Thursday, 20 February 2014

తిక్క కుదిరింది


తెలంగాణా బిల్లు పాసైపోయింది. 

ఇదేంటి! ఇంకా భూమి బ్రద్దలవ్వలేదు, ఆకాశం చిల్లు పడలేదు, కరెంట్ పోయి అంధకారం ఆవహించలేదు, నక్కలు ఊళ వేయలేదు, కనీసం పిల్లులైనా 'మ్యావ్' మనలేదు. 

నిన్న రాత్రంతా దోమలు కుడుతూనే ఉన్నయ్! ఇప్పుడు సూర్యుడు కూడా తూర్పునే ఉదయించాడు. పొద్దున్నే చలిచలిగా, మంచుమంచుగా ఉంది. 

రోజూ చేసే పనే - నేను నిద్ర లేచి స్నూపీని మొద్దునిద్ర లోంచి లేపాను. 'అప్పుడే తెల్లారిందా?' అన్నట్లు స్నూపీ బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది. దాన్ని బలవంతంగా మేడ మీదకి తీసుకెళ్ళాను. 

కాలకృత్య నిమత్తం పిట్టగోడ వైపు తిరిగి వెనక కాలెత్తింది.

"స్నూపీ! తెలంగాణా బిల్లు పాసైంది." అన్నాను.

సమాధానంగా తోక ఊపుతూ 'భౌభౌ' మంది. నాకు కుక్క భాష రాదు కావున ఆ అరుపుకి అర్ధం తెలీలేదు.

స్టడీ రూంలో మా అబ్బాయి ఇంటర్ పరీక్షలకి చదువుకుంటున్నాడు.

"బుడుగు! తెలంగాణా ఇచ్చేశారు." అన్నాను.

మావాడు నావైపు చూస్తూ ఓ క్షణం ఆలోచించాడు.

"ఎక్జామ్స్ postpone అవుతాయా?" ఆసక్తిగా అడిగాడు.

"అవ్వవు." అన్నాను.

మొహం చిట్లించుకుని పుస్తకంలోకి తల దూర్చాడు.

మా అమ్మాయి కాలేజికి వెళ్లేందుకు హడావుడిగా రెడీ అవుతుంది.

"నాన్నా! ఇవ్వాళ స్టేట్ బంద్ లేదా?"

"బంద్ పిలుపైతే ఇచ్చారు."

"ఏవిటో! ఈమధ్య బందంటూ పిలుపులే ఇస్తున్నారు, ఏదీ బంద్ చెయ్యట్లేదు." అంటూ విసుక్కుంటూ కాలేజికి వెళ్ళిపోయింది.

నా భార్య సీరియస్ గా ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటుంది.

"తెలంగాణా ఇచ్చేశారు." అన్నాను. 

"అవును. లేటుగానైనా తెలంగాణా వాళ్లకి న్యాయం జరిగింది. నాకీ తెలంగాణా విషయం చదువుతున్నప్పుడల్లా, 'అద్దెకుంటున్న ఇంటికి నేను రిపైర్లు చేయించాను కాబట్టి ఇల్లు నాదే' అనే దబాయింపు వాదం గుర్తొస్తుంది." అన్నదావిడ.

"అయితే నీకు బాధగా లేదన్నమాట." అన్నాను.  

"నాకెందుకు బాధ! బాధ పడాల్సింది మీడియా వాళ్ళు. ఇన్నాళ్ళూ వాళ్ళు తెలంగాణా మోత మోగించారు. ఇంక వాళ్లకి చెప్పడానికి విషయం ఉండదు. జర్నలిస్టులు చాలామంది ఉపాధి కోల్పోతారు." అన్నది.

"మీడియా వాళ్ళకేనా? నా బ్లాగుక్కూడా దెబ్బే! ఇంక రాయడానికి నాక్కూడా పెద్దగా విషయాలుండవ్." దిగాలుగా అన్నాను.

"తిక్క కుదిరింది." కసిగా అంది నా భార్య!

(photo courtesy :Google)

8 comments:

  1. ఇంకా రాజ్య సభ ఉంది .. ఆ తరువాత రాష్ట్ర పతి .. ఆ తరువాత సుప్రీం కోర్ట్ పేరుతో ఓ పదేళ్ళు లాగించ వచ్చు

    ReplyDelete
  2. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఇలాటి కథలే వచ్చాయి. అలగని స్వతంత్రం వదిలేసుకుంటే ఈ రోజు ఇలాగ ఉండెది కాదు. భవిషత్తులో పోతున్న అవకాశాల గురించి మా ఏడుపు

    ReplyDelete
  3. "అవును. లేటుగానైనా తెలంగాణా వాళ్లకి న్యాయం జరిగింది. నాకీ తెలంగాణా విషయం చదువుతున్నప్పుడల్లా, 'అద్దెకుంటున్న ఇంటికి నేను రిపైర్లు చేయించాను కాబట్టి ఇల్లు నాదే' అనే దబాయింపు వాదం గుర్తొస్తుంది"

    ఈ విషయం వేరేవాళ్ళకు ఎందుకు తట్టలేదు చెప్మా! తిక్క కుదిరింది.

    ReplyDelete
  4. అవును తిక్క కుదిరింది జలగల పాటికి, జగన్నాదుడికి చంద్రలోకానికి!

    ReplyDelete
  5. విషయాన్ని చెపుతూ, చరుక్కులు అంటిస్తూ కామిడి పండించటంలో మీకు మీరే సాటి సారూ.

    తిక్క కుదిరినందుకు శుభాకాంక్షలు (కుదరటం అంటే మంచిదనే కదా అర్థం!)

    ReplyDelete
  6. రమణ గారు,

    నిజమేనండీ కనీసం మన ఇంట్లో ఉండే కుక్కలకు, గేదేలకు, ఆవులకు, పిల్లలకు, చిన్న పిల్లలకు ఉన్న ఇంగీతం కూడా మనోళ్ళుకి లేకుండా పోయిందండీ...

    రాష్ట్ర విభజన జరిగిపోయింది... హైదరబాద్ మనోళ్ళుకు కాకుండా పోయిందని ఊరికినే ఎందుకు భాదపడుతున్నారో అర్ద్రం ఆయి చావడం లేదండీ....

    మన పిల్లలకు చదువులు కోసం ఎలాగూ లండనో, న్యూయర్కో, సిడ్నో పంపుతాము కదా..... ఈ హైదరబాద్ మనక్కాకుండా పోతే మనకేటండీ....

    మన కుక్కలకి దురద వచ్చినా, తుమ్ము వచ్చినా వైద్యానికి అమోరికానో, లండనో తీసుకెళ్ళి చూపించుకొస్తాం... ఈ హైదరబాద్ మనక్కాకుండా పోతే మనకి ఏంటమ్డీ...

    అలాగే మన పిల్లలు ఉద్యోగాలు కోసం హైదరబాదు వెళితే ఎంత నామోషీ.... మన పిల్లలు ఎలాగూ విదేశాల్లోనే చదువులు ఎలగ పెడతారు కాబట్టి ఉద్యోగాలు కూడా అక్కడె వెలగబడతారు... ఇంగ హైదరబాద్ మనకి ఎందుకండీ....

    ఇక రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకి వచ్చే ఆదాయ లోటు అంటరా?? అయన్నీ మనకెందుకండీ, మన ప్రాక్టీసు బాగా సాగుతుందా లేదా/ మన ఖాతాలో డబ్బులకు లోటు ఉందా లేదా లాంటివి చూడాలి కానీ ఇలాంటివి ఎందుకండీ...
    విభజన జరిగినంత మాత్రానా మనఖీ వచ్చే పేషేంట్లు ఎమైనా తగ్గుతారా??? మన ఫీజు తగ్గిస్తామా??? మనకి ఏ సమస్య లేదు.... కానీ ప్రతి చిన్న ఇషయానికి ఓ తెగ ఇదైపోతున్నారండి మనోళ్ళు.... కూసింత ఇంగిత జ్నానం లేకుండా.....

    'అద్దెకుంటున్న ఇంటికి నేను రిపైర్లు చేయించాను కాబట్టి ఇల్లు నాదే'
    నిజమేనండీ... మన తెలివ తక్కువ దద్దమ్మలు అప్పుడెప్పుడో కర్నూల్ లో సొంత ఇల్లు కట్టుకుందామని పునాదులు వరకు వేసారండీ....
    ఇంతలో వాళ్ళు వచ్చి ఎందుకు కొత్తగా ఇల్లు కట్టుకోవడం... మా హైదరబాద్ లో చానా పెద్ద ఇల్లు ఉంది... అక్కడకి వచ్చేయండి మనందరం కలిసుందాం అనగానే, ఈ వెధవలు పునాదుల వరకు వేసిన ఇల్లుని వదిలేసి పోలోమని పోయినారండీ తెలివితక్కువ దద్దమ్మలు....

    ReplyDelete
    Replies
    1. >>అయన్నీ మనకెందుకండీ, మన ప్రాక్టీసు బాగా సాగుతుందా లేదా/ మన ఖాతాలో డబ్బులకు లోటు ఉందా లేదా లాంటివి చూడాలి కానీ ఇలాంటివి ఎందుకండీ...
      విభజన జరిగినంత మాత్రానా మనఖీ వచ్చే పేషేంట్లు ఎమైనా తగ్గుతారా??? మన ఫీజు తగ్గిస్తామా??? మనకి ఏ సమస్య లేదు.... <<

      అంతేనంటారా?

      (అంతేనేమో!)

      Delete
  7. రమణ గారూ,

    ఒక ఉద్యమం ఆయినా, లేదా ఒక ఆవేదన ఆయినా, లేక ఒక బాధ ఆయినా అయా వ్యక్తుల అనుభవించిన వేదన బట్టి వాటి త్రీవత ఉంటుంది... మనం వాళ్ళ కోణంలోంచి ఆలోచించినపుడు మనకి ఆ బాధ అర్ద్రం అవుతుంది... అలా కాకుండా మనం మన దగ్గర ఉండి ఆలోచిస్తే అందులో పెద్ద విశేషం కనబడదు...
    ఒక కాలేజిని అర్దంతరంగా మధ్యలో ఎత్తేస్తే ఆ కాలేజిలో చదువుకుంటున్న విద్యార్దులకు అది చాలా అన్యాయంగా అనిపిస్తుంది... అదే కాలేజి యజమాన్యం కోణంలో నుండి చూస్తే రాద్దాంతంలా కనబడుతుంది...
    అలాగే తెలంగాణా కావాలని కోరుకొనే వారికి విభజన అర్దవంతంగా కనబడుతుంది.... వద్దనేకోనేవారికి అనవసర రాద్దాంతంగా అనిపిస్తుంది....
    హైదరబాద్ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళకి కలిసియుండాలని కోరుకోవడం అర్ద్రవంతంగా కనబడుతుంది.... హైదరబాద్ తో ఎటువంటి పని లేని మన లాంటి వాళ్ళకి అది అనవసర రాద్దంతంలా కనబడుతుంది...
    ఆయా ప్రజలకి వాళ్ళకి జరిగిన/జరుగుతున్న నష్టాలను బట్టి స్పందిస్తారు....
    మనం దేనిని తప్పుబట్టడానికి లేదు/కించపరచడానికి లేదు....
    అటు తెలంగాణా వారి కోరిక అర్దవంతమైనదే.... ఇటు సీమాంధ్రుల వేదన అర్ద్రవంతమైనదే..
    ఎవరిని తప్పుబట్టలేము.... అంతే కాని ఎవరో ఒకరి వేదనని కించపరచడానికి లేదు...
    ఇక సీమాంధ్రులు హైదరబాద్ పై ఆధారపడడానికి గల ఏకైక కారణం అది రాజధాని కావడం వల్లనే తప్ప వేరే విశేషం ఏమి లేదు...
    తెలంగాణాలో హైదరబాద్/రంగారెడ్డి మినహాయించి మిగతా ఎనిమిది తెలంగాణా జిల్లాల నుండి పొట్టకూటి/చదువు కోసం ప్రజలు రాజధానికి ఎలా వచ్చారో, సీమాంధ్ర పదమూడు జిల్లాల నుండి అలానే వచ్చారు.....
    హైదరబాద్ ని స్వంత ఇల్లుగా భావించారు కానీ అద్దె ఇల్లుగా భావించలేదు.... అద్దె ఇల్లుగా భావించి ఉంటే ఎవరూ అద్దె ఇంట్లో అంత కాలం ఉండరు... మరియు అద్దె ఇంటిపై తమ పెట్టుబడిని ఎవరూ పెట్టరు....

    విభజనపై మీరు రాసిన చాలా పోస్టులకు నా అభిప్రాయాలను కామెంటు చేద్దామనుకొన్నాను... కానీ అప్పుడు ఉన్న పరిస్దితుల్లో విభజన అంశంపై ఎటువంటి పోస్టులు, కామెంటులు పెట్టకూడదని భావించి పెట్టలేదు...
    ఇప్పుడు విభజనపై మీరు రాసే పోస్ట్ ఇదే అఖరు కాబట్టి/విభజన ఆయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిపై నా అభిప్రాయం చెప్పాను...
    నా అభిప్రాయం చెప్పడం ద్వారా మిమ్మల్లి కించపరుచున్నాననీ మీరు భావిస్తే క్షమాపణలు తెలియజేస్కుంటున్నాను....
    ఎందుకంటే ఇది మీ బ్లాగు.. కేవలం మీ అభిప్రాయాలు రాసుకోవడానికి ఉద్దేశించినది మాత్రమే....
    ఇక దీనికి నా కామెంటు జస్ట్ పానకంలో పుడక లాంటిది... పెద్దగా పట్టించుకోకండి...


    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.