Thursday, 29 March 2012

శాస్త్రిగారి 'పుస్తక వైద్యం'

నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్టుని. రాష్ట్ర సైకియాట్రిస్టుల సంఘానికి అధ్యక్షుడు సతీష్ బాబు నాకు మంచి స్నేహితుడు. ఇవ్వాళ ఉదయాన్నే సతీష్ దగ్గర్నుండి ఫోన్.

"హలో బ్రదర్! తెనాలిలో ఎవరో సైకియాట్రిస్ట్‌నని చెప్పుకుంటూ పేషంట్లని ట్రీట్ చేస్తున్నాట్ట. నాకా వివరాలు కావాలి. నువ్వా సంగతేంటో కనుక్కో."

"చూడు బ్రదర్! మనవాళ్ళ ఫీజుల బాదుణ్ని పేషంట్లు తట్టుకోలేకపోతున్నారు. అంచేత వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, మనకెందుకులేద్దూ." బద్దకంగా అన్నాను.

"డిగ్రీ లేకుండా వైద్యం చెయ్యడం నేరం. అర్జంటుగా తెనాలి వెళ్లి రిపోర్ట్ పంపు." అంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్.

పేషంట్లు అనేక రకాలు. యేది కావాలో, యేది అక్కర్లేదో నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. ఫలానా వైద్యవిధానం కరెక్టా కాదా అని కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇందులోని మంచిచెడ్డలు చెప్పడానికి మనమెవరం? 

నాకు జ్ఞాపకశక్తి తక్కువ, బద్ధకం ఎక్కువ. అంచేత ఈ ఫోన్ విషయం మర్చిపోయాను.

రెండ్రోజుల తరవాత మళ్ళీ సతీష్ బాబు ఫోన్ - "ఆ తెనాలి సంగతి ఎక్కడిదాకా వచ్చింది?"

"ఇంకా మొదలవలేదు." నవ్వుతూ అన్నాను.

"ఎల్లుండి కల్లా పూర్తి చెయ్యి." అన్నాడు సతీష్

"ఇది విన్నపమా? ఆజ్ఞా?" ఎన్టీఆర్ స్టైల్లో అడిగాను.

"విన్నపంగా ఇస్తున్న ఆజ్ఞ!" నవ్వాడు సతీష్.

ఆ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో తెనాలి బయల్దేరక తప్పింది కాదు.

తెనాలికి సంబంధించి యేదో అడ్రస్ చేత బుచ్చుకుని - 'ఫలానా వైద్యం చేసే వ్యక్తి ఎక్కడ?' అంటూ వాకబు చేసుకుంటూ వెళ్ళాను. చివరాకరికి ఒక పుస్తకాల షాపు ముందు తేలా! చచ్చితిని, నా మిషన్ తెనాలి ఒక 'మిషన్ ఇంపాజిబుల్' అయ్యేట్లుంది.

సతీష్‌కి ఫోన్ చేశాను - "నాయనా! నువ్విచ్చిన అడ్రెస్ పుస్తకాల షాపుది." ఎగతాళిగా అన్నాను.

"నా అడ్రెస్ కరక్టే! నీ పని పుస్తకాల షాపులోనే!" అన్నాడు సతీష్.

హతవిధీ! ఇంతజేసి నా పరిశోధన ఒక పుస్తకాల షాపు మీదా!!

అదొక పాత పుస్తకాల షాపు. అంటే పుస్తకాలు పాతవని కాదు. పుస్తకాలు కొత్తవి, షాపు మాత్రం పాతది. అక్కడ రకరకాల సైజుల పుస్తకాలు (సైజుల వారిగా) పేర్చి వున్నాయ్. స్టాకు ఫుల్లుగా ఉంది. కౌంటర్లో ఒక పాతికేళ్ళ కుర్రాడు ఉన్నాడు.

కొంచెం పక్కగా పడక్కుర్చీలో పడుకుని విసనకర్రతో విసురుకుంటున్న అరవయ్యేళ్ళ వృద్ధుడు. తెల్లని, బక్కపల్చటి ఆకారం. మరింత తెల్లని పంచె, లాల్చీ. మెళ్ళో రుద్రాక్షలు, విశాలమైన నుదుటిపై పెద్దబొట్టు. ఈ వృద్ధుని కోసమా నా పన్లు మానుకుని వచ్చింది!

పక్కన తాటికాయంత అక్షరాల్తో ఒక బోర్డ్.

'వైద్యరత్న పుచ్చా విశ్వనాథశాస్త్రి.
మానసిక వ్యాధులకి పుస్తక వైద్యం చెయ్యబడును.
కన్సల్టేషన్ ఉచితం.'

వావ్! దొంగ ఈజీగానే దొరికాశాడే! 

అక్కడ నేననుకున్నంత జనాలు లేరు. ఒక్కొక్కళ్ళుగా వచ్చి వెళుతున్నారు. నా పని గూఢాచారి 116 కాబట్టి ఒక పక్కగా నించొని ఆ వైద్యుడు కాని వైద్యుణ్ణి గమనిస్తున్నాను.

ఒక నడివయసు వ్యక్తి శాస్త్రిగారికి చెబుతున్నాడు - "అయ్యా! నేను బియ్యే చదివాను, బ్యాంక్ ఉద్యోగం. గంటసేపు కూడా నిద్ర పట్టట్లేదు."

శాస్త్రిగారు అర్ధమయినట్లు తల పంకించారు.

"దేవుడంటే నమ్మకం ఉందా?" అని అడిగారు.

"నోనో, నేను పరమ నాస్తికుణ్ణి." గర్వంగా అన్నాడు బ్యాంకు బాబు.

కౌంటర్ దగ్గర నిలబడ్డ కుర్రాణ్ణి చూస్తూ "రావుఁడూ! బుక్ నంబర్ ఫోర్టీన్." అన్నారు శాస్త్రిగారు.

రావుఁడు అని పిలవబడిన కౌంటర్లోని కుర్రాడు చటుక్కున లోపలకెళ్ళాడు, క్షణంలో ఒక దిండు కన్నా పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి శాస్త్రిగారి చేతిలో పెట్టాడు.

"ఈ పుస్తకం పదిరోజుల్లో చదివెయ్యాలి. పగలు చదవకూడదు. రాత్రి పది తరవాత టేబుల్ లైట్ వెలుతుర్లో మాత్రమే చదవండి. నిద్రోస్తే దిండు కింద పుస్తకం పెట్టుకొని పడుకోవాలి. పుస్తకం వెల వంద రూపాయలు." అన్నారు శాస్త్రిగారు.

"ఇంత లావు పుస్తకం వందరూపాయలేనా! ఇంతకీ ఈ పుస్తకం దేనిగూర్చి?" కుతూహలంగా అడిగాడు బ్యాంక్ బాబు.

"బోల్షివిక్ విప్లవానికి పదేళ్ళ ముందు లెనిన్ తన భార్యకి వెయ్యి ప్రేమలేఖలు రాశాడు. ఆ ఉత్తరాల ఆధారంగా లెనిన్ ప్రేమలోని రివల్యూషన్ స్పిరిట్ గూర్చి ఒకాయన విశ్లేషించాడు. అదే ఈ పుస్తకం." చెప్పారు శాస్త్రిగారు.

"నా నిద్రలేమికి, లెనిన్ విప్లవప్రేమకి కనెక్షనేంటి?" ఆశ్చర్యపొయ్యాడు బ్యాంక్ బాబు.

శాస్త్రిగారు సమాధానం చెప్పలేదు. కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపొయ్యారు.

ప్రశ్నలు అడగొద్దన్నట్లు సైగచేసి బ్యాంకు బాబుని పంపించాడు రావుఁడు.

కొద్దిసేపటికి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులోంచి కోటుతో ఒక కోటేశ్వర్రావు దిగాడు. పరిసరాలని ఇబ్బందిగా గమనిస్తూ, కర్చీఫ్ ముక్కుకి అడ్డంగా పెట్టుకుని, సూటు సరి చేసుకుంటూ శాస్త్రిగారిని చూసి విష్ చేశాడు.

"నేను ఈఈట్ కాన్పూర్లో చదువుకున్నాను. ఇప్పుడు అమెరికాలో పప్పీ సొల్యూషన్స్ అనే కంపెనీ నడుపుతున్నాను. పప్పీ నా భార్య ముద్దుపేరు." అని దీనంగా చెప్పాడు.

గర్వంగా చెప్పుకోవలసిన పరిచయం దీనంగా జరిగిందేమిటి!

"వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బేం చేసుకోవాలో అర్ధం కాని స్థితి. కానీ మనశ్శాంతి లేదు. అంతా గజిబిజి గందరగోళం. ఏడవాలనిపిస్తుంది, కానీ - ఏడుపు రాదు."

(పాపం! కుర్రాడు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు, వీణ్ణి ఆస్పత్రిలో పడేసి కనీసం ఓ లక్ష గుంజొచ్చు.)

శాస్త్రిగారు అర్ధమైందన్నట్లు తల ఆడించారు.

ఒక్కక్షణం ఆలోచించి రావుఁడితో "బుక్ నంబర్ ట్వెంటీ వన్." అన్నారు.

రావుడు లోపల్నించి పుస్తకం తీసుకొచ్చి కోటేశ్వర్రావు చేతిలో పెట్టాడు. అది - భగవద్గీత!

"ఈ భగవద్గీత రోజూ కనీసం గంటపాటు పారాయణం చెయ్యండి. ప్రశాంతత వస్తుంది. ఏడవాలనిపించదు, చావాలనీ అనిపించదు. పుస్తకం ఖరీదు నూటిరవై, అక్కడివ్వండి." అంటూ కళ్ళు మూసుకున్నారు శాస్త్రిగారు.

కోటేశ్వర్రావు సిగ్గుపడుతూ బుర్ర గోక్కున్నాడు.

"అయ్యా! నా చదువు చిన్నప్పట్నించి ఇంగ్లీష్ మీడియంలో సాగింది. నాకు తెలుగు చదవడం రాదు."

ఈమారు కళ్ళు తెరవకుండానే "బుక్ నంబర్ సిక్స్." అన్నారు శాస్త్రిగారు.

రావుఁడు పెద్దబాలశిక్ష తీసుకొచ్చి కోటాయన చేతిలో పెట్టి - "నూట డెబ్భై" అన్నాడు.

ఐదు నిమిషాల్లో ఇంకో నిద్ర పట్టని రోగం వాడు. ఇతను పరమ భక్తుడు. అతనికి అరవయ్యో నంబర్ పుస్తకం. ఎవడో ఒక ఉత్సాహవంతుడు వేదాలకీ, రాకెట్ సైన్సుకీ లంకె వేసి, పురాణాల మీదుగా లంగరు వేశాడు. పదివేల పేజీల పుస్తకం రాశాడు. అతనికి ఆ శాస్త్రం తాలూకా దిండు ఇవ్వబడింది. వెల ఐదొందలు.

ఒకడు మూలశంక ఉన్నవాడిలా చిటపటలాడుతూ వచ్చాడు. ఏమీ చెప్పక ముందే వాడికి బాపు కార్టూన్లు, ముళ్ళపూడి రమణ 'బుడుగు' చేతిలో పెట్టి పంపించారు.

ఇంకో 'పేషంట్'. ఆ కుర్రాడు ఏదో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట, ఉద్యోగం వస్తుందో రాదోనని భయంగా వుందిట. అతనికి 'విజయానికి వెయ్యి మెట్లు' పుస్తకం. వెల వంద రూపాయలు. ఆ పుస్తకాన్ని ఎగాదిగా చూశాడతను. 'అమ్మో! ఇన్ని మెట్లు నేనెక్కలేను, ఓపిక లేదు.' అని వేడుకున్నాడు. అలాగా! అయితే ఇంకో పుస్తకం. విజయానికి మూడు మెట్లు. ముందీ మూడు మెట్లెక్కి, తరవాత ఆ వెయ్యి మెట్లెక్కండి. వెల యాభై రూపాయలు.

నాకు శాస్త్రిగారి వైద్యం ఆసక్తిగా అనిపించింది. నేనిక ఏమాత్రం గూఢాచారిగా ఉండదలచలేదు. విశ్వనాథశాస్త్రిగారికి నమస్కరించాను. నేనెవరో పరిచయం చేసుకున్నాను. నా కార్యక్రమాన్నీ వివరించాను. శాస్త్రిగారు కుర్చీ ఆఫర్ చేశారు, కూర్చున్నాను.

ఒక్కక్షణం ఆలోచించి ప్రశాంతంగా, నిదానంగా చెప్పసాగారు.

"డాక్టరు గారు! నేను తెలుగు ఎమ్మేని. తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యాను. ఈ షాపు మా బావగారిది. అయన పోయినేడాది కాలం చేశారు. బావగారికి ముగ్గురు ఆడపిల్లలు. చెల్లి చేతిలో చిల్లిగవ్వ లేదు. అంచేత నేను ఈ షాపు నిర్వహణ బాధ్యత తీసుకున్నాను. మొదట్లో బోణీ కూడా అయ్యేదికాదు." అన్నారు శాస్త్రిగారు.

ఈలోపు ఒక బక్కపలచని వ్యక్తి దీనంగా అడిగాడు.

"అయ్యా! నా భార్య నన్ను కుక్కకన్నా హీనంగా చూస్తుంది."

రావుడు ఆ దీనుడి చేతిలో 'శతృవుని జయించడం ఎలా?' పుస్తకం పెట్టి వంద రూపాయలు తీసుకున్నాడు.

శాస్త్రిగారు చెప్పడం కొనసాగించారు.

"క్రమేపి షాపు మూసేసుకునే పరిస్థితి వచ్చింది. 'డాక్టర్ల ప్రాక్టీసులు బాగున్నయ్. మందుల షాపులు కళకళలాడుతున్నాయ్. ఆఖరికి ఆకుపసరు వైద్యులు కూడా బిజీగా ఉంటున్నారు. కానీ తెలుగునాట పుస్తకాల షాపులు మూసేసుకునే దుస్థితి ఎందుకొచ్చింది?' ఈ విషయం తీవ్రంగా ఆలోచించాను."

ఇంతలో నలుగురు వ్యక్తులు ఆటోలో ఒక యువకుణ్ణి తీసుకొచ్చారు. అతను బాగా కోపంగా ఉన్నాడు. పెద్దగా అరుస్తున్నాడు. "ఇతనికి నా వైద్యం పని చెయ్యదు. గుంటూరు తీసుకెళ్ళీ సైకియాట్రిస్టుకి చూపించండి." అని ఆ యువకుడి బంధువులకి సలహా చెప్పి పంపించేశారు శాస్త్రిగారు.

శాస్త్రిగారు తన సంభాషణ కొనసాగించారు.

"మన తెలుగువారికి సంపాదించే యావ ఎక్కువై పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిందన్న విషయం అర్ధం చేసుకున్నాను. సమాజంలో సగం రోగాలు మానసికమైనవనీ - అందుకు కారణం ఏదో సాధించేద్దామనే స్పీడు, హడావుడి వల్లనేనన్న అభిప్రాయం నాకుంది. నా మటుకు నాకు మంచి పుస్తకం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఒక పుస్తకం నాకు ఔషధం అయినప్పుడు ఇతరులకి ఎందుకు కాకూడదు? ఈ ఆలోచనల నుండి పుట్టిందే నా 'పుస్తక వైద్యం'."

"వెరీ ఇంటరెస్టింగ్. చిన్న సందేహం. ఇందాక మీరు కొన్ని లావు పుస్తకాలు ఇచ్చారు. ఎందుకు?" కుతూహలంగా అడిగాను.

శర్మగారు నవ్వారు. "నాక్కొన్ని పుస్తకాల్ని చూస్తుంటేనే నిద్రొస్తుంది. నాకు నిద్రొచ్చే పుస్తకం అందరికీ నిద్ర తెప్పిస్తుందని నా విశ్వాసం."

కొంతసేపు నిశ్శబ్దం.

"ఈ 'పుస్తక వైద్యం' చట్టవ్యతిరేకం అవుతుందంటారా?" అడిగారు శాస్త్రిగారు.

వచ్చిన పని పూర్తయింది. లేచి నిలబడ్డాను.

"పూర్తిగా చట్టబద్దం, పైగా సమాజహితం కూడా. మీ 'ప్రాక్టీస్' చక్కగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ నమస్కరించి బయటకి నడిచాను.

ఆ రోజే నా రిపోర్ట్ మా సతీష్‌కి పంపాను.

'పుస్తక వైద్యం అనేది మంచి ఆలోచన. మన సైకియాట్రిక్ సొసైటీవారు ఈ ఐడియాని మరింత విస్తృతంగా పరిశోధించి, ప్రయోగాత్మకంగా కొన్ని సెంటర్లలో అమలు చెయ్యాలని భావిస్తున్నాను. శ్రీపుచ్చా విశ్వనాథశాస్త్రి గారిని మన రాష్ట్ర సదస్సుకి ప్రత్యేక ఉపన్యాసకునిగా ఆహ్వానించి, వారి అనుభవాలని మనతో పంచుకునే విధంగా ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరుతున్నాను.'

గమనిక -

ఈ కథలో నేనూ, సతీష్ నిజం. మిగిలిందంతా కల్పితం.

Monday, 26 March 2012

కళాపోషణ

ఆయనో ప్రముఖ కాంట్రాక్టర్, కాంగ్రెస్ నాయకుడు, నిష్టాగరిష్టుడు. తన పుట్టిన్రోజు కళారంగానికి సుదినం అని ఆయన అభిప్రాయం. ఆయనకా ఆభిప్రాయం వుండటంలో ఆశ్చర్యం లేదు! కానీ ఆయనగారి ఆతిధ్యం పొంది ఆయన్ని కీర్తించడానికి అనేక ప్రముఖులు క్యూ కట్టడం మాత్రం ఆశ్చర్యకరమే! 

కళలు నానావిధములు. ప్రజలకి పనికొచ్చే కళలు, ప్రజలకి పనికిరాని కళలు. ఈ కళాకారుల్లో కొందరికి ఆర్ధికంగా దుస్థితి అయితే మరికొందరిది గుర్తింపు కోసం వెంపర్లాడే దుస్థితి. వీళ్ళంతా యేదోరకంగా డబ్బు సంపాదించినవారి పంచన చేరి, వారిని మెప్పించి తమక్కావలసిందాన్ని సంపాదించుకుంటారు.      
               
పూర్వం రాజులు తమ యుద్ధవ్యాపకాలు, ప్రజల నడ్డివిరిచే పన్నుల వసూళ్ళూ వంటి పనుల్లో బిజీగా వుండేవాళ్ళు. ఈ పన్లయ్యాక సేద తీరడానికి వారికి వినోదం అవసరమయ్యేది. అందుకోసం రాజులకి సంగీతం, నృత్యం, కవిత్వం తెలిసిన కళాకారుల్తో పని పడేది. రాజులు వారి దగ్గర్నుండి కొద్దిగా వినోదం పొంది, ఇంకొద్దిగా కీర్తింపచేసుకుని ఖరీదైన బహుమానాల్ని దానంగా ఇచ్చేవారు. 

ఈ కళాకారులు రాజుల చల్లని నీడలో సుఖంగా సేద తీరుతూ ప్రబందాలు, కవితల్నీ రాసేవాళ్ళు. వీళ్ళు బ్రతక నేర్చిన కళాకారులు, అందుకే పొరబాటున కూడా ప్రజల పక్షాన మాట్లాడరు. 'ఓ రాజా! పొరుగు రాజ్యాల మీదకి అనవసరంగా యుద్ధానికి పోనేల? ఈ సంవత్సరం కరువొచ్చిందికదా! పన్నులో ఓ దమ్మిడీ తగ్గించరాదా?' అని సలహాలిస్తే రాజుపక్కనుండే సేనాపతి తక్షణం శిరచ్చేదన కావిస్తాడని వీరికి తెలుసు.

గుప్తుడి స్పాన్సర్డ్ కవులు గుప్తుల కాలం స్వర్ణయుగమనీ, కృష్ణదేవరాయలు స్పాన్సర్డ్ కవులు రాయలవారి పాలనలో రత్నాలు రాసులు పోసుకుని అమ్మేవారని రాసుకుంటూ (యే ఎండకా గొడుగు పడుతూ) స్వామికార్యము, స్వకార్యము చక్కపెట్టుకున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు తమ విధేయులకి పద్మ అవార్డులు ఇచ్చినట్లే.. ఆరోజుల్లో రాజులు కవులకి, కళాకారులకి కాళ్ళూ చేతులకి కంకణాలు, కడియాలు తొడిగేవాళ్ళు.     
                 
కాలక్రమేణా రాజులు అంతరించిపొయ్యారు. వారి స్థానంలో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు వచ్చి చేరారు. ఆనాటి రాజులకి మల్లె ఇప్పటి డబ్బున్నమారాజుల్లో కొందరికి 'కలాపోసన' అనే దురదుంది. సహారా బాబు ప్రపంచ సెలెబ్రెటీలకి తన లోయనగరంలో 'సపరివార ఆతిథ్యం' ఇస్తాడు. విజయ మల్లయ్య కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం కోట్లు గుమ్మరిస్తాడు, ముద్దుగుమ్మల్తో జల్సా చేస్తాడు. కాంట్రాక్టర్ తన పుట్టిన్రోజున నచ్చినవారికి అవార్డులు (?) ఇస్తాడు.

మా సుబ్బు ఇట్లాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకొమ్మమంటాడు.

"నువ్వు వ్యక్తులకి ఉండని, ఉండాల్సిన అవసరం లేని గొప్పగుణాల్ని ఆపాదిస్తున్నావ్. అక్కడ ఇచ్చేవాళ్ళకీ, పుచ్చుకునేవాళ్ళకీ, పొగిడే ప్రముఖులకీ ఎవరి లెక్కలు వారికున్నయ్. లెక్కల్లేనిదల్లా వాళ్ళని సీరియస్‌గా తీసుకునే నీకే! లైట్ తీస్కో బ్రదర్!" 

ఎస్, సుబ్బూ ఈజ్ రైట్!

Tuesday, 20 March 2012

డిజా వు

"ప్రధానమంత్రిజీ! ప్రధానమంత్రిజీ! రక్షించండి." నిండుసభలోకి సావిత్రి స్టైల్లో ఏడ్చుకుంటూ పరుగున వచ్చాడు దినేష్ త్రివేది.

సభికులు (పార్లమెంట్ సభ్యులు) బిత్తరపొయ్యారు. జరుగుతున్న (లోక్) సభ ఒక ముఖ్యమైన (బజెట్) సమావేశం. త్రివేదిని కీచకుడిలా తరుముకుంటూ వచ్చిన మమతా బెనర్జీ ఒక్కక్షణం ఆగి సభని పరికించింది. సింహాసనం మీదనున్న మన్మోహన్ సింగ్‌ని చూసి నిర్లక్ష్యంగా నవ్వింది. మన్మోహన్ ముక్కామల స్టైల్లో ఇబ్బందిగా కదిలాడు.

"హు.. ఇదొక సభ! వీళ్ళందరూ సభ్యులు! ఈ ప్రధానమంత్రి నేను కూర్చండబెట్టిన మట్టిబొమ్మ. ఎవరు?.. ఎవరు నన్నెదిరించువారు?" అంటూ ఎస్వీరంగారావులా గర్జించింది మమత.

"అయ్యో! మమతా దీదీ! నీ పరాక్రమం నాకు తెలియనిదా! కానీ నిండుసభ కొలువై ఉండగా నీవిటుల త్రివేది వెంటపడుట.. " నీళ్ళు నమిలాడు విరాట మహారాజు.. సారీ, మన్మోహనుడు.

"నీవా నాకు సభామర్యాదలు నేర్పునది! మన్మోహనా! నువ్వేం చేస్తావో నాకనవసరం. తెల్లవారేసరికి ఈ త్రివేది రాజీనామా నా మందిరానికి చేరాలి. లేదా నీ యూపియే 2 ని సర్వనాశనం చేస్తాను. నీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటావో నీట ముంచుకుంటావో ఇహ నీ ఇష్టం." అంటూ విసవిసా సభ నుండి నిష్క్రమించింది మమతా బెనర్జీ!

చివరి తోక -

పొద్దున న్యూస్‌పేపర్ చదువుతుంటే - ఢిల్లీలో జరుగుతున్న రాజకీయం ఇంతకుముందెక్కడో చూసినట్లు అనిపించింది. కొద్దిసేపు ఆలోచించాక 'నర్తనశాల' గుర్తొచ్చింది. దీన్నే 'డిజా వు' (deja vu ) అంటారు.

Sunday, 18 March 2012

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?" (ఒక నడక మిషన్ కథ)

"ఇంకా ఎంత దూరం ఉంది నాయనా?"

దేవదాసు సినిమా క్లైమాక్స్ గుర్తుంది కదూ! దుర్గాపురం చేరేదాకా బతుకుతానో లేదో అనే దేవదాసు ఆర్తి, ఆతృత.. పారుని చూడకుండానే చనిపోతానేమోననే ఆవేదన.. గుండెని కరిగించి కన్నీటిని వరదలా ప్రవహింపచేసే ఉద్వేగపూరిత ఘట్టం. సీతారాం (బండి నడిపిన వ్యక్తి) నటన అపూర్వం. తెలుగుసినిమా చరిత్రలో నన్ను ఇంతకన్నా ఏడిపించిన సన్నివేశం మరోటి లేదు.
               
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే - ప్రతిరోజూ ఉదయం నేను కూడా దేవదాసులా ఫీలవుతుంటాను. దేవదాసుకి పార్వతి బాధ. నాకు ట్రెడ్‌మిల్ బాధ! ఈ డాక్టర్లు రాక్షసులకి తక్కువ, పిశాచాలకి ఎక్కువ. ఎక్సర్సైజులు చెయ్యకపొతే చస్తావని బెదిరిస్తుంటారు. ఆ డాక్టరే భార్య రూపేణా ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఎడారిలో ఎండమావి వంటిదని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.

కృష్ణకుమారి అక్కయ్యా! భార్యలకి భర్తల ఆరోగ్యం పట్ల తీవ్రమైన శ్రద్ధ ఎందుకు? మన పవిత్ర భారతదేశంలో భార్యలకి భర్తల పట్ల గల ఘోరప్రేమే కారణమని నేనూ, 'నీ బొంద! అది ప్రేమా కాదు, దోమా కాదు. మొగుడు చస్తే బాధ్యతలు నెత్తిమీద పడతయ్యనే బయ్యం! ప్రతిరోజూ నోరు  నొప్పెట్టేలా తిట్టుకోడానికి కొత్తమనిషి దొరకడనే అభద్రతా భావం!' అని నా స్నేహితుడూ వాదించుకుంటున్నాం. ఎవరు కరక్టో చెప్పండి. మీరు చెప్పేదాకా మేం వాదించుకుంటూనే ఉంటాం! చెప్పకపొతే కొట్టుకుని చచ్చిపోతాం!!

'ట్రెడ్‌మిల్ ఎందుకయ్యా? హాయిగా పొద్దున్నే గ్రౌండ్ లో వాకింగ్ చెయ్యొచ్చుగా?' అని మీకు అనుమానం రావొచ్చు. 'పొద్దున్నే నిద్రలేచి రోడ్డున పడకురోయ్! నిన్ను ఏ పేపరోడో, పాలపేకెట్లోడో అనుకుంటారు.' అని మా సుబ్బు భయపెడ్తాడు. కుక్కలు కరుస్తయ్యని కూడా బెదరగొడతాడు. అసలు విషయం - నేనెక్కడ వాకింగ్ చేసి ఆరోగ్యం మూట గట్టుకుంటామేమోనని సుబ్బు భయం! కానీ - నేను స్నేహితుల మాటకి విలువిచ్చే మనిషిని! అందుకే - ఉదయాన్నే లేవకుండా బారెడు పొద్దెక్కేదాకా నిద్రోవడం, పొరబాటున లేచినా వాకింగుకి దూరంగా ఉండడం చేస్తున్నాను. తప్పదు, స్నేహధర్మం!

అయితే అన్నిరోజులూ ఒకలా ఉండవు. నేను వాకింగ్ చెయ్యక తప్పని పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నిరోజులు ఇంటికి దగ్గరగా వున్న గ్రౌండ్‌కి వెళ్లాను. అక్కడ నడిచేవాళ్ళని చూసి ఆశ్చర్యమేసింది. వాకింగ్ ట్రాక్ మీద క్రమబద్దంగా, హడావుడిగా నడుస్తున్న వారంతా గొర్రెల్లా కనిపించారు.

నడకలో కూడా ఒక్కోడిది ఒక్కో స్టైల్. ఒకరిది అడుగులో అడుగేస్తూ పెళ్లినడకయితే, ఇంకొకరిది 'పదండి ముందుకు పదండి తోసుకు' అన్నట్లు పరుగులాంటి నడక. అక్కడ చాలామంది వాకర్లు కాదు. టాకర్లు మాత్రమే! కొందరైతే మొక్కుబడిగా నాలుగు రౌండ్లు నడిచి పక్కనే ఉన్న హోటల్లో అరడజను నేతి ఇడ్లీలు ఆరగించి వెళ్తున్నారు! ఆరోగ్యంగా జీవించడానికి ఇన్ని కష్టాలు పడాలా? వామ్మో! నా వల్లకాదు.

కానీ 'నడక' లేని జీవితం గాలిలో దీపం వంటిదని డాక్టర్లు ఘోషిస్తున్నారు, భయపెడ్తున్నారు, అసలు వాళ్ళు పెట్టే ఈ భయంతో చచ్చేట్లున్నాం. అందువల్ల 'ట్రెడ్‌మిళ్ అని ఆంగ్లంలో పిలవబడుతున్న ఒక నడక మిషన్ని కొన్నాను.

ట్రెడ్‌మిల్ - బుజ్జిముండ! చూడ్డానికి అందంగా, గంభీరంగా ఉంటుంది. కానీ ఈ మిషన్ మీద నడవడం మాత్రం దుర్భరం. కింద పట్టా వెనక్కి కదిలి పోతుంటుంది. మనని వెనక్కి లాక్కెళ్ళి పోదామని, పడేద్దామని ఆ పట్టా తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. కింద పడితే మూతి పళ్ళు రాల్తాయి కావున, పడకుండా మనకి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా కదిలే ఒక పట్టాతో మనం చేసే నిరంతర పోరాటన్నే 'ట్రెడ్‌మిల్ వాకింగ్' అంటారు!

మిషన్ ముందు ఒక బల్ల. దానిమీద ఎంత దూరం? ఎంత సమయం? ఎన్ని కేలరీలు? - ఇట్లా ఏవేవో లెక్కలు. 'జాగ్రత్త, ఇరువైపులా ఉన్న కడ్డీలని జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజుల్లో కరెంట్ యే క్షణాన్నైనా పోవచ్చును. మీ భద్రతకి మా బాధ్యత లేదు!' ఇలా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నడుస్తూ, అప్పుడప్పుడు పరిగెడుతూ- క్షణక్షణం ఆశగా ఎదురుగానున్న మీటర్లపై కాలము, దూరము అంకెలు చూసుకుంటూ - 'విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం.' అని పాడుకుంటూ -

"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?"

నా ఏడుపు వాకింగ్ మా 'గుండెలు తీసిన బంటు' గోఖలేకి తెలిసింది. 'అలా ఏడుస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యకు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి.' అన్నాడు. ఈ గోఖలేకి వొక్కటే పని - గుండె ఆపరేషన్లు చెయ్యడం. నేను మాత్రం చాలా బిజీ! అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సమస్యలోంచి ఎలా బయటపడుతుంది? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చైనా ఇండియాకి సహకరిస్తుందా? లేదా? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గూర్చి ఆలోచించాల్సిన గురుతర బాధ్యతలు నామీదున్నాయి.

అయినా ఎంజాయ్ చేస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యడమేమిటి! ఎంజాయ్ చెయ్యడానికి ఇదేమన్నా జ్యోతిలక్ష్మి డాన్సా? లేక సింగిల్ మాల్ట్ విస్కీయా? ఒరే మందుల కంపెనీ బాబులూ! జలుబుకీ, గజ్జికీ కూడా వందల కొద్దీ మందుల్ని మార్కెట్ చేస్తారు. పొద్దున్నే ఈ వాకింగులు, పీకింగులు లేకండా ఏదన్నా మందులు కనిపెట్టి చావండ్రా! నడవలేక ఇక్కడ కువసాలు కదిలిపోతున్నాయ్! 

Thursday, 15 March 2012

సచిన్ టెండూల్కర్.. సున్నాల సమస్య

"ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? రిచర్డ్ హాడ్లీకి ఇడ్లీ తినిపించాను, మెక్‌గ్రాత్‌ని మంచినీళ్ళు తాగించాను, షేన్ వార్న్‌కి వార్నీషు వేశాను, అక్రంని అప్పడంలా నమిలేశాను, ఉమర్ గుల్‌ని గుడ్డలా ఉతికేశాను (ప్రాస కోసం ప్రయాసల్ని పాఠకులు గుర్తించగలరు). కానీ.. కానీ.. ఈ వందోసెంచరీ ఎందుకు చెయ్యలేకపోతున్నాను? చెయ్యలేకపోతున్నాను? చెయ్యలేకపోతున్నాను?"

అదో ఐదు నక్షత్రాల హోటల్, అందులో ఓ విశాలమైన గది. గది మధ్యలో నిద్రపోతున్న గున్నేనుగులా డబుల్ కాట్, దానిపై మంచు కప్పేసినట్లు తెల్లని బెడ్ షీట్. ఓ పక్కగా అందమైన సోఫా. ఆ మూలగా ఒక టేకుబల్ల, దానిపై టేబుల్ లైట్.

ప్రస్తుతం ఆ గదిలో ఒక నడివయసు వ్యక్తి సోఫాలో జారగిలిపడి శూన్యంలోకి చూస్తున్నాడు. పరీక్షగా చూస్తే అతను తీవ్రఆలోచనల్లో మునిగున్నాడని అర్ధమౌతుంది. అతడి నామధేయం సచిన్ టెండూల్కర్, క్రికెట్ క్రీడాకారుడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు, బ్యాంకులవారిగా కోట్లాది రూపాయిలు అతగాడి సొంతం.

విధి బలీయమైనది, క్రూరమైనది కూడా! క్రికెట్ బ్యాటుతో ప్రపంచాన్ని శాసించిన సచిన్బాబుకి ఈమధ్యన అనేక కష్టాలు మరియూ కడగండ్లు! అతనిప్పుడు అశోకవనంలో సీతలా (దుఃఖించడానికి ఆడామగా తేడాలుండవ్) శోకమూర్తియై, ఆలోచనా కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

'అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను గదా! సాయిబాబా బొమ్మ జేబులో పెట్టుకుంటున్నాను. బ్యాటు, హెల్మెట్లకి లార్డ్ బాలాజీ టెంపుల్లో స్పెషల్ పూజలు చేయిస్తున్నాను. కారు నంబర్ మార్చాను, ఇల్లు మారాను, ఈశాన్యం వైపు తిరిగి కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను. ఎర్రరంగు కలిసొస్తుందంటే ఎర్రరిబ్బను కట్ డ్రాయర్లో దోపుకుని బ్యాటింగు చేస్తున్నాను. కానీ.. కానీ.. ఎందుకిలా?" బాధగా నిట్టూర్చాడు, కంట్లో పల్చటి కన్నీటి పొర.

ఇంతలో కిర్రుమంటూ గది తలుపు తెరుచుకుంది (గది తలుపు ఎప్పుడూ కిర్రుమనే తెరుచుకుంటుంది, ఇంకోలా తెరుచుకోలేదు). ఒక నడివయసువాడు.. బట్టతల, పిల్లి గెడ్డంతో ఉన్నవాడు.. ఫుల్ సూట్, బ్లాక్ షూ  ధరించినవాడు.. లోపలకొచ్చి సచిన్‌కి ఎదురుగానున్న సోఫాలో కూర్చున్నాడు. అతని తల ఇత్తడి చెంబులా, కళ్ళు గోళీకాయల్లా ఉన్నాయి. శరీరం బక్కగా, సరివి కట్టెకి సూటూబూటూ తొడిగినట్లున్నాడు. అతగాడు ఆ డ్రస్సు ఠీవీ కోసం కన్నా, గాలొస్తే ఎగిరిపోకుండా రక్షించుకుందుకు వేసుకున్నాడనిపిస్తుంది.

"సచిన్! అయాం డాక్టర్ మరణం. నాపేరు విండానికి గమ్మత్తుగా వుంటుంది. మా తాత చనిపోయిన రోజే నేను పుట్టాన్ట. నాతండ్రి ప్రముఖ నాస్తికుడు. అంచేత నా తండ్రి తన తండ్రి మరణానికి గుర్తుగా నాపేరు 'మరణం'గా ఫిక్సయ్యాడు. నేను ఆంధ్రాలో ప్రముఖ సైకాలజిస్టుని. మీకు సాయం చేద్దామని వచ్చాను." అన్నాడు డాక్టర్ మరణం.

టెండూల్కర్‌కి విసుగ్గా ఉంది. కానీ కష్టాల్లో ఉన్నాడు, నమ్మకాల్ని తీవ్రంగా నమ్మినవాడు. అంచేత సహనం వహించి డాక్టర్ మరణం అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పాడు.

"చివరి ప్రశ్న. ఈమధ్య మీకు ఒకబంతి రెండుబంతులుగా కనిపిస్తుందా?" అడిగాడు డాక్టర్ మరణం.

సచిన్ ఒక్కక్షణం ఆలోచింఛి, అవునన్నట్లు తల ఊపాడు. విషయం అర్ధమయిందన్నట్లు తల పంకించాడు డాక్టర్ మరణం.

"సచిన్! మీ కేస్ చాలా సింపుల్. మీరు మీ వందో సెంచరీ గూర్చి ప్రీ ఆక్యుపై అయ్యున్నారు. పొద్దస్తమానం వంద సంఖ్య గూర్చే ఆలోచించడం మూలానా,  మీకు తెలీకుండానే ఆ వందలో ఉన్న రెండుసున్నాలు మీ మనసులో బలంగా నాటుకుపొయ్యాయి. అందుకే మీకు గ్రౌండులో కూడా రెండుసున్నాలు కనబడుతున్నయ్. గ్రౌండులో రెండుసున్నాలంటే రెండుబంతులు. కావున మీకు ఒకబంతే రెండుగా కనిపిస్తుంది. అంచేతనే మీరు ప్రతి అడ్డమైనవాడికి మీ వికెట్ సమర్పించుకుంటున్నారు."

సచిన్ ఆసక్తిగా అడిగాడు - "ఇప్పుడు నేనేం చెయ్యాలి?"

"వెరీ సింపుల్! మీ రెండుసున్నాల్ని ఒకసున్నాకి మారిస్తే సమస్య పరిష్కారం అయినట్లే. ఈక్షణం నుండి మీరు వంద గూర్చి ఆలోచించడం మానెయ్యండి. ఇప్పట్నించి మీ సంఖ్య పది. మీరు ఈ పది నంబర్ని జపిస్తూనే వుండండి. మనసులోంచి వంద చెరిగిపోయి పదిముద్ర పడాలి. అప్పుడు మీకిక బంతి ఒకటిగానే కనిపిస్తుంది. పదిలో ఉంది ఒక సున్నానే గదా!" అంటూ లేచాడు డాక్టర్ మరణం.

మరి - డాక్టర్ మరణం సలహా సచినుడికి పని చేస్తుందా? చూద్దాం!   

Wednesday, 14 March 2012

రాహులుని రోదన

అది టెన్ జన్‌పథ్. విశాలమైన ఇల్లు, పొడవాటి వరండా. చిన్నబాబు రాహుల్ గాంధి సీరియస్‌గా వున్నాడు. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయ్. వరండాలో రాజ్యసభ సభ్యత్వం అడుక్కోడానికి వచ్చిన లీడర్లు గొడవారా వేసున్న చెక్కబల్లల మీద కునికిపాట్లు పడుతున్నారు. రాహుల్ బాబుని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడి, తొట్రుపడుతూ గబుక్కున నించొని, వొంగొంగి నమస్కారాలు చేశారు. రాహులుడు వారిని కన్నెత్తి కూడా చూళ్ళేదు.

గదులన్నీ దాటుకుంటూ సరాసరి తల్లి బెడ్రూంలోకి వెళ్ళాడు. సోనియా గాంధి మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. కొడుకు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచింది.

"రా నాన్నా రా! ఇలావచ్చి నాపక్కన కూర్చో!" అంటూ ఆప్యాయంగా పిలిచింది.

రాహులుడు తల్లి పక్కన కూర్చున్నాడు. దిగులుగా ఉన్న కొడుకుని చూసి కంగారుపడింది సోనియా.

"ఎలక్షన్లలో ఓడిపోవడం బాధగానే ఉంటుంది కన్నా! గడ్డం చేయించుకొమ్మంటినే. అసలే ఎండాకాలం, దురద పెడుతుంది నాయనా." నీరసంగా అంది సోనియా.

రాహుల్ ఒక్కసారిగా చిన్నపిల్లాళ్ళా భోరున యేడవడం మొదలెట్టాడు! 

సోనియా భయపడిపోయింది. కొంపదీసి రాహుల్ని గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసిందా ఏమిటి! 

కొద్దిసేపటికి తేరుకున్నాడు రాహుల్, కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాడు.

"అమ్మా! మనం మన ఇటలీ వెళ్లిపోదాం, ఈ దేశంలో ఉండొద్దు." ఏడుపు గొంతుతో అన్నాడు.

"ఏమైంది నాన్నా!" కన్నతల్లి తల్లడిల్లిపోయింది.

రాహుల్ గాంధి జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు.

"పొద్దున్నించి వొకటే మెసేజిలు, చూళ్ళేక చస్తున్నా!" అంటూ ఫోన్లో మెసెజిలు తల్లికి చూపించాడు.

"విషయం ఏంటి బంగారం!" అయోమయంగా అడిగింది సోనియమ్మ.

"కంగ్రాట్స్ రాహుల్. ఎ కరెక్ట్ డెసిషన్ ఎట్ కరెక్ట్ టైం. వి ఆర్ ఎరేంజింగ్ ఎ ఫేర్ వెల్ పార్టీ టు యు." అన్న మెసేజ్‌ని తల్లికి చూపించాడు రాహుల్.

"ఎవరికో పంపాల్సిన మెసేజ్ పొరబాటున నీకు పంపారు కన్నా! డోంట్ వర్రీ." ధైర్యం చెప్పింది సోనియా.

"నా ఏడుపూ అదేనమ్మా! రిటైర్ అయ్యింది క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. జనాలేమో నేను రిటైరయ్యాననుకుని పండగ చేసుకుంటున్నారు! నా రిటైర్మెంటుని స్వాగతిస్తూ వేలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయమ్మా. మొదట్లో నేనూ పొరబాటున పంపుతున్నారనుకున్నాను, కానీ కాదు. రాహుల్ అంటే నేనేననుకుని ప్రజలు నా రిటైర్మెంటునే స్వాగతిస్తూ పండగ చేసుకుంటున్నారు!" మళ్ళీ బావురుమన్నాడు రాహుల్ గాంధి.

సోనియాకి రాహుల్ని ఎలా ఓదార్చాలో తెలీక అయోమయంగా చూస్తుండిపోయింది!

Tuesday, 13 March 2012

తెలుగు సినిమాల్లో రేపుల కామెడీ

కథలు చదివేవాళ్ళని పాఠకులు అంటారు, వీళ్ళకి చదవడం రావాలి. సినిమా చూసేవాళ్ళని ప్రేక్షకులు అంటారు, వీళ్ళకి చదువుతో పన్లేదు. మన తెలుగువాళ్ళల్లో చదువుకున్నవారి సంఖ్య తక్కువ కాబట్టి, సినిమా వ్యాపారం కాబట్టి, మెజారిటీ (చదువుకోనివాళ్ళు)ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. కారణం - వీళ్ళకి నచ్చితేనే సినిమా అనే వ్యాపారంలో లాభాలొస్తయ్ కాబట్టి.

మరి సినిమాలకి ఎంతో ముఖ్యుడైన ఈ ప్రేక్షకుడు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వేదిక వుందా? లేదని నేననుకుంటున్నాను. వున్నట్లైతే ఒక సినిమా గూర్చి - 'ఎన్టీవోడు రాజనాలతో ఫైటింగ్ ఇరగదీశాడు', 'ప్రేమనగర్‌లో లేలే నారాజా పాట కోసం సిన్మా మూడుసార్లు చూశా. డ్యాన్స్ అదరహో!' తరహా అభిప్రాయాలు వినబడేవి.

ఇవ్వాళ్టి ఈ రాత ఉద్దేశం - అటువంటి వేదిక లేని లోటు తీరుద్దామనే గొప్ప ఆలోచన! నిజజీవితం వేరు, సినిమా తెర వేరు. రెంటికీ కిలోమీటర్లు దూరం వుంది. ఉదాహరణకి రేప్ లేక అత్యాచారం అన్న టాపిక్ తీసుకుందాం. నిజజీవితంలో రేప్ అన్నది అత్యంత క్రూరమైన, దుర్మార్గమైన నేరం. అయితే తెలుగు సినిమాలకి సంబంధించి రేప్ నేరం కాదు, ఒక వినోద సాధనం. ఈ నేరాన్ని ఒక ఫైటింగు సీన్లా, ఒక ఐటం సాంగులా - రేప్‌ని బాక్సాఫీస్ ఫార్ములాగా వాడుకుంటారు.

రేప్ సినిమాల్లో హీరోకి వికలాంగురాలైన ఓ చెల్లెలు. మంచి పెర్సనాలిటీ వున్న ఆ అమ్మాయికి హీరో గోరుముద్దలు తినిపిస్తూ 'ఓ చెల్లి! నా చిట్టి తల్లి' అంటూ ఘంటసాల గొంతు అరువు తెచ్చుకుని పాటలు పాడుతుంటాడు. ఆ అమ్మాయికి సినిమాలో ఒక రేప్ సీన్ రెడీగా వుందనీ, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటుందనీ హీరోకి తప్ప థియేటర్లో అందరికీ తెలుసు. రేప్ సీన్ మొదలవగానే హాల్లో ఈలలూ, చప్పట్లూ! రేప్ సీన్ అయిన వెంటనే కొందరు బయటకి వెళ్లిపొయ్యేవాళ్ళు.

రేప్ సీన్ల వీక్షక స్పెషలిస్ట్ అయిన నా మిత్రుడొకడు ఓసారి తన రేప్ సీన్ల కోరికలు వెలిబుచ్చాడు. ముందే ఓ గంటపాటు కొన'సాగే' రేప్ సీన్ చుట్టేసి, ఆ సీన్ ని సెన్సారోళ్ళు ఒప్పుకుంటే - ఆ తర్వాత ముందువెనుకలు ఏదోక కధని అతికించే సౌలభ్యమున్నట్లయితే బాగుంటుంది! హాలు బయట 'హౌస్ ఫుల్' బోర్డులాగా, హాల్లో ఫలానా టైముకి రేప్ సీనుంటుంది అనే బోర్డు గనక పెట్టిచ్చినట్లయితే - హీరోగారు ఆయన చెల్లెలిగారి మమతలూ, అనురాగాలూ తాలూకా సీన్లు చూసే శిక్ష తప్పుతుంది!

మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనే ఒక దుర్మార్గమైన నేరం సినిమాల్లో బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపొయ్యింది. ఇప్పుడు నేరాసేదంతా సినిమా రేపులగూర్చి మాత్రమే. అంచేత చదువరులు దీన్నొక సరదా రాతగా మాత్రమే భావించ మనవి.

సినిమావాళ్ళకి ఒక నటి శరీరాన్ని ఎక్స్పోజ్ చెయ్యడానికి రేపుని మించిన అవకాశం లేదు, అందుకే వాళ్ళు రేప్ సీన్లని విపులంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారు. మన తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు రావట్లేదని ఏడ్చేకన్నా, ఉత్తమ రేప్ సీన్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా చాలా అవార్డులు వచ్చేవని నా నమ్మకం.

ఎంతైనా ఆ రోజులే వేరు. రేపుల్లో ఎంత క్రియేటివిటీ! మన ఆనందం కోసం కొండల్లో, గుట్టల్లో.. ఎండనకా వాననక సత్యన్నారాయణ, ప్రభాకరరెడ్డి, రాజనాలలు ఎంత కష్టపడి రేపులు చేశారు! పాపం! కానిస్టేబుల్ సెలక్షన్ల కోసం పరిగెత్తినట్లు మైళ్ళకొద్దీ పరిగెత్తేవాళ్ళు. సత్యన్నారాయణ చాలా ఫేమస్ రేపిస్ట్. ఎందుకనో మొదట్నించి రాజనాల మొహంలో రేప్ ఫీలింగ్స్ పలకవు, అప్పుడుకూడా కత్తియుద్ధం చేస్తున్నట్లు మొహం క్రూరంగా పెడతాడు.

రేప్ సీన్లో నటించడం అంత వీజీ కాదు. దట్టమైన మేకప్ పూసుకుని, ఆర్క్ లైట్ల వేడిని తట్టుకుంటూ.. అంతమంది మధ్యన కళ్ళల్లో కామం చూపించడం ఎంత కష్టం! నామాట నమ్మరా? యేదీ, మహానటుడు చిత్తూరు నాగయ్యని ఒక రేప్ సీన్లో నటించమనండి చూద్దాం! ఆయనకి తన లిమిటేషన్స్ తెలుసు గనకనే కష్టమైన రేపుల జోలికి పోకుండా, సులభమైన భక్తిపాత్రలు వేసుకున్నాడు.

ఇప్పుడు సినిమా రేపుల గూర్చి కొన్ని నా రీసెర్చ్ ఫైండింగ్స్. అసలు తెలుగు సినిమాల్లో రేపులు ఎందుకు ఎలా మొదలయ్యాయి? అందుక్కారణం పాత సినిమా హీరోయిన్లేనని నా అభిప్రాయం! సినిమా తొలినాళ్ళలో విలన్లు హీరోయిన్లని ఘాటుగా ప్రేమించారు, వారి ప్రేమని పొందడానికి తహతహలాడారు. పాపం వాళ్ళసలు రేపుల జోలికే పోలేదు. ఇందుకు ఉదాహరణలు చాలానే వున్నాయి.

కెవిరెడ్డి దర్శకత్వం వహించిన 'జగదేకవీరుని కథ'లో రాజనాల రాజు. బి.సరోజాదేవిని చూసి మనసు పడ్డాడు. కొత్తమంత్రి సియస్సార్‌తో కలిసి ఎన్నో ప్లాన్లేస్తాడు! ఎన్నో తిప్పలు పడతాడు! 'ప్రెగ్గడ! హే పాదరాయ ప్రెగ్గడా' అంటూ మంత్రి సాయంతో సరోజాదేవి దృష్టిలో పడ్డానికి రాజనాల చెయ్యని ప్రయత్నం లేదు. చివరాకరికి ఆడవేషం వేశాడు, తన్నులు తిన్నాడు. బి.సరోజాదేవి మాత్రం తన చిలక పలుకులతో రామారావునే ప్రేమించింది కాని రాజనాలని కన్నెత్తి చూళ్ళేదు, ఇది చాలా అన్యాయం!

మళ్ళీ కెవిరెడ్డి సినిమానే ఉదాహరణ. ఆర్.నాగేశ్వరరావు దొంగే కావచ్చు, తాగుబోతే కావచ్చు. కానీ - 'దొంగరాముడు'లో సావిత్రిని ఘోరంగా ప్రేమించాడు. కసాయివాడే కానీ సావిత్రితో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ ఆ మహాతల్లి ఏంచేసింది? 'రావోయి మాఇంటికి' అంటూ పాట పాడి నమ్మకద్రోహం చేసింది. ఆరడుగుల ఆర్.నాగేశ్వరరావు ప్రేమకి వెన్నుపోటు పొడిచింది, చివరికి జైల్లో వేయించింది. ఇది మిక్కిలి గర్హనీయము.

కెవిరెడ్డి మహాదర్శకుడు, ఆయన సినిమాల్లోనే ఎంతో అన్యాయానికి గురయ్యారు మన విలన్లు. ఇంక బుద్ధున్న యే విలనైనా హీరోయిన్లనీ, హీరో చెల్లెళ్ళనీ యెలా నమ్ముతాడు? అంచేత కాన్ఫిడెన్సు కోల్పోయి, ప్రేమ విషయాల్లో హీరోల్తో పోటీపడి నెగ్గుకు రాలేమని విలన్లందరూ మూకుమ్మడిగా డిసైడైపొయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో రేపుల వైపు మళ్ళారు (దుఖంతో గొంతు పూడుకుపోతుంది ఒక్కక్షణం విరామం).

ఇప్పుడు ద బెస్ట్ అండ్ ద వరస్ట్ రేప్ సీన్స్! బెస్ట్ రేప్ - 'డబ్బుకు లోకం దాసోహం'లో సత్యన్నారాయణ రేప్. డిస్కవరీ చానెల్లో లేడి వెంట పులి పడినట్లు వై.విజయ వెనక గంటసేపు పరిగెత్తుతాడు. ఆవిడ చీరని లాగేస్తాడు, తరవాత ఆవిడ మళ్ళీ ఫుల్ చీరతో పరిగెడుతుంటుంది! మళ్ళీ లాగేస్తాడు, మళ్ళీ ఫుల్ చీర! ఈవిధంగా సత్యన్నారాయణ ఇరవైసార్లు చీర లాగేస్తాడు. ఇంకో పదిసార్లు జాకెట్ చించేస్తాడు! ఎడిటింగ్ లోపమేమో మనకి తెలీదు!

వరస్ట్ రేప్ సీన్ - 'బంగారు సంకెళ్ళు'లో గుమ్మడి రేప్. గుమ్మడి ఇబ్బందిగా, దిగులుగా జమున చెయ్యి పట్టుకుంటాడు. జమున ఏదో అంటుంది. తరవాత గుమ్మడి క్లోజ్అప్. అది ఏడుపో, నవ్వో అర్ధం కాని ఒక విచిత్ర ఎక్స్‌ప్రెషన్. అప్పడిగేవాడు కూడా మొహం అంత దీనంగా పెట్టలేడు.

ఇంకో వరస్ట్ రేప్ - 'అంతా మన మంచికే'లో చూడొచ్చు. ఒక రౌడీగాడు బయ్యంబయ్యంగా భానుమతి చేతిని సెకనులో పదోవంతుసేపు పట్టుకుంటాడు. భానుమతి వాణ్ని ఈడ్చి ఒక్క తన్ను తంతుంది, అంతే! వాడింక లేవడు! అంత పిరికి సన్నాసికి రేపెందుకో మనకి తెలీదు.

ఒక ఆరోగ్యంగా వున్న స్త్రీని ఒక్కడే మగాడు రేప్ చెయ్యడం అసాధ్యం అని ఫోరెన్సిక్ మెడిసిన్లో చదివి బిత్తరపోయ్యాను. అంటే ఇన్నాళ్ళూ తెలుగు సినిమావాళ్ళు నన్ను మోసం చేశారా!? లేక తెలుగు హీరొయిన్లు తమని రక్షించుకునే ప్రయత్నం చెయ్యకుండా, హీరోని ఎలివేట్ చెయ్యడానికి 'కెవ్వుకెవ్వు' మన్నారా? ఏమిటో అంతా గజిబిజి, గందరగోళం.

కాలంతో పాటు క్రమేణా రేపులు అంతరించిపోయాయి. రేపు చుట్టూతా తిరిగే కధలు చూడ్డం అలవాటు పడ్డ నాలాంటి ప్రేక్షకులూ అంతరించిపోయారు (అంటే చచ్చారని కాదు, సినిమాలు చూడ్డం మానేశారని అర్ధం). ఇవ్వాళ జనాలకి సినిమా రేపంటే యేంటో తెలీకుండాపోయింది!

ముగింపు -

ఇందాక చెప్పిన విషయాన్నే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనేది ఒక దారుణమైన నేరం. ఈ నేరం లోతుపాతులు ఫోరెన్సిక్ సైకియాట్రీ చదువుకున్న నాకు బాగా తెలుసు. ఈ రాత ఉద్దేశం - కేవలం మన సినిమా రేపుల గూర్చి సరదాగా రాయడం మాత్రమే. నథింగ్ మోర్, థాంక్స్ ఫర్ రీడింగ్!                              

Friday, 2 March 2012

గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!

నాకు బాలకృష్ణ అంటే ఇష్టం, అట్లని నేను బాలకృష్ణ అభిమానిని కాను. బజ్జీలంటే ఇష్టమేగానీ, బజ్జీలు తినను అన్నట్లు కంఫ్యూజింగ్‌గా వుందికదూ! చదువరులు నన్ను మన్నించాలి, విషయం తెలియాలంటే నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాల్సిందే!

అవి నేను గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో పదోక్లాసు చదువుతున్న రోజులు. సుబ్బారావు నాకు క్లాస్మేట్. బోర్లించిన మరచెంబు మొహంతో, గుండ్రంగా కార్టూన్ కేరక్టర్లా వుంటాడు. అప్పుడే నిద్ర లేచినట్లు మత్తుగా, బద్దకంగా వుంటాడు. రోజూ తలకి దట్టంగా ఆవఁదం పట్టిస్తాడు. నుదుటిమీదా, మెడవెనుకా ఆవఁదం మరకలు మరియూ ఆవఁదం కంపు. అంచేత సుబ్బారావు 'ఆవఁదం సుబ్బడు'గా ప్రసిద్ధుడయ్యాడు.

ఆవఁదం సుబ్బడికి చదువంటే అమితమైన ఆసక్తి. పొద్దస్తమానం పుస్తకంలోకి తీవ్రంగా చూస్తూంటాడు, సీరియస్‌గా వల్లె వేస్తుంటాడు. కానీ పాపం! సుబ్బడికి నత్రజనికీ, నక్షత్రానికీ తేడా తెలీదు. గాంధీ గోడ్సే అన్నదమ్ములంటాడు. అమీబాకీ అమెరికాకి యేదో సంబంధం వుందని అనుమానిస్తాడు. సహజంగానే సుబ్బడికీ యేనాడూ పదిమార్కులుకూడా రాలేదు.

డబుల్ డిజిట్స్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న మా సుబ్బడు, వున్నట్టుండి ఒకసారి సైన్స్‌లో పాసైపొయ్యాడు! నాపక్కనున్నవాడు కూపీలు లాగడంలో సిద్ధహస్తుడు. క్షణకాలంలో సుబ్బడి ఆన్సర్ షీట్‌ని స్కాన్ చేసేశాడు. సుబ్బడు ఆన్సర్ షీట్ పాసయ్యేంతగా లేదనే రహస్యాన్ని నాచెవిలో వూదాడు.

మాకు సైన్స్ టీచర్ పరిమి ఆంజనేయశర్మగారు. ఆయన తెల్లగా, లావుగా, చిరుబొజ్జతో.. తెల్లని పంచె, లాల్చీతో.. పొడుగుజుట్టుతో.. కూనిరాగాలు తీస్తుంటారు. ఆయన పిల్లల్లో పిల్లాడు. అంచేత సరదాగా, హాయిగా పిల్లలతో కలిసిపొయ్యేవారు. అయన విద్యార్ధుల పట్ల మొరటుగా ప్రవర్తించరు, కనీసం పరుషంగానైనా మాట్లాడరు.

ఆంజనేయశర్మగారు సైన్సు పాఠాన్ని ఒక కథలాగా చెప్తారు, ఆ విధానం చాలా అసక్తిగా వుంటుంది. వారు నోట్సులకి వ్యతిరేకి, టెక్స్ట్‌బుక్స్ మాత్రమే చదవాలి. పాఠం అయ్యాక మేం డౌట్లు అడగాలి, ఆ డౌట్ల నివృత్తి కోసం క్లాసు చివర్లో కొంతసమయం కేటాయించుకునేవారు. ఈ ప్రశ్నలు సమాధానాల సెషన్ చాలా ఉత్సాహభరితంగా, వివరణాత్మకంగా వుంటుంది. అంతే! పాఠం అయిపోయింది, ఇంకేం లేదు. ఇదే మా మాస్టారి బోధనాపధ్ధతి.

మాకాయన బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను ప్రభుత్వ గ్రంధాలయంలో చందమామ రెగ్యులర్‌గా చదివేవాణ్ని, అక్కడ పాత చందమామలు సంవత్సరాల వారిగా హార్డ్‌బౌండ్ చేసి ర్యాకుల్లో నీట్‌గా సర్ది వుంచేవాళ్ళు. ఆ చందమామలు నాకు విందుభోజనంతో సమానం. మాస్టారుకి నా చందమామల పిచ్చి తెలుసు. అంచేత క్లాసులో నాతో పిల్లలకి చందమామ కథలు చెప్పించేవారు. గమ్మత్తేమంటే పిల్లలతోపాటు ఆయనకూడా శ్రద్ధగా నా కథలు వినేవారు! ఒక కథని వినేవాళ్ళకి ఆసక్తిదాయకంగా వుండేందుకు నాటకీయంగా ఎలా చెప్పాలో కూడా టిప్స్ ఇచ్చేవారు.

సరే! మనం మళ్ళీ మన ఆవఁదం సుబ్బడి మార్కుల విషయానికొద్దాం. సుబ్బడికి పొరబాటున మార్కులు ఎక్కువేసిన విషయం ఆయన దృష్టికి తీసికెళ్ళాను. ఆయన చిన్నగా నవ్వారు, ఆ తరవాత ఒకక్షణం ఆలోచించారు. ఆపై రహస్యం చెబుతున్నట్లు లోగొంతుకతో ఇలా అన్నారు -

"ఒరే నానా! ఎప్పట్లాగే నీకు మంచిమార్కులు వచ్చాయిగదా. సుబ్బారావుతో నీకు పోటీ ఏంటి నానా? పాపం! ఆ వెధవాయ్ మార్కుల కోసం తెగ కష్టపడుతున్నాడు నానా. ఇంతకు ముందుకన్నా చాలా ఇంప్రూవ్ చేశాడు. వాడినిప్పుడు పాస్ చెయ్యకపోతే అసలు చదువు మీదే ఇంట్రస్ట్ పోతుంది. ఈ సంగతి వాడికి తెలీనీకు నానా, తెలిస్తే హర్టవుతాడు." ('నానా!' అనేది మాస్టారి ఊతపదం.)

నాకప్పుడర్ధమైంది. గురువుగారు పేపర్ దిద్దడంలో కేవలం పరీక్షల కోణం మాత్రమే కాకుండా ఇతర అంశాల్ని కూడా అలోచిస్తారని! నేను మా గురువుగారికి శిష్యుణ్ని. అంచేత ఆయన ఆలోచనా సరళిని అనుకరిస్తాను. సుబ్బడువంటి కష్టజీవులపట్ల సానుభూతి, ఆదరణ, ప్రేమ కలిగి ఉండాలని వారి దగ్గరే నేర్చుకున్నాను.

ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ దగ్గరకొద్దాం. బాలకృష్ణంటే నాకెందుకు ఇష్టమో ఇప్పుడు మీకర్ధమైయ్యుంటుంది. బాలకృష్ణ డాన్స్ చేసే విధానం చూడండి. అందులో నాకు ఎంతో సిన్సియారిటీ కనిపిస్తుంది. ఎంతో కష్టపడి శరీరభాగాల్ని కదుపుతూ, ఆయాసపడుతూ, చిన్నప్పుడు మనం డ్రిల్ క్లాస్‌లో పడ్డ కష్టాలన్నీ పడతాడు. అతని పట్టుదల చూడ ముచ్చటగా వుంటుంది.

సినిమా రంగంలో కమల్ హాసన్, ప్రభుదేవా వంటి మంచి డ్యాన్సర్లు వున్నారు. వాళ్ళు వంకర్లు తిరిగిపోతూ డ్యాన్సులేస్తారు. ఇదేమంత విశేషం కాదు, విశేషమంటే బాలకృష్ణ డ్యాన్సే. ఆవఁదం సుబ్బడు పదిమార్కులు దాటడానికి పడ్డ తపన, శ్రమ నాకు బాలకృష్ణ డ్యాన్స్ చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది!
                               
బాలకృష్ణ డైలాగుల్ని గమనించండి. అతనిలో తండ్రి గంభీరత, స్పష్టత, నైపుణ్యతలు లేశమాత్రమైనా లేవు. కానీ ఎంతో కష్టపడతాడు, శ్రమిస్తాడు. హోటల్ కార్మికుడు  పిండి రుబ్బినట్లు, కూలీవారు రాళ్ళు పగలకొట్టేట్లు.. అత్యంత ప్రయాసతో సంక్లిష్టమైన పదాలు, వాక్యాలు పలుకుతుంటాడు. గుండె ఆపరేషన్లు చేసే తండ్రికి పుట్టినందువల్ల కనీసం కాలు ఆపరేషనైనా చేద్దామనే తపన, ఆరాటం నాకు బాలకృష్ణలో కనిపిస్తుంది. ఎవరిలోనైనా ఈ గుణాన్ని మనం మెచ్చుకోవలసిందే.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కొందరు మహానుభావులు తోటికళాకారుల ప్రతిభాపాటవాల్ని ఖచ్చితత్వంతో విమర్శిస్తారు. శంకరాభరణం శంకరశాస్త్రి 'శారదా!' అనే గావుకేకతో కూతురిపెళ్లిని చెడగొట్టుకున్నాడు. ఆయన చెప్పదలచుకున్న సంగతి గావుకేక లేకుండా కూడా చెప్పొచ్చు. కానీ ఆయనలా చెప్పడు, చెబితే శంకరశాస్త్రి ఎలాగవుతాడు!?

మరప్పుడు ఆ శంకరశాస్త్రి మన బాలకృష్ణతో ఏంచెబుతాడు? - "చూడు బాలయ్యా! కళ అనేది కమ్మని ఫిల్టర్ కాఫీ వంటిది. ఆ స్వచ్చమైన కమ్మని కాఫీలో నీ నటన అనబడే ఈగపడి తాగడానికి పనికిరాకుండా చెయ్యరాదు. కాఫీ ఈజ్ డివైన్ వెదర్ ఇటీజ్ ఫిల్టర్ ఆర్ ఇన్స్టంట్." అని నిక్కచ్చిగా, నిర్దయతో చెప్పేస్తాడు.

ఒక మంచిప్రయత్నాన్ని నీరుగార్చే ఎస్వీరంగారావు మార్కు ధోరణి నాకు నచ్చదు. అన్నట్లు ఎస్వీరంగారావు బాలకృష్ణ పౌరాణిక సినిమా చూస్తే ఏమంటాడు? గద పైకెత్తి పట్టుకుని, క్రోధంతో మీసం మెలిస్తూ, ఈవిధంగా గర్జిస్తాడు.

"తుచ్ఛఢింభకా! ఏమి నీ భాష? నీ భాషాహననము కర్ణకఠోరముగా యున్నది. యేమి నీ హావభావములు? వీక్షించుటకు మనసు రాకున్నది. దీన్ని నటన అందువా బాలకా? ఇది యేదైనా అగునేమో గానీ నటన మాత్రం కానే కాదు. ఓయీ భాషా హంతకా! నటనా శూన్యా! అద్భుత ప్రతిభాశాలియైన నీతండ్రి నా మదీయ మిత్రుడైన కారణాన నిన్ను ప్రాణములతో వదిలివేయుచున్నాను. నీవు ఇప్పుడే కాదు, భవిష్యత్తునందు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా డైలాగులు చెప్పజూచితివా - నా గదాదండమున నీతల వేయిచెక్కలు గావించెద. నీకిదియే నాతుది హెచ్చరిక."

అదే మా గురువుగారైతే ఏం చేసేవారు? బాలకృష్ణకి షేక్‌హ్యాండ్ ఇస్తారు, ఆప్యాయంగా కౌగిలించుకుంటారు, మెచ్చుకోలుగా భుజం తడతారు. ఆ తరవాత సంతోషంగా ఇలా అనేవారు.

"నానా బాలయ్యా! చాలా బాగా చేశావ్. నాకు నీలో పెద్దాయన కనబడుతున్నారు నానా. నీకు తొంభై మార్కులు వేస్తున్నా, ఇంకొంచెం కష్టపడు నానా. నీ తండ్రిగారి స్థాయిని తప్పకుండా అందుకుంటావ్. నువ్వు ఈసారి వందమార్కులు తెచ్చుకోవాలి నానా!"

మా గురువుగారు సహృదయులు, అమాయకులు. అందువల్ల ఆయనకి ప్రతిభ ఒకాటే కాదు, ప్రయత్నం కూడా గుమ్మడికాయంత సంతోషాన్నిస్తుంది. గురువుగారి ప్రోత్సాహంతో ఆవదం సుబ్బడు తీవ్రంగా, ఘోరంగా, బీభత్సంగా తపస్సు చేసి అత్తెసరు మార్కులతో పదోక్లాసు గట్టెక్కాడు. అటుపిమ్మట ఉన్నతోద్యోగంలో ఉన్న తన మేనమామ సాయంతో ఒక ప్రభుత్వ చిరుద్యోగిగా రూపాంతరం చెంది జీవితంలో సెటిల్ అయిపోయ్యాడు.

మా గురువుగారి శిష్యులు డాక్టర్లు, ఇంజనీర్లు చీమల్లా, దోమల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మేం ఆంజనేయశర్మగారి దగ్గర పాఠాలు నేర్చుకోవడం మా జీవితాల్లో ఒక చెరగనిముద్ర వేస్తాయని మాకు అప్పుడు తెలీదు (కొన్ని అనందాలు అనుభవిస్తున్నప్పుడు తెలీదు). నాదృష్టిలో ఆయన మాఅందరికన్నా ఆవదం సుబ్బడికే ఎక్కువ సహాయం చేశారు.

ప్రతిభ అనేది యాంత్రికంగా పాఠ్యాంశాల మనన కార్యక్రమాల ద్వారా మాత్రమే నిర్ణయించకూడదనీ, కష్టపడే తత్వాన్ని ప్రోత్సాహించాలనీ, పరుగు పందెంలో కుందేలుకి, తాబేలుకి డిఫరెంట్ యార్డ్‌స్టిక్ వుండాలనీ మా గురువుగారి అభిప్రాయం.

ముగింపు -

శ్రీ పరిమి ఆంజనేయశర్మ గారు.
సైన్స్ మరియు లెక్కల అధ్యాపకులు.
శ్రీ మాజేటి గురవయ్య హై స్కూల్, గుంటూరు.
డెబ్భై మరియు ఎనభయ్యవ దశకంలో మాలాంటి ఎందరికో స్పూర్తిప్రధాత.

మా గురువుగారి గూర్చి రాస్తూపొతే చదువరులకి విసుగనిపించవచ్చు. అంచేత నాకిష్టమైన, అలవాటైన విద్య - సినిమా సంగతుల్ని కలిపి రాశాను. అందుకోసం ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ గూర్చి రాశాను, అతని అభిమానులు సరదాగా తీసుకోగలరని నా నమ్మకం.