Monday, 21 July 2014

చేదునిజం


"గాజాపై ఇజ్రాయిల్ దాడిని ఖండించండి!"

ఎందుకు!?

ఒరే! అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా?

పులి జింకని వేటాడదా?

బలవంతుడు బలహీనుణ్ణి చితకబాదడా?

తేడాలొస్తే - పోలీసుకుక్క వీధికుక్కని చీరెయ్యదా?

సైకిల్ వెళ్లి కారుని గుద్దితే సైకిల్‌ గతేంటి?

ఇదంతా ప్రకృతి ధర్మం. కాదన్డానికి నువ్వెవరివి?

నువ్వేమన్నా - బ్రిటీషోడి బాబాయివా? అమెరికావాడు ఉంచుకున్నదాని తమ్ముడివా?

కాదుగదా? అయినా ఇట్లాంటప్పుడు చుట్టరికాలు కూడా పన్జెయ్యవురొరేయ్! జాగ్రత్త.

అంచేత - నే చెప్పొచ్చేదేమంటే, బుర్రకి కొంచెం పన్జెప్పి ఆలోచించమంటున్నాను.

నీలాంటోడు అన్యాయాలని ఖండిద్దామనుకుంటే ఖండించొచ్చు. ఆ మాత్రం వెసులుబాటు నీకెప్పుడూ వుంటుంది. కాకపోతే పులికి అడ్డం నిలబడకు. ఆ పక్కగా వున్న చెట్టెక్కి పులికి వినబడీ వినబడనట్లుగా 'తీవ్రంగా' ఖండించు. అప్పుడు పులికీ ఇబ్బందుండదు, నీ ఆనందం నీకుంటుంది.

బయట్నించి చూసేవాళ్ళకి మాత్రం నువ్వు జింక పక్షం వున్నట్లుగా అనిపించాలి, కానీ - పులికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రాకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింటు.

ఈ సంగతి తెలీని కొందరు అమాయక వెధవలు పులి ముందుకి వెళ్లి అడ్డంగా నిలబడి 'నువ్వు జింకని వేటాడరాద'ని పులికే సుద్దులు చెబుతుంటారు! (సహజంగానే) పులిక్కోపం వచ్చి, ఆ జింకని వదిలేసి ముందుగా ఈ వెధవల్ని వేటాడుతుంది!

నువ్వలా చావరాదని నీ మంచి కోరే ఇదంతా చెప్తుంటా!

ఈ లోకంలో ఎప్పుడైనా బలవంతుడే గెలుస్తాడు. ఇది తధ్యం. బలవంతుని పక్షం వహించినవారే బాగుపడతారు. ఇది సత్యం. అయితే - ఈ సత్యాన్ని గ్రహింపలేని కొందరు అజ్ఞానులు 'అన్యాయం, అక్రమం' అంటూ పోలికేకలు పెడుతుంటారు. కానీ - వాళ్లకి అర్ధం కానిది - రాజధర్మంలో న్యాయాన్యాయాలు, క్రమాక్రమాలు వుండవు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం, వాడు చెప్పిందే న్యాయం. విన్డానికి చేదుగా వున్నా, ఇక్కడిదే నిజం.

అంచేత - ఎవరికైనా, ఎప్పటికైనా బలవంతుని పక్షం వహించడమే లాభసాటిగా వుంటుంది.

అయితే - నీకు డైరక్టుగా బలవంతుడి పక్షం వహించాలంటే కొంత రాజకీయాలు, కొన్ని మొహమాటాలు అడ్డం కావచ్చు. ఏం పర్లేదు! నీ ఇబ్బందులు నేను అర్ధం చేసుకోగలను.

అప్పుడు నువ్వు జింకల పక్షమే వుంటున్నట్లు వుండు (కానీ పులి పర్మిషన్ తీసుకోవడం మాత్రం మర్చిపోకు). అవసరమైనప్పుడు మాత్రం (గుంటనక్కలాగా) పులికే సపోర్ట్ చెయ్యి. అంటే - పోలీసుల్లో ఐడీ పార్టీవాళ్ళుంటారే? అలాగన్నమాట!

ఒకరకంగా ఈ స్వజాతి ద్రోహమే నీకింకా గిట్టుబాటు. అధికార పక్షమూ, ప్రతిపక్షమూ కూడా నువ్వే అయితే ఏలినవారికి ఎంత హాయి!

అంచేత - గాజా, కూజా అంటూ నీ బూజుమాటలు కట్టిపెట్టు.

అమెరికావాడికి కొంచెం ఇబ్బంది కలిగించు.. తప్పులేదు. అదీ వాడి అనుమతితోనే సుమా! కానీ - వాడికి నష్టం కలిగించే పన్లు మాత్రం చెయ్యకు.

అసలు అమెరికావాడు చేసిన తప్పేంటి?

అమెరికావాడిదీ, ఇజ్రాయిలువాడిదీ ఆడామగా సంబంధం లాంటిది కదా! కట్టుకున్నదాన్నైనా, ఉంచుకున్నదాన్నైనా - తగాదాలొచ్చినప్పుడు నీ ఆడమనిషినే నువ్వు సపోర్టు చేస్తావు కదా? కదా! అంతేగానీ - రోడ్డు మీద పబ్లిగ్గా పదిమంది ముందూ పరువు తీసుకుంటావా? తీసుకోవు కదా! ఏం? నీకో న్యాయమూ, అమెరికావాడికో న్యాయమూనా! ఇదెక్కడి న్యాయం?

రాజు పక్షం వహించినవాడికి నష్టం కలిగినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఎదిరించినవాళ్ళు మాత్రం ఎప్పుడూ మిగల్లేదు. బ్రిటీషోణ్ని ఎదిరించిన భగత్ సింగు ఏమయ్యాడు? అల్లూరి సీతారామరాజు ఏమయ్యాడు?

బలవంతుణ్ణి ఎదిరించి అర్ధాంతరంగా చచ్చి కీర్తి నొందుతావా? లేక బలవంతుడి పక్షాన చేరిపొయ్యి శాశ్వతంగా 'అభివృద్ధి' చెందుతావా?

ఆలోచించుకో. చాయిస్ ఈజ్ యువర్స్!

(picture courtesy : Google)

12 comments:

  1. // ఇదంతా ప్రకృతి ధర్మం. కాదన్డానికి నువ్వెవరివి?
    నువ్వేమన్నా - బ్రిటీషోడి బాబాయివా? అమెరికావాడు ఉంచుకున్నదాని తమ్ముడివా?//
    :) :):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):):)
    సార్‌! మిమ్మల్ని పొహడటం కాదు గానీ, మీ ఒక్కో మాట ఒక వజ్రపు తునక! -అంటే వజం లాంటి సత్యాలన్న మాట. నాకు లోకం తెలియని కాలంలో మొట్ట మొదటి సారి రావి శాస్త్రి గారి నిజం నాటకాన్ని చదివినంత సంతోషంగా వుంది సార్‌!

    ReplyDelete
  2. << బయట్నించి చూసేవాళ్ళకి మాత్రం నువ్వు జింక పక్షం వున్నట్లుగా అనిపించాలి, కానీ - పులికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రాకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింటు. >>

    :))))))))

    ReplyDelete
  3. అగ్నానముతో మూసుకుపోయిన కళ్ళను తెరిపించారు గురుదెవా...

    ReplyDelete
    Replies
    1. మొత్తానికి - కళ్ళ డాక్టరుకే కళ్ళు తెరిపించానన్నమాట! :)

      Delete
  4. ధైర్యముగా అన్యాయము నెదిరించవలెనని వుబలాటపడు మాలాంటి వుత్సాహవంతులైన కుర్ర వేధవలు కూడా భయపడి అవకాశవాదులుగా మారునంతటి తీవ్రముగా భయపెట్టుట రావిశాస్త్రి శిష్యునిగా మీకిది పాడియా వైద్య శిఖామణీ!

    ReplyDelete
    Replies
    1. నాకు హిచ్‌కాక్ సినిమాలు ఇష్టం. అంచేత అలా భయపెడుతుంటాను. :)

      Delete
  5. గురువుగారూ ఒక్కోసారి గెలుపోటములు తారుమారు అయితే ఎవరిపక్షం వహించాలి

    ReplyDelete
    Replies
    1. యుద్ధంలో ఎప్పుడూ బలవంతుడే గెలుస్తాడు. గెలుపోటములు ఎప్పుడూ తారుమారు కావు. అయితే - 'ఎవడు బలవంతుడు?' అన్నది సరీగ్గా అంచనా వెయ్యలేకపోవడానికి కారణం మన అవగాహనా లోపం. :)

      Delete
  6. మరి క్యూబా అమెరికా ఎడతెగని ప్రచ్చన్న యుద్దమైతే

    ReplyDelete
    Replies
    1. నా పోస్ట్ ఒక పొలిటికల్ స్టేట్‌మెంట్. పూర్తిగా satirical గా రాశాను. కావున - దీన్ని అంతవరకే తీసుకోవాలి అనుకుంటున్నాను.

      Delete

comments will be moderated, will take sometime to appear.