ఒక విషయాన్ని అర్ధం చేసుకోటం ఎలా? సింపుల్! ఆ విషయం గూర్చి దీక్షగా చదవడమే. ఇలా చదవడం మూలానా చాలా విషయాలు అర్ధం చేసుకోవచ్చు. మనం చదవగలం కాబట్టి ఇదేమీ పెద్ద సమస్య కాదు. అయితే - అన్ని విషయాలూ చదవడం ద్వారానే అర్ధం చేసుకోగలమా? చేసుకోలేమని నా అభిప్రాయం. కొన్ని విషయాలు దగ్గరగా వెళ్లి చూస్తే గానీ అర్ధం కావు.
ఇప్పుడు కొంతసేపు ఫ్లాష్‌బ్యాక్. నాకు ఇరవైయ్యేళ్ళ వయసుకి తెలుగు సాహిత్యంతో కొంత పరిచయం ఏర్పడింది. కొన్ని విషయాలు అర్ధమయ్యేవి, కొన్ని అర్ధమయ్యేవి కావు. ఆడవారి కష్టాలు, ఆకలి మొదలైవాటిగూర్చి టెక్స్ట్ బుక్ చదివినట్లు చదివానే గానీ, అవెలా ఉంటాయో నాకు తెలీదు. అందువల్ల ఆ రోజుల్లో (విషయంలోని సీరియస్‌నెస్ తెలీక) నాదంతా సరదా వ్యవహారమే.
నాకు మంచి స్నేహితురాళ్ళు వుండేవాళ్ళు. వారిలో 'స్త్రీకి పురుషుని సన్నిధే తరగని పెన్నిధి'గా భావించేవారి నుండి 'సృష్టిలోని సమస్త అనర్ధాలకి పురుషుడే కారణం'గా భావించేవారి దాకా ఉన్నారు. సీమటపాకాయ జడలాగా 'ఢబఢబ'మంటూ పేలే అమ్మాయిలు కొందరు - స్త్రీవిముక్తి సంఘటన, స్త్రీలపై అత్యాచారాల వ్యతిరేక కమిటీ లాంటి పేర్లతో పనిచేస్తూ.. చాలా యాక్టివ్‌గా వుండేవాళ్ళు.
నాదగ్గర ఒక కెమెరా వుంది. ఫోటోగ్రఫీలో కాలేజీ స్థాయిలో ప్రైజులు కూడా సంపాదించాను. ఆ రోజుల్లో ఒక ఫోటో తియ్యంగాన్లే అందరూ అడిగే మొదటి ప్రశ్న 'ఫోటో వస్తుందా?' అని! కారణం - తీసేవాడు గానీ, తీయించుకునేవాడు గానీ పొరబాటున కదిల్తే ఫోటో వచ్చేది కాదు. వీటికి తోడు నెగటివ్ 'కడిగే' స్టూడియోవాడి దయ కూడా అవసరమయ్యేది.
ఒకసారి నా స్నేహితురాళ్ళు ఏదో కేసు నిమిత్తం 'నిజనిర్ధారణ కమిటీ'గా ఏర్పడ్డారు. వాళ్లకి ఫోటోలు అవసరం, కానీ ఫోటోగ్రాఫర్‌ని భరించే శక్తి లేదు. అంచేత - ఫ్రీ (ఫ్రీలాన్స్ కాదు) ఫోటోగ్రాఫర్‌గా నన్ను రమ్మన్నారు. ఆ కమిటీలో ఒకమ్మాయి నా జూనియర్. 'నువ్వు ఫొటోగ్రఫీలో రఘు రాయ్ అంతటివాడివి' అని ఆ అమ్మాయి నన్ను పొగిడేసింది. అంతమాటనిపించుకున్నాక వెళ్ళకపోతే బాగుండదని మొహమాటంగానే (లోపల సంతోషిస్తూనే) ఒప్పుకున్నాను.
పేపర్లో వచ్చిన వార్త - అంతకు రెండ్రోజుల ముందు నగర శివార్లలో కాపురం వుంటున్న ఓ ఇరవైయ్యేళ్ళ యువతి కడుపునొప్పికి తట్టుకోలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 'విషయం ఇంత స్పష్టంగా ఉన్న తరవాత మళ్ళీ వీళ్ళు నిర్ధారించేదేమిటో?' అని అనుకుంటూనే వాళ్ళతో వెళ్ళాను.
పేపర్లో వచ్చిన వార్త - అంతకు రెండ్రోజుల ముందు నగర శివార్లలో కాపురం వుంటున్న ఓ ఇరవైయ్యేళ్ళ యువతి కడుపునొప్పికి తట్టుకోలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 'విషయం ఇంత స్పష్టంగా ఉన్న తరవాత మళ్ళీ వీళ్ళు నిర్ధారించేదేమిటో?' అని అనుకుంటూనే వాళ్ళతో వెళ్ళాను.
అది రెండు గదుల ఇల్లు. ఇల్లంతా రక్తం కడిగిన మరకలు.. వికారమైన వాసన. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా వున్నాయి. ఇంటి ముందువైపు బావి వుంది. కానీ - ఆ బావి పెద్ద లోతుగా లేదు, అందులో మోకాలులోతు నీళ్ళు కూడా లేవు. ఆ బావిలో ఎవరన్నా దూకినా, మహా అయితే కాళ్ళు విరగడం మినహా మరే ప్రమాదం జరిగే అవకాశం లేదు.
మాతో వచ్చినవాళ్ళల్లో ఒకమ్మాయి చాలా హుషారు. క్రైమ్ ఎనాలిసిస్ షెర్లాక్ హోమ్స్ లెవల్లో చేసేస్తుంది. మావైపు అనుమానంగా, బెరుగ్గా చూస్తున్న ఇరుగుపొరుగుల్తో నెమ్మదిగా మాట కలిపింది. తమకి పోలీసుల్తో సంబంధం లేదనీ, తాము ఆడవాళ్ళకి న్యాయం కలిగించే సంఘం తరఫున వచ్చామని చెప్పి కన్విన్స్ చేసింది. ఆ ఆడవాళ్ళింక జరిగిన సంఘటనని పోటీపడి చెప్పారు.
అక్కడ జరిగింది అచ్చమైన స్వచ్చమైన నిఖార్సైన హత్య. ఆ ఇంటివాడికి భార్య మీద అనుమానం. ఆరోజు తాగొచ్చి తగాదా వేసుకున్నాడు. ఇద్దరికీ మాటామాటా పెరిగింది. రోకలిబండతో భార్య తల పగలగొట్టి చంపాడు. ఈ విషయం అతని బంధువులకి కబురెళ్ళింది. అందరూ కలిసి తెల్లవారు ఝాము దాకా మంతనాలు చేసుకుని (వాళ్ళల్లో ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కూడా వున్నాట్ట), శవాన్ని ఎత్తి బావిలో పడేశారు. అదీ జరిగింది.
ఒకమ్మాయి తన దగ్గరున్న పాత ఎల్లైసీ డైరీలో ఈ పాయింట్లు నోట్ చేసుకుంది. నేనో నాలుగైదు ఫోటోలు తీశాను. ఈలోపు ఐదారుగురు వ్యక్తులు హడావుడిగా మాదగ్గరకి వచ్చారు. 'ఎవరు మీరు? ఇక్కడ మీకేంటి పని?' అంటూ మమ్మల్ని నిలదీశారు. మా షెర్లాక్ హోమ్స్ వాళ్ళ ప్రశ్నల్ని మళ్ళీ వాళ్ళకే విసిరింది! వాళ్ళు ఆ ఇంట్లోవాళ్ళకి దగ్గిర చుట్టాల్ట. 'కేసుని పోలీసు స్టేషన్లో సెటిల్ చేసుకున్నాంగా! ఇంక మీ గోలేంటి?' అనేది వాళ్ళ దబాయింపు. మా అమ్మాయిలు ఇంకా గట్టిగా మాట్లాడ్డం మొదలెట్టారు. గొడవ అవుతుందనుకున్నాను గానీ, మొత్తానికి మర్యాదగానే బయటపడ్డాం.
ఆరోజు వరకు కుటుంబం, స్త్రీల సమస్యల పట్ల నాకున్న అవగాహనకి ఆధారం వార్తాపత్రికలు, సాహిత్యం మాత్రమే. కానీ - గ్రౌండ్ రియాలిటీ నేను ఊహించినదానికన్నా పరమ ఘోరంగా వుంది. ఇది నాకో పెద్ద షాక్. తిని అరక్క ఏవో నాలుగు పుస్తకాలు చదువుకుని పండితుల భాషలో సున్నితంగా చర్చించుకోవటం వేరు, కఠోర వాస్తవం వేరు. ఆరోజు - నాకున్న పరిమితి, పరిధులు తెలుసుకున్నాను.
ఇలా ఎవరికివారు తమ పరిమితి, పరిధుల్ని తెలుసుకోవటం కూడా జ్ఞానమే అనుకుంటున్నాను. ఎందుకంటే - ఒకరకం మేధావులు చదువుతారు, విపరీతంగా చదువుతారు. తలెత్తితే ఎదురుగా కనిపించే సముద్రాన్ని కూడా చూడకుండా సముద్రం గూర్చి చదివి తెలుసుకుంటారు. ఆ తరవాత సముద్రం గూర్చి వ్యాసం రాస్తారు! అదే మేధావి సముద్రం దగ్గరకెళ్లి, నాలుగు అలల్ని కాళ్ళకి తగల్నిస్తే అతని అవగాహన పెరగొచ్చు, దృక్పధం మారొచ్చు.
నా దృష్టిలో బాలగోపాల్ థియరీ అండ్ ప్రాక్టీస్ సమపాళ్ళలో కలగలిసిన మేధావి. ఆయన చదివాడు, రాశాడు, నిరంతరంగా ప్రజల మధ్యనే వుండి వారితో ప్రత్యక్ష సంబంధాలు కలిగున్నాడు. కాబట్టే ఆయన అభిప్రాయాలకి అంత ప్రాముఖ్యత. రైతుల సమస్యలు, ఆత్మహత్యల గూర్చి వాళ్ళమధ్యనే ఉంటూ రిపోర్ట్ చేస్తున్న 'హిందూ' పి.సాయినాథ్ ఇంకో అరుదైన ఉదాహరణ. అరుంధతి రాయ్ మావోయిస్టుల్తో కొన్నాళ్ళపాటు తిరిగి తన ఆలోచనలు రాసింది, ఎందఱో శత్రువుల్ని కూడా సంపాదించుకుంది.
కొన్ని సమయాల్లో, కొన్ని విషయాల్లో నా జ్ఞానం - వానపాముని చూడకుండా దాని గూర్చి బట్టీ వేసే కార్పోరేట్ విద్యాసంస్థల కుర్రాళ్ళ స్థాయిలో వుంటుంది, పేషంటుని చూడకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములో ఎంబిబియస్ చదివినట్లు హాస్యాస్పదంగానూ వుంటుంది. నాకీ స్పృహ ఉంది కాబట్టే - నావి సరదా రాతలనీ, ఎయిర్ కండిషన్డ్ రాతలనీ, కేస్ షీట్ ఆలోచనలనీ అప్పుడప్పుడూ చెబుతూనే వుంటాను. ఇలా చెప్పడం మాడెస్టీ కాదు.. నా పరిమితులు తెలియజేసే ఒక డిస్‌క్లైమర్‌గా మాత్రమే భావిస్తున్నాను.
ముగింపు -
పోస్ట్ సీరియస్ అయిపోయింది. కొంచెం లైట్‌గా రాసి బ్యాలెన్స్ చేస్తాను.
మా గుంటూరు ఎండల గూర్చి మీరు చదివేవుంటారు. ఈ ఎండల గూర్చి మీరు ఎంత చదివినా లాభం లేదు. ఒకసారి మే నెలలో కొంతసేపు మా గుంటూర్లో గడపి చూడండి. మీరు జన్మలో 'మర్చిపోలేని అనుభవం' చేకూరుతుందని గ్యారెంటీ ఇవ్వగలను. దీన్నే - 'బ్రిడ్జింగ్ ద గేప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్' అంటారు!
(picture courtesy : Google)