సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానిస్తే, విమర్శ సాహిత్యాన్ని విశ్లేషిస్తుందనీ.. తెలుగులో సాహిత్యానికి తగినంత స్థాయిలో సాహిత్య విమర్శ లేదనీ.. చాలాయేళ్ళ క్రితం కొడవటిగంటి కుటుంబరావు చేసిన ఆరోపణ. సాహిత్యం వేరు, సినిమా వేరు. సాహిత్యాన్ని పాఠకుడు చదువుతాడు, సినిమాని ప్రేక్షకుడు చూస్తాడు.
కానీ ఈ రెండు ప్రక్రియలు చేసే పని ఒకటే.. కథ చెప్పడం. ఒక మంచి రచన విమర్శకుల్ని ఆకర్షిస్తుంది, మంచిచెడులు కూలంకుషంగా చర్చింపపడతాయి. ఇందుకు పాలగుమ్మి పద్మరాజు 'గాలివాన', కాళీపట్నం రామారావు 'యజ్ఞం' లాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
'కథ చెప్పడం' అనే ప్రక్రియే ప్రధానంగా ఉన్నప్పటికీ సినిమాకథకి సాహిత్యస్థాయి లేదు. అయితే - ఒక మంచి సినిమాకథకి 'సాహిత్యస్థాయి' ఇచ్చి కథాపరమైన మంచిచెడులు విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? కానీ ఎందుకో తెలుగులో ఆ ప్రయత్నం జరగలేదు (నాకు తెలిసినంతమేరకు).
సినిమాకథంటే కొందరు నటుల్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా, పామరజనుల వినోదం కోసం అల్లుకునే కథ మాత్రమేననీ, అట్టి కథలు సీరియస్ విశ్లేషణకి అనర్హం అనే అభిప్రాయం విమర్శకుల్లో ఉండటం కావచ్చు. లేదా సినిమాలో కథని ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు కూడా ముడిపడి వున్నందున, కథ నొక్కదాన్నే బయటకి లాగి చర్చింపబూనడం సరికాదనే అభిప్రాయం కావచ్చు.
కారణం ఏదైనప్పటికీ.. తెలుగు సాహిత్య విమర్శతో పోల్చి చూసుకుంటే తెలుగు సినిమా కథలకి అసలు విమర్శే లేదు. ఈ ప్రపంచంలో ఏదీ విమర్శకి అతీతం కాదు, కారాదు. నచ్చిన విషయాల్ని మెచ్చుకున్నట్లే, నచ్చనివాటి గూర్చి నిర్మొహమాటంగా చర్చించగలగాలి. ఇలా విమర్శించడం ఆయా రచయితల్ని కించపరచడం అవదు. ఒక విమర్శ కథలో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తుందనే అభిప్రాయం కూడా నాకుంది.
ఈమధ్య 'మూగమనసులు' విడుదలై యాభైయ్యేళ్ళు పూర్తైన సందర్భాన.. యధావిధిగా పత్రికలు, టీవీలవాళ్ళు సినిమాకి సన్మానపత్రాలు సమర్పించారు. నేనీ సినిమాని హాల్లో కొన్నిసార్లూ, ఇంట్లో మరికొన్నిసార్లూ చూశాను. నాకు బాగా నచ్చిన సినిమాల్లో మూగమనసులు ఒకటి. ఎలాగూ సినిమా కథ, విమర్శ అంటూ చెబుతున్నాను కాబట్టి.. ఇప్పుడు నేను మూగమనసులు కథ గూర్చి నా అభిప్రాయాలు రాస్తాను.
అనగనగా ఒక జమీందారు. ఆయనకి ఒక కూతురు, పేరు రాధ. ఈ రాధ ప్రతిరోజూ పడవలో గోదావరి దాటి ఆవలి ఒడ్డునున్న కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ పడవ నడిపేవాడు గోపీ. చాలా పేదవాడు, అమాయకుడు, అర్భకుడు. గోపీ రాధని 'అమ్మాయిగారు' అంటూ వెర్రిగా అభిమానిస్తాడు, ఆరాధిస్తాడు. అతనికి పొద్దస్తమానం అమ్మాయిగారి ధ్యాసే. గోపీని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని గౌరీ అనే అల్లరి అమ్మాయి ఎదురు చూస్తుంటుంది.
గోపీ ప్రతిరోజూ అమ్మాయిగారికి బంతిపువ్వునిచ్చి తన భక్తిని చాటుకుంటూ, ఆమెని దేవతా సమానంగా పూజిస్తాడు. ఈ వెర్రి అభిమానం.. మన తెలుగు సినిమా హీరోల వెర్రి అభిమానుల్ని తలపిస్తుంది. రాధ గోపీ వీరాభిమానం వల్ల ఏ మాత్రం ఇబ్బంది పడకపోగా.. ఆ పడవ్వాడి ఆరాధనని ప్రోత్సాహిస్తుంది, ఎంజాయ్ చేస్తుంటుంది.
కథ కొంచెం ముందుకు సాగి, రాధకి రాంబాబు అనేవాడు రాసిన ప్రేమలేఖ జమీందారు కంట పడుతుంది. కూతురు కూడా రాంబాబుని ప్రేమించిందనుకుని పెళ్లి నిశ్చయం చేస్తాడు జమీందారు. వాస్తవానికి రాధ రాంబాబుని ప్రేమించలేదు, అతనితో పెళ్ల్లి ఇష్టం ఉండదు కూడా. ఆమె ఇదే విషయం తన తండ్రికి చెప్పొచ్చు. అలా చెబితే తండ్రి పెళ్లి ప్రయత్నం చేసేవాడు కాదు. అయినా చెప్పదు, ఎందుకో తెలీదు!
తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే.. తను కనబడక గోపీ ఎంతగానో బాధ పడతాడని రాధకి తెలుసు. గోపీని పెళ్లి చేసుకోటానికి గంపెడంత ప్రేమతో గౌరీ ఎదురు చూస్తుందనీ తెలుసు. అమాయకుడైన గోపీని, గడుసైన గౌరీతో కట్టబెట్టేస్తే గోపీ జీవితం హాయిగా వెళ్ళిపోతుందని తెలుసు. తనమాట గోపీకి వేదవాక్కు. 'నువ్వు గౌరీని పెళ్లి చేసుకోరా గోపీ' అని ఒక్కమాట అన్నట్లయితే, అరనిమిషంలో గౌరీని పెళ్లి చేసుకుంటాడనీ తెలుసు. కానీ గోపీ భవిష్యత్తు గూర్చి అమ్మాయిగారు ఒక్కక్షణం కూడా ఆలోచించదు. ఎందుకో తెలీదు!
రాధ హాయిగా పెళ్లి చేసుకుని, గోపీతో పాట పాడించుకుని, భర్తతో కాపురానికి వెళ్ళిపోతుంది. భర్తకేదో రోగం రాబట్టి గానీ, లేకపోతే మొగుడికి డజను మంది పిల్లల్ని కనుండేది, ఈ ప్రేమ కథకి ముగింపు కార్డూ పడేది. కానీ ఇదో గొప్ప ప్రేమ కథ! కావున కథకోసం రాధ మొగుడు అర్జంటుగా ఏదో రోగం తెచ్చుకుంటాడు.
కొన్నాళ్ళకి రాధ భర్త చచ్చిపొయ్యి కథకి అడ్డు తొలుగుతాడు. వైధవ్యంతో పుట్టింటికి తిరిగొస్తుంది రాధ. ఇష్టం లేని పెళ్లి, మూణ్నాళ్ళ ముచ్చటగా ముగిసిన కాపురం. అయినా రాధ దుఃఖం అత్యంత భీభత్సంగా ఉంటుంది! తిండి కూడా మానేస్తుంది. సహజంగానే అమ్మాయిగారి భక్తుడైన గోపీ తల్లడిల్లిపోతాడు. ఆవిడకి బత్తాయి తొనలు తినిపిస్తూ, పాటలు పాడుతూ ఓదారుస్తుంటాడు గోపీ.
పాపం! గోపీ కడుపేదవాడు, గోదావరి తిరనాళ్లలో అవ్వకి దొరికిన దిక్కూమొక్కు లేని అనాధ, పెళ్ళీపెటాకులు లేని బ్రహ్మచారి. జీవితంలో ఏ ఆనందమూ అనుభవించని వాడు. ఏరకంగా చూసుకున్నా అమ్మాయిగారి కన్నా పరమ హీనస్థితిలో ఉన్నవాడు. అయినా కూడా భర్త చనిపోయిన బాధలో ఉన్న అమ్మాయిగారిని ఓదార్చడానికి శక్తికి మించి తాపత్రయపడతాడు.
నేను మెడికల్ స్టూడెంటుగా ఉన్నప్పుడు కష్టమైన కేసుకి డయాగ్నోసిస్ సీనియర్స్ నుండి ముందే తెలుసుకుని, దానికి తగ్గట్టుగా పేషంట్ ఎక్జామినేషన్ ఫైండింగ్స్‌తో కేసు రాసేసి, నేనే ఆ డయాగ్నోసిస్ చేసినట్లుగా ప్రొఫెసర్లకి కేస్ ప్రెజెంట్ చేసేవాణ్ణి. మూగమనసులు రచయిత కూడా నాలాంటివాడేననిపిస్తుంది (అందుకే ముగింపు ముందే అనుకుని, అందుకు తగ్గట్టు కథ రాసుకున్నాడు).
అంచేతనే - రాబోయే అమ్మాయిగారి కష్టాన్ని ఓదార్చడానికి, అటుపై ఆవిడతో కలిసి చనిపోవడానికి వీలుగా.. కావాలనే గోపీకి పెళ్లి చెయ్యకుండా రచయిత గోపీని రిజర్వులో ఉంచినట్లుగా అనిపిస్తుంది. ఊళ్ళోవాళ్ళు తమ స్నేహాన్ని చెడుగా అనుకుంటున్నారని బాధపడుతుంది రాధ. గౌరీ మీద కోపంతో అలిగి పడవ మీద పడి ఏడుస్తున్న గోపీని బలవంతంగా నదిలోకి తీసుకెళ్తుంది.
రాధకి ఎప్పుడూ తన సొంతగోలే గానీ, గోపీ గూర్చి అస్సలు ఆలోచన ఉండదు. తను చావాలి, తనతోపాటు తన భక్తుడు గోపీ కూడా చావాలి. ఆవిడ దృష్టిలో గోపీ ప్రాణానికి విలువ లేదు. ఇదీ ఆమె ధోరణి! ఉన్నత కుటుంబాలవాళ్ళు తమకన్నా బాగా స్థాయి తక్కువ వాళ్ళ పట్ల ఇలాగే ఆలోచిస్తారేమో! ఆ విధంగా తన చావుకి తోడుగా ఆ అమాయక పడవవాణ్ని వెంట తీసుకెళ్తుంది రాధ. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యవిషయమేమంటే, ఈ suicide pact లో గోపీకి ఏమాత్రం ప్రమేయం లేదు. అతను చేసిన తప్పల్లా అమ్మాయిగార్ని దేవతలా ఆరాధించడమే.
'మూగమనసులు' ఒక మంచి కథ. కథలో అన్ని పాత్రలకీ వ్యక్తిత్వం ఉంటుంది, పర్పస్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇవేవి లేనిదల్లా ఒక్క రాధకి మాత్రమే. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఒక మంచి కథలో పాత్రల ఔచిత్యం దెబ్బ తినదు. ఏ పాత్ర దృష్టికోణం నుండి చూసినా కథనం దెబ్బతినదు, తినకూడదు. కానీ మూగమనసులులో అతి ప్రధానపాత్రకి వ్యక్తిత్వం ఉండదు! కారణం యేమయ్యుంటుంది?
నాకు తోచిన కారణాలు రాస్తాను. ఏ రచయితైనా పాత్రల ద్వారా సన్నివేశాల్ని సృష్టించి కథ చెబుతాడు. అయితే ఎంత గొప్ప రచయితైనా ఏదోక పాత్ర ద్వారా మనకి కనబడతాడు. ఆ పాత్రకి extra care తీసుకుని స్పెషల్‌గా తీర్చి దిద్దుతాడు. కన్యాశుల్కం చదువుతుంటే మనకి మధురవాణిలో గురజాడ కనిపిస్తాడు. ఇలా చెయ్యటం కథనం రీత్యా కూడదు గానీ, రచయిత కూడా మనిషేగా!
'మూగమనసులు' కథకి గౌరీది మకుటాయమానమైన పాత్ర. ఈ పాత్రకి రచయిత extra care తీసుకున్నాడు. అందుకే గౌరీ కోణంలోంచి ఈ కథని ఫాలో అయితే కథలో చిన్న పొరబాటు కూడా కనబడదు. గౌరీ అమాయకురాలు, మనసున్న మనిషి, ప్రేమమయి, గడుసుది, కోపిష్టిది, ఈర్ష్యాసూయలు కలది, త్యాగశీలి. ఈ భూమ్మీద బ్రతుకుతున్న అనేకమందిలా ఒక సాధారణ మనిషి.
గోపీ కోణం నుండి కూడా ఎక్కడా వంక పెట్టటానికి వీలులేని కథ మూగమనసులు. అతనిది సింగిల్ పాయింట్ ఎజెండా.. అమ్మాయిగారి ఆరాధన. అందుకోసమే జీవించాడు, తన బ్రతుకుని నిర్లక్ష్యం చేసుకున్నాడు. చివరకి అమ్మాయిగారి కోరిక ప్రకారమే మరణించాడు కూడా.
రచయిత జన్మ, పునర్జన్మ అంటూ ఒక థియరీ చెబుతాడు. ఈ పునర్జన్మల థియరీ కోసమే రచయిత రాధాగోపీల్ని హడావుడిగా ఒకేసారి చంపేసి ఉండొచ్చు. అలా వాళ్ళిద్దరూ ఒకేసారి చావకపోతే రచయిత చెప్పదల్చుకుంది పల్చబడిపోతుంది. కాబట్టి ఇద్దర్నీ కలిపి ఒకేసారి చంపేద్దామని నిర్ణయించుకున్న రచయిత, చావడానికి రాధకి గట్టి కారణం సృష్టించగలిగాడు. కానీ - రాధ గోపీని కూడా ఎందుకు చావులొకి లాక్కెళ్తుందో బలమైన కారణం చెప్పలేకపొయ్యాడు.
సమస్య రాధది, ఆవిడకి ఊళ్ళోవాళ్ళు అన్న మాటలు అవమానంగా తోస్తే ఆవిడ ఒక్కతే చనిపోవడం న్యాయం. గుడిపాటి వెంకట చలం నాయకిలా గోపీతో లేచిపొయ్యే ధైర్యం చెయ్యకపోయినా, కనీసం తను చచ్చి గోపీని వదిలేస్తే పొయ్యేది. నేను ఈ సినిమా చిన్నతనంలో చూసినప్పుడు 'ఆ పడవ నడిపేవాడు సుబ్బరంగా రాధని పెళ్లి చేసుకోవచ్చుకదా' అని అనుకున్నాను. నాకప్పుడు మన వ్యవస్థలో ఉండే సామాజిక అంతరాల గూర్చి అవగాహన లేదు.
అంతకుముందు ఎన్నోయేళ్ళ క్రితం 'మాలపిల్ల' వచ్చింది. దళిత యువతిని పెళ్ళాడిన హీరో కథతో 'రోజులు మారాయి' వచ్చింది. మూగమనసులు కథలో జమీందార్ల అమ్మాయిని ఆరాధించిన హీరో సామాజికంగా బలహీన వర్గం వాడు. అందుకే అతనికి పొరబాటున కూడా అమ్మాయిగారి గూర్చి 'చెడు' తలంపులు రావు. ఈ విధంగా రచయిత 'కులసంకరం' కాకుండా కథాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కువ కులం మగవాడు, తక్కువ కులం అమ్మాయిని ప్రేమించవచ్చును గానీ.. తక్కువ కులం మగవాడు, పైస్థాయి అమ్మాయిని కోరుకోకూడదా? ఏమో, ఆ రోజున్న సామాజిక పరిస్థితుల్లో అది తప్పేమో!
ఈ కథ పేరు మూగమనసులు. అయితే ఇందులో ఉన్నది ఒకటే మూగమనసు! అది రాధది. మిగిలిన అన్ని పాత్రలకి చక్కటి ఆలోచనలు ఉంటాయి, హాయిగా వ్యక్తీకరిస్తూనే ఉంటాయి, ముఖ్యంగా గౌరీ. ఒక్క రాధని పక్కన పెడితే అన్ని పాత్రలు, చాలా సహజంగా ప్రవర్తిస్తుంటాయి. నా దృష్టిలో ఈ కథకి వీకేస్ట్ లింక్ రాధ. క్రికెట్ భాషలో చెప్పాలంటే కథలో రాధ పాత్ర ఎప్పుడూ non striker's end లోనే ఉంటుంది. రన్స్ మొత్తం గౌరీ, గోపీలు తీసేశారు, మ్యాచ్ గెలిపించేశారు.
సినిమా ఎప్పుడో వచ్చింది, తెలుగువాళ్ళకి నచ్చింది. వీలైతే నాలుగు మంచిమాటలు రాయాలి గానీ, విమర్శించాల్సిన అవసరం ఇప్పుడేంటి? అనేది కొంతమంది అభిప్రాయం కావచ్చు. అదీ నిజమే, ఒప్పుకుంటున్నాను. అయితే - చాలామంది 'కన్యాశుల్కం' లోపాల్ని కూడా ఆ నాటకంపై ఎంతో ఇష్టంతోనే చర్చించారు, నచ్చక కాదు.
ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక గొప్ప కథ అని మనం అనుకుంటున్నప్పుడు, ఆ గొప్ప కథలో నచ్చని కొన్ని పాయింట్లని రికార్డ్ చెయ్యడం కూడా ఆ కథకి గొప్ప ట్రిబ్యూట్ అనుకుంటున్నాను. లేకపోతే ఇంత కష్టపడి ఇదంతా రాయను కదా!
(photos courtesy : Google)