Wednesday, 17 July 2013

బడిపిల్లలు ఉద్యమకారులేనా?



కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని కోస్తాంధ్రలో మళ్ళీ 'ఉద్యమ సెగలు' మొదలయ్యాయి. నిరసన తెలియజెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం అనేవి ప్రజాస్వామిక హక్కులే. అయితే ఉద్యమాలు చెయ్యవలసింది ఎవరు? రాజకీయ పార్టీలు, లేదా తమకి నష్టం జరుగుతుందని భావించే వ్యక్తుల సమూహం, బడిపిల్లలు కాదు.

పోయిన సంవత్సరం 'సమైక్యాంధ్ర' పేరిట ఒక ఉద్యమం నడపబడింది. బడిపిల్లల్ని యూనిఫాముల్లో, బ్యానర్లు మోయిస్తూ గొర్రెల్ని తోలికెళ్ళినట్లు తీసుకెళ్ళి నిరసనల్లో భాగం చేశారు. 'మానవ హారం' అంటూ పిల్లల్ని ఎండలో గంటలకొద్ది నించోబెట్టారు. నాయకులు ఆవేశంతో ఊగిపోతూ (టీవీల కోసం) ప్రసంగాలు చేశారు. చివర్లో KCR దిష్టిబొమ్మని చెప్పుల్తో కొట్టి తగలబెట్టారు. ఈ తతంగం ఎప్పుడైపోతుందా అని పిల్లలు మండుటెండలో మాడిపోతూ, నీరసంగా ఎదురుచూశారు.

పిల్లల్తో ఈ విధంగా బలవంతపు 'నిరసన' తెలియజెయ్యడం  స్కూలు యాజమాన్యాలకున్న రాజకీయాలే కారణం. అనేక స్కూళ్ళ యాజమాన్యాలకి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు (vested interest కూడా) ఉండటం చేత.. 'ఉద్యమం' కోసం పిల్లల్ని పోగుచేసి.. ఇలా రోడ్ల మీద ప్రదర్శన చేయించారు.

నా చిన్నతనంలో నేను కూడా ఇట్లాంటి హింసకి గురయ్యాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్ళయ్యిందని మాచేత బ్యానర్లు మోయిస్తూ రోడ్లన్నీ తిప్పారు. 'అసలీ స్వాతంత్ర్యం ఎందుకొచ్చిందిరా బాబోయ్!' అని ఏడ్చుకుంటూ ఊరంతా తిరిగాం. మధ్యలో పారిపోవటానికి వీల్లేకుండా సింహంలా హెడ్మాస్టర్, పులుల్లా మేస్టర్లు మాకు కాపలా. పట్టుబడితే అంతే సంగతులు.

'జైఆంధ్ర' ఉద్యమంలో కూడా మాకు ఇవే కష్టాలు. 'ముల్కీ డౌన్ డౌన్' అంటూ వీధులన్నీ తిప్పారు. పోనీ 'ముల్కీ' అంటే ఏంటో చెబుతారా? అంటే అదీ లేదు. జైఆంధ్ర ఉద్యమంలో మాదో కూలి పని. వెట్టి చాకిరి. పిల్లల్ని ఎండల్లో తిప్పడం.. జనాలని చౌకగా పోగేసే ఒక దుర్మార్గ విధానం. ఇన్నేళ్ళైనా పిల్లల పరిస్థితి ఏమాత్రం మారకపోవటం ఆశ్చర్యకరం.

ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రతి అడ్డమైన ప్రభుత్వ అధికార కార్యక్రమాలకి (అనగా మంత్రులు, కలెక్టర్ పాల్గొను కార్యక్రమం) పిల్లలతో ర్యాలీ తీయిస్తారు. ప్రధాన వీధులన్నీ తిప్పుతారు. మొన్నామధ్య ఎయిడ్స్ ని అరికట్టండంటూ పిల్లల్తో ఒక భారీ ప్రదర్శన చేయించారు. మరి పిల్లలకి, ఎయిడ్స్ కీ సంబంధమేంటో తెలీదు.

మా ఊళ్ళో ఘనత వహించిన ఒక స్కూల్లో ఓనరయ్య, ఓనరమ్మలు తమ పుట్టిన్రోజులకి (పొగుడించుకుంటూ) పిల్లల్తో పాటలు పాడించుకుంటారు. వారు నడిచే దారిలో పూలు చల్లింప చేయించుకుంటారు. విద్యార్ధుల తలిదండ్రులు ఇలాంటి హీనమైన, సిగ్గుమాలిన, నీచసంస్కృతికి ఎందుకు సహకరిస్తున్నారో అర్ధం కాదు.

పిల్లలు చాలా సున్నితమైనవారు. అర్భకులు. వారిని ఎండల్లో రోడ్లంట తిప్పడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదు. అందువల్ల వారు dehydration కి గురయ్యే ప్రమాదముంది. దుమ్ము, ధూళి, చెత్తకి expose చెయ్యడం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముంది. మన పట్టణాల్లో ట్రాఫిక్ చాలా అడ్డదిడ్డంగా ఉంటుంది. ఈ ర్యాలీల్లో ఒక పద్ధతిగా లైన్లో వెళ్తున్న పిల్లల్ని.. సిటీ బస్, ఆటో డ్రైవర్లు హారన్లు కొడుతూ వారిని కంగారు పెట్టి పరుగులు తీయిస్తుంటారు. వారికదో పైశాచికానందం.


పిల్లల్ని తమ రాజకీయ కార్యక్రమాలకి వాడుకునే దుష్టసంప్రదాయాన్ని అందరూ వ్యతిరేకించాలి. మనదేశంలో పులులకీ, తోడేళ్ళకైనా రక్షణ అంటూ చట్టాలు చచ్చాయి. కానీ.. పిల్లల రక్షణ కోసం చట్టాలున్నట్లు తోచదు. ఇదొక విషాదం, కానీ వాస్తవం.

(photo courtesy : Google)

21 comments:

  1. సమైక్యాంధ్ర ద్రోహి (aka తెలంగాణా ద్రోహి)

    అద్సరే డాట్రు గారు, మీ గుంటూరోల్లు, బానర్లలో సమై'క్య' ని సమై'ఖ్య' అని రాస్తారేటి?

    ReplyDelete
    Replies
    1. @Bullabbai,

      మా గుంటూరువారికి ఏది చెప్పాలన్నా నొక్కివక్కాణించడం అలవాటు (మిర్చిఘాటు ప్రభావం). అంచేత 'సమైక్య' కన్నా 'సమైఖ్య' అనటమే మాకు ఇష్టం.

      (మీరు మా భావతీవ్రతని అర్ధం చేసుకోవాలి.. వ్యాకరణాన్ని కాదు!)

      Delete
  2. మాష్టారు,
    ప్రతీదానికి చట్టం కావాలంటే system బాగా complicate అయ్యిపొతుందండి. top down approach అంటే, ప్రజలు ఎలా బ్రతకాలో ప్రభుత్వం చెప్పడం కంటె, bottom up approach, మనం ఎలా బ్రతకాలో, ప్రభుత్వం ఎలా ఉండాలో చెప్పే స్థాయికి ప్రజలు మారినప్పుడే అసలు పరిష్కారం దొరుకుతుంది. ప్రజాస్వామ్యం అసలు ఉద్దెశ్యం అదే. కానీ మన బానిస మనసులు ఇంకా ఎవరొ ఒకరు మనలను కర్ర పట్టి నడిపించాలి అనే స్థాయిలోనే ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. Mahesh గారు,

      మీతో ఏకీభవిస్తున్నాను. కానీ ఈలోపు బడిపిల్లలు మాత్రం ఉద్యమ సెగలకి మలమలా మాడిపోతుంటారు.

      Delete
    2. మహెష్ గారు,
      చాలా బాగా చెప్పరండీ !!!
      వైద్యులుగారు, ఎప్పటికైన మన ప్రజలు అలా అలొచిచటం మొదలు పెడతారా? అంటే, వోట్లు అడగటానికి వచిన వాళ్ళని, "ఏహే , నీ కులం, అబ్బ పేరు కాకుండ, అసలు నువ్వు ఎం చదువు కున్నావు , ఎం చెశావో చెప్పు " అనె స్థాయికి వస్తార?
      కృష్ణ

      Delete
    3. Mahesh,

      well said..

      Delete
  3. సినిమల్లో సీన్లు వస్తే పిల్లలు చెడిపోతారు అని సాకు చూపిస్తారు సెన్సారు వాళ్ళు , మరి స్కూళ్ళల్లో ఏయిడ్స్ పైన వ్యాస రచన పోటీలు, ఉపన్యాస పోటీలు చేయిస్తుంది విద్యాశాఖ. అసలు ఏయిడ్స్ గురించి యు సర్టిఫైడ్ గా మాట్లాడ్డం రాయడం కష్టం కదా... అంతే ఇలా పొంతన లేని చేష్టలు చాలా నే చేసి విద్యార్థు ల తో ఆడేసుకుంటారు మరీ ముఖ్యంగా గవర్నమెంటు పాఠశాల విద్యార్థులతో!.

    ReplyDelete
    Replies
    1. Narsimha గారు,

      పాఠశాల విద్యార్ధుల హక్కుల హననంలో అందరూ పోటీపడుతూనే ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం.

      Delete
  4. రమణ గారు బుక్కయిపోయారు. ఇక మిమ్మల్ని సమైక్యవాదులు విపరీతంగా ఆడిపోసుకోవడం ఖాయం!

    ReplyDelete
    Replies
    1. Jai Gottimukkala గారు,

      సమైక్య / తెలంగాణావాదుల సంవాదదశ దాటిపోయిందని నా అభిప్రాయం. ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపే.

      Delete
  5. 1. చంద్ర బాబు హయాం లో "జన్మ భూమి" కార్యక్రమంలో మండుటెండలో రోజంతా పిల్లలను మానవ హారాలుగా నిలబెట్టిన విషయం పాపం మీకు కనబడలేదు..
    2. తెలంగాణా వుద్యమంలో పాపం విద్యార్ధులు ఎవరూ పాల్గొనలేదు..

    ReplyDelete
    Replies
    1. voleti గారు,

      నేను 'మాఊళ్ళో' బడిపిల్లల హింస గూర్చి మాత్రమే రాశాను.

      పిల్లల్ని ఇబ్బంది పెట్టే విషయంలో ఆంధ్రా, తెలంగాణా.. కాంగ్రెస్, TDP టైప్ చర్చ అనవసరం అనుకుంటున్నాను.

      Delete
    2. బాగా చెప్పారు. ఎంతైన మనకు, మన పరిది దాటి ఒక విషయం చూడాలంటే , కొంచెం కష్టం.
      "మా ఊళ్ళో ఘనత వహించిన ఒక స్కూల్లో ఓనరయ్య, ఓనరమ్మలు తమ పుట్టిన్రోజులకి (పొగుడించుకుంటూ) పిల్లల్తో పాటలు పాడించుకుంటారు. వారు నడిచే దారిలో పూలు చల్లింప చేయించుకుంటారు. "
      కొంచెం చెప్పండి ఈ మహానుభావులెవరో !!!
      కృష్ణ

      Delete
    3. కృష్ణ గారు,

      అది దేవరహస్యం. చెప్పరాదు.

      Delete
    4. దేవరహస్యం అంటే దేవతలకు చెప్పకూడని రహస్యం కదండీ! మానవమాత్రులం మాకు చెప్పొచ్చేమో :-)

      Delete
  6. చాలా మంచి పోస్టు.స్కూలు పిల్లలను ఎటువంచి ఆందోళనలలోనూ పాలు పంచుకో కుండా నిషేధించాలి.మన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ తోకలే. అందు చేత వారాడించినట్లల్లా ఆడుతూనే ఉంటారు.అందుకే ఈ విషయం గురించి ఏ ఒక్క పార్టీ వారూ మాట్లాడరు.

    ReplyDelete
    Replies
    1. Pantula gopala krishna rao గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      నా దృష్టిలో పిల్లల్ని ఇబ్బంది (మానసికంగానైనా, శారీరకంగానైనా) పెట్టే ఏ సమాజమైనా అనాగరికమైనది.

      Delete
  7. saamajika spruha, pillallo chinnathanam nunche chaithanyavanthulanu cheyyalani elanti kaaryakramalu chesthunnam anedi school yaajamanyalu cheppeti andhamaina najukaina ABADDHAM....kiran stubborn

    ReplyDelete
  8. బడి పిల్లల్ని నిరసనల్లో నిలబెట్టడం ర్యాలీలలో తిప్పడం దిక్కుమాలిన పనే, కానీ, విషపు తిండ్లు పెట్టి చిన్నారులని చంపేస్తున్న స్కూల్ లంచ్ స్కీములు అతి దారుణం.
    Bihar midday meal kills 27 kids
    బి ఎస్ ఆర్

    ReplyDelete
    Replies
    1. Dear BSR,

      అవును. ఒప్పుకుంటున్నాను.. చావుని మించిన దారుణం మరోటి లేదు.

      బీహర్లో పిల్లలు మరీ సుకుమారుల్లా ఉన్నారు. మన తెలుగువారికి పౌరుషమే కాదు, resistance కూడా ఎక్కువే! మన రాష్ట్రంలో ఈ లంచ్ స్కీముల వంటిశాలలు చూస్తే.. ఈ ఆహారం తిని పిల్లలు ఎట్లా బ్రతికుంటున్నారు? అని ఆశ్చర్యంగా ఉంటుంది.. దిగులుగా కూడా ఉంటుంది.

      (ఇవన్నీ ఆలోచించి బిపి తెచ్చుకునేకన్నా హాయిగా బజ్జీలు, బంతిపూలంటూ బ్లాగులు రాసేసుకుంటూ బ్రతికెయ్యడం ఉత్తమం అనే నిర్ణయానికొచ్చేశాను.)

      Delete
  9. This comment has been removed by the author.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.