Friday 24 January 2014

ఇదీ అందుకే


ఇప్పుడు స్పష్టత వచ్చేసింది.. రాష్ట్ర విభజన అనివార్యం అని.

చైనావాడితో యుద్ధం వస్తేనో, భూకంపం వచ్చి పార్లమెంట్ పూడుకుపోతేనో తప్ప రాష్ట్రం విడిపోవటం ఖాయం అని అర్ధమవుతుంది.

తెలుగు వార్తా పత్రికలు, తెలుగు టీవీ చానెళ్ళు అర్ధసత్యాలని, అసత్యాలని చెబుతుంటాయి. అందువల్ల తెలుగు వార్తలు ఫాలో అయ్యేవారు, ఏదో జరిగిపోతుందన్న భ్రమల్లో ఉండవచ్చుగాక.. అది వారిష్టం. వారి ఆనందాన్ని కాదనడానికి మనమెవరం?

ఈ విభజన సందర్భంలో అనేకానేక వినోద కార్యక్రమాలు గాంచవచ్చును.

పార్లమెంటు సభ్యులు విభజన అడ్డుకుని తీరతాం అని రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఘీంకరిస్తారు. అసెంబ్లీలో సభ్యులు భీభత్సమైన చర్చలతో నాటకం రక్తి కట్టిస్తారు. ప్రతిపక్ష నాయకుడు సమన్యాయం కావాలంటూ పదిగంటలు ఘోషిస్తాడు. అనంతరం విభజన అనర్ధదాయకం అంటూ ముఖ్యమంత్రి మరో పదిగంటలు గర్జిస్తాడు. అవ్విధముగా మన నాయకులు వారి సమైక్యస్పూర్తిని టీవీ చానెళ్ళ సాక్షిగా ప్రతిభావంతంగా ప్రదర్శించెదరు.

ఎందుకు?

- ఎట్లాగూ ఎన్టీరామారావు కత్తి యుద్ధం చేసి కృష్ణకుమారిని తిరిగి తీసుకెళ్ళిపోతాడని రాజనాలకి తెలుసు. మరి కష్టపడి హీరోయిన్ని చెరబట్టడం ఎందుకు?

- పెళ్లిభోజనాలు పరమ దరిద్రంగా ఉంటాయని తెలుసు. అయినా పెళ్ళప్పుడు ఆ భోజనాలు ఎందుకు?

- రేప్పొద్దున కల్లా గెడ్డం మళ్ళీ పెరుగుతుందని తెలుసు. మరి ఇవ్వాళ పరపరా గీక్కోటం ఎందుకు?

- సినిమా అట్టర్ ఫ్లాపైందని అందరికీ తెలుసు. మరి ఆల్ టైం రికార్దంటూ ప్రకటనలు ఎందుకు?

- తెలుగు పేపర్లలో చదివేవన్నీ చెత్తవార్తలే అని తెలుసు. మరి ఆ చెత్తని చదవడం ఎందుకు?

- ఏ పార్టీ వాడికి ఓటేసినా మన బ్రతుకులింతే అని తెలుసు. మరప్పుడు ఏదోక పార్టీకి ఓటెయ్యడం ఎందుకు?

ఎందుకో అర్ధమైందా?

ఇదీ అందుకే!

(picture courtesy : Google)

3 comments:

  1. మీ దగ్గర కూడ ఏదైనా ఆక్టోపస్ ఉందాండి?

    ReplyDelete
  2. అంతా మట్టేనని తెలుసు అది ఒక మాయే నని తెలుసు తెలిసీ తెలిసీ ......... ఉన్న తీయదనం మీకు తెలుసా?

    ReplyDelete
  3. తెలంగాణా రాష్ట్రం ఒక చారిత్రిక అనివార్యతగా ఇప్పటికయినా గుర్తించారు సంతోషం.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.