"ఎవరదీ?"
"నేను మావాఁ!"
"వార్నీ! నువ్వా అల్లుడూ! రా రా, ఆ కుర్చీ లాక్కుని కూర్చో!"
"ఎలాగున్నావ్ మావాఁ?"
"బాగానే వున్నానల్లుడూ! వయసయిపోతుందిగా! ఆమధ్య కొద్దిగా దెబ్బ తిన్నాన్లే!"
"తెలుసు, అమ్మ చెప్పింది. అందుకే చూసి పోదావఁనొచ్చా."
"మంచిది."
"అత్త ఇంట్లో లేదా మావాఁ?"
"ఏం చెప్పమంటావల్లుడూ? మీ అత్తకీ మధ్య మూతి పక్షవాతం వచ్చింది. పక్కూళ్ళో రమణయ్యని గొప్ప సిద్ధాంతిగారున్నారు. ఆయనేదన్న పరిష్కారం చెబుతాడేమోనని వెళ్ళింది."
"రోగవొఁస్తే డాక్టర్ దగ్గరకెళ్ళాలిగానీ.. సిద్ధాంతెందుకు మావాఁ!?"
"రోగాలెందుకొస్తాయల్లుడూ? వాస్తుదోషంతోనో, గ్రహబలం బాగోకే కదా? అట్లాంటప్పుడు డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు?"
"రోజులు మారాయి మావాఁ!"
"అదేంటల్లుడూ? రోజులెక్కడ మారాయి? చంద్రబాబు ఇప్పటివాడేగా!"
"మధ్యలో చంద్రబాబేం చేశాడు మావాఁ?"
"చంద్రబాబు మొదట క్రిష్ణాజిల్లాలోనే రాజధాని అన్నాడు కదా! ఇప్పుడు గుంటూరు జిల్లా వైపుకి ఎందుకు మళ్ళాడంటావ్?"
"రాజకీయ కారణాలు..."
"కాదు కాదు! వాస్తు, వాస్తు ఒప్పుకోలేదల్లుడూ!"
"వాస్తు ఒప్పుకోలేదా?!"
"మన తెలుగునాట గొప్ప జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు వున్నారు. వారంతా జన్మ నక్షత్రాన్ని బట్టి జాతకాలు చెబుతుంటారు. వారిలో ఒకాయన చాలా లోతుకెళ్ళి - ఆడవారి రజస్వల సమయం బట్టి వారి మనస్తత్వం నిర్ణయమవుతుందని ఓ గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ పండితులవారే మన చంద్రబాబుకిప్పుడు ముఖ్య సలహాదారుడు."
"అలాగా! నాకు తెలీదు."
"జగనెందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపొయ్యాడంటావ్?"
"జగన్ తండ్రినే నమ్ముకున్నాడు. చంద్రబాబు మోడీనీ, రైతుల ఋణమాఫీ హామీనీ నమ్ముకున్నాడు."
"గాడిదగుడ్డేం కాదు! జగన్ హిందువు కాదు, అందుకే గ్రహాలు మొరాయించాయి."
"గ్రహాలు హిందువులకేనా మావాఁ?"
"ఇట్లాంటి గొప్పవిషయాలు నీలాంటి సామాన్యులకి అర్ధం కావులే అల్లుడూ!"
"మావాఁ! జాతకాల్ని, వాస్తుని నమ్మడం వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి. ఆ నమ్మకాల్ని వారు తమ సొంతపనులప్పుడు పాటిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ - కొన్ని కోట్లమందికి సంబంధించిన రాజధాని విషయంలో ఈ వాదనేంటి మావా?"
"చంద్రబాబు గురువుగారు క్రిష్ణా నదికి గుంటూరు వైపునైతేనే తెలుగువారు సుఖసంతోషాలతో ప్రకాశిస్తారని సెలవిచ్చారు. ఆయన మాట చంద్రబాబుకి వేదవాక్కు. కాదన్డానికి నువ్వెవరు?"
"సర్లే మావాఁ! ఇక నేవెళ్తా. అత్తని అడిగానని చెప్పు."
"అడగడం మర్చేపొయ్యాను. నీ కొడుక్కి డాక్టర్ సీటొచ్చిందా?"
"కష్టపడి చదివాడు. అయినా రాలేదు, ఈసారి లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకుంటాట్ట మావాఁ!"
"వాడికి సీటెలా వస్తుంది? రాదు. కష్టపడి చదివితే సరిపోతుందా? వాస్తు సహకరించొద్దూ?"
"మావాడి చదువుక్కూడా వాస్తు లింకుందా మావాఁ?"
"నాకన్నీ తెలుసులేవోయ్! మీ అత్తెప్పుడో చెప్పింది. నీ ఇంట్లో ఈశాన్యం మీద బరువు పెడుతున్నావంట!"
"ఈశాన్యం మీద బరువా!?"
"అవును, నీ కారు పార్కింగ్ ఇంటికి ఈశాన్యం వైపుందిట. ఇవ్వాళ్టినుండి ఆ పాడు కారు అక్కణ్నించి తీసెయ్! ఈశాన్యం మీద బరువుండకూడదు."
"మరి కారెక్కడ పెట్టుకోను?"
"రోడ్డు మీద పెట్టుకో."
"కారుని రోడ్డు మీద పడేస్తే దొంగలెత్తికెళ్ళరూ!"
"పోతే పొనీ! వెధవ కారు. ఒకటిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, నీకు పిల్లాడి సీటు ముఖ్యమా? కారు ముఖ్యమా? అయినా ఇంకెన్నాళ్ళు? వొచ్చే నెల్లో నాకు మీ ఊళ్ళో కొద్దిగా పనుంది. వచ్చేప్పుడు రవణయ్య సిద్ధాంతిని తీసుకొస్తాను. ఆయన్నీ ఇంటికి చేయించాల్సిన మార్పుచేర్పులు చెబుతారు. ఆ ప్రకారం ఇల్లు బాగుచేసుకో."
"మావాఁ! వెళ్ళొస్తాను."
"మంచిది. నీదే ఆలస్యం, నాకు పూజకి వేళైంది."
(picture courtesy : Google)
మన అందరి జీవితాలపైన వాస్తు,జ్యొతిష్యాల ప్రభావం ఉంటుందన్న మీ అభిప్రాయన్ని, నేను గౌరవిస్తున్నాను.
ReplyDeleteవాస్తు & ఇతర హిందూ (?) సంప్రదాయాలపై వల్లమాలిన ప్రేమ ఉన్నవారు ఎవరూ మిమ్మల్ని తిడుతూ వ్యాఖ్యలు రాయలేదు ఎందుకు చెప్మా? మీ బ్లాగు వాస్తు బాగుంది కాబట్టి బతికిపోయారు!
ReplyDeletePS: ఒక నిర్ణీత స్థలానికి కట్టు పడని అంతర్జాలంలో వాస్తు ఎలా ఉంటుందనే చచ్చు ప్రశ్నకు సమాధానం ఎవరు ఇస్తారో ఏమో?
కాదేది వాస్తుకనర్హము?
Deleteనా బ్లాగుకి ఈశాన్యం బరువుందేమోనని నా అనుమానం! :)
జేసుదాసు చెత్తవాగుడు పోస్ట్ తరవాత కామెంట్ పాలసీ మార్చాను (ఈ పని ముందే చేస్తే బాగుండేది). కాబట్టి నన్ను తిట్టేవాళ్ళ కామెంట్లు మీక్కనిపించవ్!
ఆశ్చర్యకరంగా - నేను పబ్లిష్ చెయ్యనని తెలిసి కూడా నన్ను తిట్టేవాళ్ళ సంఖ్య తగ్గలేదు! మళ్ళీ - అదే ప్రొఫైల్‌తో మెచ్చుకుంటూ కామెంట్లు రాస్తారు - నన్ను టెస్ట్ చెయ్యడానికి! అట్లాంటి ప్రొఫైల్స్‌ని పర్మనెంటుగా చెత్తబుట్టలో పడేశాను, పీడా వదిలింది. ఇప్పుడు హాయిగా వుంది.
ఓహో ఇప్పుడు అర్ధం అయ్యింది. మీ చెత్తబుట్టి వాస్తు బాగుంది కాబట్టి పనికి మాలిన వ్యాఖ్యలు అందులో పడుతున్నాయా!
Delete// "మావాఁ! జాతకాల్ని, వాస్తుని నమ్మడం వ్యక్తిగతం. ఎవరి నమ్మకాలు వారివి. ఆ నమ్మకాల్ని వారు తమ సొంతపనులప్పుడు పాటిస్తే ఎవరూ తప్పు పట్టరు. కానీ - కొన్ని కోట్లమందికి సంబంధించిన రాజధాని విషయంలో ఈ వాదనేంటి మావా?"//
ReplyDeleteఅయ్యో! అయ్యో! మీరు ఏ ఇరవై వకటో శతాబ్దములో ఉన్నారని అనుకొంటున్నారు. ఇది గుప్తుల కాలం. ఇందులో వ్యక్తిగతం పరాయి అంటున్నారు! పరిపాలకుడంటే ఎవరు? రాజు, రాజుకు వాస్తు బాగా లేకపోతే రాజ్యమేల బాగు పడును? రాజ్యం శుభిక్షతముగా ఏలా ఉండును? పాడి పంటలు ఎలా వృద్ది చెందును? హర! హరా! (లేకా శివ !శివ !) ఏమి అశుభం పలికితిరి?
నైఋతి పెరిగినట్టుంది, రాయలసీమా నీదేదారి?
ReplyDeleteమీకు వాస్తు బాగా లేకే మీరు గుంటూర్లో షాపు పెట్టుకుని ప్రాక్టీస్ చేసేదీ, వాళ్ళకి బాగుండి మీ స్నేహితులు అమెరికా పోయిందీనా గురూ గారూ? అహ అసలు మాట వరసకే అడుగుతున్నాన్లెండి.
ReplyDeleteముందుకి వెళ్తున్నామో వెనక్కి పొతున్నామో తెలియడంలేదు. పూర్వం పై అంతస్తు వేస్తే వాస్తు చూడక్కర్లేదు అనేవారు, ఇప్పుడు గది గదికి చివరకి బాత్రూముకి కుడా వాస్తు అని మొదలెట్టారు. క్యాన్సర్ వచ్చి, తగ్గాక, ఇలా వాస్తు బాలేదు అనో, ఆయుర్వేదం, మూలికా సిధ్ధ వైద్యం అని, పనికిమాలిన మందులు అన్నీ తిని కాంప్లికేషన్స్‌తో పోయినవాళ్ళని చాలా మందిని చూస్తున్నాను ఈ మధ్య.
ReplyDeleteఅదేంటో కొన్ని మూఢనమ్మకాలు (ఆవు పాలు పసి పిల్లలకి అమృతం అని, గ్లోబలైజేషన్ అమెరికా దోపిడీ అని (అదేంటో మనతో వర్తకం వలన అమెరికాకి లాసు, మనకే లాభం, చైనాకి మనతో వర్తకం వలన చైనాకి లాభం, మరి అప్పుడు చైనా దోపిడీ అనరు, ఎప్పటికీ అమెరికాదే దోపిడీ), మెజీషియన్సు దేవుళ్ళని) ఎప్పటికీ అలానే ఉంటాయి.
కమ్యూనిష్టూ పార్టీలు, జన విజ్ఞాన/అజ్ఞాన వేదికాలు, వి.ర.సం, అరసం, బాబాలు, భక్తులు అందరు పోటీలు పడి మూఢనమ్మకాలని ముందుకు తీసుకెళ్ళేవారే.