"ముళ్ళపూడి వెంకట్రవణ భలే రాస్తాడు గదా!"
"అలాగా! ఆయన రాసినవాటిల్లో నీకు బాగా నచ్చిందేమిటి?"
"శ్రీరామరాజ్యం"
"ఇంకా?"
"అది కాకుండా ఆయనింకేమన్నా రాశాడా?"
"ఇద్దరమ్మాయిలు - ముగ్గురబ్బాయిలు, జనతా ఎక్స్ ప్రెస్, ఋణానందలహరి, రాజకీయ భేతాళ... "
"అలాగా! అయితే అవన్నీ కూడా భలే రాసుంటాడు."
ఇక్కడ ముళ్ళపూడి అభిమానం తప్ప విషయం లేదని అర్ధమైపోయింది.
"hmtv లో వందేళ్ళ తెలుగుకథ ప్రోగ్రాం చూడు. బాగుంది."
(ఈ విషయంపై ఇంతకుముందొక పోస్ట్ రాశాను.)
"నీకు నచ్చిందా?"
"ఎందుకు నచ్చదు? గొల్లపూడి కథల గూర్చి చెబుతున్నాడుగా!"
"తెలుగులో నీకు నచ్చిన రచయితల పేరు చెప్పు."
"పరుచూరి బ్రదర్స్."
ఇంకానయం! చందనా బ్రదర్స్ అన్లేదు.
"విశ్వనాథ సత్యనారాయణ 'వేయి పడగలు' చదువు. బాగుంటుంది."
"నాకైతే ప్రస్తుతానికి ఒక్క పడగ కూడా చదివే ఓపిక లేదు. ఎందుకు చదవాలో నువ్వు చెప్పు.. చదవడానికి ప్రయత్నిస్తాను."
"భలే బాగుంది. ఎందుకు చదవాలో నాకేం తెలుసు? ఊరికే చెప్పాను. నీకు తెలుసుగా.. నేను చాలా బిజీ."
"మరెందుకు చెప్పావ్?"
"వదిలెయ్యి బాసూ! వేయిపడగలు బాగుంటుందని మొన్నెవడో అన్నాడు. నీకా ఫీల్డులో ఇంటరెస్ట్ ఉందని.. ఆ విషయం నీ చెవిలో ఊదా."
పాపం! నేనన్ని ప్రశ్నలడుగుతానని ఊహించలేదు. ఏదో గొప్ప కోసం చెప్పాడు. అతగాడు బిజీట.. అక్కడికి నేనేదో పనీపాట లేకుండా ఉన్నట్లు!
"ఛస్తే తెలంగాణా రాదు."
"ఎలా?"
"అశోక్బాబు తెలంగాణా రాకుండా అడ్డుకుంటాడు."
"రాష్ట్రవిభజన అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం. విభజన విషయంలో ప్రధాన ప్రతిపక్షం కూడా పట్టుదలగా ఉంది. కేంద్రస్థాయిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని రివర్స్ చేసుకుంటే గాని రాష్ట్ర విభజన ఆగిపోయే అవకాశం లేదు."
"నీకు తెలీదులే. మధ్యలో కొన్ని చోట్ల బ్రేకులెయ్యొచ్చు."
"అప్పుడు విభజన కొద్దిగా ఆలస్యం అవుతుంది గానీ.. ఆగిపోదు కదా!"
"చూస్తూ ఉండు. మనకి స్టార్ batsman కిరణ్బాబు ఉన్నాడు."
"నే రాజకీయాలు మాట్లాడుతుంటే నువ్వు క్రికెట్ మాట్లాడతావేం?"
"పిచ్చివాడా! ఈ రోజుల్లో రాజకీయాలే క్రికెట్, క్రికెట్టే రాజకీయం."
అతనికి కొందరు వ్యక్తుల పట్ల గుడ్డినమ్మకమే గానీ, రాజకీయంగా పెద్ద జ్ఞానం లేదని అర్ధమైంది. తెలుగు వార్తల్ని మాత్రమే ఫాలో అయ్యేవారి జ్ఞానం ఇలాగే ఉంటుంది.
"నరేంద్ర మోడియే కాబోయే ప్రధానమంత్రి. బుద్ధున్నవాడెవడైనా మోడీకే ఓటేస్తాడు."
"మంచిది. అలాగే వేసేద్దాం. మరి 2002 మారణకాండ గూర్చి ఆలోచించావా?"
"అదంతా కాంగ్రెస్ దుష్ప్రచారం."
"మరి ముస్లిముల్ని దారుణంగా చంపేసింది ఎవరు?"
"ఎవరో? నాకేం తెలుసు? నరేంద్ర మోడీ మాత్రం కాదు."
"అంటే ఆనాడు ముస్లిములందరూ సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారంటావా?"
"అవన్నీ నాకు తెలీదు. నరేంద్ర మోడీ మాత్రం మహాత్ముడు."
మోడీకి అనుకూలంగా చాలా విషయంతో వాదిస్తాడనుకున్నాను. కానీ అతనికి మోడీ గూర్చి పెద్దగా తెలీదు!
పరిచయస్తులతో మాట్లడేప్పుడు ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. చాలామందికి చాలా విషయాలపై గట్టి అభిప్రాయాలుంటాయి. అయితే వారికెందుకా అభిప్రాయం ఏర్పడిందో వారిక్కూడా తెలీదు!
సాధారణంగా ఒక విషయం పట్ల అభిప్రాయం కలిగినవారు రెండు కేటగిరీలుగా ఉంటారు.
కేటగిరీ 1. వీళ్ళు ఒక విషయం పట్ల కొద్దోగొప్పో అధ్యయనం చేస్తారు. కొంత అవగాహన ఏర్పరచుకుంటారు. ఆపై విషయాన్ని విశ్లేషిస్తూ సమర్ధిస్తారు లేదా వ్యతిరేకిస్తారు. వీరితో చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని కొత్త సంగతులు తెలుస్తాయి కాబట్టి.. మన జ్ఞానం, అజ్ఞానం కూడా ఏ స్థాయిలో ఉన్నాయో బేరీజు వేసుకోవచ్చు.. మార్పుచేర్పులు చేసుకోవచ్చు.
కేటగిరీ 2. వీళ్ళు ఏ విషయాన్నీ తెలుసుకోటానికి ఆసక్తి చూపరు. కనీసస్థాయిలో కూడా విషయం పట్ల అవగాహన ఉండదు. కానీ రాకెట్ సైన్స్ దగ్గర్నుండి రిజర్వ్ బేంక్ వ్యవహారాల దాకా అనర్గళంగా మాట్లాడతారు. ఒక్కోసారి తీవ్రంగా ఆవేశపడుతుంటారు. చాలాసార్లు వీళ్ళ అభిప్రాయాలు అరువు తెచ్చుకున్నవి.
మనం మొదటి కేటగిరీలో లేకపోయినా పర్లేదు.. కానీ రెండో కేటగిరీలోమాత్రం వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా ఉండగలిగే స్పృహ డెవలప్ చేసుకోవాలి. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈమాత్రం అవగాహన కలిగుంటే చాలాసార్లు మర్యాదగా బయటపడొచ్చు.
"ఈ పాడు కాంగ్రెస్ విధానాల వల్ల ద్రవ్యోల్పణం పెరిగిపోతుందోయ్. ఏవంటావ్?"
"నాకు ద్రవ్యోల్పణం అంటే తెలీదు గానీ.. నాదగ్గర మాత్రం ద్రవ్యం ఎప్పుడూ అల్పంగానే ఉంటుంది."
"టెన్త్ లో చదువుకున్నావుగా! గుర్తు లేదూ?"
"నాకు నిన్న చదివినవే గుర్తుండవు. అదేదో నువ్వే చెప్పి నా అజ్ఞానాన్ని పారద్రోలరాదా?"
"నాయనా! నీకు ద్రవ్యోల్పణం గూర్చి తెలీకపోతే దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. ఈ వయోజన విద్యా కార్యక్రమం నా వల్ల కాదు."
ఏవిటో ఈ లోకం! విషయం తెలీదని నిజాయితీగా ఒప్పుకున్నా హర్షించదు గదా!
"పొద్దున్నే చిన్నుల్లిపాయ టీ తాగితే బీపీ, షుగర్లు రావని రాస్తున్నారు తెలుసా?"
"నాకు తెలీదు. నేను పొద్దున్నే ఇడ్లీలు, దోసెలు తింటాను. పగలు కాఫీ, రాత్రి సింగిల్ మాల్టు తాగుతాను. ఖాళీసమయంలో బ్లాగులు రాస్తాను. ఇవి చేస్తే ఛస్తారని ఎక్కడైనా రాస్తే చెప్పు. ఆలోచిస్తాను."
"లేదులేదు. ఇకనుండి నువ్వు కూడా చిన్నుల్లిపాయ టీ తాగు."
"చెప్పాను కదా. నాకు తాజ్ మహల్ టీ తెలుసు.. తాగుతాను. చిన్నుల్లి టీ తెలీదు.. తాగను."
ప్రతి వ్యక్తికి అన్నీ తెలిసుండాలని లేదు. ఏదీ కూడా తెలుసుకోకుండానే హాయిగా బ్రతికెయ్యొచ్చు. అసలేదీ తెలుసుకోకుండా నోరు మూసుకుని బ్రతికేసేవాడే ఉత్తముడని నా అభిప్రాయం.
(picture courtesy : Google)