శ్రీ పరిమి ఆంజనేయశర్మగారు మా గురువుగారు. వారు మొన్న ఇరవైయ్యో తారీఖున మరణించారన్న వార్త చదవంగాన్లే మనసంతా భారంగా అయిపోయింది. గురువుగారు పెద్దవారైపొయ్యరు, ఆయనకి సమయం వచ్చింది, వెళ్ళిపొయ్యారు. అవున్నిజమే, వ్యక్తులు మనకి ఎంత ఇష్టమైనా (ప్రకృతి విరుద్ధంగా) మనకోసం ఎన్నాళ్ళైనా అలాగే వుండిపోరు కదా? ఈ విషయం నాకూ తెలుసు. కానీ నేనేం చెయ్యను? నాకు చాలా దిగులుగా వుంది.
మనకి జీవితంలో అనేకమంది తారసపడుతూనే వుంటారు. వారిలో అతి అరుదుగా మాత్రమే కొందరు వ్యక్తులు మనని ప్రభావితం చేస్తారు, మనసులో చెరగని ముద్ర వేస్తారు. అటువంటి అరుదైన వ్యక్తుల్లో శ్రీ పరిమి ఆంజనేయశర్మగారు ఒకరు (గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!). వారు నాకు పాఠాలు చెప్పి నలభయ్యేళ్ళు దాటింది. నేను వారి శిష్యుడినవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, వారితో ఇంటరాక్ట్ అయిన ప్రతిక్షణాన్నీ అపురూపంగా భావిస్తున్నాను.
నేను గుంటూరు గురవయ్య హైస్కూల్లో చదువుకున్నాను. మా గురువుగారు నాకు వరసగా మూడేళ్ళపాటు సైన్స్ టీచర్. ఆయన తెల్లగా, బొద్దుగా, చిరుబొజ్జతో, జులపాల జుట్టుతో - తెల్లని పంచె, లాల్చీతో మెరిసిపోతుండేవారు. మా స్కూల్లో మంచి సైన్స్ లాబ్ ఉంది. గురువుగారికి సైన్స్ ప్రయోగాలు చేసి చూపించడం చాలా ఇష్టం. తెల్లటి జుబ్బాలోంచి తెల్లటి చేతులతో ఆ టెస్ట్ ట్యూబులు, పిపెట్లతో ఆయన చేసే విన్యాసాలు గమ్మత్తుగా అనిపించేవి.
ఒక్కోసారి ఆయన మమ్మల్నందర్నీ దూరంగా జరగమని, లక్ష్మీ ఔటు పేల్చేప్పుడు తీసుకునే జాగ్రత్తల్లాంటివి తీసుకుని, బర్నర్ మీద టెస్ట్ ట్యూబులోని ద్రవాల్ని వేడి చేస్తుండేవాళ్ళు. అప్పుడు టెస్ట్ ట్యూబులోంచి అన్నం ఉడుకుతున్నట్లు 'గుడగుడ'మని బుడగలొచ్చేవి, 'బుసబుస'మంటూ పొగలొచ్చేవి.
మాకా ల్యాబ్‌లోని కెమికల్స్ నుండి వచ్చే ఘాటైన వాసనలకి కళ్ళు మండేవి, దగ్గొచ్చేది. గురువుగారు మా అవస్థకి తెగ సంతోషించేవారు! 'ఒరే నానా! మీరీ ఘాటు అనుభవించి తీరాలి. ఇదో గొప్ప అనుభవం. గొప్పశాస్త్రవేత్తలు ఇట్లాంటి చోటే గొప్ప విషయాలు కనిపెట్టారు. మీకు బోర్డు మీద చాక్‌పీసుతో గీస్తూ ఎన్నిరోజులు పాఠాలు చెప్పినా, ఈ ల్యాబ్ అనుభవం రాదురా.' అనేవారు.
మా మాస్టారు ఒక్కోసారి మమ్మల్ని వెంటేసుకుని (మ్యూజియం చూపిస్తున్నట్లుగా) ల్యాబ్‌లోని వివిధ పరికరాల్ని, ద్రవాల్ని చూపిస్తూ వివరంగా చెప్పేవారు. నాకు ఆయనతో సమయం చాలా ఉత్సాహంగా ఉండేది. పాఠం మధ్యలో సడన్‌గా ఆపి 'నానా! ఈ నెల చందమామ చదివారా? చదవండి నానా. మీరు చందమామ రెగ్యులర్‌గా చదవాలిరా.' అనేవారు.
మా మాష్టారు పిల్లలతో సమయం గడపడం ఉద్యోగ ధర్మంగా భావించలేదు. నాకాయన పిల్లలకి పాఠాలు చెప్పడం, వారితో నిరంతరం వారి భాషలోనే కమ్యూనికేట్ చెయ్యడం.. బాగా ఎంజాయ్ చేశారనిపిస్తుంది. లేకపోతే వారు మాలో ఒకడిగా అంతలా కలిసిపొయ్యేవారుకాదు.
'ఈయన నోట్సు ఇవ్వడు, నోట్సు రాయనివ్వడు. టెక్స్టు బుక్కే చదవాలంటాడు, ఐఎంపి (important) చెప్పడు. పాఠాన్ని పాఠంలాగా కాకుండా ప్రశ్నలు, జవాబులు కార్యక్రమంలాగా విచిత్రంగా చెబుతాడు. చూసి అర్ధం చేసుకోవాలంటాడు, ఇప్పుడీ ల్యాబులో మనని చావగొడుతున్నాడు.' అని వెనకనుండి సత్తాయ్‌గాడు, భాస్కరాయ్‌గాడు ఒకటే సణుగుతుండేవాళ్ళు.
ఆంజనేయశర్మగారు ఒకసారి మా తెలుగు క్లాసులోకి 'మాస్టారూ! విత్ యువర్ పర్మిషన్.. వన్ మినిట్.' అంటూ వడివడిగా క్లాసులోకి వచ్చారు. ఆయన తెల్లని లాల్చీ ముందు కొంత భాగం చుక్కల్లాగా బొక్కలు, మరకలు! కుడి బొటనవేలు, చూపుడు వేళ్ళు పసుపుగా వున్నాయి. ఆయన తన లాల్చీ, వేళ్ళని ప్రదర్శనగా చూపిస్తూ క్లాసంతా ఆ చివర్నుండి ఈ చివర దాకా హడావుడిగా తిరిగారు.
'నానా! ఇవ్వాళ C సెక్షన్ వాళ్ళకి ప్రయోగం చేసి చూపిస్తున్నప్పుడు టెస్ట్‌ట్యూబ్ పగిలింది. సల్ఫ్యూరిక్ ఏసిడ్ మీదకి చిందింది. అది మన వంటిమీద, బట్టల మీద పడితే ఏమవుతుందో మీరు పుస్తకంలో చదువుకున్నారు. ఇప్పుడు నన్ను చూస్తే మీకు ఇంకా బాగా అర్ధమవుతుందని చూపించడానికి వచ్చాను.' అన్నారు. ఆపై తెలుగు మేస్టారుకి థాంక్స్ చెబుతూ నిష్క్రమించారు.
తెలుగు మాస్టారు ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు. మా గురువుగారి బాడీ లాంగ్వేజి కొందరికి చాదస్తంగా అనిపించవచ్చు. కానీ - పిల్లలకి విషయం అర్ధమయ్యేట్లు చెప్పాలి అనే తపన తప్ప ఆయనికి ఇంకేవీ పట్టవు!
అన్నట్లు - గురువుగారు నాతో కథలు రాయించేవారు! అవి ఎక్కువగా రాజుగారి కూతుర్ని రాక్షసుడు ఎత్తుకుపోవటం, హీరో మంత్రశక్తుల సాయంతో రాజకుమారిని తీసుకొచ్చివ్వడం వంటి చందమామ కాపీ కథలే. అయితే అవి ఆయనకి నచ్చేవి! వాటిని క్లాసులో నాతో బిగ్గరగా చదివించేవారు. ఆయన అలా చెయ్యడం నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి దోహదపడింది. అంతకుముందు ముంగిలా మూలనుండే నేను ధైర్యంగా లేచి నిలబడి పాఠాల్లో డౌట్లు అడగడం ప్రారంభించాను. ఇది నాకు గురువుగారు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తాను.
ఆ రోజుల్లో ఎటెండెన్స్ వుంటే చాలు, ప్రమోట్ చేసేవాళ్ళు. ఆయన నాకు తొమ్మిదో తరగతి క్లాస్ టీచర్. తొమ్మిది సంవత్సారాంతాన రిజిస్టర్లలో ఎటెండెన్స్ టాలీ చెయ్యటానికి నన్ను వారి ఇంటికి రమ్మన్నారు. అప్పుడు అరండల్‌పేటలోని వారి ఇంటికి వెళ్ళాను.
ఆయనా, నేనూ ఇంటి ముందున్న చెట్టు కింద, అరుగు మీద చాపేసుకుని కూర్చున్నాం. మాస్టారు మొత్తం రిజిస్టర్లు నాముందు పెట్టారు. ఒక్కో విద్యార్ధి పేరు రాసి ఆ పేరు ముందు వారి హాజరైన దినాలు టాలీ చేసి రాయమన్నారు. ఆయనకి ఒక పిల్లవాడు (వారి అబ్బాయనుకుంటాను) స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చిచ్చాడు. వారు కూనిరాగాలు తీస్తూ, చప్పరిస్తూ కాఫీని ఎంజాయ్ చెయ్యసాగారు.
నాపని - ఎటెండెన్స్ తక్కువైనవాడి పేరు మాస్టారుకి చెప్పాలి.
'శాస్త్రికి పదిరోజులు తగ్గాయండి.'
'ఒరెఒరె! మన శాస్త్రి లవకుశ పాటలు ఎంత బాగా పాడతాడ్రా! వాడికి ఆ పదిరోజులు ఎడ్జస్ట్ చెయ్యి నానా!' అన్నారు.
లవకుశ పాటలు చక్కగా పాడితే ఎటెండెన్స్ ఎందుకు సరిచెయ్యాలి? నాకర్ధం కాలేదు, బుర్ర గోక్కున్నాను. రిజిస్టర్లలో ఏబ్సెంట్ అయినచోట ఏబ్సెంట్ మార్క్ చెయ్యకుండా చుక్క పెట్టి వుంటుంది. అక్కడక్కడా ఒక పది చుక్కల్ని P గా మార్చాను.
'కృష్ణకి ఇరవై రోజులు తగ్గిందండి.'
'ఒరెఒరె! మన కృష్ణ ఎన్నముద్దాలె చాలా మంచివాడ్రా. పాపం! తండ్రి లేని పిల్లాడు, వాడిక్కూడా ఎడ్జస్ట్ చెయ్యి నానా!'
కృష్ణకి సరిచేశాను.
'సత్తాయ్, భాస్కరాయ్‌లకి బాగా తక్కువైందండి.'
వీళ్ళిద్దరి గూర్చి ఇంతకుముందు నా 'గురజాడ' కష్టాలు! లో రాశాను. వీళ్ళు క్లాసులో చేసే గోల అంతింత కాదు.
ఇప్పుడు మాత్రం గురువుగారు ఖచ్చితంగా 'వెధవలకి బుద్ధి రావాలి. ఎడ్జస్ట్ చెయ్యకు.' అంటారు. క్లాసులుకి సరీగ్గా రాకుండా గొడవ చేసేవాళ్ళ పట్ల మాస్టారు ఎందుకు జాలి చూపుతారు? చూపరు. అదీగాక మొన్ననే వాళ్ళు గోడ దూకి పారిపోతూ మాస్టారుగారికి పట్టుబడ్డారు కూడా.
'ఆ వెధవలకి తగ్గుతుందని ముందే ఊహించాను. వాళ్ళు క్లాసుకి వస్తే మనకి ఇబ్బంది గానీ, రాకపోతే మంచిదేగా? వాళ్ళక్కూడా ఎటెండెన్స్ సరిచెయ్ నానా!' అన్నారు గురువుగారు.
నేను ఆశ్చర్యపొయ్యాను.
'సత్తాయ్, భాస్కరాయ్‌లక్కూడానా.. ' నమ్మలేనట్లుగా అన్నాను.
ఆయన మొహమాటంగా నవ్వారు.
'నానా! మనమందరం కోతి నుండే వచ్చాం. ఈ వెధవాయిలిద్దరూ మనకి మన పూర్వీకుల్ని గుర్తు తెస్తుంటారు. అంతేగా! అయినా - పిచుకల మీద బ్రహ్మాస్త్రాలు దేనికి నానా?' అన్నారు.
ఆయనకి సత్తాయ్, భాస్కరాయ్‌ల పట్ల కూడా ప్రేమ చూపించడం (ఆరోజు) నాకు అర్ధం కాలేదు. గురువుగారి సమస్యల్లా తను కఠినంగా ఉండలేకపోవటమే! అది ఆయన బలహీనత! ఆయనకి బాగా చదివేవాడన్నా, చదవనివాడన్నా.. అందరూ ఇష్టమే! ఇదెలా సాధ్యం? ఇప్పుడు నాకనిపిస్తుంది - ఆయన మార్కుల్ని బట్టి విద్యార్ధుల్ని ప్రేమించలేదు. ఆయన విద్యార్ధుల్ని మనుషులుగా ఇష్టపడ్డాడు.
ఆరోజు అక్కడ జరిగిన కార్యక్రమం క్లాసులో వున్న అందరూ పాసయ్యేలా ఎటెండెన్స్ సరిచెయ్యడమే! నేను లేచి వచ్చేస్తుండగా 'పిల్లలకి చదువు పట్ల ఇంటరెస్ట్ వుండి స్కూలుకి రావాలి గానీ, ఈ పాడు రిజిస్టర్ల గోలేమిట్రా! గవర్నమెంటుకి బుర్ర లేదు.' అని విసుక్కున్నారు. అర్ధమైంది, ఆయనకిదంతా తప్పక చేస్తున్నారు.
పదో తరగతి - ఏదో ఇంటర్నల్ పరీక్ష. ఒకడు మా దుర్భాకుల సూరిగాడి దాంట్లోంచి తీవ్రంగా కాపీ కొట్టి రాస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న గురువుగారి కంట్లో ఇది పడింది. ఆయన హడావుడిగా లోపలకొచ్చారు.
'నానా! ఇక్కడ కాపీ కొట్టి రాస్తున్నావు. రేపు పబ్లిక్‌లో నీకు ఈ సౌకర్యం వుండదు కదా? అయినా ఈ పరీక్షల్లో ఎన్ని మార్కులొస్తే మాత్రం ఏముంది? ఒకపని చెస్తాను, నీ పేపర్ నేను కరెక్ట్ కూడా చెయ్యను, ఈ పరీక్షకి నీదే ఫస్ట్ మార్క్. సరేనా? చూడకుండా రాయి నానా! నీకెంత సబ్జక్ట్ వచ్చో, ఎంత రాదో తెలుస్తుంది.' చాలా ఇబ్బంది పడుతూ ఆ కాపీ కొట్టేవాడికి చెప్పారు గురువుగారు.
ఆయన గూర్చి ఇంకో ఉదంతం రాసి ముగిస్తాను. అప్పుడు నేను హౌస్ సర్జన్సీలో వున్నాను. వారి అబ్బాయికి హిందూ కాలేజి సెంటర్లో సిటీ బస్సు ఏక్సిడెంట్ అయ్యిందని విని ఆర్ధోపెడిక్ వార్డుకి వెళ్ళాను. ఆ బాబుని పలకరించి, దెబ్బల వివరాల కోసం కేస్ షీట్ చదువుతున్నాను.
అప్పుడు అక్కడున్న హెడ్‌నర్స్ అన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను.
'నేను నా సర్వీసులో ఎందరో వీఐపీలని చూశాను. కానీ ఈ పేషంట్ గూర్చి వచ్చినన్ని ఎంక్వైరీలు ఎప్పుడూ చూళ్ళేదు. సూపర్నెంటుగారు, ప్రిన్సిపాల్‌గారైతే గంటగంటకీ ఫోన్లు.'
'ఈ పేషంటు మా గురువుగారి అబ్బాయి, స్టాఫ్!' అన్నాను నేను.
'ఏం గురువుగారో ఏమో! ఇక్కడ మేం టెన్షన్‌తో చస్తున్నాం. 'మా గురువుగారబ్బాయి' అంటూ డాక్టర్లు క్యూ కట్టినట్లు వచ్చి ఆ బాబుని చూసి పోతున్నారు.' అని నిట్టూర్చింది. అంటే మా గురువుగారికి నాలాంటి శిష్యపరమాణువులతో ఒక భక్తబృందమే ఉన్నదన్నమాట!
దేశసేవ అనగానేమి? యుద్ధంలో శతృసైనికులతో పోరాడుట, సమాజసేవ చేయుట అంటూ చెబుతుంటారు. అలాగే - సమాజానికి పనికొచ్చే వృత్తులు కూడా చాలానే వున్నాయి. అందులో ఉపాధ్యాయ వృత్తి ముఖ్యమైనది. ఆ ఉపాధ్యాయ వృత్తిలో తనదైన ముద్రతో, నాలాంటి ఎందరికో స్పూర్తిని ప్రసాదించి మా గురువుగారు కూడా దేశసేవ చేశారు. ఆయన ధన్యజీవి.
మాస్టారూ! మీకు నమస్సుమాంజలులు.
ముగింపు -
ఒరే వెధవాయ్! ఏవిట్రా ఇది? నాగూర్చి ఏవిటేవిటో రాసేశావు! అందరూ కులాసానేనా! నీ బ్యాచ్‌వాళ్ళు గోవిందరాజువాడు, గంటివాడు, దావులూరివాడు, మల్లాదివాడు, స్టేషన్ మాస్టరుగారబ్బాయ్.. అందర్నీ అడిగానని చెప్పు నానా! ఉంటా నానా! ఒరిఒరి! ఎందుకురా ఆ కన్నీళ్ళు? నేనెక్కడికి పోతాను? ఎక్కడికీ పోను, మీ అందరూ నన్నెప్పుడూ తల్చుకుంటూనే వుంటారుగా! నాకేం పర్లేదు నానా!
కృతజ్ఞతలు -
లలిత గారికి.
(picture courtesy : Google)
చాలా బాగా రాసేరు.
ReplyDeleteశ్యాం
Very touching!!
ReplyDeleteనా స్కూల్ రోజులూ, శర్మగారిలాంటి టీచర్లు గుర్తుకు వచ్చారు..ఈ రోజుల్లో అలాంటి టిచర్లని extincted species గా (మొన్నొకసారి మీరు అన్నట్టు) పరిగణించాలేమో! :-((
May his soul rest in peace!!
Gurubhyonamaha!
ReplyDelete'మా గురువుగారబ్బాయి' అంటూ డాక్టర్లు క్యూ కట్టినట్లు వచ్చి ఆ బాబుని చూసి పోతున్నారు.' అని నిట్టూర్చింది
ReplyDeleteHats off to the great man sir!
అటువంటి గురువులు లభించటం ఎంత అదృష్టం
ReplyDeleteచాలా కాలం క్రితం ఇండియాలో చదూకుంటూన్నప్పుడు ఒక సీనియర్ ఎప్పుడు అంటూ ఉండేవాడు (ఏ మాట మాట్లాడినా ముందు ఈ వాక్యం అని మిగతావి అనేవాడు, ఎందుకో తెలియదు గానీ)... ప్రతీ మనిషినీ జీవితంలో కనీసం ఒక్కసారి క్షమించాలి. పరిమిగారు దీన్ని తూ.చా తప్పకుండా ఆచరించారు అనిపించింది.
ReplyDeleteమీ గురువు గారు అక్షరాలా గు-రు-వు గారు. చీకటిని తోలే వాళ్ళే కదా గురువులు?
అన్నట్టు అడగడం మర్చిపోయానండోయ్, మీరు డాక్టర్ గిరీ వెలగబెట్టాక ఆయన రిటైర్ అయిపోయాక ఎప్పుడైఆనా ఆయనదగ్గిరకి వెళ్ళి మాట్లాడారా? అప్పుడు ఇలాంటివన్నీ ఆయనకి గుర్తు చేసారా? ఆయన ఏమన్నారు?
దురదృష్టవసాథూ నాజీవితంలో టీచర్లు అందరూ దారుణంగా బెత్తం పుచ్చుకుని కొట్టినవాళ్ళే. మీరు ఇలాంటి ఆర్టికిల్ ఒకటి రాసి కౌముది.నెట్ పత్రికకి పంపించవచ్చు.
కలిశాను, ఆయన నా క్లినిక్‌కి వచ్చారు, చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. దేశవిదేశాల్లో స్థిరపడ్డ ఆయన పూర్వవిద్యార్ధులు భార్యాపిల్లలతో వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరించేవాళ్ళు. గత కొన్నేళ్ళుగా ఆయన హైదరాబాదులో స్థిరపడ్డారు. అయినా మావాళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు.
Deleteకొన్ని నెలల క్రితం ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆయన జ్ఞాపకశక్తి అమోఘం. చాలామంది గూర్చి ఎన్నో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయనతో చివరగా అన్న మాటలు -
'నాదేముంది నానా? నాకు తోచిన విధంగా పాఠాలు చెప్పాను. మీరు తారాజువ్వలు, బహుశా నేను వత్తి వెలిగించి వుంటాను. అంతే! మీరు నన్నింతగా అభిమానించడం నా అదృష్టం.' అంటూ కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడారు.
కొందరు గొప్పవ్యక్తులకి తాము గొప్పవ్యక్తులమన్న సంగతి తెలీదు! అందుకు ఉదాహరణ మా గురువుగారు.
నాకు నెట్ పత్రికలు తెలీదు, వాటియందు ఆసక్తీ లేదు. నేను నా బ్లాగులో నా థాట్ ప్రాసెస్‌ని రికార్డ్ చేస్తుంటాను, కొందరు చదువుతుంటారు. నాకిది చాలు.
వైద్యులు గారు,
Deleteమీ టపా బాగుంది. కౌముది.నెట్ కు మీరు పంపితే, బహుశా మీకంటే కూడా, ఇటువంటి ఆలొచనలు ఉన్న వాళ్ళకు ఉపయొగపడుతుంది అని అనిపిస్తుంది.
మీకు కుదిరితే తప్పకుండా పంపండి.
కృష్ణ
మంచి గురువు గురించి చక్కగా వ్రాసారు. లాబ్‌లో ప్రమాదం జరిగినా, దాని పరిణామాన్నీ విద్యార్థులకి చూపించాలన్న ఆయన తపన అద్భుతం.
ReplyDeleteనాకు ఇలాగే చక్కగా లెక్కలు చెప్పిన KVS గారిని నేనెప్పుడూ మర్చిపోలేను.
అప్పుడు మనం మనస్ఫూర్తిగా చదువుకునేవాళ్ళం.
ఇప్పుడు పిల్లలు మార్కుల స్ఫూర్తిగా చదువుకొంటున్నారు.
బాగుంది సర్.
ReplyDeletehttp://ahmedchowdary.blogspot.in/
Dear Ramana, that is a superb write up and a wonderful send off to an obviously great teacher and human being. We owe it all to teachers like him. RIP
ReplyDeleteBSR
ఆంజనేయశర్మ గారి విశేషాలూ, మీ జ్ఞాపకాలూ బాగున్నాయి. ఆయన మిమ్మల్ని ప్రోత్సహించిన విధం, సైన్స్ ప్రయోగాల గురించి వివరించిన విధానమూ గొప్పగా ఉన్నాయి. ఊతపదం, సంభాషణ తీరుతో సహా మీ గురువుగారిని వర్ణించి ఆయన్ను మా కళ్ళముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి టీచర్లు చిరస్మరణీయులు!
ReplyDeleteకళ్ళమ్మట నీళ్ళు పెట్టించారు సార్...
ReplyDeleteYa Ra
ReplyDeleteIt is obvious that he left an idelible impression on you. I was not fortunate enough to be his student. Yet I remember him for his all white attire, characteristic walk and an ever present affectionate smile. Though I was not his student, I thought he was what an ideal teacher should be. He sure did enrich the live of the people he touched. A very good teacher and a great human being that he was, I am sure, he will live on forever in the hearts of his pupils.My salutes to Mr. Parimi Anjaneya Sarma.
నేను ఎక్కువసార్లు 'ఇలా ఆలోచిస్తున్నాను' అని చెప్పడానికి పోస్టుతుంటాను.
ReplyDeleteకొన్నిసార్లు సరదాగానూ, మరికొన్నిసార్లు చికాగ్గానూ, ఇంకొన్నిసార్లు టైంపాస్ కోసం పోస్టుతుంటాను.
ఈ పోస్ట్ మాత్రం ఇష్టంతో రాశాను. చదివినవారికి, చదివి కామెంటినవారికి ధన్యవాదాలు.
య ర, You made my day/weekend అని తెలుగులో ఎలా రాయాలో తెలియక అలాగే ఉంచుతున్నా... నిన్న నీ ఈమైలు (ఆయన మరణ వార్త వచ్చిన దగ్గర్నుండీ) మనసులో ఏదో చెప్పలేని నలత - కానీ నీ పోష్టు చూసాక అది సడలింది. నాకు ఆయనతో నీకున్నంత అనుభవం లేకున్నా ఆయన క్లాసు ల్లో అప్పుడప్పుడే కూర్చున్నా, ఆయన జ్ఞాపకశక్తి, పేరు పేరునా విద్యార్ధుల్ని పిలవటం అదో అద్భుతం. ఆ రోజుల్లో గురవయ్య హైస్కూల్లో అలాంటి మాష్టర్ల సంఖ్య అధికం. అందుకే మనమందరం ఇలా ఉన్నామేమో! నీ ఈ బ్లాగు రాతలకు పునాది అక్కడే పడింది.
ReplyDeleteవారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ
- స్టేషను మాష్టారి గారబ్బాయి
Well Said Sir!
ReplyDeleteసమాజానికి పనికొచ్చే వృత్తులు కూడా చాలానే వున్నాయి. అందులో ఉపాధ్యాయ వృత్తి ముఖ్యమైనది. ఆ ఉపాధ్యాయ వృత్తిలో తనదైన ముద్రతో, నాలాంటి ఎందరికో స్పూర్తిని ప్రసాదించి మా గురువుగారు కూడా దేశసేవ చేశారు. ఆయన ధన్యజీవి.