Saturday 22 March 2014

అమాయకుని ఆలోచనలు


భారత దేశము నా మాతృభూమి. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఇక్కడ ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంటుంది, అంచేత శాంతిభద్రతలు ప్రశాంతంగా పక్కేసుకుని నిద్రోతుంటాయి. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంటుంది, పురులు విప్పి నాట్యం చేస్తుంటుంది. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి కేరాఫ్ ఎడ్రెస్ నా దేశం.. ఇక్కడ ప్రజలే పాలకులు, ప్రభువులు. కావున - ఇక్కడ అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంటారు.

నా దేశంలో ప్రజలు రెండురకాలు. ఒకరు స్వార్ధపరులు, రెండు నిస్వార్ధపరులు.

స్వార్ధపరులనగా ఎవరు? వీళ్ళు రోజు గడవటం కోసం చాకిరీ చేస్తుంటారు.. కొందరు పొలాల్లో, ఇంకొందరు ఫేక్టరీల్లో. మరికొందరు చిన్నాచితకా పనులు చేస్తుంటారు. వీళ్ళు ఎంత చేసినా, ఏం చేసినా తమ గూర్చి, తమ కుటుంబం కోసం మాత్రమే పాటు పడుతుంటారు. వీరికి దేశసేవ పట్ల ఆసక్తి ఉండదు. తమకంతటి పరిజ్ఞానం, సమయం, సొమ్ము లేదని అనుకుంటుంటారు.

మరి నిస్వార్ధపరులు ఎవరు? వారిని రాజకీయ నాయకులు అందురు. వీరికి తమ కుటుంబం కన్నా మాతృదేశమన్న మిక్కిలి ప్రీతి. వీరు స్వార్ధపరుల వలె చాకిరి చెయ్యరు, అసలు కనీస శ్రమ కూడా చెయ్యరు.. చెయ్యలేరు. అందుకు కారణం వారికి సమయం దొరక్కపోవడమే కానీ మరేదీ కాదు. ఏలననగా - రాజకీయ నాయకులు అనుక్షణం దేశం గూర్చే ఆలోచిస్తుంటారు, అనునిత్యం దేశప్రగతికై శ్రమిస్తుంటారు.. అందుకని!

భారత దేశం ఎంతో గొప్పదేశం. అందుకే ఇక్కడ దేశాన్ని సేవించుకొనుటకు తపన పడువారి సంఖ్య ఎక్కువ.. వారిలో వారికి పోటీతత్వమూ ఎక్కువే. ఒక మంచిపని చేయుటకు పోటీపడుతున్న ఇంతమంది నిస్వార్ధ రాజకీయ నాయకుల్ని చూస్తుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది.

మాతృభూమి సేవ కొరకై దేశస్థాయిలో పోటీ పడుతున్న నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు ధన్యజీవులు, వారికి నా ధన్యవాదాలు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, తద్వారా నావంటి అర్భకుడి జీవన స్థితిగతుల్ని పెంపొందించుటకై తహతహలాడుతున్న చంద్రబాబు నాయుడు, జగన్మోహన రెడ్డిల తపన, ఆత్రుత మిక్కిలి అభినందనీయం, వారికి నా నమస్కృతులు.

దేశాభివృద్ధికై నిరంతరాయంగా తీవ్రంగా పాటుపడుతున్న నాయకులందరికీ నమోన్నమః. అయ్యలారా! ఎందఱో మహానుభావులు, అందరికీ వందనములు. ఈ స్వార్ధపరుడు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలడు? మీరందరూ నా సేవకులే, కానీ - నాకున్నదేమో ఒక్కటే ఓటు, ఏమి నా దుస్థితి! 

(picture courtesy : Google)

6 comments:

  1. "నాకున్నదేమో ఒక్కటే ఓటు"

    చక్కగా బాలెట్ షీట్లు ఉండేవి. ఎంచక్కా అన్ని గుర్తుల మీద ముద్రేసి వారి నిస్వార్తసేవలకు ఉడతాభక్తిగా సమర్పించేవారము.

    ఇప్పుడు వచ్చిన ఎన్నికల యంత్రములో ఈ సదుపాయము లేదని తెల్సి మిక్కిలి దుఖం కలుగుతున్నది. ఒకరికి వోటు వేసిన యెడల అంతే నిస్వార్థముగా ప్రజాసేవ చేస్తున్న ఇతరులకు అన్యాయము. కావున అందరి దగ్గరా వారు నిస్వార్ధముగా ఇచ్చినవన్నీ పుచ్చుకొని (ద్రవపదార్ధములు అయినచో ఆరగించి) ఇంటిలో టీవీ (ICC/IPL) చూడడం ఉత్తమం.

    ReplyDelete
  2. నమో నమహ ....ఇన్నేళ్ళు ఓటేసి అలసిన ' చేతులు 'ఈసారీ కాస్త ఓపిక చేసుకుంటే వారికి సేవ చేసెస్ భాగ్యం ఇచ్చిన వారిమవుతాము

    ReplyDelete
  3. స్వార్దపరులంతా ఇప్పుడిప్పుడే నిస్వార్దపరులని అనుకరించ ప్రయత్నం చేయుచున్నారు. కానీ విపలం చెందుచున్నారు. ఈ విపలం కాస్త సపలమైతే కష్టించి నిస్వార్దుల కజాన నింపువారెవరూ? హతోస్మి!

    ReplyDelete
  4. బావుంది సర్ ..... :)

    ReplyDelete
  5. చాల చక్కగా రాసేరు....

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.