Tuesday, 16 December 2014

సావిత్రితో ఓ పాట


"శిష్యా! ఏవిఁటోయ్ లాప్‌టాప్‌నలా తినేసేలా చూస్తున్నావ్?"

"గురుగారు! యూట్యూబులో సావిత్రి పాటని చూస్తున్నాను - మైమరచిపోతున్నానండి."

"ఆహా అలాగా! ఏవిఁటో ఆ పాట?"

"సంతానం సినిమాలో 'చల్లని వెన్నెలలో'  అంటూ ఓ పాటుందండి! పాటలో సావిత్రి అందం గూర్చి ఏమని చెప్పను? చచ్చేంత అందంగా వుంది గురుగారు! సావిత్రినే చూస్తూ ఆనందంగా, హాయిగా పాడుతూ.. ఆహాహా! నాగేస్వర్రావు ఎంతదృష్టవంతుడు! అసూయగా వుందండి!"

"ఒహో అదా నీ సమస్య? నీ అసూయ తగ్గే మార్గం చెబుతా శిష్యా!"

"చెప్పండి గురుగారు."

"ఇంట్లో మంచం వుందా?"

"వుంది."

"దుప్పటుందా?"

"వుంది."

"ఒక పన్జెయ్! మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకుని సావిత్రినే తలచుకుంటూ - ఆ పాట నువ్వే పాడుతున్నట్లు, సావిత్రి ప్రేమగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లు ఊహించుకో!"

"కానీ.. "

"ఊఁ! అడుగు, మొహమాటమెందుకు?"

"నాకు పాడ్డం రాదు గురుగారు!"

"నాగేస్సర్రావుకి మాత్రం పాడ్డం వచ్చా శిష్యా? ఘంటసాల స్టోన్‌ని అరువు తెచ్చుకోలేదూ?"

"అవును కదా!"

"లే మరి! ఇంక నీదే ఆలీసెం. దుప్పటి తన్ని కళ్ళు ఘాట్టిగా మూసుకుని - 'సావిత్రి రా! సావిత్రి రా!' అంటూ రిపీటెడ్‌గా పిలువు! దెబ్బకి సావిత్రి దిగొస్తుంది!"

"కానీ గురుగారు.. "

"మళ్ళీ డౌటా శిష్యా! సర్లే - అడుగు."

"నాకు పియానో వాయించడం కూడా రాదు గురుగారు!"

"ఓరి దరిద్రుడా! నీకు సావిత్రితో డ్యూయెట్ పాడుకునే మార్గం చెబుతుంటే దిక్కుమాలిన డౌట్లతో సమయం వృధా చేస్తావేం! ఇంక నిన్ను బాగు చెయ్యడం నావల్ల కాదు. ఎందులోనన్నా దూకి చావు, పీడా విరగడౌతుంది, నే వెళ్తున్నా!"

"గురుగారు! గురుగారు!!.... "

(picture courtesy : Google)

2 comments:

  1. *సావిత్రి అందం గూర్చి ఏమని చెప్పను?

    హతవిధీ! ఎమి రాస్తున్నారు? మీరేకాలంలో ఉన్నారు? సావిత్రి ఎప్పటిది? ఆమే తరువాత సినిమా మార్కెట్ లో కాంచన,రేఖ, శ్రీదేవి,జయప్రద, ఐశ్వర్యా రాయ్, శ్రియా,త్రిష, ఇలియానా ఇలా ఎంతో మంది నటిమణులు వచ్చారు. వారిని మీరు చూశారా? వారితో పోలిస్తే సావిత్రి అందగత్తె అని ఎలా చెప్పగలరు?

    రమణ గారు మీ మైండ్ సేట్ ఎమి మారటం లేదు. సమాజం మారలని సమ సమాజం రావాలని కోరుకొనే మీలాంటివారు కనీసం హీరొ యిన్ ల విషయంలో కూడా అభిప్రాయాలు మార్చుకోవటంలేదు. మీరేమో మారరు మమ్మల్ని సంఘ్ పరివార్ వాళ్లు మాత్రం మీరు చెప్పిన అభ్యుదయం మాటలు విని మారాలంటారు? ఇదెక్కడి న్యాయం? ఆమేది సాగర సంగంలో జయప్రద తో పోల్చదగ్గ అందమా? అంటే ఇంతక్రితం గాభరా పడ్డారు. పోని ఈ పాటలో రేఖ అందంగా లేదా? :)
    https://www.youtube.com/watch?v=NbqCWwlNKrA

    ReplyDelete
  2. UG SriRam గారూ,
    ఫస్ట్ లవ్ తరువాత ఎవరూ అంత అందంగా కనిపించరండీ....... :-)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.