అతనంటే నాకిష్టం లేదు. అతన్ని చూసినప్పుడల్లా భగభగ మండే ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తున్నంత మంటగా వుంటుంది. అతనంటే నాకు ఈర్ష్య. అతన్నాపక్కనుంటే, నాకు - పులి పక్కన వినయంగా నడుస్తున్న దొంగపిల్లిలా, మంత్రిగారికి ఒంగొంగి నమస్కారాలు పెడుతున్న అవినీతి ఆఫీసర్లా, ఎస్పీ దొరగారికి సెల్యూట్ చేస్తున్న సస్పెండైన ఎస్సైలాగా, అమెరికా సూటు బాబు పక్కన సిగ్గుతో చితికిపోతూ నించున్న ఆఫ్రికా గోచిగాళ్ళా చిన్నతనంగా వుంటుంది.
నాకెందుకీ ఇన్ఫీరియారిటీ ఫీలింగు? అతను నాకన్నా ఎక్కువ చదువుకున్నాడా? లేదు బాబు లేదు, చదువులో నేనే చాలా ఎక్కువ. నాకన్నా ధనవంతుడా? కాదండీ కాదు, డబ్బు విషయంలో మా ఇద్దరి మధ్యా భూమ్యాకాశాలకున్నంత తేడా ఉంది. మరి - నాకన్నా పైస్థాయిలో ఉన్నాడా? కాదు.. కాదా? లేదు.. లేదా? ఏమో! ఈ సందేహమే నన్ను అసంతృప్తికి లోను చేస్తుంది.
అతను నా బాల్యస్నేహితుడు, ఇద్దరం ఒకే స్కూలు, ఒకే వీధి. ఆ వీధిలోకెల్లా మా ఇల్లే పెద్ద భవంతి, ఆ వీధిలోకెల్లా అతన్దే చిన్న కొంప. అతని కన్నా నేను పొడుగ్గా, బలంగా వుంటాను. నా తండ్రికి చాలా పోలాలున్నాయ్, స్థలాలున్నాయ్. అతని తండ్రికి చిన్న ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదు. ఆయన అస్తమానం దగ్గుతూ, మూలుగుతూ ఉండేవాడు. నీరసంగా కూడా ఉండేవాడు.. ఆయనకేదో జబ్బుట!
స్కూలు లేనప్పుడు విశాలమైన మా ఇంట్లో ఆడుకునే వాళ్ళం. అతను బిడియస్తుడు, మెతక మనిషి. నాకిష్టమైన ఆట, నేను ఆడమన్నంతసేపు (నేను గెలిచే విధంగా) ఆడేవాడు. అతను మా భవంతిని కలలో కనబడే ఇంద్రభవనంలా ఆశ్చర్యంగా చూసేవాడు. మా ఇంట్లో కయ్యిమంటూ మోగే మర్ఫీ రేడియో చూసి ఆనందపడ్డాడు. భొయ్యిమని చల్లగాలి వెదజల్లే ఎయిర్ కూలర్ చూసి ముచ్చటపడ్డాడు. ఫోన్ 'ట్రింగ్ ట్రింగ్' మన్నప్పుడు సంబరపడ్డాడు. పూజామందిరంలో ఉన్న నిలువెత్తు కృష్ణుడి విగ్రహం చూసి భక్తిభావంతో నిల్చుండిపొయ్యాడు.
అతను చదువులో నాకన్నా చాలా ముందంజలో ఉంటాడు. పెద్దగా చదివినట్లుగా ఉండేవాడు కాదు. వీధి పంపులోంచి బిందెతో నీళ్ళు పట్టి మోసుకు రావడం, బట్టలుతకడంలో తల్లికి సాయం చెయ్యడం లాంటి ఇంటి పన్లు చాలా చేస్తుండేవాడు. కానీ పరీక్షల్లో మార్కులు మాత్రం విపరీతంగా వచ్చేవి. అతని మార్కుల దరిదాపుల్లోకి వెళ్దామని చాలాసార్లు ప్రయత్నించా.. లాభం లేకపోయింది. అతనికన్నీ స్కూల్ ఫస్ట్ మార్కులే. నేను కష్టపడి ఒక్కో మార్కు సంపాదిస్తే, అతను అలవోకగా పుంజీడు మార్కులు తెచ్చేసుకునేవాడు. ఎలా సాధ్యం!
అతను మంచివాడు, ఈర్ష్యాసూయలు లేశమాత్రమైనా లేనివాడు. నాకు పాఠాలు అర్ధమయ్యేలా చక్కగా వివరించేవాడు. ఆ రకంగా అతన్నుండి చాలా లబ్ది పొందాను. కానీ మనసులో ఎక్కడో అశాంతి, కుళ్ళు. సందేహం లేదు - అతను నాకన్నా తెలివైనవాడు. ఒక్క చదువు విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేనే ఎక్కువ. ఇదే నాకు చాలా అసంతృప్తిగా ఉండేది. దేవుడు నా డబ్బు, ఇల్లు.. అన్నీ అతనికే ఇచ్చేసి, అతని తెలివితేటలు నాకిస్తే ఎంత బాగుణ్ణు!
మన్చేతిలో ఏదీ ఉండదు. అరిచేత్తో సూర్యకాంతిని ఆపలేం, నదీప్రవాహాన్నీ ఆపలేం. జనన మరణాలు ఆగవు, అన్యాయాలు ఆగవు, మానభంగాలు ఆగవు, రాజకీయ నాయకుల అవినీతి ఆగదు. కానీ - చదువు మాత్రం ఆగిపోతుంది. ఈ విషయం నాకతని తండ్రి మరణంతో అర్ధమైంది. కుటుంబ పోషణ కోసం అతను అర్ధాంతరంగా చదువాపేసి ఏదో అణాకానీ ఉద్యోగంలో చేరాడు. ఆ తరవాత నాకతని గూర్చి పట్టించుకునే తీరిక లేకపోయింది.
నా చదువు చక్కగా 'కొన'సాగింది. మేం ధనవంతులం కాబట్టి డొనేషన్ల సాయంతో ఉన్నత చదువులకి గోడ మీద బల్లిలా సునాయాసంగా ఎగబాకాను. నా ఉన్నత చదువులకి, ఉన్నత సిఫార్సు కూడా జతవడం చేత, ఉన్నత ఉద్యోగం కూడా వచ్చింది. ఇన్ని ఉన్నతమైన అర్హతలున్నందున, ఉన్నతమైన కుటుంబం నుండి ఉన్నతమైన ఆస్తిపాస్తుల్తో భార్య కూడా వచ్చి చేరింది.
ఇప్పుడు నాకేం తక్కువ? ఏదీ తక్కువ కాదు, అన్నీ ఎక్కువే! పెద్ద కంపెనీలో పెద్ద కొలువు, తెల్లటి మొహం మీద ఎర్రటి లిప్స్టిక్ తో అందమైన భార్య, కాంప్లాన్ బాయిల్లాగా ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఆడుకోడానికి రెండు బొచ్చు కుక్కలు. మూడు కార్లు, నాలుగైదు బిల్డింగులు, బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబళ్ళు, ఏడాదికి రెండు ఫారిన్ ట్రిప్పులు, పెద్దపెద్దవాళ్ళ స్నేహాలు.. నా జీవితం వడ్డించిన విస్తరి.. కాదు కాదు.. బంగారు పళ్ళెంలో పోసిన వజ్రాల రాశి. కానీ - అతను నాకు గుర్తొస్తూనే ఉంటాడు. అతని జ్ఞాపకాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.
ఈమధ్య ముఖ్యమైన పనుండి చాలారోజుల తరవాత మా ఊరికెళ్లాను. అతన్ని చూడ్డం కూడా ఒక ముఖ్యమైన ఎజెండాగా పెట్టుకునే ఊరికెళ్ళాను. అంచేత - వెళ్ళిన పనవ్వంగాన్లే వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్లాను. ఊరికి మూలగా ఉన్న ఏరియాలో చిన్న సందులో అద్దెకుంటున్నాడు. ఇంతకీ నే వెళ్తుంది అతన్ని పలకరిద్దామనా? కాదు. నన్ను తొలిచేస్తున్న అసంతృప్తి భావన కొంతైనా తగ్గుతుందేమోననే ఆశతో వెళ్తున్నాను.
ఆ వీధి ఇరుగ్గా వుంది, మురిగ్గా కూడా వుంది. అమెరికా వాడి అప్పు కోసం ఇండియా వాడు షో కేస్ చేసే దరిద్రపుగొట్టు వీధిలా ఉంది. అంతర్జాతీయ అవార్డు కోసం ఆర్ట్ సినిమాల డైరక్టర్ వేసిన అందమైన పేదవాడి వీధిలా కూడా వుంది. నా లక్జరీ కారు ఆ ఇరుకు వీధిని ముప్పాతిక భాగం ఆక్రమించింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఖరీదైన కారుని అందమైన దయ్యప్పిల్లని చూసినట్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అది రెండు గదుల పెంకుటిల్లు. రోడ్డు వైపుకు ఓ చిన్న గది, లోపలవైపుగా ఇంకో చిన్న గది. ఆ ఇంటి గోడల వయసు షుమారు వందేళ్ళుండొచ్చు, ఆ గోడలకి సున్నం వేసి ఓ తొంభైయ్యేళ్ళు అయ్యుండొచ్చు. కింద నాపరాళ్ళ ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా అసహ్యంగా ఉంది. ఆ మూల దండెం మీద నలిగిన, మాసిన బట్టలు పడేసి ఉన్నాయి. ఆ గదిలో రెండు పాత ఇనప కుర్చీలున్నాయి, మూలగా ఒక చాప. అంతే! ఇంకే ఫర్నిచరూ లేదు. ఈ కొంప కన్నా ఆ వీధే కొద్దిగా అందంగా, రిచ్చిగా ఉంది!
ఒక కుర్చీలో ఎవరో పెద్దాయన కూర్చునున్నాడు. పాత కళ్ళజోడూ, మాసిన గడ్డం, నెత్తిన నాలుగు తెల్ల వెంట్రుకలు.. దరిద్రంలో, వార్ధక్యంలో ఆ గదికి అతికినట్లు సరిపోయ్యాడు. ఆయన బక్కగా ఉన్నాడు, ముందుకు ఒంగిపోయున్నాడు. పొట్ట లోపలకి, బాగా లోపలకి పోయుంది. బహుశా ఎప్పుడో ఏదో జబ్బు చేస్తే పొట్ట కోసి పేగులన్నీ తీసేసి పొట్టని మళ్ళీ కుట్టినట్లుంది. వాలకం చూస్తుంటే చాలాకాలంగా ఈ ప్రపంచాన్ని పట్టించుకోటం మానేసినట్లుగా ఉంది.
ఆయన.. ఆయన కాదు.. అతను! నా స్నేహితుడు! నా తోటివాడు గదా! ఇలా అయిపొయ్యాడేంటి! నా అలికిడి విని నిదానంగా తలెత్తి నావైపు చూశాడు. కొద్దిసేపటికి నన్ను ఫలానా అని పోల్చుకున్నాడు. 'కూర్చోండి' అంటూ మర్యాద చేశాడు. కూర్చున్నాను. అతని చూపులో, మాటలో జీవం లేదు. నెమ్మదిగా, అతి చిన్నగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు మాట్లాడాక అతని వివరాలు తెలిశాయి.
తండ్రి చనిపొయేప్పటికి అప్పులు తప్పితే ఆస్తులేమి లేవు. జీతంతోనే అప్పుల్ని నిదానంగా తీర్చసాగాడు, అప్పులకి మళ్ళీ అప్పులు చేసి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళి చేశాడు. కొన్నాళ్ళకి తల్లి కూడా చనిపోయింది. అతనికి జీతం తప్ప వేరే ఆధారం లేదు, దరిద్రం తప్ప వేరే సంతోషాల్లేవు. అతని జీతం అప్పుల మాయం, జీవితం దుఃఖమయం. అంచేత భార్య కూడా అతన్ని అతని దరిద్రానికే వదిలేసి కొడుకుతో సహా పుట్టింటికెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక్కడే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాట్ట. నాకెందుకో అతను జీవిస్తున్నవాళ్ళా కాకుండా, చావు కోసం ఎదురు చూస్తున్నవాళ్ళా అనిపించాడు.
నాలో అసంతృప్తి మరింతగా పెరిగిపోతుంది. వెతుక్కుంటూ వచ్చి మరీ ఇరుక్కుపొయ్యాను. సందేహిస్తూ అడిగాను.. 'ఇప్పుడు నేను ఏ సహాయమైనా సరే! చెయ్యగల స్థాయిలో ఉన్నాను, ఏదైనా సహాయం కావాలా?' అని. అతనొక క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు. చిన్నప్పుడు నాకర్ధం కాని పాఠాలు చెప్పేప్పుడు కూడా నన్నలాగే చూసేవాడు. నాకెందుకో సిగ్గుగా అనిపించి తల దించుకున్నాను. అతనేమీ మాట్లాడలేదు, కానీ - అతనికి జీవితం పట్ల పెద్ద ఆసక్తి లేదని గ్రహించాను. ఆ గదిలో ఆ డొక్కు కుర్చీలకి, అతనికి పెద్ద తేడా లేదు. ఇక అక్కడ ఉండటం అనవసరం అనిపించి లేచి బయటకి వచ్చేశాను.
కారు డ్రైవర్ హడావుడిగా కారు వెనుక తలుపు తీసి వినయంగా నించున్నాడు, నిట్టూరుస్తూ కార్లో కూలబడ్డాను. ఇప్పుడు నాలో అసంతృప్తి ఇంకొంచెం ఎక్కువైంది. నాది కాని రాజ్యంలో ముసలి రాజుని చంపి ఆ సింహాసనంపై అక్రమంగా కూర్చున్న కుట్రదారుగా.. సింహం తినగా మిగిలిన వేటలో ఎముకలు ఏరుకునే నక్కలాగా.. ఆకలితో ఏడుస్తున్న పాపడి పాలు తాగేస్తున్న దొంగలాగా.. యాజమాన్యంతో కుమ్ముక్కై కార్మికుల పొట్టగొట్టిన కార్మిక నాయకుళ్ళాగా.. తీవ్రమైన అసంతృప్తి.
నాకు అతనిపై కోపం వచ్చింది. అతనితో యుద్ధం కడదాకా చేస్తే గెలుపోటములు తెలిసొచ్చేవి. కానీ - అతని దురదృష్టం అతని చేత మధ్యలోనే కాడి పడేసేట్లు చేసింది. యుద్ధం చేసి శత్రువుని ఓడిస్తేనే మజా, కానీ - ఈలోపే శత్రువుకి ఏదో రోగమొచ్చి చస్తే మనం గెలిచిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది?
లేదు.. లేదు.. జీవితంలో గెలుపోటములు నిర్ణయించేది చదువు, తెలివితేటలే కాదు.. అదృష్టం, అవకాశాలు కూడా. అక్కరకు రాని తెలివి అడవి గాచిన వెన్నెల వంటిది. నేను అనవసరంగా అసంతృప్తికి లోనవుతున్నాను. నేనిలా ఫీలవ్వడం నాలోని మంచితనానికి మాత్రమే నిదర్శనం. నన్ను ఇబ్బంది పెడుతున్న నా సున్నితత్వాన్ని, మంచితనాన్ని తగ్గించుకోవాలి.
ఇలా నన్ను నేను సర్ది చెప్పుకునే ప్రయత్నంలో ఏదోక రోజు నేను విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ - ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!
(picture courtesy : Google)
అతను నా కాళ్ళపైబడి నాకు ఏదైనా సహాయం చేయమని అడిగితే కానీ నా అసంతృప్తి చల్లారదు.(ఇక్కడ "నా" అంటే మీరు స్వగతములో రాసిన "నా")
ReplyDeleteఇలాంటి వ్యక్తులు మనకు జీవితములో అక్కడక్కడ తారస పడుతుంటారు. ఇతరులు తమపై ఆధారపడి ఉండాలని తమను ప్రతీ విషయములో సలహాలు/ సహాయం కోరాలని, తమదే ఎప్పుడూ పైచేయిగా ఉండాలని వారి ఆలోచనలు ఉంటాయి. అందుకు విరుద్దంగా స్నేహితుడు తన సహాయం కోరకుండా అభివృద్దిలోకి వచ్చినా వారు తట్టుకోలేరు. ఒకవేళ స్నేహితుడు ఎవరైనా దీనమైన స్థితిలో ఉంటే దానికి కారణం తమ సలహాలు తీసుకోక పోవడమేనని వారు భావిస్తారు. వీరిని గురించి డాక్టరుగారే వివరించాలి.
మనోహర్
వివరించడానికేముందండి? ఏమీ లేదు, మీకు ఎలా అర్ధమైతే అలాగే! :)
DeleteKadha baga vundi kani ekkodo chadivaa evaro peddaya racharu ee kadha kadu eelamti kadha
ReplyDeleteఅవునా!
Deleteనాకు కథలు రాయడానికి కావల్సిన basic qualification లేదు.(రాసేవాడు చచ్చినట్లు ఇతరుల కథలు చదవాలి. గత పాతికేళ్ళలో నేను పది కథలు కూడా చదవలేదు, ఇకముందు చదివే అవకాశం కూడా లేదు.) అందువల్ల నా రాతలు ఎక్కడో చదివినట్లు అనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.
నాకున్న సమయాన్ని బట్టి ఇలా sketch లాగా ఏవో నాలుగు పేరాగ్రాఫులు కెలుకుతుంటాను. అయినా - ఇదేమంత విషయమని! ఈ టాపిక్ ఎవరో, ఎక్కడో (కనీసం వందమంది) రాసే ఉంటారు.
ఈ రాతలన్నీ కేవలం 'పని లేక.. ' రాసేవి, పట్టించుకోకండి. :)
రమణ గారు,
ReplyDeleteమనసు తన survival కొసం ఎదొ ఒక logic వెతుక్కొని , మనలను మనం positive గా చూసుకోవడానికి దొహదం చేస్తుంది(irrespective of reality). అలా మనసు చెయ్యలెనప్పుడే మీకు customers దొరుకుతారు.
"యుద్ధం చేసి శత్రువుని ఓడిస్తేనే మజా, కానీ - ఈలోపే శత్రువుకి ఏదో రోగమొచ్చి చస్తే మనం గెలిచిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది?"
యుద్ధం చెసినా శత్రువుని ఓడించలేనని చిన్నప్పుడే తెలిసే ఈ బాధ. (to the character).
//ఇలా నన్ను నేను సర్ది చెప్పుకునే ప్రయత్నంలో ఏదోక రోజు నేను విజయం సాధిస్తానని నాకు తెలుసు.. కానీ - ఆ రోజేదో త్వరగా వచ్చేస్తే బాగుణ్ణు!//
ReplyDeleteఅయితే మీరు గెలవలేదా? గెలిచినట్లు తెగ పోజులు పెట్టారు.
కానీ ఈపోష్టు రాసి మీరు గెలిచారు.
చాలా నాచురల్ , ఎవరికి వారయ్యాక ఒకరి అవసరం ఒకరికి ఉండదు. అయినా 'దూరపు కొండలు' లా ఇద్దరికీ అవతల వారిలో అసూయ కలిగించేవే అవపడతాయి . అర్ధం అవడానికి చాన్నాళ్ళు పట్టింది :)
ReplyDeleteఇది పనిలేక రాసినదైనా, ఈమాట, కౌముది లాంటి పత్రికలకి పంపించవచ్చు. తప్పకుండా "పస" ఉన్న కధే. :-)
ReplyDeleteథాంక్యూ.
Deleteరాత్రిళ్ళు రాసేసి పొద్దున్నకల్లా పబ్లిష్ చేసెయ్యడం, వచ్చే కామెంట్లు చూసుకోవడం అలవాటైపోయింది.. నచ్చితే మెచ్చుకుంటారు, నచ్చకపొతే తిడతారు. ఇది నాకు బానే వుంది.
ఒకప్పుడు ఒక వార్తాపత్రిక్కి కొన్ని సందర్భాల్లో వ్యాసాలు పంపాను, వాళ్ళు వీలును బట్టి వాటిని ప్రచురించారు. కానీ - నాకు inform చేసే కనీస బాధ్యత వారు తీసుకోలేదు. నాకు తెలుగు పత్రికలు చదివే అలవాటు లేదు కనుక, ఎవరైనా చెబ్తేగాని, నా వ్యాసం పబ్లిష్ అయిందని తెలీటల్లేదు. కాబట్టి, నేను చదవని పత్రికలకి రచనలు పంపడం కరెక్టు కాదనిపించి - మానేశాను.
ఒక పత్రిక ఆదివారం అనుబంధంలో చెప్పకుండా నా పోస్టులు కొన్ని పబ్లిష్ చేసుకుంది, నేను అభ్యంతరపెట్టాను (ఇప్పుడు నాజోలికి రావడం మానేశారు).
చాలామంది బ్లాగుల్లోంచి పత్రికలకి రాయడం ప్రమోషన్ గా భావిస్తారు, నేనలా అనుకోవడం లేదు.
నా ఇంకో సమస్య, మీరు చెప్పిన పేర్లతో పత్రికలు ఉన్నాయని నా దృష్టికి రాలేదు, అది నా తప్పే. నాకు తెలుగు పత్రికలు చదివే అలవాటు లేదు, ఇకముందు చదివే ఉద్దేశం కూడా లేదు.
పస ఉన్న కధైతే మాత్రం కాదు. మీరు రాసిన విషయం నచ్చింది. పత్రికల్లో అచ్చు అయ్యే స్థాయి కధ కాదంటాను.
Delete"నాకు తెలుగు పత్రికలు చదివే అలవాటు లేదు, ఇకముందు చదివే ఉద్దేశం కూడా లేదు"- ఎందుకో తెలుసుకోవచ్చాండీ
ReplyDeleteతెలుగు న్యూస్ పేపర్లు :
Deleteనేను ఈనాడు పేపర్ చూసి ఇరవయ్యేళ్ళు దాటింది. ఆ పత్రిక్కి ఓనరే ఎడిటర్! ఉదాహరణకి, మీకు డబ్బుండి వ్యాపారం కోసం ఆస్పత్రి కట్టించారనుకోండి. ఆ ఆస్పత్రికి (అర్హత లేకుండా) మీరే చీఫ్ డాక్టర్ ఎలా అవుతారు?!
ఆంధ్రజ్యోతి పేపర్ రామచంద్రమూర్తిగారు ఎడిటర్ గా ఉన్నప్పట్నుండి తెప్పిస్తున్నాను.. ఇప్పుడూ వస్తుందిగానీ - చదవను. (చదవనప్పుడు కొనడం దేనికి? తెలీదు) తెలుగుదేశం పార్టీ అనుకూల వార్తల కోసం పేపర్ చదవాల్సిన అవసరం ఉందనుకోను.
పతంజలి సాక్షి ఎడిటర్ గా ఉన్న కాలంలో లోపలి పేజీలు బాగుండేవి, చదివేవాణ్ని. పతంజలి పోయిన తర్వాత మళ్ళీ దాని మొహం చూళ్ళేదు.
తెలుగు న్యూస్ పేపర్లు వార్తల్ని తమ నాయకుడి / పత్రిక యజమాని ప్రయోజనాలకి తగ్గట్టుగా ట్విస్ట్ చేసి రాయడంలో ప్రావిణ్యం సంపాదించాయి. ఎదుటి నాయకుణ్ని దుమ్మెత్తి పొయ్యడం మించి వీటిల్లో కంటెంట్ ఉండదు.. అంతా చెత్తా, చెదారం.
నా సలహా : ఇంగ్లీషు చదివి అర్ధం చేసుకునేవాళ్ళు, వార్తల కోసం తెలుగు పేపర్లు చదివి సమయం వృధా చేసుకోవద్దు (మీరు ఏదోక రాజకీయ నాయకుడి అభిమాన గణం అయితే మీ పార్టీ కరపత్రం ఎలాగూ చదువుతారనుకోండి). ఇంగ్లీషు పేపర్లు తెలుగు పేపర్లంత హీనంగా దిగజారలేదు.. ఇప్పటికి.
మీ చిన్న ప్రశ్నకి పెద్ద సమాధానం రాశాననుకుంటాను. :)
ఈనాటి తెలుగు వార్తాపత్రికల గురించి మీరు చెప్పింది పూర్తిగా నిజం (కొన్ని తెలుగు న్యూస్ ఛాన్నెళ్ళ వరస గూడా అలాంటిదే గదా).
Delete"ఇది పనిలేక రాసినదైనా, ఈమాట, కౌముది లాంటి పత్రికలకి పంపించవచ్చు. తప్పకుండా "పస" ఉన్న కధే." అని DG గారు అన్నారు. దానికి "మీరు చెప్పిన పేర్లతో పత్రికలు ఉన్నాయని నా దృష్టికి రాలేదు, ......." అని మీ సమాధానంలో చెప్పారు.
అమెరికా లోని న్యూజెర్సీ రాష్ట్రం నుంచి వెలువడే "తెలుగు జ్యోతి" అనే e-magazine మార్చ్-ఏప్రిల్ 2014 సంచికలో "శ్రీరామరాజ్యం" అని మీ రచన ప్రచురితమయింది కదా (www.telugujyothi.com).
"తెలుగు జ్యోతి" లాంటి మరికొన్ని e-magazine లే DG గారు చెప్పిన "ఈమాట" (www.eemaata.com), "కౌముది" (www.koumudi.net). అలాగే "వాకిలి" (http://vaakili.com/patrika/), సిలికానాంధ్ర వారి "సుజనరంజని" (www.siliconandhra.org/nextgen/sujanaranjani) అని కూడా ఉన్నాయి. ఇవి బ్లాగుల పరిభాషలో చెప్పినట్లు "జాల పత్రికలు". కొంత నాణ్యత కలిగినవి. అమెరికాలో కొంతమంది ఔత్సాహికులు నిర్వహిస్తున్న కధల / సాహిత్య పత్రికలు ఇవి. మన తెలుగు వార్తాపత్రికల లాగా కాదు. మీలాంటి వారు ఈ e-magazine లకు కూడా పంపవచ్చు, ఇంకా ఎక్కువ మంది చదివే అవకాశం ఉంటుంది (బ్లాగులు అందరూ చదవకపోవచ్చు కదా), ఆలోచించండి.
నరసింహారావు గారు,
Deleteవివరాలకి ధన్యవాదాలు.
www.telugujyothi.com వారు e mail ద్వారా నా అనుమతి పొందారు.
మీరిచ్చిన పత్రికల లింకుల్ని (పైపైన) చూశాను. అవును, మంచి standards తో ఉన్నాయి.
నా ఆలోచనలు రికార్డ్ చేసుకోడానికి బ్లాగ్ అనేది అద్భుతమైన ఫోరం అనుకుంటున్నాను. థాంక్స్ టు ఇంటర్నెట్. నా బ్లాగుల్ని కొంతమందైనా చదువుతున్నారుగా.. చాల్లెద్దురూ!
Ennallu Telugu silima lo gammadi garu ankunna kani meru nagabhushanam garu ani
ReplyDelete
ReplyDelete>> బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబళ్ళు, ...
ఎవరండీ ఈ బామ్మర్ది ?
జిలేబి