Sunday, 30 December 2012

రేప్ గూర్చి.. ఒక మంచి కల!



నేర తీవ్రత ననుసరించి శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉండాలని కొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు శిక్షలు reformative గా ఉండాలని కోరుకుంటుంటారు. ఎవరి వాదనలు వారివి.

ఒక సమాజానికి నాగరికత ఉంటుంది. ఆ సమాజానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ వ్యవస్థకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అందుకు అనుగుణంగా ఆ సమాజం లేక దేశంలో శిక్షలు ఉంటాయి.. అమలవుతుంటాయి. చైనాలో మరణశిక్షలు ఎక్కువ. యూరప్ లో దాదాపుగా లేవు. ఇది ఆయా సమాజానుగతంగా ఉంటాయి.

ఒక దేశంలో అమ్మాయి చెయ్యి పట్టుకుంటే.. ఆ చేతిని బహిరంగంగా నరికే శిక్ష ఉండొచ్చు. ఇంకో దేశంలో అదే నేరానికి మూణ్ణెల్ల జైలు శిక్ష మాత్రమే ఉండొచ్చు.

అవసరం అనుకుంటే ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోనివాణ్ణి కూడా ఉరి తీసుకుందాం. జేబు దొంగల్ని కూడా కరెంటు షాకులిచ్చి చంపేసుకుందాం. ఇక్కడిదాకా నాకు పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి.

ఈ దేశంలో నేరస్తులు, శిక్షని అనుభవించేవారు అధిక శాతం పేదవారు, సామాజికంగా తక్కువ కులం వారు.. అందునా దళితులు.. ఎందుకుంటారు? అనేక జైళ్ళలో పేదవారు, అణగారిన కులాలవారు.. (వారిపై మోపిన నేరానికి పడే శిక్ష కన్నా ఎక్కువకాలం) విచారణ పేరుతొ జైళ్ళలో ఎందుకు మగ్గిపోతున్నారు?

పదిమంది నేరం చేస్తే పదిమందికీ శిక్ష పడేలా ఉండే సమాజం కావాలని కోరుకుంటున్నాను. పైన నేను చెప్పినట్లు.. ఆ శిక్ష ఎలా ఉండాలనేది, ఎంత తీవ్రంగా ఉండాలనేది పూర్తిగా వేరే చర్చ.

ఉదాహరణకి.. రేప్ కేసుల్నే తీసుకుందాం. అత్యాచారానికి గురైన యువతి స్వేచ్చగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వ్గలిగే వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామా? క్రింది స్థాయి పోలీసు అధికారులకి ఈ నేరతీవ్రత గూర్చి, విధివిధానాల గూర్చి మన పోలీస్ ఎకాడెమీల్లో ఎంత శిక్షణనిస్తున్నారు? అసలు ఆ ఆ శిక్షణనిచ్చే ఉన్నతాధికారులకి gender sensitization  ఉందా?

రేప్ బాధితురాలిని పరీక్షించి, నిర్ధారించే వైద్యుని శిక్షణ ఏమిటి? దానికి సరియైన శాంపిల్స్ కలెక్ట్ చెయ్యడంలో సరైన విధానాలున్నాయా? ఆ శాంపిల్స్ చేరినా.. Forensic lab వారు నెలల తరబడి రిపోర్ట్ ఎందుకివ్వరు? చార్జ్ షీట్ మూడు నెలల్లో ఫ్రేం చెయ్యకపోతే నిందితుడికి (బెయిల్ పొందటం ప్రాధమిక హక్కు) స్వేచ్చ వస్తుంది.

ఆ తరవాత తాపీగా, హాయిగా కేసుని ఎలా మాఫీ చేసుకోవాలో నిందితులకి తెలుసు. అట్లా సహకరించే వ్యవస్థ మనకి లేదా? యేళ్ళ తరబడి సాగే కేసులో.. కోర్టులో బాధితురాల్ని క్రాస్ ఎక్జామినేషన్ పేరిట చాలా నీచమైన, అసభ్యమైన ప్రశ్నలడిగే న్యాయవ్యవస్థలో కూడా మనం బ్రతుకుతున్నాం.

అంటే డబ్బు, పలుకుబడి కలవాడు తప్పించుకోడానికి అడుగడుగునా అవకాశాలు పుష్కలం. ఇవేమీ లేని అర్భకుల్ని న్యాయవ్యవస్థ నేరం చేసినవాడిగా నిర్ణయిస్తుంది. మనం కోరుకున్న శిక్షలు పడేది ఈ 'బలహీన నేరస్తులకే'! (నేరస్థుల పట్ల నాకు సానుభూతి లేదు. వాడికి ఉరిశిక్షో, జీవితకాల శిక్షో తరవాత సంగతి). నా బాధల్లా వాడితో బాటుగా అదే నేరం చేసిన తొంభై మంది హాయిగా సమాజంలో పెద్దమనుషులుగా తిరిగేస్తుంటారు.

ఈ వ్యవస్థలోని లోపాలని సరిచెయ్యడానికి చట్టసభలకి కమిట్ మెంట్ అవసరం. అయితే ఆ సభలకి పటిష్టమైన వ్యవస్థలంటే ఇష్టం ఉండదు. ఎవరి ప్రయోజనాలు వారివి. అందుకే వారు వాగాడంబరం ప్రదర్శిస్తారు. ముసలి కన్నీరు కారుస్తారు. టీవీల వారికి ఇదంతా ఓ ఫ్రీ రియాలిటీ షో!

రాత్రి నాకో కల వచ్చింది...

మా ఊళ్ళో ఇద్దరు నిరుపేద, దళిత యువతులు అత్యాచారానికి గురయ్యారు. వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడి పోలీసులు వారితో అత్యంత మర్యాదగా ప్రవర్తించారు. శ్రద్ధగా కేస్ నమోదు చేసుకున్నారు.

ఆ యువతుల కంప్లైంట్ ప్రకారం నిందితుల్ని వెంటనే ఎరెస్ట్ చేశారు. నిందితుల్లో అగ్ర కులస్తులు, మైనారిటీలు, బిసి కులస్తులు, దళితులు.. అందరూ ఉన్నారు. కొందరు రాజకీయ నాయకుల కొడుకులు. ఇంకొందరు బడా ధనవంతుల పిల్లలు.

ఆ యువతుల పిర్యాదుల్ని పకడ్బందీగా నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని ఒక వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టరమ్మ ఏంతో సానుభూతితో బాధితుల్ని అనునయిస్తూ, వారికి ధైర్యం చెబుతూ చాలా సైంటిఫిక్ గా మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. చక్కటి నివేదిక తయారుచేసింది. ఆ మెటీరియల్ ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నెలలోపే రిపోర్ట్ ఇచ్చేసారు.

ఇదిలా ఉండగా.. నిందితుల తండ్రులు తమ డబ్బుని, అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ.. కేసుని నీరు గార్చడానికి అనేక ప్రయత్నాలు చెయ్యసాగారు. కానీ వారు సఫలీకృతులు కాలేకపోయ్యారు.

ఈ లోగా ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఇన్ కెమెరా విచారణ జరిపి.. నిందితులందరూ నేరస్తులని తేల్చింది. వారికి నిర్దేశిత సెక్షన్ లో కల గరిష్టమైన శిక్ష కూడా విధించబడింది. చట్టం ముందు అందరూ సమానులే! నువ్వు ఏ నేరం చేసినా, ఎంత పెద్దవాడవైనా.. శిక్ష నుండి తప్పించుకోలేవు. ఇది పుణ్యభూమి. ఇదే మా దేశ నీతి! సమాజ గతి!!

అయితే.. దురదృష్టం! తెల్లవారింది. నాకు నిద్ర నుండి మెళుకువ వచ్చింది! కల చెదిరింది. నా కల నిజమైతే ఎంత బాగుండు!!

(photo courtesy : Google)

Friday, 28 December 2012

ఆనందభవన్ లో ఆ రోజు!


అది గుంటూరు పురము. ఆ పురంబునకు బ్రాడీపేట తలమానికము. అందుకలదొక భోజనగృహము. అచట భుజించుట ఆనందదాయకము. ఆ కారణముననే కాబోలు ఆ భోజనగృహ నామధేయము ఆనందభవనముగా భాసిల్లుచుండెను. నిస్సందేహముగా ఇది సార్ధక నామధేయము.

(ఏమిటయ్యా ఈ పిశాచాల భాష? ఆ రాసేదేదో మనుషులు మాట్లాడే భాషలో ఏడిచ్చావు!)

క్షమించాలి. అలా కోప్పడకండి. తెలుగు మహాసభలు జరుగుతున్నాయ్ గదా! కొద్దిగా పాండిత్యం ప్రదర్శిద్దామని ఉబలాటపడ్డాను. మీకిష్టం లేకపోతే రాయన్లేండి. తెలుగు భాషలోనే రాస్తాను.

ఇక చదవండి..


సమయం మధ్యాహ్నం మూడు గంటలు. వేదిక గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆనందభవన్. మాసిన నేల. అరిగిపోయిన బల్లలు. సొట్టల గ్లాసులు. నిశ్శబ్దాన్ని చేదించుకుంటూ రెండో ప్రపంచ యుద్ధ కాలపు నాటి ఫ్యాన్లు 'గరగర' మంటూ భారంగా తిరుగుతున్నాయి.

ఎదురుగా ఒక అద్దాల బీరువా. దాని వయసు సుమారు తొంభయ్యేళ్ళు. బీరువా పక్కగా పెద్ద రిఫ్రెజిరేటర్. అది ఫ్రిజ్ కనిబెట్టబడిన రోజుల్లో బ్రిటిషు వాడు స్టీమర్లో పంపించినదై ఉండవచ్చు. హాలుకి ఒక మూలగా పగిలిపోయిన వాష్ బేసిన్. పక్కనే స్టీలు బకెట్ లో నీళ్ళు.. స్టీలు గ్లాసు. గత ముప్పైయ్యేళ్ళుగా ఆ వాష్ బేసిన్లోకి నీళ్ళు రావు. రావడానికి అసలు నీళ్ళ గొట్టం ఉంటేగదా! బకెట్లోంచి గ్లాసుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కోవాలి.


హోటల్ ప్రవేశద్వారం ఎడమ వైపు క్యాష్ కౌంటర్. పక్కనున్న గోడ మీద అనేక దేవతల పటాలు.. వాటికి పసుపు కుంకుమల తాలూకా మరకలు. క్యాష్ కౌంటర్ కుర్చీలో ఒక ఎర్రటి, బక్కపలచని వ్యక్తి కూర్చుని డబ్బులు లెక్కపెడుతూ.. పదులు, యాభైలు, వందలు నోట్లు కట్టలుగా కడుతున్నాడు. తెల్ల ప్యాంటు, చొక్కా. ఎత్తు అయిదడుగుల మూడంగుళాలు. ఆయనే ఆ హోటల్ యజమాని.

పేరు పురుషోత్తం. పేరుకు తగ్గట్టుగానే చాలా మంచివాడు. ఎప్పుడు నవ్వు మొహంతోనే ఉంటాడు. క్యాష్ కౌంటర్, వంటగదికి మధ్య బొంగరంలా తిరుగుతుంటాడు. అవసరమైతే క్షణంలో వంటవాడిగా మారిపోతాడు. ఒక్కోసారి కష్టమర్లు బిల్లు కట్టటానికి క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి పురుషోత్తం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది.

ఎప్పటివలె ఆ రోజు కూడా ఆనందభవనం ప్రశాంత నిలయంగా.. బద్దకంగా, మత్తుగా జోగుతుంది. కష్టమర్లు తలోమూల కూర్చుని కాఫీలు, టిఫినీలు నిదానంగా ఆరగిస్తున్నారు. సప్లైర్లు గొడకి ఆనుకుని నించొని కునికిపాట్లు పడుతున్నారు.

ఇంతలో బయట నుండి  రణగొణధ్వనులు. ఏవో స్లోగన్లు. పురుషోత్తం కంగారు పడ్డాడు. గబగబ డబ్బులు సొరుగులో పెట్టేసి తాళం వేసుకుని.. ఎందుకయినా మంచిదని సొరుగుని రెండు మూడుసార్లు ఘాట్టిగా లాగి చెక్ చేసుకున్నాడు.

చూస్తుండగానే బిలబిల మంటూ ఆడవాళ్ళు.. సుమారు పది మంది.. లోపలకి దూసుకొచ్చారు. పురుషోత్తంని చుట్టుముట్టారు. కంగారు పడిపోయిన పురుషోత్తం.. ఆ గుంపులో ఒకళ్ళిద్దర్ని గుర్తు పట్టి.. 'అమ్మయ్య!' అనుకున్నాడు.

"నమస్తే అమ్మా! వణక్కం. ఎండన పడి వచ్చారు. కాఫీ తాగండి తల్లీ!" అంటూ మర్యాద చేశాడు.

నిజంగానే పాపం వాళ్ళ మొహాలు ఎండకి వాడిపొయి, కాలిన మినపట్టుల్లా ఉన్నాయి. అయితే.. ఆ వచ్చినవారు కోపంగా ఉన్నారు. ఆవేశంగానూ ఉన్నారు. వేడిగా కూడా ఉన్నారు.

పురుషోత్తం వంటశాలలోకి వినబడేలా గట్టిగా అరిచి చెప్పాడు.

"రంగరాజన్! మేడం గార్లకి పది కాఫీ!"

ఆ గుంపులో అందరిలోకి ముందు నించునున్న ఒక యువతి కోపంగా పురుషోత్తాన్ని తినేశాలా చూస్తూ..

"మేమేమీ నీ బోడి కాఫీ తాగిపోటానికి రాలేదు. అర్జంటుగా  ఈ హోటల్ మూసెయ్యమని చెప్పడానికొచ్చాం." అన్నది. ఆవిడ పొట్టిగా, బొద్దుగా ఉంది. పేరు రమాప్రభ.

పురుషోత్తం గతుక్కుమన్నాడు.

"అమ్మా! నా హోటల్ ఎందుకు.. "


అందర్లోకి వెనగ్గా నించొని.. చేతులు వెనక్కి కట్టుకుని ఆ హోటల్ని నిశితంగా పరిశీలిస్తుంది ఒక లావుపాటి వ్యక్తి. గోల్డ్ ఫ్రేం చత్వారపు కళ్ళజోడు. ఆమె ఆ టీమ్ కి లీడర్. పేరు సూర్యాకాంతం.

"ఏవిటయ్యా నీకు కారణాలు చెబితేగానీ ముయ్యవా? నా సంగతి నీకింకా తెలీదు." విసురుగా ఎడమ చేయి చూపుడు వేలుతో బెదిరించింది.

ఇంతలో గీతాంజలి ఉత్సాహంగా స్లొగన్లందుకుంది.

"విప్లవం.. వర్ధిల్లాలి. ఆనంద భవన్ డౌన్! డౌన్!!"

మిగిలినవారు గొంతు కలిపారు.

పురుషోత్తం భయపడిపోయ్యాడు. రెండు చేతులూ జోడించాడు.

"అమ్మా! మీ అందరికీ నా హోటల్ వల్ల ఇబ్బందైతే మూసేసుకుంటాను. కానీ విషయం ఏంటో నాకు అర్ధమయ్యేట్లు చెప్పండమ్మా!" అంటూ ప్రాధేయపడ్డాడు.

ఆ ఆడవారు పురుషోత్తం వినయానికి మిక్కిలి సంతోషించారు. మగాళ్ళంతా ఇంత వినయవిధేయలతో ఉంటే ఈ లోకం శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియదా? అడవిలో లేడిపిల్లని చూసి పులి జాలి పడ్డట్లు.. నక్సలైట్ నాయకుణ్ణి ఎన్ కౌంటర్ చేసే ముందు పోలీసు జాలి పడ్డట్లు.. వారంతా పురుషోత్తాన్ని చూసి జాలి పడ్డారు. ఒకళ్ళిద్దరికి పురుషోత్తాన్ని ఓదార్చాలనిపించింది గానీ.. సూర్యాకాంతానికి ఝడిసి ఊరుకున్నారు.

ఆ విప్లవనారీ లోకానికి స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న చాయాదేవి అసలు విషయం చెప్పనారంభించింది.

"ఇదిగో అబ్బాయ్! ఇన్నాళ్ళూ మా బ్రాడీపేటలో ఆడవాళ్ళం గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. భార్యలుగా మాక్కొన్ని హక్కులుంటాయి.. నీకు తెలుసుగా?"

"అమ్మా! నాకు తెలీదు. మీరే చెప్పండి. వింటాను." పురుషోత్తం మళ్ళీ నమస్కరించాడు.

"అయ్యో నా మతి మండా! నిన్నడిగితే నువ్వేం చెబుతావు! ఎంత చెడ్డా నువ్వూ మగవెధవ్వేగా! సరే విను. నీ ఓటల్లో భోజనం అమృతంలా ఉంటుందిట. నీ కందపచ్చడి, బీట్రూట్ కూర, సాంబార్ని మా ఆయన రవణారెడ్డి కల్లో కూడా కలవరిస్తూ లొట్టలేస్తున్నాడు." అంటూ చాయాదేవి మూతి వంకర్లు తిప్పింది.

ఛాయాదేవి మాటకి పురుషోత్తం ఛాతీ గర్వంతో రెండంగుళాలు పొంగింది. సంతోషంతో సిగ్గు మొగ్గయి పొయ్యాడు. ఆనందంతో మెలికలు తిరిగిపొయ్యాడు.

ఇంతలో వెనకనుండి గిరిజ అందుకుంది.

"మా ఆయన రేలంగి మాత్రం తక్కువ తిన్నాడా? ఆఫీసు నుండి డైరక్టుగా నీ హోటలుకే వచ్చి సుష్టుగా భోంచేస్తున్నాడు. బొజ్జ ఇంకాస్త పెంచేశాడు. నేనేం చేశాను? సీతాదేవంతటి ఇల్లాల్ని. ఇంట్లో పన్లు చెయ్యమన్నాను. అంతేగా! భర్తన్నవాడు అంట్లు తోమడా? ఇల్లు చిమ్మడా? బట్టలుతకడా? ఏం! ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి?" ముక్కులెగరేసింది.

ఇంతలో రమాప్రభ మళ్ళీ అందుకుంది.

"మొగుడన్న తరవాత ఆ మాత్రం తిట్టుకోడానికి, తన్నుకోడానికి లేదా? నేనేమన్నా మా అక్క గీతాంజలిలా భర్తని బెల్టుతో తంతున్నానా? అసలు భర్తంటే అర్ధమేంటి? భార్య నుండి తిట్లు, తన్నులు భరించేవాడని! మేమేం చేసినా మా భర్తల్ని మంచి మార్గాన పెట్టుకోడానికేగా. అయినా నా మొగుడు రాజబాబుకి ఆ బుద్ధే ఉంటే నాకీ తిప్పలెందుకు?" అంటూ ముక్కు చీదుకుంటూ రమాప్రభ ఎమోషనల్ అయిపోయింది.

"ఒసే రమాప్రభా! మధ్యలో మా ఆయన పద్మనాభం సంగతి తీసుకురావద్దు. బెల్టుతో బాదుకుంటానో, బెత్తంతో కొట్టుకుంటానో నా ఇష్టం. నీకెందుకే?" సాగదీసింది గీతాంజలి.

గిరిజ విసుక్కుంటూ అన్నది.

"అబ్బా! ఆపండే మీ పాడు గోల. చూడు బాబు! ఈ ఆంధ్రదేశంలో 'భార్య' అన్న పదం వింటేనే భర్తలు గజగజా వణికిపోతారు.. ఒక్క ఈ గుంటూర్లో తప్ప! అందుకు కారణం నువ్వే! ఈ హోటల్ టిఫిన్లు, భోజనాలు చూసుకుని మా మొగుళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ తిండి సుఖమే లేకపోతే మా భర్తలు కుక్కల్లా మేం చెప్పినట్లు వింటారు."

పురుషోత్తం చేతులు జోడించి నమస్కారం పోజులోనే.. విగ్రహంలా నిలబడి వింటున్నాడు.

ఇప్పుడు చాయాదేవి అందుకుంది.

"ఏవయ్యా పెద్దమనిషి! ఇళ్ళల్లో పన్లెగ్గొట్టి మా మొగుళ్ళు నీ పంచన చేరితే.. వాళ్ళకి బుద్ధి చెప్పి, గడ్డి పెట్టాల్సిందిపోయి పీకల్దాకా భోజనం పెడతావా? నువ్వసలు మనిషివేనా? నీకు డబ్బులే ముఖ్యమా? నీకు అక్కాచెల్లెళ్ళు లేరు?" అంటూ పురుషోత్తం మీదమీదకి వెళ్ళింది.

"చాయాదేవత్తా! మా ఆయన రాజబాబు ఈ ఊరొచ్చి చెడిపొయ్యాడు. ఇంతకు ముందు నా తిట్లు, తన్నులు తట్టుకోలేపోతే..  కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలేవాడు. ఇప్పుడు సుబ్బరంగా ఈ హోటల్ కొచ్చి ముప్పూటలా మెక్కుతున్నాడు. బంగారం లాంటి మా ఆయన పద్మనాభం బావతో సావాసం చేసి చెడిపొయ్యాడు." రమాప్రభ మళ్ళీ గీతాంజలి వైపు కొరకొరగా చూసింది.

గీతాంజలి సర్రున కోపమొచ్చింది.

"అబ్బో! చెప్పొచ్చావు! మీ ఆయనో పెద్ద అమాయక చక్రవర్తమ్మా! నువ్వామధ్య పుట్టింటికెళ్తే నెలవారి సీజన్ టిక్కెట్లు కొనుక్కుని మరీ తిన్నాడు. మళ్ళీ చూడ్డానికి మాత్రం ఒంటూపిరివాళ్ళా ఉంటాడు. సూది బెజ్జం బానకడుపు. ఎవరి భాగోతం ఎవరికి తెలీదు." అంటూ రుసరుసలాడింది.

ఇంతలో సూర్యాకాంతం గట్టిగా అరిచింది.

"ఒసే! ఆపండే మీ మొహాలు మండా! వీడి ఓటేలు మూయించడానికొచ్చి మీ పరువులు బజార్న పడేసుకుంటారే? ఇదిగో అబ్బాయ్! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు మా ఆయన ఎస్వీరంగారావు ఎంత పెద్ద ప్లీడరో తెలుసుగా? బల్ల గుద్ది వాదించాడంటే ఈ గుంటూరేం ఖర్మ.. ఢిల్లీ కూడా గడగడలాడిపోవాల్సిందే. నువ్వర్జంటుగా నీ దుకాణం మూసెయ్. ఇది మర్యాదస్తులు కాపురాలు చేసుకునే ఏరియా. ఇట్లా హోటళ్ళు పెట్టి కాపురాలు కూల్చావంటే ఏవనుకున్నావో? నీమీద మా ఆయనతో న్యూసెన్స్ కేసు కట్టించి.. ఉరిశిక్ష వేయిస్తా! జాగ్రత్త." హూంకరించింది సూర్యాకాంతం.

పురుషోత్తం భయంతో వణికిపోసాగాడు. చెమటలు పట్టేశాయి.

"అ.. అ.. అమ్మగారూ! మీరు ఉప్పూకారాలు ఎక్కువేస్తున్నారంట. గంట క్రితమే మీ ప్లీడరు గుమాస్తా వంగర వెంకటసుబ్బయ్య  రెండు ఫుల్ క్యారేజీలు కట్టించుకుని తీసుకెళ్ళాడు. సాంబార్ ఎగస్ట్రా!"

సూర్యాకాంతం బిత్తరపోయింది. తదుపరి ఆవేశంతో ఊగిపోయింది.

"అదా సంగతి. 'కాంతం! ఇవ్వాళ ఒంట్లో నలతగా ఉందే. లంఖణం పరమౌషధం అన్నారు. నాకు వంట చెయ్యకు.' అంటే పస్తున్నాడేమోననుకున్నాను. ఈ మధ్య కోర్టులోనే కాకుండా ఇంట్లో కూడా అబద్దాలు చెబుతున్నాడన్న మాట! చెప్తా! చెప్తా! ఎక్కడికి పోతాడు. సాయంకాలం కోర్టు నుండి వస్తాడుగా! ముందా వంగరకి బెండు వంకర తీస్తే ఈ పెద్దమనిషి దారికోస్తాడు." పళ్ళు పటపటలాడించింది సూర్యాకాంతం.

చాయాదేవి అందుకుంది.

"ఇదిగో అబ్బాయ్! నీ వాలకం చూస్తుంటే మా గుమ్మడి బావగారిలా మంచాళ్ళాగే ఉన్నావు. ఉన్నపళంగా వెళ్ళిపొమ్మంటే నువ్వు మాత్రం ఎక్కడికి పోతావులే! అంచేత నువ్వు హోటల్ ఎత్తెయ్యడానికి నెల్రోజులు గడువిస్తున్నా. ఈ లోపు నీ ఏర్పాట్లు చూసుకో. లేకపోతే నా సంగతి నీకు తెలీదు. మా అల్లుడు రాజనాలతో చెప్పి నీ హోటల్ నేలమట్టం చేయిస్తాను. పదండే పోదాం!" అంటూ వెనుతిరిగింది.

"చాయాదేవత్తా! వెళ్ళేప్పుడు చీతిరాల వాళ్ళ కొట్లో ఓ పది అప్పడాల కర్రలు కొనుక్కెళ్ళాలి. అట్నుండి వెళ్దాం." అంది గీతాంజలి.

"అయినా నీకిదేం పోయ్యేకాలమే గీతాంజలి? మేం మాత్రం కాపురం చెయ్యట్లేదు? ఎంత మొగుడయితే మాత్రం అన్నేసి అప్పడాల కర్రలు విరిగేలా కోడతావుటే? తగలరాని చోట తగిలి హరీ మంటే రేపు నీకు కొట్టుకోడానికి ఎవరు దొరుకుతారు? అయినా ఈ కరువు రోజుల్లో అన్ని కర్రలు ఎక్కడ కొనగలం? అట్లకాడతో వీపు మీద వాతలు పెట్టు. ఖర్చు లేని పని. సరిపోతుంది." అంది చాయాదేవి.

"ఉసే ఉసే! ఈ ప్లాన్లన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలే. మొగుళ్ళని ఎంత తన్నుకున్నా.. వాళ్ళ పరువు ఇలా రోడ్డున పడెయ్య కూడదు. ఇదిగో అబ్బాయ్! నీకు మా ఛాయాదేవి ఇచ్చిన గడువు గుర్తుందిగా?" అంటూ గర్జిస్తూ బయటకి నడిచింది సూర్యాకాంతం.

వర్షం వెలిసినట్లైంది. పురుషోత్తానికి ఇంకా వణుకు తగ్గలేదు. తన హోటల్లో ఆహార పదార్ధాలు రుచిగా, శుచిగా ఉండాలనుకున్నాడు గానీ.. బ్రాడీపేట కుటుంబాల్లో ఇన్ని కలతలు రేపుతాయనుకోలేదు. వంటగదిలోకెళ్ళి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్ గా కలుపుకుని.. తాగుతూ.. ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలా? అని ఆలోచనలో పడ్డాడు.

చివరి తోక..

గుంటూరు, ఆనంద భవన్, పురుషోత్తం.. నిజం. మిగిలిందంతా కల్పితం!

అమ్మకి నాన్నతో తగాదా వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేది. నేను నాన్నతో కలిసి అన్ని రోజులూ ఆనంద భవన్ లో హాయిగా భోంచేసేవాడిని. అమ్మ తిరిగొచ్చినప్పుడు నాకు చికాగ్గా ఉండేది.. ఆనంద భవన్ మిస్ అవుతున్నందుకు. మళ్ళీ అమ్మానాన్నల తగాదా కోసం ఆశగా ఎదురు చూస్తుండేవాణ్ణి.

ఈ రోజుకీ ఎందరో భర్తలకి ఆపద సమయంలో (భార్య కన్నా) మంచి భోజనం అందిస్తున్న మా గుంటూరు ఆనందభవన్ కి వందనం.. అభినందనం!

కృతజ్ఞతలు..

ఆనంద భవన్ ఫోటోలు : నా ఆత్మీయ మిత్రుడు D.S.R.మూర్తి, బ్రాడీపేట, గుంటూరు.

Monday, 24 December 2012

'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!



ఇవ్వాళ ఆంధ్రజ్యోతిలో 'సోషలిజం తేవడం చాలా తేలికే!' అంటూ రంగనాయకమ్మ రాసిన వ్యాసం చదివాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. దాదాపుగా నా అభిప్రాయాలు కూడా రంగనాయకమ్మవే. నా ఆలోచనలు అప్పుడప్పుడు 'విరసం' ప్రముఖులకి చెబుతూనే ఉన్నాను.

ప్రస్తుతం తెలుగు బ్లాగుల్లో ఇటువంటి విషయాలు రాయాలంటే ధైర్యం కావాలి. 'విరసం', రంగనాయకమ్మ వంటి పదాలు వినడమే ఆలస్యం.. తిట్టడమే లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారు. వారితో తిట్టించుకునే ఓపిక లేకా..ఎందుకొచ్చిన గోలలే అనుకుంటూ.. ఇటువంటి అంశాలు బ్లాగులో రాయను. ఇవ్వాళెందుకో ధైర్యం వచ్చేసింది. కారణం తెలీదు.

తెలుగు సాహిత్యంలో ప్రముఖ సాహితీవేత్తల complete works ప్రచురించడం ఈ మధ్య ఊపందుకుంది. శ్రీపాద, మల్లాది, పాలగుమ్మి పద్మరాజు, గోపీచంద్, అడవి బాపిరాజు, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం మొదలైనవారి పూర్తి సాహిత్యం ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ పరిస్థితి కొన్నేళ్ళ క్రితం లేదు. కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వాన 'విశాలాంధ్ర' ప్రచురించిన కుటుంబరావు సాహిత్యం నాకెంతగానో ఉపయోగపడింది.

ఈ మధ్యన మనసు ఫౌండేషన్ వారు వరసగా ఇట్లాంటి సమగ్ర రచనల్ని ప్రచురిస్తున్నారు. రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, బీనాదేవి, గురజాడ, పతంజలి.. ఈ లిస్టు పెరుగుతూనే ఉంది. వారు ఇదొక యజ్ఞంగా స్వీకరించారు. వారికి నా అభినందనలు.

ప్రతి సంస్థకి ఒక నిర్దేశిత లక్ష్యం ఉంటుంది. ఉండాలి కూడా. ఒక హిందూ ధార్మిక సంస్థ నాస్తికవాదుల రచనల్ని ప్రచురించరాదు. జనవిజ్ఞాన వేదిక చేతబడికి ప్రచారం కలిపించరాదు. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపుల్స్.

ఇప్పుడు 'విరసం' గూర్చి మాట్లాడుకుందాం. 'విరసం' అనగా విప్లవ రచయితల సంఘంకి కుదించిన పేరు. ఈ పేరులోనే సంస్థ లక్ష్యం మనకి తెలుస్తుంది. శ్రీశ్రీ పుట్టిన రోజున ఏర్పడ్డ విరసం చరిత్ర అందరికీ తెలిసిందే. 'అరుణతార' అనే మాసపత్రిక విరసం ప్రచురిస్తుంది. అరుణతార కవితలకి ప్రాముఖ్యతనిస్తూ.. సంస్థ లక్ష్యాలకి అనుగుణంగా నడుస్తుంది.

అయితే విరసం వ్యక్తులకి అనవసర ప్రాధాన్యం ఇస్తుందని నా భావన. అంచేతనే తమ సభ్యుల complete works కి ప్రాధాన్యతని ఇచ్చుకుంటుంది. ఇది శ్రీశ్రీతో మొదలయ్యింది. శ్రీశ్రీ సాహిత్య సంపుటాలని చలసాని ప్రసాద్ ఎడిట్ చేసిన తీరు అద్భుతం. నాకు తెలిసి తెలుగులో ఇంత గొప్పగా ఎడిట్ చేసిన సాహిత్యం లేదు. అయితే శ్రీశ్రీ సాహిత్యంలో సినిమా వ్యాసాలు 'విరసం'కి అనవసరం. (చలసానికి శ్రీశ్రీ, రావిశాస్త్రిల పట్ల గల వీరాభిమానం జగద్విదితం. అంచేత దీన్నొక aberration గా అనుకున్నాను.)

ఇప్పుడు కుటుంబరావు సమగ్ర సాహిత్యం వరుసగా వెలువడుతోంది. ఇది ఇరవై సంపుటాలు. తమ సభ్యుల్ని (వల్లమాలిన ప్రేమతో/ అభిమానంతో/ స్నేహంతో) ప్రమోట్ చేసుకోవడం విరసం ఎజెండాలో ఒకటిగా నాకనిపిస్తుంది. కుటుంబరావు తెలుగు సాహిత్యంలో 'మకుటం లేని మహారాజు' అన్నాడు శ్రీశ్రీ. పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

అయితే కుటుంబరావు తాత్విక వ్యాసాలు భీతి గొలుపుతాయి. కుటుంబరావు పేరా సైకాలజీకి తెలుగు ప్రజలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నమ్ముతున్నాను. ఈ వ్యాసాల్ని కూడా ప్రచురించడంలో విరసం తాత్వికత ఏమిటో ఎడిటర్లైన చలసాని ప్రసాద్, కృష్ణాబాయిలు చెప్పాలి. అలాగే కుటుంబరావు సినిమా వ్యాసాలు రెండు పెద్ద సంపుటాలుగా (14 & 15) వెలువరించారు. సినిమా వ్యాసాలకి, విరసానికి సంబంధం ఏమిటో?!

ఒక రచయిత తన అభిప్రాయాలు మార్చుకోవచ్చు (గుడిపాటి చలం). లేదా.. ఎన్నో విషయాల్లో డెమాక్రటిక్ గా ఉంటూ స్త్రీ పురుష సంబంధాల గూర్చి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చెయ్యవచ్చు (శ్రీశ్రీ 'అనంతం'). అది ఆ వ్యక్తి ఇష్టం. వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ శ్రీశ్రీ ఒక శతకం రాస్తే.. ఆ శతకం ఒక్కదాన్నే తితిదే (TTD) వారు ప్రచురిస్తారు. మనవాడేలే అంటూ మహాప్రస్థాన కవితల్ని కూడా ప్రచురించరు. ఎందుకంటే తితిదేకి ఒక స్పష్టమైన, నిర్దేశిత లక్ష్యం ఉంది. అది విశాలాంధ్ర పబ్లిషర్స్ కి కూడా ఉంది. దురదృష్టవశాత్తు విరసంకి లేదు.

విరసం తన సభ్యులైతే చాలు. వాళ్ళు రాసిన 'అన్ని రకాల' రచనల్ని సమగ్ర సంపుటాలుగా ప్రచురిస్తుంది. అదేమంటే.. ఒక రచయిత గూర్చి చదివే వాళ్లకి పూర్తి అవగాహన కావాలంటుంది. కుటుంబరావు గూర్చి పూరా అవగాహన కల్పించే గొప్ప కార్యక్రమం విరసానికి ఎందుకు? 'పూర్తిగా' తమవాడిగా చేసుకోవలసిన అవసరం ఏమిటి? ఆ పని చెయ్యడానికి మనసు ఫౌండేషన్, ఇంకా అనేక ట్రస్టులు ఉన్నాయిగా!

ఒక వ్యక్తి రాసిన అనేక వేల పేజీల్లో తమ సంస్థ లక్ష్యాలకి అనుగుణంగా ఉన్న సాహిత్యాన్ని మాత్రమే ప్రచురించుకోగల నిర్మొహమాటత, నిక్కచ్చితనం ఉండగలగడం ఆ రచయితల సంఘం ప్రాధమిక కర్తవ్యం. ఇక్కడ వ్యక్తిగత అభిమానాలకి తావుండరాదు. ఈ విషయాన్ని రంగనాయకమ్మ తన వ్యాసంలో చక్కగా వివరించారు. అందుకు రంగనాయకమ్మని అభినందిస్తున్నాను.

చూద్దాం.. చలసాని, కృష్ణాబాయి రంగనాయకమ్మకి ఎలా రియాక్ట్ అవుతారో!


(photos courtesy : Google)

Monday, 17 December 2012

యబిచారం.. తప్పు కాదు! మంచిది కూడా!!

"ఇదిగో సారూ! యబిచారం సేసేటప్పుడు ఒళ్ళంతా యమ యేడి. ఒకటే సెగలు పొగలు. సేసిం తరవాత కళ్ళమ్మట, సెవుల్లో యేడి పొల్లుకొస్తంది. కాళ్ళూ, సేతులూ ఒకటే పీక్కపోతన్నాయి. ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా బాడీలో ఓవర్ వీట్ తగ్గటల్లా. ఆ యేడంతా పోవాలా. బాబ్బాబు! మంచి మందులు రాయండే! సచ్చి నీ కడుపున పుడతా." అన్నాడు పుల్లయ్య.

పుల్లయ్య ఒక సన్నకారు రైతు. కష్టజీవి. అతనిది ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతం. ఎత్తుగా, బలంగా ఉంటాడు. తెల్ల చొక్కా. రంగు లుంగీ. భుజంపై తుండుగుడ్డ. నున్నగా గీయించిన గెడ్డం. సన్నటి మీసం. తలకి పాగా.

ఓరి వీడి దుంప దెగ! హాయిగా వ్యభిచారం చేసుకుంటాడా! దానికి నేను మందులివ్వాలా! హథవిధి! సమాజంలో డాక్టర్ల పరిస్థితి ఎంతలా దిగజారిపోయింది! అసలు నన్నిట్లా అడగడానికి ఈ పుల్లయ్యకెంత ధైర్యం! నాకు ఒళ్ళు మండిపోయింది.

"ఏం పుల్లయ్యా! బ్రతకాలని లేదా? ఈ రోజుల్లో వ్యభిచారం ఆత్మహత్యతో సమానం. ఎయిడ్స్ రోగం వస్తుంది. హెపటైటిస్ వ్యాధి వస్తుంది. పిల్లలు గల వాడివి. వ్యభిచారం, గిభిచారం అంటూ వెధవ్వేషాలెయ్యకు. ఆ పాడు అలవాటు అర్జంటుగా బంద్ చేసెయ్యి. అర్ధమైందా?" గద్దించాను.

పుల్లయ్య ఆశ్చర్యపొయ్యాడు. ఏదో ఆలోచించాడు. సందేహంగా, బెరుగ్గా అడిగాడు. "అప్పుడప్పుడయినా.. "

"నీకసలు బుద్ధుందా? ఆప్పుడు లేదు ఇప్పుడు లేదు. నువ్వు చేసేది చాలా ప్రమాదకరమైన పని. అన్యాయంగా చచ్చిపోతావ్. గెట్ లాస్ట్!" కోపంగా అరిచాను.

పుల్లయ్య భయపడి పోయాడు.

"అట్లాగా! నాకు తెలవదు సార్! తప్పయిపోయిందయ్యా. ఇంకెప్పుడూ ఆ పాడు పని సెయ్యను. చదువు సంధ్య లేని మోటోణ్ణి సార్. తెలిసీ తెలీక ఏదో వాగాను. కోపం చేసుకోమాక సార్. ఉంటా దొరా!" అంటూ ఒంగి ఒంగి దణ్ణాలు పెడుతూ నిష్క్రమించాడు పుల్లయ్య.

నాకు మూడాఫ్ అయిపొయింది. గవర్నమెంట్ ఎయిడ్స్ ప్రాజెక్టులంటూ కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా ఏం లాభం? ఈ పుల్లయ్య వంటి అజ్ఞానులున్నంత కాలం ఈ దేశం బాగుపడదు.

నెల రోజుల తరవాత..

ఆ రోజు హాస్పిటల్లో సోమవారం హడావుడి. మధ్యాహ్నం రెండింటి సమయంలో ఒక పొడుగాటి వ్యక్తి నీరసంగా నా కన్సల్టేషన్ చాంబర్లోకి అడుగెట్టాడు. ఎక్కడో చూసినట్లుందే! అరె! పుల్లయ్య! అతని ఆకారం చూసి ఆశ్చర్యపోయ్యాను. గుర్తు పట్టలేనంతగా చిక్కిపోయున్నాడు. పెరిగిన గడ్డం. రేగిన జుట్టు. నలిగిన చొక్కా. మాసిపోయిన లుంగీ. గాజు కళ్ళు. నడిచి వచ్చిన శవంలా ఉన్నాడు.

పక్కనే ఒక ఆడమనిషి. భార్య అనుకుంటాను. బక్కగా ఎండిన కట్టెలా ఉంది. కర్రకి చీర కట్టినట్లు, దుఖానికి దుస్తులు తొడిగినట్లుంది. పెద్దాస్పత్రిలో పెద్ద జబ్బుతో పది రోజులు వైద్యం చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయినట్లుంది. నన్ను బెరుకుగా చూస్తూ నమస్కరించింది.

"ఈ మడిసి నా ఇంటాయనండి. మీ కాడ్నించి వచ్చినంక బాగా తేడా పడిపోయిండు సార్. పొద్దుగూకులు ఏందో ఆలోచిస్తా ఉంటాడు. ఉన్నట్టుండి పిల్లలు జాగరత్తంటూ ఏడస్తన్నాడు. నలుగురు మడుసుల కట్టం చేసేటోడు. మూడు పూటలా మడంతలు తినోటోడు. ఆ ఇజాన మంచాన పడ్డాడు. సూళ్ళేకపోతన్నా. ఆ మడిసికేవన్నా అయితే పిల్లలు, నేను ఏవయిపోవాలా. మాకు సావు తప్ప యేరే దారి లేదు దొరా!" అంటూ కన్నీరు పెట్టుకుంది.

'అవును తల్లీ అవును.. ఏ దేశ మేగినా ఏమున్నది గర్వ కారణం? స్త్రీ జాతి సమస్తము పురుష పీడన పరాయణం. ఏ మొగుడి చరిత్ర చూసినా అంతా విశృంఖల కేళీ విలాసము. భార్యల బ్రతుకు ఖేద భరిత విలాపములే. నీ వ్యధాభరిత దుఃఖ గాధ గాంచి సానుభూతి వినా నేనేమివ్వగలను తల్లీ?' ఆలోచిస్తూ ఆవిడ చెప్పిందంతా విన్నాను.

తరవాత మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆమెని బయటకి పంపాను. రూంలో పుల్లయ్య, నేను. కొద్దిసేపు నిశ్శబ్దం.

"ఏంటి పుల్లయ్యా! ఏమయ్యింది?" అడిగాను.

అప్పటిదాకా కనీసం నోరు విప్పని పుల్లయ్య ఒక్కసారిగా పెద్దగా చిన్నపిల్లాళ్ళా ఏడవడం మొదలెట్టాడు. కొద్దిసేపు అలాగే ఏడవనిచ్చాను.

"ఆ రోజు మీరు యబిచారం సేస్తే సస్తానని సెప్పారు. యెల్లిన నాలుగు రోజులకే తప్పు సేసాను దొరా. పిల్లలు సిన్నోళ్ళు. నా పెళ్ళాం ఎర్రి బాగుల్ది. నన్ను బతికించు దొరా!" ఏడుస్తూనే చెప్పాడు.

"చిలక్కి చెప్పినట్లు చెప్పాను. బుద్ధుండాలి. ఇప్పుడేడ్చి ఏం లాభం? అనుభవించు." విసుక్కున్నాను.

"మీరు కరస్టుగానే సెప్పార్సార్. కానీ మా ఆడది ఊరుకోటల్లేదు. రెచ్చగొడతాంది. తప్పని సెప్పినా ఇనుకోటల్లేదు. దానికి బుద్ది సెప్పండి. గడ్డి పెట్టండి. అందుకే యెంటబెట్టుకోచ్చా." కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పుల్లయ్య.

"ఆ దరిద్రపు అలవాటుతో నీ భార్యకి సంబంధమేంటి పుల్లయ్యా?" చిరాగ్గా అన్నాను.

"మరెవరితో సంబందం? నే యబిచారం చేసేది మా ఆడోళ్ళతోనే గదా!" ఆశ్చర్యపోతూ అన్నాడు పుల్లయ్య.

గతుక్కుమన్నాను. అర్ధం కాలేదు. ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. కుడికన్ను అదరసాగింది. మనసు కీడు శంకించ సాగింది.

"పుల్లయ్యా! నీ దృష్టిలో 'యబిచారం' అంటే ఏమిటి?" సూటిగా చూస్తూ నిదానంగా అడిగాను.

"నువ్వు మరీ సార్! ఎంత సదువు లేకపోయినా ఆ మాత్రం తెలీదా యేంది? యబిచారం అంటే ఆడామగా సంబందమేగా?" సిగ్గుపడ్డాడు పుల్లయ్య.

చచ్చితిని. ఘోరం జరిగిపోయింది. మహాపాపం చేశాను. పుల్లయ్య భాష అర్ధం చేసుకోలేక అతనికి తీవ్రమైన అన్యాయం చేశాను. పుల్లయ్య భాషలో 'యబిచారం' అంటే భార్యతో సెక్సువల్ ఇంటర్ కోర్స్! గ్రామీణ వాతావరణం, భాష పట్ల నాకు అవగాహన లేకపోవడం పుల్లయ్య పట్ల శాపంగా పరిణమించింది. ఒక్కసారిగా నీరసం ఆవహించింది.

ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు నా కర్తవ్యమేమి? పుల్లయ్యకి సారీ చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. జరిగిన పొరబాటు వివరించినా పుల్లయ్య నమ్మకపోవచ్చు. అసలిక్కడ సమస్య జరిగినదానికి సారీలు చెప్పుకోవడం కాదు. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలనేదే. క్షణకాలం బుర్రకి సాన బెట్టాను. మెరుపు మెరిసింది.

"చూడు పుల్లయ్యా! నువ్వు చాలా అదృష్టవంతుడువి. పదిరోజుల క్రితమే అమెరికావాడు వ్యభిచారానికి మందు కనిపెట్టాడు. నీక్కొన్ని గొట్టాలు రాసిస్తా. ఓ నెల్రోజులు వాడు. ఆ గొట్టాలు నీ ఒంట్లో వేడి లాగేస్తాయి. హాయిగా ఉంటావు." అన్నాను.

నీరసంగా, దుఃఖంగా ఉన్న పుల్లయ్య మొహం ఒక్కసారిగా కళకళలాడసాగింది. ఒంగిపోయి, ఒరిగిపోయి కూర్చున్నవాడు నిటారుగా అయిపోయాడు.

"నిజంగానా సారూ? మరి వెయిడ్స్ రోగం.. "

"ఇంకే రోగం నీ దగ్గరికి రాదు. నీకు హామీ ఇస్తున్నాను. నీ ఇష్టమొచ్చినన్ని సార్లు వ్యభిచారం చేసుకో. నీకేమవ్వదు. నాదీ పూచి. అయితే ఈ గొట్టాలు నీ భార్యతో వ్యభిచారం చెయ్యడానికే పని చేస్తాయి. బయటవాళ్ళతో వ్యభిచారం చేస్తే రియాక్షన్ ఇస్తాయి. చాలా ప్రమాదం." పుల్లయ్య చేతిని నా చేతిలోకి తీసుకుని అనునయిస్తూ, ధైర్యం చెప్పాను.

"నాకట్టాంటి పాడలవాట్లు లెవ్వు సారు. దేవుళ్ళాంటోరు. మీ కాడ అబద్దం సెపుతానా!" అన్నాడు పుల్లయ్య.

పుల్లయ్య భార్యని లోపలకి పిలిపించి ఆమెకి కూడా ధైర్యం చెప్పాను. పుల్లయ్యకి కొద్దిపాటి నరాల బలహీనత ఉందని, మందులు వాడితే గ్యారంటీగా తగ్గిపోతుందని ఘాట్టిగా నొక్కి వక్కాణించాను. ఖరీదైన 'బి కాంప్లెక్స్' గొట్టాలు రాసిచ్చాను. ఆ గొట్టాలు అన్నం తిన్న పది నిమిషాల్లోనే మింగాలనీ.. రోజూ పాలు, గుడ్లు తీసుకుంటే ఇంకా బాగా పని చేస్తాయని పలు జాగ్రత్తలు చెప్పాను.

ఇంకో నెల రోజులు తరవాత..

పుల్లయ్య మళ్ళీ వచ్చాడు. చలాకీగా, హుషారుగా ఉన్నాడు. ఒళ్ళు చేశాడు. దాదాపు మొదట్లో నేచూసినప్పటిలానే ఉన్నాడు. నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం లభించింది. నావల్ల ఒక అమాయకుడు ఎంత బాధ ననుభవించాడు! మొత్తానికి కథ సుఖాంతమైంది. థాంక్ గాడ్!

"మీరిచ్చిన గొట్టాలు బాగా పని చేశాయి సార్! ఇప్పుడు యబిచారం చేసినాంక యేడి పారాడటల్లేదు. మందులు ఇంకో నెల వాడితే ఇబ్బంది లేదుగా?" అన్నాడు.

"అస్సలు ఇబ్బంది లేదు పుల్లయ్యా! నీ ఇష్టం." రిలాక్స్డ్ గా అన్నాను.

సందేహిస్తూ నెమ్మదిగా అడిగాడు పుల్లయ్య.

"అయితే యబిచారం సేస్తే తప్పు లేదుగా సారూ?"

"అదంతా పాతమాట పుల్లయ్యా! ఇప్పుడు నువ్వు వాడింది ఆషామాషీ మందులు కాదు. అమెరికా వాడి మందులు. వాటికి తిరుగు లేదు. ఇంక నీ ఇష్టం. అసలిప్పుడు వ్యభిచారం ఎంత చేస్తే అంత మంచిది. బాగా చాకిరీ చేస్తావు కదా! ఆ వేడిని వ్యభిచారం ఎప్పటికప్పుడు బయటకి పంపించేస్తుంది." స్థిరంగా అన్నాను.

పుల్లయ్య ఆనందంగా ఇంకోసారి నమస్కరించి నిష్క్రమించాడు.

చివరి తోక..

ఇది కథ కాదు. నా అనుభవం. పేషంట్ పేరు, ప్రాంతం మార్చాను.

(picture courtesy : Google)

Wednesday, 12 December 2012

ఇల్లు నీది! ఇక్కట్లు నావి!!


అతడు నా చిన్ననాటి స్నేహితుడు. సరదాగా కబుర్లు చెబుతాడు. అతనితో కాలక్షేపం నాకు హాయిగా ఉంటుంది. ముఖ్యంగా అతని భార్య నన్ను 'అన్నయ్యా!' అని సంబోధించదు.. ప్రాణానికి సుఖంగా ఉంటుంది. అంచేత ఆ ఆదివారం సాయంకాలం నా మిత్రుని ఇంట్లో ప్రత్యక్షమయ్యాను.

మావాడు హడావుడిగా ఇంట్లోంచి బయల్దేరుతున్నాడు.

"భలే టైం కొచ్చావు. రావుగారితో పనుండి వెళ్తున్నాను. దార్లో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. పదపద!" అంటూ నన్ను లాక్కెళ్ళాడు.

ఏవో కబుర్లు చెబుతూ తన డొక్కు మోటార్ సైకిల్ పోనిస్తూనే ఉన్నాడు. ఊరు బయటకొచ్చేశాం. 

"ఏమి నాయనా? ఎవరో రావు పేరు చెప్పి నన్నేమన్నా కిడ్నాపు, గట్రా చెయ్యట్లేదు గదా!" నవ్వుతూ  అన్నాను.

మావాడు పెద్దగా నవ్వాడు. 

"రావుగారు పెద్ద కాటన్ వ్యాపారి. కోట్లల్లో టర్నోవర్ చేస్తారు. ఆయన ఇల్లు చాలా పెద్దది. ఇంత చిన్న ఊళ్ళో అంత పెద్ద ఇల్లు పట్టదు. అందుకే ఊరు బయట ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు చూస్తే కళ్ళు తేలేస్తావు." అన్నాడు.

కొద్దిసేపటికి మోటార్ సైకిల్ ఆపాడు. ఎదురుగా ఒక పేద్ధ ఇల్లు. చిన్నసైజు కోటలా ఉంది. ఊళ్ళో ఇంత పెద్ద ఇల్లున్నట్లు ఇప్పటిదాకా నాకు తెలీదు.

ఇంటిముందు ఖాకీ డ్రస్సులో వాచ్ మాన్. మావాడు అతనితో ఏదో చెప్పాడు. అతగాడు ఇంటర్ కమ్ లో ఎవరితోనో మాట్లాడి లోపలకెళ్లమన్నట్లు సైగ చేశాడు. ఇంటి ముందు విశాలమైన లాన్. పోర్టికోలో పెద్ద కుక్క. ఆ కుక్క మమ్మల్ని చూసి గంభీరంగా, హుందాగా, బద్దకంగా, నిర్లక్ష్యంగా మొరిగింది.

"నీ ప్లాన్ ఇప్పుడర్ధమయ్యింది. ఇంట్లోకి తీసికెళ్ళి ఈ కుక్కతో కరిపించి నన్ను చంపెయ్యబోతున్నావ్! అంతేనా?" అన్నాను. సమాధానంగా మావాడు మళ్ళీ పెద్దగా నవ్వాడు. 

పోర్టికోలో ఓ మూలగా చెప్పులు విడిచి హాల్లోకి అడుగెట్టాం. ఆ హాలుని పరికించి చూశాను. అది చాలా విశాలమైన హాలు. విశాలంగానే కాదు.. చాలా ఖరీదుగా కూడా ఉంది. గోడకి పెద్ద టీవీ. దానికెదురుగా అంతకన్నా పెద్ద సోఫా. 

ఆ సోఫాలో నల్లగా, పొట్టిగా, బట్టతలతో ఒక ఆసామి. తెల్ల లుంగీ, ఫుల్ చేతుల బనియనుతో ఉన్నాడు. "రావయ్యా! రా! పనుంటే తప్ప కనపడవా?" అంటూ బొంగురుగొంతుతో మావాణ్ణి ఆహ్వానించాడు. ఆయన ఆ ఇంటి ఓనరని అర్ధమైంది.

"అయ్యో! ఎంతమాటన్నారు సార్! తమవంటివారి దర్శనం చేసుకోవడం మా భాగ్యం." వినయంగా ఒంగిపోతూ అన్నాడు మావాడు. నేను ఫలానా అని ఆయనకి పరిచయం చేశాడు. ఆయన నన్ను చూసి పలకరింపుగా తల పంకించాడు.

కొద్దిసేపటికి ఆ పొట్టి బట్టతల ఇల్లు చూపించడం మొదలెట్టింది. మమ్మల్ని గదిగదికి తిప్పుతూ, ఆ గదుల ప్రత్యకతని వివరిస్తూ ఇల్లంతా తిప్పసాగాడు. ఇంటి కట్టుబడికి వాడిన సిమెంట్, ఇసుక.. వాటి రేట్లు మొదలైన వివరాలు కూడా పూస గుచ్చినట్లు చెప్పసాగాడు. 

కొద్దిసేపటికి నాకు ఆ ఇంటికి ఆయనో గైడ్ లా కనిపించసాగాడు. ఆర్కిటెక్ట్ ఎవడో ముంబాయి వాట్ట. చెక్క పనివాళ్ళు చెన్నై నుండి వచ్చారట. పైపుల పనివాళ్ళు హైదరాబాదు నుండి వచ్చారట. గోడలు నునుపుకి కారకులు ఎవరో బీహారీలట. 

నాకు విసుగ్గా ఉంది. ఈ ఆదివారం ఈ ఇంటి పిచ్చోడి చేతిలో ఇలా ఇరుక్కుపోయ్యనేమిటి! మావాడికి ఆయన చెప్పేది నోరు తెరుచుకుని మరీ వింటున్నాడు. అప్పుడప్పుడు మరిన్ని వివరాలడుగుతూ ఆయన్ని తెగ మెచ్చుకుంటున్నాడు. మొత్తానికి ఆ ఇంటిగలాయనతో మావాడికి ఏదో పెద్ద పనే ఉన్నట్లుంది. అందుకే కుట్ర పన్ని మరీ అతిగా పొగిడేస్తున్నాడు.

మావాడి ప్రశ్నలకి ఆయన ఆనందపడిపోతూ.. మురిసిపోతూ.. ఇల్లంతా తిప్పితిప్పి చూపిస్తూ.. ఆ ఇంటి  ప్లాన్ ఎప్రూవల్ కి మంత్రిగారిని ఏ విధంగా మొహమాటపెట్టిందీ, కట్టుబడి కోసం ఎవరెవరిని ఏ విధంగా మోపు చేసింది వివరించసాగాడు. 

దేవేంద్రలోకంలో ఏసీ బెడ్రూములూ, విశాలమైన లాన్స్ ఉంటాయా? మందపాటి టేకు ఫర్నిచరూ, మెత్తటి సోఫాలూ, ఖరీదైన మంచాలు, రంగురంగుల కర్టన్లు ఉంటాయా? నేనెప్పుడు చూళ్ళేదు. కావున నాకు తెలీదు. ఉన్నట్లయితే మాత్రం ఆ ఇంటిని ఇంద్రభవనం అనొచ్చు. 

డబ్బు సంపాదించినవారు ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటారు. అది వారి ఇష్టం. నాకంత డబ్బులు లేవు. ఉంటే ఏం చేస్తానో ఊహంచి ఇప్పుడే చెప్పలేను. సిరివెన్నెల సీతారామశాస్త్రి మార్కెట్ చేస్తున్న 'సువర్ణ భూమి' లో ప్లాట్ కొనుక్కుని సొంత ఇంటి కల నిజం చేసుకుంటానేమో తెలీదు.    
                 
కాకపోతే నాకు నా ఆలోచనలలో 'అందమైన సొంత ఇల్లు' అన్న ఎజెండా ఏనాడూ లేదు. పడుకోడానికి మంచం, కాలకృత్యాలు తీర్చుకోడానికో గది ఉంటే చాలు. పాలు మాత్రమే తాగేవాడికి ఎంత ఖరీదైన విస్కీ ఇవ్వజూపినా ఏమి ప్రయోజనం? నేను అంత గొప్ప ఇంటిని యాంత్రికంగా, యధాలాపంగా చూడటం ఆ పొట్టి బట్టతలకి నచ్చినట్లు లేదు. 

ఒకడు ఎంత మెచ్చుకున్నా ఇంకొకడు నిర్లిప్తంగా, నిరాసక్తంగా ఊరుకుండిపోవటంతో ఆ ఇంటాయనకి రావలిసింత 'కిక్' వచ్చినట్లు లేదు. మొహం ముడుచుకుంది. 'మొహం నల్లబడింది.' అన్రాయడానికి కుదర్దు.. ఆయన ఆల్రెడీ నల్లగా ఉన్నాడు కాబట్టి.    
              
అటు తరవాత కాఫీ తాగుతున్నంతసేపు కనీసం నాకేసి చూడలేదు ఆ పెద్దమనిషి. మావాడితో మాట్లాడుతూ నేనసలక్కడ లేనట్లే ప్రవర్తించాడు. ఏదో లావాదేవి గూర్చి సీరియస్ గా మాట్లాడుకున్నారిద్దరు. 

పాపం! ఆ బట్టతల హృదయం గాయపడినట్లుంది. తన ఇల్లు మెచ్చుకోకుంటే ఆయన అంత సీరియస్ గా రియాక్ట్ అవడం నన్నాశ్చర్యపరుస్తుంది. ఆయన కట్టించింది ఇల్లే గదా. ఆ మాత్రానికే 'అమరశిల్పి జక్కన' లా ఫీలయిపోవాలా? 'నా ఇల్లు నచ్చకపోతే నువ్వు నా శత్రువ్వి' అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. జార్జ్ బుష్ గాడి చుట్టమేమో!  

నాకిన్నాళ్ళు కవిత్వాన్ని, కళాకారుల్ని మెచ్చుకోవటం తెలుసు. మంచి పుస్తకాన్ని ఇష్టపడటం తెలుసు. కానీ ఎందుకనో ఎంత ప్రయత్నించినా సోఫాలనీ, కర్టన్లనీ మెచ్చుకోవటం తెలీటల్లేదు. నాకీ ధనవంతుని పట్ల ఈర్ష్యాసూయలు ఉన్నాయా? ఏమో! 

తిరుగు ప్రయాణంలో మావాడి మీద ఎగిరాను. 

"ఆయన ఆ ఇంటికి దిష్టిపిడతలా ఉన్నాడు. ఏవిటో ఆ ఘోష. ఒక్కముక్క అర్ధం కాలేదు నాకు. పిచ్చెక్కించాడు. నా ఆదివారాన్ని చెడగొట్టావు. నీకు బుద్ధి లేదు." అన్నాను. 

"ఆయనేదో మోజు పడి ఇల్లు కట్టించుకున్నాడు. నాలుగు మంచి ముక్కలు చెబితే మన సొమ్మేం పోయింది? నీకసలు బొత్తిగా లౌక్యం లేదు. నీ మీద కోపంతో నా పనికి ఎసరు పెడతాడని భయపడ్డాను." అన్నాడు మావాడు.

"అయితే నీ పని అయిందంటావు. కంగ్రాట్స్." అన్నాను.

"అయినట్లే ఉంది. లేకపోతే ఆ గోడల్ని, బండల్ని పొగిడే అవసరం నాకేంటి?" అన్నాడు మావాడు.

"ఎవరైనా మనుషుల్ని ప్రేమిస్తారు. కుక్కల్ని ప్రేమిస్తారు. ఈయన విచిత్రంగా ఇంటిని ప్రేమిస్తున్నాడేంటి?" ఆశ్చర్యపొయ్యాను.

"కాదేది ప్రేమకనర్హము? మనుషుల్ని ప్రేమిస్తే మోసపోవచ్చు. కుక్కల్ని ప్రేమిస్తే అవి ఏదో ఒకనాడు కరవొచ్చు. తెలివైనవాడు ప్రాణం లేని ఇళ్ళనీ, సోఫాల్ని మాత్రమే ప్రేమిస్తాడు. అవయితే అలా పడుంటాయి. మన నుండి ఏమీ ఆశించవు కూడా!" అంటూ మావాడు పెద్దగా నవ్వాడు.

'అవును కదా!' అనుకుంటూ నేనూ నవ్వాను.

చివరి తోక :- ప్రముఖ కవి కె.శివారెడ్డి కవితల సంపుటి 'రక్తం సూర్యుడు'. అందులో 'గతం నీది భవిష్యత్తు నాది' అనే కవిత ఈ టపా శీర్షికకి ఇన్స్పిరేషన్!

(photo courtesy : Google)

Saturday, 8 December 2012

'పెళ్ళి చేసిచూడు'.. చూసేశా!


గత మూడ్రోజులుగా విజయా వారి 'పెళ్లి చేసిచూడు' సినిమా చూశాను. కుదురుగా కూర్చుని సినిమా చూసే ఓపిక ఎప్పుడో నశించింది. ట్రెడ్మిల్‌పై నడుస్తూ సినిమాల్ని ముక్కలుగా చూట్టం నాకు అలవాటు. ముక్కలుగా చూసిన 'పెళ్లి చేసిచూడు' సినిమా గూర్చి కొన్నిముక్కలు.


నచ్చిన అంశాలు :-

1.ఎన్టీరామారావు పాత్ర పేరు వెంకటరమణ (తెలుగులో ఇంతకన్నా గొప్ప పేరు లేదని నా ధృఢవిశ్వాసం). అత్యున్నతమైన ఈ పేరుని హీరోకి ఇవ్వడం చక్రపాణి, ఎల్వీప్రసాదుల అత్యుత్తమ అభిరుచికి తార్కాణం! ఎస్వీరంగారావు, డా.శివరామ కృష్ణయ్య రామారావుని 'రమణా!' అంటూ పిలిచినప్పుడల్లా నా మనసు ఆనందంతో గంతులేసింది.

2.ఎస్వీరంగారావు పోషించిన వియ్యన్న పాత్ర. చాలా విలక్షణంగా ఉంది. సినిమాకి ఈ పాత్ర ఒక ఎస్సెట్. మహంకాళి వెంకయ్య సీన్లు కొన్ని తగ్గించి ఎస్వీరంగారావు పాత్ర నిడివి పెంచినట్లయితే బాగుండేది.

3.ఘంటసాల సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. పాటల గూర్చి కొత్తగా చెప్పటానికేమీ లేదు. విజువల్స్, నేపధ్య సంగీతం పాలూ నీళ్ళలా కలిసిపొయ్యాయి. కొన్ని దృశ్యాలు ఘంటసాల వల్లే ఎలివేట్ అయ్యాయి.

4.సిసింద్రీగా నటించిన బాలనటుడు మాస్టర్ కుందు ప్రతిభ. చక్కటి ఈజ్‌తో సరదాగా నటించేశాడు. కొన్ని సన్నివేశాల్లో జోగారావుని డామినేట్ చేసేశాడు.

5.ఎన్టీరామారావు రూపం. నాకు యాభైలలోని రామారావు రూపం చాలా ఇష్టం. గొప్ప అందగాడు. ఈ సినిమాలో మరీమరీ బాగున్నాడు.



హాశ్చర్యపరిచిన అంశం :-

'మిస్సమ్మ' లో మేరీ తండ్రిగా ఓ ముసలాయన గడ్డం, టోపీతో కనబడతాడు. ఆయన్ని ఆ పాత్ర కోసం ఏదో చర్చి ప్రేయర్లోంచి పట్టుకోచ్చారనుకున్నా. ఆయనే ఈ 'పెళ్లి చేసిచూడు'లో విలన్! పేరు దొరైస్వామి. నక్కజిత్తుల వాడిగా చక్కగా నటించాడు. ఇట్లాంటి పాత్రల్ని తరవాత రోజుల్లో రమణారెడ్డి, అల్లు రామలింగయ్యలు పోషించారు.


నచ్చని అంశాలు :-


1.సినిమా మొదలైన చాలాసేపటి దాకా ఎన్టీరామారావు (రమణ) కనిపించడు. ఈ సినిమాకి హీరో జోగారావేనేమో అన్న సందేహం కలుగుతుంది.

2.ఎన్టీఆర్ (రమణ) కనిపించిన మొదటి సీన్ పెళ్లి పీటలపై. కట్నం దగ్గర పేచీ వస్తుంది. తండ్రి ఆజ్ఞపై మూడు ముళ్ళు వేసి కూడా.. పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతాడు. రమణని కట్నకానుకలకు వ్యతిరేకిగా ఎస్టాబ్లిష్ చేస్తూ పెళ్ళికి ముందు ఒక సీన్ ఉన్నట్లయితే బాగుండేది (నే చూసిన డివిడిలో అటువంటి సీన్లు ఎగిరిపోయ్యాయేమో తెలీదు).

3.రమణ తండ్రిగా డా.శివరామ కృష్ణయ్య చక్కగా నటించాడు. మంచివాడు. కానీ కోపిష్టి. కథంతా ఈ పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. దొరైస్వామి చెప్పినవన్నీ అమాయకంగా నమ్మేస్తాడు. ఈయన్ని కొడుకు, కోడలు మరీ వెర్రివాడిని చేస్తారు. 'పాపం! ఈ అమాయకుడి కోసం ఇన్ని వేషాలు అవసరమా?' అనిపిస్తుంది. ఈ పాత్రని కొంత తెలివిగా చూపిస్తే కథ ఇంకా కన్విన్సింగ్‌గా ఉండేదేమో.

ధర్మసందేహం :-

సూర్యాకాంతం సన్నగా, చిన్నదిగా ఉంది. అందంగా కూడా ఉంది. దొరైస్వామికి భార్యగా వేసింది. ఇంత చిన్న వయసులో తల్లి పాత్ర ఎందుకు వేసిందబ్బా?! 'బావ' అన్నప్పుడల్లా కూతుర్ని పుర్ర చేత్తో 'ఫెడీ' మనిపిస్తుంటుంది. ఆ తరవాత కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకి సూర్యకాంతం తన చేతి చురుకు రుచి చూపించింది!

(photos courtesy : Google)

Wednesday, 5 December 2012

'రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!


సమయం రాత్రి పన్నెండు గంటలు. సాహిత్యంపై బాలగోపాల్ రాసిన వ్యాసాల సంకలనం 'రూపం-సారం' చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువసార్లు చదివిన పుస్తకం ఇదే. ఇంతలో అసరా (USA) నుండి ఒక మిత్రోత్తముని ఫోన్. చాలాసేపు చిన్ననాటి కబుర్లు, కాకరకాయలు. పిచ్చాపాటీ.

"ఈ టీవీలో 'పాడుతా తీయగా' ప్రోగ్రాం రెగ్యులర్ గా చూస్తున్నాను. ప్రోగ్రాం నాకు బాగా నచ్చింది. నువ్వు కూడా చూడు." అన్నాడు. మావాడు సంగీత ప్రియుడు. ఓ సన్నకారు పాటగాడు.

"తెలుగు టీవీ చూడకపోవడం నా ఆరోగ్య రహస్యం. కావున తియ్యగా పాడినా, చేదుగా పాడినా నాకు తెలిసే అవకాశం లేదు. నువ్వు చూడమంటున్నావు కాబట్టి తప్పకుండా చూస్తాను." అన్నాను.

నాది మాట మీద నిలబడే వంశం కాదు. అంచేత సహజంగానే అటు తరవాత ఆ టీవీ గోల మర్చిపోయ్యాను. అనగనగా ఓ పని లేని రోజు నా స్నేహితుడు, అతగాడికి చేసిన బాస గుర్తొచ్చి ఆ ప్రోగ్రాం టైమింగ్స్ వాకబు చేసి టీవీ ఆన్ చేయించాను.

టీవీ స్క్రీన్ పై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిండుగా కనిపిస్తున్నాడు. ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఈ రియాలిటీ షోలు గిరాకీ తగ్గిన పని లేని నటులకి, గాయకులకి చక్కటి ఆశ్రయం కల్పిస్తున్నాయి. మంచిది. ఇట్లాంటి కార్యక్రమాలు వృద్ధ కళాకారులకి రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ వలే కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వెరీ గుడ్.

ఇంతలో బక్కపలచటి కుర్రాడొకడు సెట్ మధ్యలో కొచ్చి ఆవేశంగా ఏదో సినిమా పాట ఎత్తుకున్నాడు. కళ్ళు మూసుకుని గొంతెత్తి పాడటం మొదలెట్టాడు. నాకు చిరాకేసింది.

'వార్నీ! పాడుతా తీయగా అంటే సినిమా పాటల పోటీ ప్రోగ్రామా!' ఆశ్చర్యపోయాను.

'మరి మన అసరోత్తముడు బాగుందన్నాడేమి! నా మీద వాడికి పాత కక్షలేమీ లేవు గదా!' ఆలోచిస్తూ మళ్ళీ టీవీ చూశాను.

ఇప్పుడు కడుపులో వికారం మొదలైంది. వెంటనే టీవీ కట్టేసాను.

ఈ వికారం నాకు కొత్త కాదు. దీనికి నలభయ్యేళ్ళ చరిత్ర ఉంది. సైకియాట్రీ వైద్యంలో PTSD అని ఓ కండిషన్ ఉంది. ఒక భయంకర అనుభవం మనసులో ముద్రించుకుపోయి.. ఆ అనుభవం తాలూకా భయాలు వెంటాడుచుండగా.. ఆ అనుభవం కనీస స్థితిలోనయినా మళ్ళీ ఎదురైతే తట్టుకోలేరు. అసలా ఊహకే విచలితులవుతారు. నా జీవితంలో ఈ సినిమా పాటల పోటీ ఒక బీభత్స అనుభవం.

ఇప్పుడు కొంచెంసేపు ఫ్లాష్ బ్యాక్. నా చిన్నప్పుడు వీధివీధినా వెలిసే  శ్రీరామనవమి పందిళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలకి కేరాఫ్ ఎడ్రెసులని ఇంతకు ముందొక టపాలో రాశాను. ప్రతి యేడాది ఈ పందిళ్ళల్లో సినిమా పాటలు పోటీ కూడా ఒక ముఖ్యాంశంగా ఉండేది.

అలనాటి ఆ పాటల పోటీలు నా జీవితంలో చెరగని ముద్ర వేస్తాయని అప్పుడు నాకు తెలీదు. అరిగిపోయిన భాషతో మర్యాద కోసం 'ముద్ర' అంటున్నానే గానీ.. నిజానికవి ముద్రలు కావు.. కత్తి పోట్లు, గొడ్డలి నరుకుళ్ళు!

ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. 'రాగమయి రావే! అనురాగమయి రావే!'. ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!

ప్రతి గాయక రాక్షకుడు మైకు ముందుకు రావడం.. గొంతు సరి చేసుకుని.. 'ఇప్పుడు ఘంటసాల మాస్టారు పాడిన ఫలానా పాట.' అని ఎనౌన్స్ చేసి మరీ హింసించేవాళ్ళు. మరీ ఒక్కోడు పాడుతుంటే పిశాచాల ప్రార్ధనలా, సూడి పంది ప్రసవ వేదనలా ఉండేది. జీవితం మీద విరక్తి పుట్టేది.

చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.

శ్రోతల ఏడుపు మొహాలు ఎవాయిడ్ చెయ్యడానికి వారు అలా కళ్ళు మూసుకొంటారని సుబ్బు అంటాడు. కొంతమంది మెలికలు తిరుగుతూ పాడేవారు. 'గొంతు ఎలాగు మెలికలు తిరగదు. కనీసం శరీరంలోనయినా చూపించనీ!' అంటాడు సుబ్బు.

మొత్తానికి ఆ యేడాది శ్రీరామనవమి పాటల పోటీ గాడిదలు, కుక్కలు, పిల్లులు, గబ్బిళాలు వంటి నానాజాతుల వికృత గాన సౌందర్య విలాసములకి పుట్టినిల్లుగా భాసిల్లింది. కళ్ళు మూసుకున్నట్లు చెవులు మూత పడకపోవడం మానవ శరీర నిర్మాణ లోపమని ఆ నాడే నాకు అర్ధమయ్యింది. అందుకే నాకు 'రాగమయి రావే' పాటంటేనే కసి, కోపం, చిరాకు, రోత!

ఒకానొక రోజు నవ్వారు మంచంపై కాళ్ళు పైకెత్తుకుని చందమామలోని ధూమకేతు, శిఖిముఖిల సీరియల్ ఉత్కంఠపూరితంగా పఠించు సమయమున.. నా ఒక్కగానొక్క అన్నయ్య ప్రేమగా అడిగాడు.

"జయభేరి సినిమాకి వెళ్తున్నా. వస్తావా?"

"ఛీ.. ఛీ.. ఆ సినిమా పొరబాటున కూడా చూణ్ను." అని ఈసడించుకున్నా.

అన్నయ్యకి అర్ధం కాలేదు. ఆ సినిమాపై నాకున్న కోపానికి కారణం తెలుసుకుని పెద్దగా నవ్వాడు.

"పోనీ ఒక పని చెయ్యి! ఆ పాట  వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని, చెవుల్లో వేళ్ళు పెట్టుకో!" అన్నాడు.

'ఇదేదో బానే ఉంది.' అనుకుంటూ అన్నయ్యతో జయభేరి సినిమాకి బయల్దేరాను.

'జయభేరి' ఒక అద్భుత దృశ్యకావ్యం. ఆసాంతం సుమధుర సంగీతమయం. నేను అసహ్యించుకున్న 'రాగమయి రావే' పాట సమయంలో కళ్ళు మూసుకోవడం కాదు.. కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయ్యి చూశాను. ఇన్నాళ్ళూ మా బ్రాడీపేట ఔత్సాహిక గాయక రాక్షసులు ఘంటసాల పాటని సామూహికంగా హత్య కావించారని అవగతమైంది.

(ఏమిరా దుష్ట దుర్మార్గ వెర్రి వైద్యాధమా! నీ రాతలతో మన బ్రాడీపేటీయుల పరువు తీయుచుంటివి? మనవాళ్ళు తమ గార్ధభ గానంతో ఘంటసాల పాటని కంకరరాళ్ళతో కలిపి కరకరలాడించారు. అంతమాత్రానికే అపచారమంటూ అంతలా అరవాలా?) 

అవును గదా! 'రాగమయి రావే!.. ' గీత హనన నేరం మా బ్రాడీపేట గాత్రకారులది కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందుకు బాధ్యత వహించవలసిన వారు ఘంటసాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, పెండ్యాల, పి.పుల్లయ్యలు మాత్రమే! ఒక పాటని మరీ అంత గొప్పగా రూపొందించడమే వారు చేసిన నేరం! దొంగలు బంగారాన్ని మాత్రమే కాజేస్తారు.

తరవాత జయభేరి సినిమా చాలాసార్లు చూశాను. ఎప్పుడు చూసినా 'రాగమయి రావే!' ఇష్టంగానే చూస్తున్నాను. కావున.. నా 'రాగమయి' పాట తాలూకా వికారం తగ్గిపోయినట్లే. ఘంటసాల అద్భుత గానం మూలానా కొందరి నీచగాన దోషం నశించినట్లుంది. పోన్లే. మంచిదే కదా!

చిత్రంగా ఇప్పుడు 'పాడుతా తీయగా' కార్యక్రమం చూస్తుంటే అప్పటి వికారం బయటేసింది. అనగా.. నేనకున్నట్లు నా చిన్ననాటి క్షుద్ర గాయకుల పట్ల నా ఆగ్రహజ్వాలలు ఇంకా చల్లారలేదన్నమాట. ఆలోచించగా ఇదంతయూ Pavlov classical conditioning వలే యున్నది. నా పసిహృదయం మరీ అంతలా గాయపడి తల్లడిల్లిందా!

దూరంగా పాట వినిపిస్తుంది. 'తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా.. మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనయినా.. '

ఈ టపాకి కారణం అయిన జయభేరి సినిమాలోని 'రాగమయి రావే.. ' పాట యూట్యూబ్ లో ఉంది. ఇక్కడ ఇస్తున్నాను. మరొక్కసారి విని ఆనందిచండి. ('చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం ఆ నాటి 78 rpm రికార్డులో లేదు.)



(photos courtesy  : Google)

Wednesday, 28 November 2012

చంద్రబాబు.. ఒక నడుస్తున్న చరిత్ర!


'ఈ టీవీ' లో చంద్రబాబు నాయుడు పాదయాత్రని చూస్తున్నాను. మనిషి బాగా చిక్కిపోయ్యాడు. కర్రకి బట్టలు తోడిగినట్లున్నాడు. కోట్ల రూపాయిలున్నాయి. అయినా ఏం లాభం? పాపం! కడుపు నిండా తినలేడు. కంటినిండా నిద్రపోలేడు. ఏమిటీ ఖర్మ? నా మనసు దిగులుగా అయిపొయింది.

"రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో  సుబ్బూ! పాపం  చంద్రబాబుని  చూడు. వృద్ధాప్యంలో ఎన్నికష్టాలు  పడుతున్నాడో!" దిగాలుగా  అన్నాను.

సుబ్బు ఆశ్చర్యపొయ్యాడు. క్షణకాలం టీవీలో చంద్రబాబుని చూశాడు.

"నీ దుఃఖానికి కారణం అర్ధం కావట్లేదు. చంద్రబాబు పాదయాత్ర చేస్తుంది తనకి పెన్షన్ అందట్లేదనో, ఇంటిస్థలం పట్టా కావాలనో కాదు. ఆయనక్కావలసింది ముఖ్యమంత్రి పదవి. అది మన చేతిలోనే లేదు. చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా నీకులా జాలిపడి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేస్తారేమో. కానీ నాకెందుకో అది చాలా కష్టం అనిపిస్తుంది." అన్నాడు సుబ్బు.

"కష్టమా! ఎందుకని?" అడిగాను.

"అసలు చంద్రబాబు ఏం చెబుతున్నాడో నాకర్ధం కావట్లేదు. ఒక పక్క అభివృద్ధి చేశానంటాడు. ఇంకోపక్క తప్పులు తెలుసుకున్నానంటాడు. మారిన మనిషినంటాడు. అంటే ఇంతకుముందు ఆయన చేసిన తప్పు రాష్ట్రాన్నిఅభివృద్ధి చెయ్యడమేనా? అంటే తను చేశానని చెబుతున్న అభివృద్ధిని disown చేసుకుంటున్నట్లే కదా!" అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! చంద్రబాబు 'మారిన మనిషి' సందేశం పార్టీ కాడర్ కోసం. పార్టీపరంగా తప్పులు జరిగాయని ఆయన ఒప్పుకుంటున్నాడు." అన్నాను.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుబ్బు.

"రాజకీయాల్లో లెక్కలు వేరుగా ఉంటాయి. ఆ మాటకొస్తే అసలు లెక్కలే ఉండవు! ఎక్కాల ప్పుస్తకంలో రెండురెళ్ళు నాలుగనే ఉంటుంది. రాజకీయాల్లో రెండురెళ్ళు పది అవ్వచ్చు. సున్నా కూడా కావచ్చు."

"సుబ్బు! నీకు లెక్కలు రావన్న సంగతి నాకు తెలుసు. కొంచెం అర్ధమయ్యేట్లు చెప్పు." విసుక్కున్నాను.

"రాజకీయంగా ఇవ్వాళ ఉన్నపరిస్థితి రేపు ఉండదు. కొత్తసమస్యలు రావచ్చు. పాతసమస్యలు పెద్దవిగా మారవచ్చు. ఉన్నట్లుండి కొన్నికారణాల వల్ల పరిస్థితి పూర్తిగా ఒకపార్టీకి అనుకూలంగా మారిపోవచ్చు. దరిద్రం నెత్తి మీదుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల్లాంటి పరిణామాలు కూడా సంభవించవచ్చు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"సుబ్బు! ఎప్పుడో అరుదుగా జరిగే ఎమోషనల్ సంఘటనలని ప్రస్తావించడం రాజకీయ విశ్లేషణ అవ్వదు. కష్టేఫలి అన్నారు పెద్దలు. గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. చంద్రబాబు కష్టపడుతున్నాడు. కష్టపడ్డప్పుడు ఫలితం ఎందుకుండదు?" చిరాగ్గా అన్నాను.

"కూల్ డౌన్! ముందుగా నువ్వు గ్రహించవలసింది నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు. నా అభిప్రాయాలు చెబుతున్నానంతే. రాజకీయాల్లో భగవద్గీతలకీ, తెలుగు నిఘంటువులకీ కూడా చోటులేదు. అంచేత కష్టం, ఫలితం వంటి మాటలకి విలువ లేదు. అదృష్టం బాగుంటే పదవి ఫెవికాల్ లా పట్టుకుంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు?"

"అవును గదా!" సాలోచనగా అన్నాను.

"చంద్రబాబు ఈ రాష్ట్రానికి CEO నని తనకితానుగా ప్రకటించుకున్నాడు. CEO లు ప్రభుత్వాలకి ఉండరు. కార్పొరేట్ కంపెనీలకి ఉంటారు. తధాస్తు దేవతలు ఆయన్ని దీవించారు. అందుకే తెలుగు దేశం పార్టీకి CEO గా మిగిలిపొయ్యాడు. అయితే ఈ TDP కంపెనీ పాతబడిపోయింది." అంటూ ఖాళీ కప్ టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

ఒకక్షణం ఆలోచించి నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.

"ఒకప్పుడు కారంటే ఎంబాసిడర్ మాత్రమే కారు. కలర్ టీవీ ఒక పెద్ద డబ్బాలా ఉండేది. సెల్ ఫోన్ కిలో బరువుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంబాసిడర్ కారు చూడాలంటే మ్యూజియంకి వెళ్ళాలి. అన్నిఇళ్ళల్లో విస్తరాకుల్లాంటి LED లు. అందరి చేతుల్లోనూ తమలపాకుల్లాంటి ఐ ఫోన్లు. మార్పు ప్రకృతి ధర్మం. ఇప్పుడెంత కష్టపడ్డా చంద్రబాబు తన పాత మోడల్ కారు, టీవీ, సెల్ ఫోనూ అమ్మడం కుదరదు. రాహుల్ గాంధీ, జగన్ మోహన్ రెడ్డిలు  కుర్రాళ్ళు. లేటెస్ట్ మోడల్ కార్లు, 3D LED, సామ్సంగ్ గెలాక్సీల్లాగా పెళపెళ లాడుతున్నవారు. వాళ్లకి ఆ మేర ఎడ్వాంటేజ్ ఉంది. మన CEO చంద్రబాబుకి ఈ సంగతి తెలియనిది కాదు. కానీ ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు."

"సుబ్బు! నువ్వు చెప్పే కార్లు, టీవీల బిజినెస్ థియరీ రాజకీయాలకి వర్తించదు. నేను ఒప్పుకోను." అన్నాను.

"పోనీ ఇంకోభాషలో చెబుతా విను. తెలుగు దేశం పార్టీ ఒక పెద్ద ఇల్లు వంటిది. ఒకప్పుడు ఆ ఇల్లు లేటెస్ట్ మోడెల్. కళకళలాడింది. ఇప్పుడది పెచ్చులూడిపోయిన పాతబడ్డ బిల్డింగ్. మామూలు పరిస్థితుల్లో అయితే చంద్రబాబు మాసికలు వేయించి, దట్టంగా wall care పెట్టించి ఏదోరకంగా నెట్టుకొచ్చేవాడే. కాకపొతే ఆ పాతబిల్డింగ్ కి తెలంగాణా వాదం అనే పెద్ద తొర్ర పడింది. బిల్డింగ్ ఒక వైపు కూలిపోయింది. రిపైర్ చేయించడానికి ఇసుక, సిమెంట్ సమకూర్చుకునే పనిలో చంద్రబాబు ఉన్నాడు. అయితే రిపైర్ పనులు ముందుకు సాగనీయకుండా ఢిల్లీ KCR అనే మేస్త్రీని కాపలా పెట్టింది. KCR పని ఆ తొర్ర పూడకుండా, వీలయితే ఇంకా పెద్దదయ్యేట్లు చెయ్యటమే! అందుకే ఒక్కోసారి పాతఇల్లు రిపైర్ చేయించేకన్నా కొత్తఇల్లు కట్టుకోవటం సులువు." అంటూ టైం చూసుకుంటూ లేచి నిలబడ్డాడు సుబ్బు.

"సుబ్బూ! నువ్వు వంద చెప్పు. చంద్రబాబుని చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ వయసులో చంద్రబాబు అంత కష్టపడటం అవసరమా?" అన్నాను.

"పూర్తిగా అనవసరం. ఈ బుట్టలల్లడాలు, ఇస్త్రీ చెయ్యడాలు, చెప్పులు కుట్టడాలు చేస్తే మిగిలిది ఆయాసం తప్ప మరోటి కాదు. ఇవన్నీ ఎసెంబ్లి స్థాయి నాయకులు ఓట్లడుక్కునేప్పుడు చేసే చౌకబారు విన్యాసాలు. చంద్రబాబు స్థాయి చాలా ఎక్కువ. ఆయన తన హయాంలో ఆర్ధిక సంస్కరణలు ప్రజలకి మేలు చేస్తాయని నమ్మాడు. వేగవంతంగా అమలు చేశాడు. ఆ విధంగా భారత రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించాడు." అంటూ తలుపు తీసుకుని వెనక్కి తిరిగాడు సుబ్బు.

"మళ్ళీ చంద్రబాబే కావాలనుకున్నప్పుడు ప్రజలే వెతుక్కుంటూ వచ్చి ఆయనకి ఓట్లేస్తారు. అంతేగానీ చరిత్రకి రోడ్డెక్కవలసిన అవసరం లేదు. అనగా ట్రెండ్ కి తగ్గట్లు తను నమ్మిన ఆర్ధిక విధానాలు, రాజకీయాలు మార్చుకోవలసిన అవసరం చంద్రబాబుకి లేదు." అంటూ హడావుడిగా వెళ్ళిపొయ్యాడు సుబ్బు.


(photos courtesy : Google)

Monday, 26 November 2012

పిల్ల సందేహాలు - పిడుగు సమాధానాలు


అప్పుడు నాకు పదేళ్ళు. అమ్మానాన్నల మధ్య కూర్చుని 'కన్యాశుల్కం' సినిమా చూస్తున్నాను (అవునురే! పదేళ్ళ వయసులో ఏ ఎన్టీవోడి సినిమానో చూసుకోక - కన్యాశుల్కాలు, వరకట్నాలు నీకుందుకురా? అయ్యా! సినిమాలు చూచుట అనేది పరమ పవిత్రమైన కార్యము. మనం ప్రతిరోజూ ఎంతమంది దేవుళ్ళకి మొక్కట్లేదు? అట్లే, అన్నిరకముల సినిమాలు చూడవలెననీ, ఎన్ని సినిమాలు చూచినచో అంత పుణ్యము లభించునని నా ప్రగాఢ విశ్వాసము).

తెర మీదకి ఎవరెవరో వస్తున్నారు. ఏవిటేవిటో మాట్లాడుతున్నారు. సినిమా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. కనీసం ఒక్క ఫైటింగు కూడా లేదు. సినిమా పరమ బోర్!

ఉన్నట్టుండి సావిత్రి 'లొట్టిపిట్టలు' అంటూ పెద్దగా నవ్వడం మొదలెట్టింది. అట్లా చాలాసేపు నవ్వుతూనే ఉంది. ఎందుకంత పడీపడీ నవ్వుతుంది? నాకర్ధం కాలేదు.

"అమ్మా! సావిత్రి ఎందుకట్లా నవ్వుతుంది?"

"సావిత్రి మధురవాణి వేషం వేస్తుంది. మధురవాణి వేశ్య!" అంది  అమ్మ.

ఓహో అలాగా! వేశ్యలు పెద్దగా నవ్వెదరు.

అంతలోనే ఇంకో సందేహం.

"వేశ్య అంటే?"

అమ్మ చిరాగ్గా మొహం పెట్టింది. ఒక క్షణం ఆలోచించింది.

"వేశ్య అంటే సంపాదించుకునేవాళ్ళు." అంది.

ఓహో అలాగా! సంపాదించుకునేవారిని వేశ్యలు అందురు.

ఇప్పుడింకో సందేహం.

"అమ్మా! నాన్న సంపాదిస్తున్నాడుగా. మరి నాన్న కూడా వేశ్యేనా?"

అమ్మ చిటపటలాడింది.

"నీ మొహం. అన్నీ కావాలి నీకు. నోర్మూసుకుని సినిమా చూడు." అంటూ కసురుకుంది.

నా మొహం చిన్నబోయింది.

          *                     *                   *                    *                        *                    
మళ్ళీ చిన్నప్పుడే!

అది మధ్యాహ్నం. సమయం సుమారు మూడు గంటలు. అమ్మ, ఆవిడ స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకునే సమయం. బియ్యంలో మట్టిగడ్డలు ఏరుతూ, తిరగలి తిప్పుతూ, ఊరగాయ పచ్చడికి ముక్కలు తరుగుతూ లోకాభిరామాయణం చెప్పుకుంటుంటారు. నేనా కబుర్లు ఆసక్తిగా వినేవాణ్ని.

ఆరోజు ఎదురింటి విజయక్కయ్య, పక్కింటి భ్రమరాంభ పిన్ని, రెండిళ్ళవతల ఉండే గిరిజత్తయ్య చెవులు కొరుక్కుంటున్నారు. ఒక చెవి రిక్కించి అటు వేశా.

"చూశావా భ్రమరా! ఎంత అమాయకత్వంగా ఉండేవాడు. అంతా నటన! నంగి వెధవ. చదువుకున్నాడు గానీ ఏం లాభం? నేనైతే చెప్పుతో కొట్టే్దాన్ని." అంది విజయక్కయ్య.

"పాపం! ఆ పిల్ల ఎంత అమాయకురాలు! ఈ మధ్యనే పెళ్ళికూడా కుదిరిందట. ఇట్లాంటి దరిద్రుల్ని గాడిద మీద ఊరేగించాలి." అంది గిరిజత్తయ్య.

కొంతసేపటికి నాకర్ధమైనదేమనగా.. వీధి చివర శంకరం గారింట్లో  స్కూల్ మాస్టరు రంగారావు అద్దెకుంటారు. ఆయన వాళ్ళావిడ ఇంట్లోలేని సమయమున పనిమనిషి చెయ్యి పట్టుకున్నాట్ట. అదీ సంగతి!

విషయం అర్ధమైంది గానీ.. మర్మం అర్ధం కాలేదు.

ఒక సందేహము బుర్ర తొలుచుచుండెను.

"విజయక్కయ్యా! మాస్టారు పనిమనిషి చెయ్యి పట్టుకుంటే ఏమవుతుంది?" అడిగాను.

అమ్మ నోర్మూసుకోమన్నట్లు గుడ్లురుమింది.

విజయక్కయ్య సిగ్గు పడుతూ చెప్పింది.

"మగవాడు ఆడవాళ్ళ చెయ్యి పట్టుకోకూడదు. చాలా తప్పు." అంది.

ఓహో అలాగా! మగవాడు ఆడవారిని ఎక్కడైనా పట్టుకొనవచ్చును గానీ.. చెయ్యి మాత్రం పట్టుకొనరాదు!

ఇప్పుడింకో సందేహం.

"మరయితే ఆ గాజులమ్మేవాడు ఇందాక మీఅందరి చేతులూ పట్టుకున్నాడుగా?"

నా డౌటుకి విజయక్కయ్య తికమక పడింది. భ్రమరాంభ పిన్ని చీరకొంగు అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది.

అమ్మ కసురుకుంది.

"వెధవా! అన్నీ పనికిమాలిన ప్రశ్నలు. అయినా ఆడాళ్ళ మధ్య నీకేం పని? అటుపొయ్యి ఆడుకో పో!"

నా మొహం మళ్ళీ చిన్నబోయింది!

(photo courtesy : Google)