Thursday 22 May 2014

అభివృద్ధి


"ఓయ్ రైతులూ! ఇక్కడ అణు విద్యుత్తు కేంద్రం కడుతున్నాం. అర్జంటుగా మీరు పొలాలు ఖాళీ చెయ్యండి, మీకు నష్టపరిహారం భారీగా వచ్చేలా ఏర్పాటు చేస్తాలే!"

"ఓయ్ కొండజాతి మనుషులూ! మీ కొండల్లో వున్న ఖరీదైన ఖనిజం తవ్వుకోడానికి ఓ కార్పొరేట్ కంపెనీకి అనుమతిచ్చాం. అర్జంటుగా మీరు కొండలు ఖాళీ చెయ్యాలి, మీకు నష్టపరిహారం భారీగా వచ్చేలా ఏర్పాటు చేస్తాలే!"

"ఓయ్ జాలర్లూ! ఇక్కడ షిప్ యార్డు కడుతున్నాం. అర్జంటుగా మీరు సముద్రం ఖాళీ చెయ్యాలి, మీకు నష్టపరిహారం భారీగా వచ్చేలా ఏర్పాటు చేస్తాలే!"

"ఏంటీ? మీ భూములు వదులుకోరా? కొడకల్లారా! 'ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కాండిరా బాబూ!' అని మర్యాదగా చెబ్తే మీకు అర్ధం కాదురా? ఇదే చైనాలో అయితే మిమ్మల్ని పిట్టల్లా కాల్చిపారేసేవాళ్ళు, పీడా వదిలిపొయ్యేది." నాయకుడుగారు కోపగించుకున్నారు. 

"అయ్యా! నేను టౌను ప్లానింగ్ ఆఫీసర్ని. మీరు మీ ఇంటిముందున్న కార్పోరేషన్ స్థలాన్ని కూడా ఆక్రమించేశారు, అంచేత - రోడ్డు ఇరుకైపొయ్యింది. సిటీ అభివృద్ధి కోసం మీ ప్రహరీ గోడని ఓ మూడంగుళాలు వెనక్కి జరుపుకుంటే ప్రజలకి ఇబ్బంది ఉండదు."

"ఎలా కుదుర్తుంది? కుదర్దు. నా గోడ వెనక్కి జరిపి నువ్వు జరిపే బోడి అభివృద్ధి నాకక్కర్లేదు. నువ్వు నా మూడంగుళాల్లో ఆనకట్టే కడతావో, విమానాశ్రయమే తెప్పిస్తావో నాకనవసరం. నా గోడ మాత్రం అంగుళం కూడా వెనక్కి జరగదు, ఏం పీక్కుంటావో పీక్కో. ఓయ్ ఆఫీసరూ! నా సంగతి నీకింకా తెలీదు, ఒక్క ఫోను కొట్టానంటే సస్పెండైపోగలవు. జాగ్రత్త!" నాయకుడుగారు మళ్ళీ కోపగించుకున్నారు. 

(photo courtesy : Google)

1 comment:

  1. రేపు రానున్నది రాక మానదు..కానున్నది కాకమానదు.
    మళ్ళీ అలజడులు, అల్లర్లు, ఉద్యమాలు, కాల్పులు!
    మళ్ళీ శవ రాజకీయం, మళ్ళీ డబ్బు వెదజల్లడం. అదేమిటంటే కరుసయ్యింది గందా అని అనడం.
    తినని వోడ్ని ఒక్కడ్ని సూపించు అనడం మళ్ళీ ఆ గాడిదలకే ఓటు వెయ్యడం!
    ఎప్పుడు అభివృద్ధికి చేరుకుంటుందో ఈ రాష్ట్రం?!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.