Saturday 20 July 2013

సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?


మిత్రులారా! ఈరోజు మీకో రహస్యం చెప్పాలి. నాగూర్చి నేను గొప్పలు చెప్పుకోకూడదు గానీ.. నేను చిన్నప్పట్నించే గొప్పఆలోచనాపరుణ్ని. మానవ సమాజం, సమాజ మనుగడ, వినోదం, విజ్ఞానం, భవిష్యత్తు కార్యాచరణ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై తలమున్కలుగా ఆలోచిస్తుండేవాణ్ని. స్కూల్లో కూర్చుని నేచేసిన నా ఆలోచనలు మచ్చుకు కొన్ని రాస్తున్నాను. చదివి ఆనందించండి.

'సినిమా'.. ఎంత గొప్ప పదం! వినుటకు కడు ఇంపుగా, సొంపుగా యున్నది! అసలీ సినిమా అనునది మానవునికి దేవుడు ప్రసాదించిన ఒక వరం. ఒక గొప్ప అదృష్టం. సినిమాలు చూడ్డం అన్నది నాగరికతకి చిహ్నం. సినిమా అనేది ఒక జాతికి జీవగర్ర (జీలకర్ర కాదు). సినీవీక్షణం ఒక పవిత్ర కార్యం, జీవన పరమావధి. సినిమాలు చూడనివాడి జీవితం వృధా.

అసలీ పురప్రజలు రోడ్ల మీద తిరుగుతూ టైమెందుకిలా వేస్ట్ చేసుకుంటున్నారు? ఊరంతా సినిమా హాళ్ళు కట్టించేస్తే హాయిగా అందరూ సినిమాలు చూసేస్తూ సినిమా హాళ్ళల్లోనే జీవించేవారు గదా! నాన్న జేబునిండా డబ్బులున్నా కూడా రోజుకో సినిమా చూడ్డేంటి? నేను మాత్రం పెద్దైంతరవాత బోల్డంత డబ్బు సంపాదించి రోజంతా సినిమాలు చూస్తూ బతికేస్తాను.

మిత్రులారా! నా ఆలోచనలు ఇంకా రాయాలంటారా? విజ్ఞులు. ఈపాటికి మీకు అర్ధమైపొయ్యుంటుంది. చిన్నట్నించి నేనెంతటి అచంచల ఆలోచనాపరుణ్నో!

ఇప్పుడు కొంచెంసేపు నా సినిమా ముచ్చట్లు. నా చిన్నతనంలో మాకు సినిమా చూడటం అనేది ఏకైక వినోద సాధనం. అందునా మా మధ్యతరగతి జీవితాల్లో సినిమా అనేది ఒక లక్జరీ కూడా. రిక్షాకి, సినిమా టిక్కెట్లకి, అవుట్ బెల్లులో (intermission) తాగే గోళీ సోడా ఖర్చుతో సహా బజెట్ ముందుగానే నిర్ణయించబడేది (సినిమా తియ్యడానికే కాదు, చూడ్డానిక్కూడా బజెట్ కావాలి).

నేను తెలివైనవాణ్నని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. సినిమాలో ఏమీ కొనుక్కోనని (ఇంటి దగ్గర) అమ్మని నమ్మబలికిన నేను.. సినిమా మొదలవ్వంగాన్లే చక్రాలు కొనిపెట్టమని బ్రతిమాలేవాణ్ని, ఏడిచేవాణ్ని (ఏడుపుని ఎఫెక్టివ్ గా వాడుకోవటం ఒక ఆర్ట్). అమ్మ దగ్గర రిజర్వులో బ్లాక్ మనీ (నాన్నకి తెలీకుండా ఇంటిఖర్చుల్లో మిగిల్చుకున్న చిల్లర) ఉంటుందని నాకు తెలుసు.

ఒకవైపు సినిమా తెరపై నడుస్తుండగానే క్యాంటీన్ కుర్రాళ్ళు చక్రాలబుట్టతో హాలంతా తిరుగుతుండేవాళ్ళు (ఎక్కువగా పిల్లలున్నచోటనే తచ్చాడుతుండేవాళ్లు). పదిపైసలకి ఐదు చక్రాలొచ్చేవి. మొత్తానికి చక్రాలు సాధించి, చొక్కా జేబులో (నా లూజు చొక్కా గూర్చి "నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు"  అంటూ ఓ పోస్టు రాశాను) వేసుకుని.. అటు తరవాత బుల్లిబుల్లి తుంపులుగా చేసుకుని.. కొద్దికొద్దిగా చప్పరిస్తూ, నముల్తూ (చక్రాలు హడావుడిగా తినరాదు. తొందరగా అయిపోవును) సినిమా చూసేవాణ్ని.

అసలు ఇంట్లోవాళ్ళు సినిమా ప్రోగ్రాం పెట్టుకోంగాన్లే ఒకరకమైన ఉద్వేగం, ఆనందం. సినిమా తెర తీస్తున్నప్పట్నించే చాలా fascinating గా ఉండేది. ఆ తెర అటూఇటూ పట్టుకు లాగేది మనుషులా? లేక కరంటు మిషనా? అన్నవిషయం గూర్చి చాలా తీవ్రంగా ఆలోచించేవాణ్ని (ఈ విషయంపై స్నేహితులతో మేధోచర్చలు కూడా జరిపేవాణ్ని).

సినిమాకి ముందు న్యూస్ రీళ్ళు వేసేవాళ్ళు. కరువు, వరదలు అంటూ ఏవో వార్తలు చూపించేవాళ్ళు (వీటిని మేం ట్రైల్ పార్టీ అనేవాళ్ళం). అసలు సినిమాకి ముందు కొసరులాగా వచ్చే ఈ రీళ్ళు కూడా నాకు భలే ఇష్టం (ఎంతైనా ఫ్రీ కదా).

ఆ రోజుల్లో నా జీవితంలో మధురానుభవం సినిమా చూడ్డం. అందులో ఇంకా మధురాతి మధురానుభవం రామారావు, రాజనాల కత్తియుద్ధ సన్నివేశాల్ని కనులారా వీక్షించడం. వాళ్ళిద్దరూ లోకేషన్లు మార్చుకుంటూ, (చేతులు పడిపొయ్యేలా) గంటలసేపు యుద్ధం చేసుకునేవాళ్ళు. వాళ్ళెంతసేపు యుద్ధం చేసుకున్నా.. ఇంకొంచెంసేపు చేసుకుంటే బాగుండుననిపించేది.

ఈరోజున నేనా సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది? నాకా రోజుల్లో అమితానందాన్నిచ్చిన ఆ సినిమాల్ని చూడ్డానికి మొన్నామధ్య ప్రయత్నించాను. కొద్దిసేపు కూడా చూళ్లేకపొయ్యాను. కారణమేమై యుండును? నేను విజ్ఞానవంతుడనయ్యానా? వివేకవంతుడనయ్యానా? మేధావినైపొయ్యానా? బాకుల్లాంటి ఈ ప్రశ్నలకి (ఒకే ప్రశ్నని ఎఫెక్టు కోసం మూడురకాలుగా రాశాన్లేండి) సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

చిన్నప్పుడు నాకు సినిమాలు 'తీస్తారని' తెలీదు. తెరమీద కనిపిస్తున్నదే నిజమనుకునేవాణ్ని. రామారావు సావిత్రిలు నిజంగానే భార్యాభర్తలు. సూర్యకాంతం నిజంగానే గయ్యాళి. రాజనాల నిజంగానే చెడ్డవాడు. వాళ్ళమధ్య జరుగుతున్న సంఘటనలన్నీ వాస్తవం. ఇంకో ఆలోచనకి తావు లేదు.

నేను హైస్కూల్లో చదివేప్పుడు నాపక్కన శాస్త్రి కూర్చునేవాడు. వాడు సినిమా విషయాలు చాలా చెప్పేవాడు.

"ఎన్టీరామారావు, సావిత్రి నిజంగానే మొగుడూపెళ్ళాలు. అందుకే రామారావు సావిత్రిని అంత గట్టిగా వాటేసుకుంటాడు. అదే నాగేస్సర్రావుని చూడు.. సావిత్రిని ముట్టుకోవాలంటే బయ్యం. దూరందూరంగా ఉంటాడు. సావిత్రిని ముట్టుకుంటే.. నాగేస్సర్రావు తన పెళ్ళాన్ని ముట్టుకున్నాడని రామారావుకి కోపం వస్తుంది. అప్పుడింక నాగేస్సర్రావు పని ఔట్."

"నిజంగా?"

"నిఝం. తల్లితోడు. మా అన్నయ్య చెప్పాడు." మా శాస్త్రిగాడికి ప్రతిదానికీ ఒట్లెయ్యడం అలవాటు.

నా వెనక బెంచిలో వీరయ్య ఉండేవాడు. వాడి భాష మొరటు. తెలుగు సినీతెర వెనుక రహస్యాలు చూసినట్లే చెప్పేవాడు.

"ఎన్టీవోణ్ని చంపెయ్యడానికి నాగ్గాడు అట్టకత్తి కాంతారావుతో కలిసి ప్లానేశాడు. ఈ సంగతి ముందే కనిపెట్టిన ఎన్టీవోడు కత్తి తీసుకోని గుర్రం మీద స్రీడుగా వస్తంటే బయపడి నాగ్గాడు పారిపోయ్యాడు. కాంతారావు ఎన్టీవొడి కాళ్ళ మీద పడ్డాడు."

నా ముందు బెంచిలో సూరి కూర్చునేవాడు. వాడిక్కూడా గొప్ప సినిమా నాలెడ్జ్ ఉండేది.

"ఉరేయ్! నీకీసంగతి తెలుసా? రామారావు కిష్టుడి వేషం వేసేముందు పూజ చేస్తాడు. అప్పుడు కిష్టుడు రామారావులోకొచ్చేస్తాడు. ఇంకాతరవాత రామారావు చేసేదేముండదు. అంతా ఆ కిష్టుడే చేసేస్తాడు."


సినిమా నటులకీ, పాత్రలకీ తేడా మాకు తెలీదు. మేం చూసే సినిమాలు మద్రాసులో తీస్తారని, సినిమాలో మేం చూస్తున్న ప్రతి సన్నివేశాల్ని క్షుణ్ణంగా ప్లాన్ చేస్తారని మాకు తెలీదు. రామారావు, రాజనాల విఠలాచార్య చెప్పింది శ్రద్ధగా విని.. కత్తియుద్ధం చేసినట్లు నటించి.. ఎవరిళ్ళకి వాళ్ళెల్తారనీ, వాళ్లక్కూడా భార్యాపిల్లలుంటారనేది మా ఊహకందని విషయం.

ఇవన్నీ తెలీదు కనుకనే రాజనాల (పనీపాట లేకుండా) పొద్దస్తమానం హీరోయిన్లని కిడ్నాప్ చేసే పన్లో ఉంటాడని నమ్మేవాళ్ళం. ఈ విలన్ల కుట్రల్ని భగ్నం చేస్తూ హీరోలు ఎంతటి కష్టాలు పడుతున్నారో కదా అని బోల్డు బాధ పడుతుండేవాళ్ళం. విలన్ల పన్నాగాలు హీరోలు ఎక్కడ తెలుసుకోలేరోనని ఆందోళన చెందేవాళ్ళం. కత్తియుద్ధంలో రాజనాల రామారావుని ఎక్కడ లోయలోకి తోసేస్తాడోనని భయపడేవాళ్ళం. రామారావు రాజనాలని ఓడించంగాన్లే ఆనందంతో చప్పట్లు కొట్టేవాళ్ళం.

కాలచక్రం గిర్రున (ఎందుకో అనాదిగా ఈ కాలచక్రం 'గిర్రు'మనే తిరుగుతుంటుంది) తిరిగింది. నేను పెద్దవాడనైనాను. సినిమా చూసి చాలా యేళ్ళయింది. ఇప్పుడు నాకు సినిమా ఎట్లా తీస్తారో తెలుసు. అంచేత అందులో మజా పోయింది. సినీఅభిమానులు ఫొటోగ్రఫీ బాలేదనీ, సంగీతం బాగుందని ఏంటేంటో మాట్లాడుతుంటారు. నాకెందుకే ఇట్లాంటి సంభాషణ రుచించదు.

పాండవవనవాసంలో రామారావు ఆవేశంగా ఊగిపోతూ తొడగొట్టి పాడిన 'ధారుణి రాజ్యసంపద.. ' రామారావు పాళ్లేదనీ, వెనుకనుండి ఘంటసాల పాడాడనీ నాకు తెలీదు. నాకా పద్యం ఎందుకంత ఇష్టమో "ధారుణి రాజ్యసంపద.. ! (బీడీలబాబు కథ)" అనే  టపాలో రాశాను. ఇప్పటితరం పిల్లలు మా అంత అమాయకులుగా ఉన్నారో లేదో తెలీదు (సినిమా ఎంజాయ్ చెయ్యడానికి కొంత అమాయకత్వం అవసరం).

నేను అప్పుడప్పుడు నా అభిమాన నటులంటూ వెనకటి తరం నటుల గూర్చి రాస్తుంటాను. వాళ్ళు గొప్పనటులని మెచ్చుకుంటూ ఉంటాను. నా రామారావు అభిమానంతో "బిరియానీయేనా? కాదు.. కాదు.. పులిహోరే.. !" అంటూ ఒక టపా కూడా రాశాను. ఎన్టీరామారావుకి సాధ్యం కానిదేది లేదని బలంగా నమ్మినవాణ్ని. ఎన్టీఆర్ నా మనసులో ఒక భాగం. అమ్మానాన్నల్లగా ఈ బంధం కూడా ఒక emotional bonding.

ఎన్టీరామారావు సినిమాలు చూసినప్పటి నా మానసికస్థితి వేరు. అప్పుడు నాకు రామారావు ఇచ్చిన మజా.. ఈరోజుల్లో పిల్లలకి మహేశ్ బాబు వంటి పాపులర్ హీరోలు ఇస్తున్నారని నా నమ్మకం. వయసురీత్యా ఒక సినిమా చూసి ఆనందించే స్థితి నేను ఎప్పుడో దాటిపొయ్యాను (ఈ స్థితి నాకేమీ సంతోషకరంగా లేదు).

సినిమా నటుల తరం మారినట్లే ప్రేక్షకులతరం కూడా మారుతుంది. ఏ తరంవారికి ఆతరం సినిమాలు నచ్చుతాయి. ఒకవయసు దాకా మన జీవితాల్లో సినిమా అనేది చాలా ముఖ్యమైనది. అటుతరవాత జీవితంలో సినిమా ప్రాముఖ్యత తగ్గడం మొదలై.. కొంతకాలానికి సినిమా అనే పదమే కనుమరుగైపొతుంది.

అందుకే వయసుడిగినవారు సినిమా ప్రసక్తి వచ్చినప్పుడల్లా తమ చిన్నప్పటి హీరోల్నే ప్రస్తావిస్తుంటారు. అసలు విషయం.. వాళ్ళు సినిమాలు చూడ్డం ఎప్పుడో మానేశారు. ఒకరకంగా ఇదో fixation. ఏసీ హోటళ్ళలకి అలవాటు పడ్డ ఈతరం కుర్రాళ్ళకి మా ఆనందభవన్ నచ్చదు. అట్లాగే మా సినిమాలూ నచ్చావు. మేం కూడా vice versa.

అమ్మాయ్య! ఇప్పుడు నాకు 'సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?' అన్న ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మీక్కూడా వచ్చేసుంటుంది (కష్టపడి ఇక్కడదాకా రాసుకుంటూ వచ్చాను. కాబట్టి మీ తరఫున కూడా నేనే చెప్పేస్తున్నా).

ముగింపు -

గత కొంతకాలంగా నా పిల్లలకి ఏదైనా పాతసినిమా చూపిద్దామని (కనీసం గుండమ్మకథ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను. నావల్ల కావట్లేదు. వారిని బలవంతం చేస్తుంటే.. 'సావిత్రేంటి ఇంతలావుగా ఉంది? రామారావెందుకలా నిక్కరేసుకున్నాడు?' లాంటి చెత్తప్రశ్నలతో నాపై ఎదురుదాడి చేస్తున్నారు. వళ్ళు మండిపోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చన్నీళ్ళ స్నానం చెయ్యడం మించి నే చెయ్యగలిగిందేమీ లేదు.

(ఏవిటో! 'సినిమాలు చిన్నప్పుడే బాగుంటయ్' అనే నా థియరీ కరెక్టనే సంతోషం ఒకవైపు.. నా హీరో ఎన్టీరామారావుని నా పిల్లలకే చూపించలేకపోతున్నాననే దుఃఖం మరోవైపు.. ఎలా రియాక్టవ్వాలో తేల్చుకోలేకున్నాను.)

(photos courtesy : Google)

44 comments:

  1. బాగా రాసారు రమణగారూ, రామారావు మీద అభిమానం డిటోయే కానీ, తను నటించిన సాంఘీకాలంటే నాకు కూడా జడుపే .కానీ హిట్ సినిమాలు( మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కధ) ఇలా కామెడీ ఉన్నవి కొన్ని చూసాను. ఇహ పాత సినిమాలు పిల్లలకు చూపించడం లో మీరు పడ్డ కష్టాల్లాంటివి నాకూ ఉన్నాయి. పొరపాటున కూడా చూడరు ఒహ వేళ బలవంత పెట్టీనా ఓ రెణ్ణిముషాలకే పారిపోతారు.అలా వాళ్ళకు రామాయణమూ, భారతమూ కూడా చెప్పలేకపోయాను:((

    ReplyDelete
    Replies
    1. Sunita Manne గారు,

      నేను చిన్నప్పుడు ప్రతి సినిమాని ఎంతో ఇష్టంగా చూశాను. 'బాగోని సినిమాలు' కూడా ఉంటాయని నాకప్పుడు తెలీదు!

      పిల్లలకి పాత సినిమాలు చూపెట్టే జిజ్ఞాస మంచిది కాదని అనుభవ పూర్వకంగా అర్ధం చేసుకున్నాను. నాకు మహేశ్ బాబు సినిమా చూసే ఓపిక లేనప్పుడు.. వాళ్ళని ఎన్టీరామారావు సినిమా చూడమని ఫోర్స్ చెయ్యడం అప్రజాస్వామికం!

      Delete
  2. బాగుందండీ పోస్టు. సినిమాలు ఎప్పుడైనా బాగానే ఉంటాయండీ. తీస్తారని తెల్సినా బాగుండేది సినిమానే. అదీ సినిమాకున్న పవర్. ఆ పవరే NTR పవర్ లోకి రావడానికి చాలావరకు ఉపయోగపడింది. పాత సినిమాలు కలర్ లో తీసి విడుదల చేసినా హిట్ అవుతున్నాయంటే వాటి నిర్మాణం , కథలు-సంభాషణలు-పాటలు-నటీనటుల నటన అన్నీ గొప్పవే. జూనియర్ NTRనుండి దాదాపు అన్ని సినిమాలలో అందరూ NTR ని ఉదహరిస్తూనే ఇప్పటికీ చాలా సన్నివేశాలు చూపిస్తున్నారంటే NTRని మరచిపోయారని, పోతారనీ నేననుకోను. 100 ఏళ్ల సినిమా సందర్భంగా ఒక్క మగాడు NTRనే అని తేలింది కదా? దాన వీర శూర కర్ణ డైలాగులు ఇప్పటికీ రింగ్ టోన్లుగా మ్రోగుతున్నాయి కదా? సినిమా పవర్ ని సరిగా ఉపయోగిస్తే సమాజం లో మార్పుకు సినిమా మీడియా ఉపయోగిపడినంతగా మరోటి ఉపయోగపడదు.

    ReplyDelete
    Replies
    1. పల్లా కొండల రావు గారు,

      చిత్తూరు నాగయ్య అభిమానులు కనుమరుగైనట్లే.. కొంతకాలానికి ఎన్టీఆర్ అభిమానులు కూడా కనుమరుగౌతారని నా అభిప్రాయం. నా చిన్నతనం ఎన్టీఆర్ సినిమాలతో ముడిపడటం ఒక యాక్సిడెంట్.

      Delete
    2. ఎంత అమాయకులండీ మీరు (నాగయ్య & SVRకి మల్లె). ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమళ్ళు, వారి పిల్లలు వగైరాలు ఏదో ఒక రంగంలో ఉన్నంత వరకు ఆయన మీద అభిమానం కను మరుగు అయ్యే చాన్సే లేదు. అలా జరిగితే వారి కుటుంబీకుల వ్యాపారం ఏమి కావాలి?

      The interests of NTR's kith & kin demands the perpetuation of his "brand".

      Delete
    3. @Jai Gottimukkala,

      మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

      చర్చ పక్కదోవ పట్టే ప్రమాదాన్ని నివారించడం కోసం చిన్న వివరణ.

      ఒక నటుడి అభిమాని అంటే ఎవరు? నేనైతే బోల్డన్ని ఎన్టీఆర్ సినిమాలు హాల్లో చూశాను. ఎన్టీఆర్ ని హీరోగా అభిమానించాను. మాతరం సినిమా పిచ్చోళ్ళు కొన్నాళ్ళకి కనుమరుగవుతారని నా అభిప్రాయం.

      (సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఒక నటుణ్ణి అభిమానించడం.. నా రామారావు అభిమానంతో పోల్చకూడదు.)

      Delete
    4. రమణ గారు,
      నాది రామారావు సామాజిక వర్గమే. నాకు ఓ పదిహేనేళ్ళు వచ్చే వరకూ నాదీ ఆయనదీ ఒకే సామాజిక వర్గమని తెలియదు. కానీ చిన్నప్పటి నుంచీ అతను సినిమాలలో చేసిన కత్తియుధ్ధాల ప్రభావంతొ అభిమానించాను.
      నాకు ఇరవై యేళ్ళు వచ్చిన తరువాత, రామా రావి ని నేను నటుడి గానే అభిమానిస్తున్నానంటే, ఎవరూ నమ్మేవారు కాదు. నా అభి మానానికి కారణం సామాజిక వర్గమే అనుకొనే వారు. శ్రీ శ్రీ, కొడవటిగంటి లాంటి వారిని అభిమానించే వారు వారి సామాజిక వర్గమైనా వారి అభిమానాన్ని ఎవరూ కులం దృష్టి తో చూడరు. కానీ రామారావు ని ఎవరైన అతని సామాజిక వర్గం వారు అభిమానిస్తే అది కులాభిమానం గానే చూస్తారు.

      Delete
    5. నేను సామాజిక వర్గాల జోలికి పోలేదు. రామారావు పాత సినిమాలకు కలకాలం క్రేజ్ ఉండడం ఆయన కుటుంబీకుల (వారే వర్గం వారయినా) ప్రస్తుత అవసరం అన్న విషయాన్ని మాత్రమె గుర్తు చేసాను.

      రమణ గారు & మీలాంటి వారు ప్రస్తుత వారసుల ప్రాపగండా కంటే ముందటిది, దానికి అతీతం. ఇలాంటి నిజమయిన అభిమానులు అరుదే.

      BTW this is also true of other great actors including MGR, Raj Kumar, Big B & Chiru

      Delete
  3. "సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?"

    - చిన్నప్పుడు మనకు అతి తెలివితేటలు ఉండవు కనుక.

    సినిమాలు ఎంజాయ్ చెయ్యాలంటే, మీరు వ్రాసినట్టు కొంచెం అమాయకత్వం అవసరం.

    నేను (నేనే కాదు చాలా మంది) సినిమా చూసేటప్పుడు చిన్నపిల్లలయిపోతారు.

    అప్పుడు కూడ మన తెలివితేటలు ప్రదర్శిస్తే, ఆ కాస్త వినోదం కూడ దక్కదు మన జీవితానికి.

    మనం టీనేజ్‌లో చూసిన సినిమాలే మనకు విపరీతంగా నచ్చుతాయి. మనం పెద్దయ్యాకా కూడ ఆ సినిమాలు మళ్ళీ చూసినప్పుడు, మనం ఆ రోజులకి వెళ్ళిపోయి చక్కగా ఎంజాయ్ (nostalgia) చెయ్యచ్చు. ఈ మధ్యే నేను "డ్రైవర్ రాముడు" సినిమా చూసి ఆనందించడమే దానికి సాక్ష్యం.


    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      నేన్రాసింది అమ్మతో కలిసి చూసిన సినిమాలు.. చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు. ఆ సినిమా పేర్లు తలచుకుంటుంటేనే నవ్వొస్తుంది.

      సతీ సక్కుబాయి, శ్రీతిరపతమ్మ కథ, బభృవాహన, ప్రమీలార్జునీయం, నాదీ ఆడజన్మే, శ్రీసత్యన్నారాయణస్వామి వ్రతమహత్యం, మంగమ్మ శపథం.. ఈ లిస్టు చాలా పెద్దది.

      Delete
  4. రామారావు మీద అభిమానం డిటో :)

    ReplyDelete
    Replies
    1. నా రామారావు అభిమానం బాల్యానికి మాత్రమే పరిమితం.

      Delete
  5. ignorence is bliss amuke

    ReplyDelete
  6. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete
  7. బాల్యపు అమాయకత్వం ప్లస్ వస్తువు కొరత... ఆనాటి సినిమాలను మధుర స్మృతులుగా మిగిల్చి ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి అమాయకత్వమూ లేదు.. సినిమాలకి కొరతా లేదు. మహేషో ఎంటీయారో లేకపోతే రణబీర్ కపూరో సింగో ఎవడో ఒకడు రెడీగా ఉంటాడు థియేటర్లో. అంత ఓపిక లేకపోతే రిమోట్ పట్టుక్కూచుంటే 24*7 సినిమాలే. అసలు బాల్యానికే ఇన్నోసెన్స్ లేకుండా పోతోంది. ఊహ తెలుస్తుండే నాటికే నట్టింట్లో వీరో వీరోవిన్లు తైతక్కలాడుతుంటారు. ఇంక కుతూహలం ఏం మిగిలుంటుంది? కాళిదాసో వాడెవడో అన్నాడుగా అతి పరిచయాదవజ్ఙా అని.

    ReplyDelete
    Replies
    1. పసిపిల్లలు ఇప్పటికీ అమాయకులేనండి.

      నేను అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని సరదాగా అడుగుతుంటాను.. మహేష్ బాబుతో రాంచరణ్ ఫైటింగ్ చేస్తే ఎవరు గెలుస్తారు? వంటి ప్రశ్నలు. వాళ్ల సమాధానం వింటుంటే చాలా ముద్దొస్తుంది.

      Delete
  8. తప్పక చదివితీరవలసిన టపా,ఆనందించవలసిన టపా!పాత సినిమాలను ఇప్పటి తరం slow సినిమాలంటున్నారు!bore కొడతాయంటున్నారు!ఒక రామారావు ఒక అక్కినేని ఒక సావిత్రి ఒక ఎస్వీరంగారావు ఏమి నటన వాళ్ళది,పాత్రలలో జీవించేవాళ్ళు!ఇప్పటి పిల్లలు తెలివిమీరి తెలుగు మీరి ఆరిందాల్లా దేశముదురులుగా అంతర్జాలంవల్ల తయారై పసితనాన్ని బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారు,తొందరపడి కోకిలలు ముందేకూస్తున్నాయి!నాటి సినిమాలకు నేటితరం connect కాలేకపోతున్నది!మనం విస్ఫారితనేత్రాలతో చిన్నపిల్లలమై కేరింతలు కొడుతూ ఇప్పటికీ పాత సినిమా DVD లను చూస్తున్నాము!గొప్ప ప్రపంచ సినిమాలన్నీ కళ్ళింతలు చేసుకొని enjoy చేస్తున్నాం,సినిమాధ్యమాన్ని ఎంతో ఇష్టపడుతున్నాం!రమణ గారూ రమణీయంగా టపా రాశారు,నాలాగే మీరుకూడా తెలివైన వారని ఒప్పుకుంటున్నాను!!!!!

    ReplyDelete
    Replies
    1. surya prakash గారు,

      రోజులు మారాయి, తరాలు మారాయి. మార్పు సహజం.

      ఇప్పటి పిల్లలు 2050 లో బ్లాగులు రాస్తారు.. 'ఔరా! రోజులెంత మారిపొయ్యాయి!' అంటూ.

      (సందేహం లేదు. మనిద్దరం తెలివైనవాళ్ళమే.)

      Delete
  9. మా చిన్నచెల్లెళ్ళకీకీ నాకూ‌ చాలా వయోబేధం ఉంది. వాళ్ళలో ఒక అమ్మాయి నాతో "పాతసినీమాలా, అబ్బా - అవన్నీ‌ చింతకాయ పచ్చడి. స్లో పరమ బోరు" అంది. ఇప్పుడు ఆమె పిల్లలతల్లి లెండి. ప్రస్తుతం పిల్లలకు చూపించటానికి పాత సినీమాల డీవీడీలు పోగుచేసుకుంటోంది. అప్పుడప్పుడు ఫోను చేసి, ఆ సినీమా చూసాను భలే గొప్పగా ఉందీ, ఇది చాలా బాగుందీ‌ అంటూ ఉంటుంది. పాతసినీమాల పేర్లు చెప్పరా కొనుక్కోవాలీ అని అడుగుతూ ఉంటుంది. ఆణిముత్యాలవంటి పాత సినీమాల పట్ల క్రమంగా క్రేజ్ పెరుగుతోందని నా అభిప్రాయం. డివీడీ దుకాణదారులు పాతసినీమాలకు మంచి సేల్స్ ఉన్నాయని అంటున్నారు కూడా.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      మనందరికీ చిన్నప్పుడు వినోదమే ప్రధానం. కొంతవయసు తరవాత ఆలోచనాశక్తి / పరిధి పెరుగుతుంది. తద్వారా అభిరుచులూ మారతాయి.

      ఒకప్పుడు విఠలాచార్యా సినిమాలు ఎగబడి చూశాను. ఇప్పుడు నాకా సినిమాల పట్ల ఆసక్తి లేదు. ప్రస్తుతం నాకు చిత్తూరు నాగయ్య 'యోగి వేమన', నాగేశ్వర్రావు 'రోజులు మారాయి' నచ్చుతున్నాయి.

      నా ఆలోచనలు, అభిరుచులలో మార్పులు పరిణామ దశలుగా భావిస్తున్నాను.

      Delete
  10. తెలుగోడు21 July 2013 at 10:11

    అమాయకంగా వ్రాశినట్టనిపించినా, ఇందులో కూడా psychology ని అంటీ అంటనట్టు అలా టచ్ చెయ్యడం మీకే సాధ్యం. పోతే, 100% ఏకీభివిస్తాను. నాక్కూడా చిన్నప్పుడు, "బాగోలేని" సినిమాలు గుర్తులేవు. ఎప్పుడూ, "బాగుండేవి", "చాలా బాగుండే" సినిమాలే గుర్తు. నన్నడిగితే, సినిమా తీయడానికి ఎంత passion అవసరమో, చూట్టానికి కూడా అంతే అవసరం అని బల్లలు, వీపులు గట్రా గుద్ది చెప్పగలను. "సతీ సక్కుబాయి" లాంటి సినిమాలు కూడా చాలా interesting గా అనిపించేవి. మేమైతే, బొమ్మ మారగానే, పొలోమని, కుటుంబసమేతంగా వెళ్ళేవాళ్ళం. ఎంత regular అంటే, gatekeeper/ticket collector టికెట్ తీసుకోకముందే, లోనికి వదిలేవాడు. నేను మా బ్రదర్ క్యూ లో నుంచొని, మళ్ళీ టికెట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. (btw, టికెట్ దొరకకపోవడం అన్న concept లేనే లేదు. థియేటర్ పుష్పకవిమానం.. ఎనతమందొచ్చినా, ఎగష్ట్రా బెంచీలు, కుర్చీలు వేసి, సినిమా అనే అద్భుతమైన అనుభవాన్ని అందరికీ పంచేవాళ్ళు).

    ReplyDelete
    Replies
    1. @తెలుగోడు,

      అమ్మయ్య! మీకు నా గోడు సరీగ్గా అర్ధమైంది.

      ఈ పోస్టులో రామారావు ప్రస్తావన పదేపదే వచ్చినా.. రామారావుకి ఈ పోస్టుతో సంబంధం లేదు.

      Delete
  11. ఇప్పటి పిల్లలు పాత సినిమాలు చూడకపోటానికీ, మహేశ్ నో చరణ్ నో ఫాలో అవడానికీ తప్పు ఎవరిది? నిజానికి పెద్దలది కాదూ? నాలుగడుగులు వేయటం రాగానే ఏ పిల్లాడూ థియేటర్ కి పారిపోవట్లేదే? వారిని తీసుకెల్తోంది పెద్దలే కదా. ఈ తరం బాలలకు తొలి సినిమా టీవీలే చూపెడుతున్నాయి. ఆ టీవీల రిమోట్లు పెద్దల చేతుల్లో ఉన్నపుడు మంచి సినిమాలు చూపిస్తే రిమోట్ ని తమ చేతుల్లోకి లాక్కునే వయసు వచ్చినపుడు కూడా పిల్లలు ఆ సినిమాలను గుర్తు పెట్టుకు చూస్తారు. కాని ప్రాక్టికల్ సీను వేరేగా ఉంది. బుడిబుడి అడుగుల పిల్లలున్న ఇంట్లో తండ్రి వయసులో ఉంటాడు. ఏ హన్సికో ఇలియానానో తెరపై గెంతుతుంటే ఆ అందాలు చూసి ఆనందిస్తాడు. తనతో పాటు ఓ పిల్లకాయ్ కూడా అవి చూస్తున్న సంగతి గుర్తుపెట్టుకోడు. ఇక తల్లికి గొప్ప క్రైం ఫాంటసీ. అత్తని చంపటం ఎలా అన్న కాన్సెప్ట్ ని అరవై ఎపిసోడ్లలో డీటైల్డ్ గా చూస్తుంది. అలాంటి వాతావరణం లో పెరిగిన పిల్లలు "కెవ్వు కేక" అనో "షీలా కీ జవానీ" అనో ఊగిపోక ఘంటశాల పాటలు వింటారా?

    నాకు పాత పౌరాణికాలంటే చాలా ఇష్టం. కాకపోతే ఏడుపుగొట్టు సినిమాలు (శొభన్ బాబు, మురళీ మోహన్ ఇలాంటి వాల్లవి కొన్ని ఉండేవి) అంటే భయం. అవునూ నాదో చిన్న డౌట్. రామారావు/రాజనాల సీరియస్ గా యుధ్ధం చేస్తుండగా వాల్లలో ఎవరికైనా "టూ" వస్తే ఏం చేసుండేవారూ?

    ReplyDelete
    Replies
    1. నేను ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాను. నాకన్నా ముందు తరం వారు చిత్తూరు నాగయ్య సినిమాలతో పెరిగారు. ఇక్కడ మంచిచెడ్డలు ఏముంటాయి? ఎన్టీఆర్ ని చిన్నప్పుడు ఆరాధించిన నేను కూడా.. ఇప్పుడు 'ఎన్టీఆర్ గొప్పనటుడు' వంటి మాటలు చెప్పడం లేదు.

      గురవయ్య హైస్కూల్, బ్రాడీపేట సందుల్లో ఆడిన క్రికెట్, ఆనందభవన్, ఎన్టీఆర్, ఘంటసాల పాటలు.. ఇవన్నీ నా చిన్నతనంతో కలగలిసిపొయ్యాయి. నాకివన్నీ unconditional గా ఇష్టం. ఇవి గొప్పవా? మంచివా? నాకెలా తెలుస్తుంది? నాదగ్గర మంచిచెడ్డలు, హెచ్చుతగ్గులు తూచే కాటాలు లేవు కదా?

      నచ్చడం, నచ్చకపోవడం అనేది పూర్తిగా మనసుకి సంబంధించిన విషయం. subjective bias కూడా చాలానే ఉంటుంది. నా దృష్టిలో ఘంటసాల గొప్పగాయకుడు. ఘంటసాల అసలు గాయకుడే కాదనుకునేవారు కూడా ఉండొచ్చు. అది వారి అభిప్రాయం. నాకు వారితో వాదన గానీ, పేచీ గానీ లేదు.

      మా చిన్నప్పుడు ఇప్పట్లా టీవీ సీరియల్స్ ఉన్నట్లైతే.. మా అమ్మ కూడా నాకు ఉత్సాహంగా చూపించేదేమో. నాన్న కూడా ఇలియానానే చూపించేవాడేమో! చెప్పలేం. టీవీ కనిపెట్టక ముందు.. ఎవరూ కూడా టీవీ చూడలేరుగదా!

      నా చిన్నతనంలో పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్లడం అంటే.. చెడగొట్టటమే అని నమ్మిన వృద్ధులు నాకు తెలుసు. కాలం మారుతుంటుంది. మనుషులూ మారిపోతుంటారు.

      Delete
    2. రమణగారూ, నచ్చడం నచ్చకపోవటం అనేది మనసుకు సంబంధించిన విషయమే అయినా ఎదిగే సమయం లో ఆ మనసు చుట్టూ ఏ వాతావరణం మనం కల్పిస్తామో ఆ వాతావరణానికే వారు అలవాటు పడే అవకాశముంది. మానసిక పరిణతి అంతగా ఎదగని చిన్న పిల్లలతో కలసి ఏ కార్యక్రమాన్ని చూసేటపుడైనా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమే కదా. ఒక మొక్క సరైన వృక్షంగా ఎదగడానికి తోటమాలి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లే ఎదిగే పిల్లలున్నవారు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చిన్న పిల్లల ఎదురుగా మందు తాగటం దమ్ము లాగటం చేస్తూ ఇవేవీ వారిని ప్రభావితం చెయ్యవు అనుకుంటే అది ఎస్కేపిజమే అవుతుంది. అదే సూత్రం వినోద కార్యక్రమాలకూ వర్తిస్తుంది. ఉదాహరణకు కామెడీ అంటే పక్కవారిని చెంపదెబ్బ కొట్టడం, అవమానకరంగా మాట్లాడటం అనే విధంగా బోలెడు సీన్లు వస్తున్నాయి. సినిమాలని వెర్రిగా అభిమానించే కొంతమంది యువత ఈ లక్షణాలనే తమ నిజ జీవితం లో కూడా చూపిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమా? టీవీలని, సినిమాలు తీసేవారిని మనం నియంత్రించలేకపోవచ్చు, కాని అడ్డమైన చెత్తని ఇంట్లోనే పిల్లల ఎదురుగా చూడకుండా మనల్ని మనం నియంత్రించుకోలేమా? "ఆ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా చూడరా" అని కొంతమంది అనొచ్చు. అటువంటివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవలక్షణాలు పిల్లలు ఎక్కడైనా నేర్చుకోగలరు. కాని ఉత్తమ లక్షణాలని తల్లిదండ్రులు గురువులే నేర్పగలరు. ఏది మంచి ఏది చెడు నాకెలా తెలుస్తుంది అని మీరు అనొచ్చు. మీరు బస్సులో వెల్తుంటే "అంకుల్ మీరు ఎక్కడి వరకు వెల్తున్నారు?" అనే ప్రశ్నవస్తే వినడానికి బావుంటుంది. "ఓయ్ బట్టతల బోడి మనిషీ, ఎక్కడ దిగిపోతావ్?" అనే ప్రశ్న వస్తే మనసు చివ్వుక్కుమంటుంది. ఒక కుర్రాడు ఎలా మాట్లాడాలి అని మనం అనుకుంటామో ఆ విధమైన ట్రైనింగే మనం మన పిల్లలకు ఇవ్వాలి.

      Delete
    3. సూర్య గారు,

      మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటున్నాను.

      పెద్దల ప్రవర్తన పిల్లల్ని ప్రభావితం చెయ్యదని నేనెప్పుడూ రాయలేదు (మీ వ్యాఖ్య జనరల్ గా రాసినట్లైతే.. ఈ వాక్యం పట్టించుకోకండి).

      (అయితే ఇంకొకళ్ళకి మంచిచెడ్డలు చెప్పేంత జ్ఞానం నాకు లేదని నా నమ్మకం. అందుకే బుద్ధిగా బ్లాగులు రాసుకుంటున్నాను.)

      Delete
    4. సూర్య గారు చెప్పింది వంద శాతం కరెక్టండీ..

      ”అవలక్షణాలు పిల్లలు ఎక్కడైనా నేర్చుకోగలరు. కాని ఉత్తమ లక్షణాలని తల్లిదండ్రులు గురువులే నేర్పగలరు”
      అక్షర సత్యాలు పైన చెప్పిన వ్యాక్యం..

      ఈ రోజుల్లో పిల్లల వ్యవహరిక బాష ఎలా ఉందో చూస్తే తల్లిదండ్రులు వారికి ఉత్తమ లక్షణాలు నేర్పిస్తున్నారా? అన్న డౌట్ రాకుండా ఉండదు.....

      Delete
  12. ఒకసారి మా తమ్ముడు, ఒక సంగతి చెప్పాడు. అప్పట్లో ఒక జానపదం సినిమాకు వెళితే, అందులో ఒక సీనులో రామారావుకు రాజనాల ముఖాముఖీగా వస్తాడు. అంతకు ముందు ఒకర్నొకరు చూసుకున్నది కూడా లేదు. అయినా వాళ్ళిద్దరూ భీకరంగా అట్టకత్తులతో అయాసం వచ్చేదాకా పోరాడి పోరాడి యెవరిదారిన వారు పోతారు. ఇది వాడు చెప్పాక నాకో అనుమానం వచ్చింది. ఒరే ఒకరికొకరు తెలియని వాళ్ళు ఎందుకని కొట్టుకునారూ అని. మా తమ్ముడి సమాధానం సింపుల్. రామారావును చూడగానే ఈ అందగాడేరా హీరో అని రాజనాలకు అర్థం కాదా? రాజనాలను చూడగానే రామారావు ఈ దొంగమొహం వాడే విలనూ అని కనిపెట్టలేడా? అయినా ప్రతీ సినిమాలోనూ కొట్టుకుంటున్నారుగా. ఆనక కథ కనుక్కోవచచ్చునులే అని పనిలో పనిగా యుధ్ధం చేసుకుని వెళ్ళిపోయారు. అదట కారణం!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      మీ తమ్ముడి సినిమా నాలెడ్జ్ అమోఘం!

      కథ ఎవడిక్కావాలండి? రాజనాల విలన్ అని, రామారావు హీరో అని.. మనకొకడు చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ ఆ విషయం వందల సినిమాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. రామారావు, రాజనాల కొట్టుకోకపొతే జనాలు దర్శకుడిని కొడతారు!

      Delete
    2. శ్యామలీయం గారు,
      మీ తమ్ముడిగారి రీజనింగ్ చాలా బాగుంది. చదవిన తర్వాత కొద్దిసేపటివరకూ నవ్వాపుకోలేకపోయాను.

      Delete
  13. ఇదంతా నిజం అయ్యి ఉంటే, ఒక సినిమాలో చనిపొయిన వాల్లు మరుసటి సినిమలో ఎలా కనిపించగలరు ? - My grand mother used to reason with me. I still didn't believe her :P

    ReplyDelete
    Replies
    1. @Sripal Sama,

      ఒకసినిమాలో చచ్చినవాడు ఇంకోసినిమాలోకి ఎట్లా వస్తాడు?

      ఇదేదో ఆషామాషీ సంధేహం కాదు. చాలా గొప్పసందేహం. ఈవిషయంపై నా స్నేహితుల మధ్య అనేక చర్చలు వాడిగా వేడిగా నడిచేవి.

      Delete
  14. బాగా రాసారండీ...సినిమాలే కాదు, చాలా విషయాలు ఆనందించాలంటే అమాయకత్వం కావాలి. దేని గురించైనా తెలియనప్పుడు వుండే మజా తెలిసిపోయాకా వుండదు...బాల్యం అందుకే వరం...ఎటొచ్చీ అది వరం అన్న విషయం అది దాటొచ్చేస్తే గానీ తెలియదు...:

    ReplyDelete
    Replies
    1. బాల్యం ఒక వరం! అవున్నిజం. ఒప్పుకుంటున్నాను.

      (ఇవ్వాళ పిల్లలు పుస్తకాల బ్యాగులు మొయ్యలేక చస్తున్నారు. వాళ్ళు మీ స్టేట్మెంట్ ఒప్పుకోకపోవచ్చు.)

      Delete
    2. వాళ్ళు పెద్దయ్యేసరికి కాలానికి తగ్గాట్టూ మోయ్యాల్సిన బరువులు ఇంకా పెరిగి...బాల్యం వరం అనే అనుకుంటార్లెండి...:)

      Delete
  15. రాజనాల నటించిన సినెమాలలో ఒక ముసలి మహారాజు ఉంటాడు . రాజనాల ఆ రాజు గారి కి బావమరిది. రాజ్యంలొ పెత్తనం చెలాయిస్తున్నాడన్న సంగతి రాజు కి తెలియటం తొ రాజు గారు మందలిసంచటం మొదలు పెట్టే సరికి రాజనాల కి కోపం వచ్చి మాట మాట పెరుగుతుంది. అంతె రాజు గారు ఎవరక్కడా అంటాడు. భటులు వస్తారు. ఈ దుర్మార్గుడిని బందించండి అని రాజు అనటం తో భటులు రాజు గారిని వచ్చి బందిస్తారు. రాజు గారికి పరిస్థితి అర్థం కాక బిక్కమొహం వేస్తాడు.అప్పుడు రాజనాల రాజు గారితో, మహరాజా మీ తరువాత కబోయే మహారాజులం మేమే కదా రాజా, అశీర్వదించండి అని అంటాడు. రాజు గారు మొసం, దగ, కుట్రా అని తిట్లు లంకించుకొంటాడు. అంతె రాజనాల గారు ఆ తిట్లని భరించలేక "ఊ , తీసుకెళ్లండి" అని భటులతొ అంటాడు. ఇటువంటి సీను లీని రాజనాల జానపద చిత్రం ఉండదేమొ.
    మా అన్నా నేను రామారావు, రాజనాల నటించిన జనపద చిత్రాలను వదలకుండా చూసెవాళ్లం.

    ReplyDelete
    Replies
    1. @UG SriRam,

      అవును. మీరు చెప్పిన సీను రాజనాల ట్రేడ్మార్క్ సీను. రాజనాల చేస్తేనే బాగుంటుంది.

      ('రాజమకుటం'లో గుమ్మడి చేశాడు గానీ.. 'రాజనాల ఎఫెక్ట్' రాలేదు!)

      Delete
  16. ఆపాత మధురాల్ని చక్కగా అక్షరీకరించారు. చదువుతోంటే చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని హాస్యస్ఫోరకంగా మనోఫలకంపై అలా కదలాడాయి. మీ కల... అదే, మీ పిల్లలకు మీ అభిమాన పెద్ద ఎన్టీఆర్ సినిమా చూపించే కల త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తాను. గుండమ్మకథ కంటే పాతాళభైరవి ప్రయత్నించండి... తోటరాముడిగా ఎన్టీఆర్, మాంత్రికుడిగా ఎస్వీఆర్ అభినయాలు, సడలని టెంపో, అద్భుత సంభాషణలు వగైరా మీ పిల్లలకు నచ్చే ప్రమాదం లేకపోలేదు. అన్నట్టు, ఎన్టీఆర్, రాజనాల కలసి నటించిన జగదేకవీరుని కథ సినిమాలో ఎందుకో వీళ్లిద్దరూ ఒక్కటంటే ఒక్కసారి కూడా కత్తులు దూయకపోవడం కాస్త చోద్యంగాను, అబ్బురంగానూ అనిపించింది. ఈ సినిమాలో కామెడీ విలనీని రాజనాల పండించిన తీరు సింప్లీ సూపర్బ్.

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      థాంక్యూ. ప్రయత్నిస్తాను. హేరీ పోటర్ ముందు తోటరాముడు సరిపోతాడంటారా?

      జగదేకవీరుని కథకి పెద్దలోపం - రాజనాల vs రామారావుల యుద్ధం లేకపోవటం. KVరెడ్డి చాదస్తుడు.. కథలో చిన్న ట్విస్ట్ పెట్టి ఇద్దరికీ ఓ కత్తియుద్ధం పెడితే ఆయన సొమ్మేం పోయింది!!

      Delete
    2. అప్పటికింకా అసాధ్యమో అసమంజసమో అయిన సీను ఇరికించాలంటే ఒక స్వప్నవృత్తాంతం అదేనండీ dream sequence పెట్టి వెలిగించేయచ్చుననే చచ్చు తెలివి తేటలు ఇప్పటంతగా పుచ్చిపోలేదేమో! లేకుంటే రాజనాలకూ రామారావుకూ యుధ్ధం పెట్తకుండానే హిట్ సినీమా తీస్తానని రెడ్డిగారు ఎవరితోనైనా మంచి పందెం చేసారేమో!

      Delete
    3. హహ్హా..! కత్తి యుద్ధం మాత్రం ఉండాల్సిందేనంటారు మీరు. మీ అనుపమాన కత్తియుద్ధాభిమానం కడు ప్రశంసనీయం సర్!! కానీ, నామట్టుకు నేను మాత్రం, అరివీర భయానక భీభత్సరస ప్రదానమగు కత్తియుద్ధాల నుండి కేవీరెడ్డిగారు కాస్త రిలీఫ్ ను ప్రసాదించారని అనుకుంటాను. కెవి రెడ్డి గారు కాకుండా వేరే దర్శకుడయ్యుంటే శ్యామ్ గారి తమ్ముడు పేర్కొనట్టు... రాజనాల - ఎన్టీఆర్ ద్వయం అసంకల్పిత ప్రతీకార చర్యలా కలుసుకోగానే కలబడి కత్తి యుద్ధకాండ జరిపేసుకుని దానిని సినిమాల్లో పెట్టేయమని హుకుం జారీ చేసేవారేమో! థ్యాంగాడ్! సెట్లో ఉన్నప్పుడు చండశాసనుడుగా పేరొందిన కెవి రెడ్డి గారంటే నాగిరెడ్డి-చక్రపాణి గార్లకు సైతం హడల్ అనీ, అప్పటికీ ఎన్టీఆర్ కూడా డైరెక్టర్ల మాట వినేవాడనీ ఎక్కడో చదివినట్టు గుర్తు. అన్నట్టు, ఎన్టీఆర్ కే సాధ్యమైన అసమాన గుర్రపుస్వారీ, అనన్యసామాన్య కత్తియుద్ధాలను... చిన్నతనంలో ఊపిరిబిగబట్టి రెప్పవాల్చకుండా చూసేవాళ్లమా, ఇప్పుడేమో అది చూస్తే పొట్టచెక్కలయ్యే నవ్వు వస్తోంది. స్థల, కాలాల్లో వచ్చిన మార్పు తాలూకు ప్రభావం కాబోలు! డార్విన్ మహాశయుని సూత్రీకరణ ప్రకారం... పాతసినిమాలవి, కత్తియుద్ధాల పరిస్థితి - struggle for existence కాగా; సినిమా వీక్షకులు మాత్రం ఎల్లకాలం - fittest of the survivalగా ఉండడం మంచిదేమో అనిపిస్తుంది నాకు. థాంక్యూ!

      Delete
    4. పిడకలవేట: నేను మా నాన్న గారి నుంచీ విన్నదేమంటే ఆ సినిమాలో రాజనాల కత్తి పట్టకుండా ఆడవేషం వెయ్యడం జనాలకు నచ్చక ఆయనకు లెటర్లు రాశారంట. సినిమా వేషాలు దొరక్కపోతే డ్రామేలేసుకోండి అంతే కానీ ఇలాంటి యుద్ధం చెయ్యని వేషాలు వెయ్యొద్దు అని.

      Delete
    5. కుంచెంసేపు నా అభిమాన రాజనాల కత్తియుద్దాల్ని పక్కనబెడితే.. రాజనాలలో అద్భుతమైన కామెడీ సెన్స్ ఉంది.

      ఒక ఉదాహరణ 'జగదేకవీరుని కథ' కాగా.. ఇంకోటి 'ఆనంద నిలయం' అనే సినిమా (కాంతారావు హీరోగా నటించిన ఈ సోషల్ పిక్చర్లో 'పదిమందిలో పాట పాడినా.. ' అనే ఘంటసాల హిట్ సాంగ్ ఉంది). అందులో రాజనాలది కామెడీ విలన్ పాత్ర. 'గుడ్డో గుడ్డు.' (గుడ్, వెరీ గుడ్ కి వచ్చిన తిప్పలు) అంటూ తెగ నవ్విస్తాడు.

      నాకా రోజుల్లో 'రాజనాల' అంటే ఇంటిపేరని తెలీదు. అందుకే టెన్త్ లో ఓసారి 'రాజనాల' ఇంటిపేరుగా గల ఒక మాస్టార్ని చూసి వణికిపొయ్యాను. ఇంటిపేరు మహాత్యమేమో.. ఆయన పిల్లల్ని బాదిపడేసేవాడు!

      Delete
    6. నిజమే. జగదేకవీరుని కథలో స్క్రీన్ పై రాజనాల - సీఎస్సార్ జంట కనిపించినంత సేపు ధారాళంగా నవ్వుల పూవులు విరబూస్తాయి. హే రాజన్ అంటూ సీఎస్సార్; హే బాదరాయన ప్రగ్గడా, కొత్తమంత్రీ అంటూ రాజనాల... తమ అత్యద్భుతమైన తెలివిని ప్రదర్శించుకోవడం సింప్లీ హెలేరియస్. ఈ లెక్కన రాజనాల (యొక్క) కత్తి యుద్ధాలు-కామెడీ కబుర్లు వింటోంటే, మీ ఈ పోస్టులో ఎన్టీఆర్ ఫొటోలతో పాటుగా, పొట్టిదో పొడుగుదో ఏదో ఒకటి రాజనాల ఫొటో కూడా జతచేసుంటే ఆయన ఆత్మ గుడ్డోగుడ్డు అని మీ బ్లాగును ప్రస్తుతించి ఉండేదేమో! :)

      Delete

comments will be moderated, will take sometime to appear.