Monday, 3 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 1


ప్రస్తుతం నడుస్తుంది ఎన్నికల సీజన్. రాజకీయ నాయకులకివి అత్యంత కీలకమైన రోజులు. కాబట్టే వాళ్ళు 'ప్రజలు తమని ఏమనుకుంటున్నారు?' అన్న సంగతి తెలుసుకోవాలనే ఆరాటంతో తెగ తంటాలు పడుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకో సర్వే ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ సర్వేలన్నీ స్పాన్సర్డ్ బాపతు అని అర్ధమవుతుంది. మరప్పుడు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే సాధనం ఏంటి?

మిత్రులారా! నాకు నా భార్య ఎవరికి ఓటేస్తుందో కూడా అంచనా లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇది పచ్చినిజం కావున ఈ సంగతి చెప్పటానికి నేనేమీ సిగ్గు పడటం లేదు. కావున, 'నీ భార్య ఆలోచనే తెలీనివాడివి, నోర్మూసుకుని కూర్చోక సమాజం గూర్చి నీకెందుకు?' అని మీరు అనుకుంటున్నట్లైతే నాకే అభ్యంతరమూ లేదు. కానీ - ఎన్నికల సమయంలో పార్టీల జయాపజయాల గూర్చి చర్చించుకోవడం చిలక జోస్యం చెప్పించుకున్నంత సరదాగా ఉంటుంది. వాతావరణశాఖ ఋతుపవనాల్ని అంచనా వేసినంత వినోదంగా కూడా ఉంటుంది. ఈ సరదా, వినోదాన్ని నేను మాత్రం ఎందుకు కాదనుకోవాలి?

'ఏ సమాజంలోనైనా ప్రజల మనోగతాన్ని అంచనా వెయ్యడం ఎలా?' అనేది ఆలోచిద్దాం. మన దేశంలో రాచరిక వ్యవస్థ ఎప్పుడో రద్దైంది, ఫ్యూడల్ వ్యవస్థ కూడా పోయింది. రాజకీయంగా ఇట్లాంటివి చాలా అంతరించిపొయ్యాయి. కానీ ఇవన్నీ మన ఆలోచనా విధానంలోంచి కూడా డిలీట్ అయ్యాయా? అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేం. యూరోపియన్ దేశాల్లో (ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాల్లో) సోషల్ సైకాలజీ స్టడీస్ ఉన్నాయి. వారు ఆ స్టడీస్ ఆధారంగా సమాజాన్ని అంచనా వేసుకోగలుగుతారు (వారి సైంటిఫిక్ మెథడాలజీ కరెక్టా? కాదా? అన్నది వేరే విషయం).

చాలా పెద్దదైన మన దేశంలో అట్లాంటి స్టడీస్ చెయ్యాలంటే కష్టం. ఇక్కడ కులం, మతం, ప్రాంతం మొదలైన అనేక అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి, విషయం సంక్లిష్టంగా మారిపోతుంది. పైపెచ్చు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రస్తుతం మనం ఆకలి చావులు, దోమల చావులు కూడా నివారించుకోలేని ప్రాధమిక దుస్థితిలో ఉన్నాం. కావున కనీసమైన శాస్త్రీయ పరిశోధన జరగని సోషల్ సైకాలజీ గూర్చి ఆలోచించ బూనడం వృధా ప్రయాస. కాబట్టి ఆ శాస్త్రాన్ని కొద్దిసేపు పక్కన పెడదాం.

సరే! ఇప్పుడు మళ్ళీ మొదటికొద్దాం. అసలు ఒక సమాజపు ఆలోచనా ధోరణిని అంచనా వెయ్యడం ఎలా? కోట్లు ఖర్చుపెట్టి పరిశోధనలు చేసే పధ్ధతి తప్ప వేరే సూచికలు లేవా? పోనీ - చదువుని అర్హతగా పరిగణించి అంచనా వేస్తే? ఉహూ! లాభం లేదు. మన చదువులు ఉద్యోగం సంపాదించడం కోసం పనికొచ్చేవే తప్ప జ్ఞానాన్ని ఇచ్చేవి కావు. ఈ దేశంలో చదువు వల్ల సంపాదించుకున్న 'సుఖమయ జీవన' మేధావులకి సామాన్య మానవుడి ఆలోచనా విధానం అర్ధం కావడం మానేసి చాలా కాలమైంది. కాబట్టి చదువుకున్నవారి సంఖ్యతో సమాజాన్ని అంచనా వెయ్యబూనడం సరైన విధానం కాదు.

పోనీ ప్రజల సాహిత్యాభిలాషతో సమాజాన్ని అంచనా వేసే ప్రయత్నం చెయ్యొచ్చా? అప్పుడు మంచి సాహిత్యం అంటే ఏంటనేది పెద్ద చర్చవుతుంది? నేను శ్రీశ్రీ అంటే ఇంకొకాయన విశ్వనాథ అంటాడు. నేను రావిశాస్త్రి అంటే ఇంకొకాయన ముళ్ళపూడి అంటాడు. ఒకళ్ళకొకళ్ళకి అస్సలు పడదు. అయినా ఒకళ్ళిద్దరు మంచి రచయితలు ఉన్నంత మాత్రాన, అది దేనికీ సూచిక కాదు. ఇది ఇందిరా గాంధీ ప్రధాని అయినందు వల్ల దేశంలో ఆడవారందరూ అభివృద్ధి చెందారని చెప్పడం వంటి గమ్మత్తైన వాదన.

అసలీ సూచికలన్నీ ఒక సమాజం నూటికి నూరుపాళ్ళు విద్యావంతమైతే తప్ప ఉపయోగపడని సాధనాలు, పద్ధతులు. అంచేత, సామాన్య ప్రజల ఆలోచనల్ని అంచనా వెయ్యడం ఎలా? అనే సబ్జక్ట్ కొద్దిగా కాంప్లికేటెడ్ వ్యవహారం. ఓటు వేసేవాడికి చదువు అవసరం లేదు - మనలో మెజారిటీకి చదువు లేదు. ఓటు వేసే వాడికి సాహిత్యంతో పన్లేదు - మనలో మెజారిటీ ఏదీ చదవరు. ఓటు వేసేవాడికి సోషల్ మీడియాతో పన్లేదు - మనలో మెజారిటీకి కంప్యూటర్ అంటే ఏంటో తెలీదు.

పోనీ - సినిమా ఒక సూచిక అవుతుందా? అవ్వొచ్చునేమో! ముందుగా సినిమాలకీ, ఎన్నికలకి గల సారూప్యతల్ని పరిశీలిద్దాం. ఓటు వెయ్యడానికి ఏ అర్హతా అవసరం లేదు, సినిమా చూడ్డానిక్కూడా ఏ అర్హతా అవసరం లేదు (జేబులో టిక్కెట్టుకి సరిపడా డబ్బులుంటే చాలు). సినిమా ప్రేక్షకులు ఆయా హీరోల కులం బట్టి కూడా అభిమానులుగా ఉంటున్నారు, ఎన్నికల్లో కూడా కులం ప్రభావం ఉంటుంది. సినిమా హీరోలకి కొందరు ప్రేక్షకులు వీరాభిమానులు ఉంటారు, రాజకీయ నాయకులకి కూడా దాదాపు అదే స్థాయి అభిమానులు ఉంటున్నారు.

కాబట్టి - తరచి చూడగా.. అందుబాటులో ఉన్న సాధనాల్లో సినిమా అనేది 'కొద్దోగొప్పో' పోల్చడానికి దగ్గరగా ఉన్నట్లుగా తోస్తుంది. అయితే ఈ ప్రాధమిక అంచనాతో ఒక ఇబ్బంది ఉంది. ప్రేక్షకుల అభిరుచి బట్టి సినిమా విజయవంతం అవుతుందని అందరూ అంటారు. కానీ ఇక్కడ నేను చెయ్యబోతుంది విజయవంతమైన ఒక సినిమా ద్వారా ప్రజల అభిప్రాయం అంచనా వెయ్యబూనడం. ఇది ఒక బోర్లింపు సిద్ధాంతం (reverse hypothesis). ఇప్పుడు బోర్లింపు సిద్ధాంతాన్ని కూడా ఒక శాస్త్రంగా గుర్తిస్తున్నారు కాబట్టి, ఎలాగూ ఇక్కడదాకా వచ్చాం కాబట్టి, ఈ దోవలోనే ముందుకెళ్దాం.

(picture courtesy : Google)

10 comments:

  1. బోర్లింపు సిద్ధాంతం...ఒక వీర తాడు...super new word....

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా! థాంక్యూ.

      Delete
  2. //అసలు ఒక సమాజపు ఆలోచనా ధోరణిని అంచనా వెయ్యడం ఎలా?// అన్న సంగతి మనజగనన్ననడిగితే చేబుతాడు. ఇంత విశ్లేషణ అవసరం లేదు సార్‌! మీ బొర్లింపు సిద్దాంతం స్థానం లో మధ్యం, మాంసం , మరియు పరామర్శ అని పెట్టుకోండి. :))

    ReplyDelete
    Replies
    1. అవునా? నేను అనవసరంగా చాలా రాశానే! :))

      Delete
    2. జగన్ భష లొ 'పరామర్శ' కాదు.. ఓదార్పు...అది ఒక అంతులేని ఓదార్పు కధ...

      Delete
  3. మీ సిన్మా థియరీ నిజంగా నిజమ్. నా క్లాస్మేట్ తన ఫేస్బుక్ లో తెలుగుదేశం పై విపరీతంగా పొగడ్తలు కురిపిస్తుంటే ఎవ్వరినీ లెక్క చెయ్యని... నాకు రోల్ మోడల్ ఎవరూ లేరని ఘట్టిగా గా చెప్పిన మా 'అప్పు' నేనా అని అస్సలు నమ్మకం కుదరలేదు . ఐ.ఐ.ఎస్ లో చదివి గొప్ప కేంద్రప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ గా పని చేస్తున్న తను ఒక పార్టీ కి ఇంట అందునా టి డి ఫై కి ఇంట అభిమానా...నాకు భలే సంత్శం వేసింది ।:)

    ఇంతా చుస్తే , ఆ మధ్య డిల్లీ లో బాబు నిరాహార దీక్ష చేసినప్పటి శిబిరం లో యనమల రామకృష్ణుడి తో మా 'అప్పాజీ' ఫోటో . అదీ సంగతి...యనమల కి తనకి సామాజిక బంధం ఉంది . హ హ

    ఏదేమైతేనేం తనని టిడిపి అభిమాని గా చూడడం ఆనందంగా ఉన్ది.

    (స్వగతం: ఏంటో, జాతీయ పార్టీలూ జగను నచ్డం లేదు . ఆ లోక్సత్తా ఉందా అంటే ఇంకా నెల బాలుడే )

    అస్సలు ఖాళీ లేకున్నా , వారానికి ఒకసారి మీ బ్లాగ్ చూడ్డం ..ఇలా నా క్లాస్మేట్ ని గుర్తు చేస్కోవడం ఇంకా బావున్ది.

    నేను మొదటి సారి మరియు చివరిసారి వేసిన ఒకేఒక్క ఓటు(ల) కధ టపా గా వ్రాయాలని యెంత అనిపించినా వ్యాఖ్య తో సరిపెట్టేస్తున్నా

    ReplyDelete
    Replies
    1. బహుకాల దర్శనం. థాంక్యూ.

      మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.

      బ్లాగు రాయడానికి తీరిక ఎందుకండి? నాకులా హడావుడిగా ఏదోటి రాసెయ్యొచ్చునే! :))

      Delete
  4. > బోర్లింపు సిద్ధాంతం (reverse hypothesis)
    hypothesis అనే మాటను సిధ్ధాంతం అని అనువాదం చేయకూడదండీ. సిధ్ధాంతం అంటే నిరూపించబడిన విషయం. hypothesis అంటే ఒక సిధ్ధాంతంగా మారటానికి తగిన ప్రాతిపదిక గల ఊహ మాత్రమే.

    ReplyDelete
    Replies
    1. అవును. ఆ పదం తప్పే. కానీ నాకు సరైన తెలుగు పదం (ఇప్పటిక్కూడా) తట్టలేదు.

      Delete
  5. సినిమాకన్నా ఎక్కువ ప్రభావితం చెయ్యగల మాధ్యమం టివి చానల్స్ అని నా నమ్మకం. అందుకేనేమో రోజుకొక టీవీ చానల్ పుట్టుకొస్తోంది. వీళ్ళు చెప్పిందే వేదం అవుతోంది ప్రజలకు.. నిజానిజాలతో సంబంధం లేకుండా

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.