Tuesday, 13 March 2012

తెలుగు సినిమాల్లో రేపుల కామెడీ

కథలు చదివేవాళ్ళని పాఠకులు అంటారు, వీళ్ళకి చదవడం రావాలి. సినిమా చూసేవాళ్ళని ప్రేక్షకులు అంటారు, వీళ్ళకి చదువుతో పన్లేదు. మన తెలుగువాళ్ళల్లో చదువుకున్నవారి సంఖ్య తక్కువ కాబట్టి, సినిమా వ్యాపారం కాబట్టి, మెజారిటీ (చదువుకోనివాళ్ళు)ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారు. కారణం - వీళ్ళకి నచ్చితేనే సినిమా అనే వ్యాపారంలో లాభాలొస్తయ్ కాబట్టి.

మరి సినిమాలకి ఎంతో ముఖ్యుడైన ఈ ప్రేక్షకుడు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే వేదిక వుందా? లేదని నేననుకుంటున్నాను. వున్నట్లైతే ఒక సినిమా గూర్చి - 'ఎన్టీవోడు రాజనాలతో ఫైటింగ్ ఇరగదీశాడు', 'ప్రేమనగర్‌లో లేలే నారాజా పాట కోసం సిన్మా మూడుసార్లు చూశా. డ్యాన్స్ అదరహో!' తరహా అభిప్రాయాలు వినబడేవి.

ఇవ్వాళ్టి ఈ రాత ఉద్దేశం - అటువంటి వేదిక లేని లోటు తీరుద్దామనే గొప్ప ఆలోచన! నిజజీవితం వేరు, సినిమా తెర వేరు. రెంటికీ కిలోమీటర్లు దూరం వుంది. ఉదాహరణకి రేప్ లేక అత్యాచారం అన్న టాపిక్ తీసుకుందాం. నిజజీవితంలో రేప్ అన్నది అత్యంత క్రూరమైన, దుర్మార్గమైన నేరం. అయితే తెలుగు సినిమాలకి సంబంధించి రేప్ నేరం కాదు, ఒక వినోద సాధనం. ఈ నేరాన్ని ఒక ఫైటింగు సీన్లా, ఒక ఐటం సాంగులా - రేప్‌ని బాక్సాఫీస్ ఫార్ములాగా వాడుకుంటారు.

రేప్ సినిమాల్లో హీరోకి వికలాంగురాలైన ఓ చెల్లెలు. మంచి పెర్సనాలిటీ వున్న ఆ అమ్మాయికి హీరో గోరుముద్దలు తినిపిస్తూ 'ఓ చెల్లి! నా చిట్టి తల్లి' అంటూ ఘంటసాల గొంతు అరువు తెచ్చుకుని పాటలు పాడుతుంటాడు. ఆ అమ్మాయికి సినిమాలో ఒక రేప్ సీన్ రెడీగా వుందనీ, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటుందనీ హీరోకి తప్ప థియేటర్లో అందరికీ తెలుసు. రేప్ సీన్ మొదలవగానే హాల్లో ఈలలూ, చప్పట్లూ! రేప్ సీన్ అయిన వెంటనే కొందరు బయటకి వెళ్లిపొయ్యేవాళ్ళు.

రేప్ సీన్ల వీక్షక స్పెషలిస్ట్ అయిన నా మిత్రుడొకడు ఓసారి తన రేప్ సీన్ల కోరికలు వెలిబుచ్చాడు. ముందే ఓ గంటపాటు కొన'సాగే' రేప్ సీన్ చుట్టేసి, ఆ సీన్ ని సెన్సారోళ్ళు ఒప్పుకుంటే - ఆ తర్వాత ముందువెనుకలు ఏదోక కధని అతికించే సౌలభ్యమున్నట్లయితే బాగుంటుంది! హాలు బయట 'హౌస్ ఫుల్' బోర్డులాగా, హాల్లో ఫలానా టైముకి రేప్ సీనుంటుంది అనే బోర్డు గనక పెట్టిచ్చినట్లయితే - హీరోగారు ఆయన చెల్లెలిగారి మమతలూ, అనురాగాలూ తాలూకా సీన్లు చూసే శిక్ష తప్పుతుంది!

మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనే ఒక దుర్మార్గమైన నేరం సినిమాల్లో బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపొయ్యింది. ఇప్పుడు నేరాసేదంతా సినిమా రేపులగూర్చి మాత్రమే. అంచేత చదువరులు దీన్నొక సరదా రాతగా మాత్రమే భావించ మనవి.

సినిమావాళ్ళకి ఒక నటి శరీరాన్ని ఎక్స్పోజ్ చెయ్యడానికి రేపుని మించిన అవకాశం లేదు, అందుకే వాళ్ళు రేప్ సీన్లని విపులంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారు. మన తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు రావట్లేదని ఏడ్చేకన్నా, ఉత్తమ రేప్ సీన్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా చాలా అవార్డులు వచ్చేవని నా నమ్మకం.

ఎంతైనా ఆ రోజులే వేరు. రేపుల్లో ఎంత క్రియేటివిటీ! మన ఆనందం కోసం కొండల్లో, గుట్టల్లో.. ఎండనకా వాననక సత్యన్నారాయణ, ప్రభాకరరెడ్డి, రాజనాలలు ఎంత కష్టపడి రేపులు చేశారు! పాపం! కానిస్టేబుల్ సెలక్షన్ల కోసం పరిగెత్తినట్లు మైళ్ళకొద్దీ పరిగెత్తేవాళ్ళు. సత్యన్నారాయణ చాలా ఫేమస్ రేపిస్ట్. ఎందుకనో మొదట్నించి రాజనాల మొహంలో రేప్ ఫీలింగ్స్ పలకవు, అప్పుడుకూడా కత్తియుద్ధం చేస్తున్నట్లు మొహం క్రూరంగా పెడతాడు.

రేప్ సీన్లో నటించడం అంత వీజీ కాదు. దట్టమైన మేకప్ పూసుకుని, ఆర్క్ లైట్ల వేడిని తట్టుకుంటూ.. అంతమంది మధ్యన కళ్ళల్లో కామం చూపించడం ఎంత కష్టం! నామాట నమ్మరా? యేదీ, మహానటుడు చిత్తూరు నాగయ్యని ఒక రేప్ సీన్లో నటించమనండి చూద్దాం! ఆయనకి తన లిమిటేషన్స్ తెలుసు గనకనే కష్టమైన రేపుల జోలికి పోకుండా, సులభమైన భక్తిపాత్రలు వేసుకున్నాడు.

ఇప్పుడు సినిమా రేపుల గూర్చి కొన్ని నా రీసెర్చ్ ఫైండింగ్స్. అసలు తెలుగు సినిమాల్లో రేపులు ఎందుకు ఎలా మొదలయ్యాయి? అందుక్కారణం పాత సినిమా హీరోయిన్లేనని నా అభిప్రాయం! సినిమా తొలినాళ్ళలో విలన్లు హీరోయిన్లని ఘాటుగా ప్రేమించారు, వారి ప్రేమని పొందడానికి తహతహలాడారు. పాపం వాళ్ళసలు రేపుల జోలికే పోలేదు. ఇందుకు ఉదాహరణలు చాలానే వున్నాయి.

కెవిరెడ్డి దర్శకత్వం వహించిన 'జగదేకవీరుని కథ'లో రాజనాల రాజు. బి.సరోజాదేవిని చూసి మనసు పడ్డాడు. కొత్తమంత్రి సియస్సార్‌తో కలిసి ఎన్నో ప్లాన్లేస్తాడు! ఎన్నో తిప్పలు పడతాడు! 'ప్రెగ్గడ! హే పాదరాయ ప్రెగ్గడా' అంటూ మంత్రి సాయంతో సరోజాదేవి దృష్టిలో పడ్డానికి రాజనాల చెయ్యని ప్రయత్నం లేదు. చివరాకరికి ఆడవేషం వేశాడు, తన్నులు తిన్నాడు. బి.సరోజాదేవి మాత్రం తన చిలక పలుకులతో రామారావునే ప్రేమించింది కాని రాజనాలని కన్నెత్తి చూళ్ళేదు, ఇది చాలా అన్యాయం!

మళ్ళీ కెవిరెడ్డి సినిమానే ఉదాహరణ. ఆర్.నాగేశ్వరరావు దొంగే కావచ్చు, తాగుబోతే కావచ్చు. కానీ - 'దొంగరాముడు'లో సావిత్రిని ఘోరంగా ప్రేమించాడు. కసాయివాడే కానీ సావిత్రితో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ ఆ మహాతల్లి ఏంచేసింది? 'రావోయి మాఇంటికి' అంటూ పాట పాడి నమ్మకద్రోహం చేసింది. ఆరడుగుల ఆర్.నాగేశ్వరరావు ప్రేమకి వెన్నుపోటు పొడిచింది, చివరికి జైల్లో వేయించింది. ఇది మిక్కిలి గర్హనీయము.

కెవిరెడ్డి మహాదర్శకుడు, ఆయన సినిమాల్లోనే ఎంతో అన్యాయానికి గురయ్యారు మన విలన్లు. ఇంక బుద్ధున్న యే విలనైనా హీరోయిన్లనీ, హీరో చెల్లెళ్ళనీ యెలా నమ్ముతాడు? అంచేత కాన్ఫిడెన్సు కోల్పోయి, ప్రేమ విషయాల్లో హీరోల్తో పోటీపడి నెగ్గుకు రాలేమని విలన్లందరూ మూకుమ్మడిగా డిసైడైపొయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో రేపుల వైపు మళ్ళారు (దుఖంతో గొంతు పూడుకుపోతుంది ఒక్కక్షణం విరామం).

ఇప్పుడు ద బెస్ట్ అండ్ ద వరస్ట్ రేప్ సీన్స్! బెస్ట్ రేప్ - 'డబ్బుకు లోకం దాసోహం'లో సత్యన్నారాయణ రేప్. డిస్కవరీ చానెల్లో లేడి వెంట పులి పడినట్లు వై.విజయ వెనక గంటసేపు పరిగెత్తుతాడు. ఆవిడ చీరని లాగేస్తాడు, తరవాత ఆవిడ మళ్ళీ ఫుల్ చీరతో పరిగెడుతుంటుంది! మళ్ళీ లాగేస్తాడు, మళ్ళీ ఫుల్ చీర! ఈవిధంగా సత్యన్నారాయణ ఇరవైసార్లు చీర లాగేస్తాడు. ఇంకో పదిసార్లు జాకెట్ చించేస్తాడు! ఎడిటింగ్ లోపమేమో మనకి తెలీదు!

వరస్ట్ రేప్ సీన్ - 'బంగారు సంకెళ్ళు'లో గుమ్మడి రేప్. గుమ్మడి ఇబ్బందిగా, దిగులుగా జమున చెయ్యి పట్టుకుంటాడు. జమున ఏదో అంటుంది. తరవాత గుమ్మడి క్లోజ్అప్. అది ఏడుపో, నవ్వో అర్ధం కాని ఒక విచిత్ర ఎక్స్‌ప్రెషన్. అప్పడిగేవాడు కూడా మొహం అంత దీనంగా పెట్టలేడు.

ఇంకో వరస్ట్ రేప్ - 'అంతా మన మంచికే'లో చూడొచ్చు. ఒక రౌడీగాడు బయ్యంబయ్యంగా భానుమతి చేతిని సెకనులో పదోవంతుసేపు పట్టుకుంటాడు. భానుమతి వాణ్ని ఈడ్చి ఒక్క తన్ను తంతుంది, అంతే! వాడింక లేవడు! అంత పిరికి సన్నాసికి రేపెందుకో మనకి తెలీదు.

ఒక ఆరోగ్యంగా వున్న స్త్రీని ఒక్కడే మగాడు రేప్ చెయ్యడం అసాధ్యం అని ఫోరెన్సిక్ మెడిసిన్లో చదివి బిత్తరపోయ్యాను. అంటే ఇన్నాళ్ళూ తెలుగు సినిమావాళ్ళు నన్ను మోసం చేశారా!? లేక తెలుగు హీరొయిన్లు తమని రక్షించుకునే ప్రయత్నం చెయ్యకుండా, హీరోని ఎలివేట్ చెయ్యడానికి 'కెవ్వుకెవ్వు' మన్నారా? ఏమిటో అంతా గజిబిజి, గందరగోళం.

కాలంతో పాటు క్రమేణా రేపులు అంతరించిపోయాయి. రేపు చుట్టూతా తిరిగే కధలు చూడ్డం అలవాటు పడ్డ నాలాంటి ప్రేక్షకులూ అంతరించిపోయారు (అంటే చచ్చారని కాదు, సినిమాలు చూడ్డం మానేశారని అర్ధం). ఇవ్వాళ జనాలకి సినిమా రేపంటే యేంటో తెలీకుండాపోయింది!

ముగింపు -

ఇందాక చెప్పిన విషయాన్నే మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను. నిజజీవితంలో రేప్ అనేది ఒక దారుణమైన నేరం. ఈ నేరం లోతుపాతులు ఫోరెన్సిక్ సైకియాట్రీ చదువుకున్న నాకు బాగా తెలుసు. ఈ రాత ఉద్దేశం - కేవలం మన సినిమా రేపుల గూర్చి సరదాగా రాయడం మాత్రమే. నథింగ్ మోర్, థాంక్స్ ఫర్ రీడింగ్!                              

29 comments:

  1. "పూర్తి ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ని సింగిల్ మగాడు రేప్ చెయ్యడం అసాధ్యం అని ఫోరెన్సిక్ మెడిసిన్లో చదివి బిత్తరపోయ్యాను." You remember your Forensic science well!!! This paragraph and the sentence stating that women can live, though raped are the high lights of your write up! కాదేదీ కవిత కనర్హం లాగా, కాదేదీ బ్లాగు రాత కనర్హం!!! Well written.

    ReplyDelete
  2. మీ పోస్ట్ లన్నింటి లోనూ ఇది అత్యుత్తమంగా నవ్వించింది. భలేగా ఉంది

    ReplyDelete
  3. తెలుగు బ్లాగుల సమాహారాలయిన కూడలి, మాలికలు 80 శాతం ఎందుకూ పనికిరాని 'చెత్త వార్తల' బ్లాగులతో నిండిపోయి.. సగటు తెలుగు బ్లాగరు బ్లాగు సమాహారాల వైపు చూడాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో మీ పోస్టులు ఎడారిలో ఒయాసిస్ లాంటివి డాక్టరుగారు.

    ఈ మధ్యకాలంలో చదివిన అత్యంత ఆహ్లాదకరమయిన పోస్టు ఇది. మీ క్రియేటివిటీకి హేట్సాఫ్!!!

    ReplyDelete
  4. ఎవరక్కడ,

    ఎవరో డాక్టరు గారట, రేపుల మీద టపా కట్టా రట. వెంటనే వెళ్లి ధర్నా చేద్దారి.. టపా మూట కట్ట నిద్దాం.

    పదండి ముందుకు
    పదండి తోసుకు
    పదండి పోదాం పై పైకి !

    (ముళ్ళు ఆకు మీద పడ్డా , ఆకు ముళ్ల మీద పడ్డా ముళ్లకే నష్టం ! ప్చ్!)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. చాలా సరదాగా రాశారు. ఆరోజుల్లో సినేమా వాల్ పోస్టర్లలో హీరొ చెల్లెలు ఎవరా అని వెతుకుతూ ఉండేవాడిని:). ఇంకొక విషయమేమిటంటె 1980 వచ్చేసరికి హీరొ ప్లాపు సినెమాలతో కొట్టు మిట్టాడుతూంటే అతని సినేమాలో విధిగా,మొతాదుకు మించి ఈ సీను పెట్టేవారు. పరుచూరి బ్రదర్స్ -బి. గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతిధ్వని, కలేక్టర్ గారి అబ్బాయి, పదహారేళ్ళ వయసు సినేమాలు మీటపా చదువుతుంటే గుర్తుకు వచ్చాయి.

    ReplyDelete
  6. "బాదరాయణ ప్రగ్గడా.." అండీ. :)

    ReplyDelete
  7. @TJ "Gowtham" Mulpur,

    మన కబుర్లే టపాగా రాశాను. నీకెందుకు బాగుండదు బ్రదర్!

    ReplyDelete
  8. @Chandu S,

    థాంక్యూ!

    మీకు బాగుండడం నాకు గొప్ప రిలీఫ్!

    ReplyDelete
  9. తెలుగు సినిమాల్లో రేప్ సీనులు ఉండేవి అనడం వాస్తవాలేనా. ప్రేక్షకులు, బ్లాగరు రమణ గారు అబద్దం చెప్పరా?



    పూర్తిగా యరమణ గారి టపా బేస్ మీద ఇలాంటివి నమ్మకూడదన్నది ముమ్మాటికీ నిజం.


    సినిమాల్లో రొమాంటిక్ సీనులు ఉన్న మాట నిజమే అయినా, ఇలాంటి నకిలీ రొమాంటిక్ సీనులు ఉన్నాయన్నది కూడా అంతే నిజం.వాటిని రేప్ శీను లు అని నిరుపించిండం లో రమణ గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి , ఈ టపా నకిలీ టపా అని కేసు పెట్టడం అయ్యింది.


    ఎవరైనా తెలుగు సినిమాల్లో రేపు శీను లు ఉన్నాయని నిరూపిస్తే వాళ్ళు కుడా నకిలీ ఏ అన్న మాట :)

    ReplyDelete
  10. ఇంత వివరంగా వ్రాసిన మీరు అసలు వ్యక్తి గురించి వ్రాయలేదు.

    ఆయనే రేపుల చలపతిరావు.

    గుండెపోటుకి గుమ్మడి ఎంత ఫేమస్సో, రేపులకి ఈయన అంత ఫేమస్.

    ReplyDelete
  11. @జీడిపప్పు,

    ధన్యావాదాలండి.

    బ్లాగ్ ఎగ్రెగేటర్ల గూర్చి మీ వ్యాఖ్య నూటికి నూరు పాళ్ళు నిజం. అందుకే నేను వాటిని చూడ్డం మానేశాను.

    ReplyDelete
  12. జిలేబి గారు,

    అసలే ఎండలు మండిపోతున్నాయి. మీరు ధర్నాలు గట్రా చేసి అలిసిపోకండి.

    అయినా మీరు పిలవంగాన్లే ధర్నా కోసం ఊరికే వచ్చేస్తారా ఏమిటి! (ఏ మాత్రం ఖర్చు పెట్టగలరు? ఎంత మంది కావాలి? ఎంత సేపు స్లోగన్లు ఇవ్వాలి?.. )

    ReplyDelete
  13. @srinivas,

    ధన్యవాదాలు.

    సినిమా వాళ్ళు మహామేధావులు. జనాలక్కావల్సింది వండి వార్చడంలో సిద్ధహస్తులు.

    ReplyDelete
  14. రమణ గారూ, చాలా దారుణం మండీ, నేను clean U certificate కేసులలో అందమయిన దృశ్యాలు కత్తిరించడం , మ్యుట్ చెయ్యడం లాంటివి విన్నాను కానీ ఇలా మరీ దారుణంగా రేప్ దృశ్యాలు వినలేదు. ఏమిచేస్తాం, ప్రజలు clean U certificate దుర్వినియోగం ప్రతీ సంవత్సరం పెరుగుతునే ఉన్నా.. అర కొర సీనులే కదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ దృశ్యాల ను చిత్రీకరించిన దర్శకుడు ఎవరి కోసం శ్రమను వదలాలి, సంఘం కోసమా, ఇజాల కోసమా, లేక స్త్రీజనోద్దరణకు కంకణం కట్టుకున్న ఆదర్శపురుషుల తృప్తి కోసమా? ప్రతీ వ్యక్తికీ న్యాయం దొరకడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్న విషయాన్ని వీరు ఎలా మరుస్తారో అర్థం కాదు.



    99,181.6>>>>>>>>>>>>>……>>>>> 181.4 Lets abolish sensor board!! :-) దీని ద్వారా మీరు చెప్పాలనుకున్నది అర్థం చేసుకుంటే .. కనీసం కొద్ది మందైనా ఆలోచిస్తారేమో. తక్కువా, ఎక్కువా అన్నది కాదు ముఖ్యం, తెలుగు సినిమా కు న్యాయం దొరకడం అన్నది ముఖ్యం అని.

    ReplyDelete
  15. @Mauli,

    నేను నా పాత టపాల్లో చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నాను.

    సినిమావాళ్ళు సినిమాలని డబ్బు చేసుకోడానికి తీస్తారు. వాళ్ళకి కావల్సింది డబ్బు.

    మనం మన స్టూడెంట్ లైఫ్ లో స్నేహితులతో పాటు కేవలం సరదా కోసం సినిమాలు చూస్తాం. మనకి కావల్సింది టైం పాస్.

    ఈ ప్రాసెస్ లో నేను పరమ చెత్త సినిమాలు చాలానే చూశాను. రామారావు నడ్డి తిప్పుతూ వేసిన స్టెప్పులు ఎంజాయ్ చేశాను. నాగేశ్వర్రావు తగరపు కోట్లు, ఎర్ర విగ్గులు భలే కామెడీగా ఉండేవి.

    గత రెండు దశాబ్దాలుగా సినిమా చూడని నాకు.. ఈ ఏరియా కేవలం ఒక nostalgia మాత్రమే! అవి రేపు సీన్లయినా.. భక్తి పాటలయినా..!!

    కావున చివరాఖరికి నే చెప్పొచ్చేదేమనగా.. నా మటుకు నాకు శంకరాభరణం, డబ్బుకు లోకం దాసోహం సినిమాలు ఒకటే!

    thanks to telugu cinima.

    ReplyDelete
  16. @bonagiri,

    నేను చలపతిరావు సినిమా చూళ్ళేదు.

    బహుశా నేను సినిమాలు చూడ్డం మానేశాక వచ్చిన రేపిస్ట్ అయ్యుంటాడు.

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  17. రమణ గారు, మీరు చెపుతున్నది నాకు అర్ధం అయ్యింది కాని,


    మీరేమో సంకలినులు చూడరు , నాలుగు నెలలక్రితం వ్రాసిన టపా పోస్ట్ చేసారు. ఇక్కడ ఇప్పటికే ఈ విషయమై చర్చ జరుగుతున్నది.



    విశేఖర్ గారు, ఇన్ని రేప్ సీనులు సినిమాల్లో ఉన్నాయి అంటే, శ్రీకాంత్ గారేమో మీరు చెప్పిన వాటిలో ఒకటో రెండో తప్ప మిగిలిని రేప్ సీనులే కాదు అంటున్నారు. నాకు అయితే శ్రీకాంత్ గారు చెప్పేది సబబు అనిపిస్తున్నది.



    కాబట్టి మీరు పైన రాసినవన్నీ ఏ విధం గా రేప్ సీనులో చక్కగా వివరించి నిరుపించాల్సి ఉంది :)

    ReplyDelete
  18. @MauLi,

    ఇందాక నాకు మీ వ్యాఖ్య అర్ధం కాలేదు. విశేఖర్ గారి టపా ఇప్పుడే చూశాను. వారి టపా కింద చర్చ చాలా ఉంది. చదవటానికి సమయం లేదు.

    విశేఖర్ గారు సినిమా రేపుల గూర్చి రాయ లేదు. ఆయన ఒక సామాజిక రాజకీయ కోణం నుండి రేపుల్ని విశ్లేషించారు. నేను పూర్తిగా విశేఖర్ గారిని సమర్ధిస్తున్నాను.

    ఏ దేశం లోనయినా ఒక చట్టం అమలు కావడం లో అనేక లోపాలుంటాయి. నేరాల్ని, చట్టాల్ని మనం ఒక తాత్విక కోణంలో చూడాలనుకుంటున్నాను.

    నాకు తెలిసిన కుటుంబంలో వరకట్న కేసు దుర్వినియోగం కాబడింది కాబట్టి వరకట్న కేసుల్ని కేస్ బై కేస్ అంచనా వెయ్యాలని వాదించడం సరి కాదు. మన వాదన వల్ల నేరస్తుల్ని సమర్ధించే వారిగా మిగిలిపొయ్యే ప్రమాదం ఉంది.

    అలాగే అత్యాచారాల విషయం కూడా. ఈ దేశంలో మహిళలు అనేక పోరాటాలు, ఆటుపోట్లు తరవాత కొన్ని చట్టాలు సాధించుకున్నారు. వాటిని ఒక వర్గం మహిళలు కొంత మేరకు మిస్ యూజ్ చెయ్యొచ్చు. కానీ.. వారిని ఉదాహరణగా చూపించి, ఒక వాదన ఎత్తుకోవడం బాధ్యతా రాహిత్యం.

    నిజజీవితంలో స్త్రీలపై.. ముఖ్యంగా కింది వర్గాల స్త్రీలపై జరిగే అత్యాచారాలు చాలా దారుణంగా ఉంటాయి.

    ఈ టాపిక్ మీద (తెలుగులో) రంగనాయకమ్మ, ఓల్గా, కుప్పిలి పద్మ వంటి ప్రముఖులు చాలా విస్తృతంగా రాశారు.

    నేను రాసే బ్లాగులు నా సామాజిక అవగాహనని రిఫ్లెక్ట్ చెయ్యవు. కేవలం హ్యూమర్ కోసమే రాస్తున్నాను. ఇలా రాయడాన్ని కూడా ఆపేసే ఉద్దేశ్యం ఉంది.

    ReplyDelete
  19. సినిమాల్లో "రేప్" లు ఆరంభం మీద విస్లేషణ బాగుంది.
    Very funny.

    ReplyDelete
  20. శంకరాభరణము లాంటి కళా త్మక చిత్రానికి కూడా రేపే మూలము. ఈ రేపు యొక్క శక్తి ఏమిటంటే, కొన్ని సినిమాలలో హీరొయిన్ అందరి తోటి చివరికి విలన్ తో కూడా ఫైట్ చేస్తది, కాని చివరి సీన్లో విలన్ రేప్ చేస్తుంటే తిరిగి కొట్టకుండా రక్షించ మని అరుస్తాది. దీన్ని బట్టి అర్ధమైన దేమంటే వంద ఫైట్లు చేసే హీరొయిన్ కూడా ఒక్క రేప్ కు మటాష్.

    ReplyDelete
  21. @rajasekhar Dasari,

    హ.. హ.. హా..

    ఆ రోజుల్లో 'పాపాత్ముడా! నీకు అక్కచెల్లెళ్ళు లేరా?' చాలా స్టాక్ డైలాగ్.

    నేను నా స్నేహితుల మధ్య చర్చనే రాశాను. మాకు సినిమా ఒక సరదా. ఇప్పుళ్ళా టీవీలు, కంప్యూటర్లు మాకు లేవు. ఉంటే.. చచ్చినా ఒక్క తెలుగు సినిమా చూసేవాళ్ళం కాదు.

    ReplyDelete
  22. ఏమండోయ్, డాక్టరు గారు,

    అంతే నంటారా ? ప్చ్. ధర్నాలలకి కూడా ధనం కావాల్సి వచ్చే. ప్చ్ ప్చ్

    @బోనగిరి గారు,

    మీ వ్యాఖ్య - గుండెపోటుకి గుమ్మడి ఎంత ఫేమస్సో సూపెర్బ్ !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  23. Fit subject for a Telugu University PhD.
    well done.

    ReplyDelete
  24. మానభంగం అని యుగయుగాలూ సగర్వంగా చెప్పుకోదగిన రేపును ఎనభయ్యో దశాబ్దం చివర్లో విశ్వనాథ్ చూపించారు. సూత్రధారులు సినిమాలోని ఆ రేపురాజాన్ని మానశ్రీభంగం అని గర్వంగా వర్ణించుకోవచ్చు. కేఆర్ విజయ అనబడే దేవజాతి స్త్రీపై అత్యాచారి సత్యనారాయణ పాల్పడిన ఆ ప్రక్రియను మానశ్రీమహాభంగం అన్నా తప్పులేదు. సత్యనారాయణ నిష్క్రమించిన తర్వాత అర్భకుడైన భర్త అశోక్ రావు వచ్చిన దృశ్యాన్ని విశ్వనాథ్ బాగా పండించారు. ఏంజరిగింది యశోదా అని అడిగితే... ఆనాడు కీచకుడు చెరబట్టే ప్రయత్నం చేసినపుడు భీమసేనుడు రాకుండా ఉంటే ద్రౌపదికి ఏంజరిగేదో తనకు అదే జరిగిందని చెప్తే వెయ్యి వాయులీనాలు చెవిలో విలవిలలాడాయి.

    రమణ గారూ ఇంత ఉదాత్తమైన ఘట్టాన్ని మీరు రాసిన రేపుల చరిత్రలో పొందుపరచకపోవడం అన్యాయం. 70లలో సినిమాల్లో విచ్చలవిడిగా వాడిన బలాత్కారం అనే పదాన్ని కూడా ప్రస్తావించకపోవడం మీ పురుషాహంకారానికి నిదర్శనం.

    ReplyDelete
  25. @thanniva Vishala,

    మీరు నన్ను క్షమించాలి. నేను సూత్రధారులు అన్న సినిమా చూళ్ళేదు. కాబట్టి నాకు తెలీదు.

    బలాత్కారం అన్న మాట వాడకపోవడం తప్పే!

    ఏం చెయ్యను? పురుష దురహంకారం లోంచి బయట పడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను! ఒక్కోసారి తొడుక్కున్న విలువల ముసుగులు జారిపోతుంటయ్! మీరు నన్ను ఇంకోసారి క్షమించాలి!

    ReplyDelete
  26. డాక్టర్ గారు, మీరు పురుష దురహంకారం అని అంట్టున్నారు, కాని ఫెమినిస్ట్లులు అనేది పురుష అహంకారం.

    విశ్వనాథ్ గారు తీసిన సినేమాలలో స్వాతి ముత్యంలో గొల్లపుడి మారుతి రావుగారు రాధిక మీద చేయబోయిన మానభంగాయత్నం మరపురానిది. తెల్లగా,సన్నగా, సంస్కారయుతంగా కనిపించే గొల్లపుడి గారు సిగరేట్ తాగుతూ, మాంచి కొబ్బరిబోండాం లాగా ఉండే రాధిక దగ్గరికి వచ్చి, శివయ్యగారు ఇంట్లో లేరమ్మ అని అంట్టూ, స్రీ అంటే ఎవరు ప్రకృతి,ప్రకృతి అంటే ఎవరు స్రీ, స్రీ యే ప్రకృతి, ప్రకృతి స్రీ అంట్టూ చేయిపట్టుకోవటం , సీన్ భలే కామేడిగా ఉంట్టుంది.

    ReplyDelete
  27. కొంచెం ఆలస్యం గా చదివాను..కేక! నాదొక ధర్మ సందేహం! ఫోరెన్సిక్ గా లేదంటున్నారంటే..ఇంతకీ రేప్ అనేది ఉన్నట్లా లేనట్లా?

    ReplyDelete
  28. @Rama,

    అవునా! నేను స్వాతిముత్యం సినిమా సగం నించి చూశాను. ఆ సగానికే తల బొప్పి కట్టింది. మీరు చెప్పిన సన్నివేశం గుర్తు లేదు.

    నా 'దుర' విశేషణాన్ని విత్ డ్రా చేసుకుంటున్నాను!

    ReplyDelete
  29. బొందలపాటి గారు,

    సావిత్రి, దేవిక, కె.ఆర్.విజయ వంటి బలాడ్యులని ప్రభాకరరెడ్డి ఒక్కడే ఏమీ చెయ్యలేడు! పైగా.. చావు దెబ్బలు తిని.. ICU లో చేరతాడు.

    నిజ జీవితంలో రేప్ అనేది ఒకడు కన్నా ఎక్కువ మంది కలిసి చేస్తారు. ఒక్కడే అయితే ముందుగా ఆ యువతిని తీవ్రంగా గాయ పరిస్తేనే సాధ్యం. అందుకే victims చచ్చిపోతుంటారు.

    రేప్ అనేది ఒక జెండర్ బేస్డ్ క్రూయల్టీ. సెక్సువల్ ప్లెజర్ తో పాటు సాడిజం కూడా ఉంటుంది. అందుకే చాలాసార్లు rape victims హత్య చెయ్యబడతారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.