నా చిన్నప్పుడు సినిమా పాటల అభిమానులకి రేడియోనే పెన్నిధి. ఇప్పుడంటే యూట్యూబు పుణ్యాన ఏ పాటనైనా క్షణాల్లో చూసేస్తున్నారు గానీ.. చిన్నప్పుడు ఇష్టమైన పాట వినడానిక్కూడా ఎన్నో తిప్పలు పడేవాళ్ళం.
ఈ తెలుగుదేశంలో ఘంటసాల అభిమానులు కానివారు నాకింతవరకూ కనబళ్ళేదు. నాకు దైవభక్తి లేదు. కానీ ఘంటసాల భక్తిపాటలు ఇష్టం! నాలో ఉన్న అనేక వైరుధ్యాలలో ఇదొకటి. 'సంతానం' సినిమాలో 'దేవి శ్రీదేవి.. ' అంటూ ఘంటసాల పాడిన భక్తిపాట నాకు చాలా ఇష్టం. 'సంతానం' సినిమా నేను చూళ్ళేదు. నటీనటులెవరో తెలీదు. కథ గూర్చి పైసా కూడా అవగాహన లేదు.
అయితే ఇంత powerful devotional song ని రేడియో స్టేషన్ వాళ్ళు ఉదయాన్నే ప్రసారం చేసే తమ భక్తిపాటల కార్యక్రమంలో వేసేవాళ్ళు కాదు. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో వినిపించేవాళ్ళు. ఈ సంగతి కనిపెట్టిన నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నవారు బుర్ర తక్కువ సన్నాసులనే అభిప్రాయానికొచ్చేశాను!
పెద్దయ్యాక గుంటూరు మెడికల్ కాలేజి గార్డెన్లో ఓరోజు సినిమా పాటల గూర్చి చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఈ పాటని భక్తిపాటల slot లో చేర్చని ఆకాశవాణి వారి అజ్ఞానాన్ని ఎత్తి చూపాను.
"అది భక్తిపాట కాదనుకుంటా. లిరిక్ జాగ్రత్తగా ఫాలో అవ్వు. 'నీ కనుసన్నల నిరతము నన్నే హాయిగా ఓలలాడించ రావే!' అని గదా ఘంటసాల పాడింది. అంటే ఇది లవ్ సాంగ్ అయ్యుండొచ్చు." అన్నాడొక సినిమా పాటల జ్ఞాని.
ఆశ్చర్యపోయాను. కానీ నమ్మలేకపోయాను. "ఆ పాట శ్రుతి, తాళం, రాగం విన్నాక కూడా దాన్ని ప్రేమగీతం అంటావేంటి? కవులు భక్తిపాటల్లో కూడా క్రియేటివిటీ చూపిస్తారు. ప్రబంధ కవులయితే దేవతలకి లవ్ లెటర్లు కూడా రాస్తారు. నువ్వు చెప్పిన లైన్లు ఆ కోవలోకి చెందుతాయి." అని వాదించాను. గెలిచాను. నోరు గలవాడిదే గెలుపు!
కొన్నాళ్ళ క్రితం నా అభిమాన భక్తిపాట విందామని యూట్యూబులోకి వెళ్ళాను. వార్నీ! ఇంతకీ 'దేవి శ్రీదేవీ.. ' భక్తిపాట కాదు! నాగేశ్వరరావు సావిత్రికి తన గాఢప్రేమని వ్యక్తీకరిస్తూ ఘంటసాల స్టోన్లో పాడిన లలిత గీతం!
లోగడ 'పెళ్ళిచేసిచూడు' సినిమాలో 'యేడుకొండలవాడా వెంకటారమణా.. ' అంటూ భక్తిపాటలా అనిపించే ప్రేమగీతం విషయంలో కూడా ఇలాగే కంఫ్యూజయ్యాను. అయితే నేను 'పెళ్ళిచేసిచూడు' చూశాను. అక్కడ నర్స్ వేషంలో ఉన్న జి.వరలక్ష్మికి అట్లాంటి పాట పాడ్డానికి ఒక రీజనుంది.
నేను 'సంతానం' సినిమా చూడని కారణాన హాశ్చర్యపడటం మించి చేయగలిగింది లేదు. సుసర్ల దక్షిణాముర్తి శాస్త్రీయ సంగీతంలో ఎంత ఉద్దండుడైనా.. సందర్భశుద్ధి లేకుండా ఇంత హెవీ క్లాసికల్ బీటుతో లవ్ సాంగ్ చేస్తాడనుకోను.
సరే! కొద్దిసేపు ఈపాట సంగీతం గోలని పక్కన పెడదాం. పాట చిత్రీకరణ గూర్చి రెండు ముక్కలు. నాకీ పాటలో నాగేశ్వరరావు, సావిత్రి పిచ్చపిచ్చగా నచ్చేశారు. జంట చూడముచ్చటగా ఉంది. వీళ్ళ దుంపతెగ! ఎంత సున్నితంగా, ముద్దుగా ప్రేమని అభినయించారు! మధ్యలో తలుపు కూడా భలే నటించిందే! దీన్నే సహవాస దోషం అంటారనుకుంటా! ఈపాట మీ కోసం ఇక్కడ ఇస్తున్నాను.
ప్రేమ పాట కూడా భక్తి పాట ల పాడిన ఘంటసాల పై మీ అభిప్రాయం..
ReplyDeleteఅడగాలంటే సాహసం కావలి..కాని సాహసించి అడుగుతున్నా???
ఘంటసాలపై నా అభిప్రాయం? ఈ ప్రశ్న అడగాలంటే నిజంగానే సాహసం కావాలి!
Deleteహిమాలయ పర్వతాలు, నయాగరా ఫాల్స్, ఘంటసాల గానం.. ఇవన్నీ సృష్టిలోని అద్భుతాలు. వీటిపై ప్రశ్నలడగరాదు. ఎంజాయ్ చేసెయ్యడమే!
చదువుతునప్పుడు తెలియలేదు కాని, పాట వినగానే తెలిసింది.."ఇది నాకు ఇంతకూ ముందు తెలిసిన పాటే నని"..
ReplyDeleteఅచ్చు తప్పు ఉన్నది మిత్రమా, కింద కరక్టుగా రాసినా పైన సంసారం అని రాసావు. ఇది " సంతానం " లొనిదే! సావిత్రి, తలుపులు, గోడలు, దుప్పట్లు (నీ కత్యంత ప్రీతికరమైనది - దుప్పటని నాకు తెలుసు!) నచ్చటం లో గొప్ప లేదు నాగేశ్వర్రావు నచ్చాడేమిటా అనుకొన్నా! ఓహో పాత నాగేశ్వర్రవు కదా. ఏది ఏమైనా ప్రొద్దున్నే మాంచి పాట వినిపించావ్! "Sorry" చూపించావ్!
ReplyDeleteమిత్రమా,
Deleteసంసార బాధ్యతలు మోయలేనంత భారమైనందున.. అనుకోకుండా (ఫ్రాయిడ్ భాషలో unconscious mind) 'సంసారం' అని వచ్చేసింది. ఇప్పుడు సరిజేసితిని. ధన్యవాదాలు.
ReplyDeleteఆ పాట శాస్రీయసంగీత బాణీలో సంగీతదర్శకుడు కూర్చిన తర్వాత ఘంటసాల మాత్రం ఏంచేస్తారు .అలాగే పాడవలసి వచ్చివుంటుంది.అది ప్రేమగీతమే.మొత్తం మీద ఒక మంచిపాట.
కమనీయం గారు,
Deleteఘంటసాల అత్యుత్తమ స్థాయి గాయకుడు. ఆయన గానంతో సాధారణ పాటలు కూడా ఉత్తమ పాటల స్థాయిని సంతరించుకున్నాయి.
ఈ పాటలో నాగేశ్వరరావు, సావిత్రిలు చాలా సున్నితంగా ప్రేమించుకుంటున్నారు. పాట మాత్రం చాలా గంభీరంగా హెచ్చు శృతిలో ఉంది. నాకు సంగీతం గూర్చి తెలీదు. సినిమా గూర్చి కూడా తెలీదు. కావున ఇప్పటికింతే!
మీరు వ్రాసింది ఈ పాట గురించి కాదా?????????????????????? ..
ReplyDeletehttp://www.youtube.com/watch?v=4QnS2-pkPtM
ఇది భక్తీ పాటే ముమ్మాటికీ, మన గుడుల ప్రస్తుత పరిస్థితి ఇదే :)
Mauli గారు,
Deleteమీరు ఇచ్చిన విడియో లింక్ చూశాను. మీకు నామీద ఇంత కోపం ఉందని అనుకోలేదు!
సున్నం కొట్టిన మొహం, బుట్ట విగ్గు, రంగురంగుల చొక్కాలు.. దసరా వేషగాడు దసరా కన్నా ముందే వచ్చేశాడు! దరిద్రపు గొట్టు పాట, ఎండలో డ్రిల్లు స్టెప్పులు.. కడుపు దేవేసింది.
ఖర్మ! పొద్దున్నే ఇంత భయానక పాట చూశాను. ఇవ్వాళ నాకేదన్నా కీడు సంభవిస్తుందా!
ప్చ్... ఇదే మన నాగయ్య పాడి వుంటేనా... ఎలా వుండేది, డాక్టారూ? :)) ;)
ReplyDeleteసైగల్, నాగయ్య, భానుమతిలు తమ పాత్రలకి మాత్రమే పాటలు పాడుకున్నారు. నాకు తెలిసి వీరు వేరెవ్వరికీ నేపధ్యగీతాలు పాడలేదు. కావున నాగయ్య నాగేశ్వరరావుకి ఎలా పాడతాడో ఊహించి చెప్పడం కష్టం.
Delete(ఘంటసాల, రఫీ పాడిన పాటలు ఇంకొకళ్ళయితే ఎలా పాడతారు? అని ఆలోచించడం కూడా దండగ. ఆల్రెడీ అది the best version అవుతుంది కాబట్టి!)
పాటంటే పాటనే, సినెమా చూడకుండా విని మీరెలాగైతే అభిప్రాయం ఏర్పరుచుకుని చెప్పారో అలానే చెప్పండి.
Deleteసమాధానం చెప్పేదాకా వదలరన్న మాట! నాగయ్య గాయక నటుడు. ఆయనకి గాయకుడిగా కొన్ని పరిమితులున్నాయి. ఘంటసాల అద్భుత గాయకుడు. నాగయ్య ఈ పాటని ఘంటసాలంత గొప్పగా, ఈ శృతిలో పాడలేకపోవచ్చు.
Delete:)
Deleteఅలా అన్నారు, ఎంత బాగుందో చూడండి. :)
మీ పోస్టు టైటిల్ చూసి తొందరపడి "దేవీ మౌనమా..శ్రీదేవీ మౌనమా.." అనే పాటగురించేమో అనుకున్నా.
ReplyDeleteలేదు. లేదు. మీరు చెప్పిన పాట గూర్చి రాసేంత 'ధైర్యం' నాకు లేదు. క్షమించాలి.
Deleteఘంటసాల, రఫీ పాడిన పాటలు ఇంకొకళ్ళయితే ఎలా పాడతారు? అని ఆలోచించడం కూడా దండగ.
ReplyDelete__________________________________________________________________________________
One counter example here http://www.youtube.com/watch?v=vN6dx4h48b0 .. One of the few songs wherein Kishore Kumar totally dominated Rafi.
Totally agree with you. Rafi's singing is nowhere to Kishore's version. Probably this was the beginning of Rafi's decline. I take back my words.
Deleteదేవి శ్రీదేవి అనేటపా టైటిల్ చూసి, నా కోరిక మన్నించి వృద్దనారీమణుల (శ్రీదేవి & మాధురి)విశేష నృత్యం పైన వెంటనే సరదాగా టపా రాశారానుకొన్నాను, కాని టపా చూసి చాలా నిరుత్సాహానికి గురయ్యాను. రాను రాను మీరు మర్యాదస్తుల లిస్టు నుంచి అతి మర్యాదస్తుల లిస్ట్ లో కి జారిపోయారు :)
ReplyDelete