Tuesday 4 February 2014

'మూగమనసులు' అంతుపట్టని అమ్మాయిగారి మనోగతం


సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానిస్తే, విమర్శ సాహిత్యాన్ని విశ్లేషిస్తుందనీ.. తెలుగులో సాహిత్యానికి తగినంత స్థాయిలో సాహిత్య విమర్శ లేదనీ.. చాలాయేళ్ళ క్రితం కొడవటిగంటి కుటుంబరావు చేసిన ఆరోపణ. సాహిత్యం వేరు, సినిమా వేరు. సాహిత్యాన్ని పాఠకుడు చదువుతాడు, సినిమాని ప్రేక్షకుడు చూస్తాడు.

కానీ ఈ రెండు ప్రక్రియలు చేసే పని ఒకటే.. కథ చెప్పడం. ఒక మంచి రచన విమర్శకుల్ని ఆకర్షిస్తుంది, మంచిచెడులు కూలంకుషంగా చర్చింపపడతాయి. ఇందుకు పాలగుమ్మి పద్మరాజు 'గాలివాన', కాళీపట్నం రామారావు 'యజ్ఞం' లాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

'కథ చెప్పడం' అనే ప్రక్రియే ప్రధానంగా ఉన్నప్పటికీ సినిమాకథకి సాహిత్యస్థాయి లేదు. అయితే - ఒక మంచి సినిమాకథకి 'సాహిత్యస్థాయి' ఇచ్చి కథాపరమైన మంచిచెడులు విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? కానీ ఎందుకో తెలుగులో ఆ ప్రయత్నం జరగలేదు (నాకు తెలిసినంతమేరకు).

సినిమాకథంటే కొందరు నటుల్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా, పామరజనుల వినోదం కోసం అల్లుకునే కథ మాత్రమేననీ, అట్టి కథలు సీరియస్ విశ్లేషణకి అనర్హం అనే అభిప్రాయం విమర్శకుల్లో ఉండటం కావచ్చు. లేదా సినిమాలో కథని ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు కూడా ముడిపడి వున్నందున, కథ నొక్కదాన్నే బయటకి లాగి చర్చింపబూనడం సరికాదనే అభిప్రాయం కావచ్చు.

కారణం ఏదైనప్పటికీ.. తెలుగు సాహిత్య విమర్శతో పోల్చి చూసుకుంటే తెలుగు సినిమా కథలకి అసలు విమర్శే లేదు. ఈ ప్రపంచంలో ఏదీ విమర్శకి అతీతం కాదు, కారాదు. నచ్చిన విషయాల్ని మెచ్చుకున్నట్లే, నచ్చనివాటి గూర్చి నిర్మొహమాటంగా చర్చించగలగాలి. ఇలా విమర్శించడం ఆయా రచయితల్ని కించపరచడం అవదు. ఒక విమర్శ కథలో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తుందనే అభిప్రాయం కూడా నాకుంది.

ఈమధ్య 'మూగమనసులు' విడుదలై యాభైయ్యేళ్ళు పూర్తైన సందర్భాన.. యధావిధిగా పత్రికలు, టీవీలవాళ్ళు సినిమాకి సన్మానపత్రాలు సమర్పించారు. నేనీ సినిమాని హాల్లో కొన్నిసార్లూ, ఇంట్లో మరికొన్నిసార్లూ చూశాను. నాకు బాగా నచ్చిన సినిమాల్లో మూగమనసులు ఒకటి. ఎలాగూ సినిమా కథ, విమర్శ అంటూ చెబుతున్నాను కాబట్టి.. ఇప్పుడు నేను మూగమనసులు కథ గూర్చి నా అభిప్రాయాలు రాస్తాను.

అనగనగా ఒక జమీందారు. ఆయనకి ఒక కూతురు, పేరు రాధ. ఈ రాధ ప్రతిరోజూ పడవలో గోదావరి దాటి ఆవలి ఒడ్డునున్న కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ పడవ నడిపేవాడు గోపీ. చాలా పేదవాడు, అమాయకుడు, అర్భకుడు. గోపీ రాధని 'అమ్మాయిగారు' అంటూ వెర్రిగా అభిమానిస్తాడు, ఆరాధిస్తాడు. అతనికి పొద్దస్తమానం అమ్మాయిగారి ధ్యాసే. గోపీని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని గౌరీ అనే అల్లరి అమ్మాయి ఎదురు చూస్తుంటుంది.

గోపీ ప్రతిరోజూ అమ్మాయిగారికి బంతిపువ్వునిచ్చి తన భక్తిని చాటుకుంటూ, ఆమెని దేవతా సమానంగా పూజిస్తాడు. ఈ వెర్రి అభిమానం.. మన తెలుగు సినిమా హీరోల వెర్రి అభిమానుల్ని తలపిస్తుంది. రాధ గోపీ వీరాభిమానం వల్ల ఏ మాత్రం ఇబ్బంది పడకపోగా.. ఆ పడవ్వాడి ఆరాధనని ప్రోత్సాహిస్తుంది, ఎంజాయ్ చేస్తుంటుంది.

కథ కొంచెం ముందుకు సాగి, రాధకి రాంబాబు అనేవాడు రాసిన ప్రేమలేఖ జమీందారు కంట పడుతుంది. కూతురు కూడా రాంబాబుని ప్రేమించిందనుకుని పెళ్లి నిశ్చయం చేస్తాడు జమీందారు. వాస్తవానికి రాధ రాంబాబుని ప్రేమించలేదు, అతనితో పెళ్ల్లి ఇష్టం ఉండదు కూడా. ఆమె ఇదే విషయం తన తండ్రికి చెప్పొచ్చు. అలా చెబితే తండ్రి పెళ్లి ప్రయత్నం చేసేవాడు కాదు. అయినా చెప్పదు, ఎందుకో తెలీదు!

తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే.. తను కనబడక గోపీ ఎంతగానో బాధ పడతాడని రాధకి తెలుసు. గోపీని పెళ్లి చేసుకోటానికి గంపెడంత ప్రేమతో గౌరీ ఎదురు చూస్తుందనీ తెలుసు. అమాయకుడైన గోపీని, గడుసైన గౌరీతో కట్టబెట్టేస్తే గోపీ జీవితం హాయిగా వెళ్ళిపోతుందని తెలుసు. తనమాట గోపీకి వేదవాక్కు. 'నువ్వు గౌరీని పెళ్లి చేసుకోరా గోపీ' అని ఒక్కమాట అన్నట్లయితే, అరనిమిషంలో గౌరీని పెళ్లి చేసుకుంటాడనీ తెలుసు. కానీ గోపీ భవిష్యత్తు గూర్చి అమ్మాయిగారు ఒక్కక్షణం కూడా ఆలోచించదు. ఎందుకో తెలీదు!

రాధ హాయిగా పెళ్లి చేసుకుని, గోపీతో పాట పాడించుకుని, భర్తతో కాపురానికి వెళ్ళిపోతుంది. భర్తకేదో రోగం రాబట్టి గానీ, లేకపోతే మొగుడికి డజను మంది పిల్లల్ని కనుండేది, ఈ ప్రేమ కథకి ముగింపు కార్డూ పడేది. కానీ ఇదో గొప్ప ప్రేమ కథ! కావున కథకోసం రాధ మొగుడు అర్జంటుగా ఏదో రోగం తెచ్చుకుంటాడు.

కొన్నాళ్ళకి రాధ భర్త చచ్చిపొయ్యి కథకి అడ్డు తొలుగుతాడు. వైధవ్యంతో పుట్టింటికి తిరిగొస్తుంది రాధ. ఇష్టం లేని పెళ్లి, మూణ్నాళ్ళ ముచ్చటగా ముగిసిన కాపురం. అయినా రాధ దుఃఖం అత్యంత భీభత్సంగా ఉంటుంది! తిండి కూడా మానేస్తుంది. సహజంగానే అమ్మాయిగారి భక్తుడైన గోపీ తల్లడిల్లిపోతాడు. ఆవిడకి బత్తాయి తొనలు తినిపిస్తూ, పాటలు పాడుతూ ఓదారుస్తుంటాడు గోపీ.

పాపం! గోపీ కడుపేదవాడు, గోదావరి తిరనాళ్లలో అవ్వకి దొరికిన దిక్కూమొక్కు లేని అనాధ, పెళ్ళీపెటాకులు లేని బ్రహ్మచారి. జీవితంలో ఏ ఆనందమూ అనుభవించని వాడు. ఏరకంగా చూసుకున్నా అమ్మాయిగారి కన్నా పరమ హీనస్థితిలో ఉన్నవాడు. అయినా కూడా భర్త చనిపోయిన బాధలో ఉన్న అమ్మాయిగారిని ఓదార్చడానికి శక్తికి మించి తాపత్రయపడతాడు.

నేను మెడికల్ స్టూడెంటుగా ఉన్నప్పుడు కష్టమైన కేసుకి డయాగ్నోసిస్ సీనియర్స్ నుండి ముందే తెలుసుకుని, దానికి తగ్గట్టుగా పేషంట్ ఎక్జామినేషన్ ఫైండింగ్స్‌తో కేసు రాసేసి, నేనే ఆ డయాగ్నోసిస్ చేసినట్లుగా ప్రొఫెసర్లకి కేస్ ప్రెజెంట్ చేసేవాణ్ణి. మూగమనసులు రచయిత కూడా నాలాంటివాడేననిపిస్తుంది (అందుకే ముగింపు ముందే అనుకుని, అందుకు తగ్గట్టు కథ రాసుకున్నాడు).

అంచేతనే - రాబోయే అమ్మాయిగారి కష్టాన్ని ఓదార్చడానికి, అటుపై ఆవిడతో కలిసి చనిపోవడానికి వీలుగా.. కావాలనే గోపీకి పెళ్లి చెయ్యకుండా రచయిత గోపీని రిజర్వులో ఉంచినట్లుగా అనిపిస్తుంది. ఊళ్ళోవాళ్ళు తమ స్నేహాన్ని చెడుగా అనుకుంటున్నారని బాధపడుతుంది రాధ. గౌరీ మీద కోపంతో అలిగి పడవ మీద పడి ఏడుస్తున్న గోపీని బలవంతంగా నదిలోకి తీసుకెళ్తుంది.

రాధకి ఎప్పుడూ తన సొంతగోలే గానీ, గోపీ గూర్చి అస్సలు ఆలోచన ఉండదు. తను చావాలి, తనతోపాటు తన భక్తుడు గోపీ కూడా చావాలి. ఆవిడ దృష్టిలో గోపీ ప్రాణానికి విలువ లేదు. ఇదీ ఆమె ధోరణి! ఉన్నత కుటుంబాలవాళ్ళు తమకన్నా బాగా స్థాయి తక్కువ వాళ్ళ పట్ల ఇలాగే ఆలోచిస్తారేమో! ఆ విధంగా తన చావుకి తోడుగా ఆ అమాయక పడవవాణ్ని వెంట తీసుకెళ్తుంది రాధ. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యవిషయమేమంటే, ఈ suicide pact లో గోపీకి ఏమాత్రం ప్రమేయం లేదు. అతను చేసిన తప్పల్లా అమ్మాయిగార్ని దేవతలా ఆరాధించడమే.

'మూగమనసులు' ఒక మంచి కథ. కథలో అన్ని పాత్రలకీ వ్యక్తిత్వం ఉంటుంది, పర్పస్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇవేవి లేనిదల్లా ఒక్క రాధకి మాత్రమే. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక మంచి కథలో పాత్రల ఔచిత్యం దెబ్బ తినదు. ఏ పాత్ర దృష్టికోణం నుండి చూసినా కథనం దెబ్బతినదు, తినకూడదు. కానీ మూగమనసులులో అతి ప్రధానపాత్రకి వ్యక్తిత్వం ఉండదు! కారణం యేమయ్యుంటుంది?

నాకు తోచిన కారణాలు రాస్తాను. ఏ రచయితైనా పాత్రల ద్వారా సన్నివేశాల్ని సృష్టించి కథ చెబుతాడు. అయితే ఎంత గొప్ప రచయితైనా ఏదోక పాత్ర ద్వారా మనకి కనబడతాడు. ఆ పాత్రకి extra care తీసుకుని స్పెషల్‌గా తీర్చి దిద్దుతాడు. కన్యాశుల్కం చదువుతుంటే మనకి మధురవాణిలో గురజాడ కనిపిస్తాడు. ఇలా చెయ్యటం కథనం రీత్యా కూడదు గానీ, రచయిత కూడా మనిషేగా!

'మూగమనసులు' కథకి గౌరీది మకుటాయమానమైన పాత్ర. ఈ పాత్రకి రచయిత extra care తీసుకున్నాడు. అందుకే గౌరీ కోణంలోంచి ఈ కథని ఫాలో అయితే కథలో చిన్న పొరబాటు కూడా కనబడదు. గౌరీ అమాయకురాలు, మనసున్న మనిషి, ప్రేమమయి, గడుసుది, కోపిష్టిది, ఈర్ష్యాసూయలు కలది, త్యాగశీలి. ఈ భూమ్మీద బ్రతుకుతున్న అనేకమందిలా ఒక సాధారణ మనిషి.

గోపీ కోణం నుండి కూడా ఎక్కడా వంక పెట్టటానికి వీలులేని కథ మూగమనసులు. అతనిది సింగిల్ పాయింట్ ఎజెండా.. అమ్మాయిగారి ఆరాధన. అందుకోసమే జీవించాడు, తన బ్రతుకుని నిర్లక్ష్యం చేసుకున్నాడు. చివరకి అమ్మాయిగారి కోరిక ప్రకారమే మరణించాడు కూడా.

రచయిత జన్మ, పునర్జన్మ అంటూ ఒక థియరీ చెబుతాడు. ఈ పునర్జన్మల థియరీ కోసమే రచయిత రాధాగోపీల్ని హడావుడిగా ఒకేసారి చంపేసి ఉండొచ్చు. అలా వాళ్ళిద్దరూ ఒకేసారి చావకపోతే రచయిత చెప్పదల్చుకుంది పల్చబడిపోతుంది. కాబట్టి ఇద్దర్నీ కలిపి ఒకేసారి చంపేద్దామని నిర్ణయించుకున్న రచయిత, చావడానికి రాధకి గట్టి కారణం సృష్టించగలిగాడు. కానీ - రాధ గోపీని కూడా ఎందుకు చావులొకి లాక్కెళ్తుందో బలమైన కారణం చెప్పలేకపొయ్యాడు.

సమస్య రాధది, ఆవిడకి ఊళ్ళోవాళ్ళు అన్న మాటలు అవమానంగా తోస్తే ఆవిడ ఒక్కతే చనిపోవడం న్యాయం. గుడిపాటి వెంకట చలం నాయకిలా గోపీతో లేచిపొయ్యే ధైర్యం చెయ్యకపోయినా, కనీసం తను చచ్చి గోపీని వదిలేస్తే పొయ్యేది. నేను ఈ సినిమా చిన్నతనంలో చూసినప్పుడు 'ఆ పడవ నడిపేవాడు సుబ్బరంగా రాధని పెళ్లి చేసుకోవచ్చుకదా' అని అనుకున్నాను. నాకప్పుడు మన వ్యవస్థలో ఉండే సామాజిక అంతరాల గూర్చి అవగాహన లేదు.

అంతకుముందు ఎన్నోయేళ్ళ క్రితం 'మాలపిల్ల' వచ్చింది. దళిత యువతిని పెళ్ళాడిన హీరో కథతో 'రోజులు మారాయి' వచ్చింది. మూగమనసులు కథలో జమీందార్ల అమ్మాయిని ఆరాధించిన హీరో సామాజికంగా బలహీన వర్గం వాడు. అందుకే అతనికి పొరబాటున కూడా అమ్మాయిగారి గూర్చి 'చెడు' తలంపులు రావు. ఈ విధంగా రచయిత 'కులసంకరం' కాకుండా కథాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కువ కులం మగవాడు, తక్కువ కులం అమ్మాయిని ప్రేమించవచ్చును గానీ.. తక్కువ కులం మగవాడు, పైస్థాయి అమ్మాయిని కోరుకోకూడదా? ఏమో, ఆ రోజున్న సామాజిక పరిస్థితుల్లో అది తప్పేమో!

ఈ కథ పేరు మూగమనసులు. అయితే ఇందులో ఉన్నది ఒకటే మూగమనసు! అది రాధది. మిగిలిన అన్ని పాత్రలకి చక్కటి ఆలోచనలు ఉంటాయి, హాయిగా వ్యక్తీకరిస్తూనే ఉంటాయి, ముఖ్యంగా గౌరీ. ఒక్క రాధని పక్కన పెడితే అన్ని పాత్రలు, చాలా సహజంగా ప్రవర్తిస్తుంటాయి. నా దృష్టిలో ఈ కథకి వీకేస్ట్ లింక్ రాధ. క్రికెట్ భాషలో చెప్పాలంటే కథలో రాధ పాత్ర ఎప్పుడూ non striker's end లోనే ఉంటుంది. రన్స్ మొత్తం గౌరీ, గోపీలు తీసేశారు, మ్యాచ్ గెలిపించేశారు.

సినిమా ఎప్పుడో వచ్చింది, తెలుగువాళ్ళకి నచ్చింది. వీలైతే నాలుగు మంచిమాటలు రాయాలి గానీ, విమర్శించాల్సిన అవసరం ఇప్పుడేంటి? అనేది కొంతమంది అభిప్రాయం కావచ్చు. అదీ నిజమే, ఒప్పుకుంటున్నాను. అయితే - చాలామంది 'కన్యాశుల్కం' లోపాల్ని కూడా ఆ నాటకంపై ఎంతో ఇష్టంతోనే చర్చించారు, నచ్చక కాదు.

ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక గొప్ప కథ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆ గొప్ప కథలో నచ్చని కొన్ని పాయింట్లని రికార్డ్ చెయ్యడం కూడా ఆ కథకి గొప్ప ట్రిబ్యూట్ అనుకుంటున్నాను. లేకపోతే ఇంత కష్టపడి ఇదంతా రాయను కదా!


(photos courtesy : Google)

46 comments:

  1. యెప్పుడూ సరదాగా ఉండే డాకటేర్ బాబు గారు ఒక్కసారిగా ఇంత సీరియస్ అయ్యారేంటి? తేరే కో క్యా హోగయా కాలియా? జర బందూక్ లగానా!

    కన్యాశుల్కంలో అసలు పెళ్ళి కూతురు స్టేజ్ మీద కనపడక పోవటానికి కారణ మేంటో తెలుసా? దేవదాసు కధలో పార్వతి దేవదా మళ్ళీ కలిసి సారీ చెప్తే యేం నాన్న నీకేనా నాకు లేడా అని రోషం చూపించటానికి కారణం తెలుసా?

    యెనత్ తెలివి తక్కువ మగవాఇకయినా యెందులో ఒకందులో అద్భుతమయిన ప్రతిభ ఉంటుంది.దాన్ని గనక తనంతట తనుగా తెలుసుకున్నా వేరే వాడెవాయినా చిన్నగా ఒక నొక్కు నొక్కినా వాడిక బూమ్మీద నడవడు.

    అట్టాగే యెంత తెలివయిన ఆడదానికయినా యెక్కడో అక్కడ వేపకాయంత వెర్రి ఉంటుంది. కాకపోతే దాన్ని కనుక్కుని బయట పడకుండా అణుచుకోగలిగీతేనే తెలివయిన ఆడదవుతుంది.మూగ మనసులు హీరోయిన్ అలా తనలో ఉన్న వెర్రిని కంట్రోల్ చెసుకోలేకపోయింది, అంతే:-)

    ReplyDelete
    Replies
    1. లేదులేదు, అస్సలు సీరియస్ అవ్వలేదు. ఒక సినిమాకథని ఇలా విమర్శించతగునా? అనే ప్రశ్న వేసుకుని, introduction ఎక్కువగా రాశాను. అంతే.

      ఈ సందర్భంగా తెలుగు మీడియాకి ధన్యవాదాలు. వాళ్ళీ సినిమాని విపరీతంగా పొగడటం వల్లనే నాకీ పోస్ట్ రాద్దామనిపించింది.

      Delete
  2. ఈ సినిమాకు "మూగ మనసులు" కన్నా "చెవిటి మనసులు" సరిగ్గా సూటవుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. సిక్త్స్ సెన్స్ ఎలా పని చేస్తుందో తెలీదు కాబట్టి చెవుడు కు కారణాలు విశ్లేషించలేను.

    డాక్టర్ చక్రవర్తి సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇలాగే అనిపించింది. నాగేసర్రావు సినిమా మొదట్లోనే సావిత్రిని "చెల్లెలు" గా భావిస్తానని ఒక్క మాట చెబితే సినిమా అంతా సాగతీసి, "ఎవరో జ్వాలను రగిలించారు" అని బాధపడే అవసరం తప్పేది. చాలా యేళ్ళక్రితం నలుపు తెలుపు టీవీ రోజుల్లో సినిమా చూస్తూ నేనీ మాట అన్నందుకు అప్పట్లో మా ఇంట్లో టీవీ రూమ్ నుండి బహిష్కరించారు.

    ReplyDelete
    Replies
    1. మూగ మనసులు కాదు చెవిటి మనసులు! అలాగే కుంటి మనసులు, గుడ్డి మనసులు, నడ్డి మనసులు, గూని మనసులు, అలాగే డాక్టర్ చక్రవర్తి కాదు డాక్టర్ శోకవర్తి?!

      Delete
    2. @రవి,

      >>నాగేసర్రావు సినిమా మొదట్లోనే సావిత్రిని "చెల్లెలు" గా భావిస్తానని ఒక్క మాట చెబితే సినిమా అంతా సాగతీసి<<

      నాదీ మీ అభిప్రాయమే. కాకపోతే మనవాళ్ళు ఆ సాగతీతని ఒక తియ్యని బాధగా ఎంజాయ్ చేశారు. :)

      Delete
    3. రవి గారూ, నాగేశ్వర్రావు సావిత్రిని చెల్లెలుగా భావిస్తున్న సంగతి ప్రేక్షకులకు కూడా అందకుండా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కూడా!

      Delete
  3. సార్ నమస్తె, ఈ సినిమాలొ జమున ఎనర్జిటిక్ యాక్షన్ సూపర్. మీ అనాలిసిస్ అబ్బా...

    ReplyDelete
    Replies
    1. 'మూగమనసులు' గౌరీ కథ. గౌరీ నాకు చాలా ఇష్టమైన పాత్ర.

      Delete
  4. రమణగారూ...
    >> ఈ ప్రపంచంలో ఏదీ విమర్శకి అతీతం కాదు, కారాదు. నచ్చిన విషయాల్ని మెచ్చుకున్నట్లే, నచ్చనివాటి గూర్చి నిర్మొహమాటంగా చర్చించగలగాలి. ఇలా విమర్శించడం ఆయా రచయితల్ని కించపరచడం అవదు. ఒక విమర్శ కథలో కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తుందనే అభిప్రాయం కూడా నాకుంది <<
    ఈ మూడు ముక్కలూ అక్షర లక్షల చేసే మాటలు! మూగ మనసులుపై మీ విమర్శనాత్మక సమీక్ష చాలా చాలా బావుంది. నాకూ "రోజులు మారాయి" సినిమా బాగా నచ్చుతుంది!

    ReplyDelete
    Replies
    1. అంటే, దొడ్దిదారిన దాన్ని కూడా యేకమనా అర్ధం?

      Delete
    2. హహ్హా... ఎంతమత్రమూ కాదండీ.
      ఆ సినిమా మీద రమణగారే కాదు, ఈగ వాలినా సహించేది లేదు, ఆయ్! :-))
      అయినా రోజులు మారాయిలో ఏకడానికి ఏమీ దొరక్కపోవచ్చు, అందరినీ ఎనకేసుకురావడమే!

      Delete
    3. 'రోజులు మారాయి' ఒక మాస్టర్ పీస్. నాక్కూడా చాలాచాలా ఇష్టం.

      'మూగమనసులు' సందర్భం వచ్చింది కాబట్టి రాశాను. నేనేవో కొన్ని పాయింట్లు రాద్దామనుకున్నాను. పోస్ట్ ఇంకోలా వచ్చింది.

      Delete
    4. సర్, "మనుషులు మారాలి "కూడా ఓ మాస్టర్ పీస్.

      Delete
  5. ఈ సినిమాలో సావిత్రి, సూర్యకాంతం సవతి కూతురు అన్న కోణంలో విశ్లేషించండి.

    ReplyDelete
    Replies
    1. నాకు మీ పాయింట్ అర్ధం కాలేదు.

      (సవతితల్లి రాధని ఇబ్బంది పెట్టినట్లు ఎక్కడా లేదు కదా? పైగా ఆ అమ్మాయిని తండ్రి చాలా ప్రేమగా చూసుకుంటాడు.)

      Delete
  6. సావిత్రి మీద గాలిని కూడా సోకనివ్వని నువ్వు, ఆమె ధరించిన పాత్రని (పాత్రనె ఆయినా) ఇంతలా మనసు లేని దాని లాగా చిత్రీకరిస్తావనుకొలెదు! విమర్సన సమంజసంగానే ఉంది కానీ ఆవిడ కూడా ఒక మానవ మాత్రురాలైన అమ్మాయి వీడు నాతో చాస్తేనే కానీ మళ్ళీ నాతో పుట్టడు, వచ్చే జన్మలో అయినా వీడి కోరిక తీరాలంటే వీణ్ణి కూడా నాతో తీసుకెళ్ళాలి అని ముందు చూపుతో ప్రవర్తించింది అనుకోని తృప్తి పడు, పిచ్చి మానసిక వైద్యుడా!

    ReplyDelete
    Replies
    1. మిత్రమా,

      'దేవుని యందు ప్రమాణము చేసి నిస్పక్షపాతంగా అన్నీ నిజాలే రాస్తాను. ఈ పోస్టు రాసేప్పుడు రాధని సావిత్రిగా చూడను.' అని సుబ్బు నాచేత ప్రమాణం చేయించాడు. :)

      Delete
  7. Y.v.ramana gaaru,chaalaa baagundi :-):-)

    ReplyDelete
  8. >> నేను మెడికల్ స్టూడెంటుగా ఉన్నప్పుడు కష్టమైన కేసుకి డయాగ్నోసిస్ సీనియర్స్ నుండి ముందే తెలుసుకుని, దానికి తగ్గట్టుగా పేషంట్ ఎక్జామినేషన్ ఫైండింగ్స్ తో కేస్ రాసేసి, నేనే ఆ డయాగ్నోసిస్ చేసినట్లుగా ప్రొఫెసర్లకి కేస్ ప్రెజెంట్ చేసేవాణ్ణి.

    ఇది కాపీ చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి పంపిస్తున్నాను మీ లైసెన్స్ పీకమని. ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. నాకేం బాధ్యత లేదు; మీరు ఒప్పుకున్నదే.

    ReplyDelete
    Replies
    1. హహ్హహ్హా.. నేన్రాసింది exams case presentation గూర్చి కాదు. హాస్పిటల్లో bed side teaching ఉంటుంది, అప్పటి రోజువారీ case presentation గూర్చి.

      Delete
  9. మీ ప్రస్థానంలో కన్యాశుల్కం పై విమర్శ ప్రస్థావన బహుశా నా బ్లాగు ప్రభావం అనుకుంటా..ధన్యవాదములు..మూగమనసులు పై మీ అభిప్రాయం 100% కరెక్టు..నాకైతే జమున పాత్ర కూడా చాలా అతి అనిపించింది..పద్మనాభం నటనలో నేను తర్వాత చచ్చిపోతాగా అన్న ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తాయి..


    ReplyDelete
    Replies
    1. ఇరవైయ్యేళ్ళ క్రితం విశాలాంధ్ర వాళ్ళు 'కన్యాశుల్కం' పై విమర్శ, ప్రతివిమర్శల చర్చా సంకలనం ఒక మందపాటి దిండు సైజులో ప్రచురించారు. ఆ పుస్తకంలో బంగోరే, ఆరుద్ర మొ. వారి వ్యాసాలున్నాయి. పుస్తకం ఎంత విలువైనదంటే.. నేను పూర్తిగా చదవకముందే ఎవడో 'జాతీయం' చేసేశాడు, మళ్ళీ దొరకలేదు. :)

      Delete
  10. భలే రాశారు. ఈ సినిమా మొత్తం మీద నాక్కూడా నచ్చేది జమున పాత్రే!చక్కగా ఓపెన్ గా హాయిగా ఉంటుంది. ఈ సినిమాచాలా చిన్నప్పుడు చూశాను.అప్పటికది ఎన్నో రిలీజో తెలీదు! ఏమీ అర్థం కాలేదు. హీరో హీరోయిన్లు చావకుండా ఉంటే బాగుండనుకున్నాను.

    తర్వాత మళ్ళీ టీవీలో చూశాక గోపీ రాధను ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోలేక పోయాను. దాంతో మూడో సారి మళ్ళీ ఎప్పుడో చూశాను..

    రాధ తను చచ్చేది కాక గోపీని ఎందుకు లాక్కు పోవాలని కోపగించుకున్నాను. ఒకవేళ నదిలోకి పోయాక బతుకు మీద ఆశ పుడితే ఎవరు కాపాడతారు? అందుకే గోపీని తీసుకు పోయుంటుందని జవాబు చెప్పుకున్నాను. రాధకి బొత్తిగా ఎజెండా లేదనుకోవాలో, మరీ గొప్ప అజెండా ఉందనుకోవాలో అర్థం కాదు

    మొత్తం మీద కొన్ని సినిమాలెలా ఉంటాయంటే, అది ఎంత చెత్త కథ అయినా, టేకింగ్ వల్ల (అంటే దర్శకత్వ ప్రతిభ వల్ల) నోరు మూసుకుని చూసొచ్చేలా ఉంటాయి. ఇంటికొచ్చాక ఇలా ప్రశ్నలు వొస్తూ ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. ఆ రోజుల్లో తెలుగు సాహిత్యంలో అమలిన (!?), ఆరాధనా పూర్వకమైన ప్రేమని దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటివారు romanticise చేశారు. బహుశా ముళ్ళపూడి వెంకట్రవణ మీద ఆ ప్రభావం ఉండి ఉండొచ్చు. ఇంకొంచెం లోతుకి వెళ్ళి మరిన్ని విషయాల గూర్చి రాయొచ్చు కానీ.. అనవసరం అనిపిస్తుంది.

      Delete
    2. సార్, ఇది మీరు చెప్పాల్సిన జవాబండి. అందువల్ల అడుగుతున్నాను.
      ఆ నాటి అమలిన శౄంగారానికి ఈ నాటి మానసిక వ్యభిచారానికి ఏమైనా తేడా ఉందాండీ? సారి మిమ్మల్ని ఇరుకున పెడితే క్షమించండి.

      Delete
    3. @THIRUPALU P,

      బాగానే ఇరుకున పెట్టారు.

      నామటుకు నేను, 'అపవిత్రమైన' సెక్సు ఆలోచనలు తప్పించి, రెంటి మధ్యా పెద్ద తేడా ఉందనుకోవట్లేదు.

      Delete
    4. ప్యూర్ ఇన్నోసెన్స్ అన్న ఫాక్టరే లేదంటారా?

      Delete
    5. ఫణి గారు,

      ఉండొచ్చు. ఇవన్నీ subjective. అందుకే నేను 'నామటుకు నేను' అన్నాను.

      Delete
  11. సర్, చాలా మంది అమ్మాయిలు ఇంతే, ఓ పక్కన పడుంటాడులే అనుకుని తమ జీవితం చాలా భారంగా గడుస్తున్నట్లు నటిస్తారు, కానీ ఇప్పటి అబ్బాయిలకు అంత ఓపిక లేక యాసిడ్ బాటిల్ తో తయారవుతున్నారు.

    ReplyDelete
  12. అంతుపట్టని అమ్మాయిగారి మనోగతం

    అంతు చిక్కని మనోగతం ఎముంది? మూగమనసులు లలో కథానాయకి అయినా, టైటానిక్ లో కథానాయకి అయినా ఇద్దరు మగవాళ్లను ప్రేమ పేరుతో నీళ్ల ముంచి కడ తేర్చిన వారే. ఒక వేళ టైటానిక్ కథానాయకి లా, రాధ బతికి ఉంటె , గోపీ ఇచిన వాడిపోయిన ముద్దబంతిపువ్వుల మధ్య కూచొని తన ప్రేమ కథను ఫ్లాష్ బక్ లోచెప్పటం మొదలు పెట్టి ఉండేదెమో :)

    ReplyDelete
    Replies
    1. మీరు ఇంత సింపుల్ గా అమ్మాయిగార్ని చదివెయ్యడం నేనొప్పుకోను. అమ్మాయిగారిది క్లిష్టమైన మనోగతం. నేను దాన్ని కష్టపడి చేధించాను. :)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
  13. గౌరి పాత్ర కొంతవరకు మగరాయుడిలా ఉంటుంది. అందుకే దర్శకుడు ఆపాత్రను అర్ధం చేసుకోగలిగాడు. రాధ మనస్తత్వం ఆయనకు gender gap వల్ల అర్ధం కాలేదు. తనకే తెలియని విషయాన్ని ప్రేక్షకులకు సరిగ్గా చెప్పలేడు కదా.

    ReplyDelete
    Replies
    1. మీ gender gap theory ప్రకారం ఆలోచిస్తే.. డాక్టర్ చక్రవర్తి ఎందుకంత అమాయకంగా ప్రవర్తించాడో అర్ధం అవుతుంది. ఆయన పాత్రని సృష్టించినది రచయిత్రి. :)

      Delete
  14. ఉరుమురిమి మంగలం మీద పడ్దట్టు మధ్యలోకి గుడిపాటి వెంకటాచలాన్ని లాగేరేంటి.

    ReplyDelete
    Replies
    1. ఇది చలం కధైతే అమ్మాయిగారు, గొపీతో నాలుగో రీల్లోనే లేచిపొయ్యేది. అందుకే చలం నాకిష్టం.

      Delete
    2. ఆప్పుడు నిర్మాత బుర్ర మీద గుడ్డేసుకు కూచోవాలి

      Delete
  15. ఈ సినిమాలో ఒక పాట నన్ను వేధిస్తుంటుంది. మొదట్లోనే నాగేసర్రావు, సావిత్రి హనీమూనుకనుకుంటాను కార్ో వెళుతుంటారు. అప్పుడు పాట.

    మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు.

    కౄరమృగమ్ముల కోరలు తీసెను
    ఘోరారణ్యములాక్రమించెను
    హిమాలయముపై జెండా పాతెను...

    ఇది డిస్కవరీ/నేషనల్ జాగ్రఫీ చానెల్ కు తెలుగులో సంక్షిప్త కామెంటరీ లా ఉంటుంది. హనీమూన్ లో ఇలాంటి పాట ఏమిటని పదేళ్ల వయసులోనే బాధపడ్డాన్నేను.

    ReplyDelete
    Replies
    1. ఈ పాట గుండమ్మ కథ సినిమా లోది. రామారావు, సావిత్రి కలిసి పాడుకుంటారు. పైగా హనీమూన్ సాంగ్ అసలు కాదు. సూర్యాకాంతం దగ్గరినుంచి రామారావు ఇంటికి వెళ్తూ పాడుకునే పాట.

      Delete
    2. రవి గారు గుండమ్మకథకి మూగమనసులకి తేడా తెలుసుకోకుండా కమెంటేసారా. ఈనా సరే ఈ పాట నాకూ అంతగా అర్ధం కాలేదు. "ఇది డిస్కవరీ/నేషనల్ జాగ్రఫీ చానెల్ కు తెలుగులో సంక్షిప్త కామెంటరీ లా ఉంటుంది " మీ వ్యాఖ్య చాలా బాగుంది.

      Delete
    3. @రవి,

      నాక్కూడా మీ కామెంట్ నచ్చింది.

      పవిత్రమైన పాతసినిమాల్ని, పాటల్ని మరీ ఇంతగా విమర్శించకూడదేమోననే సందేహం పీడిస్తుంది.

      Delete
  16. పాతదంతా పవిత్రమనుకొనే ఇన్నాళ్ళూ ఎవ్వరూ దేనినీ విమర్శించలేదు కానీ... మీరు కానివ్వండి సార్!!

    ReplyDelete
  17. After reading all these comments I have decided( inspired)to watch mugamanasulu and kanyasulkam again

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.