సినిమాల్లోంచి సమాజంలోకి - 2 లో మన ఫ్యూడల్ ఆలోచనల గూర్చి రాశాను. ఇవ్వాళ మన ఆలోచనా ధోరణిలో రాచరిక వ్యవస్థ లక్షణాల గూర్చి రాస్తున్నాను. ఈ రాతలన్నీ సినిమాల్ని ఆధారంగా చేసుకుని రాస్తున్న ఆలోచనలు కాబట్టి, విషయ పరిమితులు గమనంలో ఉంచుకోవాలని మరొక్కసారి కోరుకుంటున్నాను.
అసలు రాచరిక వ్యవస్థ అంటే ఏంటి? మిత్రులారా! నేను చిన్నప్పుడు పరీక్షల కోసం 'మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?' లాంటి పనికిమాలిన విషయాల్ని బట్టీపట్టాను, మార్కులు కొట్టేశాను. కానీ - చరిత్ర అంటే తేదీలు, సంవత్సరాలు కాదని తరవాత తెలుసుకున్నాను, బట్ టూ లేట్. కావున నాకు చరిత్ర పాఠాలు తెలీదని మనవి చేసుకుంటున్నాను. అయితే - విఠలాచార్య సినిమాలు చాలా చూశాను, లెక్కలేనన్ని చందమామ కథలు చదివాను. ఇప్పుడా జ్ఞానాన్నే దుమ్ముదులిపి 'రాచరికవ్యవస్థ' అంటూ గంభీరంగా రాస్తున్నాను.
అనగనగా ఒక దేశానికి రాజు ఉంటాడు. అతను వంశపారంపర్యంగా ప్రజలని పాలించే హక్కు కలిగుంటాడు. రాజు రాజ్యరక్షణ కోసం శత్రుదేశ రాజుల్తో యుద్ధాలు చేస్తుంటాడు. ఇందుకోసం ఆయనకో పెద్ద సైన్యం ఉంటుంది. రాజ్యం లోపల్నుండి 'రాజద్రోహులు' పన్నే కుట్రలు, కుతంత్రాల్ని కూడా రాజు భగ్నం చేస్తూ ఉంటాడు. ఇందుకోసం అతనికో గూఢాచారి వ్యవస్థ ఉంటుంది. ఈ సంస్థల్ని మేపడానికి రాజు ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తుంటాడు.
మహారాజు తన దేశప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలకి బాధ్యత వహిస్తాడు (ఇయితే ఈ విధులన్నీ మన రాజకీయ పార్టీలు రాసుకునే ఎన్నికల మేనిఫెస్టోల వంటివి). రాజుకన్నా యోగ్యుడు ప్రజల్లో వందలమంది ఉండొచ్చు, కానీ ఎవరూ రాజుగారి అధికారాన్ని ప్రశ్నించరాదు, కనీసం ఆ ఆలోచన కూడా చేయరాదు. ఒకవేళ ఎవడైనా దౌర్భాగ్యుడు అటువంటి ప్రయత్నం చేసినచో, వాడిపై రాజద్రోహ నేరం మోపబడి బహిరంగ శిరఛ్చేదన చెయ్యబడును.
రాజుకి వందలమంది మల్టీ పర్పస్ దాసీజనులు ఉంటారు. ఇద్దరు ముగ్గురు భార్యలు కూడా ఉంటారు. వాళ్ళల్లో పెద్దరాణి వారి కడుపున పుట్టేవాడే రాజవుతాడు. అంచేత ఆవిడ గర్భం ధరించడం ఒక మెగా ఈవెంట్. ఆ గర్భం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించబడతాయి. ఆ సమయంలో - ఎవరో పిలిచినట్లు అడవుల్లోంచి మునులు, ఋషులు వచ్చి మంత్రించిన అరటికాయ, మామిడిపండు లాంటి తినే వస్తువులు రాణిగారికి ఇస్తుంటారు (ఎందుకో తెలీదు)!
మొత్తానికి ఏదోరకంగా రాణీ గర్భవతి అవుతుంది. 'రాణీగారి కడుపులో ఉన్నది ఆడామగా?' అనే టెన్షన్తో పురప్రజలు ఎదురుచూస్తుంటారు. కొడుకు పుట్టినచో, రాజావారు తన మెడలోని హారం అ వార్త చెప్పిన చెలికత్తెకి బహుమతిగా ఇచ్చెదరు. యువరాజావారు జన్మించినందుకు రాజ్యం యావత్తూ ఎగిరి గంతులేస్తుంది.. పండగ చేసుకుంటుంది.
అంతేనా? ప్రకృతి కూడా పులకించును. కోయిల 'కుహూ! కుహూ!'మని కూయును, నెమలి పురివిప్పి నృత్యము చేయును, మండుటెండ పున్నమి వెన్నెల వలె ప్రకాశించును, నీలాకాశం సువర్ణ వర్ణంగా మారి ధగధగా మెరియును, సూర్యచంద్రుల సాక్షిగా మేఘాలు వర్షపు తుంపరలను ఆనంద భాష్పాలుగా కురిపించును. ఇట్లాంటి దరద్రపుగొట్టు రాతలు రాజుగారి ఆస్థాన కవులు రచించెదరు, ప్రతిఫలముగా అగ్రహారాల్ని పొందెదరు (వీరు ఇవ్వాల్టి మన 'పద్మ', జ్ఞానపీఠాలకి మూలపురుషులు)!
ముసలి రాజు, తమ యువరాజులుంగారికి ఎప్పుడు పట్టాభిషిక్తుణ్ని చేస్తారా అని దేశపౌరులు యావత్తు హిచ్ కాక్ సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నట్లు ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు (అంతకన్నా చేసి చచ్చేదేమీ లేదు కనుక). వన్ ఫైన్ డే (ఒక శుభముహోర్తాన) యువరాజు బాబుకి పట్టాభిషేకం అనే ఒక గొప్ప వేడుక జరుగుతుంది. దేశప్రజల జన్మ ధన్యమౌతుంది. ఆ రోజు నుండి ప్రజలు కొత్తరాజుని భక్తిప్రవృత్తులతో కొలవనారంభిస్తారు. కథ మళ్ళీ షరా మామూలే!
మిత్రులారా! ఇప్పటిదాకా (నాకు తెలిసిన) రాచరిక వ్యవస్థ గూర్చి తెలుసుకున్నారు. ఇదంతా మీక్కూడా తెలిసిందే, కానీ రాయబోతున్న విషయం కోసం మీ మెమరీని కొద్దిగా రిఫ్రెష్ చేశాను, అంతే! ఇప్పుడు ఇక ఇదే అలవరసలపై (ఈ పదానికి కాపీరైట్ హక్కుదారు - మీనాక్షీ పొన్నుదురై, రేడియో సిలోన్) తెలుగు సినీచరిత్ర కూడా తెలుసుకుందాం.
ఒకానొకప్పుడు తెలుగు సినిమాకి 'రెండుకళ్ళు'లాగా ఇద్దరు హీరోలు ఉండేవారు. అవడానికవి రెండుకళ్ళే గానీ, ఆ రెండుకళ్ళు ఒకే వ్యక్తివని చెప్పలేం. ఎందుకంటే రెండుకళ్ళూ రెండు వేరువేరు సామ్రాజ్యాలు. ఎవరికీవాళ్ళే తమ దర్శకులు, రచయితలతో సొంత దుకాణాలు నడుపుకునేవాళ్ళు. అవిధంగా కళామతల్లి ముద్దుబిడ్డలు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా జీవుల్ని రంజింపజేశారు. తమ అభిమానుల కోరికపై వృద్దాప్యంలో కూడా రంగుల విగ్గులు, తగరపు కోట్లు వేసుకుని మనవరాలు వయసు హీరోయిన్లతో నర్తించారు.
రాజులు ముసిలాళ్ళైపొతుంటే, సామంతరాజులు బలపడుతుంటారు. కావున అరవైలలో ఇద్దరు కొత్త హీరోలు రంగప్రవేశం చేశారు. క్రమేపి వాళ్ళు సామంతరాజుకి ఎక్కువ, చక్రవర్తికి తక్కువ అన్నట్లుగా సినీరంగంలో స్థిరపడ్డారు. ఆ తరవాత కొన్నేళ్ళకి 'ఒక కొత్తవర్గం' కి చెందిన నటుడొకడు డేకుతూ, పాకుతూ కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు.. ఆపై పెద్ద హీరోగా ఎదిగాడు. 'కొత్తవర్గం' జనులు ఆనంద భాష్పాలు కార్చారు, తమ వర్గం నటుణ్ణి భుజానికెత్తుకున్నారు. ఆనాటి నుండి తెలుగు సినీ అభిమానుల్లో వర్గపోరాటం మొదలైంది (కార్ల్ మార్క్స్ చెప్పిన వర్గపోరాటం కాదు).
ఈలోగా తమ రిటైర్మెంటుతో ఇంతకాలం తాము యేలిన తమ తెలుగు సినీసామ్రాజ్యం దిక్కులేనిదైపోతుందని, తమ అభిమానులకి దివాణం లేకుండా పోతుందని ముసలి నటులు మిక్కిలి దిగులు చెందారు. అంచేత ఆ రెండుకళ్ళ నటులు తమ తనయుల్ని యువరత్న, యువసామ్రాట్టులుగా తెరపైకి తెచ్చారు. తమ అభిమాన ముసలి హీరోల స్థానంలో వచ్చిన వారి సుపుత్ర కుర్రహీరోల్ని గాంచిన వెర్రి అభిమానులు ఆనందంతో తడిసి మోపెడయ్యారు. ముసలి హీరోల బాటలోనే, అరవైల హీరో కూడా తన అభిమానుల శ్రేయస్సుకై తన ఇద్దరు కొడుకుల్ని రంగంలోకి దించాడు, వారిలో చిన్నకొడుకు ప్రయోజకుడయ్యెను.
ఇక 'వేరే వర్గం' హీరో మాత్రం తక్కువ తిన్నాడా? అందుకే ముందుగా తమ్ముణ్నీ, తరవాతగా కొడుకునీ హీరోలుగా దించాడు. తమ్ముడు హీరో మిక్కిలి ఆలోచనాపరుడు, ఆవేశపరుడు, విప్లవకారుడు కూడా. అందుకే అభిమానులు ఆయనలో చెగువేరా, భగత్ సింగుల్ని దర్శించి తన్మయత్వం చెందుతారు. కిట్టనివాళ్ళు అతను 'జయసింహ'లో ఎస్వీరంగారావులా రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నాడు అంటారు గానీ, నిజానిజాలు మనకి తెలీదు.. అనవసరం కూడా.
మిత్రులారా! ఎక్కడా పేర్లని ప్రస్తావించకుండా నే రాసిన తెలుగు సినిమా చరిత్ర మీకు అర్దమయ్యిందనుకుంటాను. రాజలు యుద్ధాలు చేస్తారు, ఇప్పుడు యుద్ధాలు జరగట్లేదు కదా? అని మీకు అనుమానం రావొచ్చు. ఒకప్పుడు రాజ్యం చుట్టూ కోట ఋరుజు ఉండేది, మరఫిరంగులు ఉండేవి, కొట్టుకు చావడానికి సిపాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడవన్నీ రూపాంతరం చెందాయి. ఇవి ప్రపంచీకరణ రోజులు.. అన్నీ సామాన్యుల కంటికి కనపడని రక్షణ కవచాలు, యుద్ధాలే. ఇప్పుటి నటవారసులకి సొంత స్టూడియోలే రక్షణ కవచాలు, సొంత పంపిణీ వ్యవస్థే దుర్భేధ్య కోటగోడలు. ఇక్కడ అందరూ సమానులే.. కానీ కారు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న ఓ యువనటుడి సాక్షిగా ఇది రాస్తున్నాను.
ఇప్పుడు మనం రాచరిక వ్యవస్థ కోణం నుండి తెలుగు సినిమా చరిత్ర తెలుసుకున్నాం. తద్వారా - అనాదిగా మన 'ప్రజల జాతి' (అనగా పాలింపబడే జాతి) వంశపారంపర్యత పట్ల ఎంతటి భక్తి, ఆరాధన, వినయం కలిగున్నాయో కూడా అర్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఇవే ఆలోచనల్ని, ఇవే అలవరుసలపై (మళ్ళీ - థాంక్స్ టు మీనాక్షీ పొన్నుదురై) దేశ రాజకీయ రంగంలోకి మళ్ళిద్దాం.
'ఈ దేశానికి ప్రధానిగా అవతరించడానికి రాహుల్ గాంధీకున్న ఏకైక అర్హత నెహ్రూ వారసత్వం మాత్రమేనా?' అని నరేంద్ర మోడీ గర్జించి మరీ అడుగుతున్నాడు. నరేంద్ర మోడీకి వారసత్వం ఎడ్వాంటేజ్ లేకపోవడం మూలానే ఈర్ష్యతో అలా అడుగుతున్నాడని నా అనుమానం. లేదా - అతనికి విఠలాచార్య సినిమాలు, చందమామ కథలు, తెలుగు సినిమా చరిత్ర.. బొత్తిగా తెలీకపోవడం వల్లనైనా అలా అడుగుతూ ఉండుండాలి.
నిన్నగాక మొన్న, యువరాణి ఇందిరమ్మ యుద్ధవిద్యలో తండ్రి దగ్గరే కోచింగ్ తీసుకుని, ఆపై రాణిగా పట్టాభిషిక్తురాలయ్యారు కదా! ఇందిరమ్మ కొద్దిగా నయం, అసలు ఏ మాత్రం అనుభవం లేని యువరాజు రాజీవుల వారు సింహాసనాన్ని అధిష్టించారు కదా! ఏం చేస్తాం? దేశంలో క్లిష్టపరిస్థితులు అలా తన్నుకొచ్చాయి. అందుకే భార్య సోనియమ్మ వద్దంటున్నా రాజీవులవారికి రాజ్యాధికారం అనే ముళ్ళకిరీటం ధరించక తప్పలేదు.
ఒక్కసారి 'రాజమకుటం'లో కన్నాంబని గుర్తు తెచ్చుకోండి. పాపం! రాజుగారు హత్య కావించబడ్డ తరవాత రాజమాత, అధికారాన్ని కొడుక్కి అప్పచెప్పడానికి ఎన్ని కష్టాలు పడింది! షేక్స్పియర్ 'హేమ్లెట్' ఛాయలు కనిపించే రాజమకుటం సినిమాని మనం మెచ్చుకోలేదూ? ఇప్పుడు రాజమాత సోనియమ్మ సింహాసనంపై కొడుకుని కూర్చుండపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇందులో తప్పేంటి? మీరు మాత్రం మీ పొలాలు, ఇళ్ళూ మీ పిల్లలకి రాసివ్వరా? రాజులు అదే చేశారు, సినిమా హీరోలూ అదే చేశారు, రాజకీయ నాయకులందరూ అదే చేశారు.. ఇప్పుడు సోనియమ్మ కూడా చేస్తుందదే కదా!
మోడీకి వారసత్వంలో ఉన్న పవర్ అర్ధం కావట్లేదు. జవహర్ లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లా, చరణ్ సింగ్, దేవీలాల్, బిజూ పట్నాయక్, విజయ రాజె సిందియా, ఎన్టీరామారావు, శరద్ పవార్, మూలాయం సింగ్ యాదవ్, దేవెగౌడ, కరుణానిధి.. ఇట్లా వారసత్వాల లిస్టు చాంతాడంత ఉంది. ఎమ్జీఆర్ కి వారసులు లేరు, అందువల్ల ఆయన అభిమానులకి జయలలితలో తమ నాయకుణ్ణి చూసుకుని తన్మయత్వం చెందలేదా? ప్రజల్లో వీళ్ళెవ్వరి పట్లా లేని అభ్యంతరం, సోనియా గాంధీ పట్ల మాత్రం ఎందుకుండాలి?
జనాలు సినిమాల్లో వారసత్వ పల్లకీలని మోసే బోయీలుగా ఉన్నారు, మరప్పుడు రాజకీయాల్లో మాత్రం నమ్మకంగా, భక్తిగా ఓట్లేసే కూలీలుగా ఎందుకుండరు? ఉంటారనే పేట్రిక్ ఫ్రెంచ్ అనే ఆంగ్లేయుడు భారత వారసత్వ రాజకీయాల గూర్చి ఓ పుస్తకంలో విపులంగా రాశాడు. తెలుగు ప్రజలకి వారసత్వం పట్ల ఎంత గౌరవం లేకపోతే ఒక మహానాయకుడి కొడుకునో, ఇంకో అధినాయకుడి అల్లుణ్నో కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తూ, వారు తమని పాలించే శుభసమయం గూర్చి ఆశగా ఎదురుచూస్తుంటారు? వారి కోరిక త్వరలోనే తీరాలని కోరుకుందాం.. అంతకన్నా చేసేదీమీ లేదు కనక!
(picture courtesy : Google)
No need for the tone of despair and resignation. NaMo is the answer. Time to change the political dispensation in Delhi. Dynastic rule is over.
ReplyDeleteI am glad to see your post. Some so called liberals doesn't like it because as they all are swept by a decade worth of propaganda against Modi. I strongly hope and also believe that with Modi we will definitely see new blood in our political scene.
DeleteI am very glad to read your post Doc. But lot of so called liberals who are brainwashed by anti-Modi propaganda wouldn't believe and also think otherwise too. I hope and also believe that with Modi we get a new generation of politicians who are not just son/daughter's of current politicians.
Delete@GK,
Deleteవారసత్వాల్ని విమర్శిస్తూ నరేంద్ర మోడీ పేరుని ప్రస్తావించానేగానీ, ఈ పోస్టులో మోడీకి అనుకూలంగా ఏమీ రాయలేదు.. గమనించగలరు.
(వారససత్వం మాత్రమే అర్హతగా వచ్చేవాళ్ళ పట్ల నాకు వ్యతిరేకత ఉంది. అయితే - వారసత్వం లేకపోయినంత మాత్రాన, నాయకులు ప్రజల పక్షాన ఉంటారనే గ్యారెంటీ లేదు.)
ప్రజల పక్షాన లేక పోతే తరవాతి ఎలక్షన్లలో ఓడించవచ్చుగా! ఇదేదో రాజ్యరికం ఫర్ లైఫ్ కాదు కదా! ఎందుకూ పనికిరాని ఈ సెక్యులరిజం స్లోగన్లు, ఉపయోగంలేని పేదల (పేరిట) స్కీములు, ఉద్యోగాలు లేని ఎకానమీ, ఆకాశమంత లంచగొండితనం ఇంక చాలు. ఈ వోట్ల బ్యాంక్ రాజకీయాలు పోవాలింక. నా ఉద్ధేశ్యంలో ప్రతి భారతీయుడికి కులంతో, మతంతో, ఆర్ధిక స్థితి ల తో సంభంధం లేని సమ పౌర హక్కులు (బాధ్యతలు కూడా) కావాలి.
Deleteబి ఎస్ ఆర్
@GIdoc,
Deleteశుభం! అటులనే కానిండు.
మీకు మోడీకి ఓటేసే అదృష్టం లేనందుకు చింతుస్తున్నాను. :)
నెను 'Doc' అన్నది Gldoc గారిని. confusion ( తికమక పరిస్తితికి ) కి చింతిస్తునాను!!
Deleteమీకు మోదీ లో ఏ మంచి కనపడదని నాకు తెలుసు. కాబట్టి మీరు మోదీ గారి గురుంచి మంచి రాస్తారని నేను అనుకోవట్లేదు.
@GK,
Delete>>I am very glad to read your post Doc.
confusion కి కారణం ఈ వాక్యం. మీరు comment అనడానికి బదులుగా post అన్నారు. అమ్మయ్య! పోన్లేండి, ఇప్పటికైనా విషయం అర్ధమైంది.
>>మీకు మోదీ లో ఏ మంచి కనపడదని నాకు తెలుసు. కాబట్టి మీరు మోదీ గారి గురుంచి మంచి రాస్తారని నేను అనుకోవట్లేదు.
నన్ను చక్కగా అర్ధం చేసుకున్నారు, థాంక్యూ.
60 ఏళ్ళ వయసు వరకు హీరోగా అలవాటు పడ్డ వారు ఆ వయసులో ప్రజల కోసం హిరో పాత్రలను త్యాగం చేయడం సామాన్యమైన త్యాగమా
ReplyDeleteఅవును, ఆ త్యాగం మహోన్నతమైనది. :)
Deleteరాజరిక వ్యవస్థ నుండి ఇంకా బయటి పడని మన ప్రజలకు వారసత్వం అంటే మోజుతో పడి చస్తారు. ఇంకా కావాలంటే , వారసత్వం పోతుందంటే గుండె పగిలి కూడా చస్తారు. ఆ మధ్య చావలేదా? చావక పోతే చంపుతారు. లేక పోతె వారసత్వానికి విలువేమిటి? చాలా బాగుంది సార్, రాచరిక వ్యవస్థ.
ReplyDelete// మొత్తానికి ఏదోరకంగా రాణీ గర్భవతి అవుతుంది.// ఇదేంటి సార్, రాచరిక వ్య్వస్త ఉప్పొంగి పోయింద్! :))
>>చాలా బాగుంది, రాచరిక వ్యవస్థ.
Deleteఅంతా ఆ విఠలాచార్య చలవ. :)
కార్ల్ మార్క్స్ అనే పేరు లోనే ...ఆ తత్వం లోనె అంతా ఉందని మీకూ నాకూ కూడా తెలుసు. అయినా మన సౌకర్యాలు వదులుకోలేం కదా?
ReplyDeleteఒకో సారి ఈ ముసుగులో గుద్దులాట లెందుకు చక్కగా రాజరికాన్నే ఫాలో అయిపోవచ్చు గదా అనిపిస్తుంది నాకు. కించిత్ మధు పానాసక్తమయిన మా చిత్త భ్రమయా, లేక...
ReplyDeleteఅలువరసలపై (ఈ పదానికి కాపీరైట్ హక్కుదారు - మీనాక్షీ పొన్నుదురై, రేడియో సిలోన్)
ReplyDeletei want more details on this. I had a nostalgia about her! especially waht is the meaning of that "aluvarasa"
అల అంటే తరంగం, వరుస అంటే వరుసనే. అలవరుస అంటే తరంగాల వరుస. వేవ్ లెంగ్త్ కు ఈ పదం వాడానుకుంటారు. నా చిన్నతనంలో ఈ మీనాక్షీ పొన్నుదురై పేరు విన్న గుర్తు. మీనాక్షీ అక్కయ అని ప్రతీతి అని జ్ఞాపకం.
ReplyDeleteకరక్టేనంటారా
అల వరస కరెక్ట్ (నేను 'లు' అని తప్పుగా రాశాను, సరిచేస్తున్నాను). మీ అనువాదం కూడా 100% కరెక్ట్.
Deleteఅలవరస కదు సార్, అలవరసై
ReplyDeleteతమిళ వ్యాకరణానుసారం అలాంటి పదరూపం ఏర్పడింది
Deleteనా చిన్నప్పటి అందమయిన జ్ఞాపకాల్లో తనూ ఒకరు. రేడియో సిలోన్ క్రమం తప్పకుండా వినేవాణ్ణి. పాటల సెలక్షన్లో మంచి టేస్టున్న మనిషి. అదీ కాకుండా వాయిస్ కొంచెం హస్కీగా ఉంటూ తెలుగుని ఇప్పటి తెలుగు టీవీ యాంఖర్ల మాదిరి ఖూనీ చెయ్యకుండా చాలా స్పష్టంగా ఉచ్చరించేది!
ReplyDeleteపాపం! మోదీ గారికే వారసత్వం లేదు!
ReplyDelete