Tuesday, 22 July 2014

రాజు - పేద


ఈ ఫొటో చూడండి. ఈ బుడతడు బ్రిటీషు యువరాజుగారు! అబ్బ! ఎంత ముద్దొస్తున్నాడో కదా! ఎంతైనా డబ్బున్నోడి కళే వేరు. నో డౌట్! డబ్బు టన్నుల కొద్దీ అందాన్నీ, ఆహ్లాదాన్నీ ఇస్తుంది. కొందరు 'డబ్బు సుఖాన్నివ్వదు, డబ్బు శాశ్వతం కాదు' అంటూ వదరుతుంటారు. ఈ దిక్కుమాలిన దేశంలో దరిద్రాన్ని కూడా ప్రేమించే దరిద్రులున్నారు (వీళ్ళు కసబ్‌గాడి కన్నా డేంజరస్ ఫెలోస్). ఏదీ! వాళ్ళని నా ముందుకు తీసుకురాండి. షూట్ చేసి పారేస్తాను వెధవల్ని.

ఒరే అణాకానీ వెధవల్లారా! ఈ యువరాజుబాబు ముఖంలో కళని గమనించారా? దీన్నే 'డబ్బుకళ' అంటారు. కాదన్డం లేదు - మీలాంటి అడుక్కుతినే వెధవల మొహాల్లోకి కూడా గిన్నెడు గంజి దొరికినప్పుడు కళొస్తుంది. అయితే - దాన్ని 'గంజికళ' అంటారు! అర్ధమైందా? ఈ గంజికళ మీద కవిత్వం రాసి శాలువాలు కప్పించుకున్నవాడి మొహంలో కూడా కళ వుంటుంది. దీన్నే 'శాలువాకళ' అంటారు!

ఆ బ్రిటీషు చినబాబు మొహంలో చిరునవ్వు, ఆత్మవిశ్వాసం చూడండి. ఆహాహ! నా తండ్రే! నా బుజ్జే! తెల్లగా మీగడలా, ముట్టుకుంటే కందిపొయ్యేట్లున్నావు. ఎంత ముద్దొస్తున్నావురా నాయనా! జాగ్రత్త నాన్నా! జాగ్రత్త. ఎండపొడకి దూరంగా వుండు.. కందిపోగలవు. ఒంటిపై వర్షపుచుక్క పడనివ్వకు.. జలుబు చెయ్యగలదు. బిస్కత్తులు జాగ్రత్తగా తిను.. పొలమారగలదు.

ఇంతలో -

'అయ్యా! ఆకలేస్తందయ్యా! అన్నం తిని నాల్రోజులైంది బాబయ్యా! బిచ్చమెయ్యి దొరా!'

తోక తెగిన గజ్జికుక్క ఏడుస్తున్నట్లుగా, అమ్మోరికి బలవుతున్న మేకపిల్ల ఆర్తనాదంలా ఒక అరుపు లాంటి అర్దింపు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా బొచ్చెలో లయబద్దంగా చిల్లర ఎగరేస్తున్న మోత. చికాగ్గా అటువైపు తల తిప్పి చూశాను. ఒక చిన్న కుర్రాడు, పరమ మురికిగా ముదనష్టంగా అడుక్కుంటున్నాడు.

ఒరే దరిద్రుడా! నేనిక్కడ బ్రిటీషు దొరబాబు గూర్చి మాట్లాడుతుంటే నీ ఆకలి కేకలేంట్రా? అబ్బా! ముక్కు పగిలే ఈ కుళ్ళు వాసనేమిట్రా? నువ్వసలు స్నానం చెయ్యవా? ఏమన్నావు? అన్నం తిని నాల్రోజులైందా? మంచిది. ఇంకో నాల్రోజులు ఇలాగే వుండు. హాయిగా చచ్చూరుకుంటావు. నీ ఏడుపుగొట్టు మొహంలో ఆ దైన్యం, నిస్పృహ, అసహాయం చూస్తుంటేనే కడుపులో తిప్పుతుందిరా బాబూ.

చీచీ! దేశంలో మురికి ముండాకొడుకులు ఎక్కువైపొయ్యారు. ఈ దరిద్రుల వల్ల మన దేశానికి అంతర్జాతీయంగా ఎంత చెడ్డపేరు! కొంపదీసి నిన్ను ఏ ఫారిన్ టూరిస్టూ చూళ్ళేదు కదా? ఒకపక్క మన నాయకులు దేశాన్ని ముందుకు తీసుకెల్దామని అహోరాత్రులూ కష్టపడుతుంటే, ఈ కుళ్ళు గోచీ వెధవలు వెనక్కి లాగుతున్నారు. హమ్మా! ఎంత కుట్ర ముండాకొడుకులు!

పేదరిక నిర్మూలన అంటే పేదరికాన్ని నిర్మూలించడం అంటూ కొందరు అదర్శ పురుషులు మేధావి కబుర్లు చెబుతుంటారు. మీ ఆదర్శాలకో నమస్కారం. ఇవన్నీ జరిగే పన్లు కాదు సార్. అంచేత పేదల్ని నిర్మూలించడమే పేదరిక నిర్మూలనగా, ఒక పవిత్ర దేశసేవగా నేను భావిస్తాను.

అయితే - పేదల్ని నిర్మూలించడానికి హిట్లర్‌గాళ్ళా గ్యాస్ చాంబర్లు అవసరం లేదు. అవన్నీ పాతరోజుల్లో అమాయకులు చేసిన పని. పసిపాపడికి పాలు బంద్ చేసేస్తే ఏడ్చిఏడ్చి వాడే చావడా? అలాగే - ఈ దేశంలో పేదలు బ్రతికే అవకాశం లేకుండా చేస్తే సరి! వాళ్ళే చస్తారు! ఈ ఆదర్శం గాళ్ళు ఎట్లాగూ గుండెలు బాదుకుంటారు, పట్టించుకోకండి. వాళ్ళంతా విదేశీ సంస్థల నుండి డొనేషన్లు కొట్టేసే బాపతు.

కానీ - నా గొప్ప ఆలోచనల్ని అర్ధం చేసుకునే మేధావులేరి? ఈ రాజకీయ పార్టీల వెధవలక్కూడా పొద్దస్తమానం 'పేదల్ని ఉద్దరిద్దాం, ఆదుకుందాం' అనే నికృష్టపు ఆలోచనలే గానీ, 'పేదల్ని నిర్మూలిద్దాం' అనే పవిత్ర ఆలోచన రాదు కదా!

ఇలా తీవ్రంగా ఆలోచిస్తుండగా -

ఆయ్యా! ఇందాకట్నుండి మీరు గుండెలు బాదుకోవడం చూస్తూనే వున్నాను. అయినా - 'నాకెందుకులే' అనుకుని ఆ పక్కగా నిలబడ్డాను. ఇంకొంచెం సేపు మీరిలాగే ఆయాసపడితే బీపీతో చచ్చేట్లున్నారు. అంచేత - మీకిక వాస్తవం చెప్పక తప్పదు, వినండి.

మీ పేదల నిర్మూలన ఎజెండానే గత కొన్నేళ్ళుగా ఈ దేశంలో అమలవుతుంది. అయితే ఈ కార్యక్రమం చడీచప్పుడు లేకుండా, చాప కింద నీరులా జరుగుతుంటుంది. త్వరలోనే మీరు కలలు గంటున్న పేదలు లేని సువర్ణ భారతాన్ని కాంచగలరు. అప్పుడు మన పిల్లలందరూ బ్రిటీషు యువరాజు వలే బొద్దుగా, ముద్దుగా చిరునవ్వులు చిందించగలరు!

అంతట -

ఆ తీపి కబురు వినినంతనే.. నా హృదయం ఆనందంతో డిస్కో డ్యాన్స్ వేసింది. మనసు మైమరచి కథాకళి నృత్యం చేసింది. దూరంగా ఎక్కణ్ణించో 'ఉందిలే మంచికాలం ముందుముందునా.. ' అంటూ పాత సినిమా పాట వినిపిస్తుంది. అవును, ముందుంది మంచికాలమే!

(photos courtesy : Google)

10 comments:

  1. రమణ గారు!

    మీ రాత కళ చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ. అది 'ప్రేతకళ' పడకుండా చూసుకోవాలి. :)

      Delete
  2. అయ్యా మా "చీప్" మినిస్టర్ స్వయంగా హుండీ పెట్టి అడుక్కుంటున్నాడు. అడక్క తినడం లో వున్న హాయి మీకేం తెలుసు (నోట్ : లెక్కా పత్రం చూపాల్సిన అవసరం లేదు హుండిలకు, దొరికిన కాడికి దొబ్బి తినొచ్చు). ఆ విధంగా అడుక్కోచ్చి మా అందరిని సింగపుర్ సిటిజన్స్ చేయాలని ఆయన 'సొమాలియా' సిటిజన్ అవతారం యెత్తాడు. ఇక్కడ మీరేమో రాజు పేద అంటున్నారు.

    ReplyDelete
    Replies
    1. ముష్టివాళ్ళ మీద ఇంతకుముందో పోస్టు రాసినట్లు గుర్తు.

      నాకు మాత్రం ఈ పోస్టు రాయడానికి ప్రేరణ - ఆ చీమిడిముక్కువాడు. :)

      Delete
  3. సెటైరు బాగుంది. మా సీయెమ్ము గారి హుండీలో ఓ లచ్చ కోట్లయినా వచ్చి రాలక పోతాయా.అప్పుడు చూడండి మజా!

    ReplyDelete
  4. //అవును, ముందుంది మంచికాలమే!//
    అవుని మహ ప్రభో! అవును! పేదరిక రికన్సీలేషన్‌ సిద్దాంతాని ఆడం స్మిత్‌ అనే మహాహాహా నీయుడు ఆ నాడే కనిపెట్టాడు. మీకు తెలియదేమో! దాన్నే చాత్తిరి బావు) అద్బుతంగా చెప్పిండు. కూలీ వెదవలు చావాకూడదు చస్తే మనకు పని చేసె టోల్లు కరువవుతరు. అట్లా బతకా కూడదు బతికి తే మరింత కూలీ కావలని డిమ్మమాండ్‌ పెడతరు.. అంచేత .. అంచేత గిద్దెడు కూలీ ఇచ్చే చోట పావు గిద్దెడు ఇవ్వాలి. అపుడు వాడు కొన ప్రాణం తో కొన సాగుతాడు. కాబట్టి! పేద వాన్ని బతకనివ్వాలి. బట్ట కట్ట కుండా. మనం బాగు పడెటందు. .. మర్చి పోయారా!

    ReplyDelete
    Replies
    1. అవును. మీరు కోట్ చేసిన రావిశాస్త్రి కథ చాలా పాపులర్.

      రావిశాస్త్రిని మర్చిపోవటమా?!

      ఏం మాట్లాడుతున్నారు మీరు!? థర్టీ యియర్స్.. థర్టీ యియర్స్ అభిమానం ఇక్కడ. :)

      Delete
  5. రమణ గారూ, పేదల నిర్మూలన అంటూ జరిగితే చాలా దారుణం. దొరబాబుల కార్లు వాళ్ళే తోలాలా? దొరసానులకు బాసన్లు కడిగే మురికి బట్టలు ఉతికే కాలం దాపరిస్తుందా? చిరునవ్వు చిందిస్తున్న ఆ యువరాజు చీమిడి ఎవరు తుడుస్తారు?

    ప్రపంచ ధనికులారా ఏకం కండి, పోయేది ఏమీ లేదు!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.