటన ఊహించలేం.
జమీందార్లు కర్కశంగా శిస్తు వసూళ్లు చేసుకుంటూ సంపద పెంచుకునే యావలో ఉంటారనే అభిప్రాయం నాకుంది. నేనెప్పుడూ జమీందార్లని చూళ్ళేదు (నా అభిప్రాయానికి ఆధారం దాశరధి రంగాచార్య రచనలు, రోజులు మారాయి వంటి సినిమాలు). మిస్సమ్మ కథలో జమీందారు ఒట్టి వెర్రిబాగులవాడు. చాదస్తుడు. తెలుగుదేశంలో ఇట్లాంటి అమాయక జమీందారు ఉన్నట్లు దాఖలా లేదు (వంగదేశపు జమీందార్లు మంచివాళ్ళు. దేవదాసు కథలో పార్వతి ముసలి మొగుడు కూడా 'మంచి' జమీందారే).
ఈ కథ అల్లుకొన్న ముఖ్యమైన పాయింటే (కనీస స్నేహం కూడా లేని స్త్రీ పురుషులు ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటించడం) బలహీనమైనది. మనం అర్ధం చేసుకోలేనిది. ఇంక మిగిలిన విషయాల జోలికి పోవాల్సిన అవసరం ఉందా? ఈ కథలో అసహజత్వం కోసం వెదకే కన్నా సహజత్వం కోసం వెతకడం సులువైన పని.
- మోసాలు చేసే ముష్టివాడికి హీరో తన అసిస్టెంట్ పోస్టిచ్చి ఊరికి తీసుకెళ్లడం..
- డిటెక్టివ్ నంటూ జోకర్లా ప్రవర్తించే (జమీందారు) మేనల్లుడు..
- సంగీతం నేర్పించమంటూ వెంటబడే బుర్ర తక్కువ (జమీందారు) కూతురు..
- టీచరమ్మకి సీమంతాలు చేసి ముచ్చట తీర్చుకునే వెర్రిబాగుల (జమీందారు) భార్య..
ఏవిటో! అన్నీ eccentric characters తో జంధ్యాల మార్కు కనిపిస్తుంది కదూ! రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమాలా కూడా ఉంది కదూ! అవును. మిస్సమ్మ కథ కేవలం హాస్యం కోసం రాసుకున్న కథ. అందుకే మిస్సమ్మ కథలో బూతద్దంతో వెదకినా లాజిక్ కనబడదు. ఇక్కడితో మిస్సమ్మ కథ గూర్చి నే రాద్దామనుకున్నా ఆలోచనలు సమాప్తం.
'సినిమా మిస్సమ్మ' లోపాలు :
ఇప్పుడు మిస్సమ్మ సినిమాలోకొద్దాం. ఈ సినిమా టైటిల్ మిస్సమ్మ. అయితే దర్శకుడు మిస్సమ్మ పాత్రలో consistency చూపడంలో విఫలమయ్యాడు. తెలుగులో ఎంతో పాపులర్ అయిన ఒక సినిమాలో, అంతకన్నా ఎక్కువగా పాపులరైన ఒక ప్రధాన పాత్ర characterisation లోపాల్ని ఎవరూ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం.
మిస్ మేరీకి తన మతం అంటేనే గురి. ఆ విషయం మేరీ స్పష్టంగానే చెబుతుంది. మంచిది. ఎవరి మతవిశ్వాసాలు వారివి. తమ క్రైస్తవ మతం మాత్రమే గొప్పది అని నమ్మే వ్యక్తులు నాకు తెలుసు. వీరు హిందూ సాంప్రదాయాలకి వందమైళ్ళ దూరంలో ఉంటారు. ఉదాహరణకి.. వీరు ఎంత ఆకలిగా ఉన్నా హోటల్లో ఇడ్లీ కూడా తినరు (కొబ్బరి పచ్చడిలోని కొబ్బరి.. హిందూ దేవుళ్ళ ప్రసాదంతో చేసిందేమోనన్న భయం కారణంగా). వీరిలో పాడగలిగిన వ్యక్తులు చర్చిల్లో యేసుక్రీస్తు భక్తి పాటలు మాత్రమే పాడుతుంటారు. అంతే.
అయితే మన మిస్సమ్మ సినిమాలో మిస్ మేరీ త్యాగరాజ కృతి పాడటమే కాదు.. శాస్త్రీయ సంగీతం నేర్పించేంత స్థాయిలో ఉంటుంది! త్యాగరాజ కృతి పాడగలిగినంత పరిజ్ఞానం ఉన్న మేరీకి.. మరి రుక్మిణి, సత్యభామలు ఎవరో తెలీదు! అలాకాకుండా పార్కులోనే ఎం.పి.రావుతో 'నాక్కూడా మీలాగే మతాల పట్ల అంత పట్టింపు లేదు.' అని ఒక్క మాట చెప్పించేస్తే బాగుండేది. అప్పుడు మేరీ బొట్టు పెట్టుకోటాన్ని కూడా అర్ధం చేసుకునేవాళ్ళం.
మిస్సమ్మ కేవలం ఒక కామెడీ సినిమా మాత్రమేనా? :
సాధారణంగా ఒక కామెడీ సినిమా ఎంత సూపర్ హిట్ అయినా.. హాల్లో ఉన్నంతసేపూ మనసారా నవ్వుకుని.. ఆ తరవాత మర్చిపోతాం. కామెడీ సినిమాలైనా.. సమాజంలో తారసపడే సజీవ పాత్రలు, మనసుకి హత్తుకుపోయే ఉదాత్త సన్నివేశాలతో ఉన్నప్పుడు.. ఆ సినిమాలకి ఒక iconic status వస్తుంది. ఉదాహరణగా చార్లీ చాప్లిన్ సినిమాలు చెప్పుకోవచ్చు.
ఈ రకంగా చూస్తే మిస్సమ్మ చిత్రంలో తమ జీవితాలని ఐడెంటిఫై చేసుకోటానికి తెలుగువారికి ఒక్క పాయింట్ కూడా లేదు. ఏవేవో పాత్రలు వస్తుంటాయ్. నవ్వు తెప్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రవర్తిస్తుంటాయ్. మరైతే తమ జీవనానికి ఏ మాత్రం సంబంధం లేని పాత్రలు, సన్నివేశాలతో తీసిన సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం ఎందుకు పట్టారు?
మిస్సమ్మ విజయానికి కారణం :
ఏ సినిమా విజయానికైనా బేసిక్ సూత్రం కథ బాగుండాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతటి ప్రతిభావంతులైనా కథలో సరుకు లేకపోతే ఇంతే సంగతులు. ఈ విషయం చెప్పడానికి అనేక సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి. కాబట్టి సావిత్రి బాగా నటించిందనో, రాజేశ్వరరావు సంగీతం గొప్పగా అందించాడనో కబుర్లు చెబితే సరిపోదు. ఈ లబ్దప్రతిష్టులే అనేకసార్లు సూపర్ ఫ్లాపులూ అందించారు.
మిస్సమ్మ విజయానికి నేననుకునే కారణం ఏమనగా.. ఈ సినిమా 1955 లొ విడుదలైంది. అప్పటికి తెలుగు సినిమా బరువైన కుటుంబ కథలతో భారంగా నడుస్తుంది. సినిమాలో కథా బరువు మరీ ఎక్కువైపోయి మునిగిపోకుండా.. కామెడీ కోసం ఏ కస్తూరి శివరావునో, రేలంగినో వాడుకుంటూ దర్శకులు కథని బ్యాలెన్స్ చేస్తుండేవాళ్ళు.
పెళ్ళిచేసిచూడు (1952) వంటి సినిమాలో హాస్యానికి పెద్దపీట వేసినా.. ఆ సినిమాకి హాస్యమే ప్రధానం కాదు. వరకట్న సమస్యని హైలైట్ చేస్తూ lighter vein లో తీసిన సందేశాత్మక సినిమా పెళ్ళిచేసిచూడు. అప్పుచేసి పప్పుకూడు మిస్సమ్మ తరవాత వచ్చింది. కావున తెలుగులో మొట్టమొదటి పూర్తి స్థాయి కామెడీ సినిమా మిస్సమ్మ.
అప్పటికి తెలుగు ప్రేక్షకులకి absurd comedy తెలీదు. బరువైన కథాచిత్రాల ద్వారా మాత్రమే మనకి తెలిసిన ప్రముఖ నటులు.. హాస్యపాత్రలలో, సరదాసరదాగా నటించెయ్యడం కూడా గమ్మత్తుగా అనిపించి ఉండొచ్చు. ఈ గమ్మత్తుకి ఉత్తమ నటన, గొప్పసంగీతం వంటి హంగులు అద్ది.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించి విజయావారు బోల్డంత డబ్బు మూట కట్టుకున్నారు.
ఉపసంహారం :
ఇంతటితో మిస్సమ్మ సినిమా గూర్చి రాయడం కూడా అయిపోయింది. చదువరులు నేనేదో మిస్సమ్మ సినిమాపై కక్షగట్టి రాసినట్లు అనుకునే ప్రమాదం కనిపిస్తుంది. అంచేత పాతతరం దర్శకులు.. సెంటిమెంట్ సినిమాని కామెడీతో బ్యాలెన్స్ చేసినట్లు.. నే కూడా హాస్యచిత్రాల గూర్చి ఇంకొద్దిగా రాసి నా టపాని బ్యాలెన్స్ చేస్తాను.
ఎప్పుడైనా, ఎక్కడైనా కామెడీ కోసమే రాసుకునే కథల్లో లాజిక్ పెద్దగా ఉండదు. Shakespeare అంతటివాడే కామెడీ కోసం 'The Comedy of Errors' అంటూ అర్ధం పర్ధం లేని కథ రాసుకున్నాడు. Shakespeare దగ్గర్నుండి ఆమధ్య Bill Murray మానసిక రోగిగా నటించిన సినిమా 'What About Bob?' (ఈ సినిమాని 'తెనాలి' అన్న పేరుతొ కమల్ హసన్ మక్కికిమక్కి దించేశాడు.) దాకా అన్నీ అసహజ, అసందర్భ సన్నివేశాలే!
bottom line :
కామెడీ సినిమా చూసి హాయిగా నవ్వుకో. లాజిక్ వెతుక్కోకు.