Wednesday, 29 January 2014

భోజనాలు - భయాలు


'మా అమ్మాయి పెళ్ళి, మీరు తప్పక రావాలి'.

చచ్చాం రా బాబు!

వాడి కూతురు పెళ్ళయితే మధ్యలో నువ్వెందుకు చావడం?

అయ్యా! మన చిన్నప్పుడు పెళ్ళంటే పండగే, పెళ్ళి భోజనమంటే షడ్రుచుల విందే.

పులిహోరా, బూందీ లడ్డూ, పప్పూ, దప్పళం, బజ్జీ, పెరుగావడ, పాయసం...

రాస్తుంటేనే నోరూరుతుందికదూ!

ఒక పట్టు పట్టేవాళ్ళం,

తినంగాన్లే భుక్తాయసంతో నిద్ర ముంచుకొచ్చేది .

ఇదంతా ఒకప్పటి మాట.

మరిప్పుడో?

పులిహోర గుళ్ళో ప్రసాదంగా దొరుకుతుంది, కానీ పెళ్ళిళ్ళల్లో కరువైపొయ్యింది.

బాబూ! కొంచెం గారెలూ, బజ్జీ, గుత్తొంకాయా, దొసావకాయ..

ఎవడ్రా అక్కడా? ఇక్కడ వీడెవడో అలగా వెధవ, లేబరోళ్ళ కూడడుగుతున్నాడు, బయటకి గెంటండి. 

రండి సార్, రండి.. నమస్తే!

ఎంతో ఖర్చుపెట్టి హైద్రాబాద్ నించి వంటోళ్ళని పిలిపించాం. 

మష్రూమ్ చంచం, బేబీకార్న్ భంభం, పన్నీర్ దందం.. 

150 వెరైటీస్ సార్, జీడిపప్పుకే బోలెడు ఖర్చయ్యింది.

అయ్యా! ఈ బొచ్చె (దొరలు దీన్ని plate అంటార్రా అంట్ల వెధవా) కూడు మొయ్యలేక చెయ్యి లాగేస్తుంది,

కొంచెం అరిటాకో, విస్తరో ఇప్పిద్దురూ! ఓ పక్కన కూర్చుని తింటాను.

ఆ చేత్తోనే బీరకాయ పచ్చడి, దొండకాయ వేపుడూ, సాంబారు...

ఓరి దౌర్భాగ్యుడా! ఇక్కడా తగలడ్డావ్?

కొంపతీసి కలెక్టరు గారు నిన్ను చూడలేదు కదా, అర్జంటుగా వీణ్ణి నెట్టేయండ్రా బాబు!

ఇంత ఖర్చుపెట్టి ఏం లాభం?

పేరుకి శాకాహారమనే కానీ, రుచులన్నీ చిత్రవిచిత్రమే కదా!

నిజం చెప్పు,

ఈ వికృత భోజనాలు నీ ఆస్తీ, అంతస్తూ చూపుకోడానికేగా? 

నువ్వు చెప్పే కూరల పేర్లు వింటానికే తప్ప తింటానికి పనికిరావు,

ఈ పదార్ధాలు చూడ్డానికి బొద్దింకల ఫ్రై, వానపాముల హల్వా లాగున్నాయి.

ఇందులో ఏ ఛంఢాలం కలిపి వండించావో!

నీ కూతురు పెళ్ళయిన ఎన్నాళ్ళకి వాంతి చేసుకొంటుందో తెలీదు గానీ నాకు మాత్రం ఇప్పుడే వాంతి ఖాయం!

యాక్! నేను తినను, తినను గాక తినను, నువ్వే తిని 'చావు'.

నువ్వు ముందు బయటకి నడువ్!

నీ కూతురుకి పెళ్ళైతే మాకెందుకు శిక్ష?

మర్యాదగా పోతావా? నాలుగు తగిలించమంటావా? 

ఏంటోయ్ మీదమీదకొస్తున్నావ్?

నీ 'ఖరీదయిన' దరిద్రపుగొట్టు విందు కన్నా మా ఆనందభవన్ భోజనం 100 రెట్లు నయం!

అదుగో, అటు చూడు, వాడెవడో ఎమ్మెల్యేలా వున్నాడు,

ఈ డాబుసరంతా అట్లాంటి వాళ్ళ కోసమేగా?

వాణ్ణి రిసీవ్ చేసుకో.. ఉరుకు.. ఉరుకుండ్రి!

   .... ఓ (నిత్య) వికృత భోజన భాధితుడు

చివరి తోక :

మొత్తానికి తవ్వకాల్లో నా పాత రాత దొరికింది. ఇది రాసి మూడేళ్ళు దాటింది. నాకప్పుడు టైపింగ్ సరీగ్గా రాదు, అక్కడక్కడా తప్పులున్నయ్. అవి సరిచేసి, ఒక బొమ్మ తగిలించి ఇప్పుడు పోస్టుతున్నాను. 

(photo courtesy : Google)  

Monday, 27 January 2014

వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు


మనుషులు నానా రకములు. మంచివారు, చెడ్డవారు. మంచిగా కనిపించే చెడ్డవారు, చెడ్డగా కనిపించే మంచివారు. అదేవిధంగా భోజన పదార్ధాలు నానా విధములు. రుచికరమైనవి, అరుచికరమైనవి. చూడ్డానికి బాగుండి తినడానికి బాగుండనివి (ఇవి పెద్దవారి పెళ్ళిళ్ళల్లో, స్టార్ హోటళ్ళల్లో లభ్యం).. చూడ్డానికి ఎలా ఉన్నా, తిండానికి రుచికరంగా ఉండేవి (ఇవి మన ఇంట్లో లభ్యం).

ఒకప్పుడు నానా గడ్డీ తిని అరాయించుకునేవాణ్ని. కానీ - కాలచక్రం గిర్రుగిర్రున తిరిగిన కారణాన.. ఏదైనా చెత్త తిన్న మరుక్షణం కడుపులో 'రంగులరాట్నం' మొదలైపోతుంది. అంచేత తప్పనిసరి పరిస్థితుల్లో గత కొన్నేళ్లుగా నేను వివాహాది ఫంక్షన్లలో తినడం మానేశాను. అయితే - సినిమాలు చూడ్డం మానేసినవాడు గోడ మీద మీద ఇలియానా, అనుష్కల వాల్ పోస్టర్లని నోరు తెరుచుకు చూసినట్లుగా.. ఫంక్షన్లలో భోజన పదార్ధాల్ని ఆసక్తిగా గమనిస్తుంటాను.

ఈమధ్య భోజన ఏర్పాట్లన్నీ బఫే పద్ధతిలో చేస్తున్నారు. 'బఫే'ని తెలుగులో 'బొచ్చెభోజనం' అంటాడు మా సుబ్బు. ప్లేటు అనగా బొచ్చె. ఈ బొచ్చె చేత బుచ్చుకుని అన్నం, కూరల్ని అడుక్కు తినడాన్ని బొచ్చెభోజనం అంటార్ట. దీన్నే ఇంగ్లీషువాడు నైసుగా బఫే అంటాడు. చెప్పొచ్చేదేమంటే ఈ బఫే టైపు భోజనాలు తిండానికి కాకపోయినా చూసి ఆనందించడానికి అనువుగా ఉంటాయి.

అక్కడ అందమైన బిరియానీలు, కూరలు, కుర్మాలు.. వివిధ రంగుల్లో చూడ్డానికి కన్నుల విందుగా ఉంటాయి. అయితే ఆ పదార్ధాలు కేవలం కనులకి మాత్రమే విందనీ, నాలుకకి కాదని నాకు రూఢిగా తెలుసు. అందువల్ల ఆర్ట్ గేలరీలో పెయింటింగ్స్ ని తిలకిస్తున్నట్లుగా వాటిని గమనిస్తూ.. ఆ పదార్ధాల సౌందర్యానికి అబ్బురపడుతుంటాను.

ఒక్కోసారి మరీ అందంగా కనిపించిన పదార్ధాన్ని మునిసిపల్ హెల్త్ ఇనస్పెక్టర్లాగా శాంపిల్ రుచి చూస్తాను. సందేహం లేదు.. అది గడ్డే! గడ్డి నానా విధములు. పచ్చిగడ్డి మరియూ ఎండుగడ్డి. అంచేత కొన్ని పదార్ధాలు పచ్చిగడ్డిలానూ, మరికొన్ని ఎండుగడ్డిలానూ ఉంటాయి. ఎట్లా ఉన్నా మొత్తానికి గడ్డిలాగా ఉండటం మాత్రం ఖాయం. 'గడ్డి రుచి నీకెలా తెలుసు?' అని మాత్రం అడక్కండి (గడ్డి ఆహారంగా తినే జీవులకి క్షమాపణలు).

కొన్నేళ్ళ క్రితం మా అన్న కూతురి పెళ్లి ఏర్పాట్లు భారీస్థాయిలో తలపెట్టారు. ఆరోజు మెనూ నిర్ణయించడానికి హాల్లో సమావేశమయ్యాం. భోజనాల కాంట్రాక్టర్ భారీ వంటలకి ప్రసిద్ధి కాంచినవాడుట, టిప్ టాప్ గా ఉన్నాడు. చొరవ తీసుకుని అందరికన్నా ముందుగా నేనే మెనూ చెప్పడం మొదలెట్టాను.

"గోంగూర పచ్చడి, దోసావకాయ, బెండకాయ వేపుడు, గుత్తొంకాయ కూర.. "

ఆ భోజనాల మనిషి నన్ను ఎగాదిగా చూశాడు. ఆ చూపు ఏమంత మర్యాదగా లేదు. ఆ చూపులో ఫుల్ సూట్లో ఉన్న రూదర్ ఫర్డ్, చొక్కా కూడా వేసుకోని అల్లూరి సీతారామరాజుని చూసినంత తిరస్కారం ఉంది.

"అట్లాంటి వంటలు మేం చెయ్యం. మష్రూమ్ కర్రీ, బేబీ కార్న్ ఫ్రై.. " అంటూ ఏవో పేర్లు చెప్పసాగాడు.

"ఏంటవి?" అయోమయంగా అడిగాను.

ఆ వంటలాయన నన్ను మళ్ళీ అదోలా చూశాడు. ఈసారి నాకా చూపులో ఫైవ్ స్టార్ హోటల్ సప్లైర్, కాకా హోటల్లో టీ కలిపేవాణ్ని చూసినంత తేలికభావం కనబడింది.

పెళ్లివంటల గూర్చి నాకు కనీస పరిజ్ఞానం లేదని అతను డిసైడైపోయిట్లున్నాడు. అందువల్ల.. నాపక్కనే కూర్చునున్న నా మేనమామతో మాట్లాడ్డం మొదలెట్టాడు.

"మొన్న మీరు రాంబాబు గారబ్బాయి పెళ్ళికి వచ్చారుగా. ఆ ఐటమ్స్ ఎలాగున్నాయి సార్?"

"మిర్చి బజ్జీలు, పెరుగావడ.. " నేను నా మెనూని వదలదల్చుకోలేదు.

"ఈ రోజుల్లో అట్లాంటి మెనూ అఫీషియల్ గా ఉండదు." నిర్లక్ష్యంగా అన్నాడు ఆ భోజనాల వ్యాపారి.

"పర్లేదు, నాకు అనఫీషియల్ గా ఉన్నా పర్లేదు." పట్టుదలగా అన్నాను.

ఇంతలో నా మేనమామ నా పరువు తీసేశాడు.

"మావాణ్ని పట్టించుకోవద్దు. రాంబాబు గారింట్లో భోజనాలు బాగున్నాయ్. మన మెనూ అంతకన్నా అదిరిపోవాలి."

"చూస్తారుగా! మనదంతా కాస్ట్లీ మెనూ అండీ. చీప్ అనేదాన్ని దగ్గరక్కూడా రానీను." ఓరగా నావైపు చూస్తూ విజయ గర్వంతో అన్నాడు.

అటు తరవాత వాళ్ళిద్దరూ కలిసి ఆ సీన్లో నాకు డైలాగుల్లేకుండా చేసేశారు.

కొద్దిసేపటికి వరండాలో పడక్కుర్చీలో తీరిగ్గా కాఫీ తాగుతున్న నా మేనమామతో నిష్టూరంగా అన్నాను.

"మావయ్యా! అంతా నువ్వే నిర్ణయించేదానికి నేనెందుకు? వంటాడి ముందు పరువు పోయింది."

నా మేనమావది ఏదో చిన్న చదువు, అంతకన్నా చిన్న ఉద్యోగం. కానీ ఆయన చాలా తెలివైనవాడనీ, లౌక్యుడనీ, కార్యసాధకుడనీ బంధువుల్లో పేరు పడ్డాడు.

ఆయన ఒక క్షణం ఆలోచించి అన్నాడు.

"నువ్వు చెప్పిన వంటకాలు నాకూ ఇష్టమే. కానీ మీ అన్న పెద్ద స్థాయిలో ఉన్నాడు. భోజనాలు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి ఈ సారికి వదిలెయ్." అన్నాడు.

"నేనేం చెప్పాను? పిల్లదాని పెళ్ళిలో రుచికరమైన భోజనం పెడదామన్నాను. అంతేగా." గింజుకున్నాను.

ఇంతలో పెళ్లికూతురైన మా అన్న కూతురు పక్కనున్న రూం లోంచి వచ్చింది. లోపల్నుండి అంతా విన్నట్లుగా ఉంది.

"బాబాయ్! నీకో నమస్కారం. నీ గోంగూర, వంకాయ రోజూ తింటూనే ఉన్నావుగా! మళ్ళీ నా పెళ్ళిలో కూడా అవేనా?" విసుగ్గా అంది.

ఔరా! ఎంత ధిక్కారం! నిన్నగాక మొన్నటిదాకా నన్ను సినిమాకి డబ్బుల కోసం బ్రతిమాలేది. ఇవ్వాళ నా మాటంటే లెక్క లేదు.

ఆ విధంగా మా ఇంట్లో పెళ్లి వంట విషయంలో వంటరినైపొయ్యాను.. ఓడిపోయ్యాను.

ఆ పెళ్ళికి అత్యంత అందమైన, ఖరీదైన మెనూతో భోజనాలు పెట్టబడ్డాయని వేరే రాయక్కర్లేదనుకుంటా.

కొన్నాళ్ళకి ఒక కేటరింగ్ కాంట్రాక్టర్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో 'పని లేక.. '.. అతనితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నట్లుగా మాటల్లో పెట్టి, డిటెక్టివ్ యుగంధర్ వలే కొంత కూపీ లాగాను. నా దురాలోచన గ్రహించలేని అతను అమాయకంగా తన వృత్తిరహస్యాలు వెల్లడించాడు.

"ఇందులో ఒక సీక్రెట్టుందండి. మా వంటాళ్ళకి వంకాయ, బెండకాయల్లాంటివి వండటం చేతకాదు. ఆడాళ్ళు రుచి పట్టేస్తారు. అంచేత వాళ్లకి తెలీని కూరలు వండటం సేఫ్. అసలు పెళ్లి వంట చెయ్యటం చాలా ఈజీ. ముందుగా జీడిపప్పు ఎక్కువగా రుబ్బేసి ఉంచుకుంటాం. అన్ని కూరల్లో ఆ జీడిపప్పు పేస్టు కలిపేసి నూనెలో వేయించేస్తాం. తరవాత మళ్ళీ దండిగా జీడిపప్పు కలుపుతాం. వంటలో ఎక్కువ జీడిపప్పు వాడటం స్టేటస్ సింబల్. అందుకే మా వంటలు చూడ్డానికి రకరకాలుగా ఉన్నా, తిండానికి మాత్రం ఒకే రకంగా ఉంటాయి. అన్నీ వండంగా చివరాకరికి మిగిలిన మడ్డి నూనెలో అన్నం పడేసి కలబెడతాం.. అదే ఫ్రైడ్ రైస్!" అన్నాడు ఆ వంటల మనిషి.

అతను చెప్పేది వింటూ కడుపులో తిప్పుచుండగా ఆశ్చర్యపొయ్యాను.

"నిజంగా!?"

"అంతే సార్! ఈ రోజుల్లో వంట తెలిసినోళ్ళు ఎక్కడ దొరుకుతారు? లేబర్ చాలా ప్రాబ్లంగా ఉంది. మనుషులు దొరక్క ఏ గాంధీ పార్కులోంచో తెచ్చుకుంటున్నాం. అందుకే నేన్చేయించే ఆ పాడు వంట నేనసలు తినను. ఇంటికెళ్లి శుభ్రంగా నా భార్య చేతి వంట తింటాను." అన్నాడు ఆ వంటాయన.

"వంట బాగోకపోతే మీ వ్యాపారం సాగేదెలా?" మళ్ళీ ఆశ్చర్యపొయ్యాను.

"భలేవారే! ఈ రోజుల్లో వంట అందంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. అయినా మేం ఏం కూర వండామో ఎవరికి మాత్రం ఏం తెలుసు? వంటకాలు రుచిగా ఉండాలని చేయించుకునే వాడే అడగడు.. ఇంక మాకెందుకా సంగతి." అంటూ నవ్వాడు.

ఇంత చిన్న విషయాన్ని గ్రహించలేనందుకు కొంచెం సిగ్గుగా అనిపించింది. అటు తరవాత పెళ్లి భోజనాల గూర్చి ఆలోచించడం మానేశాను.

(photo courtesy : Google) 

Friday, 24 January 2014

ఇదీ అందుకే


ఇప్పుడు స్పష్టత వచ్చేసింది.. రాష్ట్ర విభజన అనివార్యం అని.

చైనావాడితో యుద్ధం వస్తేనో, భూకంపం వచ్చి పార్లమెంట్ పూడుకుపోతేనో తప్ప రాష్ట్రం విడిపోవటం ఖాయం అని అర్ధమవుతుంది.

తెలుగు వార్తా పత్రికలు, తెలుగు టీవీ చానెళ్ళు అర్ధసత్యాలని, అసత్యాలని చెబుతుంటాయి. అందువల్ల తెలుగు వార్తలు ఫాలో అయ్యేవారు, ఏదో జరిగిపోతుందన్న భ్రమల్లో ఉండవచ్చుగాక.. అది వారిష్టం. వారి ఆనందాన్ని కాదనడానికి మనమెవరం?

ఈ విభజన సందర్భంలో అనేకానేక వినోద కార్యక్రమాలు గాంచవచ్చును.

పార్లమెంటు సభ్యులు విభజన అడ్డుకుని తీరతాం అని రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఘీంకరిస్తారు. అసెంబ్లీలో సభ్యులు భీభత్సమైన చర్చలతో నాటకం రక్తి కట్టిస్తారు. ప్రతిపక్ష నాయకుడు సమన్యాయం కావాలంటూ పదిగంటలు ఘోషిస్తాడు. అనంతరం విభజన అనర్ధదాయకం అంటూ ముఖ్యమంత్రి మరో పదిగంటలు గర్జిస్తాడు. అవ్విధముగా మన నాయకులు వారి సమైక్యస్పూర్తిని టీవీ చానెళ్ళ సాక్షిగా ప్రతిభావంతంగా ప్రదర్శించెదరు.

ఎందుకు?

- ఎట్లాగూ ఎన్టీరామారావు కత్తి యుద్ధం చేసి కృష్ణకుమారిని తిరిగి తీసుకెళ్ళిపోతాడని రాజనాలకి తెలుసు. మరి కష్టపడి హీరోయిన్ని చెరబట్టడం ఎందుకు?

- పెళ్లిభోజనాలు పరమ దరిద్రంగా ఉంటాయని తెలుసు. అయినా పెళ్ళప్పుడు ఆ భోజనాలు ఎందుకు?

- రేప్పొద్దున కల్లా గెడ్డం మళ్ళీ పెరుగుతుందని తెలుసు. మరి ఇవ్వాళ పరపరా గీక్కోటం ఎందుకు?

- సినిమా అట్టర్ ఫ్లాపైందని అందరికీ తెలుసు. మరి ఆల్ టైం రికార్దంటూ ప్రకటనలు ఎందుకు?

- తెలుగు పేపర్లలో చదివేవన్నీ చెత్తవార్తలే అని తెలుసు. మరి ఆ చెత్తని చదవడం ఎందుకు?

- ఏ పార్టీ వాడికి ఓటేసినా మన బ్రతుకులింతే అని తెలుసు. మరప్పుడు ఏదోక పార్టీకి ఓటెయ్యడం ఎందుకు?

ఎందుకో అర్ధమైందా?

ఇదీ అందుకే!

(picture courtesy : Google)

Thursday, 16 January 2014

ఇవేం రాజకీయాలు!


ప్రపంచంలో అనేక దేశాలు, రకరకాలైన రాజకీయాలు. సౌదీ అరేబియా, ఉత్తర కొరియాల్లొ నియంతృత్వం ఉంది. అట్లాగే మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ. అయితే ఇది గాడిద గుడ్డు ప్రజాస్వామ్యమని మా సుబ్బు అంటుంటాడు. అనగా కాగితం మీద రాసుకుంది మాత్రం 'ప్రజలే పాలకులు' అని. కానీ - నిజానికి ప్రజలకి, పాలకులకి సంబంధం లేదు. అసలీ ఎన్నికల రంగం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పొయి చాలా కాలమైంది. సరే! మన ప్రజాస్వామ్యం గూర్చి సుబ్బు ఏమనుకుంటున్నాడన్నది ప్రస్తుతం అప్రస్తుతం.

ప్రజాస్వామ్యంలో ఆలోచనా సారూప్యత కల కొందరు వ్యక్తులు ఒక రాజకీయ పార్టీగా ఉంటారు. వారిలోంచి పార్టీ నాయకత్వం ఎన్నుకోబడుతుంది. ఈ పార్టీ నాయకత్వం విధానపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. పార్టీలో అంతర్గతంగా అనేక స్థాయిల్లో చర్చ జరుగుతుంది.

ఆ సందర్భంలో ఒక నాయకుడు పార్టీ పాలసీని విబేధించవచ్చు, ప్రశ్నించవచ్చు. కుదిరితే సహచరుల మద్దతు కూడగట్టుకుని, చర్చలో పట్టు సాధించి పార్టీ నిర్ణయాన్ని మార్చుకునేలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ డెమాక్రసీలో ఒక విధానం గూర్చి విభిన్న అభిప్రాయాల మధ్య వాడిగా చర్చింపబడటం ఆహ్వానించదగ్గ పరిణామం (ఈ గోల ఏక వ్యక్తి పాలనలో ఉండే ప్రాంతీయ పార్టీల్లో ఉండదు, అంచేత వాటికి మినహాయింపు).

పార్టీ పాలసీని విబేధిస్తూ అభిప్రాయాల్ని స్వేచ్చగా వ్యక్తీకరించి, చర్చించిన తరవాత.. పార్టీ తనకి వ్యతిరేకమైన నిర్ణయం ప్రకటించినప్పుడు ఆ నాయకుడికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి - పార్టీ అభిప్రాయానికి శిరసావహించి పార్టీలో కొనసాగడం, రెండు - ఆ పార్టీకి రాజీనామా చేసి బయటపడటం. మూడో మార్గం లేదు.. ఉండరాదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రాన్నే చూడండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశం సంవత్సరాల తరబడి చర్చించింది. వందలమంది వేలాదిగా తమ అభిప్రాయాలు చెప్పారు. చివారకరికి AICC రాష్ట్రాన్ని విడగొట్టేదామని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మంచిదా కాదా అనేది ఇక్కడ అనవసరం. ఆ నిర్ణయం నచ్చనివాళ్ళు ఏం చెయ్యాలి? రాజీ అయినా పడాలి లేదా అర్జంటుగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి బయటపడాలి. ఇది నైతికతకి సంబంధించిన విషయం. నైతికత, నిజాయితీ లేనివాడు ఏం చెప్పినా విలువుండదు.

ఇవ్వాళ మంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలో వేకెన్సీ ఉందా, ఎందులో చేరితే గిట్టుబాటు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి రేపు కొత్త పార్టీ పెట్టబోతున్నాట్ట! మరప్పుడు ఇవ్వాళ ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకో అర్ధం కాదు. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం కాదా?

పత్రికలు రాస్తున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో తన ఇమేజ్ పెంచుకుని, ఓ కొత్తపార్టీ పెట్టి, అన్ని సీట్లు గెలిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనుకుందాం. ఇది ఏ రకమైన రాజకీయం? ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ, నెలనెలా జీతం పుచ్చుకుంటూ ఇంకో కంపెనీకి లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవటం అనైతికం కాదా? ఈ ధోరణికి గిరీశం కూడా సిగ్గు పడతాడు.

అసలీ నాయకులు అధినాయకుల దగ్గర ఒకటి చెబుతున్నారు, ప్రజలకి ఇంకోటి చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి కొత్తపార్టీ వార్తల్ని ఢిల్లీ పట్టించుకోదు. వీటన్నింటినీ మన తెలుగు మీడియా మరింత వక్రీకరించి, ప్రజల్ని ప్రతిభావంతంగా తప్పుదోవ పట్టిస్తుంది. అందుకే మన మీడియా ప్రజల గూర్చి వార్తలు ప్రచురించటం ఎప్పుడో మానేసింది. ఇప్పుడు మీడియాకి హాట్ కేకులు రాజకీయ నాయకుల కెరీర్ గూర్చి వార్తలే!

ప్రతి పార్టీవారు మిగిలిన పార్టీలవారు కుమ్ముక్కయ్యారని ఆరోపిస్తుంటారు. వాస్తవానికి అన్నిపార్టీల అధినాయకత్వం, తమ నాయకుల్తో కుమ్ముక్కై ఒక డ్రామా నడిపిస్తున్నారని అనుమానం కలుగుతుంది. రాజకీయ పార్టీలు ప్రజల్ని వంచిస్తున్నారని కూడా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ దురదృష్ట పరిణామాల్ని గమనిస్తూ ఉండటం మించి సామాన్యుడు చేయగలిగిందేమీ లేదు.

(picture courtesy : Google)

Tuesday, 14 January 2014

'నేనొక్కడినే' ఓ సైకలాజికల్ ట్రాష్


ఇవ్వాళ పొద్దున్న నా స్నేహితుడి నుండి ఫోన్.

"మహేశ్ బాబు సినిమా 'నేనొక్కడినే'లో ఏదో సైకియాట్రీ జబ్బు చూపించారు. అట్లాంటి కేసు నువ్వెప్పుడైనా చూశావా?"

చచ్చితిని. అనుకున్నట్లే అయ్యింది. ఇట్లాంటి ప్రశ్న నేను ఊహిస్తూనే ఉన్నాను. సినిమాల్లో గజ్జి, తామర చూపిస్తే జనాలు పట్టించుకోరు. కానీ ఎందుకో సైకియాట్రి కేస్ చూపించగాన్లే ఎక్కడ లేని డౌట్లు వచ్చేస్తాయి.

ఇంతకు ముందు 'అపరిచితుడు' అంటూ ఏదో సినిమా వచ్చింది గానీ.. నేనా సినిమా చూళ్ళేదు. ఇప్పుడు 'నేనొక్కడినే' చూశానంటూ నా బ్లాగులో దండోరా వేశాను కావున.. తప్పించుకోటానికి లేదు.

"బిజీగా ఉన్నాను. తరవాత మాట్లాడతా." అంటూ ఫోన్ కట్ చేశాను.

నేను ఇంతకు ముందు మిస్సమ్మ, దేవదాసు, పెద్ద మనుషుల్ని విమర్శించాను. దానికి కారణం కూడా రాశాను. అందరికీ నచ్చిన సినిమాలో సూక్ష్మ లోపాల్ని ఎత్తి చూపుతూ, విమర్శిస్తే మజాగా ఉంటుంది. కానీ ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాని విమర్శించడం అనవసరం. అయినా - 'నేనొక్కడినే' సినిమాపై నా ఆలోచనలు కొన్ని రాసి ముగిస్తాను.

ఇదేదో తెలుగువారి స్థాయిని మించిన హాలీవుడ్ స్థాయి సినిమా అని కొందరు సెలవిస్తున్నారు. వారికో నమస్కారం. నాకర్ధం కానిది.. తెలుగు సినిమాలు హాలీవుడ్ సినిమాలా ఎందుకు ఉండాలి? తెలుగు సినిమా తెలుగు సినిమాలాగే ఉండాలి కదా! టెక్నికల్ గా ఆ స్థాయిలో ఉండాలని అంటున్నారా?

ఇంతకూ అసలీ 'నేనొక్కడినే' తెలుగు సినిమానేనా? పాత్రలు తెలుగు భాషలో మాట్లాడుకుంటాయి. అంత మాత్రాన దీన్ని తెలుగు సినిమా అంటూ చెప్పలేం. ఇది అనేక హాలీవుడ్ సినిమాల్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి వండిన సినిమా. స్థానికత లేని ఈ సినిమాకి మనం ఎలా కనెక్ట్ అవుతాం? అవ్వలేం కదా. మన గుండమ్మకథ ఇంగ్లీషోళ్ళకి నచ్చుతుందా?

తెలుగు సినిమాల్ని అమెరికాలో కూడా విరగబడి చూస్తున్నారనీ, అంచేత తెలుగు సినిమా చచ్చినట్లు ఇతర దేశాల్లో తీయాల్సొస్తుందనీ అంటున్నారు. ఔను, అదీ నిజమే! నిర్మాత డబ్బు ఖర్చు పెట్టేదెలా? కాబట్టి పాత్రలు తెలుగులో మాట్లాడతాయే గానీ.. ఇది తెలుగువాడి జీవితానికి సంబంధించిన సినిమా కాదు. ఓవర్సీస్ వ్యూయర్స్ ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వెదజల్లుతూ తీసిన అతి ఖరీదైన సినిమా. 

వెరైటీగా తీశారు కాబట్టి బాగుంది అంటున్నారు కొందరు. వెరైటీ అంటే బెండ కాయల్తో వంకాయ పులుసు చెయ్యడం కాదు, అది కుదరదు కూడా. ఈ సినిమా దర్శకుడు అదే చేశాడు. నే చదువుకునే రోజుల్లో ఓ క్షుద్ర రచయిత చేతబడిని హిప్నాటిజంతో లింకు పెట్టి పెద్ద నవలొకటి రాశాడు, దండిగా సొమ్ము చేసుకున్నాడు. ఆ రోజుల్లో ప్రేమ కథల్తో విసిగి ఉన్న పాఠకులు ఆ చెత్తనే ఓ రిలీఫ్ గా ఫీలయ్యారు.

ఈ సినిమాలో గాల్లో ఫైటింగ్ చేసి, హత్య చేసినట్లుగా భావించుకుంటాడు హీరో. దీన్ని hallucinatory behavior అంటారు. ఇది మానసిక రోగం. అర్జంటుగా ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించాలి. దీనికి ఓ డాక్టర్ టెస్టులు, గట్రా చేయించి (డాక్టర్లు ఉట్టి పుణ్యానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టిస్తారని దర్శకుడు ఫిక్స్ అయిపోయినట్లున్నాడు) integration disorder అని ఊరూ, పేరు లేని ఓ రోగం పేరు చెబుతాడు.

హైదరాబాదులో సైకియాట్రిస్టులు కనీసం వందమంది ఉన్నారు. దర్శకుడు వారిలో ఒకరితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడినట్లయితే.. వాళ్ళు హీరోకి ఇంకొంచెం బెటర్ రోగం సూచించి ఉండేవారు. కానీ ఆ మాత్రం రీసెర్చ్ చేస్తే అతను తెలుగు సినిమా డైరక్టర్ అవడు.

సరే! ఏదొక రోగం. మరీ శంకరశాస్త్రిలా చాందసంగా రాస్తున్నట్లున్నాను, వదిలేద్దాం. దర్శకుడి రూట్లోకే వద్దాం. డాక్టర్ హీరోదంతా ఊహే, అతనికి గతం లేదు అంటాడు. అన్నన్ని టెస్టులు చేశాడు కాబట్టి డాక్టర్ కరెక్ట్ చెప్పాడనుకుందాం. కానీ డాక్టర్ తప్పు చెప్పాడు. హీరో ఊహించుకున్న వాళ్ళంతా నిజంగానే ఉన్నారు.

మరయితే సినిమా మొదట్లో హీరో గాల్లో ఫైటింగ్ ఎందుకు చేశాడు? ఆయనగారికి అదేదో గ్రే మేటర్ తగ్గి (అసలు సంగతి - దర్శకుడికి గ్రే మేటర్ తగ్గింది) ఒక మాయదారి రోగం ఉన్నందువల్లనే కదా! డాక్టరో, హీరోనో ఎవరో ఒకళ్ళే కరక్ట్ అవ్వాలిగా. ఇద్దరూ ఎలా కరెక్ట్ అవుతారు? కనీస శాస్త్రీయత లేకుండా ఇంట్లో కూర్చుని రాసుకున్న కథ కూడా తప్పులతడకే!

ఇట్లా రాసుకుంటూ పొతే.. ఈ సినిమాలో చూపించిందంతా ఓ పెద్ద సైకలాజికల్ ట్రాష్ అని అర్ధమవుతుంది. ఒకప్పటి క్షుద్ర రచయిత లాగా, ఈ దర్శకుడు 'నేను సైకలాజికల్ థ్రిల్లర్ తీశాను, చూసి తరించండి' అంటాడు. 

ఈయన ఒకప్పుడు 'ఆర్య' అనే గొప్ప సినిమా తీశాట్ట. నేనా సినిమా విడియో చూశాను. ఆ ఆర్య అనేవాడు ఒక చౌకబారు stalker. మనకి కనిపిస్తే అర్జంటుగా eve teasing కేసు పెట్టించి జైల్లో వేయించదగ్గ వ్యక్తి. 'ఆర్య'ని ఓ intelligent సినిమాగా భావించాల్ట! దర్శకుడికి ఎంత ధైర్యం!

అసలు సమస్య ఏమంటే.. మన తెలుగు సినిమాలు చదువుకున్న వాళ్ళు చూడరు (నా తోటి సైకియాట్రిస్టులు సినిమాలు చూడరు, వాళ్ళల్లో నేనే గొప్ప), చూసినా పట్టించుకునే టైం ఉండదు.. నాలాంటి సైకియాట్రిస్ట్ 'పని లేక' రాస్తే తప్ప. తెలిసిన వాళ్ళు చెప్పకపోతే నిజంగానే ఇదేదో గొప్ప కథ అనుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఇవ్వాళ ఈ పవిత్ర కార్యం నెత్తినెత్తుకున్నాను.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కావలిసినంత స్వేచ్చ ఉంది. కావున రెండో ఎక్కం తెలీకుండా గణిత శాస్త్రంలో పుస్తకం రాసెయ్యొచ్చు. న్యూటన్ సూత్రం తెలీకుండా గొప్ప సైన్స్ ఫిక్షన్ రాయొచ్చు. ఎవడన్నా తలకి మాసినవాడు నిర్మాతగా దొరికితే (తెలుగు ప్రేక్షకులకి దరిద్రం శనిలా పట్టుకుంటే), ఆ కథనే సినిమాగా కూడా తీసి ప్రేక్షకులపై కసి తీర్చుకోవచ్చు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.

నా దృష్టిలో రొటీన్ ఫార్ములా సినిమాలు తీసేవాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సినిమా సక్సెస్ కోసం ఓ కథ ఒండుకుంటారు. దాన్లో మసాలా దట్టిస్తూ నానా తిప్పలు పడతారు. అది వారి వృత్తి. కోటి విద్యలూ కూటి కొరకే అన్నారు పెద్దలు. కానీ చెత్త తీస్తూ, తెలుగు సినిమాని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొట్టే మేధో డైరక్టర్ల డొల్లతనాన్ని గుర్తించకపొతే మాత్రం ప్రమాదం, నష్టం. ఇంతకన్నా ఈ సినిమా గూర్చి రాసి సమయం వృధా చేసుకోలేను.

(picture courtesy : Google)

Monday, 13 January 2014

లేడీస్ ఫింగర్ల ముగ్గుల పోటీలు


ప్రపంచం వేగంగా ముందుకెళ్తుంది. కవులు expression కోసం అలా అంటారు గానీ.. ప్రపంచం మరీ అంత వేగంగా ముందుకేమీ వెళ్లదు. మన చేతికున్న వాచీ వేగంతోనే ముందుకు వెళ్తుంది. అయితే అసలంటూ ఏదోక స్పీడుతో ముందుకే వెళ్తుంది.

కానీ నా చిన్నప్పట్నుండీ అస్సలు ముందుకు వెళ్లనివి కొన్ని ఉన్నాయి. వాటిలో సంక్రాంతి ముగ్గుల పోటీ ఒకటి. రంగురంగుల చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు గ్రౌండులో రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ తరవాత వాటిల్లో ఉత్తమమైన ముగ్గులు ఎంపిక చేసి బహుమతులిస్తారు. చాలాసార్లు VIP భార్యలే ప్రైజులు కొట్టేస్తారు. ఇది మాత్రం యాదృచ్చికం.

అవును. సంక్రాంతి ముగ్గులు మన సంప్రదాయం. నాకు సాంప్రదాయమన్న మిక్కిలి మక్కువ. కానీ ఎప్పట్నుండో ఒక సందేహం. ముగ్గులు ఆడవాళ్లే ఎందుకెయ్యాలి? మగవాళ్ళు ఎందుకు వెయ్యకూడదు? కొంచెం నాక్కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వరూ? ప్లీజ్!

ఓయీ అజ్ఞాని! ఈ ముగ్గులకి కె. విశ్వనాథ్ సినిమాలకున్నంత పవిత్రత యున్నదోయి. అనాదిగా ముగ్గులు ఆడవాళ్లే వెయ్యాలనేది ఒక రూలు.. అదో గొప్ప సంస్కృతి. మగవాడవైన నీవు ముగ్గుల పోటీల్లో పాల్గొంటానని అర్ధించుట విధి వైపరీత్యం కాక మరేమిటి!

రోజులు మారిపోతున్నాయి. నా చేతికి మాత్రం వేళ్ళు లేవా? ఒక్క అవకాశం ఇస్తే నా టాలెంటేంటో చూపిస్తా.

ఓరి వెర్రి వెంగళప్పా! ఒకసారి చెబ్తే అర్ధం కాదా? సర్లే చేతివేళ్ళ ప్రస్తావన తెచ్చావు కాబట్టి చెబుతున్నా విను. ఆడవారి చేతివేళ్ళు అత్యంత సుకుమారముగానూ, పొడవుగానూ ఉండును. అందుకే బెండకాయని ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అన్నారు గానీ, జెంట్స్ ఫింగర్ అన్లేదు. అర్ధమైందా?

ఇందులో అర్ధం కానిదేముంది!

దేవుడు ఆడవాళ్ళకి ఆ లేడీస్ ఫింగర్లు ఊరికే ప్రసాదించలేదు. కొన్నిపన్లు చెయ్యడానికి అనువుగా ఉంటుందనే ఇచ్చాడు. ఉదాహరణకి వాకిలి చిమ్మడం, ముగ్గులెయ్యడం, అంట్లు తోమడం, వంట చెయ్యడం, బట్టలుతకడం, పిల్లలకి ముడ్డి కడగడం.. ఇట్లాంటి పనులన్న మాట.

నిజంగా!

అవును. పచ్చి నిజం. అదీగాక ఇప్పుడు నువ్వు ముగ్గుల పోటీ అంటూ ఈ 100% ఆడాళ్ళ రంగంలో వేలు పెట్టావో జాగ్రత్త! అసలే పెళ్లి కావలసినవాడివి, జనాలకి నీపై లేనిపోని డౌట్లు వస్తాయి.

అన్నా! నీకు కృతజ్ఞతలు. ఎంత ప్రమాదం తప్పించావు! నాకు పెళ్లి ముఖ్యం. ఈ మగాళ్ళ ముగ్గుల హక్కు కోసం పోరాడి నా పెళ్లిని త్యాగం చెయ్యలేను. ఇంక పొరబాటున కూడా ఈ ముగ్గుల పోటీల గూర్చి ఆలోచించను. ఉంటానన్నా!

(photo courtesy : Google)

Saturday, 11 January 2014

'నేనొక్కడినే' నాకు నచ్చింది


దాదాపు పదమూడేళ్ళ తరవాత ఒక సినిమా హాల్లోకి అడుగెట్టాను. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. లోపల లైటింగ్ తక్కువగా ఉంది. ఫ్లోర్ మెట్లుమెట్లుగా ఉంది. ఎందుకైనా మంచిదని నాభార్య చెయ్యి పుచ్చుకుని అడుగులో అడుగేసుకుంటూ, సీట్లు తడుముకుంటూ వెళ్ళి నా నంబర్ సీట్లో కూలబడ్డాను.  

సినిమా మొదలైంది. తెరపై (పెద్ద) బొమ్మ చూసి చాల్రోజులైన కారణాన.. సంభ్రమాశ్చర్యాలకి గురయ్యాను. అయితే సినిమా శబ్దం (హాల్లో సౌండ్) ఎక్కువగా ఉంది. నడిచేప్పుడు వచ్చే బూట్ల శబ్దం కూడా చెవిలో లక్ష్మీ ఔటు పేల్చినంత భయానకంగా ఉంది.

మహేశ్ బాబు బాగున్నాడు. కానీ కోపంగా ఉన్నాడు.. ఎందుకో తెలీదు. హీరోయిన్ పొడుగ్గా ఉంది. సినిమా హడావుడిగా ఉంది. intermission లో మావాడు నా చేతిలో పెట్టిన పాప్ కార్న్ బాగుంది. 

కొద్దిసేపటికి నడుం నొప్పిగా అనిపించింది. అంచేత సినిమా తొందరగా అయిపోతే బాగుండునని అనిపించింది.

అమ్మయ్యా! సినిమా అయిపొయింది. హాల్ బయటకొచ్చాం. 

"సినిమా నీకెలా ఉంది నాన్నా?" అనడిగింది మా అమ్మాయి. 

"బాగుంది. నాకు నచ్చింది." అన్నాను. 

నా కూతురు నావైపు విచిత్రంగా చూసింది. 

"సైకియాట్రీ సబ్జక్టులో మహేశ్ బాబు కొచ్చిన రోగం లాంటిదేదైనా ఉందా?" నా భార్య ప్రశ్న. 

వాస్తవానికి నేను సినిమా ఫాలో అవలేదు. సినిమాలో ఓ డాక్టర్ కనిపించాడు. అతనేదో చెప్పాడు గానీ, నే పట్టించుకోలేదు. కాబట్టి ఆవిడ అడిగిన ప్రశ్న అర్ధం కాలేదు. అంచేత ఓ వెధవ నవ్వొకటి సమాధానంగా నవ్వాను. 

కుటుంబ సభ్యులతో సినిమా చూడ్డం మాత్రమే ఇవ్వాల్టి 'నేనొక్కడినే' పర్పస్. భార్యాపిల్లల్ని కనీసం సినిమాక్కూడా తీసుకెళ్ళని దుష్టాధముడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోవటం నాకిష్టం లేదు. డైలాగ్ కొంచెం హెవీగా ఉంది కదూ! ఏంచెయ్యమంటారు? కొన్నాళ్ళుగా నామీదున్న ఒత్తిడి అట్లాంటిది! కాబట్టి సినిమా మంచిచెడ్డలు నాకనవసరం.  

రైల్లో వెళ్తుంటే కిటికీ లోంచి బయటకి చూసినప్పుడు పొలాలు, కొండలు కనపడుతుంటయ్. అవి బాగున్నయ్యా, లేదా అని ఆలోచించం కదా? నాదృష్టిలో సినిమా చూడ్డం కూడా అంతే. కాకపోతే ప్రకృతి వీక్షణం ఆహ్లాదకరం, సినిమా వీక్షణం వ్యధాభరితం. అంతే తేడా!

(photo courtesy : Google)

Friday, 10 January 2014

ముసుగు వీరులు


ఆ ఊళ్ళో రంగారావు ఓ చిన్నపాటి నాయకుడు. రంగారావుది ఎస్వీరంగారావంతటి నిండైన విగ్రహం. పెదరాయుడంతటి హుందాతనం. ఆశ లేనివాడు మనిషే కాదు. అబ్దుల్ కలాం గారేమన్నారు? ముందొక కల గని.. ఆ తర్వాత తీరిగ్గా ఆ కలని సాకారం చేసుకోమన్నారు. రంగారావుకి కలాం గారి మాట నచ్చింది.

అందుకే కొన్నాళ్ళపాటు ప్రజాప్రతినిధి అయిపోయినట్లు కలగన్నాడు. ఇప్పుడు ఆ కల నిజం చేసుకోటానికి గత కొంతకాలంగా గ్యాపు లేకుండా ప్రజాసేవ చేసేస్తున్నాడు. ఏదైనా పార్టీ టిక్కెట్టిస్తే ప్రజాప్రతినిధిగా పోటీ చెయ్యాలని ఉబలాటపడుతున్నాడు.

అయితే ఆ ఊళ్ళో అబ్దుల్ కలాం గారి ఫాలోవర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అచ్చు రంగారావు కన్నకలే కన్నారు. వాళ్లకి రంగారావు ప్రణాళిక అర్ధమయ్యింది. దొంగలకే సాటి దొంగల మనస్తత్వం తెలుస్తుంది. అంచేత ఆ ఔత్సాహిక రాజకీయ నాయకులు రంగారావు ప్రజాసేవని ప్రశ్నించడం మొదలెట్టారు. తన పోటీదారుల ప్రశ్నాధోరణి రంగారావుకి ఇబ్బందిగా తయారైంది.

రంగారావుకి అప్పారావనే స్నేహితుడున్నాడు. నల్లగా, పీలగా, పొట్టిగా ఉంటాడు. అతనికి రోడ్డు మార్జిన్లో సైకిల్ రిపైర్ షాప్ ఉంది. అప్పారావు నిఖార్సైన తాగుబోతు. అంతకంటే నిఖార్సైన వదరుబోతు. గొంతులోకి మందు దిగంగాన్లే ఎక్కడ లేని శక్తీ వస్తుంది. ఆపై ఇందిరా గాంధీ నుండి బడ్డీ కొట్టు సాంబయ్య దాకా అందర్నీ బండబూతులు తిడతాడు. అలా తెల్లవార్లూ తాగుతూ, వాగుతూ.. మైకంలో ఎక్కడో పడిపోతుంటాడు. పొద్దున్నే మెలకువొచ్చి నీరసంగా ఇంటికి చేరుకుంటాడు. అందుకే అప్పారావుని 'బూతుల అప్పారావు', 'తాగుబోతు అప్పిగాడు' అని కూడా అంటుంటారు.

అప్పారావుకి రంగారావంటే అభిమానం. రంగారావు ఎప్పటికైనా ఏదో పదవి సంపాదిస్తాడని అప్పారావు నమ్మకం. ఆరోజు రంగారావు స్నేహితుడు అప్పారావుకి కబురంపాడు. ఫలానావాడు నన్ను ఫలానా మాటలన్నాడని అప్పారావుతో చెప్పుకుని బాధ పడ్డాడు. అప్పారావుకి ఆ ఫలానావాడి పట్ల కోపం వచ్చింది. 'ఖర్చులకి ఉంచుకో' అంటూ ఓ ఐదొందలు అప్పారావు చేతిలో పెట్టాడు రంగారావు.

ఆ రోజు రాత్రి ఫుల్లుగా తాగేసిన అప్పారావు ఆ ఫలానావాడి ఇంటికి చేరుకున్నాడు. తూగుతూ రోడ్డు మీద నిలబడి ఆ ఫలానావాణ్ని, వాడింట్లో ఆడవాళ్లనీ తెల్లవార్లు తిట్టాడు. అప్పారావు అరుపులకి వీధంతా దద్దరిల్లిపోయింది. ఆ ఇంట్లోవాళ్ళు తలుపులు బిగించుకుని, చెవుల్లో దూది పెట్టుకుని జాగారం చేశారు. విజయ గర్వంతో వికటాట్టహాసం చేశాడు అప్పారావు. ఆ రకంగా స్నేహితుని ఋణం తీర్చుకున్నట్లుగా తృప్తినొంది.. మైకం ఎక్కువై.. మురిక్కాలవ పక్కన పడిపొయ్యాడు.

మర్నాడు రంగారావు ఆ ఫలానావాడి ఇంటికి పరామర్శ కోసం వెళ్ళాడు. ఆ ఇంట్లోవారికి జరిగిన అవమానం పట్ల ఆందోళన చెందాడు. తాగుబోతు అప్పిగాడి ప్రవర్తనని తీవ్రంగా ఖండించాడు. పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేయిస్తానని హడావుడి చేశాడు. 'పోన్లే, మైకంలో ఏదో వాగాడు, వదిలేద్దాం.' అన్నారు ఆ ఫలానావాడి కుటుంబ సభ్యులు.

ఆ రోజు మొదలు, రంగారావుని విబేధించిన వారందరి ఇళ్ళ పైకి (రంగారావిచ్చిన డబ్బుల్తో) ఫుల్లుగా తాగి దండయాత్రకి పొయ్యేవాడు తాగుబోతు అప్పిగాడు. వాడి బూతుల దండకానికి ఇళ్ళల్లో ఆడవాళ్ళకి వాంతులయ్యేవి, చెవులు చిల్లులు పడేవి. ఒకళ్ళిద్దరు ధైర్యం చేసి పోలీసు రిపోర్టిచ్చి లోపల వేయించారు కూడా. ఆ మర్నాడే రంగారావు సాయంతో బెయిల్ మీద బయటకొచ్చి మరింత రెచ్చిపొయ్యేవాడు అప్పారావు. 

కొన్నాళ్ళకి ఊళ్ళోవాళ్లకి రంగారావు, అప్పారావులకి గల కనెక్షన్ అర్ధమైంది. అప్పారావంటే రంగారావు ముసుగు మాత్రమేననీ, ఇద్దరూ ఒకటేననీ తెలుసుకున్నారు. ఇప్పుడు రంగారావు వ్యతిరేకులు కొందరు అప్పారావు నోటికి ఝడిసి నోరు మూసుకుంటున్నారు. రంగారావుకి కావలిసిందదే. 

చివరి తోక :

ఈ కథ చదివిన వారికి ఒక రాజకీయ పార్టీ, దాని అనుబంధ సంస్థలు గుర్తొస్తే సంతోషం.  

(photo courtesy : Google) 

Thursday, 9 January 2014

వామ్మో వోల్వో


ఆయన పేరు పాపన్న. పరులకి ఉపకారం చెయ్యడం పాపన్నకి అలవాటు, ఇష్టం. అందుకే అందరూ ఆయన్ని పరోపకారి పాపన్న అంటారు. 'పరోపకారి పాపన్న' కథలు చందమామలో చాలా వచ్చాయి. చందమామ చదవని తెలుగువాడు దాదాపుగా ఉండడు. కాబట్టి పాపన్న పరోపకార గుణం గూర్చి ప్రత్యేకంగా రాయనక్కర్లేదు. పంచె, అరచేతుల చొక్కాలో.. ఎర్రగా, పొట్టిగా, బొద్దుగా ఉంటాడు. ఆయన ప్రశాంతంగా, హుందాగా కూడా ఉంటాడు.

పక్క వీధిలో ఉండే సుబ్బారావు కూతురి కాపురం విషయంలో ఏదో ఇబ్బంది తలెత్తితే, ఇప్పుడే ఆ సమస్య పరిష్కరించాడు పాపన్న. నెమ్మదిగా ఇంటికి నడక మొదలెట్టాడు. పాపన్న పాతకాలం మనిషి. సాధ్యమైనంతవరకూ నడకే ఆయనకి అలవాటు. అలా నడుస్తుండగా పాపన్న దృష్టి నాకర్షించింది ఓ ఇల్లు.

అదొక పెళ్లి వారిల్లు. కొత్తగా వేసిన రంగులతో ఇల్లు మెరిసిపోతుంది. కొత్తబట్టల్లో పిన్నలు, పెద్దలు.. ఇల్లంతా కళకళలాడుతుంది. కానీ వారంతా గోలగోలగా ఏదో అరుచుకుంటున్నారు. ఇంటికి కొద్దిదూరంలో రోడ్డు మార్జిన్లో ఖరీదైన బస్సొకటి పార్క్ చేసి ఉంది.

అక్కడేదో సమస్యగా ఉందని గ్రహించాడు పాపన్న. ఆయనకి ఇట్లాంటి వాతావరణం కొత్త కాదు.

'సమస్యల్ని మొగ్గలోనే తుంచెయ్యకపోతే ప్రమాదం. అది చిలికిచిలికి గాలివానగా మారొచ్చు.' అనుకుంటూ పెళ్లి వారింటి వైపు నడిచాడు. సమస్యల్ని సూ మోటోగా స్వీకరించటం పాపన్నకి అలవాటు.

కొద్దిసేపట్లోనే వివరాలు రాబట్టాడు. ఇది మగపెళ్లివారి ఇల్లట. పెళ్లి రాత్రికి ఏలూర్లోట. ప్రస్తుతం పెళ్లికొడుకు చుట్టాలంతా ఆవేశంతో ఊగిపోతున్నారు.

మరీ ముఖ్యంగా ఒక పెద్దాయన పెద్దగా అరుస్తున్నాడు. ఆయన పొడుగ్గా, సన్నగా ఉన్నాడు. జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలా ఉంది. ఆయన పెళ్లికొడుకు తండ్రిట.

ఆయన చేతుల్ని పట్టుకుని బ్రతిమాలుతున్నాడు ఒక నడివయసు బట్టతల మనిషి. అతను పెళ్లికూతురు బాబాయిట.

పాపన్నకి విషయం అర్ధమైపోయింది. సందేహం లేదు.. ఇది ఖచ్చితంగా వరకట్నం కేసు.

"నాతో పెట్టుకోవద్దు. మాట తేడా వచ్చిందంటే మనిషినే కాను." అరిచాడు తెల్లజుట్టాయన.

"తప్పైపోయింది బావగారు. మన్నించండి." బట్టతల బ్రతిమాలుతుంది.

"ఒరేయ్ గోపాలం! ఎస్పీకి ఫోను కలపరా. ఇప్పుడే వీళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టించి బొక్కలో వేయించేస్తాను." తెల్లజుట్టు కోపంతో వణికిపోయింది.

"బావగారు! మీరంత మాట అనకండి. జరిగింది తప్పే. మీరు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించాలి. ఇవి చేతులు కావు.. కాళ్ళు." అంటూ బట్టతలాయన వేడుకుంటున్నాడు.

ఈ బట్టతలాయనెవరో తెలుగు సినిమాలు బాగా చూసినట్లుంది. అన్నీ సినిమా డైలాగులే కొడుతున్నాడు.

"క్షమించాడానికి మీరు చేసిందేమన్నా చిన్న తప్పా? ఛీఛీ.. మీరింత కుట్ర మనుషులని ముందే గ్రహించలేకపొయ్యాను." ఈసడించుకుంది తెల్లజుట్టు.

పాపన్న ఇంక సమయం వృధా చెయ్యదల్చుకోలేదు.

"అయ్యా! అమ్మా! శాంతించండి. నా పేరు పాపన్న. అందరూ నన్ను పరోపకారి పాపన్న అని అంటారు. దయచేసి నే చెప్పేది సావధానంగా వినండి. ఈ రోజుల్లో కూడా డబ్బు కోసం పెళ్ళిళ్ళు ఆగిపోవలసిందేనా?"

అక్కడున్నవాళ్ళు హఠాత్తుగా అరుపులు మానేశారు. ఒక్కసారిగా నిశ్శబ్దం. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఆపై అందరూ పాపన్న వైపు ఆశ్చర్యంగా చూశారు.

బట్టతల భుజంపై చెయ్యి వేసి 'నేనున్నాను' అన్నట్లుగా తట్టాడు పరోపకారి పాపన్న. ఆయన  పాపన్న చేస్తున్న సాయం పట్ల కృతజ్ఞత చూపకపోగా మొహం చిట్లించాడు.

పాపన్నకి యిట్లాంటి విషయాల్లో అపార అనుభవం ఉంది. ఆయన పీటల మీద ఆగిపోతున్న పెళ్ళిళ్ళనే సాఫీగా అయ్యేట్లు చేశాడు.

"దయచేసి ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా కట్నం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చెయ్యడం మహాపాపం." తన ఉపన్యాస ధోరణి కొనసాగించాడు పాపన్న.

ఇంతలో పాపన్న భుజంపై ఎవరిదో చెయ్యి పడింది. ఆ చెయ్యి ఓనరు వైపు చూశాడు పాపన్న. మనిషి దిట్టంగా, కుదమట్టంగా ఉన్నాడు.

"పాపన్నగారూ! నేను పెళ్లికొడుకు మేనమావని. అసలిక్కడేం జరుగుతుందో మీకు తెలుసా?" అనడిగాడతను.

"ఇట్లాంటివి ఎన్ని చూళ్ళేదు? కట్నం దగ్గరేదో పేచీ వచ్చినట్లుంది." ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా అన్నాడు పాపన్న.

"లేదు బాబూ లేదు. ఇది అంతకన్నా పెద్ద సమస్య. పెళ్లికూతురు తండ్రి మా కోసం ఒక లక్జరీ బస్సు పంపాడు. అది మాకు నచ్చలేదు." అన్నాడాయన.

"లక్జరీ బస్సొస్తే సుబ్బరంగా ఎక్కి కూర్చోక ఈ పంచాయితీ ఏమిటి?" ఆశ్చర్యపొయ్యాడు పాపన్న.

"పాపన్నగారూ! అర్ధం చేసుకోండి. మేం ఆడపెళ్లివాళ్ళని ఆర్టీసీ ఎర్రబస్సు పంపమంటే, ఈ పెద్దమనిషి ప్రైవేటు ఓల్వో బస్సు పంపాడు. మొన్న ఓల్వో బస్సులో ప్రయాణీకులు సజీవ దహనం అయిన సంగతి మీకు తెలిసిందే గదా. అప్పట్నుండీ మా అందరికీ ఆ మాయదారి ఓల్వో పేరు వింటేనే గుండె దడగా ఉంటుంది. బయట పార్క్ చేసున్న ఆ వోల్వో బస్సు చూసి మా అబ్బాయికి దడుపుడు జెరం వచ్చింది. ప్రాణాలకి తెగించి మరీ పెళ్ళికి ఎలా వెళ్తామండీ? అందుకే ఆ వోల్వో బస్సు ఎక్కడానికి మేం ఒప్పుకోం." అన్నాడు పెళ్లికొడుకు మేనమామ.

పాపన్నకి విషయం అర్ధమైంది. ఇది కట్నం కేసు కాదు. బస్సు కేసు.

"ఏమయ్యా పెద్దమనిషీ! సంసార పక్షంగా ఎర్ర బస్సే ఏర్పాటు చెయ్యకపొయ్యావా? ఖర్చు కూడా తగ్గేది." బట్టతలని అడిగాడు పాపన్న.

"అయ్యా! పాపన్న గారూ! ఎర్ర బస్సు కోసం ఎంతో ప్రయత్నించామండి. అప్పటికీ మా ఎమ్మెల్యే గారితో ఫోను కూడా చేయించాం. అయినా మా వల్ల కాలేదు.. పెళ్ళిళ్ళ సీజన్ కదండీ!" దీనంగా అన్నాడు బట్టతల బాబాయ్.

"అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? మమ్మల్నందర్నీ బస్సెక్కి మాడి మసైపొమ్మంటారు. అంతేనా?" తెల్లజుట్టాయన మళ్ళీ ఆయాసపడ్డాడు.

"శివశివా, అంత మాటనకండి." అంటూ చెవులు మూసుకున్నాడు బట్టతలాయన.

పాపన్న గొంతు సరి చేసుకుని చెప్పడం మొదలెట్టాడు.

"ఇక్కడ ఎవరిది తప్పు అని మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే.. అవతల పెళ్లి ముహోర్తం ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు జరగవలసింది ఏంటనేది ఆలోచించడం విజ్ఞుల లక్షణం." అన్నాడు పాపన్న.

"అయితే ఈ సమస్యకి పరిష్కారం మీరే చూపాలి, మీరే చూపాలి." అన్నారు అందరూ ముక్తకంఠంతో.

ఒక క్షణం తీవ్రంగా ఆలోచించాడు పాపన్న. ఏదో ఐడియా వచ్చినట్లుంది. తల పంకిస్తూ చిన్నగా నవ్వాడు.

"పక్క వీధిలో నాకు తెలిసిన సిటీ బస్సు ఓనరొకాయన ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మీరా సిటీ బస్సులో పొయ్యే ఏర్పాటు చేయిస్తాను. సరేనా?" అన్నాడు పాపన్న.

"సరే, సరే" అన్నారు అందరూ.

"ఐతే ఇక్కడో సమస్య ఉంది. ఆ బస్సు సీట్లు చిరిగిపోయ్యాయి, టైర్లు బోడిగుండులా అరిగిపొయ్యాయి, ఎంత తొక్కినా ముప్పైకి మించి స్పీడు పోదు.... "

పాపన్నమాటకి అడ్డు తగిలాడు తెల్లజుట్టు పెద్దాయన.

"అయ్యా పాపన్న గారూ! ప్రస్తుతం మేమున్న పరిస్థితి మీకు పూర్తిగా తెలిసినట్లు లేదు. బస్సు ఎట్లా ఉన్నా పర్లేదు.. దానికి ఇంజన్ ఉంటే చాలు. మధ్యలో ఆగిపోయినా అందరం కలిసి నెట్టుకుంటూ వెళ్తాం. ఇంక మీరేమీ మాట్లాడకండి. అర్జంటుగా ఆ సిటీ బస్సేదో ఏర్పాటు చేద్దురూ." అర్ధిస్తున్నట్లు అన్నాడు.

"అయితే సరే! నాకో పావుగంట టైమివ్వండి. ఈలోపు అందరూ రెడీ అవ్వండి." అన్నాడు పాపన్న.

ఆడవాళ్ళు, పిల్లలు హడావుడిగా సూట్ కేసులు సర్దుకోడానికి ఇంట్లోకి పరిగెత్తారు.

"పాపన్నగారూ! మీ ఋణం ఈ జన్మకి తీర్చుకోలేను. చచ్చి మీ కడుపున పుడతాను." పాపన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని హెవీగా అన్నాడు బట్టతల బాబాయ్.

ఈయన సినిమా డైలాగులు తప్ప మామూలు డైలాగులు పలకలేడేమో!

పావుగంటలో పెద్దగా శబ్దం చేసుకుంటూ, నల్లటి పొగ దట్టంగా చిమ్ముకుంటూ ఒక డొక్కు బస్సు పెళ్లివారింటి ముందు ఆగింది.

పిల్లలు, పెద్దలు 'హేయ్ బస్సొచ్చేసింది' అనుకుంటూ ఆనందంగా బస్సు ఎక్కేసారు. కొద్దిసేపటికి బస్సు భారంగా ఏలూరు బయల్దేరింది.

తన జీవితంలో మరో పరోపకారం చేసినందుకు సంతోషిస్తూ, తృప్తిగా ఇంటి దారి పట్టాడు పాపన్న.

(photo courtesy : Google)