Thursday, 29 March 2012

శాస్త్రిగారి 'పుస్తక వైద్యం'

నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్టుని. రాష్ట్ర సైకియాట్రిస్టుల సంఘానికి అధ్యక్షుడు సతీష్ బాబు నాకు మంచి స్నేహితుడు. ఇవ్వాళ ఉదయాన్నే సతీష్ దగ్గర్నుండి ఫోన్.

"హలో బ్రదర్! తెనాలిలో ఎవరో సైకియాట్రిస్ట్‌నని చెప్పుకుంటూ పేషంట్లని ట్రీట్ చేస్తున్నాట్ట. నాకా వివరాలు కావాలి. నువ్వా సంగతేంటో కనుక్కో."

"చూడు బ్రదర్! మనవాళ్ళ ఫీజుల బాదుణ్ని పేషంట్లు తట్టుకోలేకపోతున్నారు. అంచేత వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, మనకెందుకులేద్దూ." బద్దకంగా అన్నాను.

"డిగ్రీ లేకుండా వైద్యం చెయ్యడం నేరం. అర్జంటుగా తెనాలి వెళ్లి రిపోర్ట్ పంపు." అంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్.

పేషంట్లు అనేక రకాలు. యేది కావాలో, యేది అక్కర్లేదో నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. ఫలానా వైద్యవిధానం కరెక్టా కాదా అని కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇందులోని మంచిచెడ్డలు చెప్పడానికి మనమెవరం? 

నాకు జ్ఞాపకశక్తి తక్కువ, బద్ధకం ఎక్కువ. అంచేత ఈ ఫోన్ విషయం మర్చిపోయాను.

రెండ్రోజుల తరవాత మళ్ళీ సతీష్ బాబు ఫోన్ - "ఆ తెనాలి సంగతి ఎక్కడిదాకా వచ్చింది?"

"ఇంకా మొదలవలేదు." నవ్వుతూ అన్నాను.

"ఎల్లుండి కల్లా పూర్తి చెయ్యి." అన్నాడు సతీష్

"ఇది విన్నపమా? ఆజ్ఞా?" ఎన్టీఆర్ స్టైల్లో అడిగాను.

"విన్నపంగా ఇస్తున్న ఆజ్ఞ!" నవ్వాడు సతీష్.

ఆ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో తెనాలి బయల్దేరక తప్పింది కాదు.

తెనాలికి సంబంధించి యేదో అడ్రస్ చేత బుచ్చుకుని - 'ఫలానా వైద్యం చేసే వ్యక్తి ఎక్కడ?' అంటూ వాకబు చేసుకుంటూ వెళ్ళాను. చివరాకరికి ఒక పుస్తకాల షాపు ముందు తేలా! చచ్చితిని, నా మిషన్ తెనాలి ఒక 'మిషన్ ఇంపాజిబుల్' అయ్యేట్లుంది.

సతీష్‌కి ఫోన్ చేశాను - "నాయనా! నువ్విచ్చిన అడ్రెస్ పుస్తకాల షాపుది." ఎగతాళిగా అన్నాను.

"నా అడ్రెస్ కరక్టే! నీ పని పుస్తకాల షాపులోనే!" అన్నాడు సతీష్.

హతవిధీ! ఇంతజేసి నా పరిశోధన ఒక పుస్తకాల షాపు మీదా!!

అదొక పాత పుస్తకాల షాపు. అంటే పుస్తకాలు పాతవని కాదు. పుస్తకాలు కొత్తవి, షాపు మాత్రం పాతది. అక్కడ రకరకాల సైజుల పుస్తకాలు (సైజుల వారిగా) పేర్చి వున్నాయ్. స్టాకు ఫుల్లుగా ఉంది. కౌంటర్లో ఒక పాతికేళ్ళ కుర్రాడు ఉన్నాడు.

కొంచెం పక్కగా పడక్కుర్చీలో పడుకుని విసనకర్రతో విసురుకుంటున్న అరవయ్యేళ్ళ వృద్ధుడు. తెల్లని, బక్కపల్చటి ఆకారం. మరింత తెల్లని పంచె, లాల్చీ. మెళ్ళో రుద్రాక్షలు, విశాలమైన నుదుటిపై పెద్దబొట్టు. ఈ వృద్ధుని కోసమా నా పన్లు మానుకుని వచ్చింది!

పక్కన తాటికాయంత అక్షరాల్తో ఒక బోర్డ్.

'వైద్యరత్న పుచ్చా విశ్వనాథశాస్త్రి.
మానసిక వ్యాధులకి పుస్తక వైద్యం చెయ్యబడును.
కన్సల్టేషన్ ఉచితం.'

వావ్! దొంగ ఈజీగానే దొరికాశాడే! 

అక్కడ నేననుకున్నంత జనాలు లేరు. ఒక్కొక్కళ్ళుగా వచ్చి వెళుతున్నారు. నా పని గూఢాచారి 116 కాబట్టి ఒక పక్కగా నించొని ఆ వైద్యుడు కాని వైద్యుణ్ణి గమనిస్తున్నాను.

ఒక నడివయసు వ్యక్తి శాస్త్రిగారికి చెబుతున్నాడు - "అయ్యా! నేను బియ్యే చదివాను, బ్యాంక్ ఉద్యోగం. గంటసేపు కూడా నిద్ర పట్టట్లేదు."

శాస్త్రిగారు అర్ధమయినట్లు తల పంకించారు.

"దేవుడంటే నమ్మకం ఉందా?" అని అడిగారు.

"నోనో, నేను పరమ నాస్తికుణ్ణి." గర్వంగా అన్నాడు బ్యాంకు బాబు.

కౌంటర్ దగ్గర నిలబడ్డ కుర్రాణ్ణి చూస్తూ "రావుఁడూ! బుక్ నంబర్ ఫోర్టీన్." అన్నారు శాస్త్రిగారు.

రావుఁడు అని పిలవబడిన కౌంటర్లోని కుర్రాడు చటుక్కున లోపలకెళ్ళాడు, క్షణంలో ఒక దిండు కన్నా పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి శాస్త్రిగారి చేతిలో పెట్టాడు.

"ఈ పుస్తకం పదిరోజుల్లో చదివెయ్యాలి. పగలు చదవకూడదు. రాత్రి పది తరవాత టేబుల్ లైట్ వెలుతుర్లో మాత్రమే చదవండి. నిద్రోస్తే దిండు కింద పుస్తకం పెట్టుకొని పడుకోవాలి. పుస్తకం వెల వంద రూపాయలు." అన్నారు శాస్త్రిగారు.

"ఇంత లావు పుస్తకం వందరూపాయలేనా! ఇంతకీ ఈ పుస్తకం దేనిగూర్చి?" కుతూహలంగా అడిగాడు బ్యాంక్ బాబు.

"బోల్షివిక్ విప్లవానికి పదేళ్ళ ముందు లెనిన్ తన భార్యకి వెయ్యి ప్రేమలేఖలు రాశాడు. ఆ ఉత్తరాల ఆధారంగా లెనిన్ ప్రేమలోని రివల్యూషన్ స్పిరిట్ గూర్చి ఒకాయన విశ్లేషించాడు. అదే ఈ పుస్తకం." చెప్పారు శాస్త్రిగారు.

"నా నిద్రలేమికి, లెనిన్ విప్లవప్రేమకి కనెక్షనేంటి?" ఆశ్చర్యపొయ్యాడు బ్యాంక్ బాబు.

శాస్త్రిగారు సమాధానం చెప్పలేదు. కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపొయ్యారు.

ప్రశ్నలు అడగొద్దన్నట్లు సైగచేసి బ్యాంకు బాబుని పంపించాడు రావుఁడు.

కొద్దిసేపటికి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులోంచి కోటుతో ఒక కోటేశ్వర్రావు దిగాడు. పరిసరాలని ఇబ్బందిగా గమనిస్తూ, కర్చీఫ్ ముక్కుకి అడ్డంగా పెట్టుకుని, సూటు సరి చేసుకుంటూ శాస్త్రిగారిని చూసి విష్ చేశాడు.

"నేను ఈఈట్ కాన్పూర్లో చదువుకున్నాను. ఇప్పుడు అమెరికాలో పప్పీ సొల్యూషన్స్ అనే కంపెనీ నడుపుతున్నాను. పప్పీ నా భార్య ముద్దుపేరు." అని దీనంగా చెప్పాడు.

గర్వంగా చెప్పుకోవలసిన పరిచయం దీనంగా జరిగిందేమిటి!

"వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బేం చేసుకోవాలో అర్ధం కాని స్థితి. కానీ మనశ్శాంతి లేదు. అంతా గజిబిజి గందరగోళం. ఏడవాలనిపిస్తుంది, కానీ - ఏడుపు రాదు."

(పాపం! కుర్రాడు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు, వీణ్ణి ఆస్పత్రిలో పడేసి కనీసం ఓ లక్ష గుంజొచ్చు.)

శాస్త్రిగారు అర్ధమైందన్నట్లు తల ఆడించారు.

ఒక్కక్షణం ఆలోచించి రావుఁడితో "బుక్ నంబర్ ట్వెంటీ వన్." అన్నారు.

రావుడు లోపల్నించి పుస్తకం తీసుకొచ్చి కోటేశ్వర్రావు చేతిలో పెట్టాడు. అది - భగవద్గీత!

"ఈ భగవద్గీత రోజూ కనీసం గంటపాటు పారాయణం చెయ్యండి. ప్రశాంతత వస్తుంది. ఏడవాలనిపించదు, చావాలనీ అనిపించదు. పుస్తకం ఖరీదు నూటిరవై, అక్కడివ్వండి." అంటూ కళ్ళు మూసుకున్నారు శాస్త్రిగారు.

కోటేశ్వర్రావు సిగ్గుపడుతూ బుర్ర గోక్కున్నాడు.

"అయ్యా! నా చదువు చిన్నప్పట్నించి ఇంగ్లీష్ మీడియంలో సాగింది. నాకు తెలుగు చదవడం రాదు."

ఈమారు కళ్ళు తెరవకుండానే "బుక్ నంబర్ సిక్స్." అన్నారు శాస్త్రిగారు.

రావుఁడు పెద్దబాలశిక్ష తీసుకొచ్చి కోటాయన చేతిలో పెట్టి - "నూట డెబ్భై" అన్నాడు.

ఐదు నిమిషాల్లో ఇంకో నిద్ర పట్టని రోగం వాడు. ఇతను పరమ భక్తుడు. అతనికి అరవయ్యో నంబర్ పుస్తకం. ఎవడో ఒక ఉత్సాహవంతుడు వేదాలకీ, రాకెట్ సైన్సుకీ లంకె వేసి, పురాణాల మీదుగా లంగరు వేశాడు. పదివేల పేజీల పుస్తకం రాశాడు. అతనికి ఆ శాస్త్రం తాలూకా దిండు ఇవ్వబడింది. వెల ఐదొందలు.

ఒకడు మూలశంక ఉన్నవాడిలా చిటపటలాడుతూ వచ్చాడు. ఏమీ చెప్పక ముందే వాడికి బాపు కార్టూన్లు, ముళ్ళపూడి రమణ 'బుడుగు' చేతిలో పెట్టి పంపించారు.

ఇంకో 'పేషంట్'. ఆ కుర్రాడు ఏదో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట, ఉద్యోగం వస్తుందో రాదోనని భయంగా వుందిట. అతనికి 'విజయానికి వెయ్యి మెట్లు' పుస్తకం. వెల వంద రూపాయలు. ఆ పుస్తకాన్ని ఎగాదిగా చూశాడతను. 'అమ్మో! ఇన్ని మెట్లు నేనెక్కలేను, ఓపిక లేదు.' అని వేడుకున్నాడు. అలాగా! అయితే ఇంకో పుస్తకం. విజయానికి మూడు మెట్లు. ముందీ మూడు మెట్లెక్కి, తరవాత ఆ వెయ్యి మెట్లెక్కండి. వెల యాభై రూపాయలు.

నాకు శాస్త్రిగారి వైద్యం ఆసక్తిగా అనిపించింది. నేనిక ఏమాత్రం గూఢాచారిగా ఉండదలచలేదు. విశ్వనాథశాస్త్రిగారికి నమస్కరించాను. నేనెవరో పరిచయం చేసుకున్నాను. నా కార్యక్రమాన్నీ వివరించాను. శాస్త్రిగారు కుర్చీ ఆఫర్ చేశారు, కూర్చున్నాను.

ఒక్కక్షణం ఆలోచించి ప్రశాంతంగా, నిదానంగా చెప్పసాగారు.

"డాక్టరు గారు! నేను తెలుగు ఎమ్మేని. తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యాను. ఈ షాపు మా బావగారిది. అయన పోయినేడాది కాలం చేశారు. బావగారికి ముగ్గురు ఆడపిల్లలు. చెల్లి చేతిలో చిల్లిగవ్వ లేదు. అంచేత నేను ఈ షాపు నిర్వహణ బాధ్యత తీసుకున్నాను. మొదట్లో బోణీ కూడా అయ్యేదికాదు." అన్నారు శాస్త్రిగారు.

ఈలోపు ఒక బక్కపలచని వ్యక్తి దీనంగా అడిగాడు.

"అయ్యా! నా భార్య నన్ను కుక్కకన్నా హీనంగా చూస్తుంది."

రావుడు ఆ దీనుడి చేతిలో 'శతృవుని జయించడం ఎలా?' పుస్తకం పెట్టి వంద రూపాయలు తీసుకున్నాడు.

శాస్త్రిగారు చెప్పడం కొనసాగించారు.

"క్రమేపి షాపు మూసేసుకునే పరిస్థితి వచ్చింది. 'డాక్టర్ల ప్రాక్టీసులు బాగున్నయ్. మందుల షాపులు కళకళలాడుతున్నాయ్. ఆఖరికి ఆకుపసరు వైద్యులు కూడా బిజీగా ఉంటున్నారు. కానీ తెలుగునాట పుస్తకాల షాపులు మూసేసుకునే దుస్థితి ఎందుకొచ్చింది?' ఈ విషయం తీవ్రంగా ఆలోచించాను."

ఇంతలో నలుగురు వ్యక్తులు ఆటోలో ఒక యువకుణ్ణి తీసుకొచ్చారు. అతను బాగా కోపంగా ఉన్నాడు. పెద్దగా అరుస్తున్నాడు. "ఇతనికి నా వైద్యం పని చెయ్యదు. గుంటూరు తీసుకెళ్ళీ సైకియాట్రిస్టుకి చూపించండి." అని ఆ యువకుడి బంధువులకి సలహా చెప్పి పంపించేశారు శాస్త్రిగారు.

శాస్త్రిగారు తన సంభాషణ కొనసాగించారు.

"మన తెలుగువారికి సంపాదించే యావ ఎక్కువై పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిందన్న విషయం అర్ధం చేసుకున్నాను. సమాజంలో సగం రోగాలు మానసికమైనవనీ - అందుకు కారణం ఏదో సాధించేద్దామనే స్పీడు, హడావుడి వల్లనేనన్న అభిప్రాయం నాకుంది. నా మటుకు నాకు మంచి పుస్తకం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఒక పుస్తకం నాకు ఔషధం అయినప్పుడు ఇతరులకి ఎందుకు కాకూడదు? ఈ ఆలోచనల నుండి పుట్టిందే నా 'పుస్తక వైద్యం'."

"వెరీ ఇంటరెస్టింగ్. చిన్న సందేహం. ఇందాక మీరు కొన్ని లావు పుస్తకాలు ఇచ్చారు. ఎందుకు?" కుతూహలంగా అడిగాను.

శర్మగారు నవ్వారు. "నాక్కొన్ని పుస్తకాల్ని చూస్తుంటేనే నిద్రొస్తుంది. నాకు నిద్రొచ్చే పుస్తకం అందరికీ నిద్ర తెప్పిస్తుందని నా విశ్వాసం."

కొంతసేపు నిశ్శబ్దం.

"ఈ 'పుస్తక వైద్యం' చట్టవ్యతిరేకం అవుతుందంటారా?" అడిగారు శాస్త్రిగారు.

వచ్చిన పని పూర్తయింది. లేచి నిలబడ్డాను.

"పూర్తిగా చట్టబద్దం, పైగా సమాజహితం కూడా. మీ 'ప్రాక్టీస్' చక్కగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ నమస్కరించి బయటకి నడిచాను.

ఆ రోజే నా రిపోర్ట్ మా సతీష్‌కి పంపాను.

'పుస్తక వైద్యం అనేది మంచి ఆలోచన. మన సైకియాట్రిక్ సొసైటీవారు ఈ ఐడియాని మరింత విస్తృతంగా పరిశోధించి, ప్రయోగాత్మకంగా కొన్ని సెంటర్లలో అమలు చెయ్యాలని భావిస్తున్నాను. శ్రీపుచ్చా విశ్వనాథశాస్త్రి గారిని మన రాష్ట్ర సదస్సుకి ప్రత్యేక ఉపన్యాసకునిగా ఆహ్వానించి, వారి అనుభవాలని మనతో పంచుకునే విధంగా ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరుతున్నాను.'

గమనిక -

ఈ కథలో నేనూ, సతీష్ నిజం. మిగిలిందంతా కల్పితం.

39 comments:

  1. అమ్మయ్య!

    మొత్తానికి కామెంట్ బాక్స్ రోగాన్ని కుదిర్చాను.

    ఈ రోగాన్ని నా దృష్ష్టికి తెచ్చిన ఆ.సౌమ్య గారికి ధన్యవాదాలు.

    ఎంక్వైరీ చేస్తూ నాకు మెయిల్ పంపిన పాలకొల్లు కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు.

    మితృలారా,

    ఇప్పుడు మీరు నా బ్లాగులో కామెంట్లు రాయవచ్చును.

    ReplyDelete
  2. డాక్టర్ గారు ఈ రోజు పోస్ట్ బాగా ఉన్నది..ఎదో ఒక రోజు మీ డాక్టర్ మిత్రులు మీ మీద యుద్దము ప్రకటించె అవకాశం ఉంధి...జాగ్రత్త సుమా...

    ReplyDelete
  3. కధ బాగుంది. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు.

    ReplyDelete
  4. @srividyaranya,

    ధన్యవాదాలు.

    ఈ పోస్టులోని అంశం నాకు చాలా ఇష్టమైనది.

    చివర్లో విశ్వనాథశాస్త్రి చేత చెప్పించిన మాటల కోసమే ఈ కథ అల్లాను.

    బాగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డవారు.. 'చలం?.. గోపీచంద్?.. ఎవరు వీళ్ళు' అంటూ నొసలు చిట్లిస్తుంటే దిగులుగా ఉంటుంది. వీళ్ళు ఏదో ఒక రోజు డిప్రెషన్లోకి వెళ్తారని నా అనుమానం (ఆకాంక్ష!).

    నా డాక్టర్ మిత్రులు నాకన్నా చాలా మంచివాళ్ళులేండి. అందుకే నన్ను ఓపిగ్గా భరిస్తూ వస్తున్నారు!

    ReplyDelete
  5. Rao S Lakkaraju గారు,

    ధన్యవాదాలండి.

    మీరు చెప్పిన సామెత ఈ కథకి వర్తిస్తుందా?!

    ReplyDelete
  6. దరిద్రం: క్రమేపి  షాపు  మూసేసుకునే  పరిస్థితి  వచ్చింది.

    ఉపాయం: ఈ  ఆలోచనల  నుండి  పుట్టిందే  నా  'పుస్తక వైద్యం'.

    ReplyDelete
  7. దాటేరు గారు,

    మీ టపా స్ఫూర్తి తో నేను ఒక టపా కొట్టేసనండీ !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. yesterday i sent my comment to your g-mail as the comment box was not working. How good had it been a realty!

    ReplyDelete
  9. how fool i was, chadavadam start chesinappudu, adanta nijame anukunnanu, ante kadu chala ananda paddaanu, kaani chadive koddi telisindi nijam kaadani.
    :venkat

    ReplyDelete
  10. puranapandaphani గారు,

    మీ మెయిల్ text కనబడలేదు. ఏవో నంబర్స్ ఉన్నాయి. i tried to reply, but mail delivery failed. thanks for the response.

    ReplyDelete
  11. రమణ గారు,
    ఈ క్రింది వ్యాసాలను చదివేది. ఇతను మాజి ఐ.యే.యస్. అధికారి, అమేరికాలో ఎకనామిక్స్ లో పి.చ్ డి చేశారు. ఆయనకి ఉన్న బాక్ పైన్ మరికొన్ని జబ్బులను డాక్టర్లకు చూపించుకొంటే తగ్గక పోగా చాలా బాధలకు గురయ్యాడు. ఇతను విదేశాలలో ఉంటాడు, కనుక ఆ డాక్టర్ల లోపాలను, వైద్య వృత్తి లో ఉన్న లోపాలను విమర్శిస్తూ వ్యాసాలు రాసాడు. http://sabhlokcity.com/2012/03/doctors-the-rapacious-unaccountable-enemies-of-humanity/

    http://sabhlokcity.com/2012/03/all-im-asking-for-is-quality-integrity-and-respect-from-the-medical-profession/

    http://sabhlokcity.com/2012/03/the-church-of-medicine-objects-to-being-questioned/

    ReplyDelete
  12. ఏదొ మీ పుణ్యమాని తెలుగు భాషాభిమానం, ఫుస్తక పఠనం, గుర్తొన్నాయి గాని, తెలుగు పుస్తకాలు చదివి ఎంతకాలమయ్యిందొ, క్రుతగ్నున్ని, చివరి పదం రైటో రాంగో

    -డా. రమేష్ బొబ్బిలి

    ReplyDelete
  13. Ramesh Bobbili గారు,

    చివరి పదం వ్యాకరణపరంగా తప్పే! అయినా ఇబ్బంది లేదు (మీరు రాసింది నాకర్ధమైంది). మనం తెలుగు పరీక్ష రాయడం లేదు గదా!

    ఒక భాషని తప్పులు లేకుండా మాట్లాడాలనుకోవడం, రాయాలనుకోవడం మంచిదే గానీ.. బ్లాగులు మన ఆలోచనలని రాయడానికే గదా! తప్పో ఒప్పో.. ముందు రాసి.. ఆపై సరిజేసుకుందాం. ఆ ప్రాసెస్ లో మన తెలుగు బాగుపడుతుంది. (నేనే ఒక ఉదాహరణ!)

    తెలుగు కాగితం మీద రాయడం నాక్కూడా (సరీగ్గా) రాదు. కష్టపడి రాసినా.. ఆ రాసిందేంటో తరవాత నాకే అర్ధం కాదు!

    లేఖిని ప్రాక్టీస్ చెయ్యండి. కష్టాలు తీరిపొతాయ్.

    ReplyDelete
  14. కృతఙ్ఞతలు, ధన్యవాదాలు

    ReplyDelete
  15. "ఓయీ దుష్ట దుర్మార్గ రమణాధమా! ఎంత మదమెంత కావరము."

    సతీష్ నన్ను తిట్టినా నాకు భలే సంతోషం వేసింది. ఇప్పటిదాకా అందరూ నన్ను 'రమణా!' అని పొట్టిగా, బోడిగా పిలిచారే తప్ప.. గంభీరంగా ముందు వెనకలు ఏ విశేషణాలు పెట్టలేదు. నాకెందుకో నన్ను 'విశ్వవిఖ్యాతనట సార్వభౌమా!' అని పిలిచినట్లనిపించింది.
    పొట్టచెక్కలయ్యేట్టు నవ్వు వచ్చిందనుకోండి

    ReplyDelete
  16. తెలుగు బాగ రాయొచ్చే దీన్లో!!!http://teluguwebmedia.net.in/hamsalekha/

    ReplyDelete
  17. @పెళ్ళంటే భయంట! వాడికి 'ధైర్యంగా ఆత్మ హత్య చేసుకోడం ఎలా?'

    అసలు మీకు పుస్తకాల పేర్లు అంత బాగా కనిపించాయా :)

    ReplyDelete
  18. Ramesh Bobbili గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  19. Mauli గారు,

    కొన్ని పుస్తకాలు కనబడనక్కర్లేదండి! ఈజీగా కనిపెట్టెయ్యొచ్చు!

    ReplyDelete
  20. ధన్యవాదాలు Bachu Sreenivasulu

    ReplyDelete
  21. Fantastic...Mind Blowing...Unbelievable!!!
    కరువు దీరా నవ్వాను...పొట్ట చెక్కలయ్యేట్టు! నవనవోన్మేషహాస్యవైద్యరత్నారమణా నమో నమ:నమో నమ:

    ReplyDelete
  22. "ఒక పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది" - అన్నమాట :-)

    ReplyDelete
  23. @drpen,

    థాంక్యూ డాక్టర్ గారు.

    మా సతీష్ కన్నా మీరే నా పేరుకి గొప్ప ఆభరణాలు ధరింపజేశారు. గ్రేట్!

    ReplyDelete
  24. Krishna Palakollu గారు,

    >>"ఒక పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది"<<

    మీ ట్యాగ్ బానే ఉంది గాని.. మన తెలుగు వాడు ఎంత గొప్ప పుస్తకమైనా డబ్బులిచ్చి కొనడు. వాడి చేత పుస్తకాలు కొనిపించాలంటే శాస్త్రిగారిలా వైద్యం పేరు చెప్పాల్సిందే!

    ReplyDelete
  25. ఇట్లా మన పొట్ట మనమే కొట్టేసుకుంటే ఎట్ల యారమణా?
    :)
    ఎన్నడో పుస్తకప్రపంచం వాడు చెప్పినట్టు మంచిపుస్తకం నీడన మనసంతా చల్లన.
    రోజురోజుకూ పదును పెరుగుతుంది. కీపిటప్!
    - జంపాల చౌదరి

    ReplyDelete
  26. ఆ శాస్త్రిగారి టైపులో మీరు కూడా వైద్యం చేస్తే మీ లైబ్రరీ ఖాళీ అయిపోతుంది.

    ReplyDelete
  27. @Chowdary,

    జంపాల చౌదరి గారు,

    ధన్యవాదాలు.

    >>ఇట్లా మన పొట్ట మనమే కొట్టేసుకుంటే ఎట్ల యారమణా?<<

    అవును గదా! ఏదో రాసి పడేశాను. నాకు తట్టలేదు సుమండి!

    ReplyDelete
  28. bonagiri గారు,

    శాస్త్రిగారు ఉత్తముడు. అల్ప సంతోషి. పుస్తకం అమ్మగా వచ్చిన లాభం చాలనుకున్నాడు.

    నేను "ఇంగ్లీషు డాక్టర్"ని. మేం పుస్తకాలు అమ్మం. మా వైద్యం కోసం వచ్చినవాడి చేతనే పొలం, పుట్రా అమ్మించేస్తాం!

    ReplyDelete
  29. pusthakalu nijangane manasika chikistaku papanichestayi

    ReplyDelete
  30. @ilam,

    ష్! గట్టిగా అనకండి. పుస్తకాలు మానసిక చికిత్సకి పని చెయ్యడం అనేది ఈ బ్లాగర్ పైత్యమే సుమండి!

    మీరు ఇట్లాంటి రాతల్ని సీరియస్ గా తీసుకోకండి. ఒక్క సైకియాట్రిస్ట్ మాత్రమే మానసిక చికిత్స చెయ్యగలడు. ఒట్టు! నన్ను నమ్మండి!

    ReplyDelete
  31. mee *saasthrigari pusthaka vaidyam
    13.05.2012 aadivaaram aandhrajyothilo prachuristhunnam.

    -editor, andhrajyothi

    ReplyDelete
  32. డాక్టర్ గారు.. శాస్త్రి గారి పుస్తక వైద్యం గురించి.. ఈ రోజు ఆంద్ర ప్రజలు మాత్రమే కాదు. ప్రపంచం లో ఉన్న ఆంధ్రులందరూ ..తెలుసుకుంటున్నారు. ..పుస్తక వైద్యం యెంత గొప్పదో..అనుకుంటే ఒళ్ళు పులక రించి పోతుంది.
    మీకు మనః పూర్వక అభినందనలు. (ఈ రోజు ఆంధ్ర జ్యోతి ఆదివారం ప్రత్యేకం లో మీ బ్లాగ్ పోస్ట్ చూసి)..

    ReplyDelete
  33. కొత్తవద్యవిధానాలు బాగున్నాయే!
    లెనిన్ ప్రేమ లేఖలకు వున్న వైద్యగుణాలు ఈసారి వామపచ్చాలు తమ ప్లీనరీ సమావేశంలో కూలకషంగా చర్చించి వెలుగులోనికి తేస్తాయని ఆశిద్దాము. :)

    మీరీపాటికి పుస్తకవైధ్యంలోని వైవిద్యాన్ని, మెళుకువలను పట్టేసుంటారని ఆశిస్తూ... విషవృక్ష పుస్తక మందులు ఏ రోగులకు/రోగాలకు పని చేస్తాయో చెప్పండి.

    ReplyDelete
  34. వనజవనమాలి గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  35. SNKR గారు,

    థాంక్యూ!

    రామయణ విషవృక్షం ఎప్పుడో ముప్పై యేళ్ళ క్రితం చదివాను. అప్పుడు నాకు, నా స్నేహితులకి చాలా నచ్చింది. చాలా సరదాగా enjoy చెయ్యొచ్చు.. రామభక్తులు కాకపోతే!

    'పుస్తక వైద్యం' పోస్ట్ concept వేరు. అయినా మీరు అంటున్నారు కాబట్టి ఒకసారి శాస్త్రి గారిని అడిగి చూద్దాం.

    ReplyDelete
  36. విషవృక్షాన్ని ఎలా "ఎంజాయ్" చేయగలిగారో తెలుసుకోవాలని వుంది, తరువాతెప్పుడైనా వీలుంటే (సీరియస్‌గా) ఓ పోస్ట్ కొట్టండి.

    ReplyDelete
  37. విషవృక్షం రాముడున్నప్పుడే వచ్చి ఉండాల్సింది, వెంటనేఏఏఏఏ వాల్మికి రాసిన రామాయణాన్ని కూడా డస్ట్ బిన్నులో పడేయించేవాడు. రాముడి గురించి తెల్వదా

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.