అనగనగా ఒక జమీ. దానికో జమిందారు. పిండినంత కాలం పిండి.. ఇంకా ఏమి లేదని తేల్చిన తర్వాత.. ఒక రోజు జమిందారు తన అనయాయులందరినీ పిలిచి వారికి తన కోసం నిర్మించుకున్న నలభై ఏళ్ళ మండువా పెంకుటింటి భవనాన్ని అప్పచెప్పాడు. వారిని ఆ వూరికి, ఇంటికీ కామందులు గా అభిషేకించాడు. అయితే, ఆస్థిని అనుభవించడానికి కొన్ని షరతులు విధించాడు.
"ఆ ఇంటిని కూల్చరాదు. ఉన్న ముగ్గురిలో ఇద్దరు చెప్పిందే వేదం. వీరికి పిల్లలు కలిగితే వారికి కూడా అనుభవించే యోగ్యత ఉంటుంది. కొత్త వారిని చేర్చరాదు. అందరూ కలసి ఉంటె ఇంటికి అద్దె లేదు. ఊరి రాబడి అంతా వీరిదే. జనానికి పన్నులు కట్టే హక్కు తప్పితే ప్రశ్నించే హక్కు లేదు. అయితే ఐదు ఏళ్ళ కొకసారి ప్రజల దగ్గిరకు వెళ్లి మీకు 'అవిచేస్తాం, ఇవి చేస్తాం' అని ఆశలు కల్పించాలి. అట్లా ఎక్కువ మందిని ఎవడు బురిడీ కొట్టించగలడో వారికి ఆ ఇంటి అద్దె లేదు. ఆదాయం తొమ్మిది పాళ్ళు వాళ్ళదే. మిగిలిన వాళ్ళు (అనగా తక్కువ మందిని బురిడీ కొట్టించిన వాళ్ళు), ఆ ఇంట్లో ఉంటూ పదింట ఒక పాలు మాత్రమే ఆదాయం పొందుతారు. ఇంటిని బాగుచేయ్యాలంటే ఆ మాత్రం ఏకాభిప్రాయం తప్పనిసరి. ఒక్కళ్ళ వల్ల కాక పొతే కొందరు కలసి విధానం ఇదని నిర్ధారిస్తారు. అట్టి వాళ్లకు అద్దె లేదు. తిరగడానికి బుగ్గ కారు ఉచితం. ఆదాయంలో వాటా చెప్పనక్కర లేదు."
ఈ విధంగా ఒక ముప్ఫై ఏళ్ళు గడిచాక ఒకరి బదులు కొందరు కలసి ఇంటిపై ఆధిపత్యం చలాయించడం, ఒక సారి వీరైతే, ఇంకొకసారి వారు ప్రజలను ఎక్కువ బురిడీ కొట్టడం నేర్చుకున్నారు.
ఇంటి పెద్ద యాక్సిడెంట్లో చనిపొయ్యాడు. అప్పటి వరకూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్న అమ్మ గారు భర్త స్థానంలో ఇంటి బాధ్యతలు స్వీకరించారు.
మేధావుల మనుకొనే వెర్రి గొర్రెలు వీరికి శక్తి కొలదీ వోట్లు వేసీ.. లేక పొతే రెండో వాడికి వోట్లు వెయ్యకా.. ఆ అనుయాయులకే పీఠం ఇవ్వడం లేదా పీఠం ఎక్కిన వాడిని నోరు అలిసేలా తిట్టడం చేసి.. చాలా గొప్పవాళ్ళం అనుకొంటున్నారు.
ప్రతి వారికీ వృద్ధాప్యం వస్తుంది. అందరి లాగే ఆ ఇంటికి కూడా. పెంకుటిల్లు కారడం మొదలు పెట్టింది. అయితే అన్ని గదులలో ఒకటిగా కారడం లేదు. కొన్ని చోట్ల చిన్న చిన్న మరమ్మత్తులు చేసి కారని వాటాలలో అస్మదీయులు (అనగా బుగ్గ కారు అనుభవిస్తున్న జీవులు).. మిగతా వాటిలో తస్మదీయులు ( అనగా బుగ్గ కారు లేని జీవులు) జీవిస్తున్నారు.
ఇంటి పెద్దకు ఇల్లంతా బాగు చేద్దాం అన్న ఊహే లేదు. తన వాటా ఎలా పెంచుదాం, తన కొడుకుకి ఈ వాటా ఎలా వారసత్వం అయ్యేలా చూద్దాం అన్న తపనే. అందుకే తన వాటా బాగుంటే ఇల్లంతా బాగుంది అని నమ్ముతూ పిల్లిలా గడుపుతుంది.
తస్మదీయులు 'ఈ ఇల్లు కారుతోంది. దీనిని సమూలంగా బాగు చెయ్యాలి. అందుకు నీ వల్ల కాదు. నా చేతికి ఈ ఇంటిని ఇచ్చి. నువ్వు నా వాటాలో ఉండు.' అని గోల చేస్తున్నారు.
దీనిని ఎదుర్కోడానికి ఇంటి పెద్ద గోల చేస్తున్న వాళ్ళలో కొందరికి బొగ్గో, బుగ్గో ఇచ్చి ఊరుకో పెడదాము అని ప్రయత్నిస్తుంది. ఇంకొక రెండేళ్ళు గడిస్తే, మట్టితో పూడి ఈ ఇల్లు కారడం ఆగుతుంది. దానికి సున్నం రాసి, భవనం మెరుస్తోంది అని చెప్పి ఎక్కువ మందిని బురిడీ కొట్టిచ్చి, ఈ ఇంటిని కొడుకు చేతిలో పెడదామని పెద్ద ఆలోచన.
కాని, ఈ మధ్య బాధల్లా అస్మదీయులతోనే. వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాటాల్లో ఉంటూనే, ఇంటి తిండి తింటూ, ఎదుటివారి పాట (ఈ ఇల్లు కారుతోంది, దీనిని సమూలంగా బాగు చెయ్యాలి, అందుకు నీ వల్ల కాదు, నా చేతికి ఈ ఇంటిని ఇచ్చి, నువ్వు నా వాటాలో ఉండు అనే గోల) చెయ్యడం, లేదా చేస్తామని బెదిరించడం ఎక్కువయ్యింది.
వీరిలో గడ్డి పరకమ్మ అగ్రగణ్యురాలు. ఆమె తనవంటి వారిని కలిపి ఒక బ్రహ్మ సూత్రం చెప్పింది.
"మనమందరం అద్దె లేకుండా ఉన్న వాళ్ళమే. అయితే మన అయిదేళ్ళ కొకసారి పేరంటానికి వచ్చే జనం దృష్టి మన ఇల్లు మనం ఎలా ఉంచుకున్నామని చూడడమే. కాబట్టి మనం కొన్ని పాత్రలు సిద్ధం చేసుకోవాలి. మన ఇంట వాన కారినా మన దగ్గిర డేగిసాలు ఉంటె వాటిల్లో నీరు పట్టి మన ఇల్లే బ్రహ్మాండం అని బురిడీ కొట్టించవచ్చు. డేగిసాల కంటే పెంకుటింటి చిల్లులు ఎక్కువ అయితే మనం ఎదుటి వారి పాట పాడదాం. దాని వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదు. ఇంటి పెద్ద బేరాని కొస్తే వాడిని మా వాటా రిపేరీ చేయించామనో లేక నాకు మరికొన్ని డేగిసాలు ఉచితంగా ఇమ్మనో అడుగుదాం. ఒప్పుకోకపొతే తస్మదీయులతో చేరి మీరు గెలిచినా ఈ వాటా మాదే! రిపేరీ మీది, డేగిసాలు మావి అని ఒప్పందం చేసుకుందాం." అని చెప్పింది.
దానికి తల ఊపిన కొందరు ఈ మధ్య ఇంటి పెద్దమ్మ గారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. పోనీ కొడుకు యెంత ప్రయోజకుడో చూద్దాం అని పంపితే.. వాడు గారడీ ఆటకి వెళ్ళిన చోటల్లా ప్రజల బోల్తా తక్కువ, కొడుకు బోల్తా ఎక్కువ అయ్యింది.
పోనీ కొడుకు కుర్చీ ఎక్కేదాకా ఉపయోగ పడతాడని నమ్మకస్తుడైన మోహనయ్యని పట్టు కొస్తే, ఆయన కుర్చీ ఎక్కక ముందు బలపం అని, ఇప్పుడు బప్పం అంటున్నాడు. గడ్డి పరకమ్మ, సైకిలు ముసలాడితో కలిసి తిరుగుతూ పెద్దకు నిద్ర లేకుండా చేస్తోంది. కొడుకేమో భయమెందుకు, కొత్త వేషం కడదాం రా! అంటున్నాడు.
వీటితో నిద్ర పట్టని ఇంటి పెద్ద వినాయక పూజకు కూర్చుంది. "అయ్యా! గణపయ్యా! నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పెడతా. నాకు కొంచెం దారి చూపు." అని వేడింది.
వెంటనే ప్రత్యక్షమైన గణపతి 'జామిందారి ఇంటి గురించి తప్ప ఇంకేదైనా కోరుకో.' అంటూ మాయమైపొయ్యాడు!
కిం కర్తవ్యమ్.. ?!
(రచన : పుచ్చా)
evarandee ee puchchaa .....bhale raasaadu,kaani aakharloa "jamindaaree inti nudi tappa annaaru kanuka aalphs parvataalanundi eamainaa koravachu jaagratta ganapayyoa......
ReplyDeleteHa ha.. Awesome !!!!!
ReplyDeleteప్రస్తుత రాజకీయ నగ్న స్వరూపం. ప్రస్తుతమేమిటి, దాదాపుగా గత 30 ఏళ్ళ నుండి జరుగుతున్న రాజకీయ నాటకమే. మన దేశములోని ఈ రాజకీయ నాయకులు ఒకే తానులోని గుడ్డ ముక్కే అనే ఆలోచన కలగనంతవరకు, బొక్కలున్న పెంకుటిళ్ళకు మరమ్మత్తులు జేసి ఇంద్ర భవనముగా చిత్రీకరిస్తారు.
ReplyDeleteమరి ఎవరికి సిగ్గున్నదో, ఎవరికి సిగ్గులేదో చెప్పడం ఆ "విఘ్నేశ్వరుడు" కి కూడా కష్టమే.
ప్రస్తుతం గడ్డిపరకే ముసలం అయ్యింది.
ReplyDeleteటపా మాత్రం యరమణ స్థాయి లో లేదు.
ReplyDeleteకాముధ
i second kamudha's comment.
ReplyDeleteముందు ఇల్లు తాకట్టు పెట్టేస్తే సరిపోతుంది, మిగతావాళ్ళకి తెలియకుండా.అదే జరుగుతోందిగా!!
ReplyDeleteవ్యాఖ్య రాసిన మితృలకి పేరుపేరునా ధన్యవాదాలు.
ReplyDeleteపుచ్చా నాకు నా గురవయ్య హై స్కూల్ రోజుల నుండీ అత్మీయ మితృడు. రిజర్వ్ బ్యాంక్ లో ఏదో పెద్ద ఉద్యోగం (నాకు బ్యాంక్ ఉద్యోగాల గూర్చి అవగాహన లేదు). మంచి తెలుగు రాస్తాడు.
నన్ను ఒక పొలిటికల్ సెటైర్ రాయమని పురమాయిస్తూ.. నిన్న ఒక plot మెయిల్ లో పంపించాడు. మన బ్లాగ్లోకంలోకి కొత్త పాత్రని ప్రవేశపెడదామని.. వాడి రాతలో బొమ్మలు ఇరికించి.. ఉన్నది ఉన్నట్లుగా పబ్లిష్ చేసేశాను. అదీ కథ!
వ్యాఖ్యానించిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.