"సభకి నమస్కారం. 'పక్కింటావిడ' పుస్తకావిష్కరణ సభకి విచ్చేసిన సాహిత్యాభిమానులకి స్వాగతం. ఇన్నాళ్ళూ తెలుగు సాహిత్యంలో తల్లీ, చెల్లి గూర్చి రాసినవారున్నారు. కానీ - మన రచయితగారు పక్కింటావిడని ప్రధానపాత్రగా చేసుకుని రచన చెయ్యడం గొప్పవిశేషం. ఇలా పక్కింటి స్త్రీ పట్ల స్పందించి సాహిత్యం సృష్టించినవారు మరే భాషలోనూ లేరనీ, ఇది తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం అనీ.. "
"బావా! బావోఁయ్! ఈడేం జరుగుతుంది"
"ష్! బయట తాటికాయంత అక్షరాల్తో బేనర్ రాసుంది - చూళ్ళేదా? ఇది పుస్తకావిష్కరణ సభ."
"పుస్తకావిష్కరణా! అంటే?"
"రచయితలు పుస్తకాలు రాస్తారు."
"ఆఁ! రాస్తే?"
"ఆ పుస్తకం మార్కెట్లోకి వదిలేముందు పుస్తకావిష్కరణ చేస్తారు."
"అర్ధం కాలా!"
"సినిమా పబ్లిసిటీ కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తారే? ఇదీ అట్లాంటిదే!"
"అర్ధమయ్యేట్టు చెప్పు బావా!"
"సరే! నువ్వో పుస్తకం రాశావనుకో! ఆ పుస్తకం రాసినందుకు నీకో మీటింగు పెట్టి అభినందిస్తారు. ఖర్చులు నీవే!"
"అబినందనా! అంటే?"
"అంటే - రచయితకి కావలసినవాళ్ళు, రచయిత కావాలసినవాళ్ళూ - అందరూ ఒకచోట కూడి ఆ రాసినాయన గూర్చి మైకులో తలా నాలుగు మంచి ముక్కలు చెబుతారు."
"ఎందుకు?"
"ఎందుకేమిటి!?"
"మంచో చెడ్డో - ఆ ముక్కలేదో పుస్తకం చదివినోడు జెప్పాలి గానీ - మధ్యలో ఈళ్ళందుకు చెప్పడం?"
"ఎందుకంటే - రేపు నీలాటి ముక్కుసూటిగాడు పుస్తకం పరమ చెత్తగా వుందని - వున్నది వున్నట్లుగా చెప్పొచ్చుగా! ఆ ప్రమాదం లేకుండా వీళ్ళు ముందుగానే మంచిగా మాట్లాడేసుకుంటారు."
"అదేంటి!"
"అదంతే!"
"బావా! ఇప్పుణ్ణాకు అర్ధమైంది. తెలుగు రచైతలు ఆళ్ళల్లోఆళ్ళు స్నేహితులు. ఆళ్ళే పుస్తకాలు రాసుకుని - ఆళ్ళే మీటింగులెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటా వుంటారు. ఇదోరకంగా ఒకళ్ళనొకళ్ళు వీపు గోక్కడం లాంటిది!"
"ష్! నెమ్మదిగా మాట్లాడు. నీకు బుర్ర లేదు బామ్మర్దీ! పుస్తకావిష్కరణ సభలు గొప్ప సాహిత్యసేవ చేస్తున్నాయి. పవిత్రమైన ఈ పుస్తకావిష్కరణ సభల గూర్చి ఘోరంగా మాట్లాడకు!"
"సర్లే బావా! అయినా మోటోణ్ని! నాకిసుమంటి పెద్దిషయాలు ఎందుగ్గానీ - నువ్వు మీటింగు ఇనుకో బావా! నేబోతా!"
"నీదే ఆలస్యం!"
ఉపన్యాసాలు ఇంకా కొన'సాగుతూ'నే వున్నయ్ -
"ఈ రచయిత తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం. 'పక్కింటావిడ' వంద నోబెల్ పైజులకి అర్హమైన గొప్ప రచన అని నా ప్రగాఢ విశ్వాసం. రచయితగారు నాకు బాగా తెలుసు. ఆయన ఉత్తముడు, నిగర్వి, నిరాడంబరజీవి, నిరంతర సత్యాన్వేషి..... "
(picture courtesy : Google)
ఇదేదో నా బోటి వారి మీద స్వ 'తైరు' లాగుందిగా!
ReplyDeleteవాస్తవానికి అవి ఆత్మప్రశంస, పర ప్రశంసల సభలు. నా అనుభవాలను, నా మేథస్సును నేను జనం ముందుంచుతాను. కాస్త నిన్ను పొగుడుతాను. నాకో శాలువా, నీకో ప్రశంస. అది రాజకీయ పుస్తకమైతే, కాస్త నా నాయకుడి ప్రశంస, వాడి ప్రత్యర్థిపై నిందలు. ఇదీ పుస్తకావిష్కరణల నిర్వహణ నైజం.
ReplyDeleteమీ బామ్మర్ది చెప్పినట్లు ఇదేదో బతకనేర్చిన వారి గొడవ మనకెందుకు లెద్దురు.
ReplyDeleteఈ పోస్టుకి చిన్న వివరణ -
ReplyDeleteఈ పోస్ట్ bad taste తో రాశానని భావిస్తూ - కొందరు మిత్రులు నొచ్చుకున్నట్లు అర్ధమవుతుంది. అందుకు నేను విచారిస్తున్నాను.
ఒకరైతే - నేను కథలు రాయలేను కాబట్టి, రాసేవాళ్ళ పట్ల ఈర్ష్యతో ఈ పోస్ట్ రాశానని అన్నారు.
నాకు తెలుగు రచయితల పట్ల గౌరవం తప్ప మరేదీ లేదని మనవి చేసుకుంటున్నాను.
@ఈ పోస్ట్ bad taste తో రాశానని భావిస్తూ - కొందరు మిత్రులు నొచ్చుకున్నట్లు అర్ధమవుతుంది.
ReplyDeleteఇవ్వాళా రేపు గుంటూరులో ఒకటిరెండు పుస్తకావిష్కరణలు ఉండగా మీరిలా వ్రాస్తే మరి బాడ్ టేస్ట్ వ్రాసినట్లనిపించడం లో అనుమానం లేదు. కాని ఇవ్వాళ ,రేపు జరిగే పుస్తకావిష్కరణ సభలు నాకు నచ్చిన వారివి కాకపొతే మీ పోస్టు కి వంద లైకులు . కాబట్టి అందరి పరిస్థితి అదే అయ్యుండొచ్చు :)
సీరియస్ గా చూస్తె పుస్తకావిష్కరణ సభ లు మీరు చెప్పినట్లుగా కాక అర్ధవంతం గా, నిజానికి సాహిత్యానికి ప్రయోజనం గా ఉండాలి. అంటే అక్కడ రచయిత ల గురించి తక్కువ, సాహిత్యం గురించి ముఖ్యంగా మాట్లాడితే వెల్లొచ్చు.
నా వివరణకి ఇంకో కారణం కూడా వుంది -
Deleteరాసేవాళ్ళు రాస్తున్నారు, చదివేవాళ్ళు చదువుతున్నారు. మధ్యలో నాకెందుకు? పూర్తిగా అనవసరం కదా?
ఎంత 'పని లేక.. ' పోతే మాత్రం - అనవసర విషయాల్లో వేలు పెట్టనేల?
ReplyDelete>>> రచయితలు పుస్తకాలు రాస్తారు."
ఆయ్, మరి రచయిత్రులు ఏమి రాస్తారు ?
తీవ్రం గా ఖండిస్తున్నా !!
జిలేబి
యర్రంసెట్టి సాయిగారు తన సాహిత్యహింసావలోకనం నవలలో, డబ్బా మూడు రకాలు - సొంత డబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా అని ఒక్ పాత్ర చేత అనిపిస్తారు. ఈ పుస్తకావిష్కరణలూ, ఆడియోరిలీజులూ అవీ హెచ్చుగా పరస్పరడబ్బాలని రమణగారు అభిప్రాయపడుతూ ఉండవచ్చును. పొనీయండి, లోకో భిన్న రుచిః. ఇవి నచ్చేవాళ్ళకు నచ్చుతాయి - మనం అభ్యంతరం చెప్పితే ఆగుతాయా యేమిటి.
ReplyDeleteటేలెంట్ ఉన్న సుబ్బుని తొక్కేసి, మీ బామ్మర్దిని పైకి తీసుకువద్దామనుకుంటున్న మీ బంధుప్రీతిని ఖండిస్తున్నాను.
ReplyDeletebonagiri గారు,
Deleteమా బామ్మర్దిని ప్రమోట్ చేస్తున్న వైనం కనిపెట్టేశారే! :)
ఇకమీదట అతన్ని పక్కన పెట్టేస్తాలేండి.
ఈ సభలపై మరో టేకు: ఆడంబర ఉత్సవాలు (కళాగౌతమి పత్రిక, డిసెంబరు 2014 సంచిక, 16వ పేజీ).
ReplyDeleteపక్కింటావిడ గురించి పుస్తకం రాస్తే ఆవిడ ఇంటాయన ఊరుకుంటాడా?
ReplyDeleteHilarious :)
ReplyDeleteపక్కింటావిడ పుస్తకం సక్సెస్ అయితే దానికి సీక్వెల్ "ఏదురింటాయన" అని మొదలెడతారేమో!
ReplyDeleteఅలా వాళ్ళిద్దరికీ లింకు పెడతారేమితండీ టండీ బాబూ! పక్కింటాయన & ఎదురింటావిడ ఇద్దరూ సదరు రచయిత వీపు విమానం మోగించడం ఖాయం :)
Delete