ప్రపంచం వేగంగా ముందుకెళ్తుంది. కవులు expression కోసం అలా అంటారు గానీ.. ప్రపంచం మరీ అంత వేగంగా ముందుకేమీ వెళ్లదు. మన చేతికున్న వాచీ వేగంతోనే ముందుకు వెళ్తుంది. అయితే అసలంటూ ఏదోక స్పీడుతో ముందుకే వెళ్తుంది.
కానీ నా చిన్నప్పట్నుండీ అస్సలు ముందుకు వెళ్లనివి కొన్ని ఉన్నాయి. వాటిలో సంక్రాంతి ముగ్గుల పోటీ ఒకటి. రంగురంగుల చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు గ్రౌండులో రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆ తరవాత వాటిల్లో ఉత్తమమైన ముగ్గులు ఎంపిక చేసి బహుమతులిస్తారు. చాలాసార్లు VIP భార్యలే ప్రైజులు కొట్టేస్తారు. ఇది మాత్రం యాదృచ్చికం.
అవును. సంక్రాంతి ముగ్గులు మన సంప్రదాయం. నాకు సాంప్రదాయమన్న మిక్కిలి మక్కువ. కానీ ఎప్పట్నుండో ఒక సందేహం. ముగ్గులు ఆడవాళ్లే ఎందుకెయ్యాలి? మగవాళ్ళు ఎందుకు వెయ్యకూడదు? కొంచెం నాక్కూడా ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వరూ? ప్లీజ్!
ఓయీ అజ్ఞాని! ఈ ముగ్గులకి కె. విశ్వనాథ్ సినిమాలకున్నంత పవిత్రత యున్నదోయి. అనాదిగా ముగ్గులు ఆడవాళ్లే వెయ్యాలనేది ఒక రూలు.. అదో గొప్ప సంస్కృతి. మగవాడవైన నీవు ముగ్గుల పోటీల్లో పాల్గొంటానని అర్ధించుట విధి వైపరీత్యం కాక మరేమిటి!
రోజులు మారిపోతున్నాయి. నా చేతికి మాత్రం వేళ్ళు లేవా? ఒక్క అవకాశం ఇస్తే నా టాలెంటేంటో చూపిస్తా.
ఓరి వెర్రి వెంగళప్పా! ఒకసారి చెబ్తే అర్ధం కాదా? సర్లే చేతివేళ్ళ ప్రస్తావన తెచ్చావు కాబట్టి చెబుతున్నా విను. ఆడవారి చేతివేళ్ళు అత్యంత సుకుమారముగానూ, పొడవుగానూ ఉండును. అందుకే బెండకాయని ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ అన్నారు గానీ, జెంట్స్ ఫింగర్ అన్లేదు. అర్ధమైందా?
ఇందులో అర్ధం కానిదేముంది!
దేవుడు ఆడవాళ్ళకి ఆ లేడీస్ ఫింగర్లు ఊరికే ప్రసాదించలేదు. కొన్నిపన్లు చెయ్యడానికి అనువుగా ఉంటుందనే ఇచ్చాడు. ఉదాహరణకి వాకిలి చిమ్మడం, ముగ్గులెయ్యడం, అంట్లు తోమడం, వంట చెయ్యడం, బట్టలుతకడం, పిల్లలకి ముడ్డి కడగడం.. ఇట్లాంటి పనులన్న మాట.
నిజంగా!
అవును. పచ్చి నిజం. అదీగాక ఇప్పుడు నువ్వు ముగ్గుల పోటీ అంటూ ఈ 100% ఆడాళ్ళ రంగంలో వేలు పెట్టావో జాగ్రత్త! అసలే పెళ్లి కావలసినవాడివి, జనాలకి నీపై లేనిపోని డౌట్లు వస్తాయి.
అన్నా! నీకు కృతజ్ఞతలు. ఎంత ప్రమాదం తప్పించావు! నాకు పెళ్లి ముఖ్యం. ఈ మగాళ్ళ ముగ్గుల హక్కు కోసం పోరాడి నా పెళ్లిని త్యాగం చెయ్యలేను. ఇంక పొరబాటున కూడా ఈ ముగ్గుల పోటీల గూర్చి ఆలోచించను. ఉంటానన్నా!
(photo courtesy : Google)
>> దేవుడు ఆడవాళ్ళకి ఆ లేడీస్ ఫింగర్లు ఊరికే ప్రసాదించలేదు. కొన్నిపన్లు చెయ్యడానికి అనువుగా ఉంటుందనే ఇచ్చాడు. ఉదాహరణకి వాకిలి చిమ్మడం, ముగ్గులెయ్యడం, అంట్లు తోమడం, వంట చెయ్యడం, బట్టలుతకడం, పిల్లలకి ముడ్డి కడగడం.. ఇట్లాంటి పనులన్న మాట
ReplyDeleteదీని మూలంగా మిమ్మల్ని గుంటూర్లో ఎవరో ఒకావిడ మిరపకాయ కారం (ఆ గుంటూరిదే) మొహం మీద కొట్టి మీచేతే వాళ్ళ పిల్లకి ముడ్డి కడిగిస్తుంది. ఇలాంటివి రాసేముందు కామెంట్లు డిజేబుల్ చెయ్యాలి గురూ గారూ. కాస్త ఒళ్ళు దగ్గిరపెట్టుకోండి. :-)
@DG,
Deleteఅమ్మయ్య! ఈ పోస్ట్ కామెంట్ లేకుండా మిగిలిపోతుందనుకున్నాను. ఆ లోటు తీర్చారు. థాంక్యూ.
మగవాళ్ళ హక్కుల గురించి రాస్తారనుకుంటే , ఇలా ముగ్గులేయండి , ముడ్డి కడగండి అని చెప్తారెంటండి .
ReplyDeleteకొత్తగా పెళ్ళైనా మాలాంటి వాళ్లంతా మీ పోస్ట్ లు చదివి దడుచుకునేలా ఉన్నాం .
ఏమైనా మీరు పురుష జాతి మీద శీతకన్ను వేసారనిపిస్తుంది .
ఇవ్వాళ ఉదయం ఆంధ్రజోతిలో ముగ్గులపోటీ బొమ్మల్ని చూశాను. కొద్దిసేపటికి నన్ను రంగనాయకమ్మ + ఓల్గా + కుప్పిలి పద్మ పూనేశారు. దాని ఫలితమే ఈ పోస్ట్. :)
Delete' చాలాసార్లు వీఫ్ భార్యలే ప్రైజులు కొట్టేస్తారు. ఇది మాత్రం యాదృచ్చికం.'
ReplyDeleteకాదు సార్! ఇదే ప్లానిచ్చికం.
:))
Deleteఆ పనులన్నీ చేయటానికే కాదు ముగ్గులు వేయటానికి కూడా ముఖ్యం గా సహనం కావాలి.. బహుమతులేమో VIP లకు కావాలి..
ReplyDeleteఅందుకే ముగ్గుల పోటీల్లో VIP భార్యలకు బహుమతులు !
అంతే కదా సార్!
సాధారణంగా ఇట్లాంటి పోటీలు ఏవో క్లబ్బులవాళ్ళు నిర్వహిస్తుంటారు. వాళ్ళు విఐపీల్ని satisfy చేస్తుంటారు. అది వారి ధర్మం.
Deleteఇది ఖర్మండీ బాబూ. అసలు ముగ్గులే వద్దంటారా ? మీ టపా కాస్త అయోమయం గా ఉంది .
ReplyDeleteముగ్గులెం ఖర్మ మీరు చెప్పిన అన్ని పన్లూ మగాళ్ళు భేషుగ్గా చెయ్యొచ్చు. కానీ చెయ్యరే!
జాతీయం గా , అంతర్జాతీయంగా సంపాదించే పోటీలు పెడితే ఆడవాళ్ళు పోటీ చెయ్యడం లా ?
ఆడవాళ్ళు అన్ని పనుల్లో పోటీ చెయ్యగలరు, మగాళ్ళకి చాతకాదు. ఏదో డబ్బులోచ్చే పనులు తప్ప.
ఈ సారి పోటీల్లో మిమ్మల్ని వి ఐ పీ గా పిలువమని చెప్తాం లెండి , ఇక బహుమతి కూడా మీకే అని వేరే చెప్పాలా ?
@Mauli,
Deleteనాకీ పోస్టు రాసినట్లు గుర్తు లేదు. మీ కామెంట్ కారణాన ఇవ్వాళ మళ్ళీ చదివాను. థాంక్యూ!