మనుషులు నానా రకములు. మంచివారు, చెడ్డవారు. మంచిగా కనిపించే చెడ్డవారు, చెడ్డగా కనిపించే మంచివారు. అదేవిధంగా భోజన పదార్ధాలు నానా విధములు. రుచికరమైనవి, అరుచికరమైనవి. చూడ్డానికి బాగుండి తినడానికి బాగుండనివి (ఇవి పెద్దవారి పెళ్ళిళ్ళల్లో, స్టార్ హోటళ్ళల్లో లభ్యం).. చూడ్డానికి ఎలా ఉన్నా, తిండానికి రుచికరంగా ఉండేవి (ఇవి మన ఇంట్లో లభ్యం).
ఒకప్పుడు నానా గడ్డీ తిని అరాయించుకునేవాణ్ని. కానీ - కాలచక్రం గిర్రుగిర్రున తిరిగిన కారణాన.. ఏదైనా చెత్త తిన్న మరుక్షణం కడుపులో 'రంగులరాట్నం' మొదలైపోతుంది. అంచేత తప్పనిసరి పరిస్థితుల్లో గత కొన్నేళ్లుగా నేను వివాహాది ఫంక్షన్లలో తినడం మానేశాను. అయితే - సినిమాలు చూడ్డం మానేసినవాడు గోడ మీద మీద ఇలియానా, అనుష్కల వాల్ పోస్టర్లని నోరు తెరుచుకు చూసినట్లుగా.. ఫంక్షన్లలో భోజన పదార్ధాల్ని ఆసక్తిగా గమనిస్తుంటాను.
ఈమధ్య భోజన ఏర్పాట్లన్నీ బఫే పద్ధతిలో చేస్తున్నారు. 'బఫే'ని తెలుగులో 'బొచ్చెభోజనం' అంటాడు మా సుబ్బు. ప్లేటు అనగా బొచ్చె. ఈ బొచ్చె చేత బుచ్చుకుని అన్నం, కూరల్ని అడుక్కు తినడాన్ని బొచ్చెభోజనం అంటార్ట. దీన్నే ఇంగ్లీషువాడు నైసుగా బఫే అంటాడు. చెప్పొచ్చేదేమంటే ఈ బఫే టైపు భోజనాలు తిండానికి కాకపోయినా చూసి ఆనందించడానికి అనువుగా ఉంటాయి.
అక్కడ అందమైన బిరియానీలు, కూరలు, కుర్మాలు.. వివిధ రంగుల్లో చూడ్డానికి కన్నుల విందుగా ఉంటాయి. అయితే ఆ పదార్ధాలు కేవలం కనులకి మాత్రమే విందనీ, నాలుకకి కాదని నాకు రూఢిగా తెలుసు. అందువల్ల ఆర్ట్ గేలరీలో పెయింటింగ్స్ ని తిలకిస్తున్నట్లుగా వాటిని గమనిస్తూ.. ఆ పదార్ధాల సౌందర్యానికి అబ్బురపడుతుంటాను.
ఒక్కోసారి మరీ అందంగా కనిపించిన పదార్ధాన్ని మునిసిపల్ హెల్త్ ఇనస్పెక్టర్లాగా శాంపిల్ రుచి చూస్తాను. సందేహం లేదు.. అది గడ్డే! గడ్డి నానా విధములు. పచ్చిగడ్డి మరియూ ఎండుగడ్డి. అంచేత కొన్ని పదార్ధాలు పచ్చిగడ్డిలానూ, మరికొన్ని ఎండుగడ్డిలానూ ఉంటాయి. ఎట్లా ఉన్నా మొత్తానికి గడ్డిలాగా ఉండటం మాత్రం ఖాయం. 'గడ్డి రుచి నీకెలా తెలుసు?' అని మాత్రం అడక్కండి (గడ్డి ఆహారంగా తినే జీవులకి క్షమాపణలు).
కొన్నేళ్ళ క్రితం మా అన్న కూతురి పెళ్లి ఏర్పాట్లు భారీస్థాయిలో తలపెట్టారు. ఆరోజు మెనూ నిర్ణయించడానికి హాల్లో సమావేశమయ్యాం. భోజనాల కాంట్రాక్టర్ భారీ వంటలకి ప్రసిద్ధి కాంచినవాడుట, టిప్ టాప్ గా ఉన్నాడు. చొరవ తీసుకుని అందరికన్నా ముందుగా నేనే మెనూ చెప్పడం మొదలెట్టాను.
"గోంగూర పచ్చడి, దోసావకాయ, బెండకాయ వేపుడు, గుత్తొంకాయ కూర.. "
ఆ భోజనాల మనిషి నన్ను ఎగాదిగా చూశాడు. ఆ చూపు ఏమంత మర్యాదగా లేదు. ఆ చూపులో ఫుల్ సూట్లో ఉన్న రూదర్ ఫర్డ్, చొక్కా కూడా వేసుకోని అల్లూరి సీతారామరాజుని చూసినంత తిరస్కారం ఉంది.
"అట్లాంటి వంటలు మేం చెయ్యం. మష్రూమ్ కర్రీ, బేబీ కార్న్ ఫ్రై.. " అంటూ ఏవో పేర్లు చెప్పసాగాడు.
"ఏంటవి?" అయోమయంగా అడిగాను.
ఆ వంటలాయన నన్ను మళ్ళీ అదోలా చూశాడు. ఈసారి నాకా చూపులో ఫైవ్ స్టార్ హోటల్ సప్లైర్, కాకా హోటల్లో టీ కలిపేవాణ్ని చూసినంత తేలికభావం కనబడింది.
పెళ్లివంటల గూర్చి నాకు కనీస పరిజ్ఞానం లేదని అతను డిసైడైపోయిట్లున్నాడు. అందువల్ల.. నాపక్కనే కూర్చునున్న నా మేనమామతో మాట్లాడ్డం మొదలెట్టాడు.
"మొన్న మీరు రాంబాబు గారబ్బాయి పెళ్ళికి వచ్చారుగా. ఆ ఐటమ్స్ ఎలాగున్నాయి సార్?"
"మిర్చి బజ్జీలు, పెరుగావడ.. " నేను నా మెనూని వదలదల్చుకోలేదు.
"ఈ రోజుల్లో అట్లాంటి మెనూ అఫీషియల్ గా ఉండదు." నిర్లక్ష్యంగా అన్నాడు ఆ భోజనాల వ్యాపారి.
"పర్లేదు, నాకు అనఫీషియల్ గా ఉన్నా పర్లేదు." పట్టుదలగా అన్నాను.
ఇంతలో నా మేనమామ నా పరువు తీసేశాడు.
"మావాణ్ని పట్టించుకోవద్దు. రాంబాబు గారింట్లో భోజనాలు బాగున్నాయ్. మన మెనూ అంతకన్నా అదిరిపోవాలి."
"చూస్తారుగా! మనదంతా కాస్ట్లీ మెనూ అండీ. చీప్ అనేదాన్ని దగ్గరక్కూడా రానీను." ఓరగా నావైపు చూస్తూ విజయ గర్వంతో అన్నాడు.
అటు తరవాత వాళ్ళిద్దరూ కలిసి ఆ సీన్లో నాకు డైలాగుల్లేకుండా చేసేశారు.
కొద్దిసేపటికి వరండాలో పడక్కుర్చీలో తీరిగ్గా కాఫీ తాగుతున్న నా మేనమామతో నిష్టూరంగా అన్నాను.
"మావయ్యా! అంతా నువ్వే నిర్ణయించేదానికి నేనెందుకు? వంటాడి ముందు పరువు పోయింది."
నా మేనమావది ఏదో చిన్న చదువు, అంతకన్నా చిన్న ఉద్యోగం. కానీ ఆయన చాలా తెలివైనవాడనీ, లౌక్యుడనీ, కార్యసాధకుడనీ బంధువుల్లో పేరు పడ్డాడు.
ఆయన ఒక క్షణం ఆలోచించి అన్నాడు.
"నువ్వు చెప్పిన వంటకాలు నాకూ ఇష్టమే. కానీ మీ అన్న పెద్ద స్థాయిలో ఉన్నాడు. భోజనాలు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి ఈ సారికి వదిలెయ్." అన్నాడు.
"నేనేం చెప్పాను? పిల్లదాని పెళ్ళిలో రుచికరమైన భోజనం పెడదామన్నాను. అంతేగా." గింజుకున్నాను.
ఇంతలో పెళ్లికూతురైన మా అన్న కూతురు పక్కనున్న రూం లోంచి వచ్చింది. లోపల్నుండి అంతా విన్నట్లుగా ఉంది.
"బాబాయ్! నీకో నమస్కారం. నీ గోంగూర, వంకాయ రోజూ తింటూనే ఉన్నావుగా! మళ్ళీ నా పెళ్ళిలో కూడా అవేనా?" విసుగ్గా అంది.
ఔరా! ఎంత ధిక్కారం! నిన్నగాక మొన్నటిదాకా నన్ను సినిమాకి డబ్బుల కోసం బ్రతిమాలేది. ఇవ్వాళ నా మాటంటే లెక్క లేదు.
ఆ విధంగా మా ఇంట్లో పెళ్లి వంట విషయంలో వంటరినైపొయ్యాను.. ఓడిపోయ్యాను.
ఆ పెళ్ళికి అత్యంత అందమైన, ఖరీదైన మెనూతో భోజనాలు పెట్టబడ్డాయని వేరే రాయక్కర్లేదనుకుంటా.
కొన్నాళ్ళకి ఒక కేటరింగ్ కాంట్రాక్టర్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో 'పని లేక.. '.. అతనితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నట్లుగా మాటల్లో పెట్టి, డిటెక్టివ్ యుగంధర్ వలే కొంత కూపీ లాగాను. నా దురాలోచన గ్రహించలేని అతను అమాయకంగా తన వృత్తిరహస్యాలు వెల్లడించాడు.
"ఇందులో ఒక సీక్రెట్టుందండి. మా వంటాళ్ళకి వంకాయ, బెండకాయల్లాంటివి వండటం చేతకాదు. ఆడాళ్ళు రుచి పట్టేస్తారు. అంచేత వాళ్లకి తెలీని కూరలు వండటం సేఫ్. అసలు పెళ్లి వంట చెయ్యటం చాలా ఈజీ. ముందుగా జీడిపప్పు ఎక్కువగా రుబ్బేసి ఉంచుకుంటాం. అన్ని కూరల్లో ఆ జీడిపప్పు పేస్టు కలిపేసి నూనెలో వేయించేస్తాం. తరవాత మళ్ళీ దండిగా జీడిపప్పు కలుపుతాం. వంటలో ఎక్కువ జీడిపప్పు వాడటం స్టేటస్ సింబల్. అందుకే మా వంటలు చూడ్డానికి రకరకాలుగా ఉన్నా, తిండానికి మాత్రం ఒకే రకంగా ఉంటాయి. అన్నీ వండంగా చివరాకరికి మిగిలిన మడ్డి నూనెలో అన్నం పడేసి కలబెడతాం.. అదే ఫ్రైడ్ రైస్!" అన్నాడు ఆ వంటల మనిషి.
అతను చెప్పేది వింటూ కడుపులో తిప్పుచుండగా ఆశ్చర్యపొయ్యాను.
"నిజంగా!?"
"అంతే సార్! ఈ రోజుల్లో వంట తెలిసినోళ్ళు ఎక్కడ దొరుకుతారు? లేబర్ చాలా ప్రాబ్లంగా ఉంది. మనుషులు దొరక్క ఏ గాంధీ పార్కులోంచో తెచ్చుకుంటున్నాం. అందుకే నేన్చేయించే ఆ పాడు వంట నేనసలు తినను. ఇంటికెళ్లి శుభ్రంగా నా భార్య చేతి వంట తింటాను." అన్నాడు ఆ వంటాయన.
"వంట బాగోకపోతే మీ వ్యాపారం సాగేదెలా?" మళ్ళీ ఆశ్చర్యపొయ్యాను.
"భలేవారే! ఈ రోజుల్లో వంట అందంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. అయినా మేం ఏం కూర వండామో ఎవరికి మాత్రం ఏం తెలుసు? వంటకాలు రుచిగా ఉండాలని చేయించుకునే వాడే అడగడు.. ఇంక మాకెందుకా సంగతి." అంటూ నవ్వాడు.
ఇంత చిన్న విషయాన్ని గ్రహించలేనందుకు కొంచెం సిగ్గుగా అనిపించింది. అటు తరవాత పెళ్లి భోజనాల గూర్చి ఆలోచించడం మానేశాను.
(photo courtesy : Google)
Wonderful.
ReplyDeleteనిజమేనండి. అన్ని రకాల వంటకాలు చేసేది తినడానికి కాదు. స్టేటస్ కోసమే.
ReplyDeleteచాలామంది చాట్‌లతోనే భోజనం ముగించేస్తారు.
అయితే వాళ్ళ వాదన కూడ కరక్టేనేమో, రోజూ ఇంట్లో తినే కూరలే అక్కడా పెడితే బోరు కొడుతుంది కదా.
"బొచ్చె భోజనం" పదం బాగుంది.
Ha ha , bochche bhojanam ... Chala bagundi, vanta kadu, mee blog!
ReplyDeleteఈ మధ్య కొన్ని పెళ్ళిళ్ళల్లొ చూసాను, బంతి భొజనం పెడతారు. మరుసటి బంతిలో కూర్చొవాలనుకునేవాళ్ళు ఈ బంతిలో తినేవళ్ళ వెనక నుంచుని వాళ్ళు తినగానే ఆకు కూడ ఎత్తకుండానే ఆ స్థలం లొ కూర్చుంటున్నారు. ఇలా చెయ్యటం సభ్యత కాదు అనుకున్నవాళ్ళకి ఆ రొజు పస్తే. దీనికన్నా బఫె భొజనమే నయమనిపించింది, కనీసం మన ప్లేట్ కోసం మన వెంట తిరగరు. ఇకపోతే పెట్టే వంటలు, మన బట్టే వుంటాయి. వచ్చే వాళ్ళు తృప్తిగా తినాలి అనుకుంటే మెను ఒకలాగా వుంటుంది, మన డాబు చూపించాలి అనుకుంటె ఒక లాగా వుంటుంది. రొజూ ఉల్లిపాయ ముట్టుకుంటేనే మహా పాపం అని బిల్డప్ ఇస్తూ, పెళ్ళి లొ బిర్యానీ తక్కువ పెట్టారు అని పెళ్ళి వాళ్ళని తిట్టే రకం మనుషులు చాలా మంది.
ReplyDelete'బొచ్చెభోజనం' హహ్హ్హహ్హ్హ!!!
ReplyDeleteడాక్టర్ గారూ...పోయిన వారం నా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళి వచ్చిన నాకు మీ పోస్ట్ తెగ నచ్చింది. వాడి మెను లో నేను వేలు పెట్టలేదు కానీ...మా అత్త గారి ఆధ్వర్యం లో గుత్తి వంకాయ అదనంగా చేర్చగలిగాను.
ReplyDeleteమీరు చెప్పిన "జీడి పప్పు" ఫార్ములా 100% కరెక్టు. హొటళ్ళలోనూ ఇదే టెక్నిక్ వాడుతారు.
మీ శైలి నాకు చాలా ఇష్టం.ధన్యవాదాలు.
అద్భుతః చాలా బాగుందండి!! ఈ రొజుల్లొ పెళ్ళి భోజనాల గురించి నాది కూడా same feeling
ReplyDeletekevvvvvvvvvvv keka ;)
ReplyDeleteపెళ్లి వంటల భండారాన్ని "బొచ్చె భోజనాల" సాక్షిగా బజారుకీడ్చి రచ్చరచ్చ చేసినట్టున్నారు! బొచ్చెను అవమానించినందుకుగాను, మనోభావాలు దెబ్బతిన్న బిచ్చగాళ్ల జాక్ (JAC) మీపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందేమో! జాగ్రత్త వహించండి :-) డిటెక్టివ్ యుగంధర్ రంగప్రవేశంతో పోస్టు పేలిపోయింది. భలే రాశారు, ఎప్పట్లానే!!
ReplyDeleteసార్, మీ పోష్టు నాకెంత నచ్చింది. ఎంత నచ్చిందంటే "గోంగూర పచ్చడి, దోసావకాయ, బెండకాయ వేపుడు, గుత్తొంకాయ కూర.. " తిన్నంత రుచిగా వుంది సార్!
ReplyDeletesuper sir
ReplyDeleteహహహహ మీ స్టైల్లో భలే రాశారండీ :-) సో ట్రూ :-)
ReplyDeleteడాక్టరు గారు,
ReplyDeleteమీరు చెప్పినది అక్షర సత్యం... ఆయితే మీకు మేనమామ ఆయితే నాకు అన్నయ్య అంతే తేడా...మిగతాదంతా సేమ్ టూ సేమ్ అండి... వాడు చదివింది టెన్త్. అది కూడా ఫెయిల్.. నేను చదివింది పోస్ట్ గ్రాడ్యుయేట్.. కానీ నా కన్నా వాడు చాలా తెలివైన వాడని బంధువుల్లో పెద్ద నమ్మకం... ఎంతంటే మా అమ్మ గారికి కూడా అంతే. మొన్న మే. నెలలో నా పెళ్ళి జరిగిందండి... అందులో మీలానే నేను కూడా ఏదో చేసేయాలని చాలానే ఊహించుకున్నాను. మొత్తం ఆ టెన్త్ ఫెయిల్ ఆయినా మా అన్నయ్య గాడీ మాటే చెల్లుబాటు ఆయిందండి. వంట వాడైతే వాడి లిస్ట్ లో ఉన్న ఐటెమ్స్ గురించే చెప్పాడు.. మనం అందులో ఏదోకటి ఎంచుకోవడమే తప్ప..మన చెప్పిన వంటకాలు వాడి లిస్ట్ లో ఉండవు.. పోనీ వాడి లిస్ట్ లో ఉన్న మంచి వంటకాలయినా ఎంచుకుందామనుకున్నా...ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు మా పెద్దోళ్ళు.. నా ముందు అందరూ తలాడించడం.. బయటకి వెళ్ళిన తర్వాత మా తెలివైనోడు చెప్పినట్టు చేయడం... ఇలా జరిగింది మొత్తం వ్యవహరం... చివరకు చిర్రెత్తుకి వచ్చి పట్టించుకోవడం మానేసాను...
ఏమి చేస్తాం టెన్త్ ఫెయిలైన వాడి జాతకం మన కన్న బాగుందనుకోవడం తప్ప....
మీ టపా మాత్రం అదరగొట్టేసారండీ ఈ సారి...
సూపర్ పోస్ట్ డాక్టర్ గారు.
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteఇదేమి బాగలేదండి. అక్కినేని గారి గురించి టపా రాయ లేదు. మీరు రాస్తారను కొన్నను, అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ టపా రాశారు.
ఈ పోస్టు చదివి కామెంటిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteపెళ్లి వంటల మీద నా పగ చాలా పురాతనమైనది. మూడేళ్ళ క్రితం ఒక పెళ్లి భోజనం తిని.. కోపంతో ఒక మెయిల్ రాసి స్నేహితులకి పంపాను. ఆ భోజనం గోడు ఎక్కడ చచ్చిందో నా మెయిల్ బాక్సులో వెతికే ప్రయత్నం చేస్తున్నాను. సబ్జక్ట్ దాదాపు ఇంతే గానీ.. ఇంకోలా ఉంటుంది.
(కనబడినట్లైతే పబ్లిష్ చేస్తాను.. నా బ్లాగు రాతల్లో ఒకటిగా, అది కూడా ఓ పక్కగా అలా పడుంటుంది.)
@Sri Ram,
మీ అంచనా తప్పు. నాగేశ్వర్రావు గూర్చి రాద్దామని ఒక్క క్షణం కూడా అనుకోలేదు.
PS : కామెంట్ రాసేప్పుడు 'డాక్టర్ గారు' అనడం avoid చెయ్యమని మిత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను.
నాకు పెళ్ళి భోజనమే కాదు, పెళ్ళంటేనే చిన్న సైజు పగండీ. భవిష్యత్తు పెళ్ళిళ్ళు, విడాకుల మీద ఒక కథ అప్పుడెప్పుడో రాశాను.
ReplyDeletehttp://poddu.net/2012/%E0%B0%85%E0%B0%AE%E0%B0%82%E0%B0%97%E0%B0%B3%E0%B0%AE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B9%E0%B0%A4%E0%B0%82%E0%B0%AC%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B1%86%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8/
Fantastic. That's exactly what's happening even in orthodox families. Even if they make ' bendakaaya fry' or 'guttonkaaya' , they all taste same. Status is more important than taste now a days.
ReplyDeleteఅన్నీ వండంగా చివరాకరికి మిగిలిన మడ్డి నూనెలో అన్నం పడేసి కలబెడతాం.. అదే ఫ్రైడ్ రైస్!" అన్నాడు ఆ వంటల మనిషి.
ReplyDeleteHilarious