ముందుమాట :
(ఐదేళ్ళ క్రితం తీసిన పై ఫోటో ఒకప్పటి మా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు లేదు. నేలమట్టం అయిపోయింది.)
ముందుమాట పట్టించుకోకుండా ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారా!? అయినచో మీరు ఉత్తములు. మీకు ఆయురారోగ్యాలు, ధనకనక అష్టైశ్వర్యాలు సంప్రాప్తించుగాక!
శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి.
ఈ పోస్టులో నా చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు రాస్తున్నాను. ఇది పూర్తిగా నా సొంతగోల. ఓ స్నేహితుడి కోసం నేన్రాసుకున్న తీపిజ్ఞాపకం. ఇది నా రాత కాబట్టి.. నాకంటూ ఓ బ్లాగుంది కాబట్టి.. పబ్లిష్ చేస్తున్నాను. మీకు విసుగనిపించవచ్చు. అయినా చదివేస్తాం అంటే.. మీ ఇష్టం!
టీవీలో ఏదో అమితాబ్ బచ్చన్ పాత సినిమా వస్తుంది. ఓ రెండు నిమిషాలపాటు కన్నార్పకుండా అమితాబ్ ని అలానే చూస్తుండిపొయ్యాను. గతమెంత ఘనము! రోజులెంత తొందరగా మారిపోయ్యాయి!
నేనొకప్పుడు ఇదే అమితాబ్ ని చూస్తూ మైమరచి పొయ్యేవాణ్ని. అమితాబ్ రేఖతో రొమేన్స్ చేస్తుంటే పులకరించిపొయ్యేవాణ్ని. అతని ఫైటింగులు చూస్తూ పరవశించిపోయేవాణ్ని. ఇప్పుడు అదే అమితాబ్ ని చూస్తుంటే పులకరింత, పలవరింత కాదు గదా.. కనీసం చక్కలిగింత పెట్టినట్లుగా కూడా లేదు! కారణమేమి?
వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు (ఎవరికైనా అభ్యంతరం ఉంటే గుంటూరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు.). అందుకలదు మా బ్రాడీపేట గ్యాంగ్. మా బ్రాడీపేట సందుల్లో, గొందుల్లో విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం. మా సందు బౌలర్లలో డెనిస్ లిల్లీ, మైఖేల్ హోల్దింగుల్నీ.. గల్లీ బ్యాట్స్ మెన్లలో విశ్వనాథ్, సోబర్సుల్నీ చూసుకుని ముచ్చటనొందేవాళ్ళం.
మాకు విపరీతంగా సినిమాలు చూసే గొప్పఅలవాటు కూడా ఉంది. అప్పటికి మా సినీవీక్షక ప్రస్తానం విఠలాచార్య కత్తియుద్దాలతో మొదలై.. రామారావు ఫైటింగుల మీదుగా పయనించి.. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల వద్దకి చేరుకుంది.
గుంటూర్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా రంగమహాల్లోకి, తక్కువగా విజయలక్ష్మిలోకి వచ్చేవి. ఏ సినిమా ఏ హాల్లోకి వచ్చినా ఒక్కోసినిమా ఒకటికి రెండుసార్లు చూసేవాళ్ళం. మాకదో దీక్ష, నోము, యజ్ఞం, వ్రతం. అమితాబ్ సినిమాలకి మొదట్రోజు జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. స్త్రీల టికెట్ కౌంటర్ వద్ద క్యూ పోట్టిదిగానూ, పురుషుల కౌంటర్ వద్ద క్యూ పొడవుగానూ ఉండేది.
మా రావాయ్ గాడు ("గల్తీ బాత్ మత్ కరో భాయ్!" ఫేం) ఆడవాళ్ళ టికెట్ కౌంటర్ల వద్ద చేతులోని రూపాయిల నోట్లు చూపుతూ, ఊపుతూ.. అత్యంత దీనంగా, జాలిగా 'అక్కా టికెట్! అమ్మా టికెట్!' అంటూ టికెట్లు తీసివ్వమని యాచించేవాడు. వీడి దొంగమొహాన్ని చూసి ఎవరో ఒక మహాతల్లికి గుండె కరిగేది. తత్ఫలితంగా మా చేతిలో టికెట్లు పడేవి.
అమితాబ్ సినిమాల్లో కిశోర్ కుమార్ పాటలుండేవి. అవి మిక్కిలి మధురంగా మనసును మైమరపించేవి. అమితానందంతో అమితాబ్ సినిమాని చూసిన మమ్మల్ని.. సినిమా తరవాత కిశోర్ గానమాధుర్యం ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ట్యూన్లలో హచ్ కుక్కలా వెంటాడేవి. సింగిల్ మాల్ట్ విస్కీలా మత్తెక్కించేవి.
ఇక్కడిదాకా పెద్ద విశేషం కాదు. ఇట్లాంటి అనుభూతులు దాదాపు అన్ని స్నేహబృందాలకి అనుభవమే. అయితే మాకు ఇక్కణ్నించే చాలా పని మొదలయ్యేది. మా బ్రాడీపేట గ్యాంగ్ లో అతి ముఖ్యుడు సూర్యం. హిందీ సినిమాల ప్రేమికుడు.
'పొద్దస్తమానం హిందీ సినిమాలేనా?' అని గింజుకునే నన్ను.. నా జుట్టు (ఆ రోజుల్లో నా తలకి ఫుల్లుగా జట్టుండేది) పట్టుకుని మరీ లాక్కెళ్ళేవాడు. సినిమా చూసిన సూర్యాన్ని కిశోర్ కుమార్ అవహించేవాడు.. పూనేవాడు. వెంటనే తీవ్రాతితీవ్రంగా కిశోర్ కుమార్ పాటల్ని అందుకునేవాడు.
బ్రాడీపేట రెండోలైన్ తొమ్మిదో అడ్డరోడ్డులో ఓంకార్స్ టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాని ఎదురుగా మా సూర్యం ఇల్లు. అది మా బ్రాడీపేట గ్యాంగ్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మేం ఒక ఆర్కెస్ట్రా కూడా డెవలప్ చేశాం. ఆర్కెస్ట్రా లీడ్ సింగర్ సూర్యం.
ఒకడు తుప్పుపట్టిన బుల్ బుల్ ప్లే చేస్తాడు. ఇంకోడు దుమ్ము పట్టిన మౌతార్గాన్. ఇట్లా ఎవరికీ దొరికిన వాయిద్యంతో వాడు రెడీ అయిపోయ్యేవాడు. ఇక్కడ మాది ఇండియన్ ఒలింపిక్స్ స్పూర్తి (ఏం వాయించాం, ఎంత బాగా వాయించాం అన్నది ప్రధానం కాదు.. అసలు ఆర్కెస్ట్రాలో ఉన్నామా లేదా అన్నదే పాయింట్).
ఇప్పుడు కొంచెంసేపు నా గిటార్ గోల. నేనో గిటార్ కొనుగోలు చేసి శిక్షణ నిమిత్తం ఆర్.అగ్రహారంలో ఒక గిటార్ టీచర్ దగ్గర చేరితిని. ఆయన ఎంతసేపటికీ ఏదో నోట్స్ ఇచ్చి (అది నిలువు అడ్డగీతలతో ఉండేది) ప్రాక్టీస్ చెయ్యమనేవాడు. నాకు వేళ్ళు మంట తప్ప ఏదీ పలికి చచ్చేదికాదు.
మొత్తానికి కిందామీదా పడి 'Come September' ప్లే చెయ్యడం నేర్చుకున్నాను. దాన్నే కొంచెం మార్చి 'The Good, the Bad and the Ugly' (అంటూ) ప్లే చేసేవాణ్ణి. కావున మా గ్రూప్ లో నేనే లీడ్ గిటారిస్టునని అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!
ఒక్క ఇంస్ట్రుమెంట్ కూడా తెలీని మా రావాయ్ గాడు అత్యుత్సాహంగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కునే వాడు. ఇంట్లో అటక మీద నుండి పెద్ద బొచ్చె దించి.. దాన్ని బోర్లేసి పుల్లల్తో వీరబాదుడు బాదేవాడు. వాడు మా డ్రమ్మర్! పాట పాడటం రానివాళ్ళు, తమ బొంగురు గొంతులతో లీడ్ సింగర్ కి గొంతు సాయం చేసేవాళ్ళు. వాళ్ళని కోరస్ సింగర్స్ అందురు.
ఆ రోజుల్లో ఇళ్ళల్లో టేప్ రికార్డర్ ఉండటం కాదు.. చూసినవాళ్ళూ తక్కువే (ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఇళ్ళల్లో రేడియో ఉండటమే గొప్ప)! మా సూర్యం ఇంట్లో నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఉండేది. అదిచూసి కొందరు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేవాళ్ళు. (అసలు ఆ టేప్ రికార్డర్ ఉండటం మూలానే మేం ఆర్కెస్ట్రా సిద్ధం చేశాం).
(ఐదేళ్ళ క్రితం తీసిన పై ఫోటో ఒకప్పటి మా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు లేదు. నేలమట్టం అయిపోయింది.)
మెయిన్ హాల్ పక్కనున్న ఒక చిన్న రూం మా రికార్డింగ్ స్టూడియో. గాయకుడు, వాయిద్యగాళ్ళు ఇరుక్కుని చాపల మీద కూర్చునేవాళ్ళం. ఇంతమంది ఇన్నిరకాలుగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కున్నా ఇంకొందరు మిగిలిపోయ్యేవాళ్ళు. వాళ్ళు self employment scheme quota లో సంగీత దర్శకుల అవతారం ఎత్తేవాళ్ళు.
అనగా.. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, శంకర్ జైకిషన్ స్టయిల్లో చేతులు పైకెత్తి.. పైకికిందకీ ఊపూతూ ట్రూప్ మొత్తం తమ చేతిసన్నల్లో ఉండేట్లు చేసుకునేవారు. ఎవరెవరు ఏ బిట్ ఎలా వాయించాలి అన్నది 'డిస్కస్' చేసుకుని.. ఇంకొద్దిసేపు ముఖ్యగాయకుడైన సూర్యంతో మరింత లోతుగా 'డిస్కస్' చేసి.. 'రెడీ! వన్.. టూ.. త్రీ.. ' అనే countdown తో ఆర్కెస్ట్రా ఫుల్ స్వింగ్ తో మొదలయ్యేది.
ఆర్కెస్ట్రా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ గాయకుడి వాయిస్ ని డామినేట్ చెయ్యరాదు అనే గొప్ప సాంకేతిక విశేషం మాకు అప్పుడే తెలుసు. అంచేత సూర్యాన్ని మైక్రోఫోన్ కి దగ్గరగా కూర్చోబెట్టి పాడించేవాళ్ళం. ఆ సత్తుబొచ్చెల డ్రమ్మర్ గాణ్ణి దూరంగా ఉంచేవాళ్ళం. తప్పదు మరి.. ఒక quality output కోసం ఆ మాత్రం ప్లాన్లెయ్యాలి.
ఈ విధంగా కిశోర్ పాటల్ని రికార్డ్ చేసుకునేవాళ్ళం. పిమ్మట మైసూర్ కేఫ్ లో శంకరనారాయణ పర్యవేక్షణలో ఇడ్లీ సాంబార్ గ్రోలి, కాఫీ సేవించి, క్రేన్ వక్కపలుకుల రుచితో సేద తీరేవాళ్ళం. ఆ తరవాత మేం రికార్డ్ చేసుకున్న పాటల్ని పదేపదే replay చేసుకుంటూ వినేవాళ్ళం. నాకా పాటలు వీనులు విందుగా ఉండేవి. కాకి పిల్ల కాకికి ముద్దు అని అనుకోకండి. ఒట్టేసి చెబుతున్నా. అదొక మధురమైన గానం. అద్భుతమైన ఆర్కెస్ట్రా!
'వాళ్ళు రికార్డ్ చేసిన పాట వింటుంటే పిశాచాలు పాళీభాషలో చేస్తున్న మృత్యుఘోషలా ఉంటుంది. కంకరరోడ్డు మీద చేస్తున్న సైనిక కవాతు వలె ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రా విమానం కూలిపోతున్నట్లుగా భీకర శబ్దాలతోనూ, తోకతెగిన ఊరకుక్క రోదనలా పరమ దరిద్రంగానూ ఉంటుంది.' అని మా శత్రువర్గ దుష్టాధములు ప్రచారం చేసేవాళ్ళు.
ఉత్తమ కళాకారులకి ఆత్మవిశ్వాసమే తరగని పెన్నిధి. విమర్శలకి కుంగిపోరాదు. పొగడ్తలకి పొంగిపోరాదు. ఇవన్నీ కళాకారులమైన మాకు బాగా తెలుసు. అంచేత కువిమర్శలకి తొణకక, బెణకక మా బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయి అనేక ఆణిముత్యాల్ని రికార్డ్ చేసింది.
అనాదిగా కళలకి, పరీక్షలకి చుక్కెదురు. అంచేత ఓ పరీక్షల సమయాన మా బ్యాండ్ చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయి కనుమరుగైపోయింది. ఆ విధంగా తెలుగు కళాప్రపంచం తీరని నష్టానికి గురయ్యింది!
చివరి మాట :
ఈ పోస్ట్ నా ప్రాణస్నేహితుడు సూర్యం కోసం రాశాను.
'సూర్యం! దిస్ ఈజ్ ఫర్ యూ.'
(గంటి సూర్యప్రకాష్. స్నేహితులకి ప్రేమగా 'సూర్యం'. గత ముప్పైయ్యేళ్ళుగా న్యూజెర్సీ పట్టణంలో మత్తు వైద్య నిపుణుడిగా స్థిరపడ్డాడు. ఈరోజుకీ తన పాటలతో అమెరికావాసుల్ని అలరిస్తున్నాడు.)
చివరి మాటకి చివరి మాట :
చివరి మాటకి చివరి మాట :
ముందుమాట పట్టించుకోకుండా ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారా!? అయినచో మీరు ఉత్తములు. మీకు ఆయురారోగ్యాలు, ధనకనక అష్టైశ్వర్యాలు సంప్రాప్తించుగాక!
శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి.
(photos courtesy : Google)
మీ పోస్టు కి నా సంపూర్ణ మద్దతు. అసలు గుంటూరు కి సంబంధించింది ఏదైనా సరే గొప్పగా ఉంటే చాలు నా బేషరతు మద్దతు. మొన్న మే నెల్లో అనుకోకుండా చికాగో చలి నుంచి వూడి బ్రాడీ పేటలో పడ్డాను. ఆ మే నెల ఎండలో గుంటూరెంత ధగ ధగ లాడిందని? మండి పోతున్న ఎండ ఎంత చల్లగా అనిపించిందని? శంకర్ విలాస్ మినహా అంతా సౌందర్యమే....
ReplyDeleteమీ బాండ్ విశేషాలు కలర్ఫుల్ గా ఉన్నాయి. సూర్యం గారి పాటలు ఎప్పుడైనా న్యూజెర్సీ వెళ్ళినపుడు వినే భాగ్యం కలిగితే తప్పక వింటా!!
సుజాత గారు,
Deleteమీ మద్దతుకి కృతజ్ఞతలు.
అవును.. మే నెల ఎండల్లో గుంటూరు సౌందర్యం వర్ణించనలవి కాదు. కర్ఫ్యూ వాతావరణంతో చాలా నిశ్శబ్దంగా కూడా ఉంటుంది.
"వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు... " ఇది నూటికి, 150 శాతం నిజం.
ReplyDeleteకృష్ణ
కృష్ణ గారు,
Deleteమరీ 150 శాతమేనా! ఇంకొంచెం పెంచితే బాగుండేదేమో!
అబ్బే, ఇది మాత్రం నేను ఒప్పుకోను.
Deleteఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా నరసాపురం (ప. గో. జి.) మాత్రమే. ఇది నూటికి, 200 శాతం నిజం.
రమణగారూ,
ReplyDeleteఈ పోష్టులో నాకు నచ్చిన వాక్యాలన్నీ ఉటంకిస్తేనే మరొక పోష్టంత అవుతుంది. బాగుంది.
నా దగ్గరొక భూకేంద్రసిధ్ధాంతం ఉంది. మ స్నేహితుడు ఒకతనికి తెనాలి సొంత ఊరు మరియు తత్కారణంగా అతకి దృష్టికి అదే భూమికి కేంద్రం. హైదరాబాదులో ఉద్యోగరీత్యా ఉండే అతగాడు చివరకు ఇల్లు మారాలన్నా సరే ఒకసారి తన భూకేంద్రం తప్పక దర్శనం చేసుకోవలసిందే. ఎక్కడికి ప్రయాణమైనా వయా తెనాలి కావలసిందే.
మీ దృష్టిలో గుంటూరు భూమికి కేంద్రం. కానివ్వండి. ఎవరికీ అభ్యంతరం ఉండదు.
శ్యామలీయం గారూ,
Deleteపోస్టుని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.
మీ భూకేంద్రసిద్ధాంతం బాగుంది, నాకు నచ్చింది (అప్పుడే నా గుంటూరు సిద్ధాంతం కూడా కరెక్టవుతుంది కాబట్టి).
సర్ ఇంగ్లిష్ లొ ఒక్క మాటలొ రాద్దామనుకున్నను కాని మనసు ఒప్పలేదు, మీ పోస్ట్ చదువు తుంటే నాకు చిన్నతనం గుర్థొస్తున్నది, మీరు మనసుని కదిలించి మానసిక వైద్యం చేస్తున్నరు super
ReplyDeletekrishna mohan గారు,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలు.
మా ఆర్కెస్ట్రా నాకు గొప్ప nostalgia అవుతుందని అప్పుడనుకోలేదు.
రమణ
ReplyDeleteఇన్ని సుందరమైన అందమైన మధురమైన
జ్ఞాపకాలు ఉంచుకుని ఎందుకు అల్గీమర్స్
వచ్చిందని అబ దాలు చెబుతావు
గోపరాజు రవి
థాంక్యూ రవి.
Deleteఆల్జైమర్స్ లో ముందుగా recent memory పోతుంది. నేన్రాసే జ్ఞాపకాలు remote memory pool నుండి. అదీ విషయం!
మీ బాండు పేరేంటి? "ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్" చాలా పొడుగ్గా ఉంది. బ్రాసూవెంరా (బ్రాడీపేట, సూర్యం, వెంకట రమణ & రావాయి) అనే పేరు పెట్టుకుంటే ఆబ్బా (Agnie, Bjoern, Benny & Anni) లేవేలులో ఉండేదేమో?
ReplyDeleteJai Gottimukkala గారు,
Deleteమా బ్యాండ్ కి ఆ రోజుల్లో ఒక మంచి పేరు పెట్టుకునే ఆలోచన చెయ్యలేదు. (చేసినట్లయితే.. ఎవడి పేరు అక్షరం ముందు రావాలో తేల్చుకోలేక తగాదాలు అయ్యేవేమో).
కొన్నేళ్లుగా మా చిన్ననాటి గ్రూప్ ని BeeGees (Brodipeta Gang) గా పిలుచుకుంటున్నాం.
నేను పేర్లు రాయలేదు గానీ.. మాలో కొందరు (వైద్యరంగ) ప్రముఖులు ఉన్నారు. వాళ్లకి నేను మా చిన్నప్పటి గోలని (పేర్లతో సహా) రాయడం ఇష్టమో, కాదో నాకు తెలీదు. అంచేత సూర్యం (వీడి పర్మిషన్ నాకు అక్కర్లేదు) ఒక్కడి పేరే రాశాను.
"మా బ్యాండ్ కి ఆ రోజుల్లో ఒక మంచి పేరు పెట్టుకునే ఆలోచన చెయ్యలేదు"
Deleteఇదే సమస్య. ఇందుకే మీ బాండ్ బీజీ, ఆబ్బాలను దాటలేదు.
You sir need a good marketing consultant. నా ఫీజు వివరాలు తరువాత (ప్రైవేటుగా) చెబుతాను.
Wonderful post Ramana! Loved it. This is one of your best posts and ranks up there with "గల్తీ బాత్ మత్ కరో భాయ్!" and భానుమతి.. సావిత్రి.. ఫ్రాయిడ్.. నేను కూడా!
ReplyDeleteBSR
dear BSR,
Deleteధన్యవాద్! ముగేంబో ఖుష్ హువా!
"వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు (ఎవరికైనా అభ్యంతరం ఉంటే గుంటూరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు."-- కోర్టులూ కేసులూ అంటూ ప్రజాధనం ఎందుకు వృధాచెయ్యటం. ఈ సంగతి ఏ నమస్తే తెలంగాణ పత్రికవారికో చెప్పండి. వాళ్ళే చూసుకుంటారు ఈ బోడిపేట మ్యూజిక్ బాండ్ సంగతి :-)
ReplyDeleteసూర్య గారు,
Deleteనా బ్లాగులో ఒకప్పుడు SNKR ఇట్లాగే వ్యంగ్యంగా, సరదాగా కామెంట్లు రాసేవారు. ఇప్పుడాయన రాయట్లేదు గానీ.. మీ కామెంట్లు SNKR గారి కామెంట్లని గుర్తు తెస్తున్నాయి.
(మా బ్రాడీపేటని బోడిపేట అనడాన్ని ఖండిస్తున్నాను.)
నిజం చెప్పండి డాక్టరుగారూ.. కోపం వచ్చిందా?
Delete@సూర్య,
Deleteదేవునియందు ప్రమాణం చేసి నిజమే చెబుతున్నాను. అస్సలు కోపం రాలేదు.
(మహానాయకుడికి మల్లే నాక్కూడా కోపం నరం ఎప్పుడో తెగిపోయింది.)
ReplyDeleteగుంటూరు పొగాకు గురించి ఒక్క ముక్కా రాయకుండా,ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు అంటే ఎట్లా?
జిలేబి
జిలేబి జీ,
Deleteనిజమే సుమీ! పరాకున అసలు విషయం మరచితిని.
గుంటూరు పొగాకుకి ప్రసిద్ధి. అందువల్లనే ఇది సుందర ప్రదేశం! ఇప్పుడు ఓకేనా?
అంటే గోంగూరకీ, మిరపకారానికీ గుంటూరు ప్రసిధ్ధి కాదా? అనవసరంగా ఇన్నాళ్ళూ పొరపడ్డానే!
Deleteలేదండి,
Deleteఎవ్వరిని అడిగినా, ఎక్కడయినా చినిమాల్లో గుంటూరు గురించి ప్రస్థావన వచ్చినా మొట్టమొదట "గోంగూర" గురించే వస్తుందండి.
రమణా వేర్వేరే విషయాల మధ్య మన బాల్య స్మృతులు చొప్పించి మా కళ్ళు చెమర్పించి మా మనస్సునూరిస్తున్నావ్ (ఇక్కడ మా అనగా మా అందరిని అనీ ఎన్టీఆర్ వారి లాగా "నా" కు బదులుగా వాడింది కాదనీ సవినయంగా మనవి). నిన్నటివరకూ సూర్యం, బీఎస్సార్, నేనూ ఒక మూడురోజులు ఓ తెలుగు సాహితీ సదస్సులో కూర్చుని ఆనన్దించామనుకొంటే దాన్ని మించిన ఆననదాన్నిచ్చింది నీ రాత! బాగు బాగు.
ReplyDeleteఓ కోరస్ గాయకు
మై డియర్ కోరస్ గాయకా,
Deleteథాంక్యూ.
బ్రాడీపేటలో పుట్టటం వల్లనూ, సూర్యం స్నేహం వల్లనూ మాత్రమే నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నానని బలంగా నమ్ముతున్నాను. నేరాసే జ్ఞాపకాలు మీ ఋణం తీర్చుకునేందుకే.
మన గుంటూరు ఖ్యాతి ఇలా ఖండాంతరాలకు వ్యాప్తిచేస్తున్న మీకు మీ మితృబృందానికి అభినందనలండి
ReplyDeletedurgeswara గారు,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలు.
మన గుంటూరు ఖ్యాతికి ముఖ్యకారణం గుంటూరు మెడికల్ కాలేజ్ అని నా అభిప్రాయం.
రమణ ,మన బ్యాండ్ మీద వ్రాసిన బ్లాగు భలెగాఉంది మనం చేసిన రికార్డింగ్ లు గుర్తుకు వచ్చినప్పుడల్లా పొట్ట చెక్కలయ్యే నవ్వు వస్తుందంటే అతిసయోక్తి ఏమి కాదు .నిజం చెప్పాలంటే అప్పుడు నేను చేసిన పూజల మూలంగ నాకు దేముడు ఇచ్చినన పెద్ద కానుక కరయోకి ( Karaoke) . దీని వల్ల చెల్లా చెదురైన మన బ్యాండు లేని లోటు తీరినది . మొత్తానికి నీ బ్లాగు లో నన్ను కూడ ఇరికించి నాకు కూడ ఒక బ్లాగు పట్టా ఇచ్చినందుకు Thanks . నాకు మటుకు నీ మిర్చీ బజ్జీల బ్లాగు NO 1
ReplyDeleteసూర్యం
సూర్యం,
Deleteమన రికార్డింగ్ ప్రహసనాన్ని రికార్డ్ చెయ్యాలని ఎప్పట్నుండో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి కుదిరింది.
మన చిన్నప్పటి సంగతులు మనకెప్పుడూ బాగానే ఉంటాయి. ఇవన్నీ మనం కబుర్ల రూపంలో చెప్పుకునేవే.
నాకు సంతోషం / ఆశ్చర్యం కలిగించినదేమనగా.. మన గోల నా బ్ల్లాగ్ రీడర్స్ కి నచ్చడం (వాళ్లకి బోర్ కొడుతుందనే అనుమానంతో ముందుమాట రాశాను).
(నీపై ఒక పోస్ట్ రాయడం నాకు బాకీ తీర్చుకోవడం లాంటిది. కాబట్టి మనమధ్య థాంక్స్ లు ఉండవు.)
This comment has been removed by the author.
ReplyDeleteఆనాటి చెలిమి ఒక కల
ReplyDeleteకల కాదు నిజము ఈ బ్లాగ్
మనసనేదె లేని నాడు బతుకులే వెల వెల,,
మంచి పాట. చక్కగా అన్వయించారు. థాంక్యూ.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteAwesome ! Reminds me of our own orchestra days, inspired by ramanavami tent orchestra, on 4th line where we get detective books from madhavarao shop, now a jeweler shop, all those came there could hear our skills at work. LOL. THANK YOU for this great post !
ReplyDeleteచాతకం గారు,
Deleteథాంక్యూ!
మాధవరావ్ షాప్! నేను వినలేదు.
నేను బ్రిడ్జి (దీన్ని flyover అనాల్ట! నాకైతే బ్రిడ్జి అనడమే ఇష్టం) పక్కన శ్రీదేవి బుక్ స్టాల్ బాగా తెలుసు. వీలైతే ఈ బుక్ షాప్ గూర్చి ఒక టపా కూడా రాయాలని ఉంది.
Madhavarao book/magazine rental is small shop build under staircase (current Hari jewellers) on 4th lane before its built. There is a small mom/pop hospital opposite it. I am a long term customer at sridevi bookstores (who is n't) and very thankful for introduction of tintin books that I rented/rerented zillion times gave interest in the world which made me think about going abroad !
DeletePs: please write also about mirchi bhajji stalls of guntur ;)
డా.రమణ గారూ,
ReplyDelete"సమ్మోహనశాస్త్ర" నిపుణుడైన మీ స్నేహితుడు డా.సూర్యప్రకాష్ గారి చుట్టూ తిరిగే ఈ టపా బాగా వ్రాసారండి.
నరసింహారావు గారు,
Deleteవ్యాఖ్యకి ధన్యవాదాలండి.
ఎంతమాట బోర్ ప్రసక్తే లేదు రమణగారు. ఇలాంటి జ్ఞాపకాలు మీ ఒక్కరివేకాదండీ అందరివీనూ.. కాస్త తేడాలతో చాలామందిమి ఇలాంటి పనులు చేసినవాళ్ళం ఉంటాం అందుకే అందరం కనెక్ట్ అవగలుగుతున్నాము :) అందులోనూ మన గుంటూరు బ్రాడీపేట పేర్లు వినపడితే ఇంకేముంది మైమరచిపోమూ :))
ReplyDeletehahahahaha
ReplyDeleteBest blog post of the decade
ReplyDelete@kiran,
Deleteనిజంగా! ఏమిటో మీరు ఇట్లా నిజాలు చెప్పేసి నన్ను మరీ మొహమాటానికి గురి చేస్తున్నారు. ఠాప్...
(మీ కామెంటుకి బెలూన్లా ఉబ్బిపోయి పేలిపోయాన్లేండి.)
కరెక్ట్ గా చెప్పావురా రమణ.
ReplyDeleteఅందరికి ఇలాంటి అనుభూతి తప్పనిసరిగా ఉంటుంది. సహజంగా ఇలాంటి స్మృతులు బందుత్వంలో కన్నా స్నేహితులతో కలసి పంచుకున్నవే మధురంగా ఉంటాయి. స్నేహితులంతా జీవితంలో స్థిరబడి కడదాక "స్నేహ బంధం" కొనసాగిస్తూ అడప తడపా కలిసినప్పుడు ఈ మధురానుభూతులను నెమరువేసుకుటూ ఉండవచ్చు. అప్పుడు ఆ అనుభూతి ఆ స్నేహితుల మధ్యలోనే ఉంటుంది. అలా కాకుండా ఇలా మీడియాలో పదీలపరిచి దానిని స్నేహితులు వారి కుటుంబ సభ్యులతో ఆ అనుభూతులను పంచుకొనేటప్పుడు వచ్చే ఆనందానికి వెల కట్టడం కష్టమేమో. స్నేహత్వం పొందడం చాలా కష్ఠం, ఆ స్నేహం మధ్య ఎటువంటి తారతమ్యం లేకుండా చిరకాలం కొనసాగడం ఇంకా కష్ఠం. మరి ఇన్ని కష్ఠాలను దాటి వస్తే "స్నేహ బంధం ఎంతో మధురం" గాక ఇంకెలా ఉంటుందండి. ఒరే రమణాయ్ ఈ విధంగా తరువాత తరానికి స్నేహపు విలువను తెలియజేసినందుకు చా చాలా ఆనందాగా, గర్వంగా ఉన్నది.
ఆఖరుగా.
అక్కా టికెట్! అమ్మా టికెట్! అని అడిగిన "రామాయ్", గా
"ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్" లోని ఒక డ్రమ్మర్ గా
ప్రసిధ్ధ "గల్తీ బాత్ మత్ కరో" పాత్ర పోషించిన,
"స్నేహబంధము ఎంతో మధురము" గా ఉన్న బ్రాడీపేట గ్యాంగులో ఒక సభ్యుడయిగా, ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను
ఇప్పుడే మీ బ్లాగ్ ని చదివాను. నేను 1961 క్లాసు వాన్ని. సూర్యం అన్నయ్య సుందర రామయ్య నా క్లాసు మేట్. నేనూ నా స్నేహితులు అనాటమీ dissection హాల్ లో కోతలన్నీచాలా తొందరగా చేసేసి మిగతా అరగంట సినిమా కబుర్లు చెప్పుకుంటూ గడిపే వాళ్ళం. "మిస్సమ్మ సినిమా లో 'సీతారాం సీతారాం' పాటను బట్టి, మా గ్రూప్ కి 'సీతారామ సంఘం' అని పేరు పెట్టాం. మీకు అమితాబ్ లాగా, మాకు దేవ్ ఆనంద్ మరియు షమ్మి కపూర్.
ReplyDeleteఇంతకూ నేను ఎందుకు వ్రాస్తున్నానంటే, we thought we had best times during school days. But, "సూర్యం అండ్ కో" లని చూసిన మరియు విన్న తరువాత, మీరందరూ friendship అనే పదానికి బెస్ట్ నిర్వచనము ఇచ్చారు. మీరూ, సూర్యం మరియు తదితరులు రికార్డు చేసిన పాటలు ఉంటె బ్లాగ్ లోకి దయచేసి ఎక్కించండి.Congrats on the great article you wrote. It is not only nostalgic for you, it made every one of us to go back and reminisce our student days.
Vijaya Raghava Rao.
మా ఆర్కెష్ట్రా పాటలు సూర్యం దగ్గర ఉన్నాయేమో కనుక్కుంటాను.
Deleteనాకున్న అతితక్కువ తీరిక సమయంలో సరదాగా ఏవో నాలుగు ముక్కలు రాస్తుంటాను, మీవంటి సీనియర్లకి కూడా నా రాతలు నచ్చినందుకు ఆనందంగా ఉంది. థాంక్యూ సర్.