జ్ఞానులు రెండురకాలు - ఒకరు అజ్ఞానులు, రెండు విజ్ఞానులు. అయితే - ఇక్కడో చిక్కుంది. ఎవరికివారు తామే విజ్ఞానఖనులమని అనుకుంటారు. అంతేకాదు - ఎదుటివారు అజ్ఞానగనులని కూడా అనుకుంటారు (బయటకి చెప్పకపోయినా). ఈ సూత్రాన్ని అనుసరించి (ఎట్లాగూ అందరూ నన్ను అజ్ఞానిగానే భావిస్తారు కాబట్టి) నన్ను నేనే ఒక విజ్ఞానిగా పరిగణించుకుంటుంటాను. నేనేమన్నా తక్కువ తిన్నానా? దెబ్బకి దెబ్బ, చెల్లుకు చెల్లు!
పనులు రెండురకాలు - ఒకటి పనికొచ్చే పని, రెండు పనికిరాని లేక పనికిమాలిన పని. భుక్తి కోసం చేసే పన్లన్నీ పనికొచ్చేవే. స్టాంపులు, సీసామూతలు సేకరించుట.. పైగా అందులకు గర్వించుట - పనికిరాని పనే. ఈ పన్లని ఇంగ్లీషులో 'హాబీ' అంటార్ట! అంటే - తిని అరక్క చేసే పనులక్కూడా ఇంగ్లీషువాడో పదం కనిపెట్టాడన్న మాట! ఎంతైనా ఇంగ్లీషోడు ఇంగ్లీషోడే!
వాదులు రెండురకాలు - ఒకరు న్యాయవాదులు (ప్లీడర్లు కాదు), రెండు అన్యాయవాదులు. ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించి, తదనుగుణంగా ఎంతోకొంత హేతుబద్దంగా వాదించే మర్యాదస్తుల్ని న్యాయవాదులు అంటారు. తన అభిప్రాయాన్ని అందరూ ఒప్పుకోవాలనే కఠిన మనస్తత్వం కలిగుండి, తదనుగుణంగా అల్లూరి సీతారామరాజు స్పూర్తితో రాజీలేని పోరాటాన్ని సాగించేవారిని అన్యాయవాదులు అంటారు.
భర్తలు రెండురకాలు - ఒకరు నీటుభర్తలు, రెండు నాటుభర్తలు. భార్యతో అనేక రకాలుగా హింసింపబడుతూ, ఆ (గృహ)హింసని పళ్ళబిగువున భరిస్తూ, బయటకి చెప్పుకోలేక గుడ్లనీరు కుక్కుకుంటూ భారంగా, భయంగా, అయోమయంగా సంసార సాగరాన్ని ఈదువారు నీటుభర్తలు. ప్రతి యువతీ తనకి ఇట్లాంటి భర్తే లభించాలని ఎన్నో పూజలు చేస్తుంటుంది. రోజూ పీకల్లోతు తాగి, చేతులు తిమ్మిరెక్కో లేక సరదాగానో పెళ్ళాన్ని తుక్కుబడ తన్నుకునే సౌలభ్యం వున్నవారు నాటుభర్తలు (వాడి పెళ్ళాన్ని వాడు కొట్టుకుంటాడు, చంపుకుంటాడు! మధ్యలో నీకెందుకు?). ప్రతి మగాడూ నాటుభర్తగా ఉందామనుకుంటాడు, కానీ - అదృష్టం కలిసిరాదు!
జ్ఞాపకశక్తి రెండురకాలు - ఒకటి అవసరమైనది, రెండు అనవసరమైనది. నా చిన్ననాటి స్నేహితుడు తెలివైనవాడు, అతనికి జ్ఞాపకశక్తి మెండు. ఫోన్ నంబర్లు, స్కూటర్ నంబర్లు శకుంతలాదేవి రేంజిలో గుర్తుంచుకునేవాడు. కానీ అతనికి పాఠ్యపుస్తకాల్లో వున్నదేదీ గుర్తుండేది కాదు! నాది పూర్తిగా ఆపోజిట్ సమస్య. నాకేదైనా గుర్తుండాలంటే అది పాఠ్యపుస్తకాల్లో వుండితీరాలి - లేకపోతే లేదు, అంతే! ఇందువల్ల నేను కొన్నిసార్లు నా స్కూటర్ తాళంతో, అదే రంగులో వున్న ఇంకొకడి స్కూటర్ తాళం తియ్యడానికి తీవ్రంగా ప్రయత్నించి తిట్లు తిన్న సందర్భాలు వున్నాయి. అయితే - నేనూ నా స్నేహితుడు ఎప్పుడూ కలిసే వుండేవాళ్ళం కాబట్టి, 'దోస్తి' సినిమాలో హీరోల్లా, ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుంటూ సింబయాటిగ్గా జీవించాం.
పరిచితులు రెండురకాలు - ఒకరు సుపరిచితులు, రెండు అపరిచితులు. ఈ సుపరిచుతులు అక్కినేని నాగేశ్వర్రావంత సౌమ్యులు, వినమృలు, మితభాషులు. చిరునవ్వుతో, దరహాసంతో 'మౌనమే నీ భాష ఓ మూగమనసా' అన్నట్లుగా వుంటారు. రెండు రౌండ్లు పడంగాన్లే జూలు విదిల్చిన సింహం వలె అపరిచితులుగా మారిపోతారు. ఆ తరవాత రౌండురౌండుకీ సీతయ్యలా గర్జిస్తారు, సమరసింహారెడ్డిలా గాండ్రిస్తారు!
వైద్యులు రెండురకాలు - ఒకరు వైద్యం చేసి డబ్బు తీసుకునేవారు, ఇంకొకరు డబ్బు కోసమే వైద్యం చేసేవారు. అనగా - రోగానికి సరైన వైద్యం చేసి, అందుకు డబ్బు వసూలు చేసేవాళ్ళు మొదటిరకం. వైద్యం తెలిసినా - తాము అనుకున్నంత బిల్లయ్యేదాకా రోగాన్ని పేరబెడుతూ వైద్యం చేసేవారు రెండోరకం. ఒకప్పుడు మొదటి రకం వైద్యులు ఉండేవాళ్ళుట! ఇప్పుడు వారు డైనోసార్లయ్యారు.
ఇలా చాలా రకాలు రాసుకుంటూ పోవచ్చుగానీ.. ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తాను.
రచయితల రకాలు కూడా రాయండి.
ReplyDeleteరాయొచ్చు. కానీ - గత పాతికేళ్ళగా కొత్తరచయితల్నెవర్నీ చదవలేదండీ.
Delete(కాబట్టి - రాయకూడదనుకుంటున్నాను.)
బ్లాగ్ చదువరులలో రెండు రకములు.ఒకరు తీవ్రవాదులు రెండు మితవాదులు.
ReplyDeleteఒకరు మీ(మన) బ్లాగులో ఇది మీరు పనిలేక రాస్తున్న రాతలని గ్రహించక అంశాలను తీవ్రముగా తీసుకొని మీతో, తోటి బ్లాగరులతో వాదనలు చేసేవారు. మరొకరు మీ భావాలను సరిగా అర్దం చేసుకొని మనసారా హాయిగా నవ్వుకునేవారు.("పనిలేక రాస్తున్న రాతలని" క్షమించాలి)
మనోహర్.
:))
Deletechala bagundi
ReplyDelete"భర్తలు రెండురకాలు. ఒకరు నీటుభర్తలు, రెండు నాటుభర్తలు. భార్యతో అనేక రకాలుగా హింసింపబడుతూ, ఆ (గృహ)హింసని పళ్ళ బిగువున భరిస్తూ, బయటకి చెప్పుకోలేక గుడ్లనీరు కుక్కుకుంటూ భారంగా, భయంగా, అయోమయంగా సంసార సాగరాన్ని ఈదువారు నీటుభర్తలు. ప్రతి యువతీ తనకి ఇట్లాంటి భర్తే లభించాలని ఎన్నో పూజలు చేస్తుంటుంది."
ReplyDeleteపొట్ట పగిలిపోయేంతగా నవ్వానంటే నమ్మండి
"జ్ఞానులు రెండురకాలు. ఒకరు అజ్ఞానులు, రెండు విజ్ఞానులు."
ReplyDeleteఅజ్ఞానులు జ్ఞానులు ఎలా అవుతారు స్వామీ?
అ'జ్ఞానం'లో కూడా జ్ఞానం వుంది శిష్యా! :)
Deleteతమరి జ్ఞానం అమోఘం గురుదేవా!
Deleteద్వైతాన్ని బాగా వ్యక్తీకరించారు :)
ReplyDeleteథాంక్యూ.
Deleteఇంతకీ - 'ద్వైతం' అంటే ఏమిటి? :)
This comment has been removed by the author.
DeleteVery funny post :-)))
ReplyDelete/* ఒకప్పుడు మొదటి రకం వైద్యులు ఉండేవాళ్ళుట! ఇప్పుడు వారు సరీసౄపాలయ్యారు. */
సరీసృపాలు అంటే reptiles అనుకుంటానండీ! మీ ఉద్దేశ్యం అది కాదేమో కదా! Extincted అనా? :-)))
అవును. నా కవిహృదయం సరీసౄపాలంటే dinosaurs అని. కాదా???!!!
Deleteఇది - ఓ రెండు భాషలు (తెలుగు మరియూ ఇంగ్లీషు) సగంసగం మాత్రమే తెలిసిననవాడి తిప్పల్లేండి. :)
Yes, it means Dinosaurs which are now extinct, thus the comparison is appropriate.
Deleteకడుపారా నవ్వుకోడానికి మందు కావాలంటే మరో డాక్టరు దగ్గరకి పోనవసరం లేదు. ఫీజు కూడా అడక్కుండా వైద్యం చేస్తున్నారు.శభాష్ రమణ గారూ!
ReplyDelete