ఉదయం ఆరుగంటలు. హోం థియేటర్‌లో ఏవో శబ్దాలు. వెళ్ళి చూద్దును గదా - బుడుగు ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు.
"పొద్దున్నే ఈ గోలేవిఁటోయ్?" విసుక్కున్నాను.
"ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మేచ్ నాన్నా!" అన్నాడు బుడుగు.
'మేచి లేదు గీచి లేదు, టీవీ కట్టేసి చదూకో!' అని అందామనుకున్నాను. కానీ - అన్లేకపొయ్యాను.
ఒకప్పుడు నేనూ ఈ ఆస్ట్రేలియా మ్యాచ్‌ల కోసం పొద్దున్నే లేచినవాణ్నే! చానెల్ నైన్ కవరేజ్, రిచీ బెనాడ్ కామెంటరీ ఎంజాయ్ చేసినవాణ్నే! కాబట్టి క్రికెట్ మేచ్ చూడొద్దనే నైతిక హక్కు నాకు లేదు.
ఒకానొకప్పుడు నేను క్రికెట్ మ్యాచ్‌ల్ని బాగా ఫాలో అయ్యేవాణ్ని. రిచర్డ్స్, గ్రెగ్ చాపెల్, కపిల్ దేవ్, హోల్డింగ్, బోథం, ఇమ్రాన్ ఖాన్, లిల్లీ, చంద్రశేఖర్.. ఇలా నా అభిమాన క్రికెటర్ల లిస్టు పెద్దదే.
మా బ్రాడీపేట గ్యాంగ్‌లో విపరీతమైన చర్చలు నడిచేవి. ఏండీ రాబర్ట్స్, మైఖేల్ హోల్డింగ్‌లలో ఎవరు గొప్ప పేసర్? ప్రసన్న, అండర్‌వుడ్‌లలో ఎవరు మంచి ఆఫ్ స్పిన్నర్? చాలా సూక్ష్మంగా క్రికెట్ ఆటని చర్చించే నాకు - కొన్నాళ్ళకి క్రికెట్ ఆట మీదే ఆసక్తి పోయింది.
అందుకు కారకుడు గవాస్కర్! గవాస్కర్ ఏనాడూ టీం కోసం ఆడిన పాపాన పోలేదు. అతని దృష్టంతా స్కోర్‌బోర్డ్ మీదే! ఓవర్‌కి ఒక రన్, పది ఓవర్లకి ఒక ఫోర్! పోనీ ఔటయ్యావాడా అంటే అదీ వుండదు. ఓపెంగ్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి, సాయంకాలానికి ఆఫ్ సెంచరీ పూర్తి చేస్తే గొప్ప!
1975 ప్రపంచ కప్‌లో 174 బంతులు ఆడి వీరోచితంగా 36 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలిపొయ్యాడు గవాస్కర్. ఈ రికార్డ్ ఇప్పటిదాకా అలాగే వుండిపోయింది! ఆ మేచ్ రేడియో కామెంటరీ విన్న దౌర్భాగ్యుల్లో నేనూ వొకణ్ని!
పళ్ళ బిగువున గవాస్కర్ ఆగడాలని భరిస్తుంటే - కెప్టెన్‌గా రాజకీయం చేసి తన శిష్యుడైన రవిశాస్త్రి అనే వొక సాటి బొంబాయివాణ్ని టీంలోకి తెచ్చాడు. ఈ శిష్యుడు గురువుని మించినవాడు, గురువే నయమనిపించాడు!
గవాస్కర్, రవిశాస్త్రిల ఆటని చూస్తూంటే మలబద్దకంతో బాధ పడుతున్నట్లుగా అనిపించేది, రోడ్డున పొయ్యేవాణ్ని పిల్చి తన్నాలనిపించేది, జీవితం మీద విరక్తి కలిగి ఎందులోనన్నా దూకి చద్దామనిపించేది. ఏ ఆటైనా ఇష్టంగా చూస్తాం గానీ - ఏడుస్తూ చూళ్ళేం కదా! అంచేత - బోడి క్రికెట్ ఆటని చూస్తూ ఇన్నేసి సమస్యలు కొని తెచ్చుకోటం దేనికని - క్రికెట్ చూడ్డమే మానేశాను.
మిత్రులారా! క్రికెట్ అంటేనే రోత పుట్టించినందుకు ఆనాడు గవాస్కర్‌ని తిట్టుకున్నాను గానీ, ఇప్పుడు చెబుతున్నాను - గవాస్కర్ నాకు మంచే చేశాడు, లేకపోతే ఇప్పటికీ క్రికెట్‌ని చూస్తూ బోల్డెంత సమయం వృధా చేసుకునేవాణ్ని. జీవితంలో ఒక్కోసారి కొందర్ని శత్రువులనుకుంటాం గానీ - కాదు! అసలైన శ్రేయోభిలాషులు వాళ్ళే!
అంచేత - 'థాంక్యూ గవాస్కర్!'
(photo courtesy : Google)
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గవాస్కర్ 36 పరుగుల ఇన్నింగ్స్ గొప్ప జోక్. ఆస్ట్రేలియాలో మ్యాచులు జరుగుతుంటే తెల్లవారుఝామునే లేచి వినడం, ఇంగ్లాండ్ లో జరిగే మ్యాచులు మధ్యాహ్నం నుంచీ రాత్రి 10.30 వరకూ వినడం లాంటి వెర్రి అభిమానపు రోజులవి. ఒకప్పుడు క్రికెట్ని అంత అభిమానించిన నేను క్రికెట్ చూడటం, ఫాలో అవడం మానేసి చాలా కాలమయింది.
ReplyDeleteAlan McGilvray of ABC, John Arlott of BBC ల కామెంటరీ నాకు బాగా గుర్తుంది. మా గుంటూరుకి ABC / BBC తెరలుతెరలుగా తుఫానులో వింటున్నట్లుగా వినబడేవి. సినిమాల్లాగే - క్రికెట్ కూడా జీవితంలో ఒక దశ అనుకుంటాను.
Deleteగవాస్కర్ తన మొదటి సీరీస్‍లో మొట్టమొదటి టెస్ట్ వేలికి ఇన్‍ఫెక్హన్ కారణంగా ఆడలేకపోయినా మిగిలిన నాలుగు టెస్టుల్లోనూ 774 పరుగులు చేసాడు. చేతకానివాడు అలా ఆడలేడు కదా. ఆ తరువాత ఇంగ్లండులో ఆడిన 3 టెస్టులసీరీస్‍లో అశోక్ మన్కడ్ అనే సీనియర్ ఓపెనర్ గారిని రక్షించటమే గవాస్కర్‍కు గగనం ఐపోయింది - మన్క్డడ్ పదిపరుగులైనా చేసాడా అన్నది నాకు గుర్తులేదు.అప్పటినుండి టీముకు గవాస్కర్ పెద్దదిక్కైపోవలసి వచ్చింది కావటానికి అందరిలో జూనియర్ ఐనాసరే. గవాస్కర్ నిష్క్రమించాక మనవాళ్ళు మరొక సున్నపరుగులో పదిపరుగులో చచ్చిచెడి చేసి ఆలౌట్ అనిపించుకొనేవారు. ఒక్కోసారి గవాస్కర్ బూట్లు విప్పుకునేలోగానే మిగతావాళ్ళు ఔటయి వచ్చేవారని ఒక నానుడి. అలాంటి టీములో ఆడేవాడు ఎంతసమర్థుడైనా రక్షణాత్మకంగా ఆడతాడా లేక జోరుగా ఆడి చక్కాపోతాడా మీరే ఆలోచించి చెప్పండి. మొదటి ఇంగ్లండు టూరులో గవాస్కర్ సిక్సర్లకు కామెంటేటర్ బాక్స్ అద్దాలు పగిలాయని పత్రికలలో వచ్చింది. ఆయన 36 పరుగుల జోక్ గురించి మాట్లాడేవారు మనటీములో మిగతావారు అంతకన్నా గొప్పజోకర్లన్నది మరచిపోతే ఎలా? గెలిచి చచ్చేది లేదని బ్యాంతింగ్ ప్రాక్టీసుగా ఆడుదామన్నది టీమ్ నిర్ణయం అని గవాస్కర్ చెప్పినమాట వదిలేసి కామెంటు చేయటం భావ్యం కాదు. మన బ్యాటింగ్ వీరుల ఆట ఒకటి గుర్తు చేస్తాను. 132/5 దగ్గర ఇంజనీరుకు సోల్కర్ జతకలిసాడు 232/6 దగ్గర భాగస్వామ్యం విడిపోయింది. 236/ఆలౌట్ - అదీ మనవారి ఘనత. అన్నట్లు మీ / మన అభిమాన స్పిన్నర్ చంద్రా 13 ఇన్నింగ్స్ వరుసగా 0 కే ఔటై రికార్డు సృజించిన సంగతి మీకింకా గుర్తుందా? రవిశాస్రి అఖరువాడిగా వ్యాటింగ్ చేయటానికి వచ్చే స్థాయినుండి ఓపెనర్ గానూ అన్ని స్థానాల్లోనూ ఆడాడు. మన టీం చేతకాని తనం వలనే సమర్థులైన వారూ డిఫెన్సు మాత్రమే ఆడుకోవలసిన గొప్పపరిస్థితి మనది. ఇప్పుడు కొంచెం నయం కావచ్చును.
ReplyDeleteశ్యామలీయం గారు,
Deleteగవాస్కర్ గొప్ప క్రికెటరే! కాదన్నదెవరు? గొప్ప క్రికెటర్ అయ్యుండి కూడా గల్లీస్థాయి రాజకీయాలు చేశాడు కాబట్టే నాకు గవాస్కర్ అంటే మంట!
1975 ప్రపంచ కప్ కెప్టెన్సీ వెంకట రాఘవన్‌కి ఇచ్చినందుకు, కావాలనే.. i repeat కావాలనే చెత్తగా ఆడాడు. పెద్ద దొంగ. టీం మేనేజ్‌మెంట్ గవాస్కర్‌ని ప్రాక్టీస్ చేసుకోమందా? అసలు ఆ రోజుల్లో టీం మేనేజ్‌మెంట్ అంటే కొద్దిమంది రిటైరైన ముసలి బొంబాయి ప్లేయర్లే కదా! అందరూ కలిసి మద్రాసి వెంకట్‌ని డమ్మీ చేసిపారేశారు.
జిమ్మీ అమర్‌నాథ్ మంచి ఆటగాడు. జిమ్మీని (ఢిల్లీవాడనే కుళ్ళుతో) టీంలోంచి పీకించేసి - అతని స్థానంలో ఇంగ్లాండ్ టూర్‌కి సాటి బొంబాయి వాడైన (వాస్తవానికి నాయక్‌ది రంజీ స్థాయి) సురూ నాయక్‌ని తీసికెళ్ళాడు. 'ఏంటయ్యా ఇది?' అంటే మాకు బేట్స్‌మన్ అక్కర్లేదు, బౌలర్ కావాలని నాయక్‌ని తీసికెళ్ళాం అంటాడు! నాయక్, రవిశాస్త్రి - ఇలా బొంబాయివాళ్ళని ఒక ఫేక్షనిస్టు లీడర్లాగా ప్రమోట్ చేసుకున్నాడు.
ఈ బొంబాయి మాఫియాని ఎదుర్కొన్న మొదటి వ్యక్తి కపిల్ దేవ్. మొదట్లో కపిల్‌ని ప్రమోట్ చేస్తున్నట్లు పోజ్ కొట్టాడు గానీ, అప్పటికే గవాస్కర్ తడిక రాజకీయాలు అందరికీ తెలిసిపొయ్యాయి. తరవాత కామెంటేటర్‌గా కుదురుకున్నాడు. బోర్డ్ అధ్యక్షుడు ఎవరైనా సరే - మంచి కాకారాయుడు గవాస్కర్. తద్వారా కామెంటేటర్ ఉద్యోగం నిలుపుకుంటూ - బోల్డెంత డబ్బు సంపాదించుకుంటున్నాడు. అక్కడెన్ని రాజకీయాలు చేసి చస్తున్నాడో నాకు తెలీదు - నాకప్పటికే క్రికెట్ మీద ఆసక్తి పోయింది.
గవాస్కర్ రాజనాలకి తక్కువ, ప్రభాకర్రెడ్డికి ఎక్కువ. నా దృష్టిలో గవాస్కర్ అత్యంత దౌర్భాగ్యుడు, నికృష్టుడు, అధముడు.
చాల్రోజుల తరవాత పెద్ద కామెంట్ (పని మానుకుని మరీ) రాశాను. గవాస్కర్ మీద నాకింకా ఇంత కోపం వుందని నాకే తెలీదు! నాకు కోపం తెపించి - పెద్ద కామెంట్ రాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. :)
ఏమో నండీ, నాకు అతడి ఆటగురించి మాత్రమే కొంచెం తెలుసును. రాజకీయాలగురించి మీరు చెబితే వినటమే. ఒకవేళ మీకు అతడిపట్ల ఉన్న ద్వేషభావం వలన మీకు అతడి తప్పులు మాత్రమే హెచ్చుగా కనిపిస్తున్నాయేమో తెలియదు, వెంకట్ మద్రాసీ ఐతే అయ్యాడు కాని నాకుతెలిసి అతడి బౌలింగ్ మరీ చెప్పుకోదగ్గదిగా అనిపించలేదు ఎప్పుడూ. అదంతా అప్రస్తుతం కాబట్టి వివరాలు తడుముకోవలసిన అవసరం లేదు. మీఅభిప్రాయం మీది. కోపం దేనికి? అంత ఆందోళన పడకండి.
Delete>>గవాస్కర్ రాజనాలకి తక్కువ, ప్రభాకర్రెడ్డికి ఎక్కువ. నా దృష్టిలో గవాస్కర్ అత్యంత దౌర్భాగ్యుడు, నికృష్టుడు, అధముడు.
DeleteROFL :D
శ్యామలీయం గారు,
Delete>>మీఅభిప్రాయం మీది. కోపం దేనికి? అంత ఆందోళన పడకండి.<<
హ..హ..హా! ఈ కోపానికి ఒక చరిత్ర వుందండి. :)
చదూకునే రోజుల్లో - స్నేహితుల్లో గవాస్కర్‌కి అనుకూల వ్యతిరేక గ్రూపులుండేవి. తీవ్రమైన చర్చలు చివరాకరికి తిట్టుకునే దాకా పొయ్యేవి. నేను గవాస్కర్ వ్యతిరేక కేంపులేండి.:)
నాకారోజులు జ్ఞాపకం వచ్చాయి. అందుకే 'కోపం' అన్న పదం సరదాగా వాడాను - అంతే! :)
గవాస్కర్ 36 పరుగుల గురించి బీసీసీఐ కి రాతపూర్వకంగా వివరణ ఇచ్చాడు. అప్పటికి వండే క్రికెట్ అనేది ఎగ్జిబిషన్ లాగా చూసేవాళ్ళం అందుకని ఆ మ్యాచ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కు వాడుకున్నాను అని చెప్పాడు. అంతే కాక అప్పట్లో బోర్డు పెద్దలే ఎవరు ఎలా ఆడాలో నిర్ణయించేవాళ్ళని టాక్. ఒకసారి అన్షుమన్ గైక్వాడ్ ని ఎందుకంత స్లో ఆడావ్ అని అడిగితే సెలెక్టర్లు నన్ను అదే చెయ్యమన్నారు అని చెప్పాడు.
ReplyDeleteమైకెల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్, జొయెల్ గార్నర్ లాంటివాళ్ళను హెల్మెట్ లేకుండా, బౌన్సర్ల నియమం లేకుండా ఎదుర్కుని 13 సెంచురీలు చేశాడు. వెస్టిండీస్ వాళ్ళు గవాస్కర్ పేరు మీద ఒక పాట కూడా తయారు చేశారు.
గవాస్కర్ సన్ని డేస్ అని తన ఆత్మకథ రాశాడు. వీలు కుదిరితే చదవండి. ఆసక్తికరంగా ఉంటుంది.
నేను 'సన్నీ డేస్' చదివాను. అన్నీ అబద్దాలే! :)
Deletevery interesting!!
Deleteమీకు వీలు చూసుకుని కొంచెం వివరంగా రాయండి. I'm more than interested to read your opinion sir. ఎందుకంటే మన దేశంలో ఎవరైనా క్రికెట్ నుంచీ రిటైర్ అయితే వెంటనే అతి మంచివాడు అయిపోతాడు. దాని వల్ల ఆ తర్వాత తరాల వాళ్ళకు నిజలు తెలిసే అవకాశం లేదు. గవాస్కర్ గురించి కూడా అంతే, మెయిన్ స్ట్రీం పత్రికలలో ఎక్కడా నెగెటివ్ విషయాలు చదవలేదు. ఎవరో మీలాంటి అప్పటి యాక్టివ్ అభిమానులు చెబితే వినడం తప్ప మరే విధమైన సమాచారం లేదు. :))
*నేను 'సన్నీ డేస్' చదివాను. అన్నీ అబద్దాలే!*
Deleteసార్, సావిత్రి అందంగా ఉంట్టుందని, ఐదు సంవత్సరాల నుంచి మీరు అబద్దాలు రాయటంలేదా! :) మొహం వరకు మాత్రం కనిపించే, మసకమసకగా ఉండే, నలుపు తెలుపు పోటో పెట్టి, అహా ఓహో అని పొగడటాన్ని ఏమంటారు? రేఖ, జయప్రద, శ్రీదేవి, మాధురి, జుహి, ఐశ్వర్య రాయ్ చూడబట్టి సరిపోయింది. లేకపోతే మీరు రాసింది చదివి, నిజమనుకొని మీ మాటలు నమ్మేసే వాళ్లం:)
రోడ్డున పొయ్యేవాణ్ని పిల్చి తన్నాలనిపించేది,.....haaaa haaa heeee heeee ...పడి పడి నవ్వానండి..బాగుంది ...మనకు అపుడప్పుడు ఇలాగె అనిపిస్తుంది ..వాట్ ఏ ట్రూ ఫీలింగ్ ఇట్ వాస్?
ReplyDelete:)
Deleteమీరు గవాస్కర్ ద్వారా అనుభవించిన క్షోభ మేము రవిశాస్త్రి ద్వారా అనుభవించాము. మొదటి ఓవర్ ఐదుబాళ్ళు మేడిన్ చేసి ఆరవ బాల్ కు సింగిల్ తీసి ఆ తర్వాత ఓవర్ మేడిన్ చేసేవాడు. అవతల ఎండు శ్రీకాంత్ పగతో రగిలిపోయేవాడు. ఇలా డ్రామాలాడి శ్రీకాంత్ ను రనౌట్ చేయించి లేదా ఫ్రస్ట్రేషన్ తో అవుట్ చేయించేసి, ఆ తర్వాత పది పదిహేను ఓవర్లాడుకునేవాడు. స్టేడియం లో "హాయ్ హాయ్" అని అరుపులు మొదలవగానే గొప్ప దేశభక్తి ప్రదర్శించి సిక్సు కొట్టేవాడు. ఆ తర్వాత ఓడిపోతుందని నిశ్చయానికి ఒచ్చాక సిక్సు కొట్టబోయి అవుటయేవాడు.
ReplyDeleteనేటి టీవీ సీరియల్స్ కన్నా రవిశాస్త్రి బాటింగ్ పదిరెట్లు నరకం.
రవిశాస్త్రి గురించి ఎందుకండీ గుర్తు చేస్తారు, భారత ప్రజలు రవిశాస్త్రి రిటైర్మెంట్ కోసం ఎదురుచూసినంతగా నైరుతీ రుతుపవనాల కోసం కూడా ఎదురు చూడలేదు. రవిశాస్త్రి గురించి ఎందుకండీ గుర్తు చేస్తారు, భారత ప్రజలు రవిశాస్త్రి రిటైర్మెంట్ కోసం ఎదురుచూసినంతగా నైరుతీ రుతుపవనాల కోసం కూడా ఎదురు చూడలేదు. :D
Delete>>నేటి టీవీ సీరియల్స్ కన్నా రవిశాస్త్రి బాటింగ్ పదిరెట్లు నరకం.
200% correct!
Guruji Maa Gavaskar meeda meeku entha prema undani ippudey telesindi. Meeku Raavi Sastri Istam kabatti pogudutaru, Maa gava istam ledu kabbati tittu chunnaru.
ReplyDeleteRavi Sastry- The guy who set records in " coming front foot and then playing defence"
ReplyDelete