Tuesday 8 July 2014

వెలుగునీడల శ్రీశ్రీ


'వెలుగు నీడలు' అని ఒక పాత తెలుగు సినిమా వుంది. ఆ సినిమాని - నేను హైస్కూల్లో వుండగా రీరిలీజులో చూశాను. అందులో 'కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు' అనే పాట నాకు చాలా నచ్చింది. ఘంటసాల గానం కూడా సందర్భానికి తగినట్లు హృద్యంగా వుంది (అలా పాట్టం ఘంటసాల బలహీనత). ఎవరో శ్రీశ్రీ అనే ఆయన ఈ పాట రాశాట్ట. పేరు గమ్మత్తుగా వున్నా పాట మాత్రం చక్కగా రాశాడనుకున్నాను.

సినిమా మాత్రం టన్నుల కొద్ది సెంటిమెంటుతో కడు భారంగా వుంటుంది. అందులో ఈ పాట సందర్భం ఇంకా బరువైనది. నాగేశ్వరరావు సావిత్రిని ప్రేమిస్తాడు. అతనికేదో రోగం వస్తుంది. అంతట నాగేశ్వరరావు తన ప్రేమని త్యాగం చేసి (ప్రేమ త్యాగాన్ని కోరుతుంది) సావిత్రికి జగ్గయ్యతో పెళ్లి జరిపిస్తాడు (ఇట్లాంటి stand by పెళ్ళికొడుకు వేషాలు జగ్గయ్య చక్కగా వేస్తాడు). జగ్గయ్య చాలా మంచివాడు కూడా! ఎందుకంటే - కథని ముందుకు నెట్టడానికి హఠాత్తుగా చచ్చిపోతుంటాడు.

తెలుగు సినిమా హీరోయిన్ కారణం లేకుండానే ఏడుస్తుంటుంది! అట్లాంటిది, భర్త పోయి - బాగా ఏడ్చేందుకు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది? అంచేత - కసిదీరా కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది (ఒక స్త్రీకి మొగుడు చచ్చినా, చావకపోయినా ఏడ్చే హక్కుంది. కాదండానికి నువ్వెవరివి?) అది చూసిన మహిళా ప్రేక్షకమణులు భోరున విలపించేవారు! మా చుట్టం ఒకావిడ 'చీపాడు! అదేం సినిమా? ఆ సినిమాలో అసలు ఏడుపే లేదు.' అనేది. అంటే - పిల్లలకి ఫైటింగ్ సీన్లు ఎంతిష్టమో, మహిళలకి ఏడుపు సీన్లు అంతిష్టం అని అర్ధమవుతుంది!

'ఇంతకీ భర్త చచ్చిపోతే అన్నిరోజులు పడీపడీ ఏడవటం దేనికి?' 

నా కూతురు అప్పుడప్పుడు పాత తెలుగు సినిమాలు కొంచెం సేపు చూస్తుంది, హఠాత్తుగా నన్నిట్లాంటి ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతుంటుంది. 

అప్పుడు నేను తల్లడిల్లిపోతాను - 

'అయ్యో! ఎంతమాటన్నావు తల్లీ? భగవంతుడా! నా కూతుర్ని క్షమించు. స్త్రీకి ఐదోతనమే (ఐదోక్లాసు కాదు) తరగని పెన్నిధి! భారతనారికి భర్తే దైవం (ఈ విషయాన్ని నా భార్యకి చెప్పమని దయగల పాఠకుల్ని అర్ధిస్తున్నాను)! ఆడదానికి భర్త లేని జీవితం సాంబారు లేని ఇడ్లీ వంటిది! ఇంకు లేని పెన్ను వంటిది! బొత్తాల్లేని చొక్కా వంటిది!' అనుకుంటూ గుమ్మడిలా మధన పడతాను, ఆపై - చిత్తూరు నాగయ్యలా నిట్టూరిస్తాను.

సరే! చనిపోయిన భర్త జ్ఞాపకాలతో రోదిస్తున్న సావిత్రిని ఓదార్చడానికి నాగేశ్వరరావు ఘంటసాల స్టోన్లో హెవీగా పాడతాడు. పాపం! నాగేశ్వరరావుకి సినిమాలు మారినా - భర్త చచ్చిన సావిత్రిని ఓదార్చడం మాత్రం తప్పదు (ఆ తరవాత వచ్చిన మూగమనసుల్లో కూడా నాగేశ్వరరావుకిదే డ్యూటీ)! ఎన్టీఆర్ పిండి రుబ్బాడు, రాజనాలతో కత్తియుద్ధాలు చేశాడు. కానీ - ఆయన ఆడవాళ్ళని ఓదార్చినట్లు నాకు జ్ఞాపకం లేదు. అసలీ రోగాలు, రొస్టులకి ఎన్టీఆర్ ఎప్పుడూ ఆమడ దూరం.

'కలకానిది, విలువైనది' పాట చాలా మీనింగ్‌ఫుల్లుగా వుంటుంది. దుఃఖంలో వున్న స్నేహితురాల్ని ఓదార్చడానికి హీరో వాడిన పదాలు, ఉపమానాలు, ఆలోచనలు చాలా అర్ధవంతంగా, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ చేసేంత స్థాయిలో చాలా ఎఫెక్టివ్‌గా వుంటాయి. పాట చూడనివాళ్ళ కోసం, చూసినా - మళ్ళీ చూద్దామనుకునేవాళ్ళ కోసం ఆ పాట యూట్యూబ్ లింక్  ఇస్తున్నాను.

నా చిన్నప్పుడు శ్రీశ్రీని 'మహాకవి' అని అంటుండగా వినేవాణ్ణి. సినిమా పాటలు అందరికన్నా బాగా రాస్తాడు కాబట్టి మహాకవి అంటున్నారేమోనని అనుకున్నాను. అలా అనుకోవడంలో నా తప్పేమీ లేదు.. అప్పటికి నాకు 'మహాప్రస్థానం' తెలీదు. అటు తరవాత శ్రీశ్రీని చదివాను. శ్రీశ్రీని 'మహాకవి' అని ఎందుకన్నారో అర్ధం చేసుకున్నాను.

శ్రీశ్రీ డబ్బునెప్పుడూ లెక్క చెయ్యలేదు. కానీ - ఆయనెప్పుడూ ద్రవ్యోల్పణంలో వుండేవాడు. ఎమర్జన్సీలో ఇందిరమ్మ పథకాల్ని కీర్తించాడు. ఎమర్జన్సీతో ఇందిరాగాంధీ దేశానికే కాదు, శ్రీశ్రీ వ్యక్తిత్వానిక్కూడా చీకటి రోజులు తెప్పించింది. అటుతరవాత శ్రీశ్రీ తన తప్పుకి భేషరతుగా క్షమాపణ చెప్పాడు. నాకిప్పుడనిపిస్తుంది - శ్రీశ్రీ అంతటివాడు క్షమాపణ చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ కలవాడు కాబట్టే క్షమించమన్నాడు. ఇది చాలా అభినందనీయం.

కొడవటిగంటి కుటుంబరావుకి దొరికిన 'చందమామ' నీడ గూర్చి శ్రీశ్రీ ఈర్ష్య పడ్డాడు. అయితే కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు, చక్రపాణిలది 'మీది తెనాలే! మాది తెనాలే!' బంధమని నా అనుమానం. అయినా - కుటుంబరావులా ఒకేచోట దశాబ్దాల తరబడి పనిచేసే మనస్తత్వం శ్రీశ్రీకి లేదనుకుంటున్నాను. శ్రీశ్రీతో చెడిన ఆరుద్ర శ్రీరంగం నారాయణబాబుని ప్రమోట్ చేద్దామని చూశాడు గానీ - వల్ల కాలేదు.

నాకో స్నేహితుడున్నాడు, అతనో బ్యాంక్ ఉద్యోగి. అతగాడికి జీవితం అంటే ఉద్యోగం, కుటుంబం మాత్రమే. పొద్దున్నే యోగాసనాలు వేస్తూ ఆయుష్షు పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. క్రమశిక్షణ లేని జీవితం బ్రేకుల్లేని కారు వంటిదని అతని నమ్మకం. అందువల్ల అతనికి శ్రీశ్రీ అంటే చిరాకు.

'శ్రీశ్రీ స్త్రీలోలుడు, అన్నపానముల కన్నా ధూమపానము, సురాపానమే మిన్న అని నమ్మినవాడు. తన అలవాట్లనే నియంత్రణ చేసుకోలేని కవి, ఇంక ప్రజలకి ఏం చెబుతాడు?' అనేది అతని లాజిక్. ఈ రకమైన లాజిక్‌తో - శ్రీశ్రీ 'దురలవాట్ల' మీద జరిగిన దాడి తెలుగు భాష కన్నా పురాతనమైనది!

నిజమే! శ్రీశ్రీ యోగాసనాలు వెయ్యడు, ఉద్యోగం చెయ్యడు, అది ఆయన ఇష్టం. నాకు తెలిసి శ్రీశ్రీ ఎక్కడా, ఎవరికీ వ్యక్తిగతమైన అలవాట్ల మీద సుద్దులు బోధించలేదు. శ్రీశ్రీ తన మందు తనే తాగాడు, తన సిగరెట్లు తనే (గుప్పిలి బిగించి మరీ) తాగాడు. తన ఆలోచనలతో తనే కవిత్వం రాసుకున్నాడు, అది చదివిన తెలుగు పాఠకులు వెర్రెక్కిపొయ్యారు.. ఊగిపొయ్యారు. అది శ్రీశ్రీ నేరం కాదు, అందుకు శ్రీశ్రీ బాధ్యుడు కూడా కాదు. ఇంకా నయం! శ్రీశ్రీ కూడా నా స్నేహితుళ్ళా ఆలోచించినట్లైతే 'మహాప్రస్థానం' రాయకుండా యోగాసనాలు వేసుకుంటూ మిగిలిపొయ్యేవాడు. నో డౌట్! అప్పుడు తెలుగు సాహిత్యం కుంటిదీ, గుడ్డిదీ అయిపొయ్యేది!

సినిమా రచనలకి సాహిత్య స్థాయి గానీ, గౌరవం గానీ ఉండనవసరం లేదని నా అభిప్రాయం. దర్శకుడు ఏదో సందర్భం చెబ్తాడు, సంగీత దర్శకుడు ఇంకేదో ట్యూను చెబ్తాడు. వారి అభిరుచికి తగ్గట్టుగా నాలుగు ముక్కలు కెలికితే అదే సినిమా పాట! కొందరు ప్రముఖ కవులు భుక్తి కోసం ఏవో కొన్ని సినిమా రచనలు చేశారు. ఎందుకంటే - వారికి కవిత్వం తిండి పెట్టలేదు, ఆ లోటు సినిమా పాట తీర్చింది.

ఈ మధ్య సమగ్ర సాహిత్యం అంటూ ఒక రచయిత రాసిన ('నాకు జలుబు చేసింది, నా భార్యకి దగ్గొస్తుంది' లాంటి వ్యక్తిగతమైన లేఖలతో సహా) ప్రతి అక్షరాన్ని పబ్లిష్ చెయ్యడమే మహత్కార్యంగా కొందరు పబ్లిషర్లు పూనుకున్నారు (ఎందుకో తెలీదు). తత్కారణంగా శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు కూడా ఆయన సమగ్ర సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. ఈ కంప్లీట్ వర్క్స్ పట్ల నా అభిప్రాయం 'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే! అంటూ ఇంతకుముందొకసారి రాశాను.  సరే! పబ్లిషర్ల దగ్గర డబ్బులున్నాయి, ముద్రణా యంత్రాలున్నాయి. వాళ్ళిష్టం! వద్దంటానికి మనమెవరం?

నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరినప్పుడు అక్కడి ప్రొఫెసర్ చెప్పే రోగి మంచం పక్కన పాఠాలు (bedside teaching) విని చాలా ఇంప్రెస్ అయిపొయ్యాను. చిన్న సంగతిక్కూడా ఎన్నో జర్నల్స్‌ని రిఫరెన్సులుగా అలవోకగా కోట్ చేస్తూ ఆయన పాఠాలు చెప్పే విధానం బహు ముచ్చటగా అనిపించింది. అటు తరవాత ఆయనకి సైకియాట్రీ జ్ఞానం టన్నుల కొద్దీ వుందనీ, నేను మొదట్లో విన్నది కొన్ని గ్రాములు మాత్రమేననీ తెలుసుకున్నాను. అంతేకాదు - ఆయన ఆ జ్ఞానంతోనే మన తాట తీస్తాడనీ, డొక్కా చించి డోలు వాయిస్తాడని కూడా అనుభవ పూర్వకంగా అర్ధం చేసుకున్నాను ( ఆయన నా థీసిస్ గైడ్ కూడా - అందువల్ల).

అట్లాగే శ్రీశ్రీ సినిమా పాటలు కూడా శ్రీశ్రీ సాహిత్యంలో టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అనీ, అవి శ్రీశ్రీ బ్రతువు తెరువు కోసం రాసిన అద్దె పంక్తులే (దర్శకుడి ఆలోచనల మేరకు రాసిన) తప్ప, శ్రీశ్రీ సాహిత్యస్థాయికి ఏ మాత్రం సరితూగవని అనుకుంటున్నాను. అంతేకాదు - ఆ పాటల్ని పబ్లిష్ చెయ్యడం (శ్రీశ్రీ అభిమానుల్ని తృప్తి పరచడం తప్పించి) తెలుగు సాహిత్యానికి పెద్దగా ప్రయోజనం లేదని నా అభిప్రాయం. 'నా అభిప్రాయం' అంటూ ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నానంటే - శ్రీశ్రీ అభిమానులు, సినీప్రేమికులు నామీద 'గయ్యి'మనకుండా వుండటానికి (ముందు జాగ్రత్త చర్యన్నమాట)!

గొప్పరచయితలు అన్నీ గొప్పగా రాయరు, ఒక్కోసారి చెత్తగా కూడా రాస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా రచయితలందరికీ వర్తిస్తుంది. తెలుగు రచయితలకి మరీ వర్తిస్తుంది. చలం, కుటుంబరావు, గోపీచంద్, పద్మరాజు, అడవి బాపిరాజు, కాళీపట్నం రామారావుల రచనలు కొన్ని చదువుతుంటే అమృతాంజనం ఎడ్వర్టైజ్‌మెంట్ కోసం రాసినట్లుంటాయి!

మరప్పుడు ఈ సమగ్ర సాహిత్యాల వల్ల కలుగు ప్రయోజనమేమి? పోతన పద్యాల్లో పదవిన్యాసము, గురజాడ రచనల్లో గురుత్వాకర్షణశక్తి అంటూ డాక్టరేట్ల కోసం యూనివర్సిటీల్లో జరిగే పరిశోధకులకి ఉపయుక్తంగా ఉండటం ఒక ప్రయోజనం. లబ్దప్రతిష్టులైన రచయితలు కూడా - మనకి తెలిసిన మంచి రచనలతో పాటు మనకి తెలీని (చదవాల్సిన అవసరం లేని) రచనలు కూడా చాలా చేశారని తెలుకోవటం మరో ప్రయోజనం. భగవంతుని సృష్టిలో ఉపయోగపడని వస్తువంటూ ఏదీ లేదని ఎవరో చెప్పగా విన్నాను.. నిజమే అయ్యుంటుంది!

ముగింపు -

ఈ మధ్య ఫలానా తెలుగు కవి లేక రచయిత 'వందేళ్ళ జయంతి' అంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు గవర్నమెంటు డబ్బుల్తో జాతరలు నిర్వహిస్తున్నారు. ఇదోరకంగా కుటీర పరిశ్రమ, ఇంకోరకంగా గిట్టుబాటు వ్యవహారం. అయినా ఊరుకోలేక 'గురజాడ మహాశయా! మీకు ప్రమోషనొచ్చింది' అంటూ రాశాను (నాకు బుద్ధి లేదు). 

అయితే - శ్రీశ్రీ వందేళ్ళ పండగని సీపీఐ పార్టీ వారు ఘనంగా నిర్వహించారు! సీపీఐ వారికి శ్రీశ్రీతో కనెక్షనేంటబ్బా? అర్ధం కాక, నాకు తెలిసిన కొంతమందిని అడిగాను. పాపం! వాళ్ళూ తెల్లమొహం వేశారు.

ఇందుకు నా బ్యాంక్ స్నేహితుడు (బ్యాంకు ఉద్యోగస్తులకి లాభనష్టాల లెక్కలు బాగా తెలుసు) చెప్పిన సమాధానం - 'ఇందులో ఆలోచించడానికేముంది? విశాలాంధ్ర వారు శ్రీశ్రీ చేతిలో పదోపరకో పెట్టి ఆయన మహాప్రస్థానాన్ని లెక్కలేనన్ని ఎడిషన్లు వేసుకుని విపరీతంగా అమ్ముకున్నారు. బహుశా ఆ కృతజ్ఞతతో ఈ శ్రీశ్రీ పండగ చేసుకుంటున్నారేమో!'

ఏమో - అయ్యుండొచ్చు! నాకైతే తెలీదు!

(photo courtesy : Google)

30 comments:

  1. పోయి పోయి శ్రీ శ్రీ మీద పడ్డారేం?జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టవ్వుద్ది:-)యెందుకంటే ఆయనా మీలాంతి తింగరోడే:-P)

    ??సీపీఐ వారికి శ్రీశ్రీతో కనెక్షనేంటబ్బా? అర్ధం కాక, నాకు తెలిసిన కొంతమందిని అడిగాను.
    >>
    వా,ర్నీ శ్రీ శ్రీ కమ్యునిష్టని కూడా తెలీకుండానే ఇంత టపా రాసేశారా?

    ReplyDelete
    Replies
    1. ఏంటీ! శ్రీశ్రీ కమ్యూనిస్టా? నాకీ సంగతి తెలీదండి. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

      (ఇప్పుడెలా? పోస్టు రాసిపడేశానే! పోన్లేండి.. అలా పడుంటుంది. )

      Delete
    2. శ్రీ శ్రీ కమ్యూనిష్టు అవునో కాదో నాకు తెలీదు కానీ కమ్యూనిస్టులు మాత్రం శ్రీశ్రీని సాంతం వాడేసుకున్నారు..
      శ్రీ శ్రీ గురించి కోతికొమ్మచ్చి పుస్తకంలో రమణ చెప్పింది "శ్రీశ్రీ రాసిన కవితలు సువాసనలు వెదజల్లుతుంటే కొందరు మాత్రం ఆయన తాగి పడేసిన సారా సీసాల దగ్గరే ఉన్నారు"

      నాక్కూడా మహాప్రస్థానంలో కొన్ని పంక్తులు నచ్చాయి తప్ప, శ్రీశ్రీ పై అంత మంచి అభిప్రాయం లేదు.. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పట్టించుకోవడం మానుకోలేని ప్రబుద్దులలో నేను ఓకడిని.

      ఫైనల్ గా ఒక ఉచిత సలహా: వీలైతే సరోజా శ్రీశ్రీ గారు రాసిన శ్రీశ్రీ బయోగ్రఫీ చదవండి.. ఆవిడ చాలా బాగా రాశారు..

      Delete
    3. @kartik,

      ఒక రచయిత రచనలు చేస్తాడు. అవి నచ్చితే చాలు.. నచ్చకపోయినా నష్టం లేదు.

      కానీ - రచయిత ఎందుకు నచ్చాలి? ఆయనకేమన్నా పెళ్ళిసంబంధం మాట్లాడుతున్నామా? లేదుకదా!

      (ఈ హోరాహోరి చర్చ ఓ నలభైయ్యేళ్ళ క్రితం జరిగిందని గుర్తు.)

      మీరు చెప్పిన పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తాను, థాంక్యూ!

      Delete
    4. హరిబాబు & రమణ గార్లకు చిన్న ప్రశ్న. అసలు సీపీఐ వాళ్ళు కమ్యూనిస్టులా?

      Delete
    5. @Jai,

      నేనూ, శ్రీశ్రీ కాదంటున్నాం. హరిబాబుగారు ఔనంటున్నారు. :)

      Delete
    6. Kikiki Ramana garu,
      As I said above, not all can consider that difference. ..:)

      Delete
    7. @jai
      మీరు వేసిన ప్రశ్న భేతాళుడి ఆఖరి ప్రశ్న లాంటిది,దానికి విక్రమార్కుడు చెప్పిన జవాబే సరి అయినది :-)

      హోశ్టు గా నా మాన మర్యాదల్ని కాపాడాల్సిన పెద్ద మనిషి కూడా నన్నూ శ్రీ శ్రీని ఇరికించేసి యెలా తప్పుకుంటున్నాడో?

      అయినా జవాబు చెప్పాల్సిందేనంటే యే త్వమేవాహం అన్నట్టుగా సరిపెట్టెయాల్సిందే.అసలు ఇవ్వాళ ఆ స్సీపీఐ సీపీయం వాళ్లే వాళ్లల్లో వాళ్ళు నువ్వు డబ్బు కమ్ముడు పోయావు అని తిట్టుకుంటున్నారు, వాళ్ళకే డవుటేమో మనం నిజంగా కమ్యునిష్టులమేనా అని.

      Delete
    8. "దానికి విక్రమార్కుడు చెప్పిన జవాబే సరి" :)

      "హోశ్టు గా నా మాన మర్యాదల్ని కాపాడాల్సిన పెద్ద మనిషి"

      రమణ గారికి పొగడ్తలు గిట్టవు కాబట్టి పొగడడం లేదు కానీ వారి తెలివితేటలూ, సమయస్పూర్తి & ఓర్పు నిజంగా అమోఘం సుమండీ :)

      "వాళ్ళకే డవుటేమో మనం నిజంగా కమ్యునిష్టులమేనా అని"

      అసలు కమ్యూనిజం అంటే కమ్యూనిస్టులమని చెప్పుకునే చాలా మందికి తెలీదు. ఆ బ్లాగు కాబట్టి ధైర్యంగా అంటున్నా వేరే చోట అంటే దెబ్బలు తినాల్సి వస్తుంది!

      Delete
    9. ఆ బ్లాగు కాబట్టి ధైర్యంగా అంటున్నా వేరే చోట అంటే దెబ్బలు తినాల్సి వస్తుంది!
      >>
      :-P)

      Delete
  2. 'ఇంతకీ భర్త చచ్చిపోతే అన్నిరోజులు పడీపడీ ఏడవటం దేనికి'
    రమణ గారు,

    వెలుగు నీడలు సినేమాలో సావిత్రి జీవితం ఎండాకాలంలో స్లీపర్ క్లాసు లో ప్రయాణం లా సాగుతూంటుంది. నాగేశ్వర రావు పరిచయం ప్రేమగా మారి, పెళ్ళికి దారి తీసే సమయం లో భవిషత్ లో నాగేశ్వర రావు తో తన జీవన ప్రయాణం థార్డ్ ఎ.సి. లో ప్రయాణం వలే ఉన్నంతలో సౌకర్యం జరిగి పోతుందని సావిత్రి ఊహించుకొంట్టుంది. అకస్మికంగా అయ్య వారికి కేన్సర్ జబ్బు రావటంతో హతాశురాలైన సావిత్రి, మితృడైన నగేశ్వర రావు సలహాతో,ఏ ఆప్షన్ లేక అనేక సందేహాల తో జగ్గయ్య ను పెళ్లి చేసుకొంట్టుంది. ఊహించని విధంగా జగ్గయతో ఆమే జీవన ప్రయణాం ఎ.సి.ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం వలే అత్యంత సుఖం తో సాగిపోతుంటే, కన్నుకుట్టిన దేవుడు జగ్గయ్య ను దూరం చేస్తాడు. జెనెరల్ కంపార్ట్ మెంట్ లో కొచ్చిన్ నుంచి డిల్లి ప్రయణం ఊహించుకొంటే ఎంత విరక్తి కలుగుతుందో, సావిత్రి స్థితి అటువంటి పరిస్థితి లోకి నెట్టినట్లు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇటువంటి సమయంలో అక్కినేని తరసపడటంతో, ముందే ధైర్యం చేసి ఇతనినే పెళ్లి చేసుకొన్నా, ఎదో జీవితం థార్డ్ ఎ.సి. ప్రయాణంలా సాఫీ గా సాగి ఉండేదేమో! సంఘాన్ని ఎదిరించి, ఇప్పుడు చేసుకొంటే మళ్లి కేన్సర్ రాదని గేరంటీ ఎమిటి? ఒకవేళ వస్తే రేడియేషన్,కిమో థెరపి అంట్టు ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ అనుభవించే సుఖాలేమిటి? ముందు గొయ్యి వెనుక నుయ్యి లా మారిన తన పరిస్థితిని తలచుకొని ఏడిచిందే తప్పా. మీరు ఊహించ్నంత బేల కాదు భారత నారి సావిత్రి. ఆమే దుఖం వెనుకలా ఎన్నో లెక్కలు ఉన్నాయి. మీరు అది అర్థం చేసుకోరు :)

    ReplyDelete
    Replies
    1. నేనేదో సరదాగా ఓ పాయింట్ రాయడం, మీరు దాన్నింకా సాగదీసి.. కొంచెం మసాలా యాడ్ చేసి కామెంటటం (కానీ భలే రాశారు)! సరీపోయింది.

      ఈ బ్లాగ్ చదివే ఆడరీడర్స్ దృష్టిలో మనం విలన్లమైపొయ్యే ప్రమాదం వుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సుమా!

      చిన్న సవరణ -

      నాగేశ్వరరావుకి టీబీ వస్తుంది, క్యాన్సర్ కాదు (అని గుర్తు).

      Delete
  3. ఓల్డ్‌ సినీ డైలాగ్లు మీరు అద్బుతంగా రాస్తూన్నారు సార్‌, ఇవి శ్రీశ్రీ గారి మూడో తరానికి ఏమి తెలుస్తాయి. అదీ సహిత్య సృహా తక్కువైన, ఇంజినీరింగ్‌ రోబోలు తయారౌతున్న రోజుల్లో '' కలకానిది విలువైనది బ్రతుకు '' తెలుగు సమాజంలో ఆత్మ హత్యకు పాల్పడిన ఒక ప్రాణి మళ్ళీ ప్రాణం పోసున్నాడట. అని శ్రీ శ్రీ గారు తన పాడవోయి భారతీయుడా అనె సినిమా సాహిత్య పుస్తకం లో రాసుకున్నాడు. ఎంతైనా పాత తరాన్ని ఈ కొత్తతరానికి పరిచయం చేస్తున్న మీరు ఎంతైనా అభినందనీయులు. మీ బ్లాగ్‌ ను చదివేయువ పాఠకులు మీకు ఋణ పడి వుంటారు.

    ReplyDelete
    Replies
    1. Thank you for the nice words.

      మన ఆలోచనలు, అనుభవాల్తో బ్లాగులు రాస్తుంటాం. వయసు రీత్యా - నేను పాతతరం వాణ్ణి కాబట్టి పాత ఆలోచనల్నే రాయగలను. కొందరికవి నచ్చుతాయ్, ఇంకొందరికి విసుగ్గా అనిపిస్తాయని అనుకుంటున్నాను.

      Delete
    2. నాకు కొన్నిసార్లు మీ అభిప్రాయాలు విసుగనిపిస్తాయి. మీకన్నా పది సంవత్సరాల ముందు యం.డి. చదివిన నా దగ్గరి బంధువు సమాజంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ఎంతో అవగాహన ఉంది. మీకు ఆ అవగాహన లేదనుకోను. కాని మీరు రాసేటప్పుడు పని గట్టుకొని 1970 కాలం నాటి స్టిరీయోటైప్ భావాలను గుప్పిస్తూంటారనిపిస్తుంది. మీరు భారత నారి గురించి అలా రాశారు కదా! గత సంవత్సరం మా ఫామిలి డాక్టర్ వాళ్ల అమ్మ చనిపోయింది. ఆమే చనిపోయిన దు:ఖం లో వాళ్ల నాయన కుడా మూడు నెలలకి చనిపోయాడు. మరి భారతదేశం లో ఇటువంటి భర్తలు ఎంతో మంది ఉన్నారు. సాహిత్యం లో ఇటువంటి వారి గురించి రాయటం అరుదు. ఎంతసేపటికి ఆడవారికి జరిగిన అన్యాయాలను,వాళ్ల కష్టాలను,కన్నీళ్లను ఏకరువు పెడుతూంటారు. ఇంట్లో జరిగే గోల రాయటం సాహిత్యంగా తయారైంది. ఎవరైనా దీనిని విమర్శిస్తే విలన్ గా చూడటం, వాళ్లని వాళ్లు మంచి వారుగా అనుకోవటం ఎక్కువైపొయింది .

      Delete
    3. UG SriRam గారు,

      >>స్త్రీకి ఐదోతనమే (ఐదోక్లాసు కాదు) తరగని పెన్నిధి! భారతనారికి భర్తే దైవం (ఈ విషయాన్ని నా భార్యకి చెప్పమని దయగల పాఠకుల్ని అర్ధిస్తున్నాను)! ఆడదానికి భర్త లేని జీవితం సాంబారు లేని ఇడ్లీ వంటిది! ఇంకు లేని పెన్ను వంటిది! బొత్తాల్లేని చొక్కా వంటిది!' అనుకుంటూ గుమ్మడిలా మధన పడతాను, ఆపై - చిత్తూరు నాగయ్యలా నిట్టూరిస్తాను.<<

      ఏం చెయ్యను చెప్పండి? ఇలా 1970ల స్టీరియోటైప్ భావాలు రాయడం అలవాటైపొయ్యింది. :)

      Delete
    4. *భారతనారికి భర్తే దైవం.(ఈ విషయాన్ని నా భార్యకి చెప్పమని దయగల పాఠకుల్ని అర్ధిస్తున్నాను)! *
      మీరు భారతనారి గురించి రాసినవి అక్షర సత్యాలు. చాలా మంది పాఠకులు ఆవాక్యాలు చదివితే భారత నారి కి తెలివి తేటలు లేవనుకొంటారు. అది నిజం కాదు. మీ ఆవిడనే తీసుకొండి. ఆవిడకి దైవం లాంటి భర్త నీడలో ఉన్నాని తెలుసు. కనుక చాలా ధైర్యంగా,నిర్భయంగా దేవుడిని ఎదిరించ గలిగినంత ధైర్యంతో మీతో జీవన ప్రయాణం చేస్తున్నాది. ఆవిడకి మీ పైన ఉన్న నమ్మకం, కాంఫిడేన్స్, రాబోయే ఎన్నికలలో, కాబోయే అమెరికా అధ్యక్షురాలు హిలరి క్లింటన్ కి ఆమే భర్త పైన లేదు. ఇటువంటి భర్తను సేలేక్ట్ చేసుకొన్నా ఆమే తెలివి తేటలు గొప్పవా? మీవి గొప్పవా? :)

      Delete
    5. శ్రీరాం గారూ, రమణ గారు డెబ్బయవ దశాబ్దంలో కాలేజీకి వెళ్లారనుకుంటా. అయితే ఆయన భావజాలం స్వాతంత్ర్యం కంటే ముందటినుంచే ఆదరణలో ఉంది. 1998 వరకూ ఈ భావాలే దేశంలో ఎక్కువ చెలామణీ అయ్యాయి. అంచేత వారి వాదనను "1970ల స్టీరియోటైప్ భావాలు" బదులు "బూజు బట్టిన చాందస వాదం" అంటే బాగుంటుందేమో? బూర్జువా, మతోన్మాది, పేదల రక్తం తాగే పిశాచి లాంటి పదాలతో కమ్యూనిస్టు తిట్లకు జవాబు ఇచ్చినట్టు ఉంటుంది.

      రమణ గారూ, మిమ్మల్ని 1970 నుండి 1917కి (పవిత్రమయిన అక్టోబర్ విప్లవం) ఎలా నేట్టేసానో చూసారా? ఇకనయినా శ్రీశ్రీ లాంటి ఎర్ర (ఎర్రి) మొఖాలను మీ టెంప్లేటు నుండి తీసేయండి!

      PS: only for fun, sorry if it causes any offenses to any person/place/thing/animal etc.

      Delete
  4. నా కామెంట్లో కంటిన్యుటి లేకపొవచ్చు. మొత్తం ఒకెసారి వ్రాయలేదు. ఇది పబ్లిష్ చెయ్యవలసిన అవసరం కుడా లేదు. నా ఏడుపు ఏడవడానికి మాత్రమే ఈ కామెంట్.

    డిగ్రీ చదివేటప్పుడు, శ్రీశ్రీ రచనలు దాదాపుగా దొరికినవన్నీ చదివేసాను. రైల్లో ఒకాయన (బాంక్ మానేజర్ అట) తిట్టారు, అవి చదివి నక్సలైట్లో జేరతావా ఏంటి అని. శ్రీశ్రీ రచనలు బానే ఉంటాయి, మరీ అంతగొప్పగా అనేమి అనిపించలేదు నాకు. పదాలు మాత్రమే బాగుంటాయి, ఇప్పుడు చూస్తే చాలా భావాలు చెత్తగా అనిపిస్తున్నాయి. కానీ ఈ చెత్తని బాష కవర్ చేసుకొస్తుంది, కాబట్టి నాకు ఇప్పటికీ శ్రీశ్రీ ఇష్టమే.

    కానీ ఏది చెత్త? మొన్నామధ్య, నేను ఎప్పుడో నా చెత్త బ్లాగులో అసంపూర్తిగా రాసుకున్న ఒక చెత్త టపాని పూర్తిచేసి ఒకాయనకి పంపితే మహబాగా నచ్చేసింది, బ్లాగుల్లో పెద్దగా పట్టీంచుకోలేదు, అదొక దైవ శాస్త్రం అది నీలాంటి "ఫేక్" బ్లాగర్కి అర్ధం కదులే అనుకున్నారు. మరి మెచ్చుకున్నాయిన అల్లాటప్పా శాస్త్రవేత్త కాదాయే. అలానే స్కాట్ ఆరన్‌సన్ గ్లాస్గో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సు లెఖ్ఖల డిపార్ట్మెంట్లు మైల్ల దూరంలో ఉన్నాయి, ఇంక అక్కడ(కంప్యూటర్ సైన్సు) రీసెర్చ్ ఏమి జరిగి ఏడుస్తుంది అని తిట్టాడు అప్పుడెప్పుడో. అలాంటిదే బ్లాగుల్లొ నేను ఎప్పుడో చెబితే, పోరా పిచ్చి ఫేక్ బ్లాగరు నిన్ను ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలో తెలియడం లేదు అని విచారించారు.

    బహుశా సోకాల్డ్ (కమ్యూనిష్టు/మత) అభ్యుదయ భావాలు లేకపోతే మనిషి మూర్ఖుడేమో (నారాయణ కలాం్‌ని పట్టుకుని మూర్ఖుడు అనలేదు, అదే మన పలానా కులసంఘం ఆయన్ని అంటాడా?)

    మళ్ళీ చెత్తకి వస్తే, అదేమిటో 1953లోనే మార్క్స్ భావజాలం మొత్తం తప్పు అని నిరూపించినా (అప్పటికే స్మిత్ భావజాలం మొత్త తప్పు అని నిరూపింపబడింది) రంగనాయకమ్మగారు రచనల్లో ఆ తప్పు అని నిరూపింపబడిన భావజాలమే ఉంటుంది కదా? మరి ఏది చెత్త? (సైన్సే చెత్త అంటారులేండి, లేదా అది పెట్టుబడిదారుల కుట్రే).
    అంతెందుకు రోహిణీప్రసాద్ సైన్సు రచనల్లో బోల్డు పచ్చి బూతులు, (గణితంతో కుదరనివి తర్కంతో నిరూపించొచ్చు అని సెలవిచ్చారు పొద్దులో అనుకుంటా, ఇదొక అధ్వితీయ అనుబూతు. జనాలకి నచ్చింది నమ్మేశారు, మరి లాజీషియన్స్ అంతా వెధవలు మరి, వారికి ఇది తెలియక ఏదో పిచ్చి రీసెర్చ్ చేసుకుంటున్నారు). ఆయన (సైన్సు) రచనల్లో ఒప్పులు వెతుక్కొవాల్సిన పరిస్థితి. ఐనప్పటికీ ఇవి అత్య్త్తమ రచనలు.

    ఇక, రంగనాయకమ్మగారి ఆర్ధిక శాస్త్రం పుస్తకం, బైబిలు మిషను సభల్లో చెప్పే సైన్సు పాఠాల స్థాయికి ఏ మాత్రం తగ్గదు. ఆత్మహత్య చేసుకోవాలి అంటే మోటివేషన్ కోసం ఆ పుస్తకం చదవొచ్చు, ఆవిడ అది చెత్త అంటే ఒప్పుకుంటారా? ఆవిడ భజన సంఘం ఊరుకుంటుందా?

    చివరగా నావరకు నాకు, మీ బ్లాగులో 2-3 టపాలు తప్ప మొత్తం చెత్తే, రావిశాస్త్రి రచనలకన్నా సుడిగాడు సినిమా ఫాస్ట్‌ఫార్వర్డ్లో బెటర్ అనుకుంట, మరి మీరు ఒప్పుకుంటారా? (మీ పూర్వ టపాలో ఉదాహరించిన బాలగోపాల్ పుస్తకంలో కుడా చాలా తప్పులు ఉన్నాయి, మరి అది చెత్త అంటే)

    చెత్త అన్నది చదివేవాడికి వదిలెయ్యాలి, ఏది చెత్తో ఏది కాదో చదివేవాడికే వదిలెయ్యాలి. మనం అనుకున్నది నిజంగా చెత్తో కాదో. సమగ్ర రచనలు పబ్లిష్ చెయ్యడం అన్నది చాలా మంచి పని, తరువాతి తరాలకి అదొక మంచి పాఠం, ఎవరు ఎలా అలోచించారు, ఎలా ప్రవర్తించారు, పర్యావసనాలేంటి అన్నది తెలుసుకొనడానికి. ఏది చెత్తో ఏది కాదో వాళ్ళకే తెలుస్తుంది. రంగనాకమ్మగారో, మీరో, విరసంఓ, అరసమో సెన్సర్ చెయ్యడానికి ఎవరు?

    ReplyDelete
    Replies
    1. తార గారు,

      బాగున్నారా? చాల్రోజులకి కనిపించారు. (ఎప్పటిలాగే) మీ కామెంట్ నాకు నచ్చింది.

      ఒక రచయిత గానీ, రచన గానీ అందరికీ నచ్చాలని లేదు. అది సాధ్యం కూడా కాదు.

      మీవంటివారు (రాయగలిగి వుండి కూడా) రాయకపోవడం నాకు నచ్చదు.

      >>చెత్త అన్నది చదివేవాడికి వదిలెయ్యాలి, ఏది చెత్తో ఏది కాదో చదివేవాడికే వదిలెయ్యాలి. మనం అనుకున్నది నిజంగా చెత్తో కాదో. సమగ్ర రచనలు పబ్లిష్ చెయ్యడం అన్నది చాలా మంచి పని, తరువాతి తరాలకి అదొక మంచి పాఠం, ఎవరు ఎలా అలోచించారు, ఎలా ప్రవర్తించారు, పర్యావసనాలేంటి అన్నది తెలుసుకొనడానికి. ఏది చెత్తో ఏది కాదో వాళ్ళకే తెలుస్తుంది. రంగనాకమ్మగారో, మీరో, విరసంఓ, అరసమో సెన్సర్ చెయ్యడానికి ఎవరు?<<

      అవును, ఈ భావనతోనే ఇప్పుడు రచయితల complte works వస్తున్నాయి. ఇక్కడ రంగనాయకమ్మో, రవణో తమ అభిప్రాయాలు చెబితే ఆగిపొయ్యే పరిస్థితి లేదు.

      ఇకపోతే - నేను వాడిన 'చెత్త' అన్న పదం మీకు నచ్చకపోతే, ఆ పదం వాడినందుకు సారీ చెబుతున్నాను.

      ఫైనల్‌గా -

      నాకున్న పరిమిత సమయంలో - నా అభిప్రాయాలు రాసుకోడానికి ఈ బ్లాగుల్ని ఒక వేదికగా వాడుకుంటున్నాను. నా ఆలోచనలు, అవి రాసే విధానం కొందరికి నచ్చుతాయి, కొందరికి చెత్తగా అనిపించొచ్చు.. అది నా బ్లాగ్ వీక్షకులకి వున్న హక్కు. అందుకే, నేనెప్పుడూ నా అభిప్రాయాల్ని defend చేసుకునే ప్రయత్నం చెయ్యను.

      రావిశాస్త్రి చెప్పినట్లు - రాసినవాడు రాసిందాన్ని పసిబిడ్డలా సాకకుండా - దాని మానాన దాన్ని అలా వదిలేస్తేనే బెస్టు. బతికితే బతుకుతుంది, లేకపొతే అదే చస్తుంది.

      Delete
    2. రమణగారు,
      నన్ను గుర్తుంచుకున్నందుకు ధన్యవదాలు,

      శ్రీశ్రీ మహా కవో కాదో నాకు తెలియదు కాని, గొప్ప కవి నా దృష్టిలో. కాదు మహాకవి అంటారా? అది మీ అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వారిది, అది మన ప్రాధమిక హక్కు, కాదనడానికి ఎవరికీ హక్కులేదు. ఐశ్వర్యరాయ్ ఉత్తరప్రదేశ్ + బెంగాళీ వాళ్ళ అబ్బాయిని పెళ్ళి చేసుకున్నది కాబట్టి నాకు సైబీరియా అంటే ఇష్టం లేదు. (ఇదెక్కడి లాజిక్ అంటారా? అదంతే, అన్ని అభిప్రాయాలకీ, ఇష్టాలకి తొక్కలో కారణాలు ఉంటాయా?). నా రూమ్మేట్‌కి (హౌస్మేట్ అనాలేమో) అమెరికా అంటే ఇష్టం, నాకు రష్యా, సో, ఉక్రేయిన్‌లో మానవహక్కుల హనన అని అతను, కాదు అది విప్లవం అని నేను అనుకుంటాం. ఎవడి గోల వాడిది, నిజం ఏమిటో నాకు తెలియదు, నా రూమ్మేట్‌కీ తెలియదు. నేనే కరెక్ట్ అని ఇద్దరం అనుకుంటాం. సో, ఎవరి అభిప్రాయం వారిది, ఇతరుల అభిప్రాయాలని గౌరవించడం నాగరికత.

      ఇక మీ అభిప్రాయల సంగతి అంటారా? అవి నాకు నచ్చాల్సిన అవసరం లేదు. చదువుతాం, నేర్చుకోవాలి అనుకున్నవి, తెలుసుకోవాలి అనుకున్నవి ఉంటే నేర్చుకుంటాం, లెదు అంతె చదివి, ఒహో అనుకుంటాం అంతే.
      ఇక మీ బ్లాగు విషయానికి వస్తే, నేను మీ నుంచి ఇంకా మంచి రచనలు ఆశిస్తాను (మంచి అనేది ఇక్కడ మళ్ళీ అభిప్రాయమే) నావరకు నాకు మీ బ్లాగులో నాకు జీవితాంతం గుర్తుండిపోయే టపాలు ఐతే ఇప్పటివరకు రాలేదు. (అసలు బాల్గుల్లోనే నాకు గుర్తుండిపోయే టపా వ్రాశింది ఈమాటలో కొడవళ్ళ హనుమంతరావు గారు, అవీ మధ్యలో ఆగిపొయింది, ఇప్పటికీ ఆయన అది పూర్తి చెస్తే బాగుణ్ణు అని ఎదురుచూస్తూ ఉంటాను).

      ఇక నేను వ్రాయకపోవడానికి కారణం.
      1. నా టర్గెట్ పాఠకులు పది- డిగ్రీ చదివే పిల్లలు, వాళ్ళు ఎవరూ వచ్చి బ్లాగులు చదువుతారని అనుకోను, అసలు తెలుగు చదవడం రాదు అని చెప్పుకోవడమే ఒక ప్యాషన్ ఇప్పుడు. పొరపాటున చదివినా నా అభిప్రాయాలు పెద్దలకి చెబితే నన్ను ఉతికి ఆరేస్తారు. (కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు అనవసరం అని నా నమ్మకం, నా ఇంగ్లీషే ఘోరం, నాదే అనుకుంటే ప్యాట్రిక్ ఖొసాది (NYU CS) ఇంకా ఘోరం, నా గైడు సంగతి అసలు చెప్పక్కర్లేదు, ఇదే విషయం చెబితే ఎవరైనా నమ్ముతారా, ఇంగ్లీషు సోగ్గా మాట్లడకపోతే పోరా ఎదవ నువ్వు మాకు చెప్పేదేంటి అంటారు).

      2. నాకున్న పరిజ్ణానం చాలదు, ఒక చిన్న ఉదాహరణ, గాస్ ప్రైం నెంబర్ థీరం గురించే వ్రాశాను అనుకోండి, సరే గాస్ ఎలానో ప్రూవ్ చేశాడు ఐతే నాకేంటి? రీమన్ హైపొథతిస్ ప్రువ్ ఐతే నాకేంటి? అని అడిగితే సమాధానం చెప్పాలి అంటే ఏమి చెప్తాం? (దీనికి ఒక పేరెన్నిక తెలుగు సైన్సు రచయిత, అందం, బ్యూటీ అని ఎవేవో చెప్పారు), కానీ కంప్యూటర్ సైన్సులో, ఫిజిక్సులో బోలెడు చిక్కు ముళ్ళు విప్పాలి అంటే ఇదొక అడ్డంకి(you can refer Prof. Margulis, Dani and Kirshan's works. Significant amount of Yale funds(even from CS, phy dept.funds Maths students who are working on this) are dedicated for this work now), అదే కనుక ప్రువ్ చేస్తే ప్రస్తుతం ఉన్న టెక్నాలెజీ చాలా ముందుకి వెళ్తుంది, అవి ఏమిటో ముందు తెలుసుకోవాలి అంటే ఎడ్వాన్స్డ్ గ్రాడ్ లెవల్ కోర్సులు 2 చెయ్యాలి (అంటే ప్రీరిక్విసైట్స్ కవర్ చెయ్యడం కోసమే ఐదేళ్ళు అధమం పడుతుంది). అప్పుడే కరెక్ట్గా వ్రాయగలను, ఆ స్థాయికి రావడానికి నాకు ఇంకో రెండేళ్ళు ఐనా పడుతుందేమో(అది నా ఏరియా కాదు, కానీ నేర్చుకోవాలి, దానికన్నా ముందు నా ఏరియాలో ఎక్పర్టైజ్ రావాలి). సాధారణంగా ఒక దాని గురించి ఒక అభిప్రాయం ఉండాలన్నా, వ్రాయాలన్న ఆ ఏరియాలో ఒక రెండు పేపర్లు పబ్లిష్ చేసేవరకు ఆగాలని పెద్దల ఉవాచ.

      నా మొదటి కామెంట్ సరదా టోన్లో వ్రాశానండి, మీరు సారి చెప్పవలసిన అవసరం లేదు, మీ రాతలని విమర్శించనూ లేదు( బహుశా సుడిగాడు సినిమా మీరు చూడలేదేమో, చూడకపోతే చుసే ప్రయత్నం చెయ్యకండి అది ఆరోగ్యానికి హానికరం).

      Delete
  5. మనిషిని మనిషి దేవుడు కాదు అన్నందుకు కేసేస్తున్నారు, నా కామెంట్ చూసి ఎవరైనా హర్ట్ అయ్యి నామీద కేసేస్తే మీదేభాద్యత, నాకేమీ తెలియదు నేనసలే ఫేక్.

    ReplyDelete
    Replies
    1. ఒప్పుకుంటున్నాను, నాదే బాధ్యత! సరేనా? :)

      Delete
  6. ఇక మీ రాజకీయ భావలపై ఆత్మ విమర్శలేదు. రైట్ వింగ్ వారిని సందు దొరికితే తిడదామని కూచొని ఉంటారు. సంఘ్ పరివార్ సోషల్ మీడీయాలో స్వేచ్చని అడ్డుకొంట్టున్నాదా? ఇది పూర్తి అవాస్తవం. గుజరాత్ ఘటన పై నమో ను తీవ్రంగా విమర్శిస్తూ రాసే ముకుల్ సిన్ హా లాంటి వారు నెట్ లో కోకొల్లలు ఉన్నారు.సుమారు 70 యన్ జి ఓ లు ఈ పని మీదే ఉన్నాయి. వీరందరికన్నా మీరు ఎక్కువ విమర్శలు చేయగలారా? మీ ఆరోపణలలో బిజెపి గెలిచిందన్న ఆక్రోశం తప్పితే ఎమి లేదు. రైట్ వింగ్ మద్దతు దారులకు సమాజం గురించి తెలియదని మీకు చాలా పెద్ద నమ్మకం ఉంది.అందరి వామపక్ష మేధావులు మద్దతు దారల మాదిరిగా మీరు ప్రవర్తించారు. వామపక్షాలు కాంగ్రెస్ బి. టిం అని ఈ రోజున అందరికి తెలుసు.మీ వరకు వస్తే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉందంట్టూ రాసినది చదివి అవాక్కయ్యాను. సినేమాలో క్లైమాక్స్ దృశ్యం లో పోలిసులు వచ్చినపుడు అల్లు రామలింగయ్య, రావుగోపాల రావును వదలి పోలిసుల పక్షాన ప్లేట్ ఫిరాయించినట్లు మీరు(వామపక్ష వాదులు) కాంగ్రెస్ పార్టి వైపుకు దూకేశారు. :)
    రైట్ వింగ్ వారికి సమాజం గురించి ఏ అవగాహన లేకపోతే మొన్నటి ఎన్నికలలో అన్ని సీట్లు ఎలాగెలుస్తారు? బిజెపికి కార్పోరేట్లు డబ్బులు ఇచ్చాయని రాసుకొని ఆనందిస్తూంటారు. లక్షల కోట్ల స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టి దగ్గర డబ్బులు లేవానా? స్వాతంత్ర మొచ్చిన 60సంవత్సరాల తరువాత దేశంలో రాజకీయ శూన్యం ఏర్పడితే సంఘ్ పరివార్ రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పద్దతూలో పూడ్చగలిగింది. అది వారి దీర్ఘదృష్టికి నిదర్శనం. మరి వామ పక్షాలకున్న లాంగ్ టరం ప్లాన్ ఎమిటి? రాజకీయ శూన్యం ఎందుకు పూరించలేకపోయాయో ఆత్మ విమర్శా చేసుకోక పోగా, సి.పి.ఐ నారాయణ, రాఘవులు ఒక్క సీటు కోసం ఎలా దూషించుకొన్నారో అందరికి తెలిసిందే.

    ReplyDelete

  7. శ్రీశ్రీ కవిత్వం ఆస్వాదించాలంటే, వాగ్దానం సిన్మా లో హరికధ వినండి. ఆయన పద విన్యాసం, ద్వని, అంత్య ప్రాస, శబ్దాలంకారాలు; పోతన కవిత్వాన్ని తలపిస్తాయ్.

    ఇక విప్లవ రచనలన్నీ జనాల వెర్రి ని చేసుకోటానికి రాసారు.... ఆయన నాస్తిక/విప్లవ కవితలకు, జీవనశైలికి పొంతనే వుండదు మరి!

    ReplyDelete
  8. "నాగేశ్వరరావు సావిత్రిని ప్రేమిస్తాడు. అతనికేదో రోగం వస్తుంది. అంతట నాగేశ్వరరావు తన ప్రేమని త్యాగం చేసి (ప్రేమ త్యాగాన్ని కోరుతుంది) సావిత్రికి జగ్గయ్యతో పెళ్లి జరిపిస్తాడు (ఇట్లాంటి stand by పెళ్ళికొడుకు వేషాలు జగ్గయ్య చక్కగా వేస్తాడు). జగ్గయ్య చాలా మంచివాడు కూడా! ఎందుకంటే - కథని ముందుకు నెట్టడానికి హఠాత్తుగా చచ్చిపోతుంటాడు."

    నేను సినిమా చూడలేదు కనుక నా ప్రశ్న మీకు సిల్లీగా అనిపించవచ్చు. రోగం వచ్చింది నాగేశ్వరరావుకు కదా మరి జగ్గయ్య ఎందుకు పోతాడు? ఒకవేళ తన రోగం సులువుగా నయం అయివుంటే ఆ మాత్రానికే త్యాగం చేయడం ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. విధిఆడిన వింత నాటకం లో జగ్గయ్య చనిపోతాడు, చనిపోతాడనుకొన్న నాగేశ్వరరావు బ్రతుకుతాడు :)

      Delete
    2. రమణ గారు "ప్రేమ త్యాగాన్ని కోరుతుంది" అనే ఆణిముత్యం లాంటి మాట చెప్పారు. మీరు "విధి బలీయం అయినది" అంటూ మరొక్కటి జోడించారు. Long live cliches :)

      Delete
  9. "కలకానిది, విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు"

    మీకు హైస్కూల్లో ఉన్నప్పుడే ఈ పాట నచ్చిందంటే నమ్మబుద్ధి కావట్లేదు.

    "చలం, కుటుంబరావు, గోపీచంద్, పద్మరాజు, అడవి బాపిరాజు, కాళీపట్నం రామారావుల రచనలు కొన్ని చదువుతుంటే అమృతాంజనం ఎడ్వర్టైజ్‌మెంట్ కోసం రాసినట్లుంటాయి!"

    ఈ లిష్టులో రావిశాస్త్రి గారి పేరు లేదేమిటి చెప్మా!

    ReplyDelete
    Replies
    1. పైనున్న శ్రీశ్రీ ఫొటోని నేనింతమటుకూ చూళ్ళేదు. చాలా లైవ్‌లీగా వుంది. పోస్ట్ రాయడానికి ఈ ఫొటోనే ముఖ్యకారణం.

      పాట సింపుల్‌గా సరళమైన పదాల్తోనే వుంటుంది. హైస్కూలు వయసంటే - కొద్దోగొప్పో పాట సత్తా తెలిసే వయసేననుకుంటున్నాను. నేను శరత్‌ని (దేశీ ప్రచురణలు) అప్పటికే చదివేశాను.

      ఇంకోకారణం - మా చిన్నమేనమామ ఈ పాటనీ, 'నీలిమేఘాలలో గాలికెరటాలలో' అనే పాటనీ చక్కగా పాడ్తుండేవాడు.

      ఈ రచయితల లిస్టులో రావిశాస్త్రి పేరెందుకు లేదు? ఎలా వుంటుంది! వుండదు.

      ఎందుకంటే - రావిశాస్త్రి దేవుడు కాబట్టి. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.