Saturday 20 December 2014

టీవీ యాంకరుడు


"బావా! బావోయ్!"

"వూఁ!"

"నాకో తెలుగు టీవీలో యాంకరుద్యోగం వొచ్చింది బావా!"

"నువ్వా! టీవీ యాంకరా! ఉద్యోగవిఁచ్చిన గాడిదెవరు?"

"గాడిద కాదు బావా - మనిషే! తుళ్ళూర్లో పదెకరాల పొలం - రోడ్డు పక్కనే అద్దిరిపొయ్యే బిట్టు -  ఒక ఐదరాబాద్ పార్టీకి ఇప్పించాలే! పార్టీ ఫుల్లు హేపీసు! ఆ పార్టీకి ఐదరాబాదులో ఏదో టీవీ చానెలుందంట! నాకందులో యాంకరుద్యోగం ఇచ్చేసారు."

"వార్నీ! బ్రోకరేజితో పాటు ఉద్యోగం కూడా కొట్టేశావన్న మాట. గుడ్!"

"సర్లేగానీ బావా! ఇంతకీ టీవీ యాంకరంటే ఏంజెయ్యాలి?"

"రోజూ టీవీలో ఏదోక విషయం మీద చర్చలొస్తుంటయ్ కదా! వాటిని మోడరేట్ చెయ్యడాన్నే ఏంకరింగ్ అంటారు."

"అటూ ఇటూ మనుషుల్ని కూర్చోబెట్టుకుని కొచ్చిన్లు అడుగుతారు! యాంకర్లంటే ఆళ్ళేనా?"

"అవును."

"కానీ నాకు కొచ్చిన్లు అడగడం రాదే! ఏదైనా సలా ఇవ్వు బావా!"

"దాన్దేవుఁంది! 'దేవుడున్నాడా? లేడా? భగవద్గీత పవిత్ర గ్రంధమా? కాదా? అమ్మాయిలు లంగా వోణీలే వేసుకోవాలా? ఇవ్వాళ తెలుగు సినిమాల్లో నంబర్ వన్ హీరో ఎవరు?' అంటూ వివాదాస్పద విషయాల్ని చర్చకి పెట్టు. అవుననేవాళ్ళని, కాదనేవాళ్ళనీ చెరిసమంగా పిలువ్. వాళ్ళు అరుచుకుంటూ వుంటారు - నువ్వు వింటూ వుండు, చాలు."

"అంతేనా! సర్లే - అట్లాగే ఓ మంచి దమ్మున్న ప్రోగ్రాం కూడా చెప్పు బావా!"

"దమ్ము కోసం ఏకంగా ఒక చానెలే వుంది, ఇంక నువ్వు కొత్తగా చేసేదేముందిలేగానీ - ఒక పన్జెయ్! ఊళ్ళల్లో మొగుడూ పెళ్ళాల తగాదాలు, వివాహేతర సంబంధాలు వున్న కుటుంబాల్ని వెతుక్కో - వాళ్ళని లైవ్‌లోకి తీసుకో! వాళ్ళింక గంటల కొద్దీ తిట్టుకు ఛస్తారు, నీ అదృష్టం బాగుంటే కొట్టుకు ఛస్తారు కూడా!"

"అంతా బాగానే చెబ్తున్నావ్ గానీ - నీకు తెలుసుగా బావా? నాకు రాజకీయాలు తెలీదు, ఏం చెయ్యాలంటావ్?"

"ఏముంది! అధికార, ప్రతిపక్ష పార్టీలవాళ్ళని పిల్చి స్టూడియోలో కూర్చోబెట్టుకో. ఆ పిల్చేదేదో పాయింటు లేకుండా పెద్దగా అరుస్తూ పోట్లాడేవాళ్ళనే పిలువ్ - అప్పుడే నువ్వు సేఫ్! ఆ రోజు తెలుగు దినపత్రికల్లో వార్తలు ఒకటొకటిగా చదువు! ఇంక వాళ్ళే ప్రోగ్రాంని నడిపిస్తారు. మధ్యలో వేడి తగ్గినప్పుడు కూసింత మంట రాజెయ్యి - చాలు."

"ఓస్! యాంకరింగంటే ఇంతేనా! వుంటా బావా! అక్కనడిగానని చెప్పు."

(photo courtesy : Google)

6 comments:

  1. You are a shrewd fellow!. What you wanted to talk about is చర్చ/ప్ర.జ./రచ్చ blogs. What you ended up discussing is TV channels alone. :-)

    ReplyDelete
    Replies
    1. Sree naadh garu,

      I never had any problems with other bloggers. I don't follow blogs regularly, since it is not possible for me to do so. That's it. I am giving this explanation to avoid misunderstanding.

      The inspiration for my post is -

      http://www.newslaundry.com/2014/12/19/peshawar-massacre-how-our-media-made-it-about-india/

      Delete
  2. ఉ. కొందఱు నేర్వగా దలచుకొందురు చర్చలు చేసిచేసి యిం
    కొందఱు నేర్పగా దలచుకొందురు చర్చల నేర్పరింతురిం
    కొందఱు వారి వాదరణకోవిదతం బ్రకటించ వత్తు రిం
    కొందఱు ప్రొద్దుపుచ్చుటకు కూదెద రచ్చట నో భిషగ్వరా

    ఉ. చారువిచారధోరణుల జక్కగ జూపెడు వారి మధ్యలో
    కారణపూర్వకంబు లనగా గల వైరము లెంచి కొందరుం
    కారణహీనవైరగుణగాఢవిషాన్వితమూఢచిత్తులై
    నేరము లెంచి కొందరన నిత్యము నుందురు బ్లాగు చర్చలన్

    శా. ఈ యీ చర్చల దేలి చచ్చునది లేనేలేదు ముమ్మాటికిన్
    మీ యారోగ్యము మీకు ముఖ్యమగుచో మీ కాలమున్ బుధ్ధియున్
    మీ యుద్యోగము మీకు ముఖ్యమగుచో మీ రెన్న డీ చర్చలన్
    డాయంబోవక యున్కి మంచిదని యాడం సాహసింతున్ వెసన్

    ReplyDelete
  3. Guruji Simply Super andi anthe.

    ReplyDelete
  4. గురుజీ! అప్రయోజనమైన నాకామెంట్‌ చెత్తబుట్టలో వేయకండి:)

    //ఊళ్ళల్లో మొగుడూ పెళ్ళాల తగాదాలు, వివాహేతర సంబంధాలు వున్న కుటుంబాల్ని వెతుక్కో - వాళ్ళని లైవ్‌లోకి తీసుకో! వాళ్ళింక గంటల కొద్దీ తిట్టుకు ఛస్తారు, నీ అదృష్టం బాగుంటే కొట్టుకు ఛస్తారు కూడా!"//

    కాప్‌ పంచాయితీలకు( కట్ట పంచాయితీలి లని తమిళులు అంటారు) టీ.వి. వాళ్లకు ఎటువంటి తేడాలున్నవో చెప్పగలరా? తెలిసీ చెప్పక పోకండి. ......:)

    ReplyDelete

  5. ఆయ్ ,

    మా మీడియా వాళ్ళ మీద ఇంతేసి విసుర్లు విసురు తారా ?

    ఉండండి మీ పని బడతా !!

    మరో మాట మీ పాలగుమ్మి వారిని క్రితం రోజు మద్రాసు ఏర్పోర్టు లో కలవడం జరిగింది !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.