Wednesday 29 January 2014

భోజనాలు - భయాలు


'మా అమ్మాయి పెళ్ళి, మీరు తప్పక రావాలి'.

చచ్చాం రా బాబు!

వాడి కూతురు పెళ్ళయితే మధ్యలో నువ్వెందుకు చావడం?

అయ్యా! మన చిన్నప్పుడు పెళ్ళంటే పండగే, పెళ్ళి భోజనమంటే షడ్రుచుల విందే.

పులిహోరా, బూందీ లడ్డూ, పప్పూ, దప్పళం, బజ్జీ, పెరుగావడ, పాయసం...

రాస్తుంటేనే నోరూరుతుందికదూ!

ఒక పట్టు పట్టేవాళ్ళం,

తినంగాన్లే భుక్తాయసంతో నిద్ర ముంచుకొచ్చేది .

ఇదంతా ఒకప్పటి మాట.

మరిప్పుడో?

పులిహోర గుళ్ళో ప్రసాదంగా దొరుకుతుంది, కానీ పెళ్ళిళ్ళల్లో కరువైపొయ్యింది.

బాబూ! కొంచెం గారెలూ, బజ్జీ, గుత్తొంకాయా, దొసావకాయ..

ఎవడ్రా అక్కడా? ఇక్కడ వీడెవడో అలగా వెధవ, లేబరోళ్ళ కూడడుగుతున్నాడు, బయటకి గెంటండి. 

రండి సార్, రండి.. నమస్తే!

ఎంతో ఖర్చుపెట్టి హైద్రాబాద్ నించి వంటోళ్ళని పిలిపించాం. 

మష్రూమ్ చంచం, బేబీకార్న్ భంభం, పన్నీర్ దందం.. 

150 వెరైటీస్ సార్, జీడిపప్పుకే బోలెడు ఖర్చయ్యింది.

అయ్యా! ఈ బొచ్చె (దొరలు దీన్ని plate అంటార్రా అంట్ల వెధవా) కూడు మొయ్యలేక చెయ్యి లాగేస్తుంది,

కొంచెం అరిటాకో, విస్తరో ఇప్పిద్దురూ! ఓ పక్కన కూర్చుని తింటాను.

ఆ చేత్తోనే బీరకాయ పచ్చడి, దొండకాయ వేపుడూ, సాంబారు...

ఓరి దౌర్భాగ్యుడా! ఇక్కడా తగలడ్డావ్?

కొంపతీసి కలెక్టరు గారు నిన్ను చూడలేదు కదా, అర్జంటుగా వీణ్ణి నెట్టేయండ్రా బాబు!

ఇంత ఖర్చుపెట్టి ఏం లాభం?

పేరుకి శాకాహారమనే కానీ, రుచులన్నీ చిత్రవిచిత్రమే కదా!

నిజం చెప్పు,

ఈ వికృత భోజనాలు నీ ఆస్తీ, అంతస్తూ చూపుకోడానికేగా? 

నువ్వు చెప్పే కూరల పేర్లు వింటానికే తప్ప తింటానికి పనికిరావు,

ఈ పదార్ధాలు చూడ్డానికి బొద్దింకల ఫ్రై, వానపాముల హల్వా లాగున్నాయి.

ఇందులో ఏ ఛంఢాలం కలిపి వండించావో!

నీ కూతురు పెళ్ళయిన ఎన్నాళ్ళకి వాంతి చేసుకొంటుందో తెలీదు గానీ నాకు మాత్రం ఇప్పుడే వాంతి ఖాయం!

యాక్! నేను తినను, తినను గాక తినను, నువ్వే తిని 'చావు'.

నువ్వు ముందు బయటకి నడువ్!

నీ కూతురుకి పెళ్ళైతే మాకెందుకు శిక్ష?

మర్యాదగా పోతావా? నాలుగు తగిలించమంటావా? 

ఏంటోయ్ మీదమీదకొస్తున్నావ్?

నీ 'ఖరీదయిన' దరిద్రపుగొట్టు విందు కన్నా మా ఆనందభవన్ భోజనం 100 రెట్లు నయం!

అదుగో, అటు చూడు, వాడెవడో ఎమ్మెల్యేలా వున్నాడు,

ఈ డాబుసరంతా అట్లాంటి వాళ్ళ కోసమేగా?

వాణ్ణి రిసీవ్ చేసుకో.. ఉరుకు.. ఉరుకుండ్రి!

   .... ఓ (నిత్య) వికృత భోజన భాధితుడు

చివరి తోక :

మొత్తానికి తవ్వకాల్లో నా పాత రాత దొరికింది. ఇది రాసి మూడేళ్ళు దాటింది. నాకప్పుడు టైపింగ్ సరీగ్గా రాదు, అక్కడక్కడా తప్పులున్నయ్. అవి సరిచేసి, ఒక బొమ్మ తగిలించి ఇప్పుడు పోస్టుతున్నాను. 

(photo courtesy : Google)  

21 comments:


  1. పెళ్ళిలో గారెలు చెయ్యరు సార్.. తద్దినాలకి చేస్తారు..
    ఇక బీరకాయ్ పచ్చడి పెళ్ళిలో ఎప్పుడు చూడలేదు..

    ఏ అప్పగింతల్లోనో, బూజంబంతుల్లోనో తప్ప, ఆవడలు కూడా పద్దతి కాదనుకుంటా..

    ReplyDelete
    Replies
    1. నేనేదో నాకిష్టమైనవి రాసేశాను. ఇప్పటికే చాదస్తుడిగా పేరుగాంచాను. మీరు నన్ను మించిపోతున్నారు. :)

      Delete
    2. చిల్లు పెడితే తద్దినానికి, లేకపొతే శుభకార్యానికి

      Delete
  2. సార్, మీరు చిరన్ జీవి గారి సినిమా ఇంద్ర చూశారా! అందులో ఒక డవిలాగు - మొక్కె కదా అని పీకితె, పీక కోస్తా అనె అర్ధం పర్ధం లేని సంభాషణ వుంది. అలానే మీరు గేదెలు గడ్డి తింటున్నట్లు బుఫే చాలా చీప్ అన్నట్లు అర్ధం వచ్చేలా ఫొతొ పెట్టారు. మీతో నూతికి నూరు శాతం ఒప్పుకుంటా. కానీ, గడ్డే కదా అని తేలిగ్గా తీసి పారెయ్యడ్డు. సార్, మీకు ఈ గడ్డి విలువ తెలియదు. కావాలంటే లల్లూ గారిని అడగండి, ఒక ఐడియా జీవితాన్ని ఎట్లా మారుస్తుందో చెప్తారు

    ReplyDelete
    Replies
    1. నో డౌట్, గడ్డి చాలా విలువైనది, పవిత్రమైనది. లాలూ లాగే నాక్కూడా గడ్డంటే మహాగౌరవం. కావునే ఆ బొమ్మ పెట్టాను. :)

      Delete
  3. మీరు ఇలాంటి టపాలు పోస్టుతే, మిమ్మల్ని పాతరాతియుగంవాడిగా జమకట్టేస్తారు ఇప్పటి సినీ జనరేషన్ వాళ్ళు.

    ReplyDelete
    Replies
    1. పోన్లేద్దురూ, కుర్రాళ్ళు ఆ మాత్రం స్పీడుగా ఉండటం సహజం.

      Delete
  4. చిన్న సవరణ రమణ గారూ,
    శాఖాహారమంటే ఆకులలములు, కొమ్మలు లాంటివి. శాకాహారం అంటే కూరగాయలు, పళ్ళు, పాలు లాంటివి.
    గమనించ ప్రార్థన.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ, సరిచేశాను.

      (మొన్న సమైఖ్యాంధ్రలో 'ఖ' కూడదన్నారు. నేడు శాఖాహరంలో కూడా 'ఖ' తప్పంటున్నారు. పాపం 'ఖ'లు!)

      Delete
    2. "bade bade blaag me, choti choti galti hoti rahti hain" Sano Rita.

      Delete
  5. శా"ఖ/కా"హరం లొ ఖ ఉన్న: లేక పోయినా,
    భొజనాలు బగున్నా: లేక పొయినా,

    మీ బ్లాగ్ లొ మాత్రం హాస్యం తప్పక ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ.

      (చూడబోతే క/ఖ లో విషయం చాలానే ఉన్నట్లుంది. తెలీని విషయాల్లో తల దూర్చరాదు.)

      Delete
  6. పులిహోరా, బూందీ లడ్డూ, పప్పూ, దప్పళం, బజ్జీ, పెరుగావడ, పాయసం...
    బీరకాయ పచ్చడి, దొండకాయ వేపుడూ, సాంబారు...

    ఆహా! ఎంత బాగున్నాయి ఈ వంటకాలు!!

    ReplyDelete
  7. సింభలిజాని అద్బుతంగా వాడారు సార్‌,

    ReplyDelete
  8. That is not buffet, they were served their favorite food. They are eating in their most comfortable posture. We are less fortunate, we have to pick and eat in the most awkward way..

    Seetharam

    ReplyDelete
  9. "ఈ వికృత భోజనాలు నీ ఆస్తీ, అంతస్తూ చూపుకోడానికేగా?
    నువ్వు చెప్పే కూరల పేర్లు వింటానికే తప్ప తింటానికి పనికిరావు,"

    కదా!

    అభినందనలు.

    ReplyDelete
  10. చాలా బాగుంది...శ్రీదేవి గారు,నిజంగా భోజనాలకి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.