Wednesday, 7 May 2014

ఎన్నికల కత


అది దట్టమైన అడవి. ఆ అడవిలో మహావృక్షాలున్నయ్, అవి దయ్యాలు జుట్టు విరబోసుకున్నట్లుగా ఉన్నయ్. సెలయేళ్ళున్నయ్, అవి ఒంపులు తిరుగుతూ ప్రశాంతంగా, బద్దకంగా ప్రవహిస్తున్నయ్. ఆ పచ్చిక బయళ్ళు, ఆ లేత చెట్లు.. భూదేవి అప్పుడే ప్రసవించినట్లు తాజాగా ఉన్నాయి, అందంగా కూడా ఉన్నాయి. 

ఇప్పుడా అడవిలో కొన్నిగంటలుగా రెండు సింహాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది, నిప్పులవాన కురుస్తున్నట్లు భూమ్యాకాశాలు దద్దరిల్లిపోతున్నయ్. అది వాటిమధ్య ఆధిపత్య పోరాటం. సింహం అనగా సన్నని నడుము, అందమైన జూలు, ఠీవియైన నడక.. అంటూ కవులు రొమేంటిసైజ్ చేస్తారు గానీ, ప్రస్తుతం జరుగుతున్న ఆ పోరాటం చూసినట్లైతే - 'ఈ పోరాటం ప్రళయ భీకరమైనప్పటికీ అతి మనోహరం. వజ్రసమాన కాయంతో, ఉక్కు పంజాతో రెండు బంగారు కొండలు ఢీకొన్నట్లు, ఉత్తుంగ తరంగాల వలె పైకెగెసి పడినట్లు.. ' అని రాసుకుంటూ పొయ్యేవాళ్ళు కాదు. మరేం చేసేవాళ్ళు? పుస్తకం, కలం ఆక్కడే పడేసి పారిపొయ్యేవాళ్ళు.. అక్కడ వాతావరణం అంత భీభత్సంగా ఉంది!

ఆ పోరాడే సింహాలకి అనుచరులైన నక్కలు, తోడేళ్ళు కూడా రెండు జట్లుగా విడిపొయ్యి అరుచుకుంటున్నాయి, కరుచుకుంటున్నాయి. ఈ యుద్ధాన్ని వీక్షిస్తున్న కుందేళ్ళు, జంగు పిల్లులు, జింకలు, అడవి దున్నలు.. మొదట్లో భయపడ్డా, ఆ తరవాత వాటికి ఇదంతా వినోదంగా అనిపించింది. అంచేత - అవి చప్పట్లు కొడుతూ భలే ఎంజాయ్ చెయ్యడం మొదలెట్టాయి. ఏ సింహం గెలుస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నయ్, పందేలు కూడా కాసుకోసాగాయి. 

కొంతసేపటికి - ఆ యుద్ధం చాపకింద నీరులా ప్రేక్షక జంతువుల్లోకి కూడా పాకింది. కావున - అవి తమలో తాము చెరో సింహం పార్టీలుగా విడిపొయ్యి, గోలగోలగా అరుచుకోసాగాయ్. కొద్దిసేపటికి - కుందేళ్ళు, కుందేళ్ళతో, జింకలు జింకలతో, దున్నలు దున్నలతో కలబడుకోనారంభించాయ్. వాతావరణం సరదా సరదాగా ఉంది, హడావుడిగా ఉంది, అడవికేదో జబ్బు చేసి దారుణ దావానలంలో మండిపోతున్నట్లుగా కూడా ఉంది. 

మరి కొంతసేపటికి యుద్ధం ముగిసింది. ఓడిపోయిన సింహం తోక ముడుచుకుని పారిపోయింది, దాంతోపాటు ఓడిపోయిన పార్టీ తోడేళ్ళు, నక్కలు కూడా పారిపొయ్యాయి. వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. ఇప్పుడంతా పార్టీ మూడ్! కుందేళ్ళు, జింకలు, దున్నలు గెలిచిన ఆ సింహాన్ని భుజాల కెత్తుకుని 'హుర్రే' అంటూ ఆనందంతో ఊరేగాయి. జింకలు పులి డేన్స్ చేశాయి, దున్నలు డిస్కో డేన్స్ చేశాయి. ఊరేగింపు ముగిసింది. 

'ప్రియమైన అడవి వాసులారా! ఇక మీకు సెలవు.'

ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపొయ్యారు. 

అలుపు తీరిన కొద్దిసేపటికి సింహంకి ఆకలి దంచెయ్యసాగింది. సింహం పరివారానికీ ఆకలిగా ఉంది.. అవును మరి, అవి కూడా గెలిచిన ఆనందంలో డేన్సులు చేసి అలసిపోయ్యి ఉన్నాయి కదా! అంచేత - ఆ సింహం కొన్ని కుందేళ్ళని, జింకల్ని, దున్నల్ని పిలిపించుకుంది. 

ఆపై - సింహం, దాని బంధువర్గం ప్రేమగా, ప్రశాంతంగా వాటి పీక కొరికి.. ధారగా కారుతున్న చిక్కటి వెచ్చని రక్తాన్ని స్కాచ్ విస్కీలాగా చప్పరిస్తూ తాగేశాయి. ఆ తరవాత - నిదానంగా మాంసాన్ని పీక్కు తిననారంభించాయి. అవి తినంగా మిగిలిన మాంసాన్ని తోడేళ్ళు, నక్కలు హడావుడిగా మింగసాగాయి. 

చచ్చి గుట్టగా పడున్న ఆ జంతువుల్లో ఓ జింకపిల్ల కొనఊపిరితో ఉంది, అది భారంగా డొక్క లెగరేస్తూ ఆయాసపడుతూ సన్నగా ఊపిరి పీలుస్తుంది. అయితే ఆ జింక పిల్ల బాధతో గిలగిల్లాడకుండా, వెక్కివెక్కి ఏడుస్తుంది!

ఒక దున్న లెగ్ పీసుని ఇష్టంగా పీక్కుతింటున్న సింహానికి జింకపిల్ల ఏడుపు ఆశ్చర్యంగా అనిపించింది. 

'జింకోత్తమా! ఏల ఈ ఏడుపు?' అని ఆసక్తిగా ప్రశ్నించింది. 

అంతట ఆ జింక పిల్ల వెక్కుతూనే ఇలా అంది.

"మృగరాజా! ఇవ్వాళంతా నీ గెలుపు కోసం నేనెంతగానో కృషి చేశాను, పరితపించాను. నీ కోసం నా తోటి జింకల్తో గొడవపడ్డాను. ఇప్పుడు నన్నీ విధంగా చంపి తింటున్నావు, ఇది నీకు న్యాయం కాదు." అంది. 

సింహానికి జింక పిల్ల యెడల జాలి కలిగింది.

"మిత్రమా! నీ ప్రశ్నకి సమాధానం చెబ్తా విను. నాది సింహం జన్మ. లంచ్ అండ్ డిన్నర్ కోసం అడవిలో జంతువుల్ని భోంచెయ్యడం మాజాతికి జన్మతో వచ్చిన హక్కు, అలాగే - మాకు ఫుడ్డుగా మారడం మీ జాతి డ్యూటీ. మనకీ విధులన్నీ నిన్నూ, నన్నూ పుట్టించిన ఆ దేవుడే ఇచ్చాడు, దీన్నే ప్రకృతి ధర్మం అని కూడా అంటారు. నీవు నీ జీవించే హక్కు గూర్చి ఎంతైనా వాదించు, ఒప్పుకుంటాను - అందులో బోల్డంత లాజిక్ ఉండొచ్చు, న్యాయం కూడా ఉండొచ్చు. కానీ - న్యాయం వేరు, ధర్మం వేరు. నేను నిన్ను చంపడం అన్యాయం అవ్వొచ్చు, కానీ - అధర్మం కాదు." అంది సింహం.

జింకపిల్లకి నోరెండిపోతుంది, భరింపలేని బాధతో మెదడు మొద్దుబారింది. నోరు పెగుల్చుకుని, మాట కూడగట్టుకుంటూ, నెమ్మదిగా అడిగింది.

"నేను.. నేను.. నీ అభిమానిని."

"అవును, ఆ విషయం నాకు తెలుసు. కానీ మైడియర్ మిత్రమా! ఇవ్వాళ జరిగిందంతా మా సింహాల మధ్య ఆధిపత్య పోరు. అనగా మిమ్మల్ని భక్షించే హక్కు కోసం జరిగిన పోరు. అసలు మా యుద్ధంతో నీలాంటి అర్భక ప్రాణులకేం పని!? మా పోటీ మీకు న్యాయం జరగడానిక్కాదు, మీ మంచికీ కాదు. అంచేత - మాలో ఎవరు గెలిచినా మీకు ఒరిగేదేమీ ఉండదు. మీరు మా చేత చంపబడటానికే పుట్టారు. ఆ సూక్ష్మాన్ని గ్రహింపలేని నువ్వు, నీ స్నేహితులు బుద్ధిహీనులై, అమాయకంగా మా పోరాటంలో దూరారు, అందుకు నీకు నా సానుభూతి తెలియజేస్తున్నాను."

జింకపిల్లకి మగత కమ్ముకొస్తుంది, కళ్ళు మూత పడుతున్నయ్. దానికి తన కుటుంబం, ఎత్తుగా ఒత్తుగా పచ్చని గడ్డితో కళకళలాడే తన ఇల్లు, ఇంటి పక్కగా గలగలా పారే సెలయేరూ.. తను, తన చెల్లెళ్ళు పోటీ పడుతూ అమ్మ పొదుగులోంచి పాలు తాగుతున్న దృశ్యం.. ఆ సమయంలో అమ్మ ప్రేమగా తమ శరీరాల్ని ప్రేమగా నాకుతూ 'నా చిట్టిపొట్టి కన్నలారా! నా పొదుగులో పాలన్నీ మీకోసమే, హాయిగా కడుపు నిండా తాగండి నాన్నా!' అని మృదువుగా, లాలనగా చెప్పిన దృశ్యం.. అప్పుడు తను - 'భగవంతుడు ఎంతటి దయామయుడు! సృష్టిలోని ఆనందాన్నంతా మూటగట్టి మా ఇంట్లోనే ఉంచాడు' అని సంతసించిన వైనం జ్ఞాపకం వచ్చాయి. ఇంతలో - దూరంగా కళ్ళు జిగేల్మనే పెద్ద వెలుగు! ఏవిటా వెలుగు? దేవుడా? దేవుడే అయ్యుంటాడు. 

'హే భగవాన్! నాకు తెలిసి నేనే తప్పూ చెయ్యలేదు, తెలీక చేసిన తప్పుల్ని క్షమించు తండ్రీ! మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను జింకగా మాత్రం పుట్టించకు." అంటూ దేవుణ్ని ప్రార్ధించింది జింకపిల్ల. 

ఇంతలో సింహం జింకపిల్ల చెవులో నెమ్మదిగా చెప్పింది.

"మిత్రమా! ఒకేఒక్క క్షణం.. కొంచెం నొప్పిగా ఉంటుంది.. ఓర్చుకో.. అయామ్ సారీ!" అంటూ జింకపిల్ల మెడని పూర్తిగా కోరికేసింది. అంతట ఆ జింకపిల్ల విగతజీవియై తల వేళ్ళాడేసింది.

ఉపసంహారం :

క్రమేపి అడవులు, అడవిలో జీవులూ అంతరించి పోసాగాయి. ప్రకృతి ధర్మాన్ని కాపాడటం దేవుని డ్యూటీ. అంచేత జనారణ్యంలో కూడా సింహాల్ని, అవి దోచుకుందుకు (వేట నిషేధింపబడిన కారణాన) అర్భక ప్రాణుల్ని కూడా ఆ దేవదేవుడు సృష్టించాడు, గాడీజ్ గ్రేట్!

ముగింపు :

ఇవ్వాళ ఆధిపత్యం కోసం సింహాలు యుద్ధం చేసుకుంటున్న రోజు.. దీన్నే ఎన్నికల రోజు అని కూడా అంటారు!

అంకితం :

నాకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ - రావిశాస్త్రి దేవుడేమోననే అనుమానం మాత్రం ఉంది. అట్టి రావిశాస్త్రి పాదపద్మములకి.. 

(picture courtesy : Google)

21 comments:

  1. Excellent post.

    I think your best post.

    ReplyDelete
  2. Execellent one sir ........... Adavi lo dharmam aena undhi......... Mana samjam lo adhi kuda thaggi pothundhi sir....

    ReplyDelete
  3. Raavi saastrini chadavakkarledu, ilaanti manchi manchi tapaalu meeru vraaste :)

    ReplyDelete
  4. కామెంట్లు రాసిన మిత్రులకి ధన్యవాదాలు.

    రావిశాస్త్రి రాసిన ద్వైతాద్వైతం, పిపీలికం, సృష్టిలో.. మొదలైన కథలు నాకు బోల్దెంత ఇష్టం.. ఆ ఛాయలు ఈ పోస్టులో కనబడతాయి.

    ఈ పోస్ట్ ఐడియా నాదే గానీ.. స్టైల్ మాత్రం రావిశాస్త్రికి కాపీలా అనిపిస్తుంది (ఈ విషయం రాస్తున్నప్పుడు నేను కూడా గమనించలేదు). ఒక రచయితని మరీ ఎక్కువ అభిమానిస్తే (ఆరాధిస్తే) వచ్చే side effect ఇది.

    నేను ఇవ్వాల్టి ఎన్నికల సందర్భంగా (ఒక పోస్టుగా) చెప్పదలచుకున్న విషయాన్ని అర్ధరాత్రి హడావుడిగా రాసిన ఫలితం ఇది (ఇదే పాయింటుని ఇంకోరకంగా రాయొచ్చు గాని.. అందుకు బోల్డంత ఆలోచించాలి, నాకంత టైం / ఓపిక లేవు).

    ఈ వివరణ ఎందుకంటే.. నేను రావిశాస్త్రి మాయలోంచి బయటకి రాలేకపోతున్నాను. ఆ విషయం మీకు మనవి చేసుకుంటే.. నన్ను 'కాపీరాయుడు' అనుకోకుండా ఉంటారనే ఆశ. అందుకోసం, అంతే!

    (ఆ గిల్ట్ వల్లనే పోస్టుని రావిశాస్త్రికి అంకితం చేశాను.)

    ReplyDelete
  5. Excellent Post రమణ గారు.
    ఈ క్రూరుల పీడ విరగడయ్యే రోజు ఎప్పుడొస్తుందో???

    ReplyDelete
    Replies
    1. ఆ రోజు తప్పకుండా వస్తుంది.

      కొన్ని హోటళ్ళలో 'అప్పు రేపు' అని రాస్తారు. ఈ 'ఆ రోజు' కూడా అంతే.:)

      Delete
  6. మా రావి శాస్త్రి మళ్ళీపుట్టాడు. సార్‌ మీకేమైన అభ్యంతరమా? రావి శాస్త్రి గారిని మీలో చూసుకొని మేం మురుసిపోకూడదా? ఇలాంటి పంచతంత్రకధను చదివినందుకు మేము ఎంత అదృష్ట వంతులమో! ఈ ఆధునిక పంచతంత్రాన్ని లేదా పిపీలికాన్ని అందించినందుకు ధన్యవాదాలుచెప్పుకోకుండ ఉండలేము.

    ReplyDelete
    Replies
    1. నాకస్సలు అభ్యంతరం లేదు. రావిశాస్త్రి అభిమానులనంతా నా ఆత్మబంధువులే.

      Delete
  7. Excellent Post
    ఇది ఒక వలయం. కుందేళ్ళు, జింకలు ఒక్కటయ్యేవరకు సింహాల మద్య యుద్దంలో అవి నలిగిపోక తప్పదు.
    Manohar.

    ReplyDelete
  8. chaala baagundi, keep it up.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! ప్రస్తుతానికి బ్లాగుని బాగానే కీప్ చేస్తున్నాను. :)

      Delete
  9. Replies
    1. కొంపదీసి కేసవదు కదా!

      Delete
  10. గిల్టీ ఫీలింగు ఒకొక్కసారి మంచి పనులు కూడ చేయిస్తుందన్నమాట!

    ReplyDelete
  11. The Best of all your posts.

    ReplyDelete
  12. //మైడియర్ మిత్రమా! ఇవ్వాళ జరిగిందంతా మా సింహాల మధ్య ఆధిపత్య పోరు. అనగా మిమ్మల్ని భక్షించే హక్కు కోసం జరిగిన పోరు. అసలు మా యుద్ధంతో నీలాంటి అర్భక ప్రాణులకేం పని!? మా పోటీ మీకు న్యాయం జరగడానిక్కాదు, మీ మంచికీ కాదు. అంచేత - మాలో ఎవరు గెలిచినా మీకు ఒరిగేదేమీ ఉండదు. మీరు మా చేత చంపబడటానికే పుట్టారు. ఆ సూక్ష్మాన్ని గ్రహింపలేని నువ్వు, నీ స్నేహితులు బుద్ధిహీనులై, అమాయకంగా మా పోరాటంలో దూరారు, అందుకు నీకు నా సానుభూతి తెలియజేస్తున్నాను//

    ఇది అద్భుతం. ఈ మధ్య మీకు బాగా రాసే లక్షణం బాగా పెరిగిపోయింది. భూషణాలు ధరించి పీఠాలెక్కిన సాహితీ వైద్యుల్ని సంప్రదించాలేమో కాస్త గమనించుకోండి.

    ReplyDelete
    Replies
    1. >>భూషణాలు ధరించి పీఠాలెక్కిన సాహితీ వైద్యుల్ని సంప్రదించాలేమో కాస్త గమనించుకోండి.<<

      అమ్మో! నాకు వీళ్ళంటే భయం. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.