Wednesday 26 March 2014

రచయిత


"నమస్కారం రచయిత గారు! ఈమధ్య మీర్రాసిన కథ చదివాను, చాలా బాగుందండి." వినయంగా అన్నాడు అప్పారావు.

రచయితకి మూడాఫ్ అయిపొయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఉప్మాపెసరట్టులో చచ్చిన ఈగ కనిపించినట్లు వికారంగా ఫీలయ్యాడు. వంద గజ్జికుక్కల ఆకలి చూపుల మధ్య పెళ్లిభోజనం చేస్తున్నంత రోతగా అనిపించింది. జబ్బుతో తీసుకుంటున్న పేదవాడు మొహంమీద దగ్గినంత ఇబ్బందిగా అనిపించింది. కొత్తగా కొన్న పెద్దకారుకి చిన్నగీత పడితే కారు ఓనరయ్యకి కలిగే ఆందోళన లాంటిది కూడా కలిగింది. స్కాచ్ మాత్రమే తాగేవాడికి లోకల్ బ్రాండ్ ఆఫర్ చేస్తే వచ్చే చికాకులాంటి భావన కూడా కలిగింది.

ఇన్నిరకాల భావనలతో, దేశంలో ఉన్న సమస్త దరిద్రాన్నీ మూటకట్టి నెత్తిన పెట్టుకుని మోస్తున్నవాళ్ళా భారంగా నడుస్తూ ఇంటికి బయల్దేరాడు. మనసు మనసులో లేదు, ఆలోచనలు మునిసిపాలిటీవాడు దోమలమందు చల్లినా చావని దోమల గుంపుల్లా కమ్ముకుంటున్నయ్.

'నా కథ ఈ అప్పారావుకి ఎలా అర్ధమైంది? నా రచనలు కాఫ్కా కన్నా పైస్థాయిలో ఉంటాయి కదా! నా ఆలోచనలు మేధావులకే అంతుబట్టవు. నా కథల్లోని అర్ధాన్ని వెతకడానికి ప్రపంచవ్యాప్తంగా నా అభిమాన గణం నిరంతరంగా ప్రయత్నిస్తుంటుంది. నా రచనల్లోని అర్ధాలు, గూఢార్ధాల, నిగూఢార్ధాల గూర్చి వ్యాఖ్యానాలే అనేక పుస్తకాలుగా వచ్చాయి. నేను కథకులకి మాత్రమే కథకుణ్ణి కదా! మరి ఈ ఆఫ్టరాల్ అప్పారావుకి నా కథ ఎలా అర్ధమైంది? నా కథల స్థాయి ఇంతగా దిగజారిందా?" ఆలోచనలతో రచయిత బుర్ర అట్టు పెనంలా వేడెక్కింది.

వేడెక్కిన బుర్రని అంతకన్నా వేడిగానున్న ఫిల్టర్ కాఫీతో చల్లబరచ ప్రయత్నించాడు. ధర్మాసుపత్రిలో అధర్మ డాక్టరిచ్చిన మాత్రలేసుకుంటే ఉన్న రోగం పోకపోగా, కొత్తరోగం మొదలైనట్లు.. ఆలోచనలు మరింతగా పెరిగిపోయ్యాయి.

ఇంతలో ఎక్కణ్ణుంచో ఒక శిష్యపరమాణువు నుండి ఫోన్.

"రచయిత గారు! ఫలానా కథలో సముద్రం ఎర్రబారిందనీ, అలలు ఘనీభవించాయనీ రాశారు. అలా ఎందుకు రాశారో చెప్తారా?"

మనం అప్పు పెట్టిన వడ్డీవ్యాపారస్తుడు వోల్వో బస్సు ప్రమాదంలో ఛస్తే వచ్చేంతటి బ్రహ్మానందం.. రచయితకి కలిగింది.

"ఆ కథలో సముద్రం అంటే సముద్రం అని కాదు, 'మనసు' అని అర్ధం." గర్వంగా అన్నాడు రచయిత.

"అలాగా! అయితే అప్పుడు అలలు అంటే అలలు కాదనుకుంటా." అన్నాడు శిష్యపరమాణువు.

"అక్కడ అలలు అంటే అర్ధం రెండురకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పోస్ట్ మోడర్నిస్ట్ అర్ధం, రెండు మేజిక్ రియలిజం అర్ధం. అయినా ఆ కథని విశ్లేసిస్తూ ఓ రెండు వేల పేజీల పుస్తకాన్ని నా అభిమానులు ప్రచురిస్తున్నారు." అన్నాడు రచయిత.

"రచయిత గారూ! నే చచ్చేలోపు మీలాగా ఒక్కవాక్యం రాసినా చాలండీ, నా జన్మ ధన్యమౌతుంది, మీరు నిజంగా కారణజన్ములు." తన్మయత్వంగా అన్నాడు శిష్యపరమాణువు.

ఆ మాటల్తో, తన కటౌట్ కి పాలాభిషేకం చేస్తున్న వెర్రి అభిమానుల్ని చూసినప్పుడు తెలుగు సినిమా హీరోకి కలిగేంత ఉత్సాహం వచ్చింది రచయితకి. ఫుల్లుగా మేకప్పేసుకుని పార్టీకి ఎటెండైన ఆంటీని 'మీరే కాలేజ్ స్టూడెంట్?' అనడిగితే వచ్చే గర్వానందము లాంటిది కలిగింది.

'అవును! తెలుగునాట 'మో' కవితల్ని అర్ధం చేసుకున్నవాడు ఉండొచ్చు, 'త్రిపుర' కథల్ని పరిచయం చేసేవాడూ ఉండొచ్చు, కానీ - నా రచనల్ని అర్ధం చేసుకున్నవాడు ఇప్పటిదాకా పుట్టలేదు (పుట్టకూడదని కూడా నా కోరిక)!' అని నర్తనశాలలో ఎస్వీరంగారావులా అనుకున్నాడు రచయిత.

కానీ - అంతలోనే అప్పారావు జ్ఞాపకం వచ్చాడు, నిస్సత్తువ ఆవహించింది. తన కథని బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టినంత బాధ కలిగింది. తన బార్లో రోజూ బిల్లు కట్టకుండా మందు తాగే పన్నుల అధికార్ని చూసి బారు ఓనరు లోలోపల నిశ్సబ్దంగా కుళ్ళుకుంటూ ఏడ్చినట్లు, రచయిత కూడా మనసులోనే రోదించసాగాడు.

'నా కథ అప్పారావుకి ఎలా అర్ధమైంది? ఇదెవరికైనా తెలిస్తే నాకెంత పరువు తక్కువ!' అనుకుంటూ అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన సూపర్ డైరక్టర్లా అవమాన భారంతో దీర్ఘాలోచనలో మునిగిపోయ్యాడు రచయిత.

రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రచయిత. ఎంత ఆలోచించినా.. అవి చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలా సాగుతూ, అక్కడక్కడే తిరుగుతున్నాయి గానీ, ఓ కొలిక్కి రావట్లేదు. అందువల్ల - మండే వేసవి ఎండలకి కరిగే గుంటూరు తారు రోడ్డు వలే.. రచయిత బుర్ర మరీ హీటెక్కిపోయింది.

'లాభం లేదు, ఒక కథ రాయడానిక్కూడా ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. ఈ విషయం తేల్చాల్సిందే.' అనుకుంటూ అప్పారావుకి ఫోన్ చేశాడు.

"రచయిత గారు నమస్తే!" అప్పారావు లైన్లోకొచ్చాడు.

"నువ్వు నాకో విషయం చెప్పాలయ్యా అప్పారావు. నా కథలో నీకేం నచ్చింది?" సూటిగా సుత్తి లేకుండా అడిగేశాడు రచయిత.

అప్పారావు వైపునుండి కొద్దిసేపు నిశ్శబ్దం.

"హ్మ్.. మీ కథ బాగుందండి." మొహమాటంగా అన్నాడు అప్పారావు.

"నేనడిగేదీ అదే, నీకాకథ ఎందుకు నచ్చింది?" రెట్టించాడు రచయిత.

అటువైపు నుండి మళ్ళీ నిశ్శబ్దం.

"అప్పారావు! అడిగేది నిన్నే! లైన్లోనే ఉన్నావా?" అసహనంగా అడిగాడు రచయిత.

"రచయిత గారు! క్షమించండి. వాస్తవానికి మీ కథ ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు." ఇబ్బందిగా అన్నాడు అప్పారావు.

"మరి బాగుందని ఎందుకు చెప్పావ్?" ఆశ్చర్యంగా అడిగాడు రచయిత.

"మీరు నన్ను మన్నించాలి. మిమ్మల్ని ప్లీజ్ చెయ్యాలని ఒక చిన్న అబద్దం ఆడాను, అంతే!" తప్పు చేసినవాడిలా అన్నాడు అప్పారావు.

"థాంక్స్ అప్పారావ్."

లైన్ కట్ చేశాడు రచయిత. ఈ థాంక్స్ దేనికో అప్పారావుకి అర్ధమయ్యే అవకాశం లేదు.

మర్డర్ మిస్టరీని చేధించినప్పుడు షెర్లాక్ హోమ్స్, డిటెక్టివ్ యుగంధర్, పెర్రీ మేసన్ లకి కలిగే ఆనందం, తృప్తి లాంటివి.. రచయితక్కూడా కలిగాయి.

'అనవసరంగా పొద్దున్నుండి ఎంతలా ఆవేదన చెందాను!' సారా పేకెట్లు పంచకుండానే ఎలక్షన్లో గెలిచిన ఎమ్మెల్యేలా సంతోషంతో పొంగిపోయ్యాడు రచయిత.

'అప్పారావుకి కథ నిజంగా అర్ధమైనట్లైతే అసలు రచన చెయ్యడమే మానేద్దును. ఇప్పుడా ప్రమాదం తప్పిపోయింది. ఇది తెలుగు జాతి అదృష్టం, తెలుగు సాహిత్యం చేసుకున్న పుణ్యం.'

రచయితకి ఒక్కసారిగా తన శిష్యకోటి, అవార్డులు, రివార్డులు, సన్మాన శాలువాలు గుర్తొచ్చాయి. గర్వాతిశయములతో గుండెల్నిండా గాలి పీల్చుకుని.. ఒక కొత్త రచనకి శ్రీకారం చుట్టాడు.

అంకితం :

పాఠకులకి అర్ధం కాకుండా రాస్తూ లబ్దప్రతిష్టులైపోయిన తెలుగు రచయితలందరికీ అభినందనలతో..

(picture courtesy : Google)

23 comments:

  1. :-):-):-):-)Chaalaa baagaa rasaaru :-):-):-)

    ReplyDelete
  2. కామెంటెట్టాలంటే చాలా పెట్టాలి. ఉదాకి --- ఎంత బాగున్నా ఉప్మా సారీ ఉపమాలంకారాలెక్కువయాయేమో!! ప్రాస కలసినా మునిసిపాలిటీ వాడు దోమలమీద దోమల మందు కాక (ఆ మందేసినా అవి చావవు) , ఇంక మలేరియా మందేస్తే ఎలా చస్తయ్యి??? జస్టు జోగ్గా రాసా!
    ఇలాంటి రచయితలు ఉన్నా నాలాంటోళ్ళు (అప్పారావులు) సాదా సీదాగా అర్ధం అయ్యేట్లు రాసినోళ్ళనే ఆదరిస్తారు, అభిమానిస్తారు.

    గౌతం

    ReplyDelete
  3. కామెంటెట్టాలంటే చాలా పెట్టాలి. ఉదాకి --- ఎంత బాగున్నా ఉప్మా సారీ ఉపమాలంకారాలెక్కువయాయేమో!! ప్రాస కలసినా మునిసిపాలిటీ వాడు దోమలమీద దోమల మందు కాక (ఆ మందేసినా అవి చావవు) , ఇంక మలేరియా మందేస్తే ఎలా చస్తయ్యి??? జస్టు జోగ్గా రాసా!
    ఇలాంటి రచయితలు ఉన్నా నాలాంటోళ్ళు (అప్పారావులు) సాదా సీదాగా అర్ధం అయ్యేట్లు రాసినోళ్ళనే ఆదరిస్తారు, అభిమానిస్తారు.

    ఇంకోటి మరచా. గూగుల్, ఫేస్ బుక్కు అన్నిటా ఉన్నావుగా పరమాత్ముడిలాగా!

    గౌతం

    ReplyDelete
    Replies
    1. నువ్వు జోగ్గా రాసినా కరెక్టుగానే రాశావు మిత్రమా. ఇప్పుడే సరిచేస్తున్నాను.

      కావాలనే ఉప్మా ఎక్కువ దట్టించాను. ఓం రావిశాస్త్రాయనమహ. :))

      ముఖపుస్తకాన్ని (అద్దంలో మొహం చూసుకున్నట్లు) రోజుకోసారి చూస్తుంటాను. అంతకుమించి నాకే పాపమూ తెలీదు.

      Delete
  4. రమణ గారు అయ్యో ఈ సెటైర్ నాకు అర్థం అయ్యింది .. ఇబ్బందేమీ లేదు కదా

    ReplyDelete
  5. చదివే పాఠకుల బుర్ర చెదలకు నిలయమైతే, రచయిత కలం పెళుసుగా కాయితాన్ని పొడుచుకు తింటుంది.

    ReplyDelete
    Replies
    1. >>చదివే పాఠకుల బుర్ర చెదలకు నిలయమైతే<<

      కుంచెం చెదలమందు కాఫీలో కలిపేసుకుని తాగేస్తే రోగం కుదుర్తుంది. :)

      Delete
  6. సార్‌, చాలా బాగుంది. ఎందుకూని మాత్రం అడగొద్దు. బాగుంది అంతే!

    ReplyDelete
    Replies
    1. సరే! మీరు అడగొద్దంటే నేను మాత్రం ఎందుకడుగుతాను? అస్సలు అడగను. ఇంతకీ.. ఎందుకు బాగుంది? :))

      Delete
  7. నమస్కారం రచయత గారు , మీర్రాసిన ఈ పోస్ట్ చదివాను , చాలా బాగుంది . :)

    ReplyDelete
  8. పాఠకులకు అర్థమవకుండా కథలు రాసి, అంతర్జాతీయ స్తాయిలో రాసేసామనుకునే రచయితలకూ, అవి అర్థం కాకుండానే అర్థమైనట్టు నటిస్తూ కాఫ్కా స్థాయిలో రాశారని మెచ్చుకునే (వీళ్ళిద్దరిలో ఎవరైనా కాఫ్కాని చదివారా అంటే అది వాళ్ళకే తెలియాలి)బాగా చురకలు వేశారు! అభినందనలు

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ. నాది double disadvantage.

      ఓపక్క సైకియాట్రీ, ఇంకోపక్క ఈ తెలుగు రచయితలు.. ఏవీ అర్ధం కావట్లేదు.

      అంచేత ఈ పోస్టుని నా ఏడుపుగా కూడా అనుకోవచ్చు. :)

      Delete
  9. I think this is your best post till date! (Dont ask me what I understood .. shhhhhh!)

    ReplyDelete
  10. ఇక ఆగడం నా వల్ల కాదు. నన్నెవరూ ఆపలేరు. నా నిర్ణయాన్ని సూర్యచంద్రాదులు వచ్చినా అడ్డుకోలేరు. ఏ ప్రలోభమూ నన్ను వశపరుచుకోలేదు. మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా పర్యవేక్షణలో మీ ఉపమల ప్రయోగం పై పిహెచ్,డి. చేయించాలని నిశ్చయించుకున్నానంతే. మీరేం చెప్పినా ఇక వినను, నేనలసే మోనార్క్ ని. చేయిస్తానంతే. (ఈలోగా మరో అలంకారం మీద పడిపోయేరు. నాకు కష్టమౌతుంది. ఇలాగే కంటిన్యూ చెయ్యండి.)

    ReplyDelete
    Replies
    1. హి..హి.. హీ.. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారండి. ఏవిటో మీ అభిమానం! మీ కామెంట్ చదువుతుంటే వేడివేడి మిర్చి బజ్జీలు తిని, గోళీసోడా తాగుతున్నంత ఆనందంగా ఉంది.

      Delete
  11. పొరబాటున కూడా మీ టపాలో ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదండీ ఒట్టు.

    ఫ్రాయిడ్ అంటే గడ్డం తాతనీ కాఫ్కాకి గడ్డం లేదని మాత్రమె తెలిసిన మాబోటి మానవమాత్రులపై ఇలాంటి ప్రయోగాలు తగునా? మెన్సా సభ్యులకు మాత్రమె పరిమితం అని బోర్డు తగిలించండి!

    ReplyDelete
    Replies
    1. మీ పేరు అప్పారావా?! :)

      Delete
  12. "నేను అప్పారావు ని మాట్లాడుతున్నాను.. మీరు భలే రాస్తారండి...అసలు ఇంత గొప్పగా ఎలా రాస్తారండి.. మీరు రాసేవాన్ని సిరివెన్నెల, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, దాసరి, పరుచూరి బ్రతర్స్ అంత గొప్పగా ఉంటాయని మా తోడల్లుడు చెప్పాడు..నిజమేనండి. ఎంతైనా లైబ్రరి లో దాచుకోవలసిన పుస్తకాలే. అచ్చు వేయించాగానే చెప్పండి".
    గమనిక: ఇది మీ పోస్ట్ కి పొడగింపు మాత్రమె..అంతే కాని మీ పోస్ట్ కి వాఖ్య గా బావిన్చారాదని మనవి

    ReplyDelete
  13. పోస్ట్ పొడిగింపులు, ఒంటి మీద బట్టలు తొడిగింపులు సిగ్గును దాచుకుందుకే కద!

    ReplyDelete
  14. రమణ గారు,
    ఈ టపాను మీరు చాలా బాగా రాశారు. ఎంత బాగా రాశారు అంటే చూపులు కలసిన శుభవేళా పాటలో సావిత్రి హావభావలు
    “శరముల వలనే చతురోక్తులను చురుకుగ విసిరే నైజములే.. శౌర్యములే” చరణం లో ఎంత పెర్ఫేక్ట్ గా ఉందో అంత చక్కగా ఉంది.

    http://www.youtube.com/watch?v=_qCFNvCTH0s (2:24 – 3:10)

    ఇక మీరు రాసిన రచయిత ను దృశ్యపరంగా ఊహించుకొంటే పెళ్లికానుక సినేమాలో రేలంగి గుర్తుకు రాకమానడు. ఈ టపావలన పాత ఎప్పుడో చూసిన ఆ సినేమాను, యుట్యుబ్ లో రేలంగి హాస్య సన్నివేశాలను చూడటంజరిగింది. మీరు చూసి ఆనందించండి.
    http://www.youtube.com/watch?v=L7Q_rVMc7zU
    http://www.youtube.com/watch?v=qwUG9uZmvpI
    http://www.youtube.com/watch?v=wYgN9ctwmEA
    http://www.youtube.com/watch?v=a7wYwth9iZc

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.