Saturday, 13 July 2013

ప్రాణ్


హిందీ సినిమా నటుడు ప్రాణ్ చనిపోయాడు. ప్రాణ్ మనదేశంలో అత్యంత ప్రముఖుడైన దుష్టుడు. తొంభై సంవత్సరాలు దాటి జీవించాడు. బహుశా హిందీ సినిమా ప్రేక్షకులు ఆయన్ని (ఆయన పాత్రల్ని) తిట్టిన తిట్లన్నీ దీవెనలుగా మారి ఇంతటి దీర్ఘాయుష్షు ప్రసాదించాయేమో!

వందేళ్ళక్రితం ప్రజలకి సినిమా అంటే ఏంటో సరీగ్గా తెలీదు. సినిమా అందుబాటులోకి వచ్చిన మొదట్లో చాలారోజులపాటు అంతకుముందు ప్రదర్శించిన నాటకాల్నే సినిమాలుగా మార్చుకున్నారు. కొంతకాలానికి సాంఘిక కథలు సృస్టించడం మొదలెట్టారు.

అయితే ఈ 'సాంఘిక' కథలక్కూడా రామాయణ మహాభారత కథలే మూలం, స్పూర్తి అని నా అభిప్రాయం. మంచి లక్షణాలన్నంటినీ పేర్చి నాయకుడిగానూ, చెడ్డలక్షణాలన్నీ కుప్పపోసి ప్రతినాయకుడిగానూ కథలు రాసుకుని సినిమాలు తీశారు. అనగా విలన్ పాత్రలకి ప్యాంటు, షర్టు తోడిగినా.. వాడికన్నీ రాక్షస లక్షణాలే. అందుకే విలనెప్పుడూ దుర్మార్గుడు, నీచుడు, స్త్రీలోలుడు.

అంచేత ఆ రోజుల్లో దాదాపు అన్నిభాషల్లో ఇట్లాంటి విలన్ పాత్రలుండేవి (అనుకుంటున్నాను). 1950 మరియు 60 లలో తెలుగులో రాజనాల, తమిళంలో నంబియార్, హిందీలో ప్రాణ్ లు దుష్టపాత్రలు పోషించారు. అర్ధశతాబ్దం తరవాత.. ఇప్పుడు మనకా పాత్రలు cartoon characters లా అనిపిస్తాయి కానీ.. ఆ రోజుల్లో అవి కథకి అత్యంత అవసరమైన పాత్రలు.

మన తెలుగు ప్రేక్షకులది బీభత్సమైన టేస్ట్. అంచేత మన అభిరుచికి తగ్గట్లుగా దర్శకులు విలన్ మొహంపై కిందనుండి లైటు వేసి నీడల్ని సృష్టించి భయపెట్టడం.. కనుబొమలు మందంగా, వంకరగా మేకప్ చెయ్యడం వంటి రకరకాల ట్రిక్కులు  ప్రయోగించి.. సాధ్యమైనంత విలన్ మొహాన్ని క్రూరంగా చూపెట్టేవాళ్ళు. తమిళులది మనకన్నా మరీ బీభత్సమైన టేస్ట్.. ఆ విషయం మీకు నంబియార్ని చూస్తే స్పష్టంగా అర్ధమైపోతుంది.

పాపం హిందీలో ప్రాణ్ కి ఇట్లాంటి ఫెసిలిటీలు లేవు. ఆయన పాత్రరీత్యా (ఎక్కువగా) ఫుల్ సూట్లో కనబడేవాడు. మనిషి బాగుంటాడు. అంచేత హిందీ సినిమా విలన్ పాత్రలో క్రూరత్వ ప్రదర్శన కోసం ప్రాణ్ తనదైన కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడు. కళ్ళల్లో తోడేలు వంటి మోసపు చూపు, పెదవులపై వంకరగా నవ్వీనవ్వనట్లు ఒక విషపు నవ్వు చూపిస్తూ మనని భయపెట్టాడు. తద్వారా తనంటే ప్రేక్షకులు అసహ్యించుకునేట్లు చేసుకున్నాడు.

ప్రాణ్ విలన్ పాత్రల కోసం సిగరెట్లని కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ సిగరెట్ల విలనిజం (ముఖ్యంగా) దిలీప్ కుమార్, షమ్మీకపూర్ సినిమాల్లో గమనించవచ్చు. స్టైలిష్ గా లైటర్తో సిగరెట్ వెలిగించుకోవటం.. తన దుర్మార్గపు ప్లాన్ల గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్న భావం ప్రదర్శిస్తూ.. గుప్పుగుప్పున దట్టమైన సిగరెట్ పొగ వదుల్తూ (నిజానికి ఇవన్నీ చిన్నచిన్న ట్రిక్స్) గొప్ప విలనిజాన్ని పండించాడు ప్రాణ్.

ప్రాణ్ నిజజీవితంలో స్మోకరో కాదో తెలీదు కానీ.. తన పాత్రల కోసం మాత్రం దిండ్ల కొద్దీ సిగరెట్లు తాగుంటాడు (ఆ రకంగా చూసుకుంటే.. ఇన్ని సిగరెట్లు తాగి కూడా అన్నేళ్ళు బతకడం విశేషమే). ఆరోజుల్లో ప్రాణ్ కనిపిస్తే తన్నాలన్నంత కోపం, కసితో హిందీ సినిమా ప్రేక్షకులు ఉండేవారని చదివాను. ఇంతకన్నా ఒక నటుడికి గొప్ప compliment ఉంటుందనుకోను!

చివరి తోక :

ప్రాణ్ గూర్చి నా ఆలోచనలు రాద్దామని ఉదయం నుండి తీవ్రంగా ప్రయత్నించి.. ఇప్పటికి హడావుడిగా నాలుగు ముక్కలు రాయగలిగాను. అమ్మయ్య! ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది.

(photo courtesy : Google)

14 comments:

  1. Replies
    1. అవును. మీరన్నది నిజం. దానిక్కారణం కూడా చివర్లో రాశాను.

      Delete
  2. Podduti ninchi English, hindi bhaashallo chadivi visuku puttina naaku, nee sraddhamjali varshapu jallulaa anipimchindiraa..

    ReplyDelete
    Replies
    1. రేపటిదాకా ఆగు మిత్రమా. రేపు తెలుగు పేపర్ల ఆదివారం అనుబంధాలన్నీ ప్రాణ్ ని ఆకాశానికెత్తేస్తూ వ్యాసాలు ప్రచురించేస్తాయి.

      (ఇక్కడ వర్షంతో చస్తున్నాం.)

      Delete
  3. రమణగారూ,

    ఒకప్పుడు ప్రాణ్ అద్దె ఇంటికోసం వెదుకుతూ‌ ఒక తలుపు తట్టాడట. తలుపు తీసిన ఆవిడ ప్రాణ్‌ను చూస్తూనే గంయ్ మని, "నీ‌ లాంటి దుష్టుడికి ఇల్లు చస్తే అద్దెకివ్వం" అనేసి ధడేలున తలుపు వేసేసుకుందట.

    ఒక విలన్ నటుడుగా తనకు అది గొప్ప కితాబు అని ప్రాణ్ సంతోషించాడట.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      స్కూల్లో ఉన్నప్పుడు సినిమా విలన్లు ఎల్లప్పుడూ తప్పతాగి, హీరోయిన్లని కిడ్నాప్ చేసే ప్లాన్లో బిజీబిజీగా ఉంటుంటారని అనుకునేవాణ్ని.

      (రాజనాలకి పెళ్ళయ్యిందని తెలిసి చాలా ఆశ్చర్యపొయ్యాను.)

      Delete
  4. ప్రాణ్ మీద పూర్తిగా రాయాలంటే ఒక పుస్తకమే రాయవలసి వస్తుంది!ఉన్నంతలో రమణగారు బాగా రాశారని కితాబు ఇవ్వవచ్చు!ముఖ్యంగా అతని తోడేలుచూపు,వంకరనవ్వును ఒక చిరుటపాలో పట్టుకోవడం మాటలు కాదు!మీరన్నట్లు ప్రతి నాయకత్వాన్ని పూర్తిగా పండించింది!జంజీర్ లోని పాత్రకు ప్రాణ్ ప్రాణం పోశాడు!నాయకుడి పాత్రకంటే ప్రతినాయకుని పాత్రలోనే pep,dynamism,దమ్ము,variety,వైవిధ్యం,కసి ఉంటాయి!సర్వరసాలను ప్రాణ్ ఒప్పించాడు!మెప్పించాడు!పూర్ణజీవితం అనుభవించాడు!దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇంటికొచ్చి ఇచ్చేదాకా బతికాడు!

    ReplyDelete
    Replies
    1. surya prakash apkari గారు,

      మంచి వ్యాఖ్య రాశారు. ధన్యవాదాలు.

      నేనీ టపాలో (సమయం లేనందున) 'దుర్మార్గ ప్రాణ్' ని మాత్రమే ప్రస్తావించాను. మీరన్నట్లు జంజీర్, ఉప్కార్ మొ. సినిమాల్లో ప్రాణ్ గూర్చి చాలానే రాయొచ్చు.

      ప్రాణ్ తెలుగులో కూడా నటించాడు. మనవాళ్ళు ఆయన చేత గమ్మత్తైన costumes వేయించి buffoon గా చూపించారు.

      Delete
  5. రమణ గారు,
    ప్రాణ్ గురించి ఒక ఈపుస్తకం http://kinige.com/kbook.php?id=1941&name=praan

    అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం , ఉత్తరాది వాళ్లెవరూ ఆ పేరు పెట్టుకేలేదంట గత నాలభై యాభై సంవత్సరాలనుండి!

    ReplyDelete
    Replies
    1. chavakiran గారు,

      ప్రాణ్ పుస్తకం చదవటానికి ప్రయత్నిస్తాను.

      సినిమా సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇట్లాంటి విషయాలు చదివితే అర్ధమవుతుంది.

      (మనకి సూర్యకాంతం పేరు కూడా ఇట్లాంటి నిషేధానికే గురయింది కదా.)

      Delete
  6. డాట్రారూ, మీ బ్లాగు పేరు చూసినప్పుడల్లా ఒక రకమైన బెంగగా ఉంటుంది - పని లేని దాక్టరనే పేరు యెక్కువవడంతో మీ ప్రాక్టిసుకు నష్టం జరుగుతుందేమో నని:-)

    ReplyDelete
    Replies
    1. మీ concern కి ధన్యవాదాలు. బెంగ వలదు. ప్రస్తుతానికి నా ప్రాక్టీస్ బానే ఉంది. తగ్గినప్పుడు బ్లాగ్ పేరు మార్చేస్తాలేండి:-)

      Delete
    2. తగ్గటానికి వీల్లేదు.

      ఇంతమంది బ్లాగర్లుండగా, ఇంతమంది చదువరులుందగా, రాజకీయాలు ఇంత గొప్పగా ఉండగా, సోషల్ మీడియా సైట్ల విజృంభణము లుండగా, ఏది తెలుగో‌ ఏది కాదో‌ అనే చర్చనుండి అనేకానేక సమస్యలుండగా, అవుండగా ఇవుండగా రమణగారి ప్రాక్టీసు తగ్గుటయా? మన నవనాగరిక సమాజము దానిని తగ్గనిచ్చుటయా? అయ్యారే!

      Delete
    3. శ్యామలీయం గారు,

      మీరు చెబుతున్నది నా blog writing practice గూర్చేకదూ?:))

      Delete

comments will be moderated, will take sometime to appear.